మానవుడు అవిధేయుడైనను స్థిరముగానున్న పరదైసు ఉత్తరాపేక్షలు
1. కొంత సమయము గడచిన తరువాత మొదటి స్త్రీ పురుషులు ఎక్కడ మరియు ఏ పరిస్థితులయందు ఉన్నారు?
సమయము గడచినది. మొదటి స్త్రీ పురుషులు అమాయకముగా దిగంబరులై లేరు. వారు దుస్తులు ధరించిరి—జంతు చర్మముతో చేసిన పొడవు వస్త్రములతో. వారు పరిపూర్ణ తోటయైన ఏదెను ద్వారము వెలుపలనే ఉన్నారు. వారి వెన్నుభాగము తోటవైపున్నది. వారి ముందున్న దృశ్యాన్ని చూసారు. సేద్యపరచని నేలమాత్రం వారికి కనిపిస్తుంది. అతిస్పష్టంగా దేవుని ఆశీస్సులను అది కలిగిలేదు. వారిముందు ముండ్లు, గచ్చ పొదలు చూడవచ్చు. ఈ భూమినే కదా వారు లోపరచుకొనమని ఆదేశింపబడ్డారు? అవును, కాని ఆ మొదటి స్త్రీ పురుషులు ఏదెను తోటను వ్యాపింపజేయు సంకల్పముతో సేద్యపరచని ఆ ప్రదేశమునకు రాలేదు.
2. ఎందుకు ఆ స్త్రీ పురుషులు పరదైసు తోటలోనికి ప్రవేశించుటకు ప్రయత్నించలేదు?
2 అట్టి వ్యత్యాసముగల దృశ్యము చూచినప్పుడు, ఎందుకు వెనుదిరిగి పరదైసు తోటలోనికి తిరిగి ప్రవేశింపలేదు? అది చెప్పుట సులభమే, కాని వారి వెనుక తోట ద్వారముయొద్ద ఏమున్నదో చూడుము. వారెప్పుడు చూడని, ఏదెను తోటలో కూడా చూడని కెరూబులు, మరియు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాల. ఆ స్త్రీ పురుషులు వాటిని దాటి జీవముతో తోటలోనికి ప్రవేశింపలేరు.—ఆదికాండము 3:24.
3. వారి పరిస్థితులలో తీవ్ర మార్పుకలుగుటకు ఏమి జరిగెను?
3 ఏమి జరిగియుండెను? అది శాస్త్రవేత్తలను వేల సంవత్సరములు కలవరపరచు కష్టతరమైన మర్మము కాదు. అది సరళముగా వివరింపబడినది. ఆ మొదటి స్త్రీ పురుషులు వారి వివాహదినమున వారికీయబడిన ఆదేశము ద్వారా వారి ముందుంచబడిన అద్భుత ఉత్తరాపేక్షను ఒక షరతుపై పొందగలరు, అదేమనగా తమ పరలోకపు తండ్రికి అతిచిన్న విషయంలో విధేయులై ఉండాలి. ఒక ఆహారాన్ని నిషేధించటంద్వారా వారి పరిపూర్ణ విధేయత పరీక్షించబడింది: వారు “మంచిచెడ్డల తెలివినిచ్చు చెట్టు” ఫలములను తినకూడదు. (ఆదికాండము 2:16, 17) దేవుని ఆజ్ఞకు విరుద్ధంగా వారాలాగు చేసినట్లయిన వారు నిశ్చయముగా చచ్చెదరు. ఆ విషయాన్ని ఆదాము దేవుని ప్రవక్తగా తనకంటే వయస్సులో చిన్నదైన తన భార్యకు చెప్పెను. అయితే ఆశ్చర్యకరముగా, ఆ నాకాష్ (nachash), ఆ సర్పము నిషేధించబడిన మంచిచెడ్డల తెలివినిచ్చు చెట్టు ఫలమును తినకూడదని దేవుడు ఆదాముకిచ్చిన హెచ్చరికయొక్క సత్యమును ప్రశ్నించెను. ఆ సర్పము స్త్రీని మోసగించి దేవుని ఆజ్ఞను తృణీకరించి, నిషేధించబడిన ఫలమును తినుట వలన ఆమె దేవునివలె తయారయి మంచిచెడ్డలను నిర్ణయించుటలో దేవునినుండి స్వాతంత్ర్యము పొందునని నమ్మించెను.—ఆదికాండము 3:1-5.
కల్పిత కథకాదు
4, 5. అపొస్తలుడైన పౌలు సర్పము హవ్వను మోసపరచుట కల్పిత కథ కాదు అని ఏలా చూపెను?
4 నమ్ముట కష్టమా? ఇది కల్పిత కథవలె వినిపిస్తుందా, సత్యములపై ఆధారములేని పురాణకథ, కావున ఆధునిక విజ్ఞానులైన వారికి అస్వీకారనీయమైనదా? కాదు, అత్యధికంగా చదివిన లేఖికుడు, ఒక నమ్మదగిన గ్రంథకర్త, విశేషంగా ఎన్నుకొనబడిన అపొస్తలుడు, తాను వ్రాసిన దాని నిజత్వమును ఎరిగిన వానికి అది అలాలేదు. లోకబుద్ధిగల కొరింథు పట్టణములోని సంఘముయొక్క ఈడు వచ్చిన క్రైస్తవులకు అపొస్తలుడైన పౌలు ఈ విధంగా వ్రాసెను: “సర్పము తన కుయుక్తిచేత హవ్వను మోసపరచినట్లు, మీ మనస్సులును చెరుపబడి క్రీస్తు యెడలనున్న సరళతనుండియు పవిత్రతనుండియు ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను.”—2 కొరింథీయులు 11:3.
5 గ్రీకు మతముయొక్క కట్టుకథలను బాగుగా యెరిగిన కొరింథీయులకు తానుచెప్పు విషయమును బలపరచుటకు పౌలు కల్పితకథను, కట్టుకథను వాడుట అసమంజసము. “దేవుని వాక్యము’’ అని ప్రకటించిన హెబ్రీలేఖనములను ఆధారముగా చేసుకొని “సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరచెను” అని నొక్కిచెప్పెను. (2 థెస్సలొనీకయులు 2:13) మరియు “హితవాక్య ప్రమాణములను” బోధించు బాధ్యత కలిగిన తోటి అధ్యక్షునికి వ్రాయుచూ పౌలు ఇట్లనెను: “మొదట ఆదాము తరువాత హవ్వ నిర్మింపబడిరి కారా? మరియు ఆదాము మోసపరచబడలేదు గాని, స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను.—2 తిమోతి 1:13; 1 తిమోతి 2:13, 14.
6. (ఎ) ఆదాముయొక్క అతిక్రమము స్త్రీయొక్క అతిక్రమమునకు ఎట్లు వ్యత్యాసమైయున్నది? (బి) ఆ స్త్రీ సర్పమును గూర్చి కట్టుకథ చెప్పుటలేదని మనకెట్లు తెలియును?
6 స్త్రీ ఆ సర్పము ద్వారా మోసపరచబడెను అనునది ఒక యథార్థము, కల్పితకథ కాదు. అదేవిధముగా ఆమె అవిధేయతతో నిషేధించబడిన ఫలమును తినుటవలన కలిగి పరిణామములు కూడా చరిత్రలోని యథార్థములు. ఆమె ఆవిధముగా దేవునికి విరుద్ధముగా అతిక్రమించిన తరువాత, ఆమె తన భర్తను తినుటకు ప్రేరేపించెను, కాని అతడు పూర్తిగా మోసపరచబడి తినలేదు. (ఆదికాండము 3:6) వారు తరువాత దేవునికి లెక్కయొప్పజెప్పవలసిన సమయములో ఏమి జరిగినదో ఈ విధముగా వర్ణించబడినది: “అందుకు ఆదాము: ‘నాతోనుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలములు కొన్ని నాకియ్యగా నేను తింటిని’ అనెను. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో: ‘నీవు చేసినదియేమిటి?’ అని అడుగగా, స్త్రీ ‘సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిని’ అనెను.” (ఆదికాండము 3:12, 13) ఆ స్త్రీ ఆ నాకాష్ (nachash), ఆ సర్పమును గూర్చి కల్పితకథను చెప్పియుండలేదు, మరియు యెహోవా దేవుడు దానిని కట్టుకథగా భావించలేదు. ఆ స్త్రీ తన దేవుడు మరియు సృష్టికర్తకు విరుద్ధంగా అతిక్రమించుటకు మోసపోవుటకు కారణము సర్పమని గుర్తించి ఆయన దానితో వ్యవహరించెను కట్టుకథకు చెందిన సర్పముతో వ్యవహరించుట దేవునికి అగౌరవనీయమైయుండును.
7. (ఎ) సర్పముపై దేవుని న్యాయతీర్పును బైబిలు ఎట్లు వర్ణించుచున్నది? (బి) స్త్రీని మోసపరచిన ఆ సర్పము మనను కూడా ఎట్లు మోసపరచగలదు?
7 ఏదెను తోటలో సర్పానికి దేవుడిచ్చిన న్యాయతీర్పు ఇలా వర్ణించబడెను: “అందుకు దేవుడైన యెహోవా సర్పముతో నీవు దీనిని చేసినందున పశువులన్నిటిలోను, భూజంతువులన్నిటిలోను నీవు శపించబడినదానవై నీ కడుపుపై ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నియు మన్ను తిందువు. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను అది నీ తలమీద కొట్టును నీవు దానిని మడిమె మీద కొట్టుదువని చెప్పెను.” (ఆదికాండము 3:14, 15) ప్రతి గంభీరమైన న్యాయశాల యథార్థతతో వ్యవహరించును మరియు రుజువులను పరిశీలించునుగాని కట్టు కథలను కాదు. యెహోవా దేవుడు కల్పితగాథకు చెందిన సర్పముపై న్యాయ తీర్పు విధించి తానొక మూర్ఖుడు మరియు బుద్ధిహీనునివలె ప్రవర్తించుట లేదుకాని, నిజముగా జీవించుచున్న తనకు లెక్కయొప్పజెప్పవలసిన ప్రాణిపై ఆయన తీర్పు విధించెను. అదే సర్పము తాను ఎప్పుడు ఉండలేదు అని, తాను ఒక కట్టుకథ అని, తాను ఏ తప్పుచేసినను ఎవరికి లెక్క ఒప్పజెప్పవలసిన అవసరము లేదని నమ్ముటకు మనలను మోసపరచినయెడల అది నవ్వవలసిన విషయముకాదుగాని జాలిపుట్టించెడి పరిస్థితియైయుండును.a
8. స్త్రీపై దేవుడు ఏ శిక్షను విధించెను, దానివలన ఆమె బిడ్డలు మరియు మనవరాళ్ళపై ఏ ప్రభావము కలిగెను?
8 సర్పమును గూర్చి ఆ స్త్రీ చెప్పిన విషయము సత్యముగా పరిగణించి, ఆ పురుషుని భార్యను గూర్చి గ్రంథము ఇలా చెప్పుచున్నది: “ఆయన స్త్రీతో, ‘నీ ప్రయాసమును నీ గర్భ వేదనను నేను మిక్కిలి హెచ్చించెదను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్తయెడల నీకు వాంఛ కలుగును అతడు నిన్ను ఏలును’ అని చెప్పెను.”(ఆదికాండము 3:16) ఆదాముతో ఆమె వివాహమును జరిపినప్పుడు దేవుడిచ్చిన ఆశీర్వాదములలో ఇటువంటిదేమి లేకుండెను కాని దేవుడు వారికిట్లు చెప్పెను: “ఫలించి అభివృద్ధిచెంది భూమిని నిండించుడి.” (ఆదికాండము 1:28) ఆ పరిపూర్ణ జంటకు ఇచ్చిన సంతోషకరమైన స్త్రీకి ఎక్కువ గర్భమును సూచించెనేగాని, భర్తద్వారా అణచివేయబడుట అందులో యిమిడియుండలేదు. అతిక్రమించిన స్త్రీపై జారీయైన న్యాయతీర్పు ఆమె బిడ్డలపై తరతరముల వరకు ప్రభావితమైయుండును.
