నరకము యొక్క మూలారంభము
“నరకము అనే పదము దండనాస్థలమును సూచించుటకు వాడబడెనని,” న్యూ కాథోలిక్ ఎన్‌సైక్లొపీడియా వివరించుచున్నది. “దుష్టుల భవిష్యత్ శిక్షాస్థలముగా”a ఒక ప్రొటస్టెంట్ ఎన్‌సైక్లొపీడియా నరకమునకు నిర్వచనమిచ్చుచున్నది. అయితే మరణానంతర దండనాస్థలమునుగూర్చిన నమ్మకము ప్రధాన క్రీస్తు మత చర్చీలకు మాత్రమే పరిమితము కాదు. క్రీస్తుమత సామ్రాజ్యము ఉనికిలోనికి రాకపూర్వము అనేక శతాబ్దములకు ముందే అది ప్రారంభమాయెను.
మెసపుటోమియా నరకము
యేసు పుట్టక పూర్వము దాదాపు 2000 సంవత్సరముల కాలములో, సుమేరియులకు బబులోనీయులకు పాతాళలోకమునందు నమ్మకముండెను. తిరిగిరాని ప్రదేశమని వారు దానిని పిలిచేవారు. “ఎపిక్ ఆఫ్ గిల్గామేష్” మరియు “డిసెంట్ ఆఫ్ ఇష్తార్ టుది అండర్ వరల్డ్” అని పిలువబడే సుమేరియుల, అక్కాడియనుల పద్యకావ్యములలో ఈ ప్రాచీన నమ్మకము తేటగా కన్పించినది. ఈ మృతుల నివాసము ఒక అంధకార గృహమని “అందు ప్రవేశించిన వారెవ్వరు దానిని విడిచివెళ్లలేని గృహము” అనివారు వర్ణించారు.
అచ్చట ఉండే పరిస్థితులనుగూర్చి “క్రింది లోకమంతా భయాందోళనతో నిండియుంటుందని” ప్రాచీన అస్సీరీయుల పాఠ్యపుస్తకము పేర్కొన్నది. భూమిక్రిందనుండే మృతుల నివాసస్థలమును చూచేందుకు అనుమతించబడినాడని చెప్పుకొను అస్సీరీయుల రాజు తానుచూచిన దానినిబట్టి “తన కాళ్లు వణికిపోయినవని” సాక్ష్యమిచ్చాడు. పాతాళలోక రాజైన నెర్గల్‌ను గూర్చి వర్ణించుచు, “అతడు నన్నుచూచి కోపోద్రేకముతో ఉరుమువలె క్రోధముతో కూడిన కేక వేసాడు” అని పేర్కొన్నాడు.
ఐగుప్తు మరియు తూర్పుదేశ మతములు
ప్రాచీన ఐగుప్తీయులు ఆత్మ అమర్త్యమైనదని విశ్వసించారు, మరియు తదుపరి లోకమునుగూర్చి వారికి తమ స్వంత నమ్మకమున్నది. ది న్యూ ఎన్‌సైక్లొపీడియా బ్రిటానికా ఇట్లనుచున్నది: “తదుపరి లోకమునకుపోవు మార్గము భయంకరమైన ఆపదలచే ఆవరింపబడియున్నదని ఐగుప్తీయుల అంత్యక్రియల పుస్తకములు చిత్రీకరించుచున్నవి: భయంకర కౄరజంతువులు, అగ్ని గుండములు, మంత్ర దండకములచేతప్ప దాటజాలని ద్వారములు, మంత్రముద్వారానే విఘ్నముచేయగల దుష్టభావాలను కలిగియున్న ఏటిని దాటించు దుష్టుడు.”
మరణానంతర శిక్షనుగూర్చిన వివిధ రకములైన నమ్మకాలను ఇండో-ఇరానియన్ మతములు వృద్ధిచేసుకొన్నవి. హిందూ మతమునుగూర్చి ఫ్రెంచి ఎన్‌సైక్లొపీడియా యూనివర్సలిస్ (సార్వత్రిక సర్వసంగ్రహ నిఘంటువు) ఇట్లనుచున్నది: “21 నరకములనుగూర్చిన అనేక రకముల వర్ణనలు హిందువులచే ఊహించబడెను. కౄరమృగములు, పాములచే పాపులు హరించివేయబడుట, నికృష్టముగా వేయించడం, ముక్కలుగా కోయడం, ఆకలి దప్పులతో చిత్రవధ చేయడం, నూనెలో ఉడకబెట్టడం లేదా యినుపపాత్రలు లేక రాతిపాత్రలలో పిండివలె దంచడం జరుగుతుంది.”
జైను మరియు బౌద్ధ మతములు నరకమునుగూర్చి తమ స్వంత వర్ణనలు కలిగియున్నవి. అచ్చట పశ్చాత్తాపములేని పాపులు బాధించబడుదురు. ఇరాన్ లేదా పర్షియాలో కనుగొనబడు జోరోస్ట్రియనిజమ్ కూడ నరకమును కలిగియున్నది. అది పాపముచేసిన ఆత్మలను బాధించు—ఒక శీతలమైన, దుర్గంధమైన ప్రదేశము.
ఆసక్తికరంగా, ఐగుప్తీయుల, హిందువుల, జైన్, బౌద్ధుల, జోరోస్ట్రియనుల నరకము శాశ్వతము కాదని తెలియుచున్నది. ఈ మతముల ప్రకారము కొంతకాలం గడిచిన పిమ్మట, మానవ గమ్యమునుగూర్చి ఆయా స్థితికి వెళ్లిపోవును. నరకమునుగూర్చిన వారి తలంపులు కాథోలిక్కుల పర్‌గేటరీని పోలియున్నవి.
గ్రీకు, ఎట్రూష్కన్, మరియు రోమా నరకములు
ప్రాచీన గ్రీకులు, ఆత్మ (సైఖె, ఈ పదమును వారు సీతాకోకచిలుకకు కూడ వాడుదురు) తప్పించుకొంటుందని నమ్మిరి. చనిపోయినవారు ఉండే లోకమునువారు హేడిస్ అని పిలిచారు, మరియు అదే పేరుగల ఒక దేవునిచే అది పాలించబడేదని వారు నమ్మారు. ఆర్పెయస్—ఎ జనరల్ హిస్టరీ ఆఫ్ రెలిజియన్స్ అను తన పుస్తకములో ఫ్రెంచి తత్వవేత్త సాల్మన్ రెయినక్ గ్రీకులనుగూర్చి ఇలా వ్రాసెను: “మృతుని నోటిలో పెట్టబడే నాణెమును రవాణా రుసుముగా వసూలుచేసే వృద్ధ నావికుడైన ఖారోన్‌యొక్క పడవలో స్టెక్స్ నదినిదాటిన తరువాత [ఆత్మ] నరకలోకములో ప్రవేశించునను బహుళ వ్యాప్తమైన నమ్మకమున్నది. నరకలోకములో అది ఆ ప్రాంతపు ముగ్గురు న్యాయాధిపతుల ఎదుట నిలువబడును . . . ; దాని నేరములకు శిక్ష విధించబడితే, టార్‌టారస్‌లో అది బాధింపబడవలసియుండును. . . . పసితనములో చనిపోయిన పిల్లల నివాసమైన లింబోను, మరియు సౌమ్యమైన దండననిచ్చి ఆత్మలను శుద్ధిచేసే పర్‌గేటరీనికూడ గ్రీకులు కనిపెట్టారు.” ది వరల్డ్ బుక్ ఎన్‌సైక్లొపీడియా ప్రకారము టార్‌టారస్‌లో అంతమగు ఆత్మలు “నిత్య బాధను అనుభవించును.”
రోమా నాగరికతకు ముందున్న, ఇటలీలోని ఎట్రూష్కన్స్‌కూడ మరణానంతర దండనయందు నమ్మికయుంచారు. ది డిక్షనరీ డిస్ రెలిజియన్స్ (వివిధ మతముల నిఘంటువు) ఇట్లనుచున్నది: “చనిపోయినవారి విషయములో ఎట్రూష్కన్స్ తీసుకొను అత్యంత శ్రద్ధ క్రిందిలోకమునుగూర్చిన తమ నమ్మకమును వర్ణించుచున్నది. బబులోనీయులవలె వీరును ఇవి బాధపెట్టు స్థలములని, చనిపోయిన వారి ఆత్మలకు నిరాశ కలిగించు ప్రదేశములని పరిగణింతురు. తమ సంతతివారు చేయు ప్రాయశ్చిత్త అర్పణలద్వారానే వీరికి ఉపశమనము లభించగలదు” దీని సంబంధిత మరో పరిశీలన ఇట్లనుచున్నది: “ఎట్రూష్కన్ల సమాధులపైగల భయంకర చిత్రములు నరకముయొక్క వర్ణచిత్రములను వేయుటకు క్రైస్తవులను ప్రేరేపించినవి.”
ఎట్రూష్కన్ల నరకమును రోమనులు స్వీకరించి, దానిని ఓర్కాస్, లేదా ఇన్‌ఫెర్నస్ అని పిలిచారు. పాతాళలోక రాజైన హేడిస్‌నుగూర్చిన గ్రీకుల కల్పితకథలనుకూడ వీరు తెచ్చుకున్నారు, అతనిని ఓర్కాస్, లేదా ప్లూటొ అని పిలిచేవారు.
యూదులు మరియు హెబ్రీ లేఖనములు
యేసు కాలమునకు ముందున్న యూదుల సంగతేమి? వారినిగూర్చి ఎన్‌సైక్లొపీడియా బ్రిటానికా (1970) నందు మనమిలా చదువగలము: “క్రీ.పూ. 5వ శతాబ్దమునుండి యూదులు, పారసీకులతోను గ్రీకులతోను సన్నిహిత సంబంధమును కలిగియుండిరి. వీరివురికి ఆ తదపరి జీవితము అనుదానినిగూర్చి బహుగా వృద్ధిచెందిన తలంపులు కలవు. . . . క్రీస్తు కాలము వచ్చేసరికి, దుష్టాత్మలు మరణానంతరము గెహెన్నాలో శిక్షించబడుననే నమ్మకాన్ని యూదులు సంతరించుకొన్నారు.” అయితే, ఎన్‌సైక్లొపీడియా జుడైకా ఇట్లనుచున్నది: “గెహెన్నానుగూర్చిన ఈ తదుపరి తలంపుయొక్క సలహా లేఖనములలో కనుగొనబడదు.”
ఈ రెండవ వ్యాఖ్య సరియైనది. ఆత్మ నరకాగ్నిలో శవపరీక్షా దండన చేయబడుననే సలహా హెబ్రీలేఖనములలో లేదు. భయబ్రాంతులను చేయు ఈ సిద్ధాంతము జలప్రళయానంతర బబులోను మతములకు చెందినదిగాని, బైబిలు సంబంధమైనది కాదు. నరకములో బాధించబడుదురనే క్రైస్తవుల సిద్ధాంతము తొలి బబులోనీయులవద్ద ఆరంభమైనది. పర్‌గేటరీలో స్వస్థపరచు బాధనుగూర్చిన కాథోలిక్కు తలంపు తొలి ఐగుప్తు మరియు తూర్పు దేశమతములలో ఆరంభమాయెను. లింబో గ్రీకుల పురాణమునుండి తీసుకొనబడినది. మరణించిన వారిని గూర్చిన ప్రార్థనలు, అర్పణలు ఎట్రూష్కన్లచే ఆచరించబడేవి.
అయితే మరణానంతరం స్పృహతోకూడిన శిక్ష అనే సిద్ధాంతములన్నియు ఏ ప్రాథమిక ఊహపై ఆధారపడియున్నవి? (w89 10/1)
[అధస్సూచీలు]
a మెక్లింటాక్ అండ్ స్ట్రాంగ్స్ సైక్లొపీడియా ఆఫ్ బిబ్లికల్, థియోలాజికల్, అండ్ ఎక్లిసియాస్టికల్ లిటరేచర్, సంపుటి 4, పుట 165.
[5వ పేజీలోని చిత్రాలు]
డాంటే “ఇన్‌ఫెర్నో” నందు వర్ణించబడినట్లు స్టెక్స్‌నదిని దాటుట
[క్రెడిట్ లైను]
Dover Publications, Inc.