సంతోషమునిచ్చు పరదైసులో మానవుని గొప్ప ఉత్తరాపేక్ష
దేవుడు వారిని ఆశీర్వదించెను; ఎట్లనగా: ‘మీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి, సముద్రపు చేపలను ఆకాశపక్షులను భూమిమీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని’ దేవుడు వారితో చెప్పెను.”—ఆదికాండము 1:28.
1, 2. మానవులు ఏమి పొందవలెనని యెహోవా ప్రేమపూర్వకముగా పనిచేయుచున్నాడు, మరియు ఆదామునకు ఏ పనిని అప్పగించెను?
“దేవుడు ప్రేమాస్వరూపి” అని బైబిలు మనకు చెప్పుచున్నది. ఆయన ప్రేమపూర్వకమైన మరియు, నిస్వార్థమైన ఆసక్తిని మానవజాతియెడల కలిగి వారు నిరంతరము ఆరోగ్యకరమైన, శాంతియుతమైన జీవితములను ఆ సంతోషమునిచ్చు పరదైసులో ఆనందించవలెనని యెడతెగక పనిచేయుచున్నాడు. (1 యోహాను 4:16; కీర్తన 16:11తో పోల్చుము.) మొదటి మానవుడు, ఆ పరిపూర్ణ ఆదాము ఆసక్తికరమైన, ఆనందకరమైన పని మరియు శాంతియుతమైన జీవితమును కలిగియుండెను. నరుని సృష్టికర్త, ఆహ్లాదకరమైన ఆ ఏదెను తోటను సేద్యపరచుటకు అతనిని నియమించెను. నరుని సృష్టికర్త మరొక కార్యమును అతనికిచ్చెను. ఒక ప్రాముఖ్యమైన (విశేషమైన) సవాలుతో కూడిన బాధ్యత అతనికివ్వబడెను జరిగిన దానిని క్రిందివృత్తాంతము ఇలా బయలుపరచుచున్నది:
2 “దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశపక్షిని నేలనుండి నిర్మించి, ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను; జీవముగల ప్రతిదానికి (SOUL)కు ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశపక్షులకును సమస్త భూజంతువులకును పేరులు పెట్టెను.”—ఆదికాండము 2:19, 20.
3. ఆదాము మరియు జంతుసృష్టికి పరస్పర భయము ఎందుకు లేకుండెను?
3 ఆ నరుడు గుర్రమును సస్ (sus) అని, కోడెను షోర్ (shohr) అని, గొర్రెను సే (seh) అని, మేకను ఎజ్ (ez) అని, పక్షిని ఓఫ్ (ohph) అని, పావురమును యోనా (yohnah) అని, నెమలిని టుక్కీ (tukki) అని, సింహమును ఆర్యే (aryeh) లేక (ari) అని, ఎలుగుబంటిని డవ్ (dov) అని, నరవానరమును గోఫ్ (gohph) అని, కుక్కను కెలెవ్ (kelev) అని, పామును నాకాష్ (nachash) అని, మరియితర వాటిని అదేవిధముగా పిలిచెను.a అతడు ఏదెను తోటనుండి ప్రవహించు నదియొద్దకు వెళ్ళినప్పుడు అతడు చేపలను చూచెను. అతడు చేపకు డాగా (dagah) అని పేరుపెట్టెను. అతనియొద్ద ఆయుధములు లేనప్పటికి అడవి జంతువులకు మరియు సాధు జంతువులకు లేక పక్షులకు ఆ నరుడు భయపడలేదు. అవి కూడా అతనిని చూచి భయపడలేదు కాని తమ అంతర్భుద్దితో అతడు తమకంటే గొప్పవాడని, ఉన్నత జాతికి చెందినవాడని గుర్తించాయి. అవన్నియు దేవునిచే సృష్టించబడినవని, ఆయననుండి జీవితమును బహుమానముగా పొందినవి మరియు ఆ నరుడు వాటిని బాధపెట్టవలెననికాని, చంపవలెననిగాని ఇచ్ఛను లేక ఆలోచనను కలిగియుండలేదు.
4. ఆదాము జంతువులకు మరియు పక్షులకు పేరుపెట్టుటను గూర్చి మనము ఏమి చెప్పగలము, మరియు అది అతనికి ఎటువంటి అనుభవమైయుండెను?
4 ఎంతకాలమువరకు ఆదాము పశువులను, అడవి జంతువులను మరియు ఆకాశమున ఎగురు పక్షులను గమనించాడో మనకు వివరించబడలేదు. అదంతయు దైవిక నడిపింపు మరియు ఏర్పాటు ప్రకారముగా జరిగెను. బహుశ ఆదాము ప్రతి జంతువును పరిశీలించుటకు సమయమును తీసుకొని వాటిప్రత్యేక నిర్మాణము మరియు అలవాట్లు కనుగొని; వాటికి విశేషముగా సరిపడు పేరును ఎన్నుకొనియుండును. దానికొరకు చెప్పుకొనదగినంత సమయము గడచియుండును. భూమిపైయున్న సకల జాతుల సృష్టి జీవులను ఆవిధంగా పరిచయముచేసుకొనుట ఆదామునకు ఆసక్తికరమైన అనుభవమైయుండెను మరియు ఈ జీవించు ప్రాణులను సరిపడు పేరుతో గుర్తించుటకు అతనికి మనోశక్తి మరియు వాక్శక్తి అవసరమైయుండెను.
5-7. (ఎ) ఏ ప్రశ్నలు సహజముగా ఉత్పన్నమగును? (బి) ఆదికాండము 1:1-25లోని సృష్టివృత్తాంతమందు ఎలాంటి సమాధానములు ఇవ్వబడినవి?
5 అయితే ఈ జీవించుప్రాణుల సృష్టి క్రమమేమైయున్నది? భూమిపైయున్న జంతువులు పక్షులు ముందు సృష్టించబడెనా లేదా, మరియు తక్కువ జాతికిచెందిన జీవప్రాణులతో పోల్చినప్పుడు, ఏ సమయములో మరియు ఏ క్రమములో ఆదాము నిలుచును? ఎన్నోరకములైన జీవప్రాణులకు భూపైభాగమును ఎంతో ఎత్తుకు ఎగురుటకు పక్షులకు గాలిని, త్రాగుటకు నీటిని, చెట్లమొక్కలను ఆహారమగుటకు, పగటిని ఉజ్వలపరచి నరుడు చూచుటకు సహాయముచేయు గొప్ప జ్యోతిని, రాత్రిని సుందరముగాచేయు చిన్న జ్యోతిని దేవుడెట్లు తయారుచేసెను? నరుడు దిగంబరియై తిరుగగలిగి, పనిచేసి, నిద్రించగలిగిన వెచ్చని సున్నితమైన వాతావరణమెందుకుండెను?
6 ఈ జవాబులను ఊహించుటకు నరుడు విడువబడలేదు. ఖచ్ఛితముగా తెలిసి, అధికారపూర్వకముగా చెప్పగల వారినుండి తెలివిగల జవాబులు పొందుటకు అతని ప్రశ్నించు మనస్సు అర్హత గలదైయుండెను. అతడు అజ్ఞానియైన దేవుని కుమారునిగా విడిచిపెట్టబడలేదు, అయితే ఉన్నతస్థాయికి చెందిన అతని మేధస్సును ఘనపరుస్తూ అద్భుత సృష్టి చరిత్ర అతనికి ఆదికాండము 1:1-25లో వివరించబడెను.
7 ఉప్పొంగజేయు ఆ సృష్టివివరణ కొరకు ఆదాము కృతజ్ఞుడైయుండును. అది ఎన్నో విషయములను స్పష్టపరచెను. అక్కడ చెప్పిన విధంగా పొడవైన మూడు సమయ భాగములు ఉన్నవని అతడు అర్థముచేసుకొనెను, వాటిని దేవుడు తన సమయమును కొలుచు పద్దతిని వాడి దినములని పిలిచెను. సృష్టి నాలుగవ సమయభాగములో దేవుడు రెండు గొప్ప జ్యోతులను ఆకాశములో అమర్చి, కొద్దిసమయము కలిగిన 24 గంటల దినమును ఏర్పరచెను. భూమిపై ఆ చిన్న మానవదినము, ఆ గొప్ప జ్యోతి అస్తమయమైన సమయమునుండి అది తిరిగి అస్తమించువరకు ఉండెను. సంవత్సరముల సమయము తనముందున్నదని ఆదాము గుర్తించి, వెంటనే తను జీవించు సంవత్సరములను లెక్కించుటకు మొదలు పెట్టియుండవచ్చును. ఆకాశవిశాలమందున్న గొప్ప జ్యోతి అతనికి అది చేయుటలో సహాయపడును. అయితే దేవుని పొడవైన సృష్టిదినముల విషయములో ఆదాము తాను దేవుని భూసంబంధమైన సృష్టిపనిలోని ఆరవదినములో జీవిస్తున్నాడని తెలిసికొన్నాడు. భూమిపైయుండు జంతువులు మరియు నరుడు ప్రత్యేకంగా సృష్టించబడిన తర్వాత ఆరవదినము అంతమాయెనని అతనికింకా చెప్పబడలేదు. చెట్లు, మొక్కలు, జలప్రాణులు, పక్షులు, మరియు భూజంతువులయొక్క సృష్టిక్రమమును అతడు గ్రహించాడు. అయితే తనంతట తాను ఏదెను తోటలో ఉండుట మానవునియెడల దేవుని సంపూర్ణ సంకల్పము కాదు.
మొదటి స్త్రీని సృష్టించుట
8, 9. (ఎ) జంతుసృష్టిని గూర్చి పరిపూర్ణ మానవుడు ఏమి గమనించెను, మరియు తనను గూర్చి ఏమి నిర్ణయించుకొనెను? (బి) ఆ పరిపూర్ణ మానవుడు తన జత కావలెనని దేవుని అడుగకుండుట ఎందుకు సరియైయుండెను? (సి) మొదటి మానవుని భార్యను సృష్టించుటను బైబిలు ఎట్లు వర్ణించుచున్నది?
8 ఆ మొదటి నరుడు తన సంపూర్ణ మనస్సు మరియు గమనించు శక్తులతో పక్షుల మరియు జంతువుల జగత్తులో ఆడ మరియు మగవి ఉండి తమవంటి వాటికి జన్మనిచ్చెనని అతడు చూచెను. అయితే ఆ నరునికి మాత్రము అప్పుడు ఆలాగు లేదు. అది గమనించిన పిమ్మట అతనిలో ఒక సహవాసితో ఆనందించవలెనను ఆలోచన పుట్టినను, తనకు సరియైన జతను ఆ జంతు జగత్తులో అతడు కనుగొనలేదు, నరవానరములలో సహితము. ఆదాము తనకు జతలేదని నిర్ణయించుకొనియుండును. ఎందుకనగా ఒక జత ఉన్నయెడల దేవుడు తనయొద్దకు తెచ్చియుండెడివాడే కదా? మానవుడు ఆ జంతు జాతులన్నిటినుండి వేరుగా సృష్టించబడెను, మరియు వేరుగానేయుండుటకు చేయబడెను! అతడు తనకుతాను నిర్ణయము చేసుకొని నిర్లజ్జితుడై దేవుడైన సృష్టికర్తను తనకు ఒకజత కావలెనని అడుగవలెనని ఆలోచించలేదు. అన్ని విషయములు దేవుని చేతిలో విడుచుట ఆ పరిపూర్ణ మానవునికి సరియైయుండెను. ఎందుకనగా, కొద్ది సమయము తర్వాత ఆ విషయమును గూర్చి దేవుడు నిర్ణయము తీసుకొనియున్నాడని అతడు తెలుసుకొన్నాడు. దీని విషయము ఏమి జరిగెనో మనకు ఇలా వివరించబడినది:
9 “అయినను ఆదాముకు సాటియైన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢనిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదామునుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునొద్దకు తీసుకొనివచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను: ‘నా యెముకలలో ఒక యెముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలోనుండి తీయబడెను గనుక నారి అనబడును.’ కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును; వారు ఏక శరీరులైయుందురు. అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరు దిగంబరులుగా నుండిరి; అయితే వారు సిగ్గు ఎరుగకయుండిరి.”—ఆదికాండము 2:20-25.
10. ఆ పరిపూర్ణ నారిని అతనికి బహుకరించినప్పుడు, ఆ పరిపూర్ణ మానవుడు ఎటువంటి ప్రత్త్యుత్తరమిచ్చెను, మరియు అతని మాటలు దేనిని సూచించియుండవచ్చును?
10 ఆ పరిపూర్ణ స్త్రీని తనకు సహాయకారిగాను, పూరకము (COMPLEMENT)గాను కానుక చేసినప్పుడు అతడు సంపూర్ణ సంతృప్తిని ఈ మాటలద్వారా ప్రకటించెను: “నా యెముకలలో ఒక యెముక నా మాంసములో మాంసము.” ఈ మాటల దృష్ట్యా చివరకు తన క్రొత్తగా సృష్టించబడిన భార్యను చూసినప్పుడు పలికిన ఈ మాటల దృష్ట్యా, అతడు ఆ ఉల్లసమునిచ్చు మానవ ప్రతిరూపము కొరకు కొంతకాలము వేచియుండి ఉండవచ్చును. తన పూరకమును వర్ణిస్తూ తన భార్యను ఆదాము “నారి” అని పిలిచెను. [ఇష్షాహా (ishshah) లేక, అక్షరార్థముగా, “ఆడదిగాయున్న నరుడు], ఎందుకనగా “ఇది నరునిలోనుండి తీయబడెను.” (ఆదికాండము 2:23, న్యూ వరల్డ్ ట్రాన్స్లేషన్ రెఫరెన్సు బైబిలు, పాదవచనము) అంతకు ముందు ఎగరేపక్షులను, భూజంతువులను పేరుపెట్టుటకు దేవుడు ఆదాము దృష్టికి తెచ్చినప్పుడు వాటిని రక్తసంబంధులుగా అతడు భావించలేదు. అతని శరీరము వాటినుండి వేరైయుండెను. అయితే ఈ నారి మాత్రము నిజముగా తన శరీర జాతికి చెందినది. (మత్తయి 19:4-6 చూడుము) ఇప్పుడు ఎవరో ఒకరితో దేవుని ప్రవక్తవలె ప్రవర్తించుటకు మరియు అద్భుతమైన సృష్టి వివరములను పంచుకొనుటకు అతడు కలిగియుండెను.
11-13. (ఎ) ఆదాము భార్యను పొందుటతో ఏ ప్రశ్నలు ఉత్పన్నమగును? (బి) మొదటి మానవ దంపతులయెడల దేవుని సంకల్పమేమైయుండెను? (సి) పరిపూర్ణ మానవ కుటుంబమునకు ఏది ఆహారమైయుండును?
11 అయితే అతనికి ఒక భార్యనిచ్చుటలో దేవుని సంకల్పమేమైయున్నది? అతడు ఒంటరితనమును అనుభవించకుండా ఉండుటకు తనజాతికి చెందిన సహవాసియై కేవలము ఒక సహాయకారిగా, పూరకముగా ఉండుటకు ఇచ్చెనా? దేవుడు వారి వివాహముపై పలికిన ఆశీర్వాదములను తెలుపుతు గ్రంథము దేవుని సంకల్పమును ఈ విధంగా వివరిస్తుంది:
12 “దేవుడు, ‘మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము; వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు’ పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను; స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను; ఎట్లనగా, ‘మీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి; సముద్రపు చేపలను ఆకాశపక్షులను భూమిమీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని’ దేవుడు వారితో చెప్పెను.”
13 “దేవుడు, ‘ఇదిగో భూమిమీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్షఫలముగల ప్రతి వృక్షమును మీ కిచ్చియున్నాను; అవి మీకాహారమగును. భూమిమీదనుండు జంతువులన్నిటికిని ఆకాశపక్షులన్నిటికిని భూమిమీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నియు ఆహారమగునని’ పలికెను. ఆ ప్రకారమాయెను.”—ఆదికాండము 1:26-30.
మొదటి మానవజత ముందున్న ఉత్తరాపేక్షలు
14. దేవుని ఆశీర్వాదముతో, పరిపూర్ణులైన స్త్రీ పురుషుల ఎదుట ఎటువంటి భవిష్యత్తు ఉంచబడినది, మరియు వారు ఏ ఊహాదృశ్యమును సరిగా చూడగలరు?
14 ఆ పరిపూర్ణ మానవుడు మరియు అతని పరిపూర్ణ భార్య దేవుని స్వరము వారితో మాట్లాడుట విని, వారు ఏమి చేయవలెనో చెపుతూ వారిని ఆశీర్వదించడం ఎంత అద్భుతకరమైన విషయం! దేవుని ఆశీర్వాదములతో జీవితము వ్యర్థము కాదు గాని, ఏమి చేయవలెనని చెప్పబడెనో అది చేయుటలో వారికి సహకారమిచ్చును. ఎంతటి భవిష్యత్తు వారి ముందుండెను! సంతోషముగా వివాహితులైన జంటగా తమ ఇల్లు అయిన ఏదెను తోటలో నిలిచియుండి, వారియెడల దేవుని చిత్తమును వారు జరిగించినప్పుడు ఏమి జరుగునో వారు ధ్యానించియుండవచ్చును. వారి మనోనేత్రములు దూరపు భవిష్యత్తులోనికి చూచినప్పుడు వారు కేవలము “తూర్పునవున్న ఏదెను తోటనే” గాక ఉజ్వలించు ముఖారవిందముగల స్త్రీ పురుషులతో నిండిన భూమిని వారు చూచిరి. (ఆదికాండము 2:8) వారందరు తమ పిల్లలే, వారివంశీయులే అని తలంచినప్పుడు ఆ స్త్రీ పురుషుల హృదయము గంతులు వేయును. అందరు పరిపూర్ణులైయుండి లోపములేని శరీరరూపము మరియు నిర్మాణముతో, జీవించు ఉల్లసముతో మంచి ఆరోగ్యముతో నిండిన నిరంతర యవ్వనము కలిగి, అందరు ఒకరియెడల ఒకరు పరిపూర్ణ ప్రేమను చూపుతు, ఐక్యతతో తమ గొప్ప సృష్టికర్త, పరలోకపు తండ్రిని తమ మొదటి తల్లిదండ్రులతో కలసి ఆరాధించుచున్న వారైయుందురు. అటువంటి కుటుంబమును కలిగియుండుటను గూర్చి ఆలోచించినప్పుడు ఆ మొదటి స్త్రీ పురుషుల హృదయము ఎంతగా ఉప్పొంగియుండవచ్చును!
15, 16. (ఎ) మానవ కుటుంబమునకు అక్కడ సమృద్ధిగా ఆహారము ఎందుకు లభ్యమగును? (బి) ఆ సంతోషకరమైన కుటుంబము సంఖ్యలో పెరిగిన కొలది వారికి ఏదెను తోట వెలుపల ఏ పని ఉండును?
15 భూమియంతటా వ్యాపించిన ఆ మానవ కుటుంబములోని ప్రతి సభ్యునికి సమృద్ధిగా ఆహారము దొరుకును. ఏదెను తోటలో ఆరంభమందు సమృద్ధిగా ఆహారముండెను. దేవుడు విత్తనములిచ్చు ప్రతిచెట్టును, ఫలములనిచ్చు చెట్లతో సహా ఆరోగ్యకరమైన, జీవితమును పోషించు ఆహారముగా ఉండుటకు వారికిచ్చెను.—కీర్తన 104:24 పోల్చుము.
16 ఆ సంతోషకరమైన కుటుంబము సంఖ్యలో పెరిగిన కొలది, ఆ తోటను ఏదెను సరిహద్దులుదాటి వ్యాపింపజేయుదురు. ఎందుకనగా ఏదెను తోట వెలుపల భూమి సేద్యముచేయని స్థితిలో ఉన్నట్టు దేవుని మాటలు సూచించును. అంటే దానిని ఎవరు కాచియుండలేదు, మరియు ఏదెను తోటవలే అది ఉన్నత స్థాయిలో సేద్యపరచబడలేదు. అందుకే వారి సృష్టికర్త వారితో భూమిని నిండించి దానిని “లోపరచుకొనుడి” అని చెప్పెను.—ఆదికాండము 1:28.
17. పెరుగుచున్న జనాబాకు ఎందుకు సంతృప్తిగా ఆహారము దొరుకును, మరియు తోట వ్యాపించిన కొలది ఏమి నిలిచియుండును?
17 ఆ పరిపూర్ణ కాపరులు మరియు సేద్యకుల ద్వారా వ్యాపించిన తోట పెరుతున్న జనాబాకు సమృద్ధిగా పంటనిచ్చును. చివరకు క్రమంగా పెరుగుతున్న తోట భూమియంతట వ్యాపించును, మరియ భూమియంతయు పరదైసుగా మారి మానవజాతియొక్క నిరంతర గృహముగా వర్ధిల్లును. అది పరలోకమునుండి చూచుటకు సుందరముగా ఉండును, మరియు పరలోకపు సృష్టికర్త అది చాలా మంచిదిగాయున్నదని చెప్పును.—యోబు 38:7 పోల్చుము.
18. భూవ్యాప్తమైన ఏదెను తోటలో అలజడి ఎందుకు ఉండదు, మరియు ఎటువంటి ప్రశాంతత అక్కడ నిలిచియుండును?
18 క్రొత్తగా వివాహమైన స్త్రీ పురుషులు ఏదెను తోటలో కనుగొన్న అలజడిలేని ప్రశాంత పరిస్థితులు అప్పుడంతా వ్యాపించును. మొదటి మానవుడు ఆదాము పరిశీలించి పేరుపెట్టిన జంతువులు మరియు ఎగిరే పక్షులు ఏ విధమైన హాని లేక ప్రమాదము కలుగజేయుననే భయము అప్పుడుండదు. తమ మొదటి మానవ తల్లిదండ్రులవలె, ఆ పరిపూర్ణ నివాసులు, భూవ్యాప్తితమైన పరదైసులోని సముద్రపు చేపలను, ఆకాశమున ఎగురు పక్షులను భూమిపై ప్రాకు ప్రతిప్రాణిని అడవి జంతువులతో సహా లోపరచుకొందురు. “దేవుని స్వరూపమందు” సృష్టించబడిన మనుష్యునికి లోబడియుండవలెనని తమ అంతర్బుద్ధితో గ్రహించు ఈ తక్కువ శ్రేణికి చెందిన ప్రాణులు అతనితో శాంతియుతంగా జీవించును. వాటి సున్నితమైన, పరిపూర్ణ మానవ యజమానులు, ఈ తక్కువ శ్రేణికి చెందిన ప్రాణులను లోపరచుకొనుటలో, ఒక శాంతియుత వాతావరణాన్ని జంతుసృష్టిలో పెంపొందింపజేయుదురు. దేవుని స్వరూపములో చేయబడిన మానవ యజమానుల శాంతియుత ప్రభావము తృప్తిపరచబడిన ఆ తక్కువ శ్రేణి ప్రాణులలో సురక్షితముగా వ్యాపించును. ప్రాముఖ్యముగా, పరిపూర్ణ మానవజాతి దేవునితో శాంతిని కలిగియుందురు. అప్పుడాయన ఆశీర్వాదములు వారినుండి ఎప్పుడును తొలగిపోవు.—యెషయా 11:9 పోల్చుము.
దేవుడు తన సృష్టికార్యములనుండి విశ్రమించును
19. (ఎ) దేవుని సంకల్పమును గూర్చి మొదటి స్త్రీ పురుషులు ఏమి గ్రహించిరి? (బి) సమయమును గూర్చి దేవుడు ఏమి సూచించెను?
19 ఆ పరిపూర్ణ మానవ జంట, దేవుని చిత్తము ప్రకారము పూర్తయిన భూలోక దృశ్యమును గూర్చి ఆలోచించుచుండగా వారొక విషయమును గ్రహింతురు. వారు దేవుడిచ్చిన ఈ అద్భుతమైన ఆదేశమును పూర్తి చేయుటకు సమయము అవసరము. ఎంత సమయము? తమ సృష్టికర్త మరియు పరలోకపు తండ్రికి తెలియును. సృష్టిదినముల వరుసలో వారు మరియొక అంతమునకు వచ్చి “సాయంకాలము”లో నిలిచియుండి ఒక క్రొత్త దినముయొక్క ఆరంభములో ఉన్నట్లు దేవుడు తన సృష్టిదినములను లెక్కించు పద్ధతిలో వారికి సూచించెను. అది ఒక ఆశీర్వదింపబడిన దినమైయుండును, మరియు దేవుని శుద్ధమైన, నీతియుక్తమైన సంకల్పము కొరకు పరిశుద్ధపరచబడిన దినము. ఆ పరిపూర్ణ మానవుడు దేవుని ప్రవక్త దీనిని గుర్తించెను. దైవావేశము వలన కలిగిన వర్ణన ఈ విధంగా చెపుతుంది:
20. బైబిలు వర్ణన “ఏడవ దినము”ను గూర్చి ఏమి చెప్పుచున్నది?
20 “దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలమంచిదిగనుండెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఆరవ దినమాయెను. ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన తనపని యేడవదినములోగా సంపూర్తిచేసి, తాను చేసిన తన పనియంతటినుండి యేడవదినమున విశ్రమించెను. కాబట్టి దేవుడు ఆ యేడవదినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను; ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టియు, సృజించినట్టియు తన పని అంతటినుండి విశ్రమించెను. దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమ్యాకాశములు సృజించబడినప్పుడు వాటి వాటి ఉత్పత్తిక్రమము ఇదే.”—ఆదికాండము 1:31–2:4.
21. (ఎ) దేవుడు విశ్రాంతి దినమును ముగించినట్లు, మరియు అది చాలామంచిగా ఉన్నట్లు బైబిలు చెప్పుచున్నదా? వివరించుము. (బి) ఎటువంటి ప్రశ్నలు ఉత్పన్నమగును?
21 దేవుడు తన విశ్రాంతి దినమును ముగించి అది చాలా మంచిగాయున్నదని చూచి సాయంకాలము మరియు ఉదయముకాగా యేడవదినమాయెనని ఆ వర్ణన మనకు చెప్పుటలేదు. గడచిన ఆరు సృష్టిదినములకు చెప్పిన రీతిగా ఏడవదినము ఇంకా అంతము కాలేదు. ఇంతవరకు గడచిన దినమునుగూర్చి దేవుడు చాలా మంచిగావుందని చెప్పగలడా? అది ఇంతవరకు ఒక ప్రశాంతమైన విశ్రాంతి దినమువలె దేవునికుండెనా? పరదైసులో తమ వివాహదినమును స్త్రీ పురుషులు దృష్టించిన హృదయమును ఉప్పొంగజేయు ఉత్తరాపేక్ష విషయమేమి? ఈ విషయములను మనము తదుపరి శీర్షికలో చూద్దాము. (w89 8/1)
[అధస్సూచీలు]
a ఆదికాండముయొక్క హెబ్రీ వచనములయందు అలాగే ప్రేరేపిత ఇతర హెబ్రీ లేఖనముల గ్రంథములయందు ఈ పేర్లు కనుగొనబడును.
మీరెట్లు ప్రత్యుత్తరమిత్తురు?
◻ తోటను కాయుటయే గాక దేవుడు ఆదామునకు ఏ పనిని ఇచ్చెను, మరియు దీనిలో ఏమి యిమిడియున్నది?
◻ ఆదికాండము 1:1-25లో సృష్టి వర్ణన ఏమి తెలియజేయుచున్నది?
◻ మొదటి మానవ భార్య ఎట్లు సృష్టించబడెను, మరియు వారి వివాహదినమున ఆదాము ఎట్లు ప్రత్యుత్తరమిచ్చెను?
◻ మొదటి మానవ జంట ఎదుట ఎటువంటి ఉత్తరాపేక్ష ఉండెను?
◻ సృష్టి దినముల వరుసలో మరియొక అంతము వచ్చెనని దేవుడు ఎట్లు సూచించెను?