వాళ్లలా విశ్వాసం చూపించండి | రిబ్కా
“నాకిష్టమే నేను వెళ్తాను”
రిబ్కా కొన్ని వారాలుగా ఒంటె మీద ప్రయాణిస్తూ వస్తుంది. ఆమె దాని మీద కూర్చుని ప్రయాణించడానికి ఈపాటికే అలవాటు పడి ఉంటుంది. తను పుట్టి పెరిగిన హారాను నుండి బయల్దేరి, ఇప్పుడు ఆమె వందల మైళ్ల దూరం వచ్చింది. బహుశా తన కుటుంబాన్ని ఆమె ఇక మళ్లీ ఎప్పుడూ కలవకపోవచ్చు. సాయంత్రం కావస్తోంది, తను వెళ్లాల్సిన చోటు దగ్గరపడుతోంది. ఇకమీదట తన జీవితం ఎలా ఉండబోతుంది అనే ఆలోచన ఆమెను వెంటాడుతోంది.
రిబ్కా, ఆమెతో ఉన్నవాళ్లు కనాను దేశంలో అడుగుపెట్టి, చాలా దూరం ప్రయాణించి నెగెబులోని బంజరు భూమి గుండా వెళ్తుండవచ్చు. (ఆదికాండం 24:62) రిబ్కాకు బహుశా అక్కడ గొర్రెలు కనిపించి ఉంటాయి. ఆ నేల పంటలు పండించి, వ్యవసాయం చేయడానికి అంత అనువైంది కాదు. కానీ జంతువులు మేత మేయడానికి సరిపడినంత గడ్డి పెరిగి ఉంటుంది. తనని వెంటబెట్టుకుని వస్తున్న పెద్దాయనకు ఆ ప్రాంతమంతా బాగా తెలుసు. ఇస్సాకుకు భార్యగా రిబ్కాను తెచ్చాను అనే శుభవార్తను, తన యజమానికి చెప్పాలని ఆయన ఆత్రంగా ఎదురుచూస్తున్నాడు. అయితే, రిబ్కా ఇస్సాకును ఇప్పటివరకు ఒక్కసారి కూడా చూడలేదు. ఆమె మనసులో ఎన్నో ప్రశ్నలు మెదులుతున్నాయి: ‘నాకు కాబోయే భర్త ఎలా ఉంటాడు? నేను తనకు నచ్చుతానా? తను నాకు నచ్చుతాడా? పెళ్లి తర్వాత ఇక్కడ నా జీవితం ఎలా ఉంటుంది?’
ఈరోజుల్లో, పెద్దలు కుదిర్చిన పెళ్లంటే చాలా దేశాల్లో వింతగా అనిపిస్తుంది. కొన్ని దేశాల్లో అలాంటి పెళ్లిళ్లు మామూలే. ఏదేమైనా, రిబ్కా జీవితం ఇప్పుడు ఒక పెద్ద మలుపు తిరగబోతుందని తెలుస్తుంది. రిబ్కా ధైర్యం, విశ్వాసం ఉన్న అమ్మాయి. మన జీవితంలో కూడా ఏమైనా మార్పులు వచ్చినప్పుడు ఆ లక్షణాలు ఎంతో అవసరం. రిబ్కాలో విశ్వాసంతో పాటు మరికొన్ని మంచి లక్షణాలు కూడా ఉన్నాయి; ఆ లక్షణాలు చాలా తక్కువమందిలో కనిపిస్తాయి.
‘నేను నీ ఒంటెల కోసం కూడా నీళ్లు చేదుకొస్తాను’
రిబ్కా నీళ్లు తోడుకోవడానికి రోజూ బావి దగ్గరికి వెళ్తూ ఉండేది. అయితే, ఈసారి అది తన జీవితాన్నే మార్చేస్తుందని అస్సలు ఊహించి ఉండదు. రిబ్కా మెసొపొతమియ ప్రాంతంలోని హారాను నగరంలో, లేదా ఆ దగ్గర్లో పెరిగి ఉంటుంది. అక్కడి వాళ్లంతా సిన్ అనే చంద్ర దేవున్ని ఆరాధించేవారు. కానీ, రిబ్కా తల్లిదండ్రులు మాత్రం యెహోవాను ఆరాధించారు.—ఆదికాండం 24:50.
రిబ్కా అందంగా, చూడచక్కగా ఉంటుంది. అందం ఒక్కటే కాదు, ఆమెలో ఇంకా ఎన్నో మంచి గుణాలు ఉన్నాయి. తను చాలా చలాకీగా, పద్ధతిగా ఉండే అమ్మాయి. వాళ్లది కాస్త డబ్బున్న కుటుంబం, వాళ్ల ఇంట్లో పని మనుషులు కూడా ఉండేవాళ్లు. అయినా, రిబ్కాను మరీ గారాబంగా, సుకుమారంగా పెంచలేదు; చిన్నప్పటి నుండే కష్టపడి పనిచేయడం నేర్పించారు. ఆ కాలంలోని స్త్రీలు రోజూ బావి దగ్గరికి వెళ్లి నీళ్లు తీసుకురావడం లాంటి కష్టమైన పనుల్ని చేసేవాళ్లు. రిబ్కా కూడా ప్రతీరోజు సాయంత్రం, భుజంపై కుండను పెట్టుకుని బావి దగ్గరికి వెళ్లి నీళ్లు తోడుకొని వచ్చేది.—ఆదికాండం 24:11, 15, 16.
ఒకరోజు సాయంత్రం, రిబ్కా తన కుండలో నీళ్లు నింపుకొని వెళ్తుంటే, ఒక పెద్దాయన ఆమె దగ్గరకు పరుగెత్తుకుంటూ వచ్చాడు. ఆయన చాలా మర్యాదగా ఆమెను ఇలా అడిగాడు: “దయచేసి, నేను తాగడానికి నీ కుండలో నుండి నాకు కొన్ని నీళ్లు ఇవ్వు.” ఆ పెద్దాయన చాలా దూరం ప్రయాణం చేసి వచ్చాడని రిబ్కాకు అర్థమైంది. కాబట్టి ఆమె వెంటనే తన కుండను భుజాల మీద నుండి దించి ఆయనకు తాగడానికి నీళ్లు ఇచ్చింది. ఆమె కేవలం గొంతు తడుపుకునేంత కాదుగానీ, చల్లని నీళ్లతో ఆయన దాహాన్ని తీర్చింది. అంతేకాదు, పక్కనే ఉన్న ఆయన పది ఒంటెలు మోకాళ్ల మీద కూర్చొని ఉండడం, నీళ్ల తొట్టిలో వాటికి నీళ్లు లేకపోవడం ఆమె గమనించింది. ఆ పెద్దాయన కళ్లు సహాయం కోసం తనవైపే చూస్తున్నట్టు రిబ్కాకు అనిపించింది. దాంతో తనకు చేతనైనంత సాయం చేయాలని ఆమె అనుకుంది. ఆమె ఇలా అంది: “నేను నీ ఒంటెల కోసం కూడా కావాల్సినన్ని నీళ్లు చేదుకొస్తాను.”—ఆదికాండం 24:17-19.
రిబ్కా ఒంటెలకు కూడా నీళ్లు పోస్తానని అన్నప్పుడు ఆమె కేవలం కొద్దిగా కాదుగానీ, వాటి దాహం తీరడానికి కావాల్సినన్ని నీళ్లు పెడతానని చెప్పింది. బాగా దాహంగా ఉన్న ఒక ఒంటె 95 లీటర్ల కంటే ఎక్కువ నీళ్లు తాగుతుంది! ఒకవేళ పది ఒంటెలు దాహంగా ఉండుంటే రిబ్కా చాలా గంటలు పనిచేయాల్సి వచ్చేది. కానీ, ఒంటెలు అంత దాహంగా లేవనే చెప్పవచ్చు.a మరి, ఒంటెలకు నీళ్లు పెడతానని మాటిచ్చినప్పుడు ఆ విషయం రిబ్కాకు తెలుసా? లేదు. ఆమె ఆ పనిని చేయడానికి ఇష్టంగా ముందుకొచ్చింది. ఎవరో తెలియని పెద్దాయనకు సాయం చేయడం కోసం ఎంత కష్టమైనా పడడానికి వెనుకాడలేదు. ఆమె చేస్తాను అనేసరికి ఆ పెద్దాయన కూడా కాదనలేకపోయాడు. రిబ్కా బావిలో నీళ్లు తోడుకొచ్చి తొట్టిలో పోస్తూ, మళ్లీ నీళ్లు తోడుకురావడానికి బావి దగ్గరకు వెళ్తూ-వస్తూ ఉంది. అలా ఆమె అటూ ఇటూ పరుగులు పెడుతుంటే ఆయన ఆమెను అలాగే గమనిస్తున్నాడు.—ఆదికాండం 24:20, 21.
రిబ్కా కష్టపడి పనిచేస్తుంది, ఆమెకు పెట్టే మనసు ఉంది
రిబ్కా మనందరికి చాలా మంచి ఆదర్శం ఉంచింది. నేడు ఎవరి స్వార్థం వాళ్లు చూసుకుంటున్న రోజుల్లో మనం జీవిస్తున్నాం. కష్టమని అనుకోకుండా వేరేవాళ్లకు సాయం చేసే బదులు, “తమను తాము ప్రేమించుకునేవాళ్లే” ఉంటారని బైబిలు ముందే చెప్పింది. (2 తిమోతి 3:1-5) క్రైస్తవులు అలాంటి స్వభావానికి దూరంగా ఉండాలి. అలా ఉండాలంటే, వేరేవాళ్లకు సాయం చేయడానికి ఇష్టంగా ముందుకొచ్చిన ఈ అమ్మాయిని చూసి నేర్చుకోవచ్చు.
ఆ పెద్దాయన తనను అలాగే గమనిస్తున్నాడనే విషయం రిబ్కాకు ఖచ్చితంగా అర్థమయ్యే ఉంటుంది. ఆయన చూపులో ఎలాంటి తప్పుడు ఉద్దేశం లేదు; బదులుగా రిబ్కా పనిచేయడం ఆయనకు చూడముచ్చటగా, ఆశ్చర్యంగా, ఆనందంగా అనిపించింది. అందుకే, రిబ్కా పనంతా అయిపోయాక ఆమెకు విలువైన కానుకలు ఇచ్చాడు! తర్వాత ఇలా అడిగాడు: “దయచేసి, నువ్వు ఎవరి కూతురివో చెప్పు. ఈ రాత్రి మేము ఉండడానికి మీ తండ్రి ఇంట్లో చోటు ఉందా?” ఆమె ఎవరి కూతురో చెప్పాక, ఆ పెద్దాయన ఆనందానికి అవధుల్లేవు. రిబ్కా ఉత్సాహంగా ఆయనతో ఇలా అంది: “మీరు ఈ రాత్రి ఉండడానికి స్థలం, మీ ఒంటెల కోసం గడ్డి, కావాల్సినంత మేత మా దగ్గర ఉన్నాయి.” ఆ పెద్దాయన్ని, ఆయనతోపాటు ఉన్నవాళ్లను రిబ్కా తన ఇంటికి ఆహ్వానించింది. రిబ్కా మనసు ఎంత మంచిదో కదా! తర్వాత ఈ విషయం వాళ్ల అమ్మకు చెప్పడానికి రిబ్కా పరుగెత్తుకుంటూ ఇంటికి వెళ్లింది.—ఆదికాండం 24:22-28, 32.
దీన్నిబట్టి, రిబ్కాకు పెట్టే మనసు ఉందని చెప్పవచ్చు. ఈ లక్షణం కూడా నేడు చాలామందిలో కనుమరుగైపోతుంది. రిబ్కాను అనుకరించడానికి ఇది ఇంకో కారణం. దేవుని మీద విశ్వాసం ఉంటే మనకు పెట్టే మనసు ఉంటుంది. యెహోవాది పెట్టే మనసు, ఆయన ఉదారంగా అందరికీ ఇస్తాడు. తనలాగే తన ఆరాధకులు కూడా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. మనకు తిరిగి ఇవ్వలేని వాళ్లకు కూడా పెడితే, మన పరలోక తండ్రి సంతోషిస్తాడు.—మత్తయి 5:44-46; 1 పేతురు 4:9.
‘నువ్వు నా కుమారుని కోసం భార్యను తీసుకురావాలి’
అసలు, ఆ బావి దగ్గర కలిసిన పెద్దాయన ఎవరు? ఆయన అబ్రాహాము సేవకుడు. అబ్రాహాము, అలాగే రిబ్కా వాళ్ల తాతయ్య ఇద్దరూ అన్నదమ్ములు అవుతారు. అందుకే, రిబ్కా తండ్రి బెతూయేలు ఆయన్ని సంతోషంగా ఇంట్లోకి ఆహ్వానించాడు. ఆ సేవకుని పేరు బహుశా ఎలీయెజెరు అయ్యుంటుంది.b రిబ్కా ఇంటివాళ్లు ఆయనకు భోజనం పెట్టినప్పుడు, తాను ఎందుకు వచ్చాడో చెప్పేంతవరకు ఆయన దాన్ని తినలేదు. (ఆదికాండం 24:31-33) తనకు అప్పగించబడిన ముఖ్యమైన పనిని పూర్తిచేయడానికి తన దేవుడైన యెహోవా ఎంత సహాయం చేశాడో ఆయన కళ్లారా చూశాడు. దాని గురించి ఆయన సంబరపడుతూ చెప్పడాన్ని మనం ఊహించుకోవచ్చు. ఇంతకీ, యెహోవా ఎలా సహాయం చేశాడు?
ఎలీయెజెరు చెప్తున్న విషయాల్ని రిబ్కా తండ్రి బెతూయేలు, అన్న లాబాను చెవులు రిక్కించి వినడాన్ని మీరు ఊహించుకోవచ్చు. కనానులో యెహోవా అబ్రాహామును ఎంతో ఆశీర్వదించాడని, అబ్రాహాము శారాలకు ఒక కొడుకును ఇచ్చాడని, వాళ్ల ఆస్తికి అతనే వారసుడని చెప్పాడు. అబ్రాహాము తన సేవకునికి చాలా ముఖ్యమైన బాధ్యత అప్పగించాడు. ఆ సేవకుడు హారానులో ఉన్న అబ్రాహాము బంధువుల దగ్గరకు వెళ్లి, ఇస్సాకు కోసం భార్యను తీసుకొని రావాలి.—ఆదికాండం 24:34-38.
కనానీయుల్లో నుండి ఇస్సాకుకు భార్యను తీసుకురాకూడదని అబ్రాహాము ఎలీయెజెరుతో ఒట్టు వేయించుకున్నాడు. ఎందుకు? ఎందుకంటే, కనానీయులు యెహోవాను ఆరాధించేవాళ్లు కాదు. వాళ్లు చేస్తున్న చెడ్డ పనులను బట్టి యెహోవా ఏదోకరోజు వాళ్లను శిక్షిస్తాడని అబ్రాహాముకు తెలుసు. కాబట్టి తప్పుడు పనులు చేసే అలాంటి వాళ్లతో సంబంధం కలుపుకోవడం అబ్రాహాముకు ఇష్టం లేదు. దేవుడు మాటిచ్చినవి నెరవేర్చడంలో తన కొడుకుకు ముఖ్యమైన పాత్ర ఉందని కూడా ఆయనకు తెలుసు.—ఆదికాండం 15:16; 17:19; 24:2-4.
హారానులో అడుగుపెట్టాక, బావి దగ్గర జరిగిన విషయాల్ని కూడా ఎలీయెజెరు రిబ్కా ఇంటివాళ్లకు చెప్పాడు. ఇస్సాకు కోసం ఒక మంచి అమ్మాయిని చూపించమని ఆయన యెహోవాకు ప్రార్థించాడు. కానీ తనెవరో ఆయనకు ఎలా తెలుస్తుంది? ఇస్సాకు పెళ్లి చేసుకునే అమ్మాయిని ఆ బావి దగ్గరకు రప్పించమని ఆయన దేవున్ని అడిగాడు. అంతేకాదు, నీళ్లు అడిగినప్పుడు కేవలం ఎలీయెజెరుకే కాదు ఒంటెలకు కూడా నీళ్లు పెడతాను అని ఆ అమ్మాయి అనాలి. (ఆదికాండం 24:12-14) మరి, ఆయన కోరుకుంది కోరుకున్నట్టుగా చేసిన అమ్మాయి ఎవరు? రిబ్కా! ఎలీయెజెరు చెప్పిన విషయాల్ని రిబ్కా విని ఉంటే, ఆమెకు ఎలా అనిపించి ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి!
ఎలీయెజెరు చెప్పిందంతా విని బెతూయేలు, లాబాను చాలా ఆశ్చర్యపోయారు. అందుకే ఇలా అన్నారు: “ఇది యెహోవా నుండి వచ్చింది.” అప్పటి సంప్రదాయానికి తగ్గట్టుగా వాళ్లు పెళ్లికి ఒప్పుకొని, రిబ్కాను ఇస్సాకుకు భార్యగా పంపిస్తామని మాటిచ్చారు. (ఆదికాండం 24:50-54) అంటే, ఇక రిబ్కా ఇష్టాయిష్టాలతో పనిలేదా?
ఆ విషయం గురించి, ఎలీయెజెరు హారానుకు బయల్దేరడానికి ముందే అబ్రాహామును కనుక్కున్నాడు. ఆయన ఇలా అడిగాడు: “ఒకవేళ ఆ అమ్మాయికి నాతో రావడం ఇష్టం లేకపోతే ఏమి చేయాలి?” అప్పుడు అబ్రాహాము ఇలా అన్నాడు: “నీ ఒట్టు నుండి నీకు విడుదల లభిస్తుంది.” (ఆదికాండం 24:39, 41) బెతూయేలు ఇంట్లో కూడా ఆ అమ్మాయి మాటకు విలువిస్తారు. ఇస్సాకుకు భార్య దొరికిందనే సంతోషంతో ఇంక ఉండబట్టలేక, తర్వాతి రోజు పొద్దున్నే రిబ్కాను తీసుకుని కనానుకు బయల్దేరతాను అని ఎలీయెజెరు అన్నాడు. కానీ వాళ్లు, కనీసం పది రోజులైనా వాళ్ల అమ్మాయిని వాళ్ల దగ్గర ఉంచుకోవాలని కోరుకున్నారు. చివరికి వాళ్లు ఇలా అనుకున్నారు: “అమ్మాయిని పిలిచి, ఆమె ఏమంటుందో అడిగి చూద్దాం.”—ఆదికాండం 24:57.
ఏ నిర్ణయం తీసుకోవాలో రిబ్కా చేతిలోనే ఉంది. ఇంతకీ ఆమె ఏమని జవాబిస్తుంది? అందర్నీ విడిచి దూరంగా వెళ్లడం కష్టం అని జాలిగా వాళ్ల నాన్న, అన్న వైపు చూస్తూ వాళ్ల దగ్గరే ఉండిపోవాలని అనుకుందా? లేదా ఇవన్నీ యెహోవాయే నడిపిస్తున్నాడని అర్థం చేసుకొని, అందులో భాగం వహించే గొప్ప అవకాశం తనకు కూడా దొరికిందని అనుకుందా? తను తీసుకోబోయే నిర్ణయం తన జీవితాన్నే మార్చేస్తుందని తెలిసినా, తన భయాలు తనకు ఉన్నా వాటన్నిటిని పక్కన పెట్టి రిబ్కా ఒక్కమాటలో ఇలా చెప్పింది: “నాకిష్టమే, నేను వెళ్తాను.”—ఆదికాండం 24:58.
ఎంత మంచి ఆదర్శమో కదా! పెళ్లి విషయంలో నేడు మన సంస్కృతులు, సంప్రదాయాలు వేర్వేరు కావచ్చు. అయినా, మనం రిబ్కా నుండి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. తన ఇష్టం కంటే దేవుని ఇష్టం చేయడమే ముఖ్యం అని రిబ్కా అనుకుంది. పెళ్లి విషయంలో, మన కాలానికి కూడా పనికొచ్చే చక్కని సలహాలు బైబిల్లో ఉన్నాయి. ఎవర్ని పెళ్లి చేసుకోవాలి, మంచి భర్తగా లేదా భార్యగా ఎలా ఉండాలి వంటి విషయాల్లో బైబిలు మనకు సహాయం చేస్తుంది. (2 కొరింథీయులు 6:14, 15; ఎఫెసీయులు 5:28-33) మనం కూడా రిబ్కాలాగే దేవుని ఇష్టం ఏంటో తెలుసుకొని అలా చేయడం చాలా మంచిది.
“మనల్ని కలవడానికి వస్తున్నది ఎవరు?”
బెతూయేలు కుటుంబం తమ కూతుర్ని ఆశీర్వదించి సాగనంపారు. రిబ్కాకు తోడుగా ఆమె దాది దెబోరాను, ఇంకా కొంతమంది సేవకుల్ని ఇచ్చి ఎలీయెజెరుతో పంపించారు. (ఆదికాండం 24:59-61; 35:8) కొద్దిసేపటికే, వాళ్లు హారానును విడిచి చాలా దూరం వెళ్లిపోయారు. వాళ్లు బహుశా మూడు వారాలు పాటు ప్రయాణించి, 800 కిలోమీటర్లు కంటే ఎక్కువ దూరం వచ్చారు. ఆ ప్రయాణం అంత తేలికేం కాదు. రిబ్కా తన జీవితంలో చాలా ఒంటెల్ని చూసే ఉంటుంది, కానీ వాటి మీద ప్రయాణించిన అనుభవం తనకు ఉందో లేదో మనకు తెలీదు. రిబ్కా కుటుంబం గొర్రెల్ని కాసేవాళ్లని బైబిలు చెప్తుంది గానీ, ఒంటెల మీద ప్రయాణించి వ్యాపారం చేసే వర్తకులని చెప్పట్లేదు. (ఆదికాండం 29:10) ఒంటెమీద కూర్చొని ప్రయాణించడం అలవాటు లేనివాళ్లు చెప్పే ఒక విషయం ఏంటంటే, కొద్దిసేపు దాని మీద కూర్చొని ప్రయాణించినా అది వాళ్లకు చాలా అసౌకర్యంగా ఉంటుందని అంటారు.
ఏదేమైనా, రిబ్కా మనసు మాత్రం ఇస్సాకు గురించి, అతని కుటుంబం గురించి ఎలీయెజెరు చెప్తున్న విషయాల మీదే ఉండి ఉంటుంది. సాయంత్రం పూట చలిమంట వేసుకొని కూర్చున్నప్పుడు, యెహోవా తన స్నేహితుడైన అబ్రాహాముకు ఇచ్చిన మాట గురించి ఆ పెద్దాయన రిబ్కాకు చెప్పడాన్ని మీరు ఊహించుకోవచ్చు. అబ్రాహాము నుంచి ఒక సంతానం రాబోతుందని, ఆ సంతానం ద్వారా భూమ్మీదున్న అన్నిదేశాల ప్రజలు దీవెనలు పొందుతారని ఆయన చెప్పి ఉంటాడు. తనకు కాబోయే భర్త ఇస్సాకు నుండి, తన నుండి యెహోవా ఇచ్చిన మాట నెరవేరబోతుందని రిబ్కా తెలుసుకున్నప్పుడు ఆమె ఎంత సంబరపడి ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి!—ఆదికాండం 22:15-18.
రిబ్కా వినయం చూపించింది, ఈ మంచి లక్షణం చాలా తక్కువమందిలో కనిపిస్తుంది
చివరికి, రిబ్కా ఇస్సాకును కలిసే రోజు రానే వచ్చింది. వాళ్లు ప్రయాణిస్తూ నెగెబు వరకు వచ్చారు. సాయంత్రం చీకటి పడుతుండగా, పొలంలో నడుస్తూ వస్తున్న ఒకతన్ని రిబ్కా చూసింది. అతను దేని గురించో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టు కనిపించాడు. “వెంటనే ఆమె ఒంటె మీద నుండి కిందికి దిగింది” అని మనం బైబిల్లో చదువుతాం. బహుశా, ఒంటె మోకాళ్ల మీద కూర్చునే వరకు ఆమె ఆగలేదు. తర్వాత రిబ్కా, “పొలంలో నుండి మనల్ని కలవడానికి వస్తున్నది ఎవరు?” అని ఆ పెద్దాయన్ని అడిగింది. అతను ఇస్సాకు అని తెలుసుకున్నప్పుడు ఆమె తలమీద ముసుగు వేసుకుంది. (ఆదికాండం 24:62-65) ఎందుకు? తనకు కాబోయే భర్త మీద గౌరవం ఉందని చూపించడానికి అలా చేసింది. ఈ రోజుల్లో, వినయంగా ఉంటూ గౌరవం చూపించడం కొంతమందికి పాతకాలం పద్ధతిలా అనిపించవచ్చు. కానీ మగవాళ్లయినా, ఆడవాళ్లయినా రిబ్కా నుండి ఎంతో నేర్చుకోవచ్చు. ఎందుకంటే, వినయం చూపించాల్సిన అవసరం మనందరికీ ఉంది.
దాదాపు 40 ఏళ్లున్న ఇస్సాకు తన తల్లి శారా విషయంలో దుఃఖిస్తున్నాడు. అప్పటికే శారా చనిపోయి దాదాపు మూడేళ్లు అయ్యింది. దీన్నిబట్టి ఇస్సాకు ఎంత బాగా ప్రేమిస్తాడో, అతని మనసు ఎంత సున్నితమైందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి వ్యక్తికి వినయం, కష్టపడే గుణం, పెట్టే మనసు ఉన్న అమ్మాయి దొరకడం ఎంత గొప్ప ఆశీర్వాదమో కదా! మరి వాళ్లిద్దరి మనసులు కలిశాయా? బైబిలు ఒక్కమాటలో ఇలా చెప్పింది: “అతను ఆమెను చాలా ప్రేమించాడు.”—ఆదికాండం 24:67; 26:8.
దాదాపు 4000 సంవత్సరాలు గడిచినా, ఇప్పటికి మనం కూడా రిబ్కాను చాలా ఇష్టపడతాం. ఆమె ధైర్యం, కష్టపడి పనిచేసే గుణం, పెట్టే మనసు, వినయం గురించి తెలుసుకున్నప్పుడు మనకు ఎంతో ముచ్చటేస్తుంది. పెద్దవాళ్లయినా-చిన్నవాళ్లయినా, స్త్రీలైనా-పురుషులైనా, పెళ్లైనా-పెళ్లికాకపోయినా అందరూ రిబ్కా లాంటి విశ్వాసాన్ని చూపించవచ్చు!
a అప్పటికే అది సాయంకాలం. రిబ్కా చాలా గంటలు బావి దగ్గరే ఉండిపోవాల్సి వచ్చిందని బైబిలు చెప్పట్లేదు. అలాగని, రిబ్కా ఇంకా బావి దగ్గరే ఏం చేస్తుందా అని వాళ్ల ఇంట్లోవాళ్లు ఆమెను వెతుక్కుంటూ వచ్చారని గానీ, రిబ్కా ఇంటికి వెళ్లేసరికి ఇంట్లోవాళ్లు నిద్రపోయారని గానీ బైబిలు చెప్పట్లేదు.
b ఆ సేవకుని పేరు ఎలీయెజెరు అని ఇక్కడ బైబిలు చెప్పకపోయినా, ఆయనే అయ్యుంటాడని మనం చెప్పవచ్చు. ఎందుకంటే, తనకు పిల్లలు లేని కారణంగా తన ఆస్తి అంతా ఎలీయెజెరుకు ఇవ్వాలని అబ్రాహాము ఒకసారి అనుకుంటాడు. కాబట్టి అబ్రాహాము సేవకుల్లో ఈ ఎలీయెజెరే వయసులో పెద్దవాడు, నమ్మకస్థుడు. ఈ సందర్భంలో కూడా, సేవకుడి గురించి మాట్లాడుతున్నప్పుడు అలాంటి వివరాల్నే చూడవచ్చు.—ఆదికాండం 15:2; 24:2-4.