కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w97 1/1 పేజీలు 30-31
  • ఇస్సాకు నిమిత్తం భార్యను వెదకడం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఇస్సాకు నిమిత్తం భార్యను వెదకడం
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఒక సవాలుతో కూడిన కార్యం
  • మన కొరకు పాఠాలు
  • యెహోవాను సంతోషపెట్టాలనుకున్న రిబ్కా
    చిన్నారుల కోసం బైబిలు పాఠాలు
  • “నాకిష్టమే నేను వెళ్తాను”
    కావలికోట: “నాకిష్టమే నేను వెళ్తాను”
  • ప్రార్థనా శక్తి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
  • రిబ్కా కష్టపడి పనిచేసే దైవభక్తిగల స్త్రీ
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2004
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
w97 1/1 పేజీలు 30-31

వారు యెహోవా చిత్తాన్ని చేశారు

ఇస్సాకు నిమిత్తం భార్యను వెదకడం

బావి వద్ద కూర్చున్న పెద్ద మనిషి బాగా అలసిపోయి ఉన్నాడు. అతను, అతని పరిచారకులు తమ పది ఒంటెలతోపాటు బెయేర్షెబా సరిహద్దుల నుండి బయల్దేరి ఉత్తర మెసపొతేమియ వరకు ప్రయాణించి వచ్చారు, అది 800 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం.a వారిప్పుడు తమ గమ్యాన్ని చేరుకున్నారు గనుక, అలసిపోయిన ఈ ప్రయాణికుడు తనకు అప్పగింపబడిన కార్యభారాన్ని గురించి ఆలోచించడం ప్రారంభిస్తాడు. ఈ వ్యక్తి ఎవరు, ఈ సుదీర్ఘ ప్రయాణాన్ని అతను ఎందుకు సాగించాడు?

ఆ వ్యక్తి అబ్రాహాము సేవకుడు, అతని ‘ఇంటి పెద్దదాసుడు.’ (ఆదికాండము 24:2) ఆ వృత్తాంతంలో అతని పేరు చెప్పబడకపోయినప్పటికీ, అతను బహుశ ఎలీయెజెరు అయివుంటాడు, అతని గూర్చి అబ్రాహాము ఒకసారి నాకు ‘వారసుడు’ అయ్యే అవకాశమున్న వాడు అని, నా ‘పరివారములోని ఒకడు’ అని అన్నాడు. (ఆదికాండము 15:2, 3) అయితే, అది అబ్రాహాము శారాలకు సంతానం లేనప్పటి విషయం. ఇప్పుడు వారి కుమారుడు ఇస్సాకుకు 40 సంవత్సరాలు వచ్చాయి, ఎలీయెజెరు ఇప్పుడు అబ్రాహాము ముఖ్య వారసుడు కాకపోయినప్పటికీ అతను ఇప్పటికీ అతని సేవకుడే. కాబట్టి అబ్రాహాము కష్టతరమైన కోరిక కోరితే అతను దాన్ని అంగీకరించాడు. అది ఏమిటి?

ఒక సవాలుతో కూడిన కార్యం

అబ్రాహాము కాలంలో వివాహమనేది కుటుంబాన్ని మాత్రమే కాక పూర్తి గోత్రాన్ని లేక సమాజాన్నంతటినీ ప్రభావితం చేసేది. కాబట్టి తలిదండ్రులు తమ పిల్లల కొరకు జతను ఎంపిక చేయడం అప్పుడు సాంప్రదాయంగా ఉండేది. అయితే, తన కుమారుడైన ఇస్సాకు కొరకు భార్యను వెదకడంలో అబ్రాహాము ఒక సమస్యను ఎదుర్కొన్నాడు. స్థానిక కనానీయులు భక్తిహీన మార్గాల్లో ఉన్నందున వారిలో ఒకరికిచ్చి వివాహం చేసే ప్రసక్తేలేదు. (ద్వితీయోపదేశకాండము 18:9-12) ఒక పురుషుడు తన స్వంత గోత్రంలోని ఒక అమ్మాయిని వివాహం చేసుకోవడం సాంప్రదాయబద్ధమైనప్పటికీ, అబ్రాహాము బంధువులు వందల కిలోమీటర్ల దూరాన ఉత్తర మెసపొతేమియలో నివసిస్తున్నారు. ఇస్సాకు తన నివాసాన్ని అక్కడికి మార్చుకునేందుకు ఆయన అనుమతించలేడు, ఎందుకంటే ‘నీ సంతానమునకు ఈ’ కనాను ‘దేశము నిచ్చెదను’ అని యెహోవా అబ్రాహాముకు వాగ్దానం చేశాడు. (ఆదికాండము 24:7) కావున, అబ్రాహాము ఎలీయెజెరుకు ఇలా చెప్పాడు: “నా స్వదేశమందున్న నా బంధువులయొద్దకు వెళ్లి ఇస్సాకను నా కుమారునికి భార్యను” తీసుకురావాలి.—ఆదికాండము 24:4.

ఆ సుదీర్ఘ ప్రయాణాన్ని ముగించి, ఎలీయెజెరు బావి ప్రక్కన కూర్చుని తాను నెరవేర్చవలసిన పనిని గురించి ఆలోచిస్తాడు. ఇక కొంతసేపటికి స్త్రీలు రాత్రి అవసరాల కొరకు నీళ్లు తీసుకెళ్లేందుకు బావివద్దకు వస్తారని అతను గుర్తించాడు. కాబట్టి అతను యెహోవాను ఇలా వేడుకుంటాడు: “నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగా—నీవు త్రాగుము నీ ఒంటెలకును నీళ్లు పెట్టెదనని యే చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకుకొరకు నీవు నియమించినదై యుండునుగాక, అందువలన నీవు నా యజమానునిమీద అనుగ్రహము చూపితివని తెలిసికొందు”ను.—ఆదికాండము 24:14.

అతను ఇంకా ప్రార్థిస్తుండగానే, రిబ్కా అనే పేరుగల ఒక ఆకర్షణీయమైన యౌవన స్త్రీ వస్తుంది. “నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను త్రాగనిమ్మని” ఎలీయెజెరు ఆమెతో అంటాడు. రిబ్కా నీళ్లు ఇస్తుంది, తర్వాత ఆమె ఇలా చెబుతుంది: “నీ ఒంటెలు త్రాగుమట్టుకు వాటికిని నీళ్లు చేదిపోయుదు”ను. దాహంతో ఉన్న ఒక ఒంటె కేవలం పది నిమిషాల్లోనే 95 లీటర్ల వరకు నీళ్లు త్రాగగలదు గనుక అది ఎంతో ఉదారమైన మాట. ఎలీయెజెరు ఒంటెలు అంత దాహంతో ఉన్నా లేక పోయినా, తాను చేస్తానన్న పని ఎంతో శ్రమతో కూడినదని రిబ్కాకు తెలిసే ఉంటుంది. వాస్తవానికి, ఆమె “త్వరగా గాడిలో తన కడవ కుమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి పరుగెత్తుకొనిపోయి అతని ఒంటెలన్నిటికి నీళ్లు చేదిపోసెను.”—ఆదికాండము 24:15-20.

యెహోవా నడిపింపును గ్రహించి ఎలీయెజెరు రిబ్కాకు బంగారు ముక్కు కమ్మిని రెండు బంగారు కడియములను ఇస్తాడు, నేటి విలువల ప్రకారం వాటి వెల 1,400 డాలర్లు. తాను అబ్రాహాము సహోదరుడైన నాహోరు మనుమరాలినని రిబ్కా అతనికి చెప్పినప్పుడు, ఎలీయెజెరు దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రార్థిస్తాడు. “యెహోవా నా యజమానుని బంధువుల యింటికి నన్ను నడిపించె”ను అని అతను అంటాడు. (ఆదికాండము 24:22-27) ఎలీయెజెరు రిబ్కా ఇంటికి వెళ్తాడు. కొంత కాలానికి, రిబ్కా ఇస్సాకుకు భార్య అవుతుంది, అలా ఆమె మెస్సీయయగు యేసుకు పూర్వికురాలయ్యే ఆధిక్యతను పొందుతుంది.

మన కొరకు పాఠాలు

ఇస్సాకు నిమిత్తం దైవభయంగల భార్యను వెదికేందుకు ఎలీయెజెరు ప్రార్థనాపూర్వకంగా చేసిన కృషిని యెహోవా ఆశీర్వదించాడు. ఇస్సాకు వివాహం, అబ్రాహాము ద్వారా సంతానాన్ని ఉత్పత్తి చేయాలన్న దేవుని సంకల్పంతో నేరుగా సంబంధాన్ని కలిగి ఉందనే విషయాన్ని జ్ఞాపకముంచుకోండి. కాబట్టి తమకు వివాహజత కావాలని ప్రార్థించే ప్రతి ఒక్కరికీ అద్భుతరీతిలో వారు లభిస్తారని భావించేందుకు ఈ వృత్తాంతం మనలను నడిపించకూడదు. అయినప్పటికీ, మనం యెహోవా సూత్రాలకు హత్తుకొని ఉంటే, జీవితంలోని ఏ పరిస్థితినందైనా, అది వివాహమే గాని అవివాహస్థితియే గాని దానిలో ఎదురయ్యే సవాళ్లను సహించడానికి ఆయన మనకు శక్తినిస్తాడు.—1 కొరింథీయులు 7:8, 9, 28; ఫిలిప్పీయులు 4:11-13 పోల్చండి.

యెహోవా చిత్తాన్నిబట్టి విషయాలను చేసేందుకు ఎలీయెజెరు ఎంతో కృషి చేయవలసి వచ్చింది. యెహోవా ప్రమాణాలకు సరితూగడం ఎల్లవేళలా సులభం కాదని మనం కూడా గ్రహించవచ్చు. ఉదాహరణకు, దైవపరిపాలనా కార్యాలను అణచివేయని ఉద్యోగాన్ని, దైవభయంగల వివాహజతను ప్రోత్సాహకరమైన సహవాసులను దిగజారిపోని వినోదాన్ని కనుగొనడం కష్టతరంగా ఉండవచ్చు. (మత్తయి 6:33; 1 కొరింథీయులు 7:39; 15:33; ఎఫెసీయులు 4:17-19) అయినప్పటికీ, బైబిలు సూత్రాలతో రాజీపడేందుకు నిరాకరించే వారిని యెహోవా ఆదుకోగలడు. బైబిలు ఇలా వాగ్దానం చేస్తుంది: “నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును.”—సామెతలు 3:5, 6.

[అధస్సూచీలు]

a ఒంటెల సాధారణ వేగాన్ని పరిగణిస్తే, ఈ ప్రయాణాన్ని ముగించేందుకు 25 దినాలకంటే ఎక్కువ సమయమే పట్టి ఉంటుంది.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి