NASA ఫోటో
అప్రమత్తంగా ఉండండి!
భూమంతటినీ ఏలే నిలకడైన ప్రభుత్వం వస్తుందా?—బైబిలు ఏం చెప్తుంది?
ప్రపంచంలో ఎటు చూసినా ప్రభుత్వాలకు కష్టాల సుడిగుండమే. చూడ్డానికి నిలకడగానే ఉన్న దేశాల్లో కూడా రాజకీయ నాయకుల చీకటి కోణాలు, ఒక కొలిక్కిరాని ఎన్నికల ఫలితాలు, రాజకీయ విభజనలు, జనం చేసే ధర్నాలు ప్రభుత్వాల్ని కూర్చోనివ్వట్లేదు-నుంచోనివ్వట్లేదు.
కానీ ఒక్క ప్రభుత్వం మాత్రం నిలకడగా ఉంటుందని బైబిలు చెప్తుంది. ఆ ప్రభుత్వం గురించి మీరు ఈపాటికే వినుంటారు. అది, యేసుక్రీస్తు నేర్పించిన ఒక ప్రార్థనలో ఉంది.
“మీరు ఈ విధంగా ప్రార్థించాలి: ‘పరలోకంలో ఉన్న మా తండ్రీ, నీ పేరు పవిత్రపర్చబడాలి. నీ రాజ్యం రావాలి. నీ ఇష్టం పరలోకంలోలాగే భూమ్మీద కూడా నెరవేరాలి.’”—మత్తయి 6:9, 10.
ఆ రాజ్యం గురించి బైబిలు ఏం చెప్తుంది?
ఆ రాజ్యం—ఒక స్థిరమైన ప్రభుత్వం
ఆ రాజ్యం పరలోకం నుండి పరిపాలిస్తుంది.
యేసు ఆ ప్రభుత్వాన్ని “పరలోక రాజ్యం” అని పిలిచాడు. (మత్తయి 4:17; 5:3, 10, 19, 20) అందుకే ఆయన ఇలా అన్నాడు: “నా రాజ్యం ఈ లోకానికి సంబంధించినది కాదు.”—యోహాను 18:36.
ఆ రాజ్యం మనుషుల ప్రభుత్వాల్ని తీసేస్తుంది.
బైబిలు ఇలా చెప్తుంది: “ఆ రాజ్యం ... [మనుషుల] రాజ్యాలన్నిటినీ నలగ్గొట్టి నాశనం చేస్తుంది, అదొక్కటే ఎప్పటికీ నిలుస్తుంది.”—దానియేలు 2:44.
ఆ రాజ్యం ఎప్పటికీ నాశనం కాదు, దాని రాజు యేసుక్రీస్తు.
బైబిలు ఇలా చెప్తుంది: “ఆయన పరిపాలన శాశ్వతంగా ఉంటుంది, అది ఎప్పటికీ అంతం కాదు; ఆయన రాజ్యం ఎప్పటికీ నాశనం కాదు.”—దానియేలు 7:13, 14.
ఆ రాజ్యం భూమిని శాంతిభద్రతలకు నిలయంగా చేస్తుంది.
బైబిలు ఇలా చెప్తుంది: ‘ప్రతివాడు తన ద్రాక్షల నడుమ, అత్తిచెట్ల నడుమ సురక్షితంగా జీవిస్తాడు. అతడిని ఎవడు భయపెట్టడు.’—మీకా 4:4, పవిత్ర గ్రంథము, కతోలిక అనువాదము.
ఆ రాజ్యం గురించి ఎక్కువ తెలుసుకోండి
యేసు భూమ్మీద ఉన్నప్పుడు, ఎక్కువ సమయం “రాజ్యం గురించిన మంచివార్త ప్రకటిస్తూ” గడిపాడు. (మత్తయి 9:35) ఆయన ఇంకా ఇలా చెప్పాడు:
“అన్నిదేశాల ప్రజలకు సాక్ష్యంగా ఉండేలా, ఈ రాజ్య సువార్త భూమంతటా ప్రకటించబడుతుంది. ఆ తర్వాత అంతం వస్తుంది.”—మత్తయి 24:14.
ప్రస్తుతం, ఆ రాజ్యం గురించిన మంచివార్త 240 కన్నా ఎక్కువ దేశాల్లో, ప్రాంతాల్లో మారుమోగుతోంది. ఆ ప్రభుత్వం గురించి, దానివల్ల మీకొచ్చే ప్రయోజనాల గురించి తెలుసుకోమని ఆహ్వానిస్తున్నాం.
దయచేసి దేవుని రాజ్యం అంటే ఏమిటి? వీడియో చూడండి.