2
యెహోవాను సంతోషపెట్టాలనుకున్న రిబ్కా
రిబ్కా యెహోవాను ప్రేమించిన స్త్రీ. ఆమె భర్త పేరు ఇస్సాకు. ఈయన కూడా యెహోవాను ప్రేమించాడు. అసలు రిబ్కా, ఇస్సాకు ఎలా కలుసుకున్నారు? యెహోవాను సంతోషపెట్టాలనే కోరిక ఉందని రిబ్కా ఎలా చూపించింది? ఇప్పుడు ఆమె గురించి ఇంకా ఎక్కువ తెలుసుకుందాం.
ఇస్సాకువాళ్ల నాన్న అబ్రాహాము, అమ్మ శారా. వాళ్లు కనాను దేశంలో ఉండేవాళ్లు, అక్కడి ప్రజలు యెహోవాను ఆరాధించేవాళ్లు కాదు. కానీ అబ్రాహాము మాత్రం వాళ్ల అబ్బాయికి యెహోవాను ఆరాధించే అమ్మాయితోనే పెళ్లి చేయాలనుకున్నాడు. అందుకే, వాళ్ల బంధువులు ఉంటున్న హారానుకు వెళ్లి, తన కొడుకు కోసం ఒక మంచి అమ్మాయిని చూడమని సేవకుడిని పంపించాడు. ఈ సేవకుడు బహుశా ఎలీయెజెరు అయ్యుంటాడు.
ఒంటెలకు నీళ్లు పెట్టడానికి రిబ్కా సంతోషంగా కష్టపడి పనిచేసింది
ఎలీయెజెరు ఇంకొంతమంది సేవకులను వెంటబెట్టుకుని బయలుదేరాడు. వాళ్లు చాలా దూరం ప్రయాణించాలి. పది ఒంటెల మీద ఆహారం, కానుకలు పెట్టుకుని వాళ్లు ముందుకుసాగారు. మరి ఇస్సాకుకు సరైన జోడీ ఎవరో ఎలీయెజెరుకు ఎలా తెలుస్తుంది? ఎలీయెజెరు, అతనితో ఉన్నవాళ్లు హారానుకు చేరుకున్నప్పుడు అక్కడ ఓ బావి కనిపించింది. ఆ ఊరివాళ్లు ఎలాగూ నీళ్లు తోడుకోవడానికి అక్కడికి వస్తారు కాబట్టి అందరూ అక్కడ ఆగారు. ఎలీయెజెరు యెహోవాకు ప్రార్థిస్తూ ఇలా అన్నాడు: ‘నాకు నీళ్లు ఇమ్మని అడిగినప్పుడు ఏ అమ్మాయైతే నాకు, నా ఒంటెలకు కూడా నీళ్లు ఇస్తుందో తనే నువ్వు చూపించిన అమ్మాయని నేను అనుకుంటాను.’
అప్పుడు రిబ్కా అనే యువతి ఆ బావి దగ్గరకు వచ్చింది. ఆమె చాలా అందంగా ఉంటుందని బైబిలు చెబుతోంది. తాగడానికి నీళ్లు ఇమ్మని ఎలీయెజెరు ఆమెను అడిగాడు. దానికి ఆ అమ్మాయి, ‘ఓ తప్పకుండా ఇస్తాను, మీ ఒంటెలకు కూడా పట్టుకొస్తాను’ అంది. అమ్మబాబోయ్ ఒంటెలకు నీళ్లు పెట్టడమంటే మాటలా! బాగా దాహంతో ఉన్న ఒంటెలు బోలెడు నీళ్లు తాగేస్తాయి. అందుకే వాటికి కావల్సినన్ని నీళ్లు తోడుకొని రావడానికి రిబ్కా పరిగెత్తుకుంటూ చాలాసార్లు బావి దగ్గరకు వెళ్లాల్సివచ్చింది. ఒకసారి చిత్రం చూడండి, ఆమె ఎంత కష్టపడి పనిచేస్తోందో కదా?— యెహోవా తన ప్రార్థనకు జవాబిచ్చిన తీరు చూసి ఎలీయెజెరు ఎంతో ఆశ్చర్యపోయాడు.
ఎలీయెజెరు రిబ్కాకు ఎన్నో మంచిమంచి కానుకలు ఇచ్చాడు. ఆ అమ్మాయి ఎలీయెజెరును, మిగతా సేవకులను వాళ్లింటికి ఆహ్వానించింది. అబ్రాహాము తనని అక్కడకు ఎందుకు పంపించాడో, యెహోవా తన ప్రార్థనకు ఎలా జవాబిచ్చాడో రిబ్కా ఇంట్లోవాళ్లకు ఎలీయెజెరు వివరించాడు. రిబ్కాను ఇస్సాకుకు ఇచ్చి పెళ్లి చేయడానికి ఆమె ఇంట్లోవాళ్లు సంతోషంగా ఒప్పుకున్నారు.
రిబ్కా ఎలీయెజెరుతో కనానుకు వెళ్లింది, ఇస్సాకును పెళ్లిచేసుకుంది
ఇంతకీ ఇస్సాకును పెళ్లిచేసుకోవడం రిబ్కాకు ఇష్టమేనా?— ఎలీయెజెరును అక్కడకు యెహోవాయే పంపించాడని రిబ్కాకు తెలుసు. కనానుకు వెళ్లి ఇస్సాకును పెళ్లిచేసుకోవడం ఇష్టమేనా అని ఇంట్లోవాళ్లు అడిగినప్పుడు రిబ్కా, ‘నాకు ఇష్టమే, వెళ్తాను’ అంది. వెంటనే ఆమె ఎలీయెజెరుతో బయలుదేరింది. వాళ్లు కనానుకు వచ్చిన తర్వాత రిబ్కా ఇస్సాకును పెళ్లిచేసుకుంది.
యెహోవా అనుకున్నట్లే రిబ్కా చేసింది. అందుకే ఆయన ఆమెను దీవించాడు. చాలా సంవత్సరాల తర్వాత, యేసు ఆమె సంతానం నుండే వచ్చాడు! మీరు కూడా రిబ్కాలా ప్రవర్తిస్తూ యెహోవాను సంతోషపెడితే, ఆయన మిమ్మల్ని కూడా దీవిస్తాడు.
మీ బైబిల్లో చదవండి
ఆదికాండము 12:4, 5; 24:1-58, 67