2వ అధ్యాయం
మీరెలా మంచి మనస్సాక్షితో ఉండవచ్చు?
‘నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉండండి.’ —1 పేతురు 3:15, 16.
1, 2. (ఎ) దిక్సూచి ఒక ప్రాముఖ్యమైన పరికరమని ