దేవుని రాజ్యముక్రింద భూమియొక్క దివ్యమైన భవిష్యత్తు
బైబిలు: “విశ్వాసమనునది నిరీక్షింపబడువాటియొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునైయున్నది” అని చెప్పుచున్నది. (హెబ్రీయులు 11:1) ముందటి శీర్షికలో మనము చూచినట్లు క్రీస్తు పుట్టుకకు 500 సంవత్సరములకు పూర్వమే దానియేలు దినములనుండి మనదినములవరకు వచ్చు ప్రపంచ ఆధిపత్యముల పుట్టుక మరియు పతనములను గూర్చిన ముందృష్టి దానియేలు గ్రంథములో వ్రాయబడులాగున దేవుడు ప్రేరేపించెను. ఈ ప్రవచనముల సత్యత్వము దానియేలు గ్రంథములోని ఇతరప్రవచనములును నెరవేరునని మరియు బహుత్వరలో క్రీస్తుద్వారా దేవుని రాజ్యము మానవ ప్రభుత్వముల స్థానములో వచ్చునని విశ్వసించుటకు బలమైన కారణమునిచ్చుచున్నవి.
మానవజాతికి అది ఎంతటి మార్పైయుండును! ఆ కాలమువైపు చూచుచు దేవుడే యిలా అనుచున్నాడు: “ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను”. (ప్రకటన 21:5) ఆ “నూతన”కాలమునుగూర్చి ఒక చిత్రమును చూపించునట్టి ప్రేరేపిత ప్రవచనముల పరిశీలన, మనము ప్రస్తుతముచూచు మానవపరిపాలనలకు ఎంత పూర్తి విభిన్నముగా అది యుండునో చూచుటకు మనకు సహాయపడును. నిజముగా, భూమియొక్క భవిష్యత్తు, అందులోని జీవితమును గూర్చి బైబిలు చెప్పునది ఎంతమాత్రము తక్కువ ఆశ్చర్యము కలిగించునది కాదు. పరిశీలించుము:
నేరము మరియు బలత్కారము అంతమగును. “కీడుచేయు వారు నిర్మూలమగుదురు, . . .భక్తిహీనులు లేక పోవుదురు.” అందులోజీవించువారు “ఎవరి భయములేకుండ ప్రతివాడును తన ద్రాక్షచెట్టుక్రిందను తన అంజూరపు చెట్టుక్రిందను కూర్చుండును; సైన్యములకధిపతియగు యెహోవా మాటయిచ్చియున్నాడు.”—కీర్తన 37:9, 10; మీకా 4:4.
జాతి మరియు తెగల బేధములు, వాటివలన కలుగు యుద్ధములు ఇక ఉండవు. “జనము మీదికి జనము ఖడ్గమెత్తక యుండును, యుద్ధము చేయ నేర్చుకొనుట ఇక మానివేయును.”—యెషయా 2:4
ఇండ్లకొరత, యిండ్లు లేనిపరిస్థితి, మరియు నిరుద్యోగము గతించిన సంగతులైయుండును. యెషయా యిలా ప్రవచించెను: “జనులు ఇండ్లుకట్టుకొని వాటిలో కాపురముందురు. ద్రాక్షతోటలు నాటించుకొని వాటి ఫలముల ననుభవింతురు. . . .వారు వృధాగా ప్రయాసపడరు.”—యెషయా 65:21, 22.
భయంకరమైన కరవులు అనగా ఇటీవల ఆఫ్రికాయందలి కొన్నిభాగములలో సోకినలాంటి వాటి స్థానములో అందరికి విస్తారమైన ఆహారముండును. “దేశములోను పర్వత శిఖరములమీదను సస్య సమృద్ధికలుగును.” “భూమి దాని ఫలములిచ్చును. దేవుడు మా దేవుడు మమ్మును ఆశీర్వదించును.”—కీర్తన 72:16; 67:6, 7.
వీటికితోడుగా, ఆ ఆశీర్వాదములను అనుభవించుటకు ఆరోగ్యము జీవము ఉండును. యేసు యొక్క భూపరిచర్యకాలములో కూడ నిజముగా యిట్లు చెప్పబడినది, “గ్రుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు.” ఏమైనను అంతకన్న ఎక్కువైన వాగ్ధానము అమలులోకి వచ్చును: “ఆయన (దేవుడు) వారికన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయెను.”—లూకా 7:22; ప్రకటన 21:4.
ఎంతటి మహత్తరమైన మార్పు! కృంగియున్న మానవజాతికి ఎంతటి విశ్రాంతిని కలుగజేయును! ప్రపంచ పరిపాలనలో జరుగునట్టి అట్టి యుగ మార్పునుండి కలుగుప్రయోజనములను మీరు పొందులాగున, ఇప్పుడును మిమ్మును మీరు దేవుని రాజ్యమునకు లోపరచుకొనుమని మేము ప్రోత్సహించుచున్నాము. (w88 6⁄15)
[11వ పేజీలోని చిత్రాలు]
ఇప్పుడు నివసించుప్రజలు అద్భుతకర ఆశీర్వాదములైన—యుద్ధము, నేరము, దారిద్ర్యము, వ్యాధి, చివరకు మరణపు అంతమును చూచుటకు ఎదురుచూడవచ్చును. అట్టి భవిష్యత్తును నీవు అనుభవింతువా?