వాగ్ధాన దేశమునుండి దృశ్యములు
యొప్పా ప్రసిద్ధమైన పురాతన ఓడరేవు
పురాతన ఇశ్రాయేలుకు పొడవైన ఇసుక తీరముకలదు. అయినను ఇశ్రాయేలీయులు సముద్రతీర ప్రజలుగా పేరుగాంచలేదు. బహుశ వారి తీర సహజపరిస్థితి అందుకు కారణమై యుండవచ్చును.
అది దాదాపు ఒకే సముద్రతీరముగా నుండి నైలునదిచేa సముద్రమువరకు కొట్టుకొని రాబడిన ఇసుకతిన్నెలతో నిండుకొనియుండెను. మీరు ఐగుప్తు యొక్క సరిహద్దునుంచి అక్కడకు సముద్రయానము చేసి యున్నట్లయితే, కర్మెలు పర్వతమునకు దక్షిణముగా మీకు నిజమైన స్వాభావిక ఓడరేవును కనుగొనియుండరు.
అయితే ఇశ్రాయేలీ తీర మధ్యమమునకు వచ్చినప్పుడు ఒక కొండమీద నున్న యొప్పా నగరమును మీరు చూచియుందురు. పైన దృశ్యములో చూపబడినట్లు, తీరమున నున్న రాళ్ళవరుస ఒక సన్నని జలమార్గమును చేసెను. ఆవిధముగా ఏర్పడిన రేవు దూరముగా ఉత్తరముననున్న అక్రె (టోలిమియాస్) రేవుకంటె చిన్నదైనప్పటికిని అది యొప్పేను ఒక ప్రసిద్ధమైన దానిగా చేసినది. (అ.కార్యములు 21:7) హేరోదు రాజు కైసరయలో కృత్రిమ ఓడరేవు నిర్మించేంతవరకు యొప్పా, తీరమున ఓడలు నిలుచుటకు మంచి స్థలమై యుండెను. ఇది యొప్పాకు సంబంధించిన కొన్ని బైబిల్ విషయములపై వెలుగును ప్రసరించుచున్నది.
ఆలయనిర్మాణములో సొలొమోనుకు సహాయముచేస్తూ తూరు రాజైన హీరాము ఇట్లనెను: “మేము నీకు కావలసిన మ్రానులన్నియు లెబనోను నందు కొట్టించి వాటిని నీ కొరకు సముద్రము మీద తెప్పలుగా యొప్పేకు కొని వచ్చెదము. తరువాత నీవు వాటిని యెరూషలేమునకు తెప్పించుకొనవచ్చును.” (2 దినవృత్తాంతములు 2:1, 11, 16) తూరు లేక సీదోనులోనున్న ఫ్యునేషియా రేవులనుండి బహుశ ఈ తెప్పలు వదలబడియుండవచ్చును. (యెషయా 23:1, 2; యెహెజ్కేలు 27:8, 9) కర్మెలును దాటుచు కేదారుమ్రానుల తెప్పలు యొప్పేలో ఆగెను. అక్కడనుండి నైరుతి దిశగా 34 మైళ్ళదూరముననున్న యెరూషలేమునకు ఈ కేదారు మ్రానులు తీసికొని రాబడినవి. చెఱవిడిపింపబడిన యూదులు దేవాలయమును పునర్నిర్మించినప్పుడు కూడ యొప్పా కేదారు మ్రానులు నిలుపు రేవు పట్టణమైయుండెను.—ఎజ్రా 3:7.
పొడవుగా ఉన్నటువంటి ఫ్యునేషియా ఓడలలో బహుశ కలప పనివారు కలప దుంగలతోసహా ప్రయాణించి ఉండవచ్చును. మీరు చదివినట్లుగా, యెహోవా యోనాను నీనెవె పట్టణమునకు సంబంధించిన పని అప్పజెప్పినప్పుడు ఆ ప్రవక్త మరొక మార్గమున పారిపోయెనని మీరు గుర్తుకుతెచ్చుకొందురు. “యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితోకూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను.”—యోనా 1:1-3.
యొప్పేనుండి తర్షీషు (పురాతన స్పెయిన్ కావచ్చును) నకు బహు దూరము ప్రయాణము చేయుటకు అనువైన ఇటువంటి ప్రయాణపు ఓడను యోనా ఎక్కి వుండవచ్చును. అది బహుశ బాగా మలచబడిన ముందు భాగము కలిగియుండి అచట ఒకరాతితో చేయబడిన లంగరు వ్రేలాడదీయబడియుండును. ప్రయాణికులు, వర్తకులు సామానులు దీనిపై భాగమునకు సరిపోవును. అయితే అది ఇక్కడ చూపిన బొమ్మలో లేదు. ఓడ క్రింది భాగములో ఎక్కువ సామానులు నిలువచేయవచ్చును. ఇక్కడే యోనా నిద్రపోయెను. ఓడ తిన్నని సరళమానుల చెక్కలతో చేయబడి వాటిమధ్య తెరచాప కొరకు దేవదారు దూలములు ఇరుప్రక్కల ఆధారముగా వుంచబడును. ఇరుప్రక్కలనున్న పొడవైన చెక్కలను (బహుశ బాషానులోనున్న ఓకు చెట్లకలప) గమనించండి. ఇప్పుడు భయంకరమైన తుఫానుచే బెదిరించబడిన సముద్రములోనున్న ఓడను ఊహించండి. సముద్ర నావికులు వారివారిదేవతలకు ప్రార్థన చేసి తుదకువారు నశించిపోకుండుటకు యోనాను సముద్రములో పడవేయునంతవరకు వారు సహాయమునకై అరచిన కేకలు వినండి.—యెహెజ్కేలు 27:5-9; యోనా 1:4-15.
మొదటి శతాబ్దములో యొప్పాలో క్రైస్తవసంఘముండెను. అందులో కొంతమంది మాజీ నావికులుగాను రేవు ఓడపనివారునైయున్నారు. రద్దీగానున్న ఈ ఓడరేవు సంఘములో యూదురాలైన దొర్కా (తబితా) ఒక సభ్యురాలు. “ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసియుండెను.” సా.శ. 36వ సంవత్సరములో దొర్కా రోగియై మరణించినప్పుడు అనేకమందికి అది విచారము కలిగించెను. తోటిక్రైస్తవులు అపొస్తలుడైన పేతురును విడ్డా (నేటి లోడ్ నుంచి టెల్ అవివ్ విమా నాశ్రయము దగ్గరవరకు) నుండి యొప్పేకు తీసుకొనివచ్చిరి. ఈ ప్రియమైన సహోదరిని పేతురు పునరుత్థానము చేసినప్పుడు ఆ అద్భుతము “యొప్పే అంతటికి తెలిసి అనేకులు ప్రభువునందు విశ్వసించిరి.”—అ.కార్యములు 9:36-42.
యొప్పేలో చర్మకారుడైన సీమోను ఇంట పేతురు కొంతకాలము నివసించెను. ఇక్కడ ఈ అపొస్తలునికి ఒక దర్శనము కలిగెను. ఆ తర్వాత కొంతమంది యొప్పే సంఘమునందలి సహోదరులతో కలిసి ఉత్తర తీర రహదారి వెంట క్రొత్త ఓడ రేవుగానున్న కైసరయకు వచ్చెను. అచ్చట పేతురు ప్రకటించి రోమా శతాధిపతియైన కొర్నేలికి బాప్తిస్మమిచ్చెను. ఇతడు సున్నతిపొందని అన్యులనుండి అభిషక్త క్రైస్తవునిగా అయిన మొదటి క్రైస్తవుడు. (అ.కార్యములు 9:43–10:48) క్రైస్తవ చరిత్రలో మలుపు తిరిగిన ఈ సంఘటన వార్తతో యొప్పేకు తిరిగి వచ్చిన సహోదరులకు ఇది ఎంతటి సంతోషము మరియు ఉత్సాహము కలుగజేసినది!
నేడు అనేక పర్యాటకులు ఆధునిక టెల్ అవివ్-జాఫాలో భాగముగా యున్న యొప్పేను దర్శింతురు మరియు వారు ఈ గుర్తింపబడిన ఓడరేవులో జరిగిన అనేక బైబిలు సంఘటనలను తేలికగా వదలివేతురు. (w89 9/1)
[అధస్సూచీలు]
a 1989 యెహోవాసాక్షుల క్యాలండరులో ఉన్న ఉపగ్రహదృశ్యములో మీరు ఇసుక తిన్నెలుగల ఈ తీరప్రాంతమును తేలికగా చూడవచ్చును. ఈ క్యాలెండరులో పైన చూపబడిన యొప్పా యొక్క పెద్ద దృశ్యమును కనుగొనగలరు.
[10వ పేజీలోని చిత్రసౌజన్యం]
Pictorial Archive (Near Eastern History) Est.
[11వ పేజీలోని చిత్రసౌజన్యం]
Pictorial Archive (Near Eastern History) Est.