దాచబడిన నిధులను వెదకునట్లు వెదకుచునుండుము
దేవుని వాక్యమైన బైబిలునందు కనుగొనబడు రత్నములవంటి జ్ఞానము ఎంతటి అమూల్యమైనదైయున్నది! ఈ మణులు దైవసంకల్పమును బయలుపరచి ఉల్లసవంతమైన ఉత్తరాపేక్షలను మనముందుంచుచున్నవి. అవి మనకు ఓదార్పునందించి, దేవుని ఎలా ప్రీతిపరచవలెనో చూపుచున్నవి. (రోమీయులు 15:4) యితరులతో మనము వ్యవహరించుటలో జ్ఞానయుక్తముగా నడుచుకొనుటకు కూడా ఈ రత్నములు మనకు సహాయపడుచున్నవి. నిజమే, దేవునినుండి వచ్చు జ్ఞానము సంతృప్తి మరియు సంతోషముతో “జీవ మార్గమందు” నడుచుటకు మనకు తోడ్పడును.—కీర్తన 16:11; 119:105.
జ్ఞానముయొక్క ప్రయోజనములు అనేకములు గనుక, మనము దానిని ఉన్నతమైన బహుమానముగా ఎంచాలి. వ్యక్తిగా జ్ఞానము యిట్లనుచున్నది, “నా నోటిమాటలన్నియు నీతిగలవి, వాటిలో మూర్ఖతయైనను కుటిలతయైనను లేదు. అవన్నియు వివేకికి తేటగాను తెలివినొందినవారికి యథార్థముగాను ఉన్నవి. వెండికి ఆశపడక నా ఉపదేశము అంగీకరించుడి. మేలిమి బంగారునాశింపక తెలివినొందుడి. జ్ఞానము ముత్యములకన్న శ్రేష్టమైనది. విలువగలసొత్తులేవియు దానితోసాటికావు”.—సామెతలు 8:8-11.
ఎందుకు వెదకుచూ ఉండవలెను?
సాధారణముగా, పాతిపెట్టబడిన వజ్రములు, బంగారము లేక వెండి కొరకు చేసే అన్వేషణ నిష్పలమగుచుండును. దైవజ్ఞానము విషయములో అది వాస్తవముకాదు. అయితే ఈ అన్వేషణలో మనము ఎలా విజయము సాధించగలము? అవును, విజయమనేది ఆ నిధిని మనము ఎంతగా అపేక్షించుచున్నాము, దానిని కనుగొనడానికి ఎంత కష్టపడి పనిచేస్తున్నాము అను దానిపై ఆధారపడియుంటుంది. దాని నిజమైన విలువను మనము గుర్తించినయెడల విలువగల యితర వాటన్నిటికన్న మిన్నగా దానిని కాపాడుకుంటాము. అసలు, “అపరంజిని సంపాదించుటకంటే జ్ఞానమును సంపాదించుట ఎంతో శ్రేష్టము. వెండిని సంపాదించుటకంటే తెలివిని సంపాదించుట ఎంతోమేలు.”—సామెతలు 16:16.
సామెతలు 2:1-6 యిలా ప్రేరేపించుచున్నవి: “నా కుమారుడా, నీవు నా మాటల నంగీకరించి నా ఆజ్ఞలను నీయొద్ద దాచుకొనినయెడల జ్ఞానమునకు నీ చెవి యొగ్గి హృదయపూర్వకముగా వివేచననభ్యసించినయెడల తెలివికై మొర్రపెట్టినయెడల వివేచనకై మనవి చేసినయెడల వెండిని వెదకినట్లు దాని వెదకినయెడల దాచబడిన ధనమును వెదకినట్లు దాని వెదకినయెడల యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు. దేవునిగూర్చిన విజ్ఞానము నీకు లభించును. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు తెలివియు వివేచనయు ఆయన నోటనుండి వచ్చును.”
పాతిపెట్టబడిన నిధులు మరుగైయుండును గనుక, వాటిని వెదకవలసిన అవసరమున్నది. త్రవ్వుచుండగా కొందరు తమ వినోదసమయాన్ని, భోజనమును మరియు నిద్రను త్యాగముచేస్తారు. అయితే నిధి కనుగొనబడినప్పుడు అట్టి ప్రయత్నము విలువైనదిగా యుండును. దేవుని జ్ఞానమును వెదకుటకు అట్టి త్యాగములను మనము చేయవలసియున్నాము. పాతిపెట్టబడిన నిధులకొరకుచేయు అన్వేషణలో శ్రమతోకూడిన త్రవ్వకము ఉన్నట్లుగా జ్ఞానమును అన్వేషించుటలో పట్టుదల అవసరము. బైబిలును, క్రైస్తవసాహిత్యములను పైపైనే చూస్తే సరిపోదు. ఆత్మీయ రత్నములను కనుగొనాలంటే సమయము, పరిశోధన, ధ్యానము అవసరము. అయితే లేఖనముల పరిజ్ఞానమును మనము సంపాదించిననాడు ఎంత సంతోషము కలుగుతుంది!—నెహెమ్యా 8:13.
విజయవంతమైన నిధి-అన్వేషణ
అవును, దేవునివాక్యమును త్రవ్వి జ్ఞానమువంటి రత్నములను కనుగొన్నప్పుడు సంతోషము కలుగును. (సామెతలు 3:13-18) అందుకు, ఒక మంచి వ్యక్తిగత లేక కుటుంబ గ్రంథాలయమును సమకూర్చుకొంటే మనము జ్ఞానులమే. దానిలో ఏవి ఉండాలి? ఒక మంచి నిఘంటువు మాత్రమే కాక లేఖనములయొక్క వివిధతర్జుమాలను, క్రైస్తవ బైబిలు ప్రచురణలను, అందులో ప్రతిసంవత్సరము దివాచ్‌టవర్ ప్రతులను మరియు దానితోటి పత్రికయైన అవేక్! ప్రతులను కలిగియుండుట ప్రయోజనకరమని యెహోవాసాక్షులు కనుగొన్నారు. అయితే నిధి-అన్వేషకులుగా అది మనకు సహాయపడవలెనంటే గ్రంథాలయమును సరిగా ఉపయోగించుకోవాలి.
జ్ఞానము కొరకు మనము చేయు అన్వేషణలో వాచ్‌టవర్ పబ్లికేషన్స్ ఇండెక్స్ లోని అంశములను లేఖన భాగములను లేదా వాచ్‌టవర్ సొసైటియొక్క పుస్తకముల లేదా పత్రికల బౌండు వాల్యూమ్ల చివరగల విషయసూచికలను మనము పరిశీలించవచ్చును. ఇవన్నియు దైవిక జ్ఞానమును వెదకుటకు తోడ్పడు ప్రాథమిక ఉపకరణములు. వాస్తవానికి, “దాచబడిన ధనము” వంటి దైవిక జ్ఞానమునకు నడుపు పటమువలె అవి మనకున్నవి. (సామెతలు 2:4) పరిశోధనకు అవసరమగు సాహిత్యములు కొన్ని మనకు లేనియెడల, మీ ప్రాంతమందలి యెహోవాసాక్షుల రాజ్యమందిరములో అవి లభించవచ్చును.
విజయవంతమైన నిధి-అన్వేషణను ఇప్పుడు దృష్టాంతపరచుదాము. మనము బైబిలు పఠనము చేయునప్పుడు యేసుక్రీస్తును అప్పగించిన తరువాత యూదా ఇస్కరియోతు ఎలా చనిపోయాడోనని మనము ఆశ్చర్యపడుచుండవచ్చును. యూదా “పోయి ఉరిపెట్టుకొనెను” అని మత్తయి 27:5 తెల్పుచున్నది. కానీ అపొస్తలులకార్యములు 1:18 చెప్పేదేమంటే: “అతడు తలక్రిందుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నియు బయటికి వచ్చెను.” కనుక యూదా ఎలా చనిపోయాడు? ఈ లేఖన భాగములకు ఇన్సైట్ ఆన్ది స్క్రిప్చ్‌ర్స్ అను సాహిత్యములో “స్క్రిప్చ్‌ర్ ఇండెక్స్”ను చూచినయెడల సమాధానము కనుగొనబడును. అది మనకిట్లు తెల్పుచున్నది: “ఆత్మహత్యచేసుకొనిన విధానమును మత్తయి వర్ణించుచున్నట్లు కన్పించుచున్నది. అపొస్తలులకార్యములు దాని ఫలితాన్ని వర్ణించుచున్నది. ఈ రెండువర్ణనలను జతపరచితే, యూదా ఒక కొండచరియపై ఉరివేసుకొనడాన్కి ప్రయత్నించినట్లు తేటపడుచున్నది, అయితే త్రాడుగాని చెట్టుకొమ్మగాని విరిగి పోవడం మూలంగా అతడు క్రిందనున్న రాళ్లపైపడినప్పుడు పేగులన్నియు బయటకు వచ్చియుండవచ్చును. యెరూషలేము చుట్టునున్న ప్రాంతపు వర్ణనను చూస్తే అట్టి సంఘటన ఊహించశక్యమగును.”—వాల్యూమ్ 2, పేజి 130.
కంకార్డెన్స్ను ఉపయోగించుట మూలంగా బైబిలు లేఖనములను కనుగొనుటకు మనకు దోహదముచేయును. అయితే, ఒక లేఖనమును చర్చించుచున్నప్పుడు దానిసందర్భమును మనము గుర్తించాలి. దీనిని దృష్టాంతపరచుటకు కీర్తన 144:12-14ను పరిశీలించుదము. కొందరు ప్రజలు ఈ విధముగా చెప్పుచున్నట్లు ఈ వచనములు చూపుచున్నవి: ‘మా కుమారులు తమ యౌవనకాలమందు ఎదిగిన మొక్కలవలె ఉన్నారు. మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూలకంబములవలె ఉన్నారు. మాకొట్లు నింపబడి పలువిధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి. మా గొర్రెలు వేలకొలదిగాను పదివేలకొలదిగాను మాగడ్డి బీళ్లలో పిల్లలు వేయుచున్నవి. మా పశువులకు గర్భస్రావము లేదు.’ ఈ మాటలు దేవుని ప్రజలకు అన్వయించునని మనము తలంచవచ్చును, కానీ సందర్భము చూస్తే కాదని తెలియుచున్నది. 11వ వచనములో, కీర్తనల రచయితయగు దావీదు అసత్యము పల్కువారినుండి విడిపించుమని వేడుకొనుచున్నాడు. వారు తమ కుమారులు, కుమార్తెలు, గొర్రెలమంద మరియు పశువులనుగూర్చి గర్వించుచున్నారు. 15వ వచనము ప్రకారము, అట్టి చెడుక్రియలు చేసేవారు ఇలా చెప్పుకొనిరి: “ఇట్టిస్థితి గలవారు ధన్యులు!” అయితే దానికి భిన్నముగా, దావీదు ఇలా అనుచున్నాడు: “యెహోవా తమకు దేవుడుగాగల జనులు ధన్యులు!”
ఆత్మీయ రత్నాలు విస్తారము!
జ్ఞానముకొరకైన విజయవంతమగు అన్వేషణవలన నిశ్చయముగా సంతోషము లభించును. పరిశోధన మూలంగా బైబిలు ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానములతో పాటు ఆత్మీయరత్నాలు కనుగొనబడును. మనము వెదకుచూ ఉన్నట్లయితే ఎట్టి సమాధానములను కనుగొందుము! ఉదాహరణకు, కయీను తన భార్యను ఎక్కడనుండి తెచ్చుకున్నాడు? ది వాచ్‌టవర్ (అక్టోబరు 1, 1981) యిలా చెప్పుచున్నది: “ఆదాము హవ్వకు కేవలము ఇద్దరు [కయీను, హేబెలు] మాత్రమే కాక చాలా మంది పిల్లలున్నారని బైబిలు మనకు తెల్పుచున్నది. ‘షేతును [మరొక కుమారుడు] కనిన తరువాత ఆదాము బ్రదికిన దినములు ఎనమన్నూరు ఏండ్లు; అతడు కుమారులను, కుమార్తెలను కనెను.’ (ఆదికాండము 5:4) ఆ సమాచారమును బట్టి కయీను తన భార్యను ఎక్కడనుండి తెచ్చుకున్నాడని మీరుచెప్పుదురు? అవును, అతడు తన సహోదరీలలో ఒకామెను పెండ్లి చేసుకొనియుండవచ్చును. నేడు అలా దగ్గర సంబంధముగల తలిదండ్రులకు పుట్టిన పిల్లలకు అది ప్రమాదకరము కావచ్చును. అయితే మానవచరిత్ర ప్రారంభములో మానవజాతి పరిపూర్ణతకు సమీపముగా యున్నందున అది సమస్యకాదు.”
ఒకవేళ మనము బైబిలు పుస్తకమగు సామెతలు చదువుచుండవచ్చును. సామెతలు 1:7నందు తెలుపబడిన దానిని గుర్తించి, ‘“యెహోవాయందు భయము” అనగా ఏమిటి?’ అని ఆశ్చర్యపడవచ్చును. పరిశోధన 1987, మే 15, ది వాచ్టవర్నకు మనలను నడుపవచ్చును. అది యిలా చెప్పుచున్నది: “ఆయన ప్రేమ, దయ, మరియు మంచితనమును అభినందించుచున్నాము గనుక ఆయనను అసంతృప్తి పరచకుండవలెనను సంపూర్ణ భీతితో మరియు భక్తితోకూడిన మిక్కిలి పూజ్యభావమును చూపుటయైయున్నది. ‘యెహోవాయందలి భయము’ అనగా ఆయన ప్రధాన న్యాయాధిపతియని, సర్వోన్నతుడని తనకు అవిధేయులైన వారిని శిక్షించుటకు లేదా సంహరించుటకు హక్కు మరియు శక్తి గలవాడని గుర్తించుటయైయున్నది. దేవుని నమ్మకముగా సేవించవలెనని, ఆయనయందు సంపూర్ణ నమ్మకముకలిగి ఆయన దృష్టికి చెడ్డదైన దానిని అసహ్యించుకొనుటయనికూడా దాని భావము.”
వెదకుచూ ఉండుము!
మూల్యములేని ఆత్మీయరత్నాలను కనుగొను జ్ఞానము కొరకు అత్యంత శ్రద్ధగా వెదకువారికి సహాయపడునిమిత్తము ది వాచ్‌టవర్ ప్రచురింపబడుచున్నది. జ్ఞానము మరియు దేవుని వాక్యముయొక్క అవగాహన మన అందరికి అవసరము. సామెతలు 4:7, 8 ఇట్లనుచున్నది: “జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదనంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము. దాని గొప్ప చేసిన యెడల అదినిన్ను హెచ్చించును. దాని కౌగలించినయెడల అది నీకు ఘనతను తెచ్చును.”
లేఖనముల బావ అవగాహన పొందుటవలన మరియు ఆ జ్ఞానమును సరైన విధంగా ఉపయోగించుటవలన మాత్రమే మనము నిజమైన సంతోషమును పొందగలము. అవును, దైవ జ్ఞానమును సాధన చేయుట మూలంగా మాత్రమే మనము యెహోవాను ప్రీతిపరచగలము. అందుచేత దాచబడిన నిధులను వెదకినట్లు జ్ఞానముకొరకు వెదకుటలో ఏదియు నిన్ను ఆటంకపరచనీయకుము. (w89 3⁄15)
[4, 5వ పేజీలోని చిత్రాలు]
పాతిపెట్టబడిన నిధులను వెదకుటకు కష్టపడి త్రవ్వాలి. దైవజ్ఞానము కొరకు మనముచేయు అన్వేషణ విషయములో ప్రయాసపడవద్దా?