ఆదాముపై తీర్పు ద్వారా దేవుని నియమము ఘనపరచబడినది
9, 10. (ఎ) దేవుడు ఆదాముకు ఏ సూటియైన హెచ్చరికనిచ్చెను, మరియు దేవుడు ఆ శిక్షను అమలుపరచినట్లయితే ఎటువంటి పరిణామములు కలుగును? (బి) ఆదాముకు వ్యతిరేకముగా దేవుడు ఏ తీర్పు తీర్చెను?
9 తనతో అతిక్రమమును చేయుటకు పురికొల్పిన పురుషునితో ఆ స్త్రీ ఎటువంటి మారిన పరిస్థితులను పంచుకొనవలెను? ఈ మనుష్యునితో దేవుడు ముఖాముఖిగా చెప్పియుండెను. అయితే “మంచిచెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికాజ్ఞాపించెను.” (ఆదికాండము 2:17) కేవలము ఒక ఫలమును తిన్నందుకు, న్యాయాధిపతిగా దేవుడు ఆ గంభీర తీర్పును విధించునా? అటువంటి శిక్షను విధించుట వలన ఏమి జరుగునో ఆలోచించుము! తమ సంతానముతో భూమినినిండించి, ఒక పరిపూర్ణ మానవజాతి పరదైసు భూమిపై శాంతియుతముగా అంతములేని యవ్వనముతో నిరంతరము నివసిస్తూ తమ పరలోకపు తండ్రితో శాంతియుత సంబంధము ఉండవలెనన్న ఉత్తరాపేక్షతో తమ వివాహదినమందు ఆదాము హవ్వలు ఆశించిన ఆ ఆత్మను-కంపింపజేయు అపేక్ష అంతమగును! మానవజాతి అంతటికి మొదటి తల్లిదండ్రులపై మరణశిక్షను ఖచ్ఛితముగా నిర్వహించి, మానవజాతి కొరకు మరియు మానవుని భూసంబంధమైన ఇంటికొరకు తన అద్భుత సంకల్పమును నిశ్చయముగా ఆయన ఓడించడు! కాని స్పష్టముగా వ్రాయబడిన దైవిక నిర్ణయమును బైబిలు వర్ణించుటను వినుము:
10 “ఆయన ఆదాముతో, ‘నీవు నీ భార్యమాటవిని, “తిన వద్దని” నేను నీకాజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడియున్నది. ప్రయాసముతోనే నీవు బ్రదుకు దినములన్నియు దాని పంట తిందువు, అది ముండ్ల తుప్పలను గచ్చపొదలను నీకు మొలిపించును; పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరువరకు నీ ముఖపు చెమటకార్చి ఆహారముతిందువు, ఏలయనగా నేలనుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువు’ అని చెప్పెను.”—ఆదికాండము 3:17-19.
11. విధేయత విషయమైన ఏ వాస్తవములు, ఆదాముకు వ్యతిరేకముగా దేవుడు తీర్చిన తీర్పు న్యాయమని దృష్టాంతపరచుచున్నవి?
11 పరదైసు భూమి పరిపూర్ణమైన స్త్రీ పురుషులతో నిండి, ప్రేమ పూర్వకంగా శాంతియుతంగా, కలిసి నివసిస్తూ భూవ్యాప్తమైన పరదైసు నిరంతరము కాస్తు, సేద్యపరుస్తూ ఉండవలెనన్న దేవుని సంకల్పమునకు ఎటువంటి పరిణామము కలిగినను ఆ మరణదండన నిర్వహింపవలెనని ఆ తీర్పుయొక్క అర్థము. నిషేధించబడిన “మంచిచెడ్డల తెలివినిచ్చు వృక్షము”నుండి తినకూడదని చెప్పిన దేవుని మాట వినకుండా, ఆ మానవుడు తన భార్య మాటను వినెను. తనకు తానే తన దేవుడు మరియు సృష్టికర్తయొక్క మాటకు విధేయత చూపనప్పుడు, తన పిల్లలకు తప్పకుండా అలా చేయుటకు నేర్పించునా? యెహోవాదేవునికి విధేయత చూపుమని వారికి బోధించుటలో, తన స్వంతవుదాహరణ మాట్లాడే అంశముగా వుండునా?—1 సమూయేలు 15:22 పోల్చుము.
12, 13. (ఎ) ఆదాము పాపము అతని పిల్లలమీద ఎట్లు ప్రభావము చూపెను? (బి) ఎందుకు ఆదాము పరదైసునందుగాని భూమిమీదగాని నిరంతరము జీవించుటకు అర్హుడుకాడు
12 ఆదాము ఒకప్పుడు తన మానవ పరిపూర్ణతయందు దేవుని నియమమునకు పరిపూర్ణ విధేయత చూపినట్లు అతనిపిల్లలు చేయగలరా? వంశపారంపర్యా నియమముల అనుసారముగా తన పిల్లలకు దేవుని మాటకు విధేయత చూపక వేరొకరి మాట విను తన స్వభావమును మరియు బలహీనతను తన పిల్లలకు సంక్రమింపజేయడా? యథార్థ చరిత్ర ఈ ప్రశ్నలకు ఉత్తరమిచ్చును.—రోమీయులు 5:12.
13 కేవలము ఒక మానవ సృష్టికొరకు దేవునియెడల తన పరిపూర్ణ ప్రేమను వ్యక్తపరచు, పరిపూర్ణ విధేయతనుండి తొలగిపోయిన మానవుడు, పరదైసులో లేక భూమిపైకూడా నిరంతరము జీవించుటకు అర్హుడా? అతనిని భూమిపై నిరంతరము అనుమతించుట సురక్షితమా? తన అతిక్రమముతో భూమిపై జీవించుటకు అనుమతించుట వలన దేవుని నియమమును ఘనపరచి ఆయన సంపూర్ణ న్యాయమును ప్రకటించునా లేక దేవుని నియమమునకు అగౌరవమును నేర్పునా, ఆయన మాటలు నమ్మదగినవికావని సూచించునా?
ఏదెను తోటనుండి వెళ్ళగొట్టబడెను
14. ఆదాము అతని భార్యమీద దేవుడు తీసుకొనిన చర్యను బైబిలు చరిత్ర ఎట్లు వర్ణించుచున్నది?
14 ఈ విషయముపై దేవుడు ఏ నిర్ణయము చేసెనో బైబిలు మనకు చెపుతుంది: “దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను. అప్పుడు దేవుడైన యెహోవా, ‘ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు, ఆదాము మనలో ఒకనివంటివాడాయెను. కాబట్టి అతడు ఒకవేళ తనచెయ్యిచాచి జీవ వృక్షఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో,—’ అని దేవుడైన యెహోవా అతడు ఏ నేలనుండి తీయబడెనో దాని సేద్యపరచుటకు ఏదెను తోటలోనుండి అతని పంపివేసెను. అప్పుడాయన ఆదామును వెళ్లగొట్టి ఏదెను తోటకు తూర్పుదిక్కున కెరూబులను, జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టెను.”—ఆదికాండము 3:21-24.
15. (ఎ) ఆదాము హవ్వలు తమ దిగంబరత్వమునకు సిగ్గుపడుటయెడల దేవుడెట్లు జాలిచూపెను? (బి) ఆ మొదటి దంపతులు ఎట్లు ఏదెను తోటనుండి వెళ్ళగొట్టబడిరి? (సి) ఏదెను తోట వెలుపట ఎలాంటి మారిన పరిస్థితులు ఆదాము హవ్వలకు ఎదురైనవి?
15 పాపులై ఆదాము మరియు అతని భార్య దిగంబరులైయుండుట చూచి లజ్జితులైనప్పుడు ఆ దైవిక న్యాయాధిపతి అర్థము చేసుకొనెను. వారు చేసి నడుముకు కట్టుకున్న అంజూరపు ఆకులకు బదులుగా, మనకు చెప్పబడని రీతిగా వారికి చర్మముతో చేసిన పొడవు వస్త్రములను ఇచ్చెను. పాపము చేసిన తరువాత చెడ్డమనసు గలవారైనందున, దేవునిదృష్టికి కనబడకుండేందుకుగాను (ఆదికాండము 3:7) ఆ చర్మవస్త్రములు చాలా రోజులుండి ఏదెను తోట వెలుపటవున్న ముండ్లు, గచ్చతుప్పలు మరియు ఇతర హానికరమైన వాటినుండి సంరక్షించును. పాపము చేసిన తరువాత చెడ్డమనసు గలవారైనందున, దేవునిదృష్టికి కనబడకుండేందుకుగాను ఏదెను తోటలోని చెట్లమధ్య దాగుకొనుటకు ప్రయత్నించిరి. (ఆదికాండము 3:8) వారిపై తీర్పుతీర్చిన తరువాత దేవుడు వారిని తోట వెలుపలికి వెళ్లగొట్టుటకు వారి మీదకు దైవిక వత్తిడిని తెచ్చెను. వారు తూర్పువైపు వెళ్లగొట్టబడి, కొద్దిసమయము తరువాత తమనుతాము తోట వెలుపల కనుగొనిరి. ఎల్లప్పుడు అందులోనుండి నిషేధించబడిరి. మరిక వారెన్నడు ఆ తోటను పెంపొందింపజేసి, ఆ పరదైసును భూమియంతట వ్యాపింపజేయు పనిలో భాగమువహించరు. వారు ఇకముందు భూమియొక్క పంటను ఆహారముగా తిందురు గాని అది వారిని నిత్యము జీవించుటకు పోషించలేదు. వారు “జీవ వృక్షమునుండి” వేరు పరచబడిరి. కొద్ది సమయము తరువాత—ఎంత సమయము?—వారు చనిపోయెదరు!
యెహోవా ఆదిసంకల్పము అపజయమునొందదు
16. దేవుడేమి చేయుటకు సంకల్పించలేదు, ఎందుకు?
16 ఇప్పుడు మంటినుండి చేయబడిన ఇద్దరు ప్రాణులను తనకు విరుద్ధంగా పాపము చేసినందున దేవుడు భూమిని, చంద్రుడు, సూర్యుడు మరియు నక్షత్రములతో సహా ఒక విశ్వ ప్రళయాగ్నితో నాశనము చేయుటకు నిశ్చయించెనా? ఆయన అలా చేసినట్లయిన, ఆయనయొక్క అద్భుత సంకల్పము ఆ నాకాష్ (nachash), మొదలు పెట్టిన దానితో అపజయము పొందెనని దాని అర్థముకాదా? ఆయన ఆదాము హవ్వ వివాహముతో తన సంకల్పమును జారీచేసి వారిని ఆశీర్వదించి తనచిత్తమేమిటో వారికి చెప్పెను: భూమియంతయు పరిపూర్ణ మానవజాతితో నింపవలెను, భూమియంతయు పరిపూర్ణమైన ఏదెను తోటవలె లోపరచుకొనబడి, మానవజాతియంతయు శాంతియుతముగా తక్కువ శ్రేణికి చెందిన ప్రాణులను భూమిపైయున్నవాటిని, నీటిలోయుండువాటిని ఏలవలెను. దేవుని సంకల్పము పూర్తి అయినప్పుడు జరుగువాటి మిరుమిట్లు కలిగించు దృశ్యము, నిజమగుటకు దేవుడు ఆరు సృష్టిదినములలో ఎన్నోవేల సంవత్సరములు పనిచేసెను! కేవలము ఒక సర్పము మరియు వక్రబుద్దిగల మొదటి మానవ జంట చేసినదాని కొరకు దేవునియొక్క ఈ ఘననీయమైన సంకల్పము నిజముకాకుండా విడువబడునా? కాదు.—యెషయా 46:9-11 పోల్చుము.
17. ఏడవ దినము విషయమై దేవుడేమి తీర్మానించెను, కాగా ఈ దినము ఎట్లు ముగించబడును?
17 ఆ ఏడవ దినమున యెహోవా దేవుని విశ్రాంతి దినమైయుండెను. ఆయన ఆ దినమును ఆశీర్వదించి, దానిని పరిశుద్ధపరచవలెనని నిర్ణయించెను. ఆ దినమును శపించుటకు ఆయన ఎవరిని అనుమతించడు మరియు ఆ విశ్రాంతి దినమును శపించుటకు ఎవరు ఏ పన్నాగమును చేసినను దానిపై ప్రతిక్రియ చూపి దానిని ఆశీర్వాదముగా మార్చి ఆ దినమును సంతోషకరముగా ముగింపజేయును. అప్పుడు భూమియంతయు ఒక పరిశుద్ధ స్థలముగా మారి దేవుని చిత్తము పరలోకమందు నెరవేరుతున్నట్లు భూమియందును నెరవేర్చబడును, ఇది ఒక పరిపూర్ణమైన మానవజాతి ద్వారా.—మత్తయి 6:10తో పోల్చుము.
18, 19. (ఎ) పాపులైన మొదటి దంపతుల పిల్లలు ఎందుకు సంతోషముగా ఉండగలరు? (బి) వచ్చే కావలికోట సంచికలయందు మరింకే విషయములు చర్చించబడును?
18 దేవుడు ఆశాభంగముననుభవించలేదు. తన సంకల్పమును ఆయన విడిచిపెట్టలేదు. ఆయన నమ్మదగినవాడై సంకల్పించి, సంకల్పించినవాటిని పూర్తిచేయగలడని నిరూపించి తనను తాను మహిమపరచుకొనుటకు నిర్ణయించెను. (యెషయా 45:18) పాపము చేసిన మొదటి జతయొక్క అపరిపూర్ణమైన బాధపడుతున్న సంతానము, తమ నిత్యశ్రేయస్సు కొరకు దేవుడు విశ్వాసయోగ్యముగా తన మొదటి సంకల్పమును పూర్తిచేయునని సంతోషకరముగా ఎదురుచూడవచ్చును. అప్పుడే దేవుని విశ్రాంతి దినములో వేల సంవత్సరములు గడిచినవి, మరియు విశేషమైన ఆశీర్వాదములను తెచ్చు ఆ దినముయొక్క ఆఖరి భాగము కూడా సమీపములో ఉంది. దేవుని విశ్రాంతి దినముయొక్క “సాయంకాలము” గడచినది, మరియు దానిముందున్న ఆరు సృష్టిదినములవలె “ఉదయము” రావలెను. ఆ “ఉదయము” పరిపూర్ణతకు వచ్చినప్పుడు, చూచేవారందరికి కనపడే విధముగా దేవుని ఎప్పుడుమారని సంకల్పముయొక్క మహిమాపూర్వకమైన నెరవేర్పు జరుగును. అప్పుడు ఈ విధముగా వ్రాయుటకు సాధ్యమగును, “అస్తమయమును ఉదయమును కలుగగా యేడవ దినమాయెను.” ఎంతటి ఆశ్చర్యకరమైన ఉత్తరాపేక్ష!
19 ఇదంతయు ఆలోచించుటకు ఎంత ఆహ్లాదకరము! వచ్చే కావలికోట సంచికలలో, విధేయతగల మానవులకు దేవుని నియమమును ప్రేమించు వారికి గల ఆకర్షణీయమైన పరదైసు ఉత్తరాపేక్షలను గూర్చి ఇంకా ఎక్కువ చెప్పబడును. (w89 8/1)
[అధస్సూచీలు]
a ప్రకటన 12:9లో అపవాదియగు సాతాను “ఆది సర్పము”గా గుర్తింపబడినది; అలాగే యోహాను 8:44నందు యేసు క్రీస్తు అతనిని “అబద్ధమునకు జనకుడు” అని మాట్లాడెను.
మీరేమి చెప్పుదురు?
◻ ఆ మొదటి జత తమ పరదైసు గృహమును ఎందుకు కోల్పోయిరి?
◻ సర్పము హవ్వను మోసపరచుట కల్పితగాధ కాదని మనకెట్లు తెలియును?
◻ స్త్రీపై దేవుడు ఏ శిక్షను విధించెను?
◻ ఆదాముపై దేవుడు ఏ శిక్షను విధించెను, మరియు ఇది దేవుని నియమమును ఎట్లు ఘనపర్చును?
◻ పరదైసు భూమి అంతయు పరిపూర్ణ మానవులతో నింపవలెనన్న తన సంకల్పమునుగూర్చి దేవుడు ఎందుకు ఆశాభంగమును అనుభవించలేదు?