జనాంగములన్నింటికి త్వరలోనే న్యాయము
“నీవు జీవించి నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమును స్వాధీనపరచుకొనునట్లు కేవలము న్యాయమునే అనుసరించి నడచుకొనవలెను.”—ద్వితీయోపదేశకాండము 16:20.
1. మనుష్యునియెడల దేవుని ఆదిసంకల్పమేమై యుండెను, మరియు అతడు కేవలము ఎట్లు మాత్రమే దానిని నెరవేర్చగలడు?
పరిపూర్ణ ప్రాణులతో భూమిని నింపవలెనను సంకల్పముతో యెహోవా దేవుడు స్త్రీ పురుషులను సృజించెను. వారందరు భూమిని లోబరచుకొనుటలో తమ పాత్రను నిర్వహిస్తూ ఆయనను స్తుతించుదురు. (ఆదికాండము 1:26-28) మానవుడు దేవుని స్వరూపమందు ఆయన పోలికచొప్పున కలుగజేయబడినందున, అతనికి జ్ఞానము, న్యాయము, ప్రేమ మరియు శక్తియను లక్షణములు యివ్వబడెను. కేవలము ఈ లక్షణములను సమతూకముగా అభ్యసించుటద్వారా మాత్రమే అతడు ఎప్పుడైనను తన కొరకైన తన నిర్మాణకుని సంకల్పమును నెరవేర్చగలడు.
2. ఇశ్రాయేలీయులకు న్యాయముననుసరించి నడుచుకొనుట ఎంత ప్రాముఖ్యమైయుండెను?
2 పోయిన సంచికనందు గమనించినట్లుగా, మానవుడు దేవుని క్రియా విధానమునకు వ్యతిరేకముగా తిరుగుబాటుచేసి, తత్ఫలితముగా మరణశిక్షను పొందెను. యిప్పుడు అసంపూర్ణత కారణముగా మానవజాతికొరకైన దేవుని ఆది సంకల్పమును నెరవేర్చుట అతనికి అసాధ్యమైయుండెను. ఈ విఫలతయందు పరిపూర్ణ న్యాయమును ప్రదర్శించుటలో నరుని అశక్తత ఒక ప్రాముఖ్యమైన వాస్తవమైయున్నది. అందుకే, “నీవు . . . కేవలము న్యాయమునే అనుసరించి నడచుకొనవలెను!” అని మోషే ఇశ్రాయేలీయులకు గుర్తుచేయుటయందు ఆశ్చర్యమేమియు లేదు. వారి జీవితములు మరియు వాగ్ధాన దేశమును స్వతంత్రించుకొనుట వారు న్యాయమును అనుసరించి నడచుకొనుటమీద ఆధారపడియుండెను.—ద్వితీయోపదేశకాండము 16:20.
రానైయున్న మంచి సంగతుల ఛాయ
3. ఇశ్రాయేలీయులతో యెహోవా వ్యవహారములను పరీక్షించుట మనకీనాడు ఎందుకు ప్రాముఖ్యము?
3 తాను ఎంపిక చేసుకొనిన సేవకుడైన యేసుక్రీస్తుద్వారా, యెహోవా నిజముగా జనాంగములన్నింటికి తన న్యాయమును స్పష్టము చేయునను మన నమ్మకమును, ఇశ్రాయేలు జనాంగముతో ఆయన వ్యవహారములు బలపరచును. అపొస్తలుడైన పౌలు విషయములను యిలా వివరించుచున్నాడు: “ఏలయనగా ఓర్పువలనను, లేఖనములవలని ఆదరణవలనను మనకు నిరీక్షణకలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నియు మనకు బోధకలుగు నిమిత్తము వ్రాయబడియున్నవి.” (రోమీయులు 15:4) దేవుడు “నీతిని, న్యాయమును ప్రేమించువాడై” నందున, తమ పరస్పర వ్యవహారములన్నింటియందు ఇశ్రాయేలీయులు తనను అనుకరించవలెనని ఆయన కోరెను. (కీర్తన 33:5) ఇశ్రాయేలీయులకు యివ్వబడిన 600 నియమములలో కొన్నింటిని పరీక్షించుటద్వారా దీనిని స్పష్టముగా చూడవచ్చును.
4. మోషే ధర్మశాస్త్రము క్రింద పౌర-హక్కుల సమస్యలు ఎట్లు తీర్చబడేవి?
4 మోషే ధర్మశాస్త్రమును పాటించినప్పుడు పౌర-హక్కుల సమస్యలు ఉనికిలో లేకుండెను. వారి దేశమందు జీవించవచ్చిన అన్యుని విషయములో లేవీయకాండము 19:34 యిట్లనుచున్నది: “మీ మధ్య నివసించు పరదేశిని మీలో పుట్టినవానివలె ఎంచవలెను, నిన్నువలె వానిని ప్రేమింపవలెను.” ఎంత ప్రేమపూర్వకమైన మరియు న్యాయమైన ఏర్పాటు! యింకా, న్యాయాధిపతులు, సాక్షులు యిట్లు ఉపదేశింపబడిరి: “దుష్కార్యము జరిగించుటకే సమూహమును వెంబడించవద్దు, న్యాయమును త్రిప్పివేయుటకు సమూహముతోచేరి వ్యాజ్యెములో సాక్ష్యము పలుకకూడదు. వ్యాజ్యెమాడువాడు బీదవాడైనను వానియెడల పక్షపాతముగా నుండకూడదు.” (నిర్గమకాండము 23:2, 3) దానిగూర్చి కొంచెము ఆలోచించుము—ధనికులకు బీదలకు ఒకే విధముగా న్యాయము చేయబడెను!
5. మోషే ధర్మశాస్త్రము క్రిందగల నేరస్థుల శిక్షాసృతిని ఈనాటి నియమావళి పొల్చుము.
5 మోషే ధర్మశాస్త్రము క్రిందగల నేరస్తుల శిక్షాసృతి, ఈనాటి జనాంగముల శాసన గ్రంథములలోని నియమములకంటే ఎంతో ఉన్నతమైనదిగా యుండెను. ఉదాహరణకు, శాసనమునకు లోబడి కష్టించి పనిచేయు వారిమీద భారము పెంచుటకు, దొంగను చెరసాలలో వేయుట జరిగేదికాదు. అతడు పనిచేసి తాను దొంగిలించినదానికి రెండింతలు లేక అంతకంటె ఎక్కువ చెల్లించవలసియుండెను. ఆ విధముగా పోగొట్టుకొనిన వ్యక్తికి నష్టము ఉండేదికాదు. అయితే దొంగ పనిచేయుటకు నిరాకరించాడనుకోండి, అప్పుడు పరిహారమూల్యము చెల్లింపబడు పర్యంతము అతడు బానిసగా అమ్మబడేవాడు. ఇంకను అతడు తన మొండి వైఖరిని విడనాడకుంటే, అతనికి మరణశిక్షవేయబడేది. ఈ విధముగా నష్టపోయిన వ్యక్తికి న్యాయము చేయబడేది, యిలా యిది యితరులు దొంగతనమువైపు మొగ్గుచూపకుండా వారిని బలముగా అడ్డుకొనెడిది. (నిర్గమకాండము 22:1, 3, 4, 7; ద్వితీయోపదేశకాండము 17:12) అంతేకాకుండా, ప్రాణము దేవుని దృష్టియందు పవిత్రమైయున్నందున, ప్రతి హంతకునికి మరణశిక్ష వేయబడెడిది. యిది, జనాంగమునుండి ఒక దుష్టుని మరియు నరహంతకుని తొలగించివేయును. విషయమిలా ఉన్నను, ఉద్దేశ్యరహితముగా మనిషి చావుకు కారణమైన వారియెడల కనికరము చూపించబడెడిది.—సంఖ్యాకాండము 35:9-15, 22-29, 33.
6. ఇశ్రాయేలీయుల నియమములను పరీక్షించుట తుదకు మనమే నిర్ణయమునకు వచ్చుటకు నడిపించును?
6 కాబట్టి, ఇశ్రాయేలీయులతో దేవుని న్యాయ వ్యవహారములన్నింటియందు న్యాయము గుర్తింపబడియున్నదను విషయమును ఎవరు నిరాకరించగలరు? అందుకే యెషయా 42:1 లోని దేవుని వాగ్ధానము యేసుక్రీస్తుద్వారా ప్రభావములోనికి తెచ్చు విధమును మనమాలోచించినప్పుడు, అది మనలో ఎంతటి ఓదార్పును, ఎంతటి నిరీక్షణను నింపుచున్నది! అక్కడ మనకిలా అభయమివ్వబడినది: “అతడు అన్యజనులకు న్యాయము కనుపరచును.”
న్యాయము కరుణతో సమతూకము చేయబడెను
7. ఇశ్రాయేలీయులతో యెహోవా కరుణపూరిత వ్యవహారములను వివరించుము.
7 దేవుని న్యాయము కరుణతో సమతూకము చేయబడియున్నది. దేవుని నీతి మార్గములకు వ్యతిరేకముగా ఇశ్రాయేలీయులు తిరుగుబాటుచేయ నారంభించినప్పుడు ఇది స్పష్టముగా ప్రదర్శింపబడెను. 40 సంవత్సరములు వారు అరణ్యమందుండిన కాలములో యెహోవా కరుణతో వారియెడల ఎట్లు శ్రద్ధచూపెనో మోషే వర్ణించుటను వినుము: “అరణ్య ప్రదేశములోను, భీకరధ్వనిగల పాడైనయెడారిలోను వానికనుగొని ఆదరించి పరామర్శించి తన కనుపాపనువలె వాని కాపాడెను. పక్షిరాజు తనగూడురేపి తన పిల్లలపైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కలమీద వాటిని మోయునట్లు యెహోవా వాని నడిపించెను. యెహోవా మాత్రము వాని నడిపించెను.” (ద్వితీయోపదేశకాండము 32:10-12) ఆ పిమ్మట జనాంగము మతభ్రష్టతకు తిరిగినప్పుడుకూడ, యెహోవా వారినిట్లు అడిగెను: “మీ దుర్మార్గతను మీ దుష్క్రియలను మాని దయచేసి తిరుగుడి.”—జెకర్యా 1:4a NW.
8, 9. (ఎ) ఎంతమేరకు దేవుడు యూదులయెడల కరుణపూరిత న్యాయమును చూపించెను? (బి) చివరకు వారికే విపత్తు సంభవించెను, అయితే వారితో దేవుని వ్యవహార విధానమునుగూర్చి ఏమి చెప్పవచ్చును?
8 యెహోవా కరుణతో చెప్పిన మాటలను వారు పెడచెవినబెట్టిరి. ప్రవక్తయైన జెకర్యాద్వారా దేవుడిట్లు చెప్పెను: “వారు వినకపోయిరి, నామాట ఆలకించకపోయిరి.” (జెకర్యా 1:4b) కాగా కరుణతో కూడిన దేవుని న్యాయము వారు తన తట్టు తిరుగుటకు వారికి సహాయపడుటకు ఆయన తన అద్వితీయ కుమారుని పంపించునట్లు చేసినది. స్నానికుడైన యోహాను, “ఇదిగో లోకపాపమును మోసికొనిపోవు దేవుని గెర్రెపిల్ల!” అని దేవుని కుమారుని పరిచయము చేసెను. (యోహాను 1:29) కొన్ని సంవత్సరములపాటు, యేసు అసంఖ్యాకముగా అద్భుతములు చేయుచు, అలా ముందుగనే చెప్పబడిన విమోచకుడు తానేయని నిరూపించుచు అలసిపోకుండా యూదులకు దేవుని సరియైన మార్గములను బోధించుచువచ్చెను. (లూకా 24:27; యోహాను 5:36) అయితే ప్రజలు ఆయనను వినలేదు లేక ఆయనయందు నమ్మికయుంచలేదు. అందునుబట్టి యేసు వారినిగూర్చి యిట్లనెను: “యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును నీయొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కలక్రిందికేలాగు చేర్చుకొనునో ఆలాగే నేను నీ పిల్లలను ఎన్నోమారులు చేర్చుకొనవలెనని యుంటినిగాని, మీరు ఒల్లకపోతిరి. ఇదిగో! మీయిల్లు మీకు విడువబడియున్నది.”—మత్తయి 23:37, 38.
9 అయినను, దేవుడు మరొక 37 సంవత్సరములవరకు, అనగా సా.శ. 70 వరకు తన కఠినమైన తీర్పును నిలువరింపజేసెను. ఆ పిమ్మట రోమన్లు యెరూషలేమును నాశనముచేసి వేలాదిమంది యూదులను చెరబట్టికొనిపోవుటకు ఆయన అనుమతించెను. అనేక శతాబ్దముల కాలమందు యెహోవా చూపిన దీర్ఘశాంతమును మరియు ఓరిమిని మనము విచారించినప్పుడు, మనలో ఎవరు ఇశ్రాయేలీయులతోగల దేవుని వ్యవహారములన్నింటియందు ఆయన న్యాయము గుర్తింపబడియుండుటను చూడ తప్పిపోవుదురు?
అన్యజనులందరికి న్యాయము
10. దేవుని న్యాయము అన్ని జనాంగముల వారికి ఎట్లు విస్తరించెను?
10 ఇశ్రాయేలీయులు యేసును తృణీకరించిన పిదప, యాకోబు యిట్లనెను: “అన్యజనులలోనుండి దేవుడు తన నామముకొరకు ఒక జనమును ఏర్పరచుకొనుటకు మొదటిసారిగా వారిని కటాక్షించెను.” (అపొ.కార్యములు 15:14 NW) యేసును మెస్సీయాగా అంగీకరించిన కొద్దిమంది యూదులతోపాటు ఈ “జనము,” ఒకగుంపుగా “దేవుని [ఆత్మీయ] ఇశ్రాయేలుగా” రూపింపబడి, యేసుక్రీస్తు ఆత్మాభిషక్తులైన 144,000 మంది అనుచరులుగా తయారగుదురు. (గలతీయులు 6:16; ప్రకటన 7:1-8; 14:1-5) కొర్నేలీ అన్యులలోనుండి వచ్చిన సున్నతిపొందని మొదటి విశ్వాసియైయుండెను. కొర్నేలీ అతని కుటుంబము దేవుని రక్షణమార్గమును అంగీకరించినప్పుడు, పేతురు యిట్లనెను: “దేవుడు పక్షపాతికాడని నిజముగా గ్రహించియున్నాను. ప్రతిజనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొనువానిని ఆయన అంగీకరించును.” (అపొ.కార్యములు 10:34, 35) యెహోవా న్యాయ నిష్పక్షపాత వైఖరిని పౌలు యింకను విస్తరించి చెప్పుచు యిట్లనుచున్నాడు: “ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు; యేసుక్రీస్తునందు మీరందరు ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రాహాముయొక్క సంతానమైయుండి వాగ్దాన ప్రకారము వారసులైయున్నారు.”—గలతీయులు 3:28, 29.
11. అబ్రాహాముకు ఏ వాగ్ధానము చేయబడెను, మరియు అది ఎట్లు నెరవేర్చబడును?
11 యిక్కడ యెహోవా అబ్రాహాముకు యిచ్చిన అద్భుతమైన వాగ్ధానము మనకు గుర్తుచేయబడియున్నది. తన ప్రియకుమారుడైన ఇస్సాకును బలియిచ్చుటకు వెనుదీయని ఆ మూలపురుషుని యిష్టతమీద ఆధారపడి, దేవుడు ఆయనతో యిట్లనెను: “నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఇయ్య వెనుతీయక ఈ కార్యముచేసినందున, నేను నిన్ను ఆశీర్వదింతును. . . . భూలోకములోని జనములన్నియు నీ సంతానమువలన ఆశీర్వదించబడును.” (ఆదికాండము 22:16-18) ఈ వాగ్ధానము ఎట్లు నెరవేరును? యేసుక్రీస్తు మరియు మరణమువరకు తమ విశ్వాస్యతను నిలుపుకొనిన ఆయన అభిషక్తులగు 144,000 అనుచరులతో తయారయిన “అబ్రాహాము సంతానము,” పరలోకమునుండి వెయ్యి సంవత్సరములు మానవ జాతిమీద పరిపాలన చేయుదురు. (ప్రకటన 2:10, 26; 20:6) ఆ దీవెనకర కాలమునుగూర్చి యెహోవా మనకు యిలా అభయమిచ్చుచున్నాడు: “మితిలేకుండా దానికి (ఆ రాజ్యపాలనకు) వృద్ధియు క్షేమమును కలుగును.” ఎందుకు? ఎందుకనగా మెస్సీయా రాజ్యముయొక్క, “ఆ రాజ్యపాలన” ‘న్యాయము వలనను నీతివలనను యుగయుగములు స్థిరపరచబడినదై యుండును.’—యెషయా 9:7.
12. అబ్రాహాము నిబంధనా ఆశీర్వాదములను యిప్పటికే ఎంత విస్తారముగా అనుభవించుట జరుగుచున్నది?
12 అయితే అబ్రాహాము నిబంధనా దీవెనలను అనుభవించుటకుగాను యేసుక్రీస్తు వెయ్యేండ్ల పరిపాలనా కాలము ఆరంభమగు పర్యంతము వేచియుండనవసరము లేదు. ఆ ఆశీర్వాదములను “ప్రతి జనములోనుండియు ప్రతివంశములోనుండియు ప్రజలలోనుండియు, ఆయా భాషలు మాటలాడువారిలో” నుండి వచ్చిన “గొప్ప సమూహమునకు” చెందినవారు యిప్పటికే అనుభవించుచున్నారు. సూచనార్థకముగా వారు ‘గెర్రెపిల్లయైన యేసుక్రీస్తు రక్తమునందు తమ వస్త్రములను తెలుపుజేసుకొని’ యెహోవాయెదుట నీతిమంతముగా నిలువబడియున్నారు. అబ్రాహాము వలెనే, వారు యెహోవాకు స్నేహితులైరి! న్యాయము నిజముగా అన్ని జనాంగములనుండి వచ్చు లక్షలాదిమంది కొరకైన యెహోవా రక్షణమార్గమందు గుర్తింపబడియున్నది.—ప్రకటన 7:9, 14.
దేవుని న్యాయమార్గములకు మీరు ప్రత్యుత్తరమిచ్చుచున్నారా?
13, 14. (ఎ) మనమందరము వ్యక్తిగతముగా ఏ హృదయపరిశీలన చేసుకొనవలెను? (బి) యెహోవా యెడల మన కృతజ్ఞతను మనమెట్లు వ్యక్తపరచగలము?
13 మీ విమోచనకొరకు తన అద్వితీయ కుమారుని యిచ్చుటలో దేవుని ప్రేమ మరియు న్యాయమార్గముద్వారా మీ హృదయము స్పర్శింపబడి, మిక్కిలిగా కదిలింపబడినదా? ఎంతగానో ప్రేమించిన తన కుమారుని బలియిమ్మని యెహోవా అబ్రాహామును అడిగినప్పుడు, ఆయనెట్లు భావించియుండెనో ఊహించుము! అయితే దేవుని భావనలు మరియెక్కువ లోతుగా వెళ్లును. తన ప్రియకుమారుడు కోపతాపములకు గురియగుట, బాటసారుల దూషణను, హింసామ్రానుపై విపరీతమైన నొప్పిని అనుభవించుటయెడల ఆయన ఎంతగా బాధపడియుండునో ఆలోచించుము. “నాదేవా, నాదేవా, నన్నెందుకు చెయ్యివిడిచితివి?” అని యేసు బిగ్గరగా కేక వేసినప్పుడు యెహోవా ప్రతిస్పందన ఎట్లుండెనో ఊహించుము. (మత్తయి 27:39, 46) అయినను, న్యాయము దేవుని నీతి మహిమార్థమై తన యథార్థతను నిరూపించుకొనుటకు, తన కుమారుడు ఆ విధముగా మరణించుటకు యెహోవా దేవుడు అనుమతించునట్లు చేసెను. అంతేకాకుండా, మరణించుటకు తనకుమారుని అనుమతించుటద్వారా యెహోవా మనకొరకు ఒక రక్షణ మార్గమును తెరచెను.
14 కాబట్టి నిశ్చయముగా, యెహోవా యేసుక్రీస్తుల యెడలగల కృతజ్ఞత మనము: “మాదేవునికి, గెర్రెపిల్లకు మారక్షణకై స్తోత్రము” అని బహిరంగముగా అంగీకరించుటకు మనలను కదిలించవలెను. (ప్రకటన 7:10) యిలా అనుకూలముగా మనము ప్రత్యుత్తరమిచ్చుటద్వారా, “[యెహోవా] చర్యలన్నియు న్యాయములని” చెప్పిన మోషే మాటలను మనము నమ్ముదుమని చూపించుదుము. (ద్వితీయోపదేశకాండము 32:4) మానవుని రక్షణకొరకైన దేవుని న్యాయమార్గములను గుర్తించి వాటిని అనుసరించి నడచుకొనుచు, మనమెంతగా యెహోవా మరియు ఆయన కుమారుని హృదయములకు సంతోషమును కల్గించవలెను!
15. నికొదేముతో యేసు పలికిన మాటలు మనకే ప్రాముఖ్యతను కలిగియున్నవి?
15 మనతోటి విశ్వాసులు 1870వ దశాబ్దకాలములో విమోచనా బలి విషయములో స్థిరమైన స్థానమును గైకొనినందుకు మనము సంతోషించుటలేదా? మానవుని రక్షణకొరకైన దేవుని న్యాయ మరియు ప్రేమపూర్వక చర్యను అంతే తీర్మానముతో పట్టుకొనిన సంస్థకు ఈనాడు మనము చెందియున్నందుకు సంతోషించుటలేదా? అట్లయిన నికొదేముతో యేసు పలికిన మాటలయెడల మనము ప్రత్యేకశ్రద్ధను చూపించవలెను: “లోకము తన కుమారునిద్వారా రక్షణపొందుటకే గాని లోకమునకు తీర్పుతీర్చుటకు దేవుడాయనను లోకములోనికి పంపలేదు. ఆయనయందు విశ్వాసముంచువానికి తీర్పుతీర్చబడదు. . . . సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడియున్నవని ప్రత్యక్ష పరచబడునట్లు వెలుగునొద్దకు వచ్చును.” దేవుని తీవ్రమైన తీర్పునుండి తప్పించుకొనుటకు ‘దేవుని మూలముగా చేయు క్రియలను’ చేయుటద్వారా కుమారుని యందలి మన విశ్వాసమును నిరూపించుకొనవలెను.—యోహాను 3:17, 18, 21.
16. యేసు శిష్యులెట్లు పరలోకపు తండ్రిని మహిమపరచగలరు?
16 యేసు యిట్లనెను: “మీరు బహుగా ఫలించుటవలన నాతండ్రి మహిమపరచబడును, యిందువలన మీరు నా శిష్యులగుదురు. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచియున్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనినయెడల నా ప్రేమయందు నిలిచియుందురు.” (యోహాను 15:8, 10) ఈ ఆజ్ఞలు కొన్ని ఏమైయున్నవి? ఒకదానిని మనము యోహాను 13:34, 35లో కనుగొనవచ్చును, అక్కడ యేసు తన శిష్యులతో యిట్లనెను: “మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ యిచ్చుచున్నాను, . . . మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైన యెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలుసుకొందురు.” ప్రేమయనే ఈ ఫలము యెహోవా సాక్షులమధ్య సాక్ష్యాధారముగా ఉన్నది. యేసు యింకను యిట్లు ఆజ్ఞాపించెను: “కాబట్టి మీరువెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు, నేను ఏయే సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నింటిని గైకొనవలెనని వారికి బోధించుడి.” (మత్తయి 28:19, 20) ‘దేవుని మూలముగా ఈ క్రియలను’ మీరు వ్యక్తిగతముగా చేయుచున్నారా?
17. ప్రకటించు మరియు శిష్యులనుచేయు పని యెహోవా న్యాయముయొక్క ప్రదర్శనయని ఏ ఫలితములు చూపుచున్నవి?
17 యెహోవా సాక్షులు కేవలము ఒక్క సంవత్సరములోనే నెరవేర్చిన దానిని మనము విచారించినప్పుడు, ప్రకటించుట, శిష్యులను చేయుటవంటి ఈ కార్యములను చేయుటకు యేసు అనుచరులను అనుమతించుటయందు యెహోవా న్యాయ మార్గము తేటపడుచున్నది. 1989లో 2,63,855 మంది క్రొత్త శిష్యులు బాప్తిస్మము పుచ్చుకొనిరి! యిది మీ హృదయమును సంతోషింపజేయుటలేదా?
న్యాయముగల దేవుడు త్వరగా చర్యగైకొనును
18. యెహోవా ప్రజలు హింసింపబడుట దృష్ట్యా ఏ ప్రశ్నలు లేవదీయబడవచ్చును?
18 వ్యతిరేకతలేకుండా సాక్ష్యపు పని నెరవేర్చబడుట లేదు. యేసు తన అనుచరులతో యిట్లనెను: “లోకులు నన్ను హింసించిన యెడల మిమ్మునుకూడ హింసింతురు.” (యోహాను 15:20) ఆ మాటల సత్యమును యెహోవా సాక్షుల ఆధునిక-దిన చరిత్ర రుజువుచేయుచున్నది. ఒక దేశము వెంబడి మరొక దేశములో సాక్షులు నిషేధములను, చెరసాలలో వేయబడుటను, కొట్టబడుటను, చిత్రహింసను అనుభవించుచున్నారు. హబక్కూకు ప్రవచన వాక్యములు మరలా మన మదిలోనికి వచ్చును: “ధర్మశాస్త్రము నిరర్థకమాయెను, న్యాయము ఎన్నడును జరుగకుండ మానిపోయెను.” కాబట్టి, కొన్నిసమయములలో యెహోవా ప్రజలు యిట్లు ప్రశ్నించ భావించవచ్చును: ‘కపటులను యెహోవా చూస్తు ఎందుకు ఊరకున్నాడు? దుర్మార్గుడు తనకంటే ఎక్కువ నీతిపరుని నాశనము చేయగా ఆయన చూచియు ఎందుకు ఊరకున్నాడు?’—హబక్కూకు 1:4, 13.
19. దేవుని దృష్టికోణమునుండి విషయములను అర్థము చేసుకొనుటకు మనకు సహాయపడు ఏ ఉపమానమును యేసు చెప్పెను?
19 అలాంటి ప్రశ్నలకు జవాబిచ్చుటకు, విషయములను దేవుని దృష్టికోణమునుండి చూచుటకు మనను శక్తిమంతులను చేయుటకు సహాయపడు ఉపమానమునొకదానిని యేసు చెప్పెను. ఈ విధానాంతమును గుర్తింపజేయు హింసాత్మక పరిస్థితులను యేసు లూకా 17:22-37లో వర్ణించెను. అవి జలప్రళయమునకు ముందు నోవహు దినములలో వలెను, సొదొమ గొమొర్రాల నాశనమునకు ముందు లోతు దినములలో వలెను ఉండునని ఆయన తెల్పెను. ఆ తర్వాత, లూకా 18:1-5లో వివరింపబడినట్లు యేసు శిష్యులవైపు తిరిగి, “వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను.” యేసు, బహు అవసరతలో ఉన్న ఒక విధవరాలు మరియు ఆమె అవసరతలు తీర్చగల ఒక “న్యాయాధిపతిని” గూర్చియు మాట్లాడెను. ఆ విధవరాలు విడువక ఆయనను యిట్లు వేడుకొనెను: “నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చుము.” ఆమె పట్టుదల కారణముగా చివరకు న్యాయాధిపతి ‘ఆమెకు న్యాయము తీర్చెను.’
20. యేసు ఉపమానము మనకే పాఠమును కలిగియున్నది?
20 దీనియందు మనకు ఈనాడు ఏ పాఠము కలదు? ఆ అన్యాయపు న్యాయాధిపతికి భిన్నమైన రీతిలో యెహోవానుగూర్చి యేసు యిట్లు చెప్పెను: “అన్యాయస్థుడైన ఆ న్యాయాధిపతి చెప్పినమాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తమను గూర్చి మొర పెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమేగదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడు.”—లూకా 18:6-8a.
21. మన వ్యక్తిగత సమస్యలను మనమెట్లు దృష్టించవలెను, మరియు వాటితో మనము ఎట్లు వ్యవహరించవలెను?
21 మన వ్యక్తిగత సమస్యల విషయము వచ్చినప్పుడు మన ప్రార్థనలకు జవాబు ఆలస్యమగుచున్నట్లు కన్పించినను, అది దేవుని అయిష్టతవలన కలిగినది కాదని అన్ని సమయములలో గుర్తుంచుకొనుము. (2 పేతురు 3:9) ఆ విధవరాలిని పోలి మనము ఏదైనా అన్యాయమును లేక హింసను అనుభవించుచున్నట్లయిన, కడకు దేవుడు న్యాయము జరుగునట్లు చూచునను విశ్వాసమును మనము కలిగియుండగలము. అలాంటి విశ్వాసమును మనమెట్లు చూపించగలము? పట్టుదలతో ప్రార్థించుట అలాగే ప్రార్థనలకనుగుణ్యముగా నమ్మకమైన కార్యాచరణ విధానమును కాపాడుకొనుటద్వారా. (మత్తయి 10:22; 1 థెస్సలొనీకయులు 5:17) మన విశ్వాసముద్వారా భూమిమీద విశ్వాసమనేది యింకా బ్రతికియున్నదని, న్యాయమును నిజముగా ప్రేమించువారు కలరని, మరియు మనము వారిమధ్య ఉన్నామని నిరూపించుదుము.—లూకా 18:8b
“జనములారా ఆయన ప్రజలతోకూడ ఆనందించుడి”
22. ఏ విజయోత్సాహపు మాటలతో మోషే తన కీర్తనను ముగించెను?
22 అనేక శతాబ్దములకు పూర్వము, మోషే ఈ విజయోత్సాహపు మాటలతో తన కీర్తనను ముగించెను: “జనములారా, ఆయన ప్రజలతోకూడ ఆనందించుడి. హతులైన తన సేవకులనుబట్టి ఆయన ప్రతిదండన చేయును. తన విరోధులకు ప్రతీకారము చేయును, తన దేశము నిమిత్తమును తన ప్రజల నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేయును.” (ద్వితీయోపదేశకాండము 32:43) క్రితమెన్నటికంటెను ఎక్కువగా యెహోవా ప్రతిదండన దినము సమీపించుచున్నది. ఆయన న్యాయముతోకూడ దీర్ఘశాంతమును యింకను చూపించుచున్నందుకు మనమెంతగా కృతజ్ఞతగలవారమై యున్నాము!
23. దేవుని ప్రజల సంతోషమునందు భాగమువహించు వారికొరకు ఏ సంతోషదాయక ఫలితము వేచియున్నది?
23 అన్ని జనాంగములలో “పశ్చాత్తాప పడు” వారికి మార్గము యింకను తెరిచేయున్నది. అయితే దానిని పోగొట్టుకొనుటకు సమయమికను లేదు. పేతురు యిట్లు హెచ్చరించెను: “యెహోవా దినము దొంగవచ్చినట్లు వచ్చును.” (2 పేతురు 3:9, 10 NW) ఈ దుష్ట విధానము త్వరలో నాశనము చేయబడవలెనని దేవుని న్యాయము గట్టిగా అడుగుచున్నది. అది సంభవించినప్పుడు “జనములారా, ఆయన ప్రజలతోకూడ ఆనందించుడని” తెల్పిన ఆనందదాయక పిలుపుకు ప్రత్యుత్తరమిచ్చినవారి మధ్యను మనముందుము గాక. అవును, దేవుని చర్యలన్నింటిలో న్యాయము గుర్తింపబడియుండుటను చూచిన ధన్యులమధ్యను మనముందుము గాక! (w89 3/1)
మీరెట్లు జవాబిత్తురు?
◻ దేవుని న్యాయమందు మోషే ధర్మశాస్త్రము మన విశ్వాసమును ఎందుకు బలపరచవలెను?
◻ దేవుని న్యాయ మార్గములకు ప్రత్యుత్తరమిచ్చుటకు మనలను ఏది పురికొల్పవలెను?
◻ యెహోవా ఎట్లు మహిమపరచబడగలడు?
◻ ఈనాడు, ఎక్కడ మాత్రమే మనము నిజమైన సంతోషమును కనుగొనవచ్చును?
[11వ పేజీలోని చిత్రాలు]
“దేవుడు పక్షపాతికాడని నిజముగా గ్రహించియున్నాను. ప్రతిజనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొనువానిని ఆయన అంగీకరించును.”—అపొ.కార్యములు 10:34, 35.
[14వ పేజీలోని చిత్రాలు]
దేవుడు తానేర్పరచుకొనినవారు తనకు మొర్రపెట్టగా వారికి న్యాయము తీర్చును