ప్రపంచ పరిపాలన మారుచున్నది
మీరు ఎన్నుకొనగలిగినట్లయితే ఎటువంటి ప్రభుత్వము క్రింద మీరు జీవించయిష్టపడెదరు? మనలో ఎక్కువమందిమి సహేతుకంగా వ్యక్తిగత స్వాతంత్ర్యమునిచ్చు ఒకస్థిరమైన ప్రభుత్వమును కోరుకొందుము. నేరమును అదుపుచేసి, సమాధానమును, సాంఘిక న్యాయమును కాపాడుతూ, భౌతిక సంక్షేమమును వర్ధిల్లజేయు ప్రభుత్వమును యిష్టపడుదుము. నిశ్చయముగా, బాధించని లేక అవినీతికరము కాని ప్రభుత్వమును మనము కోరుకొందుము.
విచారకరముగా, అనేక ప్రభుత్వములు ఈవిధముగా లేవు. 20వ శతాబ్ధపు చివరి అర్ధభాగములో ఉన్నలోకమును గమనించిన మనము దేనిని కనుగొందుము? దారిద్ర్యము, అవినీతి, అసమర్ధత, బాధ, సాంఘికఅన్యాయము, నేరము, అంతర్జాతీయ ఉద్రిక్తత. వేలసంవత్సరములుగానున్న మానవ ప్రభుత్వముల చివరి ఫలితము యిలా ఉన్నది.
బహుశ, కొందరు పరిపాలకులు వ్యక్తిగతముగా న్యాయమైన మనస్సుగలవారై, సమర్ధులైయున్నారనుట సత్యమే. కొన్నిప్రభుత్వవిధానములు కొంతమట్టుకు స్థిరముగాను, ఫలవంతముగాను యున్నవి. కాని సహజసిద్ధముగా అవి ఏమి చేయాలనుకుంటామో, దానిని చేయుటలో మొత్తముమీదవున్న మానవప్రభుత్వముల విఫలత బైబిలు వాక్య సత్యమును రుజువుచేస్తుంది. అదేమనగా: “తమ మార్గమునేర్పరచుకొనుట నరులవశములో లేదనియు, మనుష్యులు తమ ప్రవర్తనయందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేనెరుగుదును.” (యిర్మీయా 10:23) ఇంకొకమాటలలో చెప్పవలెనంటే, బయటి సహాయములేకుండా తనను తాను పరిపాలించుకొనుటకు నరుడు చేయబడలేదు.
అందుకనే ప్రపంచపరిపాలన మారుచున్నదని తెలుసుకొనుట మంచిది. ఈ మాటలవలన మా భావమేమి? మా భావమేమనగా, మానవజాతియొక్క అనుదిన జీవిత నడిపింపంతయు, సంపూర్ణముగా విజయవంతమగు ఒక క్రొత్తవిధమైన ప్రభుత్వపు చేతిలోనికి త్వరలో వెళ్లబోవుచున్నది. ప్రభుత్వముయొక్క యిట్టి సమూలమార్పు దేవునిచే ప్రవచింపబడినది. నిజమునకు బైబిలుయొక్క ముఖ్యాంశమే అదైయున్నది.
ప్రభుత్వమునుగూర్చిన దేవుని శ్రద్ధ
మానవనడిపింపునుగూర్చి దేవుడు ఎల్లప్పుడు శ్రద్ధకలిగియుండెను. మానవప్రభుత్వములు ఎంతవరకు తమ బాధ్యతను నెరవేర్చుచున్నవని ఆయన జాగ్రత్తగా గమనించుచున్నాడు. కొన్నిసార్లు వాటిని ఆయన జవాబడుగుచున్నాడు. నిజమునకు, కొన్నిముఖ్యప్రభుత్వ విధానముల 2,500 సంవత్సరముల గతచరిత్ర బైబిలునందు ముందుగానే ప్రవచింపబడినది. క్రీస్తుపుట్టకమునుపు 500 సంవత్సరముల క్రితము వ్రాయబడిన దానియేలు గ్రంథములో పురాతనబబులోను పతనము, మాదీయ-పారశీక, గ్రీసు, రోముల పుట్టుక పతనములను గూర్చిన ప్రవచనములు వ్రాయబడియున్నవి. చివరకు మన దినములలోని ఆంగ్లో-అమెరికన్ ప్రపంచాధిపత్యపు ఎదుగుదలనుగూర్చియు ప్రవచనములు ముందే తెల్పెను. వీటిలోని కొన్నిప్రవచనముల క్లుప్తమైన పరిశీలన ప్రపంచపరిపాలన మారుచున్నదను మాటయొక్క భావమేమిటో అర్ధముచేసుకొనుటకు మనకు సహాయపడును.
అద్భుతకరమైన ఈ ప్రవచనములలో మొదటిది ప్రేరేపణతో కలిగిన ఒక కల. ఇందు దానియేలు నాటినుండి మనకాలముల వరకు ఉన్న రాజకీయఆధిపత్యములు ఒక పెద్దప్రతిమ ద్వారా సూచింపబడెను. ఆ తరువాత, చేతిసహాయములేక తీయబడిన ఒక రాయి దానిపైబడి ఆ ప్రతిమను తుత్తునీయలుగా చేసెను. ఆ రాయి ఈ ప్రపంచాధిపత్యములను పొట్టువలె నలగగొట్టెను. “దంచబడి కళ్లములోని చెత్తవలె కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండ గాలివాటిని కొట్టుకొనిపోయెను.”—దానియేలు 2:31-43.
దానియేలు గ్రంథపు అదే అధ్యాయము దాని భావమేమో వివరించుచున్నది. విఫలమగుచున్న మానవప్రభుత్వముల స్థానములో అన్నిటికంటె ఉన్నతమైనదొకటి వచ్చునని అది చూపుచున్నది. అదేమనగా: “ఆ రాజులకాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును. దానికెన్నటికిని నాశనముకలుగదు, ఆ రాజ్యము దానిపొందిన వారికిగాక మరెవరికిని చెందదు; అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగులగొట్టి నిర్మూలముచేయునుగాని అది యుగములవరకు నిలుచును. . .కల నిశ్చయము, దాని భావము నమ్మదగినది.—దానియేలు 2:44, 45.
అంతటితో విషయము సమాప్తము కాలేదు. రెండవ దర్శనములో వరుసగావచ్చు ప్రపంచాధిపత్యములు వాటిశక్తిని సూచించు లక్షణములుగల పెద్దమృగములతో సూచింపబడెను. తరువాత “మహావృద్ధుడగు” వాడు ఆసీనుడైయున్న సింహాసనముతోపాటు, తన దినములలోకాక, మనకాలములోని ఆంగ్లో-అమెరికన్ ప్రపంచాధిపత్యము సమయములో జరుగునది చూపబడెను. ఈ ప్రపంచాధిపత్యములకు తీర్పుతీర్చుటకై కూర్చొనియున్న యెహోవాయొక్క మహత్తరమైన పరలోకసభను ఆయన చూసెను. (దానియేలు 7:2-12) మరియు తదుపరి వచనములు చూపురీతిగా పరిపాలనలో మార్పునకు దైవశాసనము బయలువెడలెను. ఎవరికి ఈ పరిపాలన యివ్వబడును?
మనుష్యకుమారుని పోలిన యొకడు
పులకరింతకలుగజేయు ఈ సమాధానమును దానియేలు యిచ్చుచున్నాడు:
“రాత్రికలిగిన దర్శనములను నేనింక చూచుచుండగా ఆకాశమేఘారూఢుడై మనుష్యకుమారుని పోలినయొకడువచ్చి, ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. సకలజనులును రాష్ట్రములును ఆయాభాషలు మాట్లాడువారును, ఆయనను సేవించునట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయనకీయబడెను. ఆయనప్రభుత్వము శాశ్వతమైనది అదెన్నటికిని తొలగిపోదు. ఆయనరాజ్యము ఎప్పుడును లయముకాదు.”—దానియేలు 7:13, 14.
ఆవిధముగా “మహావృద్ధుడగు” యెహోవా దేవుడు బాధాకరమైన మానవ ప్రభుత్వముల చెడుపరిపాలనను తీసివేయునని ప్రవచించుటకు దానియేలు వాడుకొనబడెను. మానవజాతి ఎప్పుడూ ఊహించనటువంటి ఒక శ్రేష్టమైన ప్రభుత్వమును వీటిస్థానములో తెచ్చును. అది—పరలోకమునుండి శక్తిని, అధికారమును ప్రయోగించు అదృశ్యమైన రాజ్యము. అయితే ఆ రాజ్యమును పొందు “మనుష్యకుమారుని పోలిన యొకడు” ఎవరు?
ఈ విషయములో మనము సందేహములో విడిచిపెట్టబడలేదు. యేసు తననుతాను “మనుష్యకుమారుని”గా గుర్తించుకొనెను. తన ప్రత్యక్షతను “తన మహిమతో మనుష్యకుమారుడును ఆయనతో కూడ సమస్తదూతలును వచ్చున”ట్టి సమయముగా ఆయన వివరించెను. (మత్తయి 25:31) యూదా ప్రధానయాజకుడు “నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువా” సభయెదుట చెప్పుమని గట్టిగా కోరినప్పుడు యేసు యిలా సమాధానమిచ్చెను: “నీవన్నట్టే. ఇది మొదలుకొని మనుష్యకుమారుడు, సర్వశక్తుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు, ఆకాశమేఘారూఢుడై వచ్చుటయు మీరుచూతురని చెప్పెను.”a—మత్తయి 26:63, 64.
చివరి మానవ ప్రపంచాధిపత్యము
దానియేలు సమయమునకు 600సంవత్సరముల తర్వాత అపొస్తలుడైన యోహాను దైవప్రేరణతో బైబిలుపుస్తకమైన ప్రకటనను వ్రాసెను. ఆ పుస్తకము ఈ ప్రపంచాధిపత్యములను బలమైన “రాజులు”గా వివరిస్తూ యిలా అనుచున్నది: “మరియు ఏడుగురు రాజులు కలరు; అయిదుగురు కూలిపోయిరి. ఒకడున్నాడు, కడమవాడు ఇంకను రాలేదు. వచ్చినప్పుడు కొంచెము కాలముండవలెను.”—ప్రకటన 17:10.
యోహాను వ్రాసినప్పటికి కూలిపోయిన అయిదు ఏమనగా ఐగుప్తు, అస్సీరియా, బబులోను, మాదీయ-పారశీకము, గ్రీసు. రోమను సామ్రాజ్యము యింకను ‘ఉన్నది.’ నిశ్చయముగా, మనకాలములోని ఏడవ ప్రపంచాధిపత్యమగు ఆంగ్లో-అమెరికన్ ప్రపంచాధిపత్యము ఆసమయమునకు వచ్చియుండలేదు. ప్రకటన గ్రంథప్రకారము నేడున్న—ఏడవ ప్రపంచాధిపత్యము తరువాత మిగిలియుండేదేదిలేదు. ఇదియే ఆఖరిది. ఇక యేమియు ఉండవు.
ఏమైనను, అది భయమునుగొల్పు సంగతికాదు— పులకరింపును కలుగజేయునది! అన్యాయము, యుద్ధప్రీతిగల మానవపరిపాలనలకు అంతము సమీపమని దానిభావము. భూమి పరిపాలింపబడు తీరులోమార్పు అకస్మికముగా సంభవించునని చెప్పుటలో ప్రవచనములన్నియు ఏకమౌచున్నవి— ఆ మార్పు స్వార్థపూరిత మానవపరిపాలన నుండి నీతియుక్తమైన మరియు పరలోక సంబంధమైన దేవునిరాజ్యము.
రాజ్యప్రభుత్వము
ఆ రాజ్యమేమిటి? అది కేవలము ప్రజల హృదయములలో, జీవితములలో మంచిని కలుగజేయు ప్రభావముకాదు. పేరుకు మాత్రము పిలువబడు క్రైస్తవ చర్చిజీవితము అంతకన్నకాదు. దేవుని రాజ్యము నిజమైన ఒక ప్రభుత్వము. దానికి రాజు, సహపరిపాలకులు, ప్రాంతము, అందు నివసించు ప్రజలు ఉన్నారు. మరియు ముందు తెల్పిన అద్భుతకర ఆశీర్వాదములను కూడా అది తెచ్చును.
యేసు ఆ రాజ్యమునకు రాజుగా గుర్తింపబడియున్నాడు. ఆయన తననుతాను “రాజ్యము సంపాదించుకొని మరల రావలెనని దూరదేశమునకు ప్రయాణమై వెళ్లిన” ఒక రాజకుమారునికి పోల్చుకొనెను. ఆ భవిష్యత్ సమయమునుగూర్చి ఆయన యిలా చెప్పెను: “తన మహిమతో మనుష్యకుమారుడును ఆయనతో కూడ సమస్తదూతలును వచ్చునప్పుడు ఆయన తన మహిమగల సింహాసనముముమీద ఆసీనుడైయుండును.”—లూకా 19:12; మత్తయి 25:31.
“మనుష్యకుమారుడు” ఎప్పుడువచ్చును? ఆ సమాధానమును మనము ఊహించనవసరములేదు. “నీ రాకడకు, ఈ యుగ సమాప్తికిని సూచన ఏమని” అడిగిన ప్రశ్నకు ఆయనిచ్చిన సమాధానములో యేసు మాటలున్నవి. (మత్తయి 24:3, 30) తరచు ఈ పత్రికలోని సమాచారములో చూపబడినట్లు ఆ “ప్రత్యక్షత” (రాకడ) పరలోకములో అదృశ్యముగా 1914లో “అన్యజనముల కాలములు” ముగింపబడుటతో ప్రారంభమైనది.b—లూకా 21:24.
యిలా జరుగుతుందని ప్రకటన 12వ అధ్యాయములో చెప్పబడినరీతిగా, యేసు తన ఆధిపత్యమును తీసుకొని సాతానును భూమిపైకి పడద్రోసెను. అప్పుడు పరలోకమందు స్వరము యిలా వినబడెను: “సహోదరులమీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడియున్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవునివాయెను. ఇప్పుడు అధికారము ఆయనక్రీస్తుదాయెను.” ఇది అప్పటినుండి ప్రపంచపరిస్థితులు ఎందుకుచెడుగా మారుచున్నవనుటకు కారణమును తెల్పుచున్నది. అందుకే పరలోకమందు స్వరము యింకను యిలా వినబడెను: “భూమీ, సముద్రమా, మీకు శ్రమ; అపవాది తనకు సమయముకొంచెమే అని తెలిసికొని బహుక్రోధముగలవాడై మీయొద్దకు దిగివచ్చియున్నాడు.”—ప్రకటన 12:9-12.
ఆ కొంచెము సమయము త్వరలో ముగియనున్నది. కొన్ని అధ్యాయములతర్వాత మహిమపరచబడిన యేసు తెల్లని గుర్రముపై కనపడెను. “దేవుని వాక్యమని” పిలువబడెను, మరియు ఆయన “జనములను కొట్టి”, “యినుపదండముతోవారిని ఏలును”. దానియేలు చూపినవిధముగా ఆ తదుపరి భూమియంతటికి వ్యాపించు రాయివంటి దేవుని రాజ్యముచే జనములు నలగగొట్టబడుదురు.—ప్రకటన 19:11-16; దానియేలు 2:34, 35, 44, 45.
ఇక ఎన్నటికిని మృగములలాంటి మానవరాజకీయ ఆధిపత్యములు మానవజాతిని బాదించవు!
సహపరిపాలకులు
అయితే యింకను ఎక్కువ ఉన్నది. రాజ్యము కేవలము “మనుష్యకుమారుని పోలిన యొకని”కే గాక “మహోన్నతుని పరిశుద్ధులకునుచెందును” అని చెప్పుటకు దానియేలు ప్రేరేపింపబడెను.—దానియేలు 7:27.
వీరు ఎవరు? గొర్రెపిల్లయైన క్రీస్తుయేసును గూర్చి ప్రకటన యిలా అనుచున్నది: “ప్రతి వంశములోను, ఆయా భాషలు మాటలాడువారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను, దేవునికొరకు మనుష్యులనుకొని మాదేవునికి వారిని ఒకరాజ్యముగాను యాజకులనుగాను చేసితివి. గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్తపాట పాడుదురు.” ఇంకను వారు “దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడ వెయ్యిసంవత్సరములు రాజ్యము చేయుదు”రనియు అది చెప్పుచున్నది. వారి సంఖ్య 1,44,000 మందిగా యివ్వబడినది.—ప్రకటన 5:9, 10; 14:1; 20:6.
వీరు మహోన్నతుడైన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుతో పాటు ప్రపంచ ప్రభుత్వములో వంతుకలిగి యుండుటకు ఎన్నుకొనినవారు. దేవుడు ఎన్నుకొనిన వీరియందు గాక వేరే ఎవరిచేతిలోనైనను మన భవిష్యత్తు భద్రముగా ఉండగలదా? లేదు, ఈ రాజ్యము మానవునికి ఇప్పటికి తెలిసియున్న దేనికన్నను—మంచి ప్రభుత్వమై యుండగలదు. ఆ పరిపాలన క్రింద భూమియంతయు దేవుడు ఆదిలో సంకల్పించిన ఉద్యానవనముగా (పరదైసు) మార్పుచెందును.
నిజముగా నీవు జీవించగోరునది యిలాంటి ప్రభుత్వము క్రిందనేమో తెలుసుకొనుటకు తదుపరి శీర్షికను చదివి చూడుము. (w88 6/15)
[అధస్సూచీలు]
a దానియేలు దర్శనమునుగూర్చి న్యూకేథలిక్ ఎన్‌సైక్లొపీడియా యిలా చెప్పుచున్నది: “కాలాంతమందు నిత్యసూచనగా ఉండు ఒక సంఘటనను గూర్చి దానియేలు మాట్లాడుచున్నాడనుటలో ఏ సందేహము లేదు.” ఇంకను యిట్లనుచున్నది: “యూదుల ప్రధానన్యాయసభయెదుట యేసు ఒప్పుకొనినది, తనను మనుష్యకుమారునిగా గుర్తించుకొని, తాను అధికారముతో వచ్చుననుటను గూర్చి మనకు నిర్వివాదమైన సాక్ష్యమునిచ్చుచున్నది.”
b ది వాచ్‌టవర్ మే 1, 1982, ఏప్రిల్ 1,1984 సంచికలను చూడుము.
[8వ పేజీలోని బాక్సు]
“యేసు బోధయొక్క ముఖ్యాంశము”
“దేవునిరాజ్యము యొక్క అంశము యేసు బోధలో కేంద్రస్థానము వహించెను”—న్యూ కేథలిక్ ఎన్‌సైక్లొపీడియా.
“[దేవుని రాజ్యము] సాధారణముగా యేసు బోధయొక్క ముఖ్యాంశముగా ఎంచబడెను.”—ఎన్‌సైక్లొపీడియా బ్రిటానికా.
మీ చర్చిలో యేసుబోధయొక్క ముఖ్యాంశము చర్చించబడుటను మీరు విన్న చివరిసారి ఎప్పుడు?
[9వ పేజీలోని బాక్సు]
దేవునిరాజ్యమునుగూర్చిన గలిబిలి
“భూమిమీద నున్న చర్చియే” దేవుని రాజ్యమని కొందరు తలంచియున్నారు. ప్రస్తుత లోకము “ఒక రాజ్యముగా తయారయ్యేంతవరకు క్రైస్తవ ప్రభావము క్రింద వృద్ధిచెందునని” మరి కొందరు నమ్మియున్నారు. ఇంకొందరు దేవుని రాజ్యమనగా “వ్యక్తియొక్క హృదయములోను జీవితములోను దేవుని పరిపాలన” అని చెప్పుదురు.
అయితే దేవునిరాజ్యమనగా పూర్తిగా—మతవిధానము, క్రమీణజరుగు రాజకీయమార్పు, లేక ప్రజల హృదయములలోని ఆత్మీయ స్థితియేనా?