కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • bt అధ్యా. 11 పేజీలు 85-92
  • ‘పవిత్రశక్తితో, సంతోషంతో నింపబడ్డారు’

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ‘పవిత్రశక్తితో, సంతోషంతో నింపబడ్డారు’
  • “దేవుని రాజ్యం గురించి పూర్తిస్థాయిలో” సాక్ష్యం ఇవ్వండి
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఒక పని కోసం వాళ్లను “ప్రత్యేకపర్చండి” (అపొ. 13:1-12)
  • “ప్రోత్సహించే మాట” (అపొ. 13:13-43)
  • “మేము అన్యజనుల దగ్గరికి వెళ్తున్నాం” (అపొ. 13:44-52)
  • బర్నబా—“ఆదరణ పుత్రుడు”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • క్రైస్తవ మిషనరీ సేవకు ప్రేరేపిత లేఖన మాదిరి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
  • “ఓదార్పు పుత్రుడు”
    ధైర్యం చూపిస్తూ దేవునితో నడవండి
  • యెహోవా ప్రజలు విశ్వాసమందు స్థిరపరచబడిరి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
మరిన్ని
“దేవుని రాజ్యం గురించి పూర్తిస్థాయిలో” సాక్ష్యం ఇవ్వండి
bt అధ్యా. 11 పేజీలు 85-92

అధ్యాయం 11

‘పవిత్రశక్తితో, సంతోషంతో నింపబడ్డారు’

ప్రజలు మంచివార్త విననప్పుడు పౌలు ఏం చేశాడు? మనం ఏం నేర్చుకోవచ్చు?

అపొస్తలుల కార్యాలు 13:1-52 ఆధారంగా

1, 2. బర్నబా, సౌలు మొదలుపెట్టబోతున్న ప్రయాణం ఎందుకు ప్రత్యేకమైనది? వాళ్లు చేయబోతున్న పని అపొస్తలుల కార్యాలు 1:8 లోని మాటల్ని ఎలా నెరవేరుస్తుంది?

అంతియొకయ సంఘానికి అది ఒక మర్చిపోలేని సంఘటన. మంచివార్తను సుదూర ప్రాంతాలకు తీసుకెళ్లడానికి ఆ సంఘంలోని ప్రవక్తలు, బోధకుల్లో నుండి దేవుడు తన పవిత్రశక్తి ద్వారా బర్నబాను, సౌలును ఎంచుకున్నాడు.a (అపొ. 13:1, 2) అంతకుముందు కూడా, ప్రకటనా పని కోసం కొంతమంది పంపబడ్డారు. అయితే వాళ్లు, అప్పటికే క్రైస్తవులు ఉన్న ప్రాంతాలకు పంపబడ్డారు. (అపొ. 8:14; 11:22) కానీ ఈసారి, మంచివార్త అస్సలు తెలియని ప్రజలు ఉండే ప్రాంతాలకు బర్నబా, సౌలు వెళ్లబోతున్నారు. వాళ్లకు సహాయం చేయడానికి మార్కు అనే పేరున్న యోహాను కూడా వాళ్లతో పాటు వెళ్తున్నాడు.

2 దాదాపు 14 సంవత్సరాల క్రితం, యేసు తన అనుచరులతో ఇలా అన్నాడు: “యెరూషలేములో, యూదయ అంతటిలో, సమరయలో, భూమంతటా మీరు నా గురించి సాక్ష్యమిస్తారు.” (అపొ. 1:8) బర్నబాను, సౌలును కొత్త ప్రాంతాలకు మిషనరీలుగా పంపించడం ద్వారా యేసు అన్న ఆ మాటలు నెరవేరడం మొదలైంది!b

ఒక పని కోసం వాళ్లను “ప్రత్యేకపర్చండి” (అపొ. 13:1-12)

3. మొదటి శతాబ్దంలో, ఎక్కువ దూరం ప్రయాణించడం ఎందుకు కష్టం?

3 ఈ రోజుల్లో కార్లు, విమానాలు లాంటివి ఉండడం వల్ల ఎంత దూరమైనా కొన్ని గంటల్లోనే వెళ్లిపోవచ్చు. కానీ క్రీస్తు శకం మొదటి శతాబ్దంలో ఇలాంటివేవీ లేవు. అప్పట్లో ఎక్కడికి వెళ్లాలన్నా ముఖ్యంగా నడుచుకుంటూనే వెళ్లాలి, అదికూడా ఎగుడుదిగుడు దారుల్లో. సాధారణంగా అలాంటి దారుల్లో ప్రయాణం అలసటగా ఉండేది, రోజుకు కేవలం 30 కిలోమీటర్ల దూరమే వెళ్లగలిగేవాళ్లు!c కాబట్టి తమ ప్రయాణం అంత తేలిగ్గా ఏమీ ఉండదని బర్నబాకు, సౌలుకు తెలుసు. వాళ్లు ఎంతో కష్టపడాలి, కొన్ని త్యాగాలు చేయాలి. అయినా, అవేవీ వాళ్ల ఉత్సాహాన్ని నీరుగార్చలేదు.—మత్త. 16:24.

రోడ్డు ప్రయాణం

అపొస్తలుల కాలంలో రోడ్డు ప్రయాణం చాలా సమయం తీసుకునేది, అంతేకాదు ఆ ప్రయాణం బాగా అలసటగా ఉండేది. చెప్పాలంటే, ఓడ ప్రయాణం కంటే రోడ్డు ప్రయాణానికే ఖర్చు ఎక్కువ. కానీ, చాలా ప్రాంతాలకు కాలి నడకన మాత్రమే వెళ్లగలిగేవాళ్లు.

ఒక వ్యక్తి రోజంతా నడిస్తే దాదాపు 30 కిలోమీటర్లే వెళ్లగలిగేవాడు. పైగా ఎండలో, వానలో, చలిలో ప్రయాణించాలి. అలాగే ఆ ప్రయాణంలో దొంగల చేతికి చిక్కే ప్రమాదం ఉంది. అందుకే, అపొస్తలుడైన పౌలు ‘నదుల్లో, దొంగల చేతుల్లో ప్రమాదాలు ఎదుర్కొన్నాను’ అని చెప్పాడు.—2 కొరిం. 11:26.

రోమా సామ్రాజ్యం అంతటా మంచి రోడ్లు ఉండేవి. ప్రయాణికులు రాత్రిపూట ఉండడానికి, కావాల్సినవి కొనుక్కోవడానికి వీలుగా ముఖ్య రహదారుల్లో దాదాపు ప్రతీ 30 కిలోమీటర్లకు లాడ్జీలు, హోటళ్లు, షాపులు ఉండేవి. సాధారణంగా అవి జనాలతో కిక్కిరిసిపోయి, చాలా మురికిగా ఉండేవని, అక్కడ బాగా పురుగులు ఉండేవని అప్పటి కాలంలోని రచయితలు రాశారు. అక్కడ ఎక్కువగా చెడ్డవాళ్లే ఉండేవాళ్లు. హోటల్‌ యజమానులు తరచూ ప్రయాణికుల్ని దోచుకునేవాళ్లు, అక్కడ వ్యభిచారం కూడా నడిపేవాళ్లు.

క్రైస్తవులు సాధ్యమైనంత వరకు ఆ చోట్లకు వెళ్లకుండా ఉండడానికి ప్రయత్నించేవాళ్లు. కానీ తప్పని పరిస్థితుల్లో, అంటే వాళ్లు ప్రయాణిస్తున్న ప్రాంతాల్లో వాళ్ల బంధువులు గానీ, స్నేహితులు గానీ ఎవ్వరూ లేకపోతే అక్కడే ఉండాల్సి వచ్చేది.

4. (ఎ) బర్నబా, సౌలు ఎలా ఎంచుకోబడ్డారు? అప్పుడు తోటి సహోదరులు ఏం చేశారు? (బి) సంఘంలో నియామకాలు పొందిన వాళ్లకు మనం ఎలా సహాయం చేయవచ్చు?

4 దేవుడు తన పవిత్రశక్తి ద్వారా బర్నబాను, సౌలునే ఎందుకు “ప్రత్యేకపర్చాడు”? (అపొ. 13:2) బైబిలు దాని గురించి ఏమీ చెప్పట్లేదు. పవిత్రశక్తి ద్వారా వీళ్లిద్దరూ ఎంచుకోబడ్డారని మాత్రమే మనకు తెలుసు. అంతియొకయలోని ప్రవక్తలు, బోధకులు ఆ నిర్ణయానికి అడ్డు చెప్పినట్టుగా బైబిల్లో ఎక్కడా లేదు. బదులుగా బర్నబా, సౌలు తమ నియామకాన్ని చక్కగా చేసేలా వాళ్లు చేయగలిగిన సహాయం చేశారు. ఈ ఆధ్యాత్మిక సహోదరులు వాళ్ల మీద అసూయ పడకుండా, వాళ్లకోసం ఉపవాసం ఉండి ప్రార్థించారు. ఆ తర్వాత, “వాళ్లిద్దరి మీద చేతులు ఉంచి వాళ్లను పంపించారు.” అది చూసి బర్నబాకు, సౌలుకు ఎలా అనిపించి ఉంటుందో ఒక్కసారి ఊహించండి. (అపొ. 13:3) సంఘంలో పర్యవేక్షకులుగా నియమించబడిన వాళ్లకు, అలాగే వేరే నియామకాలు పొందిన వాళ్లకు సహాయం చేయడానికి మనం కూడా చేయగలిగినదంతా చేయాలి. అలాంటి నియామకాలు అందుకున్న వాళ్ల మీద ఈర్ష్య పడే బదులు, “వాళ్లు చేసే పనిని బట్టి, ప్రేమతో వాళ్లమీద విశేషమైన గౌరవం చూపించండి.”—1 థెస్స. 5:13.

5. కుప్రలో ప్రకటించడం గురించి వివరించండి.

5 బర్నబా, సౌలు అంతియొకయ దగ్గర్లోని సెలూకయ రేవుకు నడుచుకుంటూ వెళ్లి ఓడ ఎక్కారు. వాళ్లు దాదాపు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుప్ర ద్వీపానికి బయల్దేరారు.d అది బర్నబా సొంతూరు. కాబట్టి మంచివార్త ప్రకటించడం కోసం అక్కడికి వెళ్లడం ఆయనకు ఎంతో ఆనందంగా అనిపించి ఉంటుంది. వాళ్లు ఆ ద్వీపంలో తూర్పున ఉన్న సలమీ నగరానికి చేరుకుని, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా “యూదుల సమాజమందిరాల్లో దేవుని వాక్యాన్ని ప్రకటించడం మొదలుపెట్టారు.”e (అపొ. 13:5) బర్నబా, సౌలు కుప్ర అంతటా తిరుగుతూ పెద్దపెద్ద నగరాల్లో ప్రకటించారు. అంటే, వాళ్లు దాదాపు 160 కిలోమీటర్లు నడిచి ఉంటారు!

యూదుల సమాజమందిరాలు

“సమాజమందిరం” అనే మాటకు “సమకూర్చడం” అని అర్థం. మొదట్లో ఈ పదాన్ని సమావేశమైన యూదుల్ని సూచించడానికి ఉపయోగించేవాళ్లు. తర్వాతి రోజుల్లో, వాళ్లు ఆరాధన కోసం కలుసుకునే స్థలానికి ఆ పేరు వచ్చింది.

యూదులు 70 సంవత్సరాలు బబులోను చెరలో ఉన్న సమయంలో లేదా చెర నుండి విడుదలైన వెంటనే సమాజమందిరాలు ఏర్పడ్డాయని కొంతమంది అంటారు. ఉపదేశం పొందడానికి, ఆరాధించడానికి, లేఖనాల్ని చదవడానికి, వాటి అర్థాన్ని తెలుసుకోవడానికి యూదులు ఈ సమాజమందిరాల్లో కలుసుకునేవాళ్లు. క్రీస్తు శకం మొదటి శతాబ్దంలో, పాలస్తీనాలోని ప్రతీ పట్టణంలో ఒక సమాజమందిరం ఉండేది. పెద్ద పట్టణాల్లో ఒకటి కంటే ఎక్కువ సమాజమందిరాలు ఉండేవి, యెరూషలేములో అయితే చాలా ఉండేవి.

బబులోను చెర నుండి విడుదలయ్యాక, యూదుల్లో కొంతమంది పాలస్తీనాకు తిరిగి రాలేదు. చాలామంది వ్యాపారాల కోసం వేరే దేశాలకు వెళ్లి, అక్కడే స్థిరపడ్డారు. క్రీస్తు పూర్వం 5వ శతాబ్దానికల్లా, పర్షియా సామ్రాజ్యంలోని 127 సంస్థానాల్లో యూదా ప్రజలు ఉన్నారు. (ఎస్తేరు 1:1; 3:8) కొంతకాలానికి, యూదా ప్రజలు మధ్యధరా సముద్రం చుట్టుపక్కల ఉన్న నగరాల్లో కూడా నివసించడం మొదలుపెట్టారు. ఇలా వేర్వేరు ప్రాంతాల్లో చెదిరిపోయిన యూదులు, వెళ్లిన ప్రతీ చోట సమాజమందిరాల్ని ఏర్పాటు చేసుకున్నారు.

ఈ సమాజమందిరాల్లో, ప్రతీ విశ్రాంతి రోజున ధర్మశాస్త్రాన్ని చదివి, వివరించేవాళ్లు. సమాజమందిరంలో కాస్త ఎత్తుగా ఉన్న ఒక చోటు నుండి ధర్మశాస్త్రాన్ని చదివేవాళ్లు, దానికి మూడు వైపులా ప్రజలు కూర్చోవడానికి సీట్లు ఉండేవి. దైవభక్తిగల ప్రతీ యూదా పురుషుడు లేఖనాల్ని చదవొచ్చు, ప్రకటించవచ్చు, వివరించవచ్చు.

6, 7. (ఎ) సెర్గి పౌలు ఎవరు? మంచివార్త వినకుండా బర్‌యేసు అతన్ని ఎందుకు అడ్డుకోవాలని చూశాడు? (బి) సౌలు చూస్తూ ఊరుకునే బదులు ఏం చేశాడు?

6 ఆ రోజుల్లో కుప్ర ద్వీపంలో ఎక్కడ చూసినా, ప్రజలు అబద్ధ దేవుళ్లను ఆరాధించేవాళ్లు. పాఫు నగరానికి చేరుకున్నప్పుడు ఆ విషయం బర్నబా, సౌలులకు బాగా అర్థమైంది. ఆ నగరం కుప్రలో పడమర వైపు ఉండేది. అక్కడ వాళ్లు బర్‌యేసు అనే వ్యక్తిని కలిశారు. “అతనొక మంత్రగాడు, అబద్ధ ప్రవక్త.” ఈ బర్‌యేసు “సెర్గి పౌలు అనే స్థానిక అధిపతి దగ్గర పనిచేసేవాడు, ఈ సెర్గి పౌలు తెలివైనవాడు.”f ఆ రోజుల్లో సెర్గి పౌలు లాంటి తెలివైన వాళ్లతో సహా బాగా పలుకుబడి ఉన్న చాలామంది రోమన్లు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు సలహా కోసం మంత్రగాళ్లను, లేదా జ్యోతిష్యులను సంప్రదించేవాళ్లు. అయితే సెర్గి పౌలు రాజ్య సందేశం మీద ఆసక్తితో “దేవుని వాక్యాన్ని వినాలని” కోరుకున్నాడు. కానీ బర్‌యేసుకు ఆ విషయం నచ్చలేదు. అతనికి ఎలుమ అనే పేరు కూడా ఉంది, ఆ పేరుకు “మంత్రగాడు” అని అర్థం.—అపొ. 13:6-8.

7 దేవుని రాజ్యం గురించిన మంచివార్త బర్‌యేసుకు నచ్చలేదు. అప్పటిదాకా తన గుప్పిట్లో ఉన్న సెర్గి పౌలు, ఎక్కడ మారిపోతాడేమో అన్న భయంతో “ప్రభువును విశ్వసించకుండా అతన్ని అడ్డుకోవాలని” బర్‌యేసు చూశాడు. (అపొ. 13:8) కానీ సెర్గి పౌలు ఆసక్తిని నీరుగార్చడానికి ఆ మంత్రగాడు చేస్తున్న ప్రయత్నాల్ని సౌలు చూస్తూ ఊరుకోలేదు. మరి ఆయన ఏం చేశాడు? బైబిలు ఇలా చెప్తుంది: “పౌలు అని కూడా పిలవబడిన సౌలు పవిత్రశక్తితో నిండిపోయి, ఎలుమ వైపు సూటిగా చూస్తూ ఇలా అన్నాడు: ‘అన్నిరకాల మోసంతో, చెడుతనంతో నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్తమైన నీతికి విరోధీ, నువ్వు యెహోవా సరైన మార్గాల్ని చెడగొట్టడం ఆపవా? ఇదిగో! యెహోవా చెయ్యి నీకు వ్యతిరేకంగా ఉంది. నువ్వు గుడ్డివాడివై కొంతకాలం సూర్యకాంతిని చూడకుండా ఉంటావు.’ వెంటనే అతని కళ్లు మసకబారాయి, వాటికి చీకటి కమ్ముకుంది. దాంతో అతను ఎవరైనా తనను చెయ్యి పట్టుకొని నడిపిస్తారేమో అని వెతుకుతూ చుట్టూ తిరగడం మొదలుపెట్టాడు.”g ఆ అద్భుతాన్ని చూశాక సెర్గి పౌలు ఏం చేశాడు? “జరిగింది చూశాక ఆ స్థానిక అధిపతి విశ్వాసి అయ్యాడు, ఎందుకంటే అతను యెహోవా బోధకు చాలా ఆశ్చర్యపోయాడు.”—అపొ. 13:9-12.

ఒక సహోదరుడు బైబిలు తెరిచి, కోర్టులో జడ్జి ముందు సత్యాన్ని సమర్థిస్తూ మాట్లాడుతున్నాడు.

పౌలులాగే మనం కూడా వ్యతిరేకత వచ్చినా, సత్యాన్ని సమర్థిస్తూ ధైర్యంగా మాట్లాడతాం

8. పౌలు చూపించినలాంటి ధైర్యాన్ని నేడు మనం కూడా ఎలా చూపించవచ్చు?

8 పౌలు బర్‌యేసుకు భయపడలేదు. అదేవిధంగా వ్యతిరేకులు సత్యం నేర్చుకుంటున్న వాళ్ల ఆసక్తిని తగ్గించడానికి ప్రయత్నిస్తుంటే, మనం ధైర్యంగా సత్యం తరఫున మాట్లాడాలి. అయితే మన మాటలు “ఎప్పుడూ దయగా, ఉప్పు వేసినట్టు రుచిగా ఉండాలి.” (కొలొ. 4:6) అదేసమయంలో, ఆసక్తి చూపించిన వ్యక్తి యెహోవా గురించి నేర్చుకునేలా సహాయం చేయడానికి చేయగలిగినదంతా చేయాలి. అది వాళ్లను అడ్డుకునే వాళ్లకు కోపం తెప్పించినా సరే, అలా చేయడం మానకూడదు. బర్‌యేసులాగే నేడు అబద్ధ మతాలు కూడా ‘యెహోవా సరైన మార్గాల్ని చెడగొట్టడానికి’ ప్రయత్నిస్తున్నాయి. కాబట్టి వాళ్ల అబద్ధ బోధల్ని, తప్పుడు పనుల్ని బయట పెట్టడానికి మనం అస్సలు భయపడకూడదు. (అపొ. 13:10) పౌలులాగే మనం కూడా సత్యం గురించి ధైర్యంగా మాట్లాడి, సరైన హృదయస్థితి ఉన్నవాళ్లకు సహాయం చేయాలనుకుంటాం. పౌలుకు ఇచ్చినట్టు, అద్భుతాలు చేసే శక్తిని ఈ రోజుల్లో యెహోవా మనకు ఇవ్వట్లేదు. కానీ ఆయన తన పవిత్రశక్తిని ఉపయోగించి, అర్హులైన వాళ్లను సత్యం వైపు ఆకర్షిస్తాడు అనే నమ్మకంతో ఉండవచ్చు.—యోహా. 6:44.

“ప్రోత్సహించే మాట” (అపొ. 13:13-43)

9. నేడు సంఘంలో బాధ్యతల్లో ఉన్న సహోదరులకు పౌలు, బర్నబా ఎలా ఆదర్శం ఉంచారు?

9 పౌలు, బర్నబా, మార్కు ముగ్గురూ కలిసి పాఫు నుండి బయల్దేరి దాదాపు 250 కిలోమీటర్లు ఓడలో ప్రయాణించి పెర్గేకు చేరుకున్నారు. ఇది ఆసియా మైనరులోని తీర ప్రాంతం. అపొస్తలుల కార్యాలు 13:13 లో మనం ఒక మార్పును గమనించవచ్చు. అక్కడ “పౌలు, అతనితో ఉన్నవాళ్లు” అని చెప్పబడింది. ఆ మాటను బట్టి, ఆ చిన్న గుంపును పౌలు ముందుండి నడిపిస్తున్నాడని అర్థమౌతుంది. అయితే పౌలును చూసి బర్నబా ఈర్ష్య పడినట్టు బైబిలు ఎక్కడా చెప్పట్లేదు. బదులుగా, దేవుని ఇష్టాన్ని చేయడానికి వాళ్లిద్దరు కలిసికట్టుగా పని చేశారు. నేడు సంఘంలో బాధ్యతల్లో ఉన్న సహోదరులకు పౌలు, బర్నబా మంచి ఆదర్శం ఉంచారు. వేరేవాళ్ల కన్నా పైస్థానంలో ఉండాలి అనుకునే బదులు, “మీరంతా సహోదరులు” అని యేసు చెప్పిన మాటల్ని క్రైస్తవులు ఎప్పుడూ గుర్తుంచుకుంటారు. యేసు ఇంకా ఇలా అన్నాడు: “తనను తాను గొప్ప చేసుకునే వ్యక్తి తగ్గించబడతాడు. తనను తాను తగ్గించుకునే వ్యక్తి గొప్ప చేయబడతాడు.”—మత్త. 23:8, 12.

10. పౌలు బర్నబాలు పెర్గే నుండి పిసిదియలోని అంతియొకయకు చేసిన ప్రయాణం గురించి వివరించండి.

10 పెర్గేకు చేరుకున్న వెంటనే పౌలు బర్నబాల్ని వదిలి మార్కు యెరూషలేముకు వెళ్లిపోయాడు. ఆయన వెళ్లి పోవడానికి గల కారణం ఏంటో బైబిలు మనకు చెప్పట్లేదు. పౌలు, బర్నబాలు పెర్గే నుండి బయల్దేరి పిసిదియలోని అంతియొకయకు వెళ్లారు. ఈ నగరం గలతీయ ప్రాంతంలో ఉంది. సముద్రమట్టానికి 3,600 అడుగుల ఎత్తులో ఉన్న ఈ నగరానికి చేరుకోవాలంటే ఎన్నో కొండల్ని దాటుకుంటూ, దొంగల చేతికి చిక్కకుండా ప్రయాణించాలి. కాబట్టి ఆ ప్రయాణం అంత తేలికేం కాదు. దీనికితోడు, బహుశా ఈ ప్రయాణం సమయంలో పౌలు ఆరోగ్యం కూడా బాగోలేదని తెలుస్తోంది.h

11, 12. పిసిదియలోని అంతియొకయ సమాజమందిరంలో, ప్రజల హృదయాల్ని చేరుకునేలా పౌలు ఎలా మాట్లాడాడు?

11 పిసిదియలోని అంతియొకయకు చేరుకున్న తర్వాత పౌలు, బర్నబా విశ్రాంతి రోజున సమాజమందిరానికి వెళ్లారు. బైబిలు ఇలా చెప్తుంది: “అక్కడ ధర్మశాస్త్రాన్ని, ప్రవక్తల పుస్తకాల్ని చదవడం పూర్తయిన తర్వాత సమాజమందిర అధికారులు వాళ్లను, ‘సహోదరులారా, ప్రజల్ని ప్రోత్సహించే మాట ఏదైనా మీ దగ్గరుంటే చెప్పండి’ అని అడిగారు.” (అపొ. 13:15) దాంతో పౌలు మాట్లాడడానికి లేచాడు.

12 పౌలు, “ఇశ్రాయేలీయులారా, దేవునికి భయపడే ఇతర ప్రజలారా, వినండి” అంటూ మాట్లాడడం మొదలుపెట్టాడు. (అపొ. 13:16) పౌలు మాటల్ని వింటున్న వాళ్లంతా యూదులు, యూదులుగా మారిన అన్యజనులు. యేసే మెస్సీయ అని వాళ్లు అప్పటికింకా అంగీకరించలేదు. మరి వాళ్ల హృదయాల్ని చేరుకునేలా పౌలు ఎలా మాట్లాడాడు? ముందుగా, ఇశ్రాయేలు ప్రజల కోసం యెహోవా ఏమేం చేశాడో పౌలు గుర్తుచేశాడు. ఇశ్రాయేలు ప్రజలు ‘ఐగుప్తు దేశంలో పరదేశులుగా ఉన్నప్పుడు యెహోవా వాళ్లను ఎలా హెచ్చించాడో,’ ఐగుప్తు నుండి బయటికి వచ్చిన తర్వాత ‘40 సంవత్సరాలు ఎడారిలో ఆయన వాళ్లను ఎలా భరించాడో’ వివరించాడు. వాళ్లు వాగ్దాన దేశాన్ని సొంతం చేసుకోవడానికి యెహోవా ఎలా సహాయం చేశాడో, ఆ దేశాన్ని ఎలా వాళ్లకు “వారసత్వ ఆస్తిగా పంచి ఇచ్చాడో” కూడా వివరించాడు. (అపొ. 13:17-19) ఆ విశ్రాంతి రోజున కాసేపటి క్రితమే చదివిన లేఖనాల్ని ఉపయోగించి పౌలు మాట్లాడి ఉంటాడని కొంతమంది అంటారు. ఒకవేళ అదే నిజమైతే, “అన్నిరకాల ప్రజలకు సహాయం చేయడానికి” ఎలా శాయశక్తులా కృషిచేయాలో పౌలుకు తెలుసని ఇది చూపిస్తుంది.—1 కొరిం. 9:22.

13. వినేవాళ్ల హృదయాల్ని చేరుకోవడానికి ఎలా కృషిచేయవచ్చు?

13 మనం కూడా ప్రకటిస్తున్నప్పుడు, వినేవాళ్ల హృదయాల్ని చేరుకోవడానికి కృషిచేయాలి. ఉదాహరణకు ఒక వ్యక్తి నమ్మకాలు ఏంటో తెలుసుకుంటే, అతనికి బాగా ఆసక్తి కలిగించే విషయాల్ని మాట్లాడగలుగుతాం. అంతేకాదు వాళ్లకు ఉపయోగపడే లేఖనాల్ని తీసి మాట్లాడవచ్చు. ఒకవేళ వాళ్ల దగ్గర బైబిలు ఉంటే, వాళ్ల సొంత బైబిలు నుండే చదవమని అడగడం మంచిది. వినేవాళ్ల హృదయాల్ని చేరుకునేలా ఎలా మాట్లాడాలో మనం ఆలోచిస్తూ ఉండాలి.

14. (ఎ) పౌలు యేసు గురించి మాట్లాడడం ఎలా మొదలుపెట్టాడు? ఆయన వాళ్లను ఏమని హెచ్చరించాడు? (బి) పౌలు మాటలకు ప్రజలు ఎలా స్పందించారు?

14 ఆ తర్వాత పౌలు, ఇశ్రాయేలు రాజవంశం నుండి ‘ఒక రక్షకుడు వచ్చాడని, ఆయనే యేసు’ అని వివరించాడు. యేసు మీద విశ్వాసం ఉంచేలా, బాప్తిస్మమిచ్చే యోహాను ప్రజల్ని ఎలా సిద్ధం చేశాడో కూడా చెప్పాడు. అంతేకాదు యేసు ఎలా చంపబడ్డాడో, ఎలా తిరిగి బ్రతికాడో వివరించాడు. (అపొ. 13:20-37) పౌలు ఇలా అన్నాడు: “కాబట్టి సహోదరులారా, ఒక విషయం మీకు తెలియాలి. అదేమిటంటే, ఈయన ద్వారానే దేవుడు మీ పాపాల్ని క్షమిస్తాడని నేను మీకు ప్రకటిస్తున్నాను . . . అయితే దేవుడు, విశ్వసించే ప్రతీ ఒక్కర్ని యేసు ద్వారా నీతిమంతులుగా తీర్పుతీరుస్తాడు.” తర్వాత తన మాటల్ని వింటున్న వాళ్లను పౌలు ఇలా హెచ్చరించాడు: “కాబట్టి ప్రవక్తల పుస్తకాల్లో రాయబడిన ఈ విషయాలు మీ మీదికి రాకుండా జాగ్రత్తపడండి: ‘తిరస్కరించే ప్రజలారా, మీ రోజుల్లో నేను చేసే ఒక పనిని చూడండి. మీరు దాన్ని అస్సలు నమ్మరు. ఎవరైనా దాని గురించి వివరంగా చెప్పినా మీరు దాన్ని నమ్మరు. బదులుగా మీరు ఆశ్చర్యపోతారు, నాశనమౌతారు.’” పౌలు మాట్లాడడం అయిపోయాక, “తర్వాతి విశ్రాంతి రోజున కూడా ఈ విషయాల గురించి మాట్లాడమని ప్రజలు వాళ్లను వేడుకున్నారు.” ప్రజలు ఇంత చక్కగా స్పందిస్తారని బహుశా పౌలు కూడా ఊహించి ఉండడు. అంతేకాదు సమాజమందిరం నుండి బయటికి వచ్చాక, ‘చాలామంది యూదులు, యూదులుగా మారిన అన్యజనులు పౌలును, బర్నబాను అనుసరించారు.’—అపొ. 13:38-43.

“మేము అన్యజనుల దగ్గరికి వెళ్తున్నాం” (అపొ. 13:44-52)

15. తర్వాతి విశ్రాంతి రోజున ఏం జరిగింది?

15 తర్వాతి విశ్రాంతి రోజున, “దాదాపు ఆ నగరంలోని వాళ్లంతా” పౌలు మాటల్ని వినడానికి వచ్చారు. అది కొంతమంది యూదులకు నచ్చలేదు. దాంతో వాళ్లు, “పౌలు చెప్పే విషయాల్ని వ్యతిరేకిస్తూ దూషించడం మొదలుపెట్టారు.” అప్పుడు పౌలు, బర్నబా ధైర్యంగా ఇలా అన్నారు: “దేవుని వాక్యం మొదట మీకు ప్రకటించబడడం తప్పనిసరి. అయితే మీరు దాన్ని నిరాకరిస్తున్నారు, పైగా శాశ్వత జీవితం పొందడానికి మీరు అర్హులని మీరు అనుకోవట్లేదు, కాబట్టి ఇదిగో! మేము అన్యజనుల దగ్గరికి వెళ్తున్నాం. ఎందుకంటే, ‘భూమి అంచుల వరకు రక్షణను తీసుకెళ్లడానికి నేను నిన్ను అన్యజనులకు వెలుగుగా నియమించాను’ అని యెహోవా మాకు ఆజ్ఞాపించాడు.”—అపొ. 13:44-47; యెష. 49:6.

పిసిదియలోని అంతియొకయలో వ్యతిరేకులు కోపంతో పౌలు, బర్నబాల్ని ఊరి అవతలికి వెళ్లగొడుతున్నారు.

‘వాళ్లు పౌలు బర్నబాల మీదికి హింస వచ్చేలా చేశారు . . . శిష్యులు పవిత్రశక్తితో, సంతోషంతో నింపబడుతూ ఉన్నారు.’—అపొస్తలుల కార్యాలు 13:50-52

16. పౌలు, బర్నబా అన్న మాటలకు యూదులు ఎలా స్పందించారు? అప్పుడు వాళ్లిద్దరు ఏం చేశారు?

16 ఆ మాటలు విన్న అన్యజనులు చాలా సంతోషించారు, “శాశ్వత జీవితం పొందడానికి తగిన హృదయ స్థితి ఉన్నవాళ్లందరూ విశ్వాసులయ్యారు.” (అపొ. 13:48) దేవుని వాక్యం వేగంగా దేశమంతా వ్యాపించింది. యూదులు దాన్ని అస్సలు సహించలేకపోయారు. మెస్సీయ గురించిన మంచివార్త మొదట యూదులకే అందింది కానీ, వాళ్లు దాన్ని ఇష్టపడలేదు. కాబట్టి, దేవుడు వాళ్లకు తీర్పు తీరుస్తాడని పౌలు, బర్నబా అన్నారు. యూదులు కోపంతో ఆ నగరంలో ఉన్న “గొప్పింటి స్త్రీలను, ప్రముఖులైన పురుషుల్ని రెచ్చగొట్టారు.” దాంతో వాళ్లు, “పౌలు బర్నబాల మీదికి హింస వచ్చేలా చేసి, వాళ్లను ఆ నగర పొలిమేరల అవతలికి వెళ్లగొట్టారు.” మరి అప్పుడు పౌలు, బర్నబా ఏం చేశారు? వాళ్లిద్దరు, “తమ పాదాలకు అంటుకున్న దుమ్ము దులిపేసుకుని ఈకొనియకు వెళ్లిపోయారు.” దాంతో ఇక పిసిదియలోని అంతియొకయలో క్రైస్తవత్వం అంతమైపోయిందా? లేదు! ఆ ప్రాంతంలో ఉండిపోయిన శిష్యులు “పవిత్రశక్తితో, సంతోషంతో నింపబడుతూ ఉన్నారు.”—అపొ. 13:50-52.

17-19. పౌలు, బర్నబాల ఆదర్శాన్ని నేడు మనం ఎలా పాటించవచ్చు? అది మన సంతోషాన్ని కాపాడుకునేలా ఎలా సహాయం చేస్తుంది?

17 వ్యతిరేకత వచ్చినా తమ సంతోషాన్ని కాపాడుకున్న ఈ మిషనరీల నుండి ఒక మంచి పాఠం నేర్చుకోవచ్చు. అధికారం, పలుకుబడి ఉన్నవాళ్లు మన పనిని అడ్డుకోవాలని చూసినా, మనం మాత్రం ఆపకుండా దాన్ని చేస్తూనే ఉంటాం. అంతియొకయలోని ప్రజలు మంచివార్తను వద్దనుకున్నప్పుడు పౌలు, బర్నబా ‘తమ పాదాలకు అంటుకున్న దుమ్మును దులిపేసుకున్నారని’ మనం చదివాం. వాళ్లు ఆ పని కోపంతో చేయలేదు. ఇక ఆ ప్రజలకు ఏం జరిగినా, తాము బాధ్యులం కాదని చూపించడానికే వాళ్లు అలా చేశారు. మంచివార్త ప్రకటిస్తూ ఉండడమే తమ చేతుల్లో ఉంటుంది కానీ, ప్రజలు దాన్ని వినేలా చేయడం తమ చేతుల్లో ఉండదని పౌలు, బర్నబాలకు తెలుసు. అందుకే వాళ్లు ప్రకటించడానికి ఈకొనియకు వెళ్లిపోయారు!

18 అంతియొకయలో కొత్తగా శిష్యులైన వాళ్ల సంగతేంటి? వాళ్ల చుట్టూ వ్యతిరేకులే ఉన్నారు. అయితే, ప్రజలు మంచివార్త విన్నా, వినకపోయినా వాళ్లు తమ సంతోషాన్ని కాపాడుకున్నారు. “దేవుని వాక్యాన్ని విని, పాటించేవాళ్లు ఇంకా సంతోషంగా ఉంటారు!” అని యేసు అన్నాడు. (లూకా 11:28) పిసిదియలోని అంతియొకయలో ఉన్న శిష్యులు సరిగ్గా అదే చేయాలని నిర్ణయించుకున్నారు.

19 పౌలు, బర్నబాల్లాగే మనం కూడా ఎప్పుడూ ఒక విషయాన్ని గుర్తుంచుకుందాం: కేవలం మంచివార్త ప్రకటించడమే మన బాధ్యత, కానీ దాన్ని అంగీకరిస్తారా లేదా అనేది వినేవాళ్ల చేతుల్లోనే ఉంటుంది. మీరు మంచివార్త ప్రకటిస్తున్నప్పుడు ప్రజలు వినట్లేదా? అయితే, మొదటి శతాబ్దంలోని శిష్యుల నుండి మనం మంచి పాఠం నేర్చుకోవచ్చు. మంచివార్త ఎంత విలువైనదో గుర్తిస్తూ, పవిత్రశక్తి నిర్దేశానికి తగ్గట్టు నడుచుకుంటే వ్యతిరేకత ఉన్నా మన సంతోషాన్ని కాపాడుకుంటాం.—గల. 5:18, 22.

బర్నబా—“ఓదార్పు పుత్రుడు”

మొదటి శతాబ్దంలోని యెరూషలేము సంఘంలో అందరికీ బాగా తెలిసిన వ్యక్తి యోసేపు. ఆయన ఒక లేవీయుడు, ఆయన సొంతూరు కుప్ర. ఆయన చాలా దయగలవాడు, అందుకే అపొస్తలులు ఆయనకు బర్నబా అనే పేరు పెట్టారు. ఆ పేరుకు “ఓదార్పు పుత్రుడు” అని అర్థం. (అపొ. 4:36) తన తోటి సహోదర సహోదరీలు ఎవరైనా అవసరంలో ఉన్నారని తెలిస్తే, బర్నబా వెంటనే సహాయం చేసేవాడు.

బర్నబా నాణేలు ఉన్న రెండు చిన్న సంచీల్ని విరాళంగా ఇస్తున్నాడు.

క్రీస్తు శకం 33, పెంతెకొస్తు పండుగ రోజున 3000 మంది బాప్తిస్మం తీసుకుని, శిష్యులయ్యారు. బహుశా, వాళ్లలో చాలామంది పండుగ కోసం వేరే ప్రాంతాల నుండి యెరూషలేముకు వచ్చారు. వాళ్లు అక్కడ అనుకున్న దానికంటే ఎక్కువ రోజులు ఉండాల్సి వచ్చింది. కాబట్టి వాళ్లందరి అవసరాలు చూసుకోవడానికి సంఘానికి చాలా డబ్బు అవసరమైంది. అప్పుడు బర్నబా దయతో తనకున్న కొంత భూమిని అమ్మి, వచ్చిన డబ్బును అపొస్తలులకు విరాళంగా ఇచ్చాడు.—అపొ. 4:32-37.

అనుభవం గల సంఘపెద్ద అయిన బర్నబా ఇతరులకు సహాయం చేయడానికి ముందుండేవాడు. ఉదాహరణకు, క్రైస్తవుల్ని హింసించిన సౌలు శిష్యుడిగా మారినప్పుడు, ఆయన్ని కలవడానికి అందరూ భయపడుతున్న సమయంలో, బర్నబా సౌలుకు సహాయం చేశాడు. (అపొ. 9:26, 27) క్రైస్తవులుగా మారిన యూదులు, అలాగే అన్యజనులు కలిసుండాలనే విషయంలో పేతురును, బర్నబాను పౌలు మందలించినప్పుడు, బర్నబా వినయంగా తన తప్పును అంగీకరించాడు. (గల. 2:9, 11-14) “ఓదార్పు పుత్రుడు” అనే తన పేరుకు తగ్గట్టే బర్నబా జీవించాడని ఈ కొన్ని ఉదాహరణలు చూపిస్తున్నాయి.

a “బర్నబా—‘ఓదార్పు పుత్రుడు’” అనే బాక్సు చూడండి.

b ప్రకటనా పని అప్పటికే సుదూర ప్రాంతాలకు విస్తరించింది, కొత్త సంఘాలు కూడా ఏర్పడ్డాయి. యెరూషలేముకు ఉత్తరాన, 550 కిలోమీటర్ల దూరంలో సిరియాకు చెందిన అంతియొకయలో ఏర్పడిన సంఘమే అందుకు ఒక ఉదాహరణ.

c “రోడ్డు ప్రయాణం” అనే బాక్సు చూడండి.

d సాధారణంగా మొదటి శతాబ్దంలో ఓడ ప్రయాణం ఎలా ఉండేదంటే, గాలి చక్కగా వీస్తూ వాతావరణం అనుకూలిస్తే రోజుకు దాదాపు 160 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. వాతావరణం అనుకూలంగా లేకపోతే, ఆ ప్రయాణం ఇంకా ఎక్కువసేపు పడుతుంది.

e “యూదుల సమాజమందిరాలు” అనే బాక్సు చూడండి.

f కుప్ర రోమన్ల పరిపాలన కింద ఉండేది. అక్కడ రోమన్లు, తమ ప్రతినిధిగా ఒక స్థానిక అధిపతిని నియమించేవాళ్లు.

g ఈ సందర్భం నుండి సౌలును, పౌలు అని పిలవడం మొదలైంది. పౌలు ఈ రోమా పేరును, సెర్గి పౌలు మీద గౌరవంతో పెట్టుకున్నాడు అని కొంతమంది అంటారు. కానీ కుప్రను విడిచి వచ్చిన తర్వాత కూడా పౌలు ఇదే పేరుతో పిలవబడ్డాడు. అంటే, పౌలు ఉద్దేశం అది కాదని అర్థమౌతుంది. పౌలు ‘అన్యజనులకు అపొస్తలుడు’ అయ్యాడు కాబట్టి, తన రోమా పేరును ఉపయోగించాలని నిర్ణయించుకున్నాడు. అంతేకాదు సౌలు అనే హీబ్రూ పేరును గ్రీకులో పలికితే తప్పు అర్థం వస్తుంది కాబట్టి, ఆయన తన రోమా పేరును ఉపయోగించి ఉండవచ్చు.—రోమా. 11:13.

h కొన్నేళ్ల తర్వాత, పౌలు గలతీయులకు ఉత్తరం రాస్తూ ఇలా అన్నాడు: “నా అనారోగ్యం కారణంగా మీకు మొదటిసారి మంచివార్త ప్రకటించే అవకాశం నాకు దొరికిందని మీకు తెలుసు.”—గల. 4:13.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి