నరకమును గూర్చిన సత్యము
మరణానంతర దండన అనే నమ్మకము, అసలు మనిషి నిజంగా చనిపోడని భౌతికశరీరము మృతినొందినప్పుడు—తరచు ఆత్మ అని పిలువబడేదేదో శరీరమరణమునుండి తప్పించుకొని పోవుననే సిద్ధాంతము దానికి ఆధారమని విశదమగుచున్నది. ముందు శీర్షికలో మనము గమనించిన రీతిగా ఈ నమ్మకము మెసపుటోమియా నందలి ఆదిమ సుమేరియులు, బబులోనీయుల నాటిది. అటుపిమ్మట దీనిని గ్రీకులు స్వీకరించారు. ప్లాటో వంటి తత్వవేత్తలు ఈ సిద్ధాంతమునకు మెరుగులు దిద్దారు. “శరీరము, ఆత్మను” గూర్చి వారుచేసిన శుద్ధీకరణా ద్విపాత్రా నమ్మకము భ్రష్టులైన యూదుల నమ్మకములో భాగమైనది.
తదుపరి జీవితమనే నమ్మకాన్ని నామకార్థ క్రైస్తవులు ఎప్పుడు స్వీకరించారు? నిశ్చయముగా అది యేసు అతని అపొస్తలులు జీవించిన కాలమందు మాత్రముకాదు. ఫ్రెంచి ఎన్‌సైక్లొపీడియా యూనివర్సలిస్ ఇట్లనుచున్నది: “[అపొక్రిపల్] పేతురుయొక్క ప్రత్యక్షత (సా.శ. 2వ శతాబ్దము) నరకములో పాపులను హింసించి శిక్షించుటనుగూర్చి పేర్కొనిన మొదట క్రైస్తవ వివరము.”
వాస్తవానికి, తొలి చర్చి ఫాదర్లలో నరకమునుగూర్చి ఎక్కువ అనంగీకారమున్నట్లు కన్పించుచున్నది. జస్టిన్ మార్టిర్, అలెగ్జాండ్రియా వాడైన క్లెమెంట్, టెర్టూలియన్, సైప్రియన్ నరకమును బలపర్చారు. ఓరిగెన్, నరకములో పాపులు క్రమేపి రక్షించబడుదురని చెప్పుచు నరకము స్వస్థపర్చునదనే మలుపుతిప్పాడు. గ్రెగరీ ఆఫ్ నాజయనస్ మరియు గ్రెగరి ఆఫ్ నైసా అతనిని ఎంతోకొంత అనుకరించారు. అయితే నరకమునుగూర్చిన అట్టి మృదువైన నమ్మకాలకు అగస్టీన్ మట్టుపెట్టాడు. ఆక్స్‌ఫర్డ్ ప్రొఫెసర్ జె. ఎన్. కెల్లీ తన పుస్తకమైన ఎర్లీ క్రిస్టియన్ డాక్ట్రిన్ ఇలా వ్రాసాడు: “పాపులకు తమ జీవితము అంతమైన తరువాత రెండవ అవకాశముండదని వారిని కబళించే నరకము ఎన్నటికి అంతము కాదనే కౄరమైన సిద్ధాంతము ఐదవ శతాబ్దమునకెల్లా అంతటా ప్రబలిపోయినది.”
పర్‌గేటరీనిగూర్చి “ఓర్ఫియస్—ఎ జనరల్ హిస్టరీ ఆఫ్ రెలిజియన్స్ అనే పుస్తకము ఇట్లనుచున్నది: “భవిష్యత్ వసతి మరియు నాశనమునకు మధ్య అగ్నిచేత ఆత్మలను శుద్ధిచేయు ఒక మధ్యంతర విమర్శ ఉంటుందని సెయింట్ అగస్టీన్ నమ్మెను. అది పర్‌గేటరీనిగూర్చిన ఓర్ఫిక్ [అన్య గ్రీకు] మరియు విర్జిలియన్ [అన్య రోమా] సిద్ధాంతము: ఆరవ శతాబ్దములో కూర్చబడి ఫ్లారెన్స్ కౌన్సిల్‌చే (1439) అది చర్చి సిద్ధాంతమని ప్రకటించబడెను.” న్యూ కాథోలిక్ ఎన్‌సైక్లొపీడియా ఇట్లు అంగీకరించుచున్నది: “పర్‌గేటరీ గూర్చిన కాథోలిక్కుల నమ్మకము పారంపర్యాచారముపై ఆధారపడినదేగాని పరిశుద్ధ లేఖనములమీద ఆధారపడినది కాదు.” లింబోనుగూర్చి రోమునందలి కార్డినల్ రిట్జింగర్, అది “కేవలము తాత్విక ఊహ” మాత్రమేనని ఒప్పుకొనుచున్నాడు.
మరణానంతర శిక్ష లేదు
అయితే మరి బైబిలు విషయమేమిటి? మరణమందు ఆత్మ శరీరమునుండి తప్పించుకొని నరకాగ్నిలోగాని లేదా పర్‌గేటరీలోగాని శిక్షించబడునా? న్యూ కాథోలిక్ ఎన్‌సైక్లొపీడియా ఇట్లనుచున్నది: “మరణానంతరము ఆత్మ తప్పించుకొనునన్న తలంపు బైబిలునందు కనుగొనబడదు. పాతనిబంధనలో ఆత్మ అనేది మనిషిలో ఒక భాగము కాదుగాని, సంపూర్ణ మానవుడే—జీవించు ప్రాణిగా మనుష్యుడే ఆత్మ. ఆలాగే, క్రొత్త నిబంధనలో అది మానవ జీవితమును: ఒకవ్యక్తియొక్క జీవమును సూచించుచున్నది.”
కనుక మరణానంతర శిక్షనుగూర్చిన మూల సిద్ధాంతము తప్పు అని రుజువాయెను. బైబిలు ఇట్లనుచున్నది: “పాపముచేయు ఆత్మ చనిపోవును.” (యెహెజ్కేలు 18:4, రివైజ్డ్ స్టాండార్డ్ వర్షన్, కాథోలిక్ సంచిక) అది ఇంకను ఇలా చెప్పుచున్నది: “పాపముయొక్క జీతము మరణము.” (రోమీయులు 6:23 RSV) అందుచేత, పశ్చాత్తాపము నొందని దుష్టులు “గెహెన్నా,” “నిత్యాగ్ని,” “అగ్నిగుండములో” పడవేయబడుదురని బైబిలు చెప్పుచున్నప్పుడు, వారు “రెండవ మరణమనే” శాశ్వత మరణము నొందుదురని చెప్పుటకు అది కేవలం సూచనార్థకంగా వాడబడిన పదజాలము మాత్రమే.—మత్తయి 23:33; 25:41, 46; ప్రకటన 20:14; 21:8;a పోల్చుము 2 థెస్సలొనీకయులు 1:7-9.
పునరుత్థానము ద్వారా నరకము ఖాళీయగును
అట్లయితే నరకము వేడిగా ఉండునా? బైబిలు ప్రకారమైతే కాదు. అవును, కొన్ని బైబిళ్లయందు “నరకమని” తర్జుమాచేయబడిన హెబ్రీ గ్రీకు పదములు కేవలం మృతినొందిన మానవుల సామాన్య సమాధిని సూచించునవైయున్నవి. అది బాధపెట్టునటువంటి వేడి ప్రదేశము కాదు. బదులుగా, అది ఒక విశ్రమస్థలము, అచ్చటనుండే మృతులు పునరుత్థానులగుదురు. (ప్రసంగి 9:10; అపొ.కార్యములు 24:15) స్విట్జర్‌ల్యాండ్, థియోలాజికల్ ఫేకల్టీ ఆఫ్ ది యూనివర్శిటి ఆఫ్ బేసిల్ మరియు పారిస్‌నందు సోర్‌బోనిలో ప్రొఫెసర్ అయిన ఓస్కార్ కుల్‌మాన్ “మరణించినవారు పునరుత్థానమగుదురనే క్రైస్తవుల విశ్వాసమునకు అమర్త్యమైన ఆత్మనుగూర్చిన గ్రీకుల నమ్మకమునకుగల ప్రత్యక్ష తేడానుగూర్చి” మాట్లాడెను. అతడు చెప్పిందేమంటే, “ఆ తదుపరి క్రైస్తవులు ఈ రెండు నమ్మకముల మధ్యస్థ నమ్మకము కాదుగాని ఒకదానిని [పునరుత్థానమునుగూర్చిన బైబిలు సిద్ధాంతము] మరొకదాని [మానవ ఆత్మ అమరత్వమునుగూర్చిన అన్య నమ్మకము] కొరకు పరిత్యజించుటయే.”—ఇటాలిక్కులు మావి.
ఆత్మ అమర్త్యమైనదనే తలంపునకు అనుగుణ్యముగా పునరుత్థానమందు తమకుగల నమ్మకాన్ని యెహోవా సాక్షులు విడనాడలేదు. నరకము వేడిగా లేదనే సత్యాన్ని, బైబిలునుండి మీకు నిరూపించి, సంతోషదాయకమైన తమ నిరీక్షణను మీతో పంచుకొనుటకు వారు ఉల్లసించగలరు. (w89 10/1)
[అధస్సూచీలు]
a నరకాగ్ని సిద్ధాంతమును వాదించుటకు వీటిని మరి యితర బైబిలు లేఖనములను ఎవరైనా వాడినట్లయితే వీటినిగూర్చిన అదనపు సమాచారము కొరకు వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్టు సొసైటి వారిచే ప్రచురింపబడిన జీవితమున ఉన్న యావత్తు ఇదేనా? అను పుస్తకమును చూడండి.