దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేయుట
మనకు ఈ వాగ్ధానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసికొనుచు, శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషమునుండి మనలను పవిత్రులనుగా చేసికొందము.”—2 కొరింథీయులు 7:1.
1. ఉన్నతస్థాయిలోయున్న దూతలు యెహోవా యొక్క పరిశుద్ధతను గుర్తించుచున్నారని మనకెట్లు తెలియును?
యెహోవా పరిశుద్ధుడైన దేవుడు. పరలోకములో ఉన్నత స్థాయిని కలిగియున్న దూతలు ఆయన పరిశుద్ధతను గూర్చి ఏ మాత్రము అనిశ్చయత లేకుండా ప్రకటించుచున్నవి. “సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది.” ఆ సెరాపుల ఉత్తేజకరమైన పిలుపును ప్రవక్తయైన యెషయా సా.శ.పూ. 8వ శతాబ్దములో ఒక దర్శనమందు చూచెను. సా.శ. మొదటి శతాబ్దముయొక్క అంతములో అపొస్తలుడైన యోహాను మనము ప్రస్తుతము జీవించుచున్న “ప్రభువు దినమున” జరగనైయున్న వాటిని దర్శనములద్వారా చూచెను. యెహోవా సింహాసనముచుట్టు నాలుగు జీవులను ఆయన చూచెను. మరియు వారు మానక ఇట్లు ప్రకటించుట ఆయన వినెను: “భూతవర్తమాన భవిషత్కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు.” యెహోవాయొక్క పరలోక ఆత్మీయజీవులు ముమ్మారు చేసిన ఈ ప్రకటనలు సృష్టికర్తయొక్క సర్వోన్నత పరిశుద్ధతను నొక్కిచూపుచున్నవి.—యెషయా 6:2, 3; ప్రకటన 1:10; 4:6-8, NW.
పరిశుద్ధత మరియు ప్రత్యేకత
2. (ఎ) పరిశుద్ధతలో ఏ రెండు విధములు గలవు, మరియు ఈ రెండు విషయములలో యెహోవా ఎట్లు పరిశుద్ధుడైయున్నాడు? (బి) మోషే యెహోవా పరిశుద్ధతను ఎట్లు నొక్కిచెప్పెను?
2 పరిశుద్ధత అనగా మతసంబంధమైన శుభ్రత మరియు స్వచ్ఛతయేగాక ప్రత్యేకత లేక పరిశుద్ధపరచబడుట అని కూడా అర్థము. యెహోవా అత్యంత పరిశుభ్రత లేక స్వచ్ఛతకలవాడు; ఆయన సంపూర్తిగా జనాంగముల మలినమైన దేవతలకు వేరైయున్నాడు. ఈ విషయమందు ఆయనయొక్క పవిత్రత లేక మహిమగల పరిశుద్ధస్థితిని నొక్కి చెప్తూ మోషే ఇట్లు పాడెను: “యెహోవా వేల్పులలో నీవంటివాడెవడు? పరిశుద్ధతనుబట్టి నీవు మహానీయుడవు.”—నిర్గమకాండము 15:11.
3. ఏ మార్గములలో ఇశ్రాయేలీయులందరు పరిశుద్ధులై యుండవలసియుండెను? మరియు ఈ విషయములో యెహోవా వారికి ఎట్లు సహాయపడెను?
3 పరిశుద్ధదేవుడైన యెహోవా భూమిపై తనప్రజలైన పురాతన ఇశ్రాయేలీయులను పరిశుద్ధులై యుండవలెనని కోరెను. ఇది యాజకులు మరియు లేవీయులకే కాక పూర్తి జనాంగమంతటికి అధికారయుక్తముగా కోరబడెను. యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను—“ఇశ్రాయేలీయుల సర్వసమాజముతో ఇట్లు చెప్పుము. ‘మీరు పరిశుద్ధులైయుండవలెను. మీ దేవుడనైన యెహోవానగు నేను పరిశుద్ధుడనైయున్నాను.’” (లేవీయకాండము 19:2) అందుకొరకై వారు ఆత్మీయంగా, నైతికంగా, మానసికంగా, శరీరకంగా మరియు నియమితాచారము విషయములలోను పరిశుద్ధులైయుండుటకు సహాయము చేయుటకై యెహోవా వారికి నియమములనిచ్చెను. ఆఖరిది వారు గుడారముయొద్ద అటుతరువాత దేవాలయముయొద్ద వారి ఆరాధన సంబంధముగా ఇవ్వబడెను.
ప్రత్యేకపరచబడిన ప్రజలు
4, 5. (ఎ) శారీరక ఇశ్రాయేలీయులు ఎట్లు ఒక పరిశుద్ధపరచబడిన జనాంగముగా ఉండెను? (బి) ఆత్మీయ ఇశ్రాయేలీయుల నుండి ఏమి కోరబడుతుంది, మరియు అపొస్తలుడైన పేతురు దీనిని ఎట్లు దృఢపరిచెను?
4 ఇశ్రాయేలీయులు దేవుని ఆజ్ఞలను అనుసరించినంత వరకు వారు వారిచుట్టు ఉన్న అతి భ్రష్ట దేశములనుండి ప్రత్యేకముగా నిలిచిరి. వారు వేరుచేయబడినట్టి ప్రజలుగా లేక తమపరిశుద్ధ దేవుడైన యెహోవా సేవకొరకు పరిశుద్ధపరచబడిన ప్రజలుగా ప్రత్యేకించబడియుండిరి. మోషే వారితో ఇట్లనెను: “మీరు మీ దేవుడైన యెహోవాకు ప్రతిష్టిత జనము, మీదేవుడైన యెహోవా భూమిమీదనున్న సమస్త జనముల కంటె మిమ్మును ఎక్కువగా ఎంచి మిమ్మును తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను.”—ద్వితీయోపదేశకాండము 7:6.
5 అట్టి పరిశుభ్రత మరియు ప్రత్యేకత ఆత్మీయ ఇశ్రాయేలీయుల నుండి కూడా కోరబడుతుంది. ఆత్మీయ ఇశ్రాయేలీయులుగా ఎన్నుకొనబడిన వారికి అపొస్తలుడైన పేతురిట్లు వ్రాసెను: “‘నేను పరిశుద్ధుడనైయున్నాను గనుక మీరును పరిశుద్ధులైయుండుడని’ వ్రాయబడియున్నది. కాగా మీరు విధేయులగు పిల్లలై మీపూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలననుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడైయున్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులైయుండుడి.”—1 పేతురు 1:1, 14-16.
6, 7. (ఎ) ప్రకటన 7వ అధ్యాయములో “గొప్పసమూహము” వారు ఎట్లు వర్ణించబడిరి, మరియు సమంజసముగా వారినుండి ఏమి కోరబడుతుంది? (బి) తరువాతి పేరాగ్రాఫ్‌లలో ఏమి పరిశీలించబడును?
6 ప్రకటన 7వ అధ్యాయములో “గొప్పసమూహమునకు” చెందిన సభ్యులు “తెల్లని వస్త్రములు ధరించుకొన్నవారై సింహాసనము యెదుటను గొఱ్ఱెపిల్లయెదుటను నిలువబడి” యున్నట్లుగాను మరియు వారు “గొఱ్ఱెపిల్ల రక్తములో తమవస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసికొని” నట్లుగాను వర్ణించబడియున్నారు. (ప్రకటన 7:9, 14) వారి తెల్లని వస్త్రములు, క్రీస్తుయొక్క విమోచన రక్తముపై వారి విశ్వాసమునుబట్టి యెహోవా వారికిచ్చు శుభ్రమైన మరియు నీతికరమైన స్థానమును సూచించుచున్నవి. కావున స్పష్టమైనరీతిగా, అభిషక్త క్రైస్తవులే కాక “వేరేగొఱ్రెలు” కూడా యెహోవాను అంగీకృతమైన రీతిగా ఆరాధించుటకు ఆత్మీయంగా మరియు నైతికంగా శుద్ధులైయుండవలెను.—యోహాను 10:16.
7 ఇప్పుడు మనము గతములో యెహోవా ప్రజలు పరిశుభ్రత మరియు పరిశుద్ధతను నిరూపించుకొనుటకు ఏమి చేయవలసియుండిరో మరియు అవే సూత్రములు ఈనాడు దేవుని ప్రజలకును ఎందుకు అనువర్తించునో గమనించెదము.
ఆత్మీయ పరిశుభ్రత
8. ఏ కారణముచేత ఇశ్రాయేలీయులు తమ్మును తాము కనానీయుల మతములనుండి వేరుపరచుకొనవలసియుండెను?
8 శరీరసంబంధమైన ఇశ్రాయేలీయులు, ఇతర జనాంగముల అశుభ్రమైన మత ఆచారముల నుండి తమ్మును తాము ఖచ్చితముగా వేరుపరచుకొనవలసియుండెను. మోషే ద్వారా మాట్లాడుతు యెహోవా ఇశ్రాయేలీయులతో ఇట్లనెను: “నీవు ఎక్కడికి వెళ్లుచున్నావో ఆ దేశపు నివాసులతో నిబంధన చేసికొనకుండా జాగ్రత్తపడుము. ఒకవేళ అది నీకు ఉరి కావచ్చును. కాబట్టి మీరు వారి బలిపీఠములను పడగొట్టి వారి బొమ్మలను పగులగొట్టి వారి దేవతా స్తంభములను (అసహ్యకరమైన లైంగిక ఆరాధనలో వాడబడినవి) పడగొట్టవలెను. ఏలయనగా వేరొక దేవునికి నమస్కారము చేయవద్దు; ఆయన నామము రోషముగల యెహోవా, ఆయన రోషముగల దేవుడు. [లేక “సంపూర్ణ భక్తిని కోరు దేవుడు” న్యూవరల్డ్ ట్రాన్స్‌లేషన్ రెఫరెన్సు బైబిలు, ఫుట్‌నోట్] ఆ దేశపు నివాసులతో నిబంధన చేసికొనకుండ జాగ్రత్తపడుము; వారు ఇతరుల దేవతలతో వ్యభిచరించి ఆ దేవతలకు బలి అర్పించుదురు.”—నిర్గమకాండము 34:12-15.
9. సా.శ.పూ. 537లో బబులోనును విడిచివచ్చిన నమ్మకమైన శేషమునకు ఎట్టి ఖచ్చితమైన ఉపదేశములివ్వబడెను?
9 శతాబ్దముల తరువాత బబులోను నుండి యూదాకు తిరిగివచ్చు నమ్మకమైన శేషమును ఉద్దేశించి ఈ ప్రవచనార్థకమైన మాటలు చెప్పుటకు యెహోవా యెషయాను ఇట్లు ప్రేరేపించెను: “పోవుడి పోవుడి అచ్చటనుండి వెళ్లుడి అపవిత్రమైన దేనిని ముట్టకుడి దానియొద్దనుండి తొలగి పోవుడి యెహోవా సేవోపకరణములను [యెరూషలేములోని దేవాలయములో సత్యారాధనను పునరుద్ధరించుటలో వాడబడునవి] మోయువారలారా మిమ్మును మీరు పవిత్రపరచుకొనుడి.”—యెషయా 52:11.
10, 11. (ఎ) మొదటి శతాబ్దములోని ఆత్మీయ ఇశ్రాయేలీయులకు అదేవిధమైన ఏ ఉపదేశములివ్వబడెను? (బి) 1919 మరియు 1935 నుండి విశేషముగా ఈ ఉపదేశములు ఎట్లు అనుసరించబడెను? మరియు ఏ ఇతర మార్గములో అభిషక్తులు మరియు వారి సహచరులు ఆత్మీయ శుభ్రతను కాపాడుకొనిరి?
10 అదేవిధముగా ఆత్మీయ ఇశ్రాయేలీయులు మరియు వారి సహచరులు విగ్రహారాధనతో నిండిన ఈలోకపు మతములతో అపవిత్రపడకుండా జాగ్రత్తపడవలెను. కొరింథీ సంఘములోని అభిషక్త క్రైస్తవులకు వ్రాస్తూ అపొస్తలుడైన పౌలు ఇట్లు చెప్పెను: “దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవముగల దేవుని ఆలయమైయున్నాము; అందుకు దేవుడీలాగు సెలవిచ్చుచున్నాడు.—‘నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనైయుందును. వారు నా ప్రజలైయుందురు.’ కావున మీరు వారి మధ్యనుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకొందును.”—2 కొరింథీయులు 6:16, 17.
11 1919నుండి శుభ్రపరచబడి మెరుగుపరచబడిన అభిషక్త శేషము వారు మహాబబులోను యొక్క అపవిత్రమైన మరియు విగ్రహారాధనతో నిండిన మతములనుండి విడుదలచెందెను. (మలాకీ 3:1-3) “నాప్రజలారా మీరు దాని పాపములలోపాలివారు కాకుండునట్లు దాని తెగుళ్లలో ఏదియు మీకు ప్రాప్తించకుండునట్లు దానిని విడిచి రండి,” అని పరలోకము నుండి వచ్చిన పిలుపును వారు గైకొనిరి. (ప్రకటన 18:4) 1935 నుండి “వేరేగొఱ్ఱెల”యొక్క పెరుగుతున్న గొప్పసమూహము కూడా అదేవిధముగా ఈ పిలుపును విని అపవిత్రమైన బబులోను మతమును విడిచిపెట్టిరి. అంతేగాక, అభిషేకించబడినవారు మరియు వారి సహచరులు మతభ్రష్టులయొక్క నాశనపాత్రమైన ఆలోచనలన్నిటికి దూరముగా ఉండుట ద్వారా తమ ఆత్మీయ పవిత్రతను కాపాడుకొందురు.—యోహాను 10:16; 2 యోహాను 9-11.
నైతిక పరిశుభ్రత
12. (ఎ) ఏ నియమముల నిచ్చుటద్వారా యెహోవా ఇశ్రాయేలీయుల నైతిక స్థాయిని వారి చుట్టు ఉన్న జనాంగముల అతి ఉన్నతముగా చేసెను? (బి) ఏ విధులు ముఖ్యముగా యాజకత్వము కొరకు ఖచ్చితమైయుండెను?
12 ధర్మశాస్త్ర నిబంధన ద్వారా యెహోవా ఇశ్రాయేలీయుల నైతిక స్థాయిని వారి చుట్టువున్న జనాంగముల హీనస్థితి కంటె ఉన్నతంగా హెచ్చించెను. వివాహము మరియు కుటుంబ జీవితము సంరక్షించబడిన సంస్థానములైయుండెను. పది ఆజ్ఞలలో ఏడవది వ్యభిచారమును నిషేధించెను. వ్యభిచారము మరియు జారత్వమును చేయువారు తీవ్రంగా శిక్షించబడిరి. (ద్వితీయోపదేశకాండము 22:22-24) ధర్మశాస్త్రము క్రింద కన్యకలు సంరక్షించబడిరి. (ద్వితీయోపదేశకాండము 22:28, 29) విశేషముగా యాజకుల వివాహముకొరకు ఖచ్చితమైన నియమములుండెను. ప్రధాన యాజకుడైతే పవిత్రమైన కన్యను మాత్రమే వివాహము చేసికొనవలసియుండెను.—లేవీయకాండము 21:6, 7, 10, 13.
13. క్రీస్తు యొక్క “పెండ్లి కుమార్తె” తరగతి సభ్యులు ఎవరితో పోల్చబడిరి, మరియు ఎందుకు?
13 అదేవిధముగా గొప్ప ప్రధానయాజకుడైన యేసుక్రీస్తు “కన్యకలతో” పోల్చబడిన 1,44,000 అభిషక్త క్రైస్తవులతో చేయబడిన “పెండ్లికుమార్తెను” కలిగియున్నాడు. (ప్రకటన 14:1-5; 21:9) వారు సాతాను లోకమునుండి కళంకము లేకుండా చూచుకొని సిద్ధాంతరీతిగా మరియు నైతికంగా స్వచ్ఛముగా వుందురు. అపొస్తలుడైన పౌలు కొరింథీలోని అభిషక్త క్రైస్తవులకు ఇట్లు వ్రాసెను: “దేవాసక్తితో మీయెడల ఆసక్తిని కలిగియున్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మును ప్రధానముచేసితిని.” (2 కొరింథీయులు 11:2) మరియు పౌలు ఇట్లు వ్రాసెను: “అటువలె క్రీస్తుకూడా సంఘమును ప్రేమించి, అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక, పరిశుద్ధమైనదిగాను, నిర్దొషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన యెదుట దానిని నిలువబెట్టవలెనని, వాక్యముతో ఉదకస్నానముచేత దానిని పవిత్రపరచి, పరిశుద్ధపరచుటకై దానికొరకు తన్నుతాను అప్పగించుకొనెను.”—ఎఫెసీయులకు 5:25-27.
14, 15. (ఎ) పెండ్లి కుమార్తె తరగతియొక్క ఆత్మీయ స్వచ్ఛతతో పాటు ఏమి కూడ ఉండవలెను? మరియు ఏ లేఖనము దీనిని చూపుచున్నది? (బి) ఈ విధమైన నైతిక స్వచ్ఛత వేరే గొఱ్రెల నుండి కూడా కోరబడుతుందని ఎట్లు స్పష్టమవుతుంది?
14 క్రీస్తు పెండ్లికుమార్తె యొక్క ఈ ఆత్మీయ స్వచ్ఛత దాని సభ్యుల నైతిక పరిశుభ్రతతో కూడా కూడినదైయుండవలెను. అపొస్తలుడైన పౌలు ఇట్లుచెప్పెను: “మోసపోకుడి; జారులైనను విగ్రహారాధకులైనను వ్యభిచారులైనను. . .దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టివారైయుంటిరి గాని. . .మీరు కడుగబడి పరిశుద్ధపరచబడినవారైరి.”—1 కొరింథీయులకు 6:9-11.
15 ఆ నైతిక స్వచ్ఛతయొక్క అగత్యత వేరేగొర్రెలకు కూడా అనువర్తిస్తుంది. ఈ విషయమును యెహోవా ఎవరిని వాగ్థానము చేయబడిన క్రొత్తభూమి, క్రొత్త ఆకాశములో ప్రవేశించనీయకుండా చేయునో పరిశీలించునపుడు స్పష్టమవుతుంది. మనమిట్లు చదువుదుము: “అసహ్యలును నరహంతకులును, వ్యభిచారులును మాంత్రికులును అగ్నిగంథకములతో మండు గుండములో పాలుపొందుదురు. ఇది రెండవ మరణము.—ప్రకటన 21:1, 8.
ఘనమైన వివాహము
16, 17. (ఎ) నైతిక శుభ్రత కొరకు ఏకత్వము లేక ఒంటరి తనము అవసరములేదని ఏ లేఖనములు చూపించుచున్నవి? (బి) ఒక క్రైస్తవుడు వివాహజతను ఎన్నుకొనుటలో దేవునియెడల సరియైన భయమును ఎట్లు ప్రదర్శించగలడు మరియు అపొస్తలుని కట్టడను త్రోసిపుచ్చుట ఎందుకు అవివేకమైయున్నది?
16 నైతికంగా పవిత్రులైయుండుటకు పెండ్లికుమార్తె తరగతి యొక్క అభిషక్త సభ్యులు మరియు వేరేగొర్రెలు అవివాహితులుగా ఉండవలసిన అవసరములేదు. (1 తిమోతి 4:1-3) తప్పనిసరిగా వివాహముచేసికొనకుండా ఉండవలెననుట లేఖనానుసారమైనది కాదు. వివాహబంధములో లైంగిక సంబంధములు అశుభ్రము కాదు. దేవుని వాక్యమిట్లు చెప్పుచున్నది: “వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను, పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను. వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పుతీర్చును.”—హెబ్రీయులు 13:4.
17 ఏమైనను, దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్ణము చేయగోరు క్రైస్తవుడు అతనికి లేక ఆమెకు ఇష్టము వచ్చినవారిని వివాహము చేసికొనవచ్చు అని భావించరాదు. “దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తిచేసికొనుచు, శరీరమునకు ఆత్మకును కలిగిన సమస్త కల్మషమునుండి మనలను పవిత్రులనుగా చేసికొందము” అని క్రైస్తవులకు సలహా ఇవ్వకముందు అపొస్తలుడైన పౌలు ఇట్లువ్రాసెను: “మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్ణీతితో ఏమి సాంగత్యము. . . అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది?” (2 కొరింథీయులు 6:14, 15; 7:1) యెహోవాయొక్క ప్రత్యేకమైన మరియు పవిత్రమైన ప్రజలలో సభ్యుడిగా ఒక పురుషుడేగాని, స్త్రీయేగాని వివాహము చేసికొనగోరినయెడల అపొస్తలుని యొక్క కట్టడను స్వీకరించి “ప్రభువునందే” ఆలాగుచేయును. అనగా సమర్పించుకొని బాప్తిస్మము పొంది యెహోవాను నమ్మకముగా సేవించుచున్న వారినే ఎన్నుకొనుట ద్వారా అట్లు చేయును. (1 కొరింథీయులు 7:39) గతంలో నిజమైన రీతిగా ఇప్పుడుకూడా దేవుని ప్రజలలోని సమర్పించుకొనిన వారు ఈ లేఖనాను సారమైన ఉపదేశమును త్రోసిపుచ్చుట అవివేకమైనదైయుండును. (ద్వితీయోపదేశకాండము 7:3, 4; నెహెమ్యా 13:23-27ను పోల్చుము.) మనగొప్ప యజమానియైన యెహోవా యెడల అది ఆరోగ్యకరమైన భయమును ప్రదర్శించునదై యుండదు.—మలాకీ 1:6.
18. మరి ఏ ఇతర మార్గములో క్రైస్తవులు తమ వివాహమును ఘనమైనదిగా ఉంచగలరు?
18 అంతేకాకుండా ఇశ్రాయేలీయులలో వివాహబంధమందు కూడ లైంగికకార్యకలాపాలపై హద్దులను నియమించు ఆజ్ఞలు ఉండెను. ఒక భర్త తన భార్యయొక్క ఋతుస్రావ సమయములో సంబంధములను మానివేయవలసియుండెను. (లేవీయకాండము 15:24; 18:19; 20:18) దీనికొరకు ఇశ్రాయేలు పురుషులు ప్రేమపూర్వకమైన శ్రద్ధతో మెలగుట మరియు ఆశానిగ్రహము చూపుట అవసరమైయుండెను. క్రైస్తవులు కూడా తమ భార్యల విషయంలో ఏమైన తక్కువ శ్రద్ధతో మెలగవలెనా? క్రైస్తవ భర్తలు తమ భార్యలతో “జ్ఞానము చొప్పున కాపురము చేయ” వలెనని అపొస్తలుడైన పేతురు చెప్పుచున్నాడు. అనగా భార్య “బలహీనఘటమై” స్త్రీ సంబంధమైన లక్షణములతో నిర్మించబడినదన్న జ్ఞానముతో కాపురము చేయవలెను.—1 పేతురు 3:7.
“పరిశుద్ధ మార్గమున” నడచుట
19, 20. (ఎ) మానవజాతిలో అనేకులు అనుసరించుచున్న విశాల మార్గమును వర్ణించుము? (బి) యెహోవా ప్రజలు సాతాను లోకమునుండి ఎట్లు వేరైయుండవలెను? (సి) ఏ రాజమార్గమును దేవుని ప్రజలు అనుసరించుచున్నారు? అది ఎప్పుడు తెరవబడెను, మరియు ఎవరు మాత్రమే అందులో ప్రవేశించగలరు?
19 ముందు చెప్పబడినదంతయు సాతాను లోకమునుండి యెహోవా ప్రజలను ప్రత్యేకపరచునట్టి అంతకంతకు విస్తరించు అగాధమును నొక్కిచూపుచున్నది. ప్రస్తుత లోకవిధానము ఎంతో ఇష్టానుసారముగా నడచుచు అన్నిటిని ఆమోదించుచున్నది. యేసు ఇట్లు చెప్పెను: “ఇరుకు మార్గమున ప్రవేశించుడి; నాశనమునకు పోవు మార్గము వెడల్పును ఆ దారి విశాలమునైయున్నది, దానిద్వారా ప్రవేశించువారు అనేకులు.” (మత్తయి 7:13) మానవజాతి యొక్క అత్యధిక భాగము ఆ విశాల మార్గమును అనుసరించుచున్నారు. అపొస్తలుడైన పేతురు చెప్పినట్టుగా అది “పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజల”తో కూడిన మార్గము. మరియు అది “అపరితమైన దుర్వ్యాపారమునకు” సంబంధించిన మార్గము. (1 పేతురు 4:3, 4) దాని అంతము నాశనమే.
20 అయితే మరియొకవైపు దేవుని ప్రజలు వేరే మార్గమున నడుచుచున్నారు. అది ఒక శుభ్రమైన మార్గము. శుభ్రమైన ప్రజలు అనుసరించు మార్గము. అంత్యకాలములో ఈ మార్గము తెరువబడునని ప్రవక్తయైన యెషయా ఇట్లువ్రాసెను: “అక్కడ దారిగానున్న రాజమార్గము ఏర్పడును. అది పరిశుద్ధ మార్గమనబడును. అది అపవిత్రులు పోకూడని మార్గము.”(యెషయా 35:8) ఈ ప్రవచనముపై వాఖ్యానిస్తు వరల్డ్‌వైడ్ సెక్యూరిటి అండర్ ది “ప్రిన్స్ ఆఫ్ పీస్” అను పుస్తకము ఇట్లనెను: “1919లో ఒక సూచనార్థకమైన రాజమార్గము ఆనందభరితమైన దేవుని ప్రజలకు తెరువబడెను. యెహోవా దృష్టిలో పరిశుద్ధులుగా ఉండగోరినవారు ‘ఆ రాజమార్గము’లో, ఆ ‘పరిశుద్ధ మార్గము’లో నడిచిరి. ఈ రోజు ఈ యుగసమాప్తియొక్క ఆఖరి గడియలో దైవికంగా ఏర్పాటు చేయబడిన ఆ ‘రాజమార్గము’ ఇంకా తెరువబడియున్నది. గుణగ్రహణ కలిగిన ప్రజలు గుంపులు గుంపులుగా ఆ ఆత్మీయ పరదైసు మార్గములో, ‘ఆ పరిశుద్ధ మార్గము’లో ప్రవేశించుచున్నారు.”a
21. ఎట్లు మరియు ఎందుకు యెహోవా సేవకులు అపవాది గుంపు నుండి తమ్మును తాము వేరుపరచుకొనవలెను? మరియు తదుపరి శీర్షికలో ఏమి చర్చించబడును?
21 అవును, ఆత్మీయ ఇశ్రాయేలుయొక్క అభిషక్తశేషము మరియు వారి సహచరులైన వేరేగొర్రెలు సాతాను లోకమునుండి వేరుపరచబడిన ప్రజలుగా తమను తాము ప్రత్యేక పరచుకొనుచున్నారు. ఆ సాతాను లోకమునకు పరిశుద్ధతా భావము అర్థములేనిదిగా తయారయినది. “నాశనమునకు పోవు వెడల్పును మరియు విశాలమైన మార్గమున పోవు” అపవాది గుంపునకు ఏదియు పరిశుద్ధము కాదు. వారు ఆత్మీయంగా మరియు నైతికంగానే కాక ఎన్నోమార్లు శారీరకంగాను అశుభ్రతగలవారై, వారి రూపము మురికిగాను హీనమైనదిగాను కనిపించునదై ఉండును. అయినను అపొస్తలుడైన పౌలు: “దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తిచేసికొనుచు, శరీరమునకును, ఆత్మకును కలిగిన సమస్త కల్మషమునుండి మనలను పవిత్రులనుగా చేసికొందము” అని చెప్పుచున్నాడు. (2 కొరింథీయులు 7:1) శారీరంకంగా మరియు మానసికంగా పవిత్రతను కాపాడుకొనుటకు దేవుని ప్రజలు ఎట్లు జాగ్రత్త కలిగియుండవలెనో తదుపరి శీర్షికలో పరిశీలించబడును. (w89 6/1)
[అధస్సూచీలు]
a అధ్యాయము 16, పేజీలు 134-5.
పునఃపరిశీలించు విషయములు
◻ పరిశుద్ధతలో ఏ రెండు భాగములు గలవు, మరియు యెహోవా అతిపరిశుద్ధుడని ఎందుకు చెప్పగలము?
◻ ఏ రెండు మార్గములలో ఇశ్రాయేలీయులు ఒకపరిశుద్ధజనాంగమని నిరూపించవలసియుండెను?
◻ ఆత్మీయ ఇశ్రాయేలీయులు మరియు వారి సహచరులైన వేరేగొఱ్రెల నుండి ఏమి కోరబడుతుంది?
◻ దేవుని యెడల మనకున్న భయము, వివాహజతను ఎన్నుకొనుటపై ఎటువంటి ప్రభావము కలిగియుండవలెను?
◻ ఈనాడు ఏ రెండు మార్గములను అనుసరించవచ్చును, మరియు ఒక స్పష్టమైన నిర్ణయము ఎందుకు చేయవలెను?
[24వ పేజీలోని చిత్రాలు]
“వివాహము ఘనమైనదిగా ఉండవలెను”—అని దేవుని వాక్యము చెప్పుచున్నది