క్రైస్తవ మిషనరీ సేవకు ప్రేరేపిత లేఖన మాదిరి
“నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి.”—1 కొరింథీయులు 11:1
1. తన అనుచరులు అనుసరించుటకు యేసు కనబరచిన అసాధారణమైన మాదిరియొక్క కొన్ని మార్గములేమై యున్నవి? (ఫిలిప్పీయులు 2:5-9)
యేసు తన శిష్యుల కొరకు ఎంతటి అసాధారణమైన మాదిరిని కనబర్చెను! భూమి మీదికి వచ్చి పాపులైన మానవుల మధ్య జీవించుటకు సంతోషముతో ఆయన తన పరలోక మహిమను విడిచి పెట్టెను. మానవజాతి రక్షణ కొరకు, మరింత ప్రాముఖ్యముగా తన పరలోకపు తండ్రి నామ మహిమార్థం ఎంతో బాధననుభవించుటకు ఆయన ఇష్టపడెను. (యోహాను 3:16; 17:4) తన ప్రాణాన్ని గూర్చిన న్యాయవిచారణ సమయంలో, యేసు ధైర్యముగా ఇట్లు ప్రకటించెను: “సత్యమునుగూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని; ఇందు నిమిత్తమే యీ లోకమునకు వచ్చితిని.”—యోహాను 18:37.
2. తాను ప్రారంభించిన పనిలో కొనసాగుడని పునరుత్థానుడైన యేసు తన శిష్యులకు ఎందుక ఆజ్ఞాపించగల్గెను?
2 రాజ్య సత్యానికి సాక్ష్యమిచ్చే పనిని కొనసాగించగలుగునట్లు, తన మరణానికి ముందు యేసు తన శిష్యులకు ఉత్తమమైన శిక్షణనిచ్చెను. (మత్తయి 10:5-23; లూకా 10:1-16) కాబట్టే, తాను పునరుత్థానుడైన తర్వాత యేసు ఈ ఆజ్ఞనివ్వగల్గెను: “మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి.”—మత్తయి 28:19, 20.
3. శిష్యులను చేయు పని ఎట్లు విస్తరించెను, అయితే అది ఎక్కువగా ఏ ప్రాంతాలలో కేంద్రీకరించబడింది?
3 ఆ తర్వాతి మూడున్నర సంవత్సరాలలో, యేసు శిష్యులు ఈ ఆజ్ఞకు లోబడ్డారు. అయితే శిష్యులను చేయు తమ పనిని యూదులకు, యూదామత ప్రవిష్టులకు, సున్నతి పొందిన సమరయులకు మాత్రమే పరిమితము చేశారు. ఆ పిమ్మట, సా.శ. 36లో సున్నతిపొందని వ్యక్తియగు కొర్నేలి, అతని కుటుంబ సభ్యులకు సువార్త ప్రకటించబడాలని దేవుడు ఆదేశించాడు. ఆ తర్వాతి దశాబ్దములో, ఇతర అన్యులును సంఘములో చేర్చబడిరి. అయితే, పనిలో అధిక భాగము తూర్పు మధ్యదరా ప్రాంతాలకు మాత్రమే పరిమితమై యున్నట్లు కన్పిస్తున్నది.—అపొ. కార్యములు 10:24, 44-48; 11:19-21.
4. దాదాపు సా.శ. 47-48లో ఏ ప్రాముఖ్యమైన సంఘటన జరిగెను?
4 సుదూర ప్రాంతాలలోని యూదులను, అన్యులను శిష్యులనుగా చేయుటకు క్రైస్తవులను ప్రేరేపించునది లేదా శక్తిమంతులను చేసేది ఏదో అవసరమై యుండెను. కావున, దాదాపు సా.శ. 47-48లో సిరయలోని అంతియొకయలోని సంఘపెద్దలు ఈ దైవిక వర్తమానమును పొందారు: “నేను బర్నబాను సౌలును పిలిచిన పనికొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడి.” (అపొ. కార్యములు 13:2) అప్పటికి పౌలు తన అసలు పేరైన సౌలు అని పిలువబడుటను గమనించండి. దేవుడు పౌలు కంటే బర్నబాను మొదట ప్రస్తావించుటను కూడా గమనించండి, బహుశ అప్పటికి వీరిద్దరిలో బర్నబా అనుభవజ్ఞుడని పరిగణించబడినందున ఇలా ప్రస్తావించి యుండవచ్చును.
5. పౌలు బర్నబాల మిషనరీ యాత్రయొక్క నివేదిక ఈనాటి క్రైస్తవులకు ఎందుకు గొప్ప విలువను కలిగియుంది?
5 పౌలు బర్నబాల మిషనరీ యాత్రనును గూర్చిన వివరణాత్మక నివేదిక యెహోవాసాక్షులకు, ప్రత్యేకంగా తమ స్వస్థలాలను విడిచి విదేశి సమాజమందు దేవుని సేవించుటకు వెళ్లిన మిషనరీలకు, పయినీర్లకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉన్నది. అంతేకాకుండా, అపొ. కార్యములు 13 మరియు 14 అధ్యాయముల పునఃసమీక్ష పౌలు, బర్నబాలను మరింతగా అనుకరించుటకు అన్నింటికంటె ప్రాముఖ్యంగా శిష్యులను తయారు చేయు పనిలో తమ భాగమును విస్తరింపజేసికొనుటకు నిశ్చయముగా పురికొల్పుతుంది.
కుప్ర ద్వీపము
6. కుప్రలో ఆ మిషనరీలు ఏ మాదిరి చూపారు?
6 ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ మిషనరీలు సిరయా రేవు పట్టణమైన సెలూకయ నుండి కుప్ర ద్వీపమునకు ప్రయాణమై వెళ్లారు. వారు సలమీలో దిగిన తర్వాత తిన్నగా, “యూదుల సమాజమందిరములలో దేవుని వాక్యమును ప్రచురించుచుండిరి.” క్రీస్తు మాదిరిననుసరిస్తూ, వారు ఆ పట్టణములోనే స్థిరపడి, ద్వీపవాసులు తమయొద్దకు రావలెనని వేచియుండ లేదు. బదులుగా, వారు పనిచేయుచు “ద్వీపమందంతటను సంచరించిరి.” కుప్ర ద్వీపము పెద్దదైనందున, వారా ద్వీపంలో అధికభాగం సంచారం చేయవలసి యున్నందున యీ పనిలో ఎక్కువ నడక, బసచేయు స్థలాలను పదేపదే మార్చుట యిమిడియుండెననుటలో సందేహము లేదు.—అపొ. కార్యములు 13:5, 6.
7. (ఎ) పాఫులో ఏ అసాధారణ సంఘటన జరిగెను? (బి) ఈ నివేదిక ఏ దృక్పధాన్ని కలిగియుండుటకు మనల్ని ప్రోత్సాహిస్తుంది?
7 వారక్కడ ఉండిన చివరి సమయములో పాఫు అను పట్టణములో వీరిద్దరికి ఒక చక్కని అనుభవంను కలిగింది. ఆ ద్వీపపు అధిపతియైన, సెర్గి పౌలు వారి వర్తమానము విని “విశ్వసించెను.” (అపొ. కార్యములు 13:7, 12) పౌలు ఆ పిమ్మట ఇలా వ్రాశాడు: “సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను, ఘనులైనను, గొప్ప వంశమువారైనను అనేకులు పిలువబడలేదు.” (1 కొరింథీయులు 1:26) అయినప్పటికిని, ప్రతిస్పందించిన ఘనులలో సెర్గి పౌలు ఒకరు. ప్రభుత్వాధికారులకు సాక్ష్యమిచ్చుటను గూర్చి అనుకూల దృక్పధాన్ని కలిగియుండుటకు ఈ అనుభవము మనలనందరిని, ప్రత్యేకంగా మిషనరీలను ప్రోత్సహించాలి. మనమలా చేయుటకు 1 తిమోతి 2:1-4లో కూడా ప్రోత్సహింపబడుతున్నాము. అధికారమందున్న వ్యక్తులు కొన్నిసార్లు దేవుని సేవకులకు బహుగా సహాయం చేశారు.—నెహెమ్యా 2:4-8.
8. (ఎ) అప్పటినుండి పౌలు బర్నబాల మధ్య ఎటువంటి మార్పు వచ్చింది? (బి) ఏ విధముగా బర్నబా ఒక శ్రేష్టమైన మాదిరియై యుండెను?
8 యెహోవా ఆత్మ ప్రభావముతో పౌలు, సెర్గి పౌలును మార్చుటకు ప్రముఖ పాత్ర వహించాడు. (అపొ. కార్యములు 13:8-12) అంతేకాకుండా, అప్పటినుండి పౌలు నాయకత్వం వహించినట్లు కన్పిస్తుంది. (అపొ. కార్యములు 13:7ను అపొ. కార్యములు 13:15, 16, 43తో పోల్చుము.) పౌలు మారినప్పుడు అతని కివ్వబడిన దైవాజ్ఞకు ఇది పొందికగావుంది. (అపొ. కార్యములు 9:15) బహుశ అటువంటి మార్పు బర్నబా వినయాన్ని పరీక్షించి ఉండవచ్చు. అయితే, ఈ మార్పును తనకు కలిగిన అవమానమని తలంచే బదులు, బర్నబా “ఆదరణ పుత్రుడని” తన పేరుకున్న భావానికి తగినట్లు జీవిస్తూ, మిషనరీ యాత్రంతటిలో ఆలాగే సున్నతి పొందని అన్యులకు తాము చేస్తున్న పరిచర్యను క్రైస్తవులైన యూదులు కొంతమంది సవాలు చేసినప్పుడు పౌలుకు నమ్మకముగా తన మద్దతునిచ్చి యుండవచ్చును. (అపొ. కార్యములు 15:1, 2) బేతేలు, మిషనరీ గృహములలో నివసించు వారితో సహా ఇది మనందరికి ఎంత చక్కని మాదిరి! మనమన్ని సమయాలలో దైవపాలనా సవరణలను అంగీకరించి, మనలో నాయకత్వం వహించుటకు నియమించబడిన వారికి పూర్తి మద్దతునివ్వడానికి ఇష్టపడాలి.—హెబ్రీయులు 13:17.
చిన్న ఆసియా పీఠభూమి
9. పిసిదియలోని అంతియొకయ వరకు ప్రయాణమై వెళ్లుటకు పౌలు బర్నబాలు ఇష్టపడుటనుబట్టి మనమేమి నేర్చుకొందుము?
9 పౌలు బర్నబాలు కుప్ర నుండి బయలుదేరి ఆసియా ఖండముయొక్క ఉత్తరభాగానికి వెళ్లారు. ఏదో తెలియని కారణమునుబట్టి, ఆ కోస్తాతీర ప్రాంతములో ఉండకుండా, ఆ మిషనరీలు అక్కడ నుండి బయలుదేరి దాదాపు 180 కిలోమీట్లర సుదీర్ఘమైన, ప్రమాదకరమైన ప్రయాణం చేసి చిన్న ఆసీయా పీఠభూమియందుగల పిసిదయలోని అంతియొకయకు వెళ్లారు. ఈ ప్రయాణంలో ఒక పర్వత మార్గంగుండా ఎక్కివెళ్లి సముద్ర మట్టానికి రమారమి 1,100 మీటర్ల ఎత్తునున్న మైదాన ప్రాంతానికి దిగివచ్చారు. బైబిలు విద్వాంసుడైన జె. ఎస్. హౌసన్ ఇలా చెపుతున్నాడు: “ప్రాచీనకాల చరిత్రయంతటిలో దక్షిణ కోస్తాతీరమందలి మైదానాల నుండి . . . పీఠభూమిని వేరుచేయు ఆ పర్వత ప్రాంతాలలోని ప్రజలు దుర్నీతితో, దొమ్మిగాపడి దోచుకొను అలవాట్లకు పేరుపొందారు.” దానికితోడు, ఆ మిషనరీలు ప్రకృతిసంబంధమైన విపత్తులు సహితము ఎదుర్కొన్నారు. హౌసన్ ఇంకను ఇట్లు తెలియజేస్తున్నాడు, “పిసిదియ పర్వత ప్రాంతాలలో ఉన్నంత ఎక్కువ ‘వరదలు,’ చిన్న ఆసియాలోని మరియే యితర జిల్లాలలోను ఉండేవి కావు. అక్కడ కొండకోనలనుండి ఉప్పొంగు నదులు ఇరుకైన లోయలగుండా అమిత వేగంతో ప్రవహించేవి.” సువార్తను విస్తరింపజేయుటకు ఆ మిషనరీలు ఎటువంటి ప్రయాణాలకు సిద్ధపడిరో మన మదిలో చిత్రీకరించుకొనుటకు ఈ వివరాలు మనకు సహాయం చేస్తాయి. (2 కొరింథీయులు 11:26) అదే ప్రకారము ఈనాడు, అనేకమంది యెహోవా సేవకులు ప్రజలను సమీపించి, వారితో సువార్తను పంచుకొనుటకు అన్నిరకాల ఇబ్బందులను ధైర్యముగా ఎదుర్కొంటున్నారు.
10, 11. (ఎ) తన ప్రేక్షకులకు తెలిసిన సాధారణ విషయాన్నే పౌలు ఎట్లు ప్రస్తావించాడు? (బి) మెస్సీయకు కలిగిన బాధలనుగూర్చి విన్నప్పుడు యూదులలో అనేకులు ఎందుకు ఆశ్చర్యపడి యుండవచ్చును? (సి) పౌలు తన శ్రోతలయెదుట ఎటువంటి రక్షణనుంచాడు?
10 పిసిదియలోని అంతియొకయలో యూదులు సమాజమందిరమొకటి ఉండెను గనుక, ఆ మిషనరీలు దేవుని వాక్యముతో ఎక్కువ పరిచయమున్న వారికి సువార్తనంగీకరించు అవకాశమునిచ్చుటకు మొదట అక్కడకు వెళ్లారు. మాట్లాడమని కోరిన మీదట, పౌలు నిలువబడి బహు నైపుణ్యముతో బహిరంగ ప్రసంగమునిచ్చాడు. ఆయన ప్రసంగమందు ప్రేక్షకులలోని విషయాన్నే ప్రస్తావించాడు. (అపొ. కార్యములు 13:13-16, 26) ఉపోద్ఘాతము చెప్పిన తర్వాత, పౌలు చెప్పుకోదగిన యూదుల చరిత్రను పునఃసమీక్షించి, తమ పితరులను యెహోవా ఏర్పరచుకొని వారిని ఐగుప్తు నుండి విడిపించెనని, అలాగే వాగ్దాన దేశనివాసులపై వారికి విజయాన్ని ప్రసాదించెనని వీరికి జ్ఞాపకం చేశాడు. ఆ తర్వాత పౌలు, దావీదుతో దేవుని వ్యవహారములను గూర్చి నొక్కి తెల్పాడు. దావీదు వంశస్థులలో ఒకరిని దేవుడు రక్షకునిగా ఏర్పరచి, ఆయనను నిత్య పరిపాలకునిగా నియమించునని మొదటి శతాబ్దపు యూదులు ఎరిగియున్నందున అటువంటి సమాచారము వారి హృదయాలను ఆకట్టుకొన్నది. ఆ సమయములో, పౌలు ధైర్యముగా ఇట్లు ప్రకటించాడు: “అతని [దావీదు] సంతానమునుండి దేవుడు తన వాగ్దానము చొప్పున ఇశ్రాయేలు కొరకు రక్షకుడగు యేసును పుట్టించెను.”—అపొ. కార్యములు 13:17-23.
11 అయితే, తమను రోమీయుల అధికారమునుండి విడిపించి, ఇతర జనాంగములకంటె యూదా జనాంగమును ఉన్నతస్థానములో ఉంచగల సైనిక నాయకుని తరహాలో ఆ రక్షకుడు ఉండునని అనేకమంది యూదులు ఎదురు చూశారు. కావున, మెస్సీయను తమ మతనాయకులే మరణమునకు అప్పగించారని పౌలు చెప్పినప్పుడు వారు నిస్సందేహముగా ఆశ్చర్యపడ్డారు. “అయితే దేవుడు మృతులలోనుండి ఆయనను లేపెను” అని పౌలు ధైర్యముగా ప్రకటించాడు. అద్భుతరీతిలో తన ప్రేక్షకులు రక్షణ పొందగలరని ఆయన తన ప్రసంగ ముగింపులో వారికి చూపించాడు. “కాబట్టి, . . . మీకు ఈయన ద్వారానే పాపక్షమాపణ ప్రచురమగుచున్నదనియు, మీరు మోషే ధర్మశాస్త్రమువలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేక పోతిరో ఆ విషయములన్నిటిలో, విశ్వసించు ప్రతివాడును ఈయన వలననే నీతిమంతుడుగా తీర్చబడుననియు మీకు తెలియు గాక” అని ఆయన చెప్పాడు. ఈ అద్భుతకరమైన రక్షణ ఏర్పాటును నిర్లక్ష్యము చేయుదురని దేవుడు ప్రవచించిన అనేకులలో ఉండకుడని తన ప్రేక్షకులకు ఉద్భోదిస్తూ పౌలు తన ప్రసంగాన్ని ముగించాడు.—-అపొ. కార్యములు 13:30-41.
12. పౌలు ప్రసంగం వలన వచ్చిన ఫలితమేమి, ఇది మనలనెట్లు ప్రోత్సహించాలి?
12 లేఖనాధారముతో ఆ ప్రసంగం ఎంతచక్కగా అందించబడింది! ఆ ప్రేక్షకులు ఎట్లు ప్రతిస్పందించారు? “అనేకులు యూదులును, భక్తిపరులైన యూదామత ప్రవిష్టులును, పౌలును బర్నబాను వెంబడించిరి.” (అపొ. కార్యములు 13:43) ఈనాడు అది మనకెంత ప్రోత్సాహకరముగా ఉన్నది! బహిరంగ పరిచర్యలో ఉన్నప్పుడు లేదా మన సంఘకూటములలో వ్యాఖ్యానించునప్పుడు మరియు ప్రసంగములిచ్చునప్పుడు, సత్యమును ప్రభావితముగా అందించుటకు మనము కూడా అదే ప్రకారము మన శక్తిమేరకు శ్రేష్టమైన ప్రయత్నము చేయుదము గాక.—1 తిమోతి 4:13-16.
13. మిషనరీలు పిసిదియలోని అంతియొకయను ఎందుకు విడిచిపెట్టవలసి వచ్చింది, క్రొత్త శిష్యుల విషయములో ఏ ప్రశ్నలు ఉత్పన్నమగును?
13 పిసిదియలోని అంతియొకయలో క్రొత్తగా ఆసక్తిచూపిన వారు ఈ సత్యమును తిరిగి ప్రకటించకుండా ఉండలేకపోయారు. దాని ఫలితముగా, “మరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా ఆ పట్టణమంతయు దేవునివాక్యము వినుటకు కూడివచ్చెను.” కాగా అనతికాలంలోనే ఆ వర్తమానము పట్టణము దాటి వ్యాపించింది. వాస్తవానికి, “ప్రభువు వాక్యము ఆ ప్రదేశమందంతట వ్యాపించెను.” (అపొ. కార్యములు 13:44, 49) ఈ వాస్తవాన్ని అంగీకరించుటకు బదులు, ఈర్ష్యపరులైన యూదులు ఆ మిషనరీలను పట్టణమునుండి వెళ్లగొట్టారు. (అపొ. కార్యములు 13:45, 50) క్రొత్త శిష్యులపై ఇదెలాంటి ప్రభావము చూపింది? వారు నిరుత్సాహపడి, వెనుకంజ వేశారా?
14. మిషనరీలు ప్రారంభించిన పనిని వ్యతిరేకులు ఎందుకు ఆపుజేయలేకపోయారు, దీనినుండి మనమేమి నేర్చుకొందుము?
14 లేదు, ఎందుకంటె ఇది దేవుని పని. అంతేకాకుండా, ఆ మిషనరీలు పునరుత్థానుడైన ప్రభువగు యేసుక్రీస్తునందు విశ్వాసమనే బలమైన పునాది వేశారు. కాబట్టే, ఆ క్రొత్త శిష్యులు, మిషనరీలను కాదుగాని క్రీస్తును తమ నాయకునిగా దృష్టించారు. ఆ విధముగా, వారు “ఆనందభరితులై పరిశుద్దాత్మతో నిండినవారై” నారని మనము చదువుదుము. (అపొ. కార్యములు 13:52) ఈనాటి మిషనరీలకు, శిష్యులనుచేసే ఇతరులకు ఇదెంత ప్రోత్సాహకరముగా ఉంది! మనము వినయముతో, ఆసక్తితో మన వంతు మనం చేస్తే, యెహోవా దేవుడు, యేసుక్రీస్తు మన పరిచర్యను ఆశీర్వదిస్తారు.—1 కొరింథీయులు 3:9.
ఈకొనియ, లుస్త్ర, దెర్బే
15. ఈకొనియలో మిషనరీలు ఏ పద్ధతినవలంబించారు, దాని ఫలితమేమిటి?
15 పౌలు, బర్నబాలిప్పుడు ఆగ్నేయదిశగా దాదాపు 140 కిలోమీటర్లు ప్రయాణించి, తర్వాతి పట్టణమైన ఈకొనియకు చేరుకున్నారు. వారు అంతియొకయలో అనుసరించిన విధానమునే అనుసరించుటకు హింసాభయం ఏమాత్రం ఆటంకపరచలేదు. దాని ఫలితంగా, “అనేకులు యూదులును గ్రీసు దేశస్థులును విశ్వసించారని” బైబిలు చెప్పుచున్నది. (అపొ. కార్యములు 14:1) ఇక్కడ కూడ, సువార్తను అంగీకరించని యూదులు వ్యతిరేకతను పురికొల్పారు. అయితే ఆ మిషనరీలు ధైర్యంగా, క్రొత్త శిష్యులకు సహాయంచేస్తూ ఈకొనియలో బహుకాలం గడిపారు. వ్యతిరేకులైన యూదులు తమను రాళ్లతో కొట్టుటకు చూస్తున్నారని తెలిసికొని, పౌలు బర్నబాలు తెలివిగా అక్కడనుండి తప్పుకొని, సమీప ప్రాంతాలగు “లుస్త్రకును దెర్బేకును చుట్టుపట్లనున్న ప్రదేశమునకును పారిపోయిరి.”—అపొ. కార్యములు 14:2-6.
16, 17. (ఎ) లుస్త్రలో పౌలుకు ఏమి సంభవించెను? (బి) అపొస్తలునితో దేవుడు వ్యవహరించిన విధము లుస్త్రలోనున్న ఒక యౌవనునిపై ఎట్లు ప్రభావము చూపెను?
16 ధైర్యముగా వారు అంతకుముందు పనిచేయని ఈ క్రొత్తప్రాంతములో “సువార్త ప్రకటించుచుండిరి.” (అపొ. కార్యములు 14:6) పిసిదియలోని అంతియొకయ, ఈకొనియనందలి యూదులు దీనిని విన్నప్పుడు, వారు లుస్త్రకు వచ్చి పౌలును రాళ్లతో కొట్టవలెనని జనసమూహములను రెచ్చగొట్టారు. తప్పించుకొను సమయము లేకపోవుటతో, వ్యతిరేకులు పౌలుమీద రాళ్లు రువ్వి ఆయన మరణించాడని తలంచి, పట్టణము వెలుపలికి ఆయనను ఈడ్చుకొనిపోయారు.—అపొ. కార్యములు 14:19.
17 క్రొత్త శిష్యులను ఇది ఎంత కలవరపరచెనో మీరూహించగలరా? అయితే అత్యంత ఆశ్చర్యం కలుగురీతిలో వారాయన చుట్టు నిలిచినప్పుడు, ఆయన లేచి నిలబడ్డాడు! ఈ క్రొత్త శిష్యులలో తిమోతి అను పేరుగల యౌవనుడు ఉన్నాడో లేదో బైబిలు చెప్పడం లేదు. పౌలుతో దేవుడు వ్యవహరించిన విధము ఆయనకు నిశ్చయముగా కొంత కాలమునకు తెలిసి, ఆయన యువ మనస్సుపై గట్టి ముద్రవేసింది. తిమోతికి వ్రాసిన రెండవ పత్రికలో పౌలు ఇలా వ్రాశాడు: “నీవు నా బోధను నా ప్రవర్తనను, . . . అంతియొకయ ఈకొనియ లుస్త్ర అను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవములను, తెలిసికొనినవాడవై నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించితిని గాని, వాటన్నిటిలోనుండి ప్రభువు నన్ను తప్పించెను.” (2 తిమోతి 3:10, 11) పౌలు రాళ్లతో కొట్టబడిన రెండు మూడు సంవత్సరముల తర్వాత, మరలా లుస్త్రకు తిరిగి వచ్చినప్పుడు, తిమోతి మాదిరికరమైన క్రైస్తవునిగా, “లుస్త్రలోను ఈకొనియలోను ఉన్న సహోదరుల వలన మంచిపేరు పొందిన వాని”గా ఉన్నట్లు గమనించారు. (అపొ. కార్యములు 16:1, 2) కావున పౌలు అతన్ని తన ప్రయాణ సహవాసిగా ఉండుటకు ఎంచుకొన్నాడు. ఇది ఆత్మీయముగా పరిణతిచెందుటకు తిమోతికి సహాయం చేసింది, మరియు వివిధ సంఘాలను సందర్శించులాగున పౌలు ఆయనను పంపుటకు సకాలములో అతడు అర్హుడయ్యాడు. (ఫిలిప్పీయులు 2:19, 20; 1 తిమోతి 1:3) అదేప్రకారము, ఈనాడు ఆసక్తిగల దేవుని సేవకుల ప్రభావం యౌవనులపై చక్కని ముద్రవేయగా, తిమోతి వలెనే వారిలో అనేకులు మిగుల విలువైన దేవుని సేవకులుగా ఎదిగిరి.
18. (ఎ) దెర్బేలో మిషనరీలకు ఏమి సంభవించెను? (బి) వారికిప్పుడు ఏ అవకాశము తెరువబడెను, అయితే వారు ఏ విధానాన్ని ఎన్నుకొనిరి?
18 లుస్త్రలో మరణము తప్పించుకొనిన మరునాటి ఉదయం, పౌలు బర్నబాతో కలిసి దెర్బేకు వెళ్లాడు. ఈసారి, ఏ వ్యతిరేకులు వారి వెంట వెళ్లలేదు, మరియు ‘వారక్కడ శిష్యులను తయారుచేసిరని’ బైబిలు చెప్పుచున్నది. (అపొ. కార్యములు 14:20, 21) దెర్బేలో సంఘము స్థాపించిన తర్వాత, పౌలు బర్నాబాలు ఒక తీర్మానము చేసికొనవలసి యుండిరి. రోమీయులు దెర్బేనుండి తార్సునకు ఒక పెద్ద రహదారిని నిర్మించారు. తిరిగి వెళ్లాలంటే అక్కడనుండి సిరియాలోని అంతయొకయ ఎంతో దూరములో లేదు. తిరిగివెళ్లుటకు వారికది చాలా అనుకూలమైన రహదారి. అదియునుగాక ఆ మిషనరీలు తమకిప్పుడు కొంత విశ్రాంతి అవసరమని తలంచి యుండవచ్చు. అయితే పౌలు బర్నబాలు తమ యజమాని వలెనే, అత్యవసరమైన మరొక దానిని గుర్తించారు.—మార్కు 6:31-34.
దేవుని పనిని సంపూర్ణముగా నెరవేర్చుట
19, 20. (ఎ) మిషనరీలు లుస్త్రకు, ఈకొనియకు, అంతియొకయకు తిరిగి వచ్చుటను యెహోవా ఎట్లు ఆశీర్వదించెను? (బి) ఇది యెహోవా ప్రజలకీ నాడు ఏ పాఠము నందిస్తున్నది?
19 ఇంటికి తిరిగివెళ్లడానికి ఆ దగ్గరి దారిని ఎంచుకొనడానికి బదులు, ఆ మిషనరీలు ధైర్యముగా వెనుదిరిగి మరలా తమ ప్రాణాలకు అపాయాన్ని కలిగించిన పట్టణాలను పునర్దర్శించారు. క్రొత్త గొర్రెలయెడల వారికున్న నిస్వార్థ శ్రద్ధనుబట్టి యెహోవా వారి నాశీర్వదించాడా? అవును, ఆయన వారినాశీర్వదించాడు, ఏలయనగా వారు “శిష్యుల మనస్సులను దృఢపరచి—విశ్వాసమందు నిలుకడగా ఉండవలెనని . . . వారిని హెచ్చరించిరని” వృత్తాంతము తెల్పుతుంది. సరియైన రీతిలో వారు క్రొత్త శిష్యులకు ఇలా చెప్పారు: “అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెను.” (అపొ. కార్యములు 14:21, 22) రానైయున్న దేవుని రాజ్యములో తోడివారసులై యుండు తమ పిలుపును గూర్చి కూడా పౌలు బర్నబాలు వారికి గుర్తుచేశారు. నేడు, మనము కూడా క్రొత్త శిష్యులకు అదే విధమైన ప్రోత్సాహాన్నివ్వాలి. పౌలు బర్నబాలు ప్రకటించిన అదే దేవునిరాజ్య పరిపాలన క్రింద భూమిపై నిత్యజీవ నిరీక్షణను వారి ముందుంచుట ద్వారా, శోధనలు సహించుటకు మనము వారిని బలపరచవచ్చును.
20 ప్రతి పట్టణాన్ని విడిచి వెళ్లుటకు ముందు, స్థానిక సంఘము మరింత వ్యవస్థీకరించబడుటకు పౌలు బర్నబాలు సహాయం చేశారు. వారు అర్హులైన మనుష్యులకు శిక్షణనిచ్చి, నాయకత్వం వహించుటకు వారిని నియమించాడు. (అపొ. కార్యములు 14:23) నిస్సందేహముగా ఇది మరింత విస్తరణకు దోహదపడింది. అదే ప్రకారము నేడు, మిషనరీలు, ఇతరులు బాధ్యత వహించగలుగు రీతిగా అభివృద్ధి చెందుటకై అనుభవము లేనివారికి సహాయముచేసి, ఆ పిమ్మట కొన్నిసార్లు అవసరత ఎక్కువగావున్న ప్రదేశాలలో తమపనిని కొనసాగించడానికి వెళ్తున్నారు.
21, 22. (ఎ) పౌలు బర్నబాలు తమ మిషనరీ యాత్రను పూర్తిచేసిన తర్వాత ఏమి సంభవించింది? (బి) ఇది ఏ ప్రశ్నలను లేవదీస్తుంది?
21 చివరకు ఆ మిషనరీలు సిరియాలోని అంతియొకయకు తిరిగివచ్చినప్పుడు, వారు బహుగా సంతృప్తి పొందియుండవచ్చును. నిజమే, దేవుడు వారికి అప్పగించిన పనిని వారు సంపూర్ణముగా “నెరవేర్చితిరని” బైబిలు నివేదిక తెల్పుచున్నది. (అపొ. కార్యములు 14:26) వారి అనుభవాల వివరణ “సహోదరులందరికిని మహా సంతోషము” కలుగుజేసింది. (అపొ. కార్యములు 15:3) మరి భవిష్యత్ విషయమేమి? వారిప్పుడు తీరిగ్గా వేరే పనేమీలేకుండా తమకు కలిగిన విజయాల్నిగూర్చి ఆలోచిస్తూ కూర్చుంటారా? నిశ్చయంగా కాదు. సున్నతి విషయంలో ఒక నిర్ణయానికి వచ్చేందుకు యెరూషలేమునందలి పరిపాలక సభను సందర్శించిన తర్వాత, వీరిద్దరు మరలా తమ మిషనరీ యాత్రను కొనసాగించారు. ఈసారి వారు వేర్వేరు దిశలకు వెళ్లారు. బర్నబా, మార్కు అను మారుపేరుగల యోహానును తీసికొని కుప్రకు వెళ్లగా, పౌలు క్రొత్త సహవాసిను అనగా సీలను తీసికొని సిరయ, కిలికియ దేశముల ద్వారా ప్రయాణించాడు. (అపొ. కార్యములు 15:39-41) ఈ యాత్రలోనే ఆయన యౌవనుడైన తిమోతిని ఎంచుకొని తనతోపాటు తీసుకు వెళ్లాడు.
22 బర్నబా రెండవ ప్రయాణమందలి ఫలితాన్ని గూర్చి బైబిలు వెల్లడించుటలేదు. పౌలు విషయానికొస్తే, ఆయన ఐరోపానందలి క్రొత్తప్రాంతాలలో సంచారము చేయుచు, కనీసము ఐదు పట్టణాలలో—ఫిలిప్పీ, బెరయ, థెస్సలొనీక, కొరింథు, ఎఫెసులో—సంఘాలు స్థాపించాడు. పౌలుయొక్క అసాధారణమైన విజయానికి కీలకమేది? అవే క్రైస్తవ సూత్రాలు ఈనాడును క్రైస్తవ శిష్యులను తయారుచేయు వారి విషయములోను పనిచేయునా?
మీరు గుర్తుతెచ్చుకొందురా?
◻ అనుకరించుటకు యేసు ఎందుకు ఒక అసాధారణమైన మాదిరిగా ఉన్నాడు?
◻ బర్నబా ఏ విషయంలో మాదిరిగా ఉన్నాడు?
◻ పిసిదియలోని అంతియొకయలో పౌలు యిచ్చిన ప్రసంగమునుండి మనమేమి నేర్చుకొందుము?
◻ పౌలు బర్నబాలు తమకప్పగింపబడిన పనిని ఎట్లు సంపూర్ణముగా నెరవేర్చారు?
[8వ పేజీలోని చిత్రం]
అపొస్తలుడైన పౌలు హింసను సహించుట యౌవనస్థుడైన తిమోతిపై శాశ్వత ముద్రవేసింది