యేసుయొక్క జీవితము పరిచర్య
క్రీస్తురాజ్యపు మహిమయొక్క పూర్వప్రదర్శన
యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములకువచ్చి, తన అపొస్తలులును చేరియున్న ఒక జనసమూహమునకు బోధింపనారంభించెను. ఆయన వారికి ఉలికిపడజేయు ఈ ప్రకటన చేసెను: “ఇక్కడ నిలిచియున్న వారిలో కొందరు, మనుష్యకుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచువరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.”
‘యేసు భావమేమై యుండవచ్చును?’ అని శిష్యులు ఆలోచించిరి. ఒక వారము తర్వాత పేతురు, యాకోబు, యోహాను ఆయనతోకూడ ఒక ఎత్తైన ఒక పర్వతము మీదికి పోయిరి. శిష్యులు నిద్రించుచున్నందున బహుశ అది రాత్రియైయుండవచ్చును. యేసు ప్రార్థించుచుండగా ఆయన వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యునివలె ప్రకాశించెను; ఆయన వస్త్రములు వెలుగువలె తెల్లనివాయెను.
ఆ పిమ్మట, గుర్తుపట్టు వీలగులాగున రెండు ఆకారములు, “మోషేయు, ఏలీయాయు” వారికి కన్పించిరి, వారు యేసుతో ఆయన ‘యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమునుగూర్చి’ మాటలాడుచుండిరి. ఈ నిర్గమము స్పష్టముగా యేసు మరణ పునరుత్థానములను సూచించుచున్నది. ఆ విధముగా, ఈ సంభాషణ పేతురు కోరినట్లుగా, తన అవమానకరమగు మరణము తప్పింపబడ వీలులేనిదని నిరూపించుచున్నది.
ఇప్పుడు పూర్తిగా మేలుకొనిన వారై, శిష్యులు ఆశ్చర్యముతో దానిని గమనించుచు ఆ మాటలను వినిరి. ఇది దర్శనమైనను, పేతురుకు అది ఎంతగా నిజమైయుండెననగా అతడు ఆ దృశ్యమందు భాగము వహించుటకు ఆరంభించి, “ప్రభువా, మనమిక్కడ ఉండుట మంచిది. నీ కిష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు మోషేకు ఒకటియు ఏలీయాకు ఒకటియ మూడు పర్ణశాలలు కట్టుదునని” అనెను.
పేతురు ఇంకను మాట్లాడుచుండగా, ప్రకాశమానమైన యొక మేఘము వారిని కమ్ముకొనెను, మరియు ఆ మేఘములోనుండి ఒక స్వరము వారికిట్లు చెప్పెను: “ఈయన నా ప్రియకుమారుడు, ఈయనయందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడి.” శిష్యులు ఆ మాటలు వినినవెంటనే బోర్లపడిరి. అయితే యేసు, “లెండి, భయపడకుడి” అని వారితో చెప్పెను. వారు లేచిచూడగా, యేసు తప్ప మరి ఎవరును వారికి కనబడలేదు.
మరుసటి దినము వారు కొండదిగి వచ్చుచుండగా, యేసు వారికిట్లు ఆజ్ఞాపించెను: “మనుష్యకుమారుడు మృతులలోనుండి లేచువరకు ఈ దర్శనము మీరు ఎవరితోను చెప్పకుడి.” దర్శనములో ఏలీయా కన్పించుట శిష్యుల మదిలో ఒక ప్రశ్నను లేవదీసెను. “ఈలాగైతే, ఏలీయా ముందుగా రావలెనని శాస్త్రులెందుకు చెప్పుచున్నారని” వారడిగిరి.
అందుకు యేసు, “ఏలీయా యిదివరకే వచ్చెను; వారతనిని ఎరుగలేదని” చెప్పెను. అయితే యేసు, ఏలీయాకు పోలిన పాత్రను నెరవేర్చిన స్నానికుడైన యోహానునుగూర్చి మాట్లాడుచున్నాడు. ఎలీషా కొరకు ఏలీయా చేసినట్లుగానే, యోహాను క్రీస్తు కొరకు మార్గమును సిద్ధముచేసెను.
యేసు మరియు శిష్యులకు ఈ దర్శనము ఎంతగా బలపరచునదిగా నిరూపింపబడెను! ఈ దర్శనము క్రీస్తు రాజ్యముయొక్క మహిమకు పూర్వప్రదర్శన అన్నట్లు ఉండెను. నిజానికి, శిష్యులు ఒక వారముముందు యేసు వాగ్దానము చేసినట్లుగా, “మనుష్యకుమారుడు తన రాజ్యముతో వచ్చుటను” చూసిరి. యేసు మరణము తర్వాత, పేతురు ‘తాము పరిశుద్ధ పర్వతముమీద ఆయనతోకూడ ఉండినప్పుడు, క్రీస్తు మహిమను కన్నులారా చూచితిమని’ చెప్పెను.
దేవుడు ఏర్పరచుకొనిన రాజని లేఖనములలో చెప్పబడినది తానేయని నిరూపించుటకు పరిసయ్యులు యేసునుండి ఒక సూచనను అడిగిరి. వారికి అటువంటి సూచన ఏదియు ఇవ్వబడలేదు. మరొకవైపున, రాజ్య ప్రవచనములను స్థిరపరచుటకు, యేసు సన్నిహిత శిష్యులు రూపాంతరమును చూచుటకు అనుమతింపబడిరి. ఆ పిమ్మట పేతురు ఈ విధముగా వ్రాసెను: “కావున స్థిరమైన ప్రవచనవాక్యము మనకున్నది.” మత్తయి 16:28–17:13; మార్కు 9:1-13; లూకా 9:27-37; 2 పేతురు 1:16-19.
◆ మరణము రుచి చూడకముందు, క్రీస్తు రాజ్యమందు వచ్చుటను కొందరెట్లు చూసిరి?
◆ దర్శనములో, మోషే మరియు ఏలీయా యేసుతో దేనినిగూర్చి మాట్లాడిరి?
◆ ఈ దర్శనము శిష్యులకు ఎందుకు అంత బలమునిచ్చునదై యున్నది? (w88 1/1)
[9వ పేజీలో పూర్తి-పేజీ చిత్రం ఉంది]