‘పునరుత్థానమందు వారులేచెదరని మాకు తెలియును’
సర్వోన్నతుడైన దేవుడు మానవులకు జీవమునిచ్చాడు. చనిపోయినవారికి దానిని మరలా యిచ్చి పునరుద్ధరించగలడు కూడా. జీవన్మరణములను గూర్చి నమ్మదగిన సమాచారమునుకూడా మనము ఆయననుండి పొందియున్నాము. అదే హెబ్రీ మరియు క్రెస్తవగ్రీకు లేఖనములను రెండు భాగములతో కూడిన బైబిలు. చనిపోయినవారిలో అనేకులు తిరిగి రాగలరని మరియు వస్తారను వాస్తవాధారమైన వర్తమానము అందున్నది.—యోహాను 5:28, 29.
ఉదాహరణకు యేసుక్రీస్తునకు సుపరిచితుడైన బేతనియ నందలి లాజరు యొక్క చారిత్రక వృత్తాంతమును పరిశీలించుము. లాజరు రోగగ్రస్థుడై తుదకు చనిపోయెను. అటుపిమ్మట లాజరుయొక్క సహోదరియైన మార్తతో యేసు ఇట్లనెను: “చనిపోయిన నీ సహోదరుడు లేచును.” దానికి ఆమె యిలా సమాధానమిచ్చింది: “అంత్యదినమున పునరుత్థానమందు లేచునని ఎరుగుదును.” (యోహాను 11:23, 24) అవును, అది ఆమెకు తెలుసు. వాస్తవమైన సమాచారముపై ఆధారపడినదై “అంత్యదినమున” తన ప్రియ సహోదరుడైన లాజరు లేచి వస్తాడనుటకు ఆమెకు సందేహమేమియులేదు.
యోహాను 11వ అధ్యాయమందలి ఈ చారిత్రక నివేదికను చదువునప్పుడు అటుపిమ్మట ఏమి జరిగిందో వాటి వివరములను మీరు తెలిసికొందురు. లాజరు చనిపోయి నాలుగు దినములైనను యేసు అతనిని సజీవునిగా లేపెను. చనిపోయినవారిని “అంత్యదినమున” తిరిగి లేపుదునని చేసిన వాగ్ధానమును దేవుడు నెరవేర్చగలడనుటకు ఈ పునరుత్థానము ఒక నిదర్శనము. అయితే మార్త లాజరును ఎచ్చట చూస్తానని నిరీక్షించిది? రాబోవు పునరుత్థానమనేది ఎచ్చట జరుగునని ఇతర నమ్మకస్థులైన యూదులు ఊహించారు?
‘తిరిగి రాలేని ప్రదేశమా’?
మానవులు సహజంగా జీవించు ప్రదేశంగా దేవుడు భూమిని ఎంచుకున్నాడు. కీర్తనల గ్రంథకర్త దానిని ఈ మాటలలో విశదపర్చాడు: “ఆకాశములు యెహోవా వశము భూమిని ఆయన నరులకిచ్చియున్నాడు”. (కీర్తన 115:16) ఆదాము, హవ్వ దేవునికి విధేయులై యున్నయెడల భూమిమీదకాక మరోచోట ఎక్కడో నిత్యజీవము అనుభవిస్తారని పరిశుద్ధలేఖనములలో ఎచ్చట చూపబడలేదు. నిజానికి, ఆ మానవదంపతులు దేవునికి అవిధేయులు కాక మునుపు అనుభవించిన పరదైసులో, ఈ భూమిమీదనే “జీవవృక్షము” ఉన్నదికదా? (ఆదికాండము 2:9; 3:22) దానికి భిన్నమైన సమాచారము దేవునినుండి రాలేదు కనుక, ఏదెను తోట వెలుపలగల తన నమ్మకమైన సేవకులు, (దైవ భయముగల ఆదాముకుమారుడగు హేబెలు మొదలుకొని) వారికి తెలిసియున్న మానవగృహమగు భూమియే తాము పునరుత్థానమగు స్థలముగా తప్పక ఎంచియుందురు.
ఇప్పుడు ‘ఒక నిముషమాగండి’! అని బైబిలుతో పరిచయమున్న కొందరు అభ్యంతరము తెలిపి, ‘యోబు 16వ అధ్యాయము 22వ వచనములో “తిరిగిరాని మార్గమున నేను వెళ్లుదును” అని యోబు చెప్పలేదా? యోబు 7:9నందు అతడు సూచించినదేమంటే: “పాతాళమునకు [షియోల్] దిగిపోయినవాడు మరి ఎప్పుడును రాడు.” 10వ వచనములో యింకా యిలా అన్నాడు: “అతడు ఇక ఎన్నడును తనయింటికి రాడు అతని స్థలము అతని మరల ఎరుగదు.”’
కనుక, ఈ వచనములు మరియు అటువంటి వ్యాఖ్యలు మరణమనేది “తిరిగిరాని ప్రదేశము” వంటిదని యోబు భావించినట్లు చూపుటలేదా? అని కొందరు పండితులు అడుగుచున్నారు. భవిష్యత్తు పునరుత్థానమందు యోబుకు నమ్మకములేదని అట్టి వ్యాఖ్యల భావమా? సమాధానముకొరకు అవి పలుకబడిన సందర్భమును పరిగణనలోనికి తీసుకోవాలి, మరియు ఆ విషయముపై యోబు వ్యక్తపరచిన ఇతర ఆలోచనలతో వాటిని పోల్చిచూడాలి.
తన బాధలకుగల కారణములు, యోబునకు తెలియదు. తన శ్రమలకు దేవుడే కారణమని ఒక సమయమందు అతడు తప్పుగా తలంచాడు. (యోబు 6:4; 7:17-20; 16:11-13) కృంగిపోయినవాడై వెంటనే ఉపశమనము పొందగల ప్రదేశము పాతాళమేనని అతడు భావించాడు. (యోబు 7:21; 17:1 పోల్చుము 3:11-13) అచ్చట, తన సమకాలికుల దృష్టిలో అతడు కనిపించడు. తన యింటికి తిరిగిరాడు, మరి యితర గుర్తింపు ఉండదు. దేవుని యొక్క నిర్ణయకాలమునకు ముందు అలాచేస్తామనే ఎట్టి నిరీక్షణయు అతనికి ఉండదు. దేవుని ప్రమేయములేకుండానే, తమకైతాము విడువబడినవారై మృతులలో నుండి లేచుటకు యోబు మరియు యితర ఆదాము సంతతి అంతయు శక్తిలేనివారు.a—యోబు 7:9,10; 10:21; 14:12.
పునరుత్థానమందు నమ్మకము
యోబు తాను అనుభవిస్తున్న వాటిని గూర్చి అనిశ్చయతనుబట్టియు, సమీపభవిష్యత్తును గూర్చి ఆయన పల్కిన అఘోర వ్యాఖ్యలనుబట్టియు అతడు పునరుత్థానమును నమ్మలేదని మనము అర్థము చేసుకొనకూడదు. ఆయన భవిష్యత్తు పునరుత్థానమును నమ్మియున్నాడనునది యోబు 14:13-15 నుండి స్పష్టమగుచున్నది. ఆ వాక్య భాగములో యోబు ‘షియోల్నందు దాచబడవలెనని’ అటుపిమ్మట ‘దేవునిచే జ్ఞాపకము చేసికొనబడవలెనని’ కోరెను. అంతేకాక, విశ్వాసము, యథార్థత కలిగిన ఈ మనుష్యుడు యోబు 19:25-27 నందు ఒక విమోచకుని కలిగియున్నాడని అటుపిమ్మట “దేవుని చూచెదనని” పల్కెను. అవును, యోబు పునరుత్థానమందు విశ్వాసముంచెను. మృతులను లేపుటకు దేవుని సామర్థ్యమునుగూర్చి అంతకు ముందుగా అబ్రాహాము నిశ్చయములను కలిగియున్నట్టే దేవుడు తనను తిరిగి జీవమునకు తేగలడని తెస్తాడని అతడు నమ్మెను.—హెబ్రీయులు 11:10, 16, 19, 35.
మన ఆధునిక కాలములవరకు కూడా, యూదులు భవిష్యత్తులో భూమిమీద జీవముకొరకు పునరుత్థానము చేయబడుదుమని విశ్వసించిరి. ఎన్సైక్లొపీడియా జూడైక (1971) ఇట్లనుచున్నది: “తుదకు మృతులు తమశరీరములందు పునరుద్ధరించబడి భూమిపై మరలా జీవింతురని చెప్పుట యూదా మతముయొక్క ప్రధాన సిద్ధాంతము.” ఆ ఎన్సైక్లొపీడియా ఇంకా యిలా అనుచున్నది: “ఈ తలంపు ఎంత తీవ్రముగా అక్షరార్థముగా తీసుకొనబడినదనగా, ఇశ్రాయేలునందు పాతిపెట్టబడే విషయములోను, పాతిపెట్టు బట్టలవిషయంలోను, అన్ని అవయవములను భూస్థాపితము చేయు విషయములోను మతధర్మాసక్తిగల యూదులు చాలా శ్రద్ధకలిగియుందురు.”
చోద్యమైన విషయమేమంటే, చనిపోయి మట్టిలో కలిసిపోయిన మానవ శరీరములను దేవుడు పునరుత్థానమందు పునర్నిర్మించునని బైబిలు తెలుపుటలేదు. చాలాకాలము క్రితము చనిపోయినవారి అసలు అణువులు భూమియందంతట వ్యాపించి తరచు కూరగాయలలోను జంతువులలోను—అవును, అటుపిమ్మట చనిపోవు ఇతర మానవులలోనికి కూడా క్రమక్రమముగా కలిసిపోయియుండవచ్చును. పునరుత్థానమందు లేచువారికి అదే అణువులు ఒక్కరికంటే ఎక్కువమందికి ఉపయోగించబడవని స్పష్టమగుచున్నది. బదులుగా దేవుడు తనకు ప్రీతికరమగు రీతిలో మానవులను తగిన శరీరములతో ఏ శరీరభాగములలో కూడా లోపంలేకుండా మరణమునకు ముందు అనుభవించిన ఏ యితర వ్యాధిలేకుండా జీవమునకు తెచ్చును.—1 కొరింథీయులు 15:35-38 పోల్చుము.
పునరుత్థానులైన వీరిని తిరిగి జీవింపజేయబడిన తమ బంధువులు, స్నేహితులు గుర్తించగలరా? అది న్యాయసమ్మతం, ఎందుకంటె లేచినవారిని మనము, వారు మనలను గుర్తించలేకపోయినయెడల చనిపోయిన మన ప్రియులు నిజంగా తిరిగి లేచారని మనకెలా తెలుస్తుంది? లాజరు శరీరము కృషించిపోయినను, యేసు ఆయనను పునరుత్థానుని చేసిన పిదప అతని బంధువులు, పరిచయస్థులచేత అతడు గుర్తించబడెను. ఆవిధంగా భూమిపై జీవానికి పునరుత్థానులనుచేసిన మనలను కూడ యెహోవాదేవుడు ప్రేమపూర్వకముగా ఒకరినొకరు చూడగల్గునట్లు ఎరుగునట్లు చేయగలడని ఆశించగలము.
కొద్దిమందికి పరలోక నిరీక్షణ
మనము గుర్తించినట్లు భూమి మానవులకు దేవుడనుగ్రహించిన గృహము. అయితే మానవులలోనుండి ఎంపిక చేయబడిన కొందరు వాడబారని, అమర్త్యమైన ఆత్మీయ జీవమునకు తనతోపాటు పరలోకమందు ఉంటారనే ఉత్తరాపేక్షను యేసుక్రీస్తు తెల్పెను. (2 తిమోతి 1:10) పరలోక జీవముకొరకైన “నూతనమైనదియు జీవముగలదైన మార్గమును” యేసు ప్రతిష్టించిన తరువాత ఆ నిరీక్షణయందు పాలుపొందుటకు క్రైస్తవులు అందరు ఆహ్వానింపబడిరి. (హెబ్రీయులు 9:24; 10:19, 20) ఆ బహుమానమును ఎంతమంది పొందుతారు? ‘యేసు తనదాసులకు కనుపరచుటకు దేవుడాయనకు అనుగ్రహించిన ప్రేరేపిత ప్రకటనలో’ “భూలోకమునుండి కొనబడిన” వీరిసంఖ్య 1,44,000 మంది అని నిర్ణయించబడినది.—ప్రకటన 1:1; 7:4-8; 14:1,3.
పరలోకజీవము కొరకు “భూలోకమునుండి కొనబడిన వారు” ఎందుకంత కొద్దిమందే ఉన్నారు? ఆ పరిమిత సంఖ్యయొక్క కారణమును అదేపుస్తకమైన ప్రకటన గ్రంథము తెల్పుచున్నది. 20వ అధ్యాయము 5, 6 వచనములలో మనము యిలా చదువుచున్నాము: “ఇదియే మొదటి పునరుత్థానము. ఈ మొదటి పునరుత్థానములో పాల్గొనువారు ధన్యులును పరిశుద్ధులునైయుందురు. ఇట్టివారిమీద రెండవమరణమునకు అధికారములేదు. వీరు దేవునికిని క్రీస్తునకును యాజకులై క్రీస్తుతో కూడా వెయ్యిసంవత్సరములు రాజ్యముచేయుదురు.”—ప్రకటన 5:9, 10కూడ చూడుము.
రాజుయొక్క భూసంబంధమైన ప్రజలు
మానవులందరు రాజులుగా మరియు యాజకులుగా పాలించలేరనునది చాలా స్పష్టము, అందరూ రాజులైతే వారు ఎవరిమీద “పాలన” చేస్తారు? అయితే యేసుయొక్క నమ్మకమైన అపొస్తలులతో నిర్మింపబడిన ఈ ప్రత్యేక ఎంపికచేయబడిన గుంపు ప్రకటన 7వ అధ్యాయం 9నుండి 17 వచనములందు వర్ణించబడిన “గొప్పసమూహము”తో కూడిన ప్రజలతో నిండియున్న భూమిపై పాలనచేయుదురు. భూమిపైనున్న అవినీతి నంతటిని తుడిచివేయు “సర్వోన్నతుడైన దేవుని మహాయుద్ధదినము” కొరకు వీరిలో లక్షలమంది యిప్పుడు ఎదురుచూస్తున్నారు. దేవుని దయాసంకల్పమునుబట్టి వారు ఎన్నటికి మరణించక మహాశ్రమలను తప్పించుకొందురు.—ప్రకటన 16:14; 21:14; సామెతలు 2:21, 22.
‘చనిపోయిన మా ప్రియుల విషయమేమి?’ అని మీరు అడుగవచ్చును. యేసు తానే మార్తతో ఇతరులు, ‘వారు చనిపోయినను బ్రతుకును’, అని చెప్పెను. (యోహాను 11:25) అది భూసంబంధమైన పునరుత్థానము. పరలోకమందు క్రీస్తు అతని 1,44,000మంది రాజులును యాజకులైనవారితో పాలనచేయు కాలమందు యోగ్యులైనవారిని దేవుడు జ్ఞాపకము చేసికొనునప్పుడు చనిపోయిన లక్షలాదిమంది లేపబడి యెహోవా యొక్క సత్యారాధనను నేర్చుకొను సంపూర్ణ అవకాశమును కల్గియుందురు. వారు నమ్మకస్థులైనయెడల, భూవ్యాప్త పరదైసులో నిత్యజీవమును బహుమానముగా పొందగలరు. తనసహోదరుడైన లాజరు తిరిగి జీవమునకు లేచునని మార్త అంగీకరించి తెల్పిన “అంత్యదినము” అప్పుడే.—యోహాను 5:28, 29; 11:24; లూకా 23:43.
అభయములపై ఆధారపడిన నిరీక్షణ
బైబిలునందు పేర్కొనబడిన పునరుత్థానములు, పరిశుద్ధ లేఖనములు సూచించు పునరుత్థాన నిరీక్షణయొక్క సత్యత్వఅభయము మరియు మాదిరులైయున్నవి. క్రైస్తవ కాలములకు ముందున్న ప్రవక్తలైన ఏలియా, ఎలీషాలచేత మరియు దేవుని కుమారునిచే (లాజరు పునరుత్థానముతో సహా) అపొస్తలుడైన పేతురు, పౌలు, మరిముఖ్యంగా యెహోవా దేవుడు తనకుమారుని పునరుత్థానముచేయుట వంటి భూమిపై జరిగిన పునరుత్థానములనుగూర్చి ఆ నివేదిక తెల్పుచున్నది. అట్టి వృత్తాంతములను మీ బైబిలునందు: 1 రాజులు 17:17-24; 2 రాజులు 4:32-37; మత్తయి 28:1-10; లూకా 7:11-17; 8:40-56; యోహాను 11:38-44; అ.కార్యములు 9:36-42; 10:38-42; 20:7-12లో చదువగలరు.b
అట్టి శక్తివంతమైన సాక్ష్యాధారమైన పునరుత్థాన నిరీక్షణ ఆధారముగా ఏథెన్సువారికి పౌలు యిలా అభయమివ్వగల్గెను: “దేవుడు తాను నియమించిన మనుష్యునిచేత నీతిననుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయెడి యొక దినమును నిర్ణయించియున్నాడు. మృతులలోనుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికిని ఆధారము కలుగజేసియున్నాడు.”—అ.కార్యములు 17:30, 31.
అవును, పునరుత్థాన నిరీక్షణను బలపర్చు కడపటి అభయము యేసు పునరుత్థానమే. కనుక మనము కూడ యెహోవాదేవుని ప్రేమ మరియు శక్తియందు సంపూర్ణముగా నమ్ముటకు స్థిరమైన ఆధారమును కల్గియున్నాము. మార్త కల్గియున్న నమ్మకాన్నే మనమును వ్యక్తపర్చగలము: ‘మృతులు అంత్యదినమున పునరుత్థానమందు లేచెదరని మాకు తెలియును!’
“మృతుల పునరుత్థానమును” గూర్చిన పౌలు సాక్ష్యమును మార్స్ పర్వతముమీద అతని ప్రేక్షకులు వినిన పిదప మూడు గుంపులుగా వారు విభాగింపబడ్డారు: “కొందరు అపహాస్యముచేసారు. మరికొందరు—దీనిగూర్చి నీవు చెప్పునది ఇంకొకసారి వింటాము అన్నారు—అయితే కొందరు మనుష్యులు అతని హత్తుకొని విశ్వసించిరి.”—అ.కార్యములు 17:32-34.
పునరుత్థాన నిరీక్షణకు మీ ప్రతిచర్య ఏమిటి? లక్షలాదిమందిని, కోట్లమందిని కూడ మృతులలోనుండి లేపుతానన్న తన వాగ్ధానమును యెహోవా నిలబెట్టుకొనును. వారిని నీవు మరలా చూడగలవా లేక వారు నిన్ను చూడగలరా అనేది ఎక్కువగా నీవు చేసే దానిమీద ఆధారపడి ఉంటుంది. నిత్యజీవమును పొందుటకు దేవుని చిత్తమును తెలిసికొని దానికనుగుణ్యముగా జీవించుటకు యిష్టపడెదవా? మృతులకొరకైన నిరీక్షణనుగూర్చి మరియు ఈ విధానముయొక్క అంతమును నీవు ఎలా తప్పించుకొనగలవో మరి వివరమైన సమాచారమునిచ్చుటకు యెహోవాసాక్షులు బహుగా సంతోషిస్తారు.—యోహాను 17:3. (w89 6/15)
[అధస్సూచీలు]
a అదేసరళిలో దేవుడు చొరవ తీసుకొనకముందు ఉండేపరిస్థితినిగూర్చి కీర్తనల రచయిత ఈ విధంగా వ్రాసాడు: “కాగావారు (ఇశ్రాయేలీయులు) కేవలం శరీరులైయున్నారనియు విసరి వెళ్లి మరలిరాని గాలివలె వారి ప్రాణము [దేవునినుండి కల్గిన జీవశక్తి] ఉన్నదని ఆయన (దేవుడు) జ్ఞాపకముచేసికొనెను.”—కీర్తన 78:39.
b బైబిలు కాలమందలి పునరుత్థానములను గూర్చి క్రీస్తుపాలనక్రింద జరుగబోవు పునరుత్థానములను గూర్చిన వివరమైన చర్చను యుకెన్ లివ్ ఫరెవర్ ఇన్ పారడైజ్ ఆన్ ఎర్త్ అనుపుస్తకమందు మీరు కనుగొనగలరు. అందు 20వ అధ్యాయము పేరు “పునరుత్థానము ఎవరికి మరియు ఎచ్చట? మీ ప్రాంతమందలి యెహోవాసాక్షులయొద్దగాని ఈ పత్రికలోని 2వ పేజీనందు యివ్వబడిన కార్యాలయములనుండి పొందవచ్చును.