కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w90 4/1 పేజీలు 21-26
  • భార్యగా ప్రేమను గౌరవమును చూపించుట

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • భార్యగా ప్రేమను గౌరవమును చూపించుట
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • మిక్కిలి గౌరవము—ఒక సవాలు
  • కుటుంబమునకు ఆమె కావలికాయును
  • సాధువైనట్టియు మృదువైనట్టియునైన గుణము
  • శారీరక బాంధవ్యమందు గౌరవము
  • సహోదరీల ప్రాముఖ్యమైన పాత్ర
  • భర్తగా ప్రేమను మరియు గౌరవమును చూపుట
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
  • గాఢంగా ప్రేమింపబడే భార్య
    నీ కుటుంబ జీవితమును సంతోషభరితముగా చేసికొనుము
  • నిరంతరం నిలిచే వివాహానికి రెండు కీలకాలు
    కుటుంబ సంతోషానికిగల రహస్యము
  • మీ కుటుంబం సంతోషంగా ఉండవచ్చు
    బైబిల్లో మనం ఏమి నేర్చుకోవచ్చు?
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
w90 4/1 పేజీలు 21-26

భార్యగా ప్రేమను గౌరవమును చూపించుట

“భార్యయైతే తన భర్తయందు భయము కలిగియుండునట్లు చూచుకొనవలెను.”—ఎఫెసీయులు 5:33.

1. ఆధునిక వివాహస్థితి విషయమై ఏ ప్రశ్నలు ఉత్పన్నమగును?

స్వేచ్ఛా “స్వాతంత్ర్య”ముల ఈ ఆధునిక యుగమందు, సాంప్రదాయ వివాహపు దృష్టి తీవ్రముగా దెబ్బతిన్నది. తల్లిదండ్రులలో ఎవరో ఒకరు లేకనే లక్షలాది కుటుంబములు నడువవలసియున్నది. చట్టబద్దమైన వివాహ ప్రయోజనము లేకుండానే కలిసి జీవించుట అనేకమంది ఆచారమై పోయినది. అయితే ఇది భార్యకు మరియు తల్లికి మరింత భద్రతనిచ్చుటకు నడిపినదా? పిల్లలకు అది స్థిరతను దయచేసినదా? మరియు ఈ విధముగా విలువ పడిపోవుట కుటుంబ ఏర్పాటులో మరింత గౌరవమునకు నడిపించినదా? వీటికి భిన్నముగా దేవుని వాక్యము ఏమని సిఫారసు చేయుచున్నది?

2. ఆదాము ఒంటరిగా కొనసాగుట ఎందుకు మంచిదికాదు?

2 మొదటి స్త్రీని సృజించుటలోని తన ఉద్దేశ్యమును వ్యక్తము చేసినప్పుడు, ఆయన ఇట్లనెను: “నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు.” జంతు కుటుంబములను—తమ పిల్లలతో ఆడవి మగవి ఉండుటను—గాంచిన తరువాత, ఆ వ్యాఖ్యతో ఆదాము తలంపు ఏకీభవించి యుండవచ్చును. పరిపూర్ణునిగాను, సంతృప్తికర పరదైసులో ఉన్నను, తన జాతి సహవాసము అతనికి లేకుండెను. అతనికి జ్ఞానము, మాట ఇవ్వబడినది, అయితే ఆ ఈవులను పంచుకొనుటకు తన జాతిప్రాణి ఏదియు అక్కడ లేకుండెను. అయితే త్వరలోనే పరిస్థితి భిన్నమైయుండును, ఏలయనగా దేవుడిట్లు సెలవిచ్చెను: “వానికి సాటియైన సహాయమును వానికొరకు చేయుదును.”—ఆదికాండము 2:18-20.

3. (ఎ) హవ్వ ఎట్లు ఆదాము “జాతి”దాయెను? (బి) ఒకడు తన భార్యను “హత్తుకొనుట” అనగా దాని భావమేమై యున్నది?

3 ఆదాము యెముకలలో ఒక దానిని ఆధారము చేసుకొని యెహోవా స్త్రీయైన హవ్వను సృజించెను. కాబట్టి హవ్వ ఆదాము “జాతి” వంటిదాయెను. ఆమె క్షుద్ర జంతువులలోనిది కాదు, అయితే ఆమె “[అతని] యెముకలలోని ఒక యెముక, [అతని] మాంసములో మాంసమై” యుండెను. తదనుగుణ్యముగా ప్రేరేపిత వృత్తాంతము తెల్పునదేమనగా: “కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును; వారు ఏకశరీరమైయుందురు.” (ఆదికాండము 2:23, 24) “హత్తుకొనుట” అని తర్జుమా చేయబడిన హెబ్రీ పదమునకు అక్షరార్థముగా “అంటుకొనుట, అతుకుట, ప్రత్యేకముగా గట్టిగా, జిగురుతో అన్నట్లు” అని భావము.(జెసినియస్‌’ హిబ్రూ అండ్‌ కాల్ది లెక్సికన్‌ టు ది ఓల్డ్‌ టెస్ట్‌మెంట్‌ స్క్రిప్చర్స్‌) భార్యాభర్తలు వేరుకాని సహవాసులను తలంపును ఇది నిజముగా అందజేయుచున్నది. మరొక పండితుడు చెప్పునదేమనగా, “ఇది భార్యాభర్తల మధ్య లైంగిక ఐక్యతలకంటే ఎక్కువను సూచించుచు, బాంధవ్యమంతటికిని విస్తరించుచున్నది.” ఆవిధముగా, వివాహము సాగిపోవు భ్రాంతి కాదు. అది శాశ్వతమైన బంధము. మరియు ఎక్కడైతే పరస్పర గౌరవము, మర్యాద ఉండునో, కొన్నిసార్లు నొప్పి కల్గినను అక్కడ వారి ఏకత తెగిపోనిదై యుండవలెను.—మత్తయి 19:3-9.

4. ఏ భావమందు నరునికి భార్య సహాయకారిగాను, సహవాసిగాను ఉండెను?

4 స్త్రీ పురుషునికి సహాయకారిగాను, సహవాసిగాను ఉండునని దేవుడు సెలవిచ్చెను. వారిరువురు దేవుని స్వరూపమందు చేయబడినందున, తమ పరస్పర వ్యవహారములయందు తన లక్షణములను—న్యాయము, ప్రేమ, జ్ఞానము, శక్తి—కనబరచవలెనని ఆయన అపేక్షించును. కాబట్టి, హవ్వ “సాటియైన సహవాసిగా” యుండునే గాని, పోటీపడుదానిగా కాదు. కుటుంబము పోటీపడు ఇద్దరు కెప్టెన్లుగల ఓడవలె ఉండకూడదు, అయితే ఆదాము శిరస్సత్వమును వహించును.—1 కొరింథీయులు 11:3; ఎఫెసీయులు 5:22-24; 1 తిమోతి 2:12, 13.

5. అనేక మంది పురుషులు తమ భార్యలతో ఎట్లు వ్యవహరించిరి, దీనికి దేవుని అంగీకారముండునా?

5 అయితే, దేవుని ప్రేమగల శిరసత్వ ఏర్పాటుకు వ్యతిరేకముగా మొదటి మానవ జంట చేసిన తిరుగుబాటు మరియు పాపము తొందరపాటు చర్యయై వారి కుటుంబమునకు అలాగే బావి కుటుంబములన్నింటికి ఒక భిన్నమైన విధానమును రూపొందించినది. మానవజాతిమీద వారి పాప ప్రభావము దానియొక్క ఫలితములను ముందే తెలుసుకొన జ్ఞానము కలిగిన యెహోవా దేవుడు, హవ్వతో ఇట్లనెను: “నీ భర్తయెడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలును.” (ఆదికాండము 3:16) దురదృష్టకరమేమంటే, శతాబ్దములుగా పురుషులు స్త్రీలపై కౄరముగా అధికారము చేసిరి. ప్రపంచవ్యాప్తముగా స్త్రీలు, ఇంకను అనేక విధములుగా అవమాన పరచబడుచున్నారు, మరియు వంచింపబడుచున్నారు. అయినను, మనము క్రితము శీర్షికలో చూసిననట్లుగా, పురుషాహంకారమునకు బైబిలు సూత్రములు ఎంతమాత్రమును ఆధారమునిచ్చుట లేదు. బదులుగా, అది మిక్కిలి గౌరవముయొక్క విలువను నెక్కి తెల్పుచున్నది.

మిక్కిలి గౌరవము—ఒక సవాలు

6, 7. (ఎ) అవిశ్వాసులైన భర్తలను సత్యములోనికి ఎట్లు రాబట్టవచ్చును? (బి) తన అవిశ్వాసియైన భర్తయెడల “మిక్కిలి గౌరవమును” చూపించుటలో భార్య ఎట్లు విఫలమగు సాధ్యత కలదు?

6 ప్రవర్తనలో క్రీస్తు మాదిరి వివరములను, తన ‘అడుగు జాడలలో నడచుటకు’ యేసు ఉంచిన మాదిరిని అపొస్తలుడైన పేతురు వివరించెను. ఆ పిమ్మట పేతురు చెప్పినదేమనగా: “అటువలె స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడియుండుడి; అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే, వారు మిక్కిలి గౌరవముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి, వాక్యము లేకుండనే తమ భార్యల నడవడివలన రాబట్టబడవచ్చును.” (1 పేతురు 2:21–3:2, NW.) క్రైస్తవ భార్యలు ఎట్లు ఈ “మిక్కిలి గౌరవమును” కనబరచగలరు?

7 మన క్రైస్తవ సహోదరీలు అనేకమంది అవిశ్వాసులైన మరియు కొన్నిసార్లు వ్యతిరేకించు భర్తలను కలిగియున్నారు. పేతురు సలహా నిరర్థకము మరియు వట్టిది అని ఈ పరిస్థితుల భావమా? కాదు. “వాక్యమునకు అవిధేయులై” యున్నను, విధేయత మరియు గౌరవము అవసరము. కాబట్టి, వ్యతిరేకించు భర్తగల ఒక క్రైస్తవ సహోదరి రాజ్యమందిరమునకు వచ్చి, సంఘములోని యితర సహోదరీలనేక మందికి ఆయనను గూర్చి లేనిపోనివి చెప్పుచు, ఆయన తననెట్లు హింసించుచున్నాడో ఏకరవు పెట్టినట్లయిన, అది మిక్కిలి గౌరవము చూపుటకు చిహ్నమైయున్నదా? ఆమె అలా సంఘమందలి ఒక సహోదరుని లేక సహోదరి యెడల చేసినట్లయిన అది ఏమని పిలువబడును? అది వదరుబోతుతనము లేక కొండెములు చెప్పుటగా యుండును. కాబట్టి, భార్య తన భర్తను గూర్చి చెడ్డగా చెప్పుట మిక్కిలి గౌరవమునకు రుజువు కాదు. (1 తిమోతి 3:11; 5:13) అయినను, వ్యతిరేకించబడు సహోదరీలు కొందరు గంభీరమైన సమస్యను కలిగియున్నట్లుగా గుర్తించబడినది. క్రైస్తవ పరిష్కారమేమై యున్నది? వారు పెద్దలయొద్దకు వెళ్లి వారి సహాయమును, సలహాను పొందవచ్చును.—హెబ్రీయులు 13:17.

8. వ్యతిరేకించు భర్త ఆలోచనా సరళి ఏవిధముగా ఉండవచ్చును?

8 వ్యతిరేకించు భర్తతో పెద్దలు యుక్తిగా ఎట్లు వ్యవహరించగలరు? మొట్టమొదట, అతని దృష్టికోణమునుండి విషయమును చూచుటకు వారు ప్రయత్నింతురు. అతను దుర్భాషలాడినను లేక శారీరకముగా హింసించుటకు దిగినను అది మూడు-సంకెళ్ల గొలుసు కట్టుగా అనగా, భయమునకు నడుపు అజ్ఞానపు ప్రతిఘటన, ఆపిమ్మట హింసాయుత ప్రతిచర్య, ఫలితముగా కలుగవచ్చును. మరి ఇది ఎందుకు జరుగును? కొన్నిసార్లు దురభిమాన తోటిపని వారినుండి వినిన కారణముగా అతడు యెహోవాసాక్షులను గూర్చి కొద్దిగా లేక అసలు తెలియకయుండవచ్చును. బైబిలు చదువకపూర్వము తన భార్య పూర్తిగా తన మరియు పిల్లల సేవలోనే మునిగియుండెనని అతనికి తెలుసు. అయితే ప్రస్తుతము ఆమె మరిశ్రేష్టమైన భార్యగా, తల్లిగాయున్నను, ‘ఆమె వారమునకు మూడుసార్లు తనను విడిచి కూటములకు వెళ్లుచున్నది. ఆ కూటములలో ఏమి జరుగుచున్నదో నాకు తెలియదు, ఆ మందిరమువద్ద అందముగా కన్పించు మగవారు కలరు, అలాగే. . . ’, ఇలా అతని దృక్పధములు ఉండవచ్చును. అవును, అతని అజ్ఞానము ఈర్ష్యకు భయమునకు నడిపించవచ్చును. ఆ వెంటనే స్వయం-రక్షక ప్రతిఘటన రావచ్చును. ఈ దృక్పధములు కనుగొనబడినప్పుడు, పెద్దలు ఎలా సహాయము చేయవచ్చును?—సామెతలు 14:30; 27:4.

9. అవిశ్వాసులైన కొందరి భర్తల విషయములో ఏ యుక్తిని ఉపయోగించవచ్చును, ఇది ఎలాంటి ప్రభావమును కలిగియుండును?

9 పెద్దలలో ఒకరు ఆ భర్తకు వ్యక్తిగతముగా తెలిసియుండవచ్చును. (1 కొరింథీయులు 9:19-23) ఆ భర్త ఎలక్ట్రిషియన్‌గా, వడ్రంగిగా, పెయింటర్‌గా మంచి నిపుణుడై యుండవచ్చును. తన నైపుణ్యమునుపయోగించి రాజ్యమందిరములోని ఒకానెక సమస్యను తొలగించుటకు సహాయము చేయుటకు అతడు ఇష్టపడవచ్చును. ఆవిధముగా, కూటమునకు హాజరుకావలెనను బాధ్యతలేకుండానే అతను రాజ్యమందిరములో అడుగిడి దానిని లోపలచూచుటకు వీలగును. సహోదరులతో అతనికి కలుగు పరిచయము వలన, తన భార్యయెడల సత్యముయెడల తనకుగల అభిప్రాయము మృదువుగా మారవచ్చును. అక్కడ ఆయనచూచు ప్రేమ, సంఘముయొక్క సహకార ఆత్మనుబట్టి తానే తనభార్యను కూటములకు తీసుకురావడం ఆరభించవచ్చును. అలా ఒకదాని వెంబడి మరొక సంగతి మెరుగుపడి, కొంతసేపు విందామను ఆలోచనతో కూటముల సమయమున మందిరములోనికి అతను రావచ్చును. ఎంతోకాలము కాకమునుపే అతను బైబిలు పఠనము కొరకు అడుగవచ్చును. ఇదంతయు సాధించవచ్చును, మరియు ఇది కొన్నిసార్లు సాధించబడినది కూడా. ఈనాడు వేలాది మంది విశ్వాసులైన భర్తలున్నారు, అది సాధించిన ప్రేమకు, యుక్తికి, భార్య “మిక్కిలి గౌరవమునకు” ధన్యవాదములు.—ఎఫెసీయులు 5:33.

కుటుంబమునకు ఆమె కావలికాయును

10, 11. రాజైన లెమూయేలు సమర్థురాలైన భార్యయొక్క ఏ వివిధ ఆకృతులను వర్ణించెను? (విడివిడిగా విచారించుము.)

10 ఆదర్శవంతమైన భార్యనుగూర్చి రాజైన లెమూయేలు తన తల్లియొద్దనుండి చక్కని సలహాను పొందెను. (సామెతలు 31:1) కష్టించి పనిచేయు తల్లి మరియు భార్యనుగూర్చి సామెతలు 31:10-31లో ఆమె చేసిన వర్ణన జాగ్రత్తగా చదువ విలువగలదైయున్నది. సాక్ష్యాధారముగా ఆమెకు దేవుని నీతిసూత్రములను అన్వయించుటలో, వాటియెడల మిక్కిలి గౌరవమును చూపుటలో అనుభవము ఉండెను.

11 “గుణవతియైన భార్య” నమ్మదగినదని, ఆధారపడదగినదని, యథార్థమైనదని లెమూయేలు వ్రాయుచున్నాడు. (10-12 వచనములు) భర్తకు పిల్లలకు ఆహారమునియ్యవలెనని ఆమె కష్టించి పనిచేయును. (13-19, 21, 24 వచనములు) నిజముగా అవసరత గలవారియెడల ఆమె దయగలదిగాను, సహాయపడునదిగాను ఉండును. (20వ వచనము) తన గౌరవము, ప్రవర్తనల ద్వారా ఆమె తన భర్తకు పేరుప్రతిష్టలు తెచ్చును. (23వ వచనము) ఆమె ఉబుసుపోక మాట్లాడునది కాదు లేక నాశనకర విమర్శకురాలు కాదు. దానికి భిన్నముగా ఆమె తన నోటిమాట ద్వారా క్షమాభివృద్ధిని, స్వస్థతను కలుగజేయును. (26వ వచనము) ఆమె సోమరి కాదు గనుక, ఆమె ఇల్లు పరిశుభ్రముగా, క్రమముగా ఉండును. (27వ వచనము) (వాస్తవానికి, ఇరుగుపొరుగు అంతటిలో క్రైస్తవ గృహము పరిశుభ్రముగా ఉండవలెను.) ఆమె భర్త పిల్లలు ఆమెయెడల కృతజ్ఞత కలిగియుండి ఆమెను కొనియాడుదురు. బయటివారు సహితము ఆమె లక్షణములను ప్రశంసింతురు. (28, 29, 31 వచనములు) ఆమె అందము చర్మమంత మందమైనదే కాక, అది దైవ వ్యక్తిత్వముగల దైవభక్తిగల స్త్రీ అందమైయుండును.—30వ వచనము.

సాధువైనట్టియు మృదువైనట్టియునైన గుణము

12. ఏది “దేవుని దృష్టిలో మిగుల విలువగలదై యున్నది,” మరియు ఈ అంశమును స్పానిషు సామెత ఎట్లు నెక్కిచెప్పుచున్నది?

12 క్రైస్తవ స్త్రీ తన బాహ్యరూపమునకు మోతాదుకుమించి శ్రద్ధనివ్వరాదని పేతురు సలహానిచ్చినప్పుడు ఈ చివరి అంశమునే ఆయన ప్రతిధ్వనించెను. ఆయనిట్లు వేడుచున్నాడు: “సాధువైనట్టియు, మృదువైనట్టియునైన గుణమను అక్షయాలంకారముగల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను; అది దేవుని దృష్టికి మిగుల విలువగలది.” (1 పేతురు 3:3, 4) ‘సాధువైనట్టియు, మృదువైనట్టియునైన గుణము దేవుని దృష్టికి మిగుల విలువకరమను’ అంశమును గమనించుము. ఆవిధముగా, అటువంటి గుణముగల భార్య మరియు తల్లి తన భర్తను ప్రీతిపరచుటయేగాక, మరింత ప్రాముఖ్యముగా, ప్రాచీనకాల విశ్వాస స్త్రీలవలెనే ఆమె దేవుని ప్రీతిపరచునదై యుండును. ఈ అంతరంగ అలంకారము, “అందమైన స్త్రీ కన్నులను ప్రీతిపరచును; సద్గుణములుగల స్త్రీ హృదయమును ప్రీతిపరచును. మొదటిది రాళ్లుపొదిగిన నగ అయితే, రెండవది ధనరాశియైయున్నది” అని చెప్పిన స్పానిషు సామెతను కూడా ప్రతిబింబించునదై యున్నది.

13. భార్య తన పిల్లలమీద ఎట్లు సేదదీర్చు ప్రభావము కలిగియుండగలదు?

13 క్రైస్తవ భార్య తన కుటుంబమందతటికి సేదదీర్చునదిగా యుండగలదు. (మత్తయి 11:28-30 పోల్చుము.) భార్య భర్తను గౌరవించుట చూసిన పిల్లలు తామును తల్లిదండ్రులను బయటివారిని గౌరవించుదురు. తత్ఫలితముగా, క్రైస్తవ పిల్లలు దయగలవారిగాను, శ్రద్ధగలవారిగాను ఉందురు. పిల్లలు బలవంతముగా కాక స్వచ్ఛందముగా పనులను చేయుట ఎంత విశ్రాంతిదాయకము! వారి నిస్వార్థత కుటుంబ ధన్యతకు చేయూతనిచ్చును, మరియు తల్లి అంగీకార చిరునవ్వు సరియైన ప్రతిఫలమై యుండును.

14. క్రమశిక్షణనిచ్చు అవసరత ఏ సవాలుకు నడిపించవచ్చును?

14 మరి క్రమశిక్షణను ఇవ్వవలసిన సమయముల విషయమేమి? తల్లిదండ్రులవలెనే పిల్లలును తప్పిదములు చేయుదురు. కొన్నిసార్లు వారు లోబడకుందురు. తండ్రి ఆ సమయమునకు లేనట్లయిన క్రైస్తవ భార్య ఎట్లు స్పందించవలెను? తన పిల్లల ఘనతను ఆమె గౌరవించునా? లేక వారి విధేయతను పొందు ప్రయత్నమందు ఆమె పెద్దగా అరిచి ఘీపెట్టునా? పెద్దగా అరిచినంత మాత్రమున పిల్లవాడు విధేయతను నేర్చుకొనునా? లేక నెమ్మదిగా వానితో తర్కించు స్వరము ఎక్కువ ప్రభావమును కలిగియుండునా?—ఎఫెసీయులు 4:31, 32.

15. పిల్లల విధేయత విషయమై పరిశీలకులు ఏమి కనుగొనిరి?

15 పిల్లల విధేయతమీద వ్యాఖ్యానించుచు, సైకాలజీ టుడే అను పత్రిక ఇట్లనినది: “ఇటీవల పరిశీలనల ప్రకారము, ఏదైనా చేయుమని నీవు పిల్లలకు ఎంత బిగ్గరగా చెప్పుదువో, అప్పుడు చాలామట్టుకు వారు అటునిటు తిరిగి ఖచ్ఛితముగా నీవు చేయవద్దని చెప్పిన పనినే చేయుదురు.” మరొక ప్రక్కన, పెద్దలు మృదువుగా మాట్లాడినప్పుడు, పిల్లలు ఎలాంటి తటపటాయింపు లేకుండా విధేయత చూపుటవైపు మొగ్గు చూపిరని పరిశీలకులు కనుగొనియున్నారు. అనంతమైన పిడివాద ఆజ్ఞలతో పిల్లవానిని చికాకుపరచుటకు బదులు వానితో తర్కించుట చాలా ప్రాముఖ్యము సుమండి.—ఎఫెసీయులు 6:4; 1 పేతురు 4:8.

శారీరక బాంధవ్యమందు గౌరవము

16. భర్త భావోద్రేక అవసరతల కొరకు భార్య ఎట్లు శ్రద్ధ చూపించగలదు, తత్ఫలితముగా ఏలాంటి ప్రయోజనము వచ్చును?

16 భార్య మరింత సున్నితమైన శరీరముగలదని భర్త ఏలాగు ఆమెయెడల శ్రద్ధను చూపునో, అట్లే భార్యకూడా భర్త భావోద్రేక, లైంగిక అవసరతలను గుర్తించవలెను. భార్యాభర్తలు పరస్పరము సంతోషించవలెనని, సంతృప్తిపరచుకొనవలెనని బైబిలు సూచించుచున్నది. దానికి పరస్పర అవసరతలను, భావప్రేరణలను పసిగట్టుట అవసరము. ఈ పరస్పర సంతృప్తి జతలో ఎవరును తిరిగే శరీరమునకు నడుపగల తిరిగే కన్నులను కలిగియుండకుండా నిశ్చయముగా చేయును.—సామెతలు 5:15-20.

17. వివాహపు విధిని నెరవేర్చుటను భార్యాభర్తలు ఎట్లు దృష్టించవలెను?

17 పరస్పర గౌరవము ఎక్కడయుండునో, అక్కడ జతలోని ఎవరును లైంగిక అవసరతను మానసిక ఆయుధమువలె నిశ్చయముగా ఉపయోగించరు. ప్రతివారును తమ వివాహ ధర్మమును నెరవేర్చవలెను, తాత్కాలికముగా సౌఖ్యమునకు దూరముగా యుండవలసియున్నను, అదియు పరస్పర అంగీకారముతోనే జరుగవలెను. (1 కొరింథీయులు 7:1-5) ఉదాహరణకు, కొన్నిసార్లు వాచ్‌టవర్‌ సొసైటి బ్రాంచి కార్యాలయ నిర్మాణకార్యము లేక మరొక దైవపరిపాలనా కార్యము నిమిత్తము తాత్కాలికముగా దూరముగా యుండవచ్చును. అటువంటి సమయములో తనకు తన భార్య హృదయపూర్వక అంగీకారమున్నదని భర్త రూఢి పరచుకొనవలెను. ఆవిధమైన ఎడబాటు, తిరిగివచ్చి భర్త తెల్పు అనుభవముల రూపమున కుటుంబమునకు ఆత్మీయ ఆశీర్వాదములను కూడా తెచ్చును.

సహోదరీల ప్రాముఖ్యమైన పాత్ర

18. పెద్దయొక్క భార్యకు ఎందుకు ఎక్కువ బాధ్యత కలదు?

18 ఎక్కడ క్రైస్తవ భార్యయొక్క భర్త పెద్దగా యుండునో, అప్పుడు ఆమెకు మరి గొప్ప బాధ్యతయుండును. మొదట ఆయనమీద చాలా వత్తిడియుండును. సంఘ ఆత్మీయ విషయమై ఆయన యెహోవాకు జవాబుదారుడై యుండును. (హెబ్రీయులు 13:17) పెద్దకు భార్యగా, మరియు బహుశ తానుగా వృద్ధస్త్రీగా ఆమె గౌరవపూర్వకమైన మాదిరి అవశ్యకము. (పోల్చుము 1 తిమోతి 5:9, 10; తీతుకు 2:3-5.) చాలా మంది పెద్దల భార్యలు తమ భర్తలకు మద్దతుగా ఎంత చక్కని మాదిరినుంచిరి! తరచుగా, భర్త సంఘవ్యవహారములకు హాజరు కాగలందులకు బయటకు వెళ్లవలసియుండును, కాగా ఆ విషయములయెడల ఆమెకు ఆసక్తి పెరుగవచ్చును. అయినను, యథార్థముగా, దైవభక్తిగల భార్య ఇతరుల విషయములలో జోక్యము కలిగించుకొను వారివలే ఆమె సంఘ వ్యవహారములలో తలదూర్చదు.—1 పేతురు 4:15.

19. పెద్ద ‘ఇంటిని బాగుగా ఏలుటలో’ ఏమి కూడా చేరియుండును?

19 ఏదిఏమైనను, తన భార్య క్షమాభివృద్ధికరముకాని దృక్పధమును ప్రదర్శించనట్లయిన లేక యితర సహోదరీలకు మంచి మాదిరియుంచనట్లయిన ఆ పెద్ద ఆమెకు గద్దింపునివ్వవలసి యుండును. తన ‘గృహమును సరిగా పాలించుటయందు’ కేవలము పిల్లలేకాదు తన భార్యయు చేరియున్నది. లేఖన కట్టడను అన్వయించుట కొంతమంది భార్యల వినయమును పరీక్షించవచ్చును.—1 తిమోతి 3:4, 5, 11; హెబ్రీయులు 12:11.

20. ప్రాచీన మరియు ఆధునిక కాలములలో వివాహితులు, అవివాహితులైన మాదిరికర సహోదరీల ఉదాహరణలను కొన్నింటిని తెల్పుము. (వాచ్‌టవర్‌ పబ్లికేషన్స్‌ ఇండెక్స్‌ 1930-1985 నందు “లైఫ్‌ స్టొరీస్‌ ఆఫ్‌ జెహోవాస్‌ విట్‌నెసెస్‌” చూడుము.)

20 అవివాహిత సహోదరీలు కూడా సంఘములో భార్యల గౌరవప్రదమైన పాత్రను ప్రతిబింబించవచ్చును. అటు లేఖనములలో, ఇటు ఈనాటి సంఘములలో శ్రేష్టమైన విశ్వాస సహోదరీల ఉదాహరణలు ఎన్నోకలవు! తన “సత్క్రియలను” బట్టి బహుశ ఒంటరిదానిగాయున్న సహోదరియగు దొర్కా ఎంతగానో కొనియాడబడినది. (అ.కార్యములు 9:36-42) ప్రిస్కిల్ల, ఫీబే వీరుకూడా సత్యము విషయమై ఆసక్తిని కలిగియుండిరి. (రోమీయులు 16:1-4) అదే విధముగా ఈనాడు మన సహోదరీలగు అనేకమంది వివాహిత అవివాహిత స్త్రీలు మిన్నయైన మిషనరీలుగా, పయనీర్లుగా, మరియు పబ్లిషర్లుగా ఉన్నారు. అదే సమయములో, భక్తిపరులైన వీరు తమ గృహములను పరిశుభ్రముగా, క్రమముగా ఉంచుతు, తమ కుటుంబములను ఎన్నటికిని నిర్లక్ష్యముచేయని వారిగాయున్నారు. వారు ఎక్కువ సంఖ్యలో ఉన్నందునను, పరిస్థితుల మూలముగను ప్రకటించు పనిలో ఎక్కువ భాగమును వీరే చేయుచున్నారు.—కీర్తన 68:11.

21. విశ్వాసులైన సహోదరీలు తమ క్రైస్తవ సహోదరులకు ఎట్లు ఒక ప్రోత్సాహకరమై యున్నారు?

21 సంఘమందలి విశ్వాస సహోదరీలు అవశ్యకమైన క్షమాభివృద్ధికరమైన పాత్రను పోషింతురు. వారి ఆసక్తి, మాదిరి సహోదరులకును, సంఘ సర్వసభ్యులకును ప్రోత్సాహకరమై యుండును. వారు నిజముగా సాటియైనపనివారును, సహాయకులునై యున్నారు. (ఆదికాండము 2:18 పోల్చుము.) వారు నిష్కల్మషమైన ప్రేమ మరియు గౌరవములకు ఎంతగా అర్హులైయున్నారు! మరియు క్రైస్తవ వివాహిత దంపతులకు పౌలు సలహా నిజముగా సరియైయున్నది: “మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తననువలె తన భార్యను ప్రేమింపవలెను, భార్యయైతే తన భర్తయందు భయము కలిగియుండునట్లు చూచుకొనవలెను.”—ఎఫెసీయులు 5:33 (w89 5⁄15)

మీరు జ్ఞప్తికి తెచ్చుకొందురా?

◻ పరిపూర్ణ స్త్రీపురుషులకు దేవుడు మొదట ఏర్పరచిన పాత్రలు ఏమైయున్నవి?

◻ అవిశ్వాసులైన భర్తలను సత్యములోనికి ఎట్లు రాబట్టవచ్చును?

◻ సమర్థురాలైన భార్యయొక్క ప్రాముఖ్యమైన లక్షణములు ఏమైయున్నవి?

◻ క్రైస్తవ భార్య నెమ్మదిని సాత్వికతను ఎట్లు కనబరచవచ్చును?

◻ భార్యభర్తల శరీరక బాంధవ్యముల మధ్య ఎలాంటి సమతూకము అవసరము?

[22వ పేజీలోని చిత్రాలు]

కుటుంబము పోటీపడు ఇద్దరు కెప్టెన్లు గల ఓడవలె ఉండకూడదు

[24వ పేజీలోని చిత్రాలు]

తన భార్య కూటములకు లేక ఇతర క్రైస్తవ కార్యకలాపములకు హాజరగుట విషయమై, అవిశ్వాసియైన భర్త ఓర్వలేనివానిగా, కొన్నిసార్లు కాస్త భయపడువానిగా తయారుకావచ్చును. అతనికి ఎట్లు సహాయము చేయవచ్చును?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి