యేసు జీవితము పరిచర్య
యాయీరు ఇంటిని విడిచి నజరేతును పునర్దర్శించుట
దెకపొలినుండి సముద్రయానము, రక్తస్రావముగల స్త్రీని స్వస్థపరచటము, యాయీరు కుమార్తెను పునరుత్థానము చేయటంతో యేసు ఆరోజు చాలా పనిలో మునిగియుండెను. కాని ఆ దినము అంతటితో ముగియలేదు. యేసు యాయీరు ఇంటిని విడచుచుండగా ఇద్దరు గ్రుడ్డివారు “దావీదు కుమారుడా, మమ్మును కరుణించుమని” కేకలు వేసిరి.
యేసును ‘దావీదు కుమారుడా’ అని సంబోధించటములో వారు యేసు దావీదు సింహాసనానికి వారసుడని రాబోవు మెస్సియా ఈయనేయని నమ్మిరి. అయితే యేసు బహుశ వారి సహనమును పరీక్షించుటకు సహాయము కొఱకు వారు వేయుకేకలను విననట్లేయుండెను. కాని వారు ఆగలేదు. యేసు నివాసమున్న స్థలమునకు వచ్చి ఆయన ఇంటిలో ప్రవేశించునపుడు ఆయన వెంట లోనికివచ్చిరి.
అంతట యేసు: “నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా?” అని అనెను.
“అవును ప్రభువా” అనివారు నమ్మకముతో సమాధానమిచ్చిరి.
పిమ్మట యేసు వారి కనులను ముట్టి “మీ నమ్మికచొప్పున మీకిది కలుగును గాక” అనెను. వెంటనే వారు చూడగలిగిరి. అప్పుడు యేసు—“ఇది ఎవరికిని తెలియకుండ చూచుకొనుడని” వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను. అయితే వారు సంతోషముతో నిండుకొనినవారై యేసు ఇచ్చిన ఆజ్ఞను మరిచి ఆ ప్రాంతమంతయు ఆయనను గూర్చి తెలియజేసిరి.
ఈ మనుష్యులు వెళ్లిన తరువాత, ప్రజలు దయ్యము పట్టిన యొక మనుష్యుని తెచ్చిరి. ఆ దయ్యము ఆ వ్యక్తిని మాటలాడనీయకుండా చేసియుంచెను. యేసు ఆ దయ్యమును వెళ్లగొట్టిన వెంటనే ఆ మనుష్యుడు మాటలాడసాగెను. ఆ జనసమూహము అద్భుతకార్యమును చూచి “ఇశ్రాయేలులో ఈలాగు ఎన్నడును కనబడలేదని చెప్పుకొనిరి.”
అక్కడ పరిసయ్యులును ఉండిరి. అద్భుత కార్యములను త్రోసిపుచ్చలేనివారై, దుష్టసంబంధమైన తమ అపనమ్మకముతో యేసుయొక్క శక్తివంతమైన పనులకు ఆరోపించిన మూలమును మరలా పునరావృతము చేయుచు: “ఇతడు దయ్యముల అధిపతివలన దయ్యములను వెళ్లగొట్టుచున్నాడని చెప్పిరి.”
ఈ సంఘటనలు జరిగిన కొద్దిసమయమునకే యేసు తన స్వస్థలమైన నజరేతునకు తిరిగివచ్చెను. ఈసారి తన శిష్యులు మాత్రమే ఆయన వెంటవచ్చిరి. షుమారు ఒక సంవత్సరము క్రిందట ఆయన అక్కడున్న సమాజమందిరమునకు వెళ్లి బోధించెను. మొదట ప్రజలు ఆయన మాటలకు ఆశ్చర్యపడిననూ, తరువాత ఆయన బోధకు వ్యతిరేకించి ఆయనను చంపప్రయత్నించిరి. ఇప్పుడు యేసు కనికరముతో మరొకసారి తన మునుపటి పొరుగువారికి సహాయముచేయుటకై వచ్చెను.
ఇతరస్థలములలో మూగినట్లుగా జనసమూహములు ఇక్కడ యేసు చుట్టు మూగుటలేదు. సబ్బాతు దినమున యేసు బోధించుటకు సమాజమందిరమునకు వెళ్లెను. ఆయన బోధవిన్న ప్రతివారును, “ఈ జ్ఞానమును, అద్భుతకార్యములు చేయుశక్తి ఈ మనుష్యనకెక్కడినుండి వచ్చినవి?” అని అడుగుచూ “ఇతను వడ్లవానికుమారుడు కాడా? ఇతని తల్లిపేరు మరియ కాదా! యాకోబు, యోసేపు, సుమియోను, యూదా ఈతని సహోదరులుకారా? ఈతని సోదరీమణులు మనతో లేరా? ఈతని కివన్నియు ఎక్కడనుండి వచ్చినవని ఆశ్చర్యపడిరి.”
‘యేసు మనలాంటి స్థానిక మనుష్యుడే’ అనివారు భావించిరి. ఇతని కుటుంబము మనకు తెలుసు. ఇతను మనమధ్యే ఎదిగెను. ఇతనెట్లు మెస్సీయాకాగలడు” అనివారు వాదించిరి. ఆయనకున్న జ్ఞానమును, అద్భుతక్రియలను వారు చూచినప్పటికిని ఆయనను వారు తిరస్కరించిరి. అతని బంధువులు సహితము తమకున్న కుటుంబ సాన్నిహిత్యమునుబట్టి అభ్యంతరపడినపుడు యేసు “ప్రవక్త తనదేశములోను, తన ఇంటను తప్ప మరి ఎక్కడను ఘనహీనుడు కాడని వారితో చెప్పెను.”
వారికి విశ్వాసములేనందున యేసు బహు ఆశ్చర్యపడెను. కావున, కొద్దిమంది రోగులమీద చేతులుంచి స్వస్థపరచటము మినహా మరి ఏ అద్భుతకార్యమును ఆయన చేయలేదు. మత్తయి 9:27-34; 13:54-58, మార్కు 6:1-6; యెషయా 9:7.
◆ “దావీదు కుమారుడ”ని సంబోధించుటద్వారా గ్రుడ్డివారు ఆయననేమని నమ్మిరి?
◆ యేసుచేసిన అద్భుతకార్యములకు పరిసయ్యులు ఎట్టివివరణ ఇచ్చిరి?
◆ యేసు నజరేతులోనున్నవారికి సహాయపడుట యనుక్రియ ఆయనకు వారియెడల కనికరము కనపరచునదిగా ఎట్లుండెను?
◆ యేసుకు ఎటువంటి స్వాగతము నజరేతులో లభించెను? మరియు ఎందువలన? (w87 7/1)
[9వ పేజీలో పూర్తిపేజీ చిత్రం ఉంది]