ప్రపంచ మహాధిపత్యముల దీర్ఘకాల ప్రభావము అంతమగుటకు సమీపించినది
ప్రపంచ చరిత్రలో వేలాది సంవత్సరముల కాలములో ఒకదానివెంట మరొకటిగావచ్చు ఏడుప్రపంచ మహాధిపత్యములు—బలమైన సామ్రాజ్యములనుగూర్చి బైబిలు చెప్పుచున్నది. ఈ వరుసలో క్రితము ప్రచురించిన శీర్షికలు మనము వీటిలోని చివరిదియైన—మన కాలమందలి ఆంగ్లొ-అమెరికా ప్రపంచ ఆధిపత్యముయొక్క కాలమందు జీవించుచున్నామని చూపించినవి.a—ప్రకటన 17:9, 10.
ఇదే ఆంగ్లొ-అమెరికా ప్రపంచ ఆధిపత్యము ప్రకటన గ్రంథములో అంతకుముందే “రెండు కొమ్ములు”గల క్రూరమృగముగా వర్ణింపబడినది. రెండు భాగములుగల ఈ ప్రపంచ ఆధిపత్యము, ఈ ఏడు ప్రపంచ ఆధిపత్యములకు ప్రాతినిధ్యము వహించు రాజకీయ క్రూరమృగమునకు “ఒక ప్రతిమను చేయవలెనని భూనివాసులకు చెప్పుచున్నది.”—ప్రకటన 13:11, 14.
ఈ ప్రవచనములు ఎట్లు నెరవేరినవి, మరియు అవి ఈనాడు మనకు ఏ భావమును కలిగియున్నవి? దానికి ఆసక్తిదాయకమైన జవాబే ఈ క్రింది శీర్షిక ముఖ్యాంశమైయున్నది.
మొదటిప్రపంచ యుద్ధము యొక్క నాలుగు సంవత్సరముల భీభత్సము ముగియుచున్నప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ వుడ్రోవిల్సన్ బ్రిటిష్ ప్రధానమంత్రి డేవిడ్ లియోద్ జార్జి కలిసి నానాజాతిసమితిని ప్రతిపాదించిరి. దాని గురి యేమనగా “అంతర్జాతీయ శాంతిభద్రతలను సాధించి” అట్టి యుద్ధభీతి ఎప్పటికిని తిరిగి కలుగకుండ కాపాడుట.
ఈ విషయమందు ముందు చొరవను తీసుకున్నవారెవరో గమనించుట ఆసక్తికరమైన విషయము. ఈ ఇద్దరు నాయకులును బైబిలు చరిత్రలోని ఏడవప్రపంచ ఆధిపత్యమగు ఆంగ్లభాష మాటాడు ఆంగ్లో-అమెరికన్ ప్రపంచ ఆధిపత్యపు రెండు భాగముల అధిపతులైయున్నారు. ఇది మరియు అంతర్జాతీయ శాంతిభద్రతల సంస్థను గూర్చిన యితర సత్యములు మన దినములలో లేచి నాశనమునకు పోవు కొద్దిదినములుండు “యెనిమిదవ రాజు”ను గూర్చి బైబిలు పుస్తకమగు ప్రకటన గ్రంథము చెప్పిన దానికి, అద్భుతరీతిలో సరిపోయి యున్నవి. వీటిలోని కొన్ని ఆసక్తికర సమాంతరము లేమి?—ప్రకటన 17:11
ప్రకటన గ్రంథము లోని ప్రవచనము “గొర్రెపిల్లవంటి రెండుకొమ్ములు” గల “క్రూరమృగము”, బైబిలు చరిత్రలోని ఏడు ప్రపంచ ఆధిపత్యములచే నడపబడిన కృరమృగమునకు ఒక “ప్రతిమను చేయవలెనని భూనివాసులతో” చెప్పునని బయలుపరచు చున్నది.
ఖచ్చితముగా, ఆంగ్లొ-అమెరికన్ ప్రపంచ ఆధిపత్యము ఈ పనినే చేసినది. గొప్ప ప్రభుత్వములవలె కనిపించి వాటివలె ప్రవర్తించిన సమితిని ఏర్పరచునట్లు అది “భూనివాసులను” బలవంతపెట్టినది. అయితే నిజమునకు “క్రూరమృగమునకు” అది “ఒక ప్రతిమ” మాత్రమే. కేవలము దాని సభ్యదేశములు యిచ్చిన అధికారము తప్ప, దానికి స్వంతగా అధికారములేదు. మరియు గత ప్రపంచ ఆధిపత్యములలాగా, కొంత సైనిక జయముతో అధికారమునకు వచ్చుచున్నట్లు అది వర్ణింపబడలేదు. బదులుగా ఏడు ప్రపంచ ఆధిపత్యములనుండియే అది పుట్టుకొస్తుంది. దాని ఉనికికి ఒక్క ఏడవదియేగాక, ముందటి ఆరింటియొక్క శేషభాగములును కారణమైయున్నవి. అయితే ఈ రాజకీయ ప్రతిమ దాని స్థాపకులు నిరీక్షించిన ఉన్నతగురులను చేరునా?—ప్రకటన 17:11, 14.
సమితి విఫలత
నానాజాతిసమితి సాంఘిక రంగాలలో అనేక విషయములను సాధించినది. అయితే దానియొక్క “నానాజాతిసమితి నిబంధనలో”వ్యక్తపరచబడినట్లు దానినిజమైన గురియేమనగా: “అంతర్జాతీయ సహకారమును పెంపొందింపజేసి, అంతర్జాతీయ శాంతిభద్రతలను సాధించుట.” అయితే యిందులోనే అది విఫలమైనది.
1931లో జపానును మంచూరియాలో ప్రవేశించకుండ నిలుపుటలో సమితి విజయము సాధించలేకపోయినది. 1933లో బొలీవియా మరియు పెరాగ్వే యుద్ధమును ఆపలేదు. 1936లో ముస్సోలిని ఇథియోపియాను జయించకుండా ఆపుచేయుటలో విఫలమైనది. ఏమైనను 1939 సెప్టెంబరు1న, చెలరేగిన రెండవ ప్రపంచయుద్ధపు సమూలనాశనము, వేదనను ఆపుచేయుటలో తప్పిపోవుటతో సమితికి చావు దెబ్బతగిలినది. ఆ యుద్ధమునకు ఎందరు బలియైరి? 1కోటి 60లక్షలమంది సైనికులు, 3కోట్ల 90లక్షలమంది సాధారణ పౌరులతో మొత్తము మృతులసంఖ్య 5కోట్ల 50లక్షలకు చేరెను. ఇది మొదటి ప్రపంచయుద్ధపు మృతుల సంఖ్యకు నాలుగు రెట్లు ఎక్కువ.
ఏమైనను, మానవప్రయత్నములద్వారా శాంతి రాలేదు గనుక, సమితి నిబంధన పనిలోకి రాకముందే 1919లో యెహోవాసాక్షులు (అప్పుడు బైబిలు విద్యార్థులు) సమితి తప్పక విఫలము కావలయునని ప్రకటించిరి. తరువాత 1926లో ఇంగ్లాండునందలి లండనులో జరిగిన సమావేశమునందు ప్రకటన 17ప్రకారము ప్రపంచ ఆధిపత్యముల వరుసలో ఆఖరిదిగా “యెనిమిదవ రాజు” ప్రత్యక్షమగునని సూచించబడెను. “దాని పుట్టుకను, కొద్దికాల ఉనికిని, దాని చిరకాల అంతమును ప్రభువు ప్రవచించె” ననియు ప్రసంగీకుడు సూచించెను.
అది తిరిగి వచ్చును
ఈ యెనిమిదవ రాజును గూర్చి ప్రేరేపిత ప్రవచనము యిలా చెప్పినది: “నీవు చూచిన ఆ మృగము ఉండెను గాని యిప్పుడు లేదు; అయితే అది అగాధజలములోనుండి పైకి వచ్చుటకును నాశనమునకు పోవుటకును సిద్ధముగా యున్నది.”—ప్రకటన 17:8.
యుద్ధకాల మధ్యసంవత్సరమైన 1942నుండి, అప్పటికి నిద్రావస్థ స్థితిలోయున్న శాంతిభద్రతల సంస్థ తన కార్యరహిత అగాధమునుండి పైకి లేచునని యెహోవాసాక్షులు గుర్తించిరి. ఆ సంవత్సరమున వాచ్‌టవర్ సొసైటి ప్రెసిడెంటు యిలా చెప్పెను: “సమితీని హత్తుకొనుచున్నామని నలభైదేశములు యిప్పటికిని అనుచున్నను, సమితి జీవము కోల్పోయిన స్థితిలో యున్నది. . .‘యిప్పుడులేదు.’” అయితే అది “అగాధము నుండి” “పైకి లేచునా”? ఈ బైబిలు ప్రవచనముపై తన మాటలను ఆధారము చేసికొని, “ప్రపంచదేశముల ఈ కూటమి మరలా లేచునని” ఆయన ప్రకటించెను.
ప్రవచనము చెప్పినట్లే, ఈ యెనిమిదవ రాజు 1920 నుండి 1939 వరకు “ఉండెను.” 1939 నుండి 1945లో రెండవ ప్రపంచ యుద్ధము ముగియువరకు ‘అది లేదు’. ఆ తరువాత తిరిగి పనికి లేచిన నానాజాతిసమితి వారసురాలిగా, ఐక్యరాజ్యసమితియై “అగాధమునుండి పైకిలేచెను.”
ఉన్నత నిరీక్షణలు నెరవేరక పోయెను
1945, జూన్ 26న, ఐక్యరాజ్యసమితి అధికారిక పత్రముపై 50దేశముల ప్రతినిధులు సంతకము చేసిరి. ఆ పత్రము యొక్క తొలి మాటలు యిలా ప్రారంభమైనవి: “మన జీవితకాలములో రెండుసార్లు చెప్పజాలనంత దుఃఖమును తెచ్చిన యుద్ధవాతనుండి రాబోవుతరములను కాపాడుటకు, ఐక్యరాజ్యసమితిలో సభ్యులమైన మేము తీర్మానించుకొని యున్నాము. . . ”
ఐక్యరాజ్యసమితిపైన నిలిపిన నిరీక్షణలు వాస్తవికతకు అతీతముగా వెళ్లినవి. యు.యస్. ప్రభుత్వ మాజీ సెక్రటరి కార్డెల్హల్ “మన నాగరికతకు రక్షణ” కీలకమును అదియే కలిగి యున్నదని అనెను. యు.యస్. ప్రెసిడెంటు హారి ట్రుమన్ “దేవుని నడిపింపు క్రింద శాశ్వత శాంతిని స్థాపించుటకు ఒక ఉన్నతావకాశమని” దానిని పిలిచెను. ఐక్యరాజ్యసమితియొక్క అధికారిక పత్రము “మానవునిచే సృష్టించబడిన పత్రములన్నిటిలోకెల్లా ఎంతో సమయానుగుణ్యమైన పత్రముగాను” “నాగరికత చరిత్రలో ఒక మలుపుగాను” పిలువబడెను. నలభై సంవత్సరముల తర్వాత, యు.యస్. ప్రభుత్వ విభాగపు గ్రెగరి జె. నేవెల్ యిలా అన్నారు: “దాని ఉద్దేశ్యము అతిగా ఊహించబడినది: నిరుత్సాహము తప్పదు.”
నానాజాతిసమితివలెనె, ఐక్యరాజ్యసమితియు సాంఘిక రంగాలలో ఎంతో సాధించినది. అయితే శాంతిని కాపాడుటనే గాని లేక యుద్ధమును ఆపుటనేగాని చేయలేదు. 1962లో బ్రిటీష్ హౌస్ ఆఫ్ కామన్స్‌తో బ్రిటను మాజి ప్రధానమంత్రియైన హారాల్డ్ మాక్మిలన్ యిలా చెప్పెను: “ఐక్యరాజ్యసమితి నిర్మింపబడిన పునాదియంతయు బిగువులేనిదాయెను.”
మొట్టమొదట అనేకులు ఈ సంస్థను మతసంబంధమైన భావముతో దృష్టించిరి. దేవునిరాజ్యమే చేయగలదని బైబిలు చెప్తున్న: శాశ్వత శాంతిస్థాపన, న్యాయము, నిజముగా ఐక్యపరచబడిన లోకమును ఈ “ప్రతిమ” తేగలదని అనేకులు విశ్వసించిరి. నిజమైన శాంతికి మూలము మానవ ప్రయత్నములు కావని చూపిన బైబిలు ప్రవచనములను వారు దృఢముగా ఎదిరించిరి. ఏమైనను ఐక్యరాజ్యసమితీకి 40సంవత్సరములు వచ్చాక, చరిత్రకారుడైన థామస్ యం. ఫ్రాంక్ యిలా అనెను: “1945లో మనము నిరీక్షించినదానికన్న అది ఎంతో తక్కువ ఫలభరితంగా ఉన్నది. . . .” యు.యస్. ప్రభుత్వ సెక్రటరి వ్యాఖ్యానించినట్లు: “ఐక్యరాజ్యసమితి పుట్టుక ఎంతమాత్రము ప్రపంచమును పరదైసుగా మార్చలేదు.”
శాంతికి నిజమైన అవరోధములైన: జాతీయత, ధనము యెడల పేరాశ, దారిద్ర్యము, వర్ణాభిమానము, నిరంకుశప్రభుత్వవిధానము, లోకముపైన సాతాను ప్రభావములను మానవ ప్రభుత్వములు తీసివేయలేదు గనుక ఐక్యరాజ్యసమితి విజయము సాధించలేక పోయినది. భవిష్యత్తు ఏదో తేటగాయున్నందున కాక, వేరే శ్రేష్టమైన నిరీక్షణ ఏదియు లేనందున ప్రజలు ఈ ప్రభుత్వములను హత్తుకొనియున్నారు.—ప్రకటన 12:12.
ఐక్యరాజ్యసమితియొక్క ఉనికి, మరియు దానియందు ప్రజలు చేసిన ప్రయత్నములు, భూ ప్రజలు మార్పు యొక్క అవసరతను ఎంతగా గుర్తించియున్నారో చూపు చున్నది. ఆ మార్పు వస్తుంది, కాని అది ఒక భిన్నమైన మరియు ఎక్కువ ఫలవంతమైన విధముగా ఉండును. ఏ విధముగా?
శాశ్వత పరిపాలన
ఒకరివెంట యింకొకరుగా వచ్చు “రాజులు” లేక ప్రభుత్వ ఆధిపత్యములు ఏడేనని బైబిలు చెప్పుచున్నదని గుర్తుంచుకొనుము. దాని తర్వాత వచ్చుదానిగా ఏ పెద్ద ప్రభుత్వము చెప్పబడలేదు. చివరకు తాత్కాలికముగా వచ్చు “యెనిమిదవ రాజు. . . నాశనమునకు పోవుననియు” బైబిలు చెప్పుచున్నది.—ప్రకటన 17:10, 11.
అయితే బైబిలు మరి శ్రేష్టమైన నిరీక్షణున్నదనియు చెప్పుచున్నది. మానవులు దీనముగా ఎదురుచూచు శాంతి,న్యాయము, ఐక్యపరచబడిన లోకమును తెచ్చునది వేరొకటున్నదని అది వాగ్దానము చేయుచున్నది. “ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును. దానికెన్నటికిని నాశనము కలుగదు, .. . . .అది ముందు చెప్పిన [విఫలమగుచున్న మానవ] రాజ్యములన్నిటిని పగులగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగముల వరకు నిలుచును.”—దానియేలు 2:44.
ఈ పరిపాలనను గూర్చియే యేసు మాట్లాడెను. “నీ రాజ్యము వచ్చుగాక” అనినప్పుడు ఈ రాజ్యమును గూర్చియే ఆయన అనుచరులు ప్రార్ధించియున్నారు. (మత్తయి 6:10) ఈ రాజ్యము మనుష్యుల హృదయాలలో మంచినిమిత్తమై పనిచేయు ఏదో ఒక ప్రభావముకాదు. అది వాస్తవమైన పరలోకపరిపాలనయై, ఆత్మీయ సామ్రాజ్యమునుండి భూమిని పరిపాలించునదైయున్నది. అది భూమిపై మనము జీవించు విధానమును మార్చును. —ప్రకటన 21:1-4.
ఉత్సాహభరితమైన ఆ నూతన పరిపాలనను గూర్చి బైబిలు చెప్పుదానిని, అది పనిచేయువిధము, కలుగజేయు శాంతి, న్యాయము, ఐక్యపరచబడిన లోకమును గూర్చిన అంశము తదుపరిదియు, ఈ పరంపరలోని ఆఖరిదియునైన శీర్షికలో యుండును. (w88 6/1)
[అధస్సూచీలు]
a ఈ ప్రపంచ ఆధిపత్యములనుగూర్చి ఈ పత్రికయొక్క పూర్వసంచికలు చర్చించినవి: (1)ఐగుప్తు, మార్చి 1, 1989; (2)అష్షూరు, ఆగష్టు 1, 1989; (3)బబులోను, సెప్టెంబరు 1, 1989; (4)మాదీయ-పారసీక, అక్టోబరు 1, 1989; (5)గ్రీసు, నవంబరు 1, 1989; (6)రోము, డిశంబరు 1, 1989; (7)ఆంగ్లొ-అమెరికా ప్రపంచ ఆధిపత్యము, జనవరి 1, 1990.
[30వ పేజీలోని బాక్సు]
యుద్ధముయొక్క తీవ్రత
నానాజాతి సమితి పతనమునకు కారణమైన రెండవ ప్రపంచయుద్ధము అసాధారణరీతిలో ప్రాణాలను బలిగొనినది. 1940లో వివిధ దేశముల జనాబాతో సైనిక మృతుల నిష్పత్తినిచ్చుచు ఎన్‌సైక్లొపీడియా బ్రిటానికా (1954 సంచిక) మరణించినవారి విస్తారతను ఉదహరించుచున్నది. కొన్ని సంఖ్యలు ఇలా ఉన్నవి: అమెరికా సంయుక్త రాష్ట్రములలో దాని 1940 జనాబాలో ప్రతి 500 మందికి సైన్యములో యుద్ధమందు ఒకరు మరణించిరి; చైనాలో ప్రతి 200 మందిలో ఒకరు; యునైటెడ్ కింగ్డంలో ప్రతి 150 మందిలో ఒకరు; ఫ్రాన్సులో ప్రతి 200 మందిలో ఒకరు; జపానులో ప్రతి 46 మందిలో ఒకరు; జర్మనీలో ప్రతి 25 మందిలో ఒకరు; మరియు రష్యాలో ప్రతి 22 మందిలో ఒకరు చొప్పున మరణించిరి. సైనికుల నష్టముకంటే సామాన్య పౌరులలోని క్షతగాత్రుల సంఖ్య తరచుగా ఎక్కువగా యున్నదని మనము విచారించినప్పుడు, నిజమైన శాంతి, భద్రతలను తెచ్చుటలో మానవయత్నములు నిజముగా ఎట్లు విఫలమైనవో మనము నిస్సంకోచముగా చూడగలము
[31వ పేజీలోని చిత్రం]
‘ఐ.రా.స రూపొందించబడిన దగ్గరనుండి యుద్ధములలో రెండు కోట్లమంది చనిపోయిరి, ఇది దాని విఫలతను ధృవీకరించు దుఃఖకరమైన వాస్తవమైయున్నది.’—థామస్ ఎమ్. ఫ్రాంక్ వ్రాసిన, “నేషన్ ఎగెయినిస్ట్ నేషన్”