అవిశ్వాసులతో మిమ్మును మీరు జోడుగా చేసుకొనకుడి
“అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది?—2 కొరింథీయులు 6:14,15.
1. ఒక సహోదరి అవిశ్వాసిని వివాహమాడు పరిస్థితికి ఎట్లు వచ్చెను?
అమెరికా సంయుక్త రాష్ట్రములలోని పశ్చిమార్ధ ప్రాంతమునందు నివసించుచున్న యెహోవా సాక్షి ఒకరు కారు ప్రమాదములో తన భర్తను పోగొట్టుకొనినది. ఆమె తనకు జరిగినదానిని ఇలా గుర్తుచేసుకొనినది: “జరిగినదానికి మొదట నేను నివ్వెరపోయాను, అయితే అది యెహోవాకు నేనుచేయు సేవను అడ్డగించుటకు అనుమతించకూడదని తీర్మానించుకొంటిని. రెండు సంవత్సరముల తర్వాత సంఘమందలి జంటల మధ్య నేనొక పనికిరానిదానివలెనున్నట్లుగా భావింపనారంభించితిని. నన్ను నా కూతుర్ని ఆయాకుటుంబములు బయటకు వెళ్లునప్పుడు వారితో వెళ్లుటకు ఆహ్వానించుట అన్ని సమయములలో జరిగేదికాదు. ఎప్పుడైతే క్రైస్తవ జంటలు ఒకరినొకరు ఆప్యాయతను చూపించుకొనుటను నేను చూసేదాన్నో, అప్పుడు నేను మరింతగా విడిచిపెట్టబడినదానిగా భావించేదాన్ని. నేను ఆత్మీయముగా బలహీనమగుటను ఎవరు గమనించినట్లుగా కన్పించలేదు. ఆ సమయములో ఒకరోజు నాకు పరిచయమున్న లోకసంబంధియైన నా తోటి ఉద్యోగి ఒకరు నన్ను సాయంకాల భోజనానికి రమ్మన్నప్పుడు నేను వెళ్లాను. చివరకు, నేనెంత బలహీనముగా మరియు ఒంటరితనముచేత జయింపబడితినంటే, అతనిని పెళ్లాడుటకు నేను ఒప్పుకొంటిని.”
2. వివాహమాడవలెనను కోరిక ఎందుకు సహజమైయున్నది, మరియు దేనిని కలుగజేయుటకు వివాహము రూపించబడినది?
2 అవును, మరొకరితో జీవితమును పంచుకొనవలెనను కోరిక చాలా బలముగా యుండగలదు, మరియు అది సహజము కూడా. యెహోవా తానే చెప్పినట్లుగా: “నరుడు ఒంటరిగానుండుట మంచిది కాదు. వానికి సాటియైన సహాయమును [“అతనివంటి దానిని,” అతని కొరకు సరియైన దానిని] వానికొరకు చేయుదుననుకొనెను.” (ఆదికాండము 2:18, న్యూ వరల్డ్ ట్రాన్స్లేషన్ రెఫరెన్సు బైబిలు, పాదవచనము) స్త్రీపురుషుల మధ్య సన్నిహితమైన, శాశ్వతమైన ఐక్యమత్యమును తెచ్చేందుకు వివాహము రూపించబడినది. ఆదాము కాదు యెహోవాయే ఇట్లు సెలవిచ్చెను: “కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును; వారు ఏక శరీరమైయుందురు.” (ఆదికాండము 2:22-24; మత్తయి 19:4-6 పోల్చుము.) అలాంటి జతకొరకు బహుశ నీ హృదయము కోరుచుండవచ్చును.
3, 4. (ఎ) అవిశ్వాసులతో సన్నిహిత బాంధవ్యములను కల్గించుకొనుటకు వ్యతిరేకముగా బైబిలు ఎట్లు హెచ్చరిక చేయుచున్నది? (బి) సరికాని జోడునిగూర్చిన పౌలు సలహాను ఏ విధముగా వివాహమునకు అన్వయించవచ్చును? (సి) “అవిశ్వాసులను” మాటను కొరింథునందలి క్రైస్తవులు ఎట్లు అర్థము చేసుకొనియుండవచ్చును? (పాదవచనము చూడుము.)
3 విషయమట్లున్నను, బైబిలు అవిశ్వాసులతో సన్నిహిత సహచర్యమును కలిగియుండుటకు వ్యతిరేకముగా హెచ్చరించుచున్నది. అపొస్తలుడైన పౌలు చెప్పినట్లుగా: “మీరు అవిశ్వాసులతో [“అసమమైన జట్టులో నిన్నునీవు చేర్చుకొనకుము,” ది జెరూసలేమ్ బైబిల్] జోడుగా ఉండకుడి.a అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది.”b (2 కొరింథీయులు 6:14, 15) పొలము దున్నుటకు ఎద్దును గాడిదను కాడికి కట్టుటను నిషేధించిన మోషే ధర్మశాస్త్రమును పౌలు మదిలో కలిగియుండవచ్చును. (ద్వితీయోపదేశకాండము 22:10) గాడిద చిన్నదియు, అంత బలముగలదికాదు గనుక, దానిని కలిపి కాడికట్టుట వలన అది బాధింపబడగలదు. వివాహమనునది కూడా భార్యాభర్తలను కలిపియుంచు కాడివంటిది గనుక, ఒక క్రైస్తవ వ్యక్తి అవిశ్వాసిని చేసుకొనుట అసమమైన జోడిని కలుగజేయును. (మత్తయి 19:6) అటువంటి జోడి తరచుగా మరింత వత్తిడిని వివాహమునకు కృంగుదలను తెచ్చును.—1 కొరింథీయులు 7:28 పోల్చుము.
4 అయినను, ప్రారంభమునందలి అనుభవము దృష్టాంతపరచినట్లుగా, కొందరు క్రైస్తవులు అవిశ్వాసులను వివాహమాడుటకు ఎంపికచేసుకొనిరి. “ప్రభువునందు మాత్రమే” వివాహము చేసుకొనుట కొందరికెందుకు కష్టముగా ఉన్నది?—1 కొరింథీయులు 7:39.
కొందరెందుకు మరొకచోట చూచెదరు
5. కొందరెందుకు అవిశ్వాసితో భావనాత్మకతయందు చేరియుందురో దృష్టాంతపర్చుము.
5 వారు కావాలని దేవుని సలహాను త్రోసిపుచ్చుచున్నారని కాదు. వివాహము చేసుకొనవలెనని యిష్టపడుచున్న ఒక క్రైస్తవ సహోదరి పరిస్థితిని విచారించుము. ఆమె క్రైస్తవ భర్తను కోరుచుండవచ్చును, అయితే ఆమెకుగల విశ్వాసులైయున్న స్నేహితుల పరిధిలో తనకు తగిన సహోదరులు అనేకమంది లేకపోవచ్చును. ఆమె తన వయస్సునుగూర్చి తలంచుచుండవచ్చును. తనకొక కుటుంబముండవలెనని ఆమె కోరుచుండవచ్చును. ఒంటరిగానే వయస్సు పెరిగిపోవుచున్నదను భయము, ప్రేమించబడవలెనను భావన ఆమె ప్రమాదములో పడిపోవునట్లు చేయగలదు. అలాంటి సమయములో లోకస్థుడైన పురుషుడొకరు ఆమెయందు శ్రద్ధ చూపించినట్లయిన దానిని త్రోసిపుచ్చుట ఆమెకు కష్టమగును. అతను దయగలవానిగా మృదువైనవానిగా కన్పించవచ్చును. అతను పొగత్రాగకుండవచ్చును లేక దుర్భాషిగాయుండక పోవచ్చును. అప్పుడు ఇలాంటి తర్కములు బయలుదేరవచ్చును: ‘అంతెందుకు, నాకు తెలిసిన అనేకమంది సహోదరులకంటే ఇతనెంతో నయము!’ ‘పఠనముచేయుటకు అతనికి శ్రద్ధకలదు.’ ‘సహోదరి ఒకరు అవిశ్వాసిని చేసుకొనగా, చివరకు ఆయన విశ్వాసిగా మారిన సంఘటనలు నాకు తెలియనివా.’ ‘అనుకున్నంత ప్రయోజనములను తీసుకురాని క్రైస్తవ వివాహములును కొన్ని కలవు!’—యిర్మీయా 17:9 చూడుము.
6, 7. (ఎ) తన ఆశాభంగతను ఒక సహోదరి ఎట్లు వర్ణించినది? (బి) ఏ ప్రశ్న మన విచారణార్షమై యున్నది?
6 అవును, వివాహముచేసుకొన కోరుచున్న ఒక ఒంటరి క్రైస్తవ వ్యక్తికి అది ఎంతో ఆశాభంగమును కల్గించునదిగా ఉండగలదు. కొందరు నిస్పృహకు కూడా లోనగుదురు. తన ప్రాంతమందలి పరిస్థితిని వివరించుచు ఒక సహోదరి, “తగిన సహోదరులు అతికొద్ది సంఖ్యలో వున్నారని, అలాగే ఒంటరిగాయున్న సహోదరీలు చాలా ఎక్కువ సంఖ్యలో వున్నారని. ఒక సహోదరి తన యవ్వనము తరిగిపోవుటను చూచినప్పుడు అసలు వివాహము చేసుకొనకూడదనో లేక తనకు లభించు మొదటి అవకాశమునందే పెండ్లి చేసుకొనవలెనను స్థితికి ఆమె కోరికలు దిగజారునని,” తెల్పినది.
7 ఏది ఏమైనను, బైబిలు సలహా స్పష్టముగాయున్నది: ‘అవిశ్వాసులతో మిమ్మును మీరు జోడుగా చేసుకొనకుడి.’ (2 కొరింథీయులు 6:14) ఈ దైవ హెచ్చరిక కఠినముగాను లేక కారణరహితముగాను ఉన్నదా?
దేవుని ప్రేమపూర్వక శ్రద్ధ వ్యక్తమైయున్నది
8. తన హృదయమందు మనకొరకు శ్రేష్టమైన శ్రద్ధలను కలిగియున్నాడని యెహోవా ఎట్లు ప్రదర్శించెను?
8 మన శాశ్వత సంక్షేమమునందు యెహోవా మిక్కిలి శ్రద్ధను కలిగియున్నాడు. ఆయన తనకెంతో అమూల్యమైన తన కుమారుని, “అనేకులకు ప్రతిగా విమోచనగా” యివ్వలేదా? (మత్తయి 20:28) ‘మనకు ప్రయోజనము కలుగునట్లు’ ఆయన మనకు బోధించుట లేదా? (యెషయా 48:17) ‘మనము సహింపగలిగినంతకంటే ఎక్కువ శోధనను అనుమతించనని’ ఆయన వాగ్ధానము చేయలేదా? (1 కొరింథీయులు 10:13) కాబట్టి, అవిశ్వాసులతో జోడుగాయుండకుడి అని ఆయన చెప్పినప్పుడు, కారణయుక్తముగా మన విషయమైన శ్రేష్టమైన శ్రద్ధను ఆయన మదిలో తప్పక కలిగియుండవచ్చును! ఈ హెచ్చరిక మనయెడలగల ఆయన శ్రద్ధనెట్లు వ్యక్తము చేయుచున్నదో విచారించుము.
9. (ఎ) క్రైస్తవ వ్యక్తి అవిశ్వాసితో సన్నిహిత బాంధవ్యమును కల్గించుకొనుటకు వ్యతిరేకముగా ఏ హెచ్చరికను పౌలు ఇచ్చుచున్నాడు? (బి) “పొత్తు” అని భాషాంతరము చేయబడిన గ్రీకు పదమునకు అర్థము ఏమైయున్నది, మరియు ఒక క్రైస్తవ వ్యక్తి తననుతాను అవిశ్వాసితో జోడిచేసుకొనుట వలనవచ్చు కష్టమును అది ఎట్లు దృష్టాంతపరచుచున్నది?
9 భార్యాభర్తలు “ఏక శరీరముగా” మానవులమధ్య సన్నిహిత బాంధవ్యమును రూపొందించుటకు సృష్టికర్త వివాహమును ఉద్దేశించెను. (ఆదికాండము 2:24) అలాంటప్పుడు ఒక క్రైస్తవుడు అవిశ్వాసితో అటువంటి బాంధవ్యమును కలిగియుండుట జ్ఞానయుక్తమైన పనియేనా? ప్రతిదానికి ముందుగనే భావించిన ప్రతికూల సమాధానము వచ్చు సూటియైన ప్రశ్నలద్వారా పౌలు దానికి సమాధానమిచ్చుచున్నాడు, “నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలుతో [సాతాను] ఏమి పొత్తు [గ్రీకు, సింఫొనిసిస్]? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది?” (2 కొరింథీయులు 6:14, 15) గ్రీకు పదమైన సింఫొనిసిస్ అను పదమునకు అక్షరార్థముగా “కలిసి స్వరము వినిపించుట” (సిన్, నుండి “కలిసి,” ఫోన్, నుండి “ఒక శబ్దము”) అను అర్థము కలదు. సంగీత ఉపకరణములద్వారా ఉత్పన్నమగు పొందిక సంబంధముగా ఇది ఉపయోగించబడును. అయితే సాతాను క్రీస్తుకు మధ్య పొందిక లేదనుకోండి. అదే ప్రకారము సరిగాలేని కాడినందు భార్యాభర్తలు ‘స్వర ఏకతను’ కలిగియుండుట చాలా కష్టము. అలాంటప్పుడు, శ్రావ్యమైన సంగీతమును ఉత్పన్నముచేయుటకు బదులు వారు అపశ్రుతులను వినిపించు, రెండు విభిన్న సంగీత ఉపకరణములను పోలియుందురు.
10. ధన్యతగల వివాహమునకు ఏ సంగతులు అవశ్యకము, మరియు సరియైన జోడివున్నప్పుడు ఏ ప్రయోజనములు ఉనికిలో యుండును?
10 శరీర సంబంధమైన వ్యక్తితో ఒక ఆత్మీయవ్యక్తి సంపూర్ణమైన పొందికనెట్లు అనుభవించగలడు? (1 కొరింథీయులు 2:14) ధన్యతగల కుటుంబమునకు, ఇద్దరికి ఆమోదయోగ్యమైన నమ్మకములు, సూత్రములు మరియు గమ్యములు అవశ్యకము. సృష్టికర్త యెడలగల పరస్పర భక్తినిమించి మరేదియు వివాహమునకు బలమును చేకూర్చలేదు. సరిసమానమైన జోడివున్నప్పుడు, భార్యాభర్తలిద్దరు ఆరాధనయందు పరస్పరము ప్రోత్సహించుకొన వచ్చును. వారి భేదాభిప్రాయములను పరిష్కరించుకొనుటకు వారిరువురు లేఖనములను చూడవచ్చును. మనము మన వివాహ జతతో సాధ్యమైనంత సన్నిహిత బాంధవ్యముననుభవించవలెనని యెహోవా కోరుచున్నందుననే, ఆయన అవిశ్వాసులతో జోడుగా యుండకుడి అని మనకు చెప్పుచున్నాడనుటకు ఇది సాక్ష్యము కాదా?
11. ఆరాధికులు కానివారితో వివాహములు ఇశ్రాయేలీయులలో ఎందుకు నిషేధింపబడినవి, మరియు ఆలోచనను రేకెత్తించు ఏ ప్రశ్న ఉత్పన్నము చేయబడినది?
11 బైబిలు హెచ్చరికను లక్ష్యపెట్టుట వలన మనము, ఒక క్రైస్తవుడు అవిశ్వాసిని చేసుకొనిన ఫలితముగా కలుగు బాధాకరమైన పరిణామములనుండి తప్పింపబడుదుము. ఉదాహరణకు, అవిశ్వాసియైన వ్యక్తి తన క్రైస్తవ జతను యెహోవాను సేవించకుండా త్రిప్పివేయు సాధ్యతకలదు. ప్రాచీన ఇశ్రాయేలీయులకు యెహోవా చేసిన హెచ్చరికను విచారించుము. ఆరాధికులు కాని వారితో వివాహబంధములు నిషేధించబడినవి. ఎందుకు? ఎందుకనగా, “నన్ను అనుసరింపకుండ ఇతర దేవతలను పూజించునట్లు నీ కుమారుని వారు మళ్లించుదురు”అని యెహోవా వారిని హెచ్చరించెను. (ద్వితీయోపదేశకాండము 7:3, 4) అవిశ్వాసియైన జతనుండి వ్యతిరేకత వచ్చినప్పుడు, తక్కువగా అడ్డగించు మార్గమువైపు నెమ్మదిగా కొట్టుకొనిపోవు భావము కలుగవచ్చును. ‘నాకది సంభవించక పోవచ్చును’అని తలంచుట చాలా సులభము. అయితే సొలొమోను అంతటి జ్ఞానముగల వ్యక్తికి ఇది సంభవించినది. అలాంటిదే నీకును సంభవింపదా?—1 రాజులు 11:1-6; 1 రాజులు 4:29, 30 పోల్చుము.
12. పరదేశులతో వివాహ సంబంధములను నిషేధించిన దేవుని నియమము ఇశ్రాయేలీయులకు ఎట్లు రక్షణదాయకముగా పనిజేసినది? దృష్టాంతపరచుము.
12 విశ్వాసి సత్యారాధననుండి త్రిప్పబడక పోయినను, మతపరముగా విభాగింపబడిన గృహమందు తరచుగా సమస్యలు, వత్తిడులు కలుగును. మరలా దేవుడు ఇశ్రాయేలీయులకు యిచ్చిన నియమమును విచారించుము. ఒక ఇశ్రాయేలీయ యువతి కనానీయ పురుషుని వివాహము చేసుకొనుటకు అంగీకరించినదనుకోండి. కనాను దేశములోగల లైంగిక అభ్యాసముల విషయము వచ్చినప్పుడు, ఆమె దేవుని నియమముయెడల అతను ఏమి గౌరవమును కలిగియుండును? మోషే ధర్మశాస్త్రము చెప్పినట్లుగా ఆమె రుతుస్రావమప్పుడు అతడు యిష్టపూర్వకముగా లైంగిక సంగమమునుండి తప్పుకొనునా?c (లేవీయకాండము 18:19; 20:18; లేవీయకాండము 18:27 పోల్చుము.) ఒక ఇశ్రాయేలీయుడైన పురుషుడు కనాను పిల్లను వివాహము చేసుకొనినట్లయిన, అతను ఏడాదికి మూడుసార్లు పండుగలనాచరించుటకు యెరూషలేముకు ప్రయాణమై వెళ్లునప్పుడు, ఆమె ఎంతవరకు తనకు మద్దతునిచ్చును? (ద్వితీయోపదేశకాండము 16:16) సాక్ష్యాధారముగా, అటువంటి వివాహములను నిషేధించిన దేవుని నియమము ఇశ్రాయేలీయులకు రక్షణదాయకముగా పనిజేసెను.
13. (ఎ) లోకస్థుడైయున్న వ్యక్తి ఎందుకు బైబిలు-శిక్షిత క్రైస్తవ మనస్సాక్షిని కలిగియుండడు? (బి) మతపరముగా విభాగింపబడిన గృహములలో కొందరు ఎటువంటి సమస్యలను, వత్తిడులను ఎదుర్కొనిరి?
13 మరి నేటి విషయమేమి? లోక ప్రజల నైతిక నియమములు బైబిలు నియమములకు చాలా దూరమందున్నవి. లోకులు ఎంత స్వచ్ఛమైన వారిగా కన్పించినను, వారికి బైబిలుశిక్షిత క్రైస్తవ మనస్సాక్షిని కలిగియుండరు. ‘తమ మనసు మారి రూపాంతరము పొందునట్లు’ ‘పాత స్వభావమును విడుచుటకు’ వారు దేవుని వాక్యమును సంవత్సరములుగా పఠించలేదు. (రోమీయులు 12:2; కొలొస్సయులు 3:9) కాబట్టి, అవిశ్వాసితో జోడికట్టు క్రైస్తవ వ్యక్తి తరచుగా తననుతాను హృదయవేదనకు, దుఃఖమునకు గురిచేసుకొనినవాడగును. కొందరు పెడద్రోవపట్టిన లైంగిక విధానముల కొరకు లేక లోక సెలవుదినములను ఆచరించుటకు తరచు వత్తిడిని ఎదుర్కొనుచున్నారు. మరికొందరైతే ఒంటరితనమును కూడా ఫిర్యాదు చేయుచున్నారు. ఒక సహోదరి చెప్పినట్లుగా: “యెహోవాను ప్రేమించని వ్యక్తిని వివాహము చేసుకొనినప్పుడు నీవనుభవించు ఒంటరితనము ఊహించుటకుకూడా అంతుబట్టనంత నీచమైనదిగా యుండును. నీ జీవితములో అన్నింటికంటే ప్రాముఖ్యమైయున్న సత్యమును పంచుకొనుటకు ఎవ్వరు నీకు లేకుండుటను నీవు చూచెదవు.”
14. (ఎ) విభాగిత గృహమందు, పిల్లలను “యెహోవాయొక్క శిక్షలోను బోధలోను” పెంచుట ఎందుకు కష్టము? (బి) విభాగిత గృహములో పిల్లలపై ఏ ప్రభావముండును?
14 విభాగిత గృహమునందు పిల్లలను: “యెహోవాయొక్క శిక్షలోను బోధలోను” పెంచుట మహాకష్టముగా యుండగలదు. (ఎఫెసీయులు 6:4, NW.) ఉదాహరణకు, అవిశ్వాసియైన వ్యక్తి పిల్లలు కూటములకు హాజరయ్యేందుకు లేక ఇంటింటి పరిచర్యయందు భాగము వహించేందుకు యిష్టపూర్వకముగా అనుమతించునా? ఇలావుంటే తరచుగా పిల్లలు తమ అనురాగమందు చీల్చబడినవారగుదురు—వారు తలిదండ్రులిరువురుని ప్రేమించుదురు, అయితే వారిలో ఒక్కరు మాత్రమే యెహోవాను ప్రేమించువారైయుందురు. అవిశ్వాసిని వివాహమాడిన ఒక సహోదరి ఇట్లు చెప్పుచున్నది: “నేను నా 20సం.ల వైవాహిక జీవితములో ఎంతో హృదయవేదనను అనుభవించితిని. నా పిల్లలు తీవ్ర సంక్షోభమందును, భావోద్రేకముగా తల్లక్రిందులైన పరిస్థితులయందును పెరిగారు, వారిప్పుడు లోక సంబంధులైయున్నారు. ఆమె తండ్రిదగ్గరకూడా వుండవలసిన హక్కును ఆయన కలిగియుండుటనుబట్టి, వెళ్లవలసివచ్చినప్పుడల్లానా కూతురు నన్ను విడిచి దూరముగా ఉండుటలో తరచు స్థయిర్యమును పోగొట్టుకొనుచున్నది. ఈ సమస్యలన్ని వున్నాయంటే దానికి కారణము నేను 18సం.ల వయస్సులో వున్నప్పుడు, యెహోవా చెప్పిన ఒకానొక సూత్రమును అలక్ష్యము చేయుటకు నేను ఎంపికచేసుకొంటిని.” ఏమిటా సూత్రము? అవిశ్వాసులతో మిమ్మును మీరు జోడుగా చేసుకొనకుడి!
15. అవిశ్వాసులతో మనలను మనము జోడుగా చేసుకొనకుమని యెహోవా మనకెందుకు సలహానిచ్చుచున్నాడు?
15 స్పష్టముగా యెహోవా మనము మన జీవితములనుండి శ్రేష్టమైన దానిని పొందవలెనని ఇచ్ఛయించుచున్నాడు. మనలను మనము అవిశ్వాసులతో జోడుగా చేసుకొనకూడదను సలహాతోసహా, ఆయన మనను అడుగునది మన మంచికొరకై యున్నది. (ద్వితీయోపదేశకాండము 10:12, 13) అవిశ్వాసిని వివాహము చేసుకొనుట, లేఖనానుసారమైన సలహాను, అభ్యాససిద్ధమైన జ్ఞానమును త్రోసిపుచ్చుటయు అలాగే తరచు ఇతరులనుండి కలుగు బాధాకరమైన అనుభవములను కలిగియుండుటయునై యున్నది.
సాధారణముగా అడుగబడుచున్న ప్రశ్నలు
16, 17. (ఎ) మనము జాగ్రత్త వహించనట్లయిన, భావోద్రేకము సరియైన తలంపునందు ఎట్లు జొరబడగలదు? (బి) క్రైస్తవుడొకరు అవిశ్వాసిని వివాహముచేసుకొనగా, వారిరువురు ఇప్పుడు యెహోవాను సేవించుచున్నటువంటి పరిస్థితులు అరుదుగాయుండుటను బట్టి, దేవుని సలహాను పెడచెవినబెట్టవలెనా? వివరించుము.
16 అయినను, మనము జాగ్రత్తగా ఉండకపోయినట్లయిన, భావోద్రేకము మన సరియైన తలంపులలోనికి జొరబడగలదు. మన విషయములో ఈ ఒక్కసారికి ఏమికాదులే అని భావించుటకు ప్రారంభించవచ్చును. ఎక్కువ సాధారణముగా అడుగబడు కొన్ని ప్రశ్నలను విచారించుము.
17 ఒక సహోదరుడు లేక సహోదరి అవిశ్వాసిని వివాహము చేసుకొనగా, వారిరువురు ఇప్పుడు యెహోవాను సేవించుచున్నటువంటి పరిస్థితుల మాటేమిటి? అయినప్పటికిని, అక్కడ యెహోవా సూత్రములను ఉల్లంఘించుట జరిగినది. అలా వారి విషయములో జరిగినంతమాత్రమున దానిని సమర్థించవచ్చునా? బబులోను బానిసత్వమునుండి మరలివచ్చుచున్న యూదుల విషయమందు దేవుని సలహాను పెడచెవినబెట్టు వారిని ఆయన దృష్టించు విధమును దృష్టాంతపరచవచ్చును. వారిలో కొందరు అన్య స్త్రీలను భార్యలుగా తెచ్చుకొనుటను ఖండించుటలో బైబిలు రచయితలైన ఎజ్రా, నెహెమ్యా వెనుదీయలేదు. ఆ యూదులు “ఆజ్ఞను మీరి,” “అపరాధమును” చేయగా అది వారిమీదకు “దోషమును” తెచ్చెను. (ఎజ్రా 10:10-14; నెహెమ్యా 13:27) ఇంకను శ్రద్ధ వహించవలసినదేమనగా: దేవుని సలహాను మనము పెడచెవినబెట్టినప్పుడు నిషాదచిహ్న మనస్సాక్షిని కలుగజేసుకుంటు మనలను మనమే ఆత్మీయముగా గాయపరచుకొనవచ్చును. అవిశ్వాసిగాయుండి ఆ తర్వాత విశ్వాసియైన భర్త గల ఒక సహోదరి ఇట్లనెను: ‘నేనింకను భావోద్రేక గాయములతోనే సతమతమగుచున్నాను. “వారి విషయములో యిది పనిజేసినది” అని చెప్పుచు ఇతరులు మమ్ములను చూపించినప్పుడల్ల నేననుభవించు బాధ చెప్పనలవి కాదు.’
18. బాప్తిస్మము తీసుకొనని వ్యక్తియెడల నీవు ఆకర్షితుడవైనట్లయిన, అప్పుడు జ్ఞానయుక్తమైన విధానము ఏమైయుండును, మరియు అలాచేయుట ద్వారా నీవు ఏమి ప్రదర్శింతువు?
18 బైబిలు పఠనముచేయుచు, కూటములకు హాజరగుచున్నను, యింకను బాప్తిస్మము తీసుకొనని అతను లేక ఆమెయెడల నీవు ఆకర్షితుడవైనట్లయిన అప్పుడు విషయమేమి? బైబిలు సత్యముయెడల ఎవరైనా శ్రద్ధ చూపినట్లయిన మనమానందింతుము. అయితే ఇక్కడ ప్రశ్న ఏమంటే: అదే అభిరుచిని నీవు వెంబడింపవలెనా? నిర్మొహమాటంగా చెప్పాలంటే, నీ స్నేహితునితో కలిసి తిరుగుటకు ముందుగా, ఆ వ్యక్తి బాప్తిస్మము తీసుకొని, దేవుని ఆత్మ ఫలములను కనబరచుటకు అభివృద్ధిసాధించుచున్న తర్వాత కొంతకాలము వరకు వేచియుండుట జ్ఞానయుక్తమైన పనియైయుండును. (గలతీయులు 5:22, 23) అటువంటి సలహాను అన్వయించుట సులభము కాకపోయినను, అలా చేయుటద్వారా బైబిలుయెడల నీకున్న భక్తిని ప్రదర్శింతువు; కాగా ఇది వివాహమందలి నిజమైన ధన్యతకు మంచి పునాదిని వేయును. నీ స్నేహితుడు నీయందు నిష్కళంకమైన శ్రద్ధకలిగియుండి నిజముగా యెహోవాను ప్రేమించవచ్చినట్లయిన, నిస్సందేహముగా అతను (లేక ఆమె), కలిసితిరుగుటకు ముందు మీరిద్దరు—సమర్పించుకొని బాప్తిస్మము తీసుకొని—“ప్రభువునందుండు” పర్యంతము వేచియుండుటకు యిష్టపడును. నిజమైన ప్రేమ గడుచు కాలము వలన దెబ్బతినదని కూడా గుర్తుంచుకొనుము.—1 కొరింథీయులు 7:39; ఆదికాండము 29:20.
19. తోటి విశ్వాసుల మధ్య వివాహిత జతను కనుగొనుట మీకు కష్టముగాయున్నట్లయిన మీరు దేనిని మదిలో ఉంచుకొనవలెను?
19 తోటి విశ్వాసుల మధ్య సరియైన వివాహజతను కనుగొనుటకు నీకు కష్టముగా ఉన్నట్లయిన అప్పుడు విషయమేమి? “నాకు యిప్పటికే 26సం.లు, ఒంటరిగాయున్నాను, నిజముగా ఒంటరితనముననుభవించుచున్నాను,”అని ఒక సహోదరి తెల్పినది. నిజమే ఒంటరిగాయుండుట మీకు కష్టముగా యుండవచ్చును, అయితే వివాహమందు సరియైన జోడికట్టబడకపోవుట మూలముగా కలుగు సమస్యలు మరింత కష్టముగాయుండును! దేవుని సలహాకు విధేయత చూపించుటకు విశ్వాసము, ఆశానిగ్రహము, ఓపిక అవసరము, అయితే నీకు శ్రేష్టమైన దానిని యెహోవా ఎరిగియుండి దానిని నీ కొరకు యిచ్ఛయించుచున్నాడను నిశ్చయతను కలిగియుండుము. (1 పేతురు 5:6, 7) దానిని ప్రార్థనా విషయముగా చేసి, యెహోవామీద ఆధారపడి యుండుము. (కీర్తన 55:22) ఈ విధానములో ఎవరును పరిపూర్ణ సంతుష్టినిచ్చు జీవితమును కలిగిలేరు. నీ హృదయము జతకొరకు తీవ్ర వాంఛను కలిగియుండవచ్చును. అలాగే ఈ విధానములో బాగుచేయబడలేని కొన్ని సమస్యలను మరికొంతమంది కలిగియుండవచ్చును. కేవలము రానైయున్న నూతన లోకములోనే “ప్రతిజీవి కోరికయు” సంపూర్ణముగా తీర్చబడును.—కీర్తన 145:16.
20. ఒక అవివాహిత సహోదరి తన తీర్మానమును ఎట్లు వ్యక్తపరిచినది, అలాంటి దృక్పధమునే కలిగియుండుటద్వారా ఎటువంటి తృప్తిని మీరు కలిగియుందురు?
20 అదేసమయములో, అవిశ్వాసితో మిమ్మును మీరు జోడిగా చేసుకొనకుండుటకు తీర్మానించుకొనుడి. ఒక 36సం.ల అవివాహిత సహోదరి తన తీర్మానమును ఇట్లు వ్యక్తపరచినది: “ప్రతిదినము జతకొరకు నేను యెహోవాను ప్రార్థింతును. యెహోవా సంస్థ వెలుపట చూచుటకు నాకు యిష్టములేదు, అయితే శోధనలు వున్నాయి. ఈ సమయములో, ఆత్మీయ పురుషుడు వెదకుచున్నటువంటి ఆత్మీయ స్త్రీగా నన్ను వృద్ధిచేయు లక్షణములపై పనిచేయ పథకము వేసుకొనియున్నాను.” మీరుకూడా అటువంటి తీర్మానమునే కలిగియున్నారా? అట్లయిన, దైవిక న్యాయమునకు దేవుడైనవాని యెడల మీ యథార్థతను నిరూపించుకొనుట మూలముగా వచ్చు సంతృప్తి మీది కాగలదు.—కీర్తన 37:27, 28. (w89 11/1)
[అధస్సూచీలు]
a 1 కొరింథీయులు 14:22లో “విశ్వాసులకు” లేక బాప్తిస్మము తీసుకొనిన వ్యక్తులకు భిన్నముగా పౌలు “అవిశ్వాసులను” పదమును ఉపయోగించెను. అప్పటి కొరింథీయులు “అవిశ్వాసులను”మాట బాప్తిస్మము తీసుకొనని వ్యక్తులను సూచించునదిగా అర్థము చేసుకొనువారైయుండిరి.—అ.కార్యములు 8:13; 16:31-34; 18:8 చూడుము.
b “విస్తరింపబడిన రీతిలో సూత్రమును ఈ విధముగా వ్యక్తపరచవచ్చును: ‘క్రైస్తవ కట్టడల విషయమై రాజీకి నడుపు లేక క్రైస్తవ సాక్ష్యముయొక్క పొందికను ప్రమాదములో పడవేయు ఎటువంటి సంబంధమునైనను, అది శాశ్వతమైనదేగాని తాత్కాలికమైనదేగాని అవిశ్వాసులతో కలిగియుండకుము. ఎందుకంత వేరుగా యుండుట? ఎందుకనగా అవిశ్వాసి క్రైస్తవ కట్టడలయందు, సానుభూతియందు లేక గమ్యములయందు భాగము వహించడు.’”—ది ఎక్స్‌పోజిటర్స్ బైబిల్ కామెంట్రి, సంపుటి 10, పుట 359.
c ది వాచ్‌టవర్ 1972, సెప్టెంబరు 15, పుటలు 575-6 చూడుము.
మీరు వివరించగలరా?
◻ అవిశ్వాసులతో సన్నిహిత బాంధవ్యములను కల్గించుకొనుటకు వ్యతిరేకముగా బైబిలు ఎట్లు హెచ్చరిక చేయుచున్నది?
◻ వివాహిత జతకొరకు కొంతమంది సమర్పిత క్రైస్తవులు సంఘము వెలుపల ఎందుకు చూతురు?
◻ సరికాని విధముగా జోడుకట్టుటకు వ్యతిరేకముగా యెహోవా యిచ్చిన హెచ్చరిక ఎట్లు మనయెడల ప్రేమపూర్వక శ్రద్ధతో చెప్పినదైయున్నది?
◻ జతను కనుగొనుట విషయమై సాధారణముగా ఏ ప్రశ్నలు అడుగబడును, మరియు వాటికి మీరెట్లు సమాధానము చెప్పుదురు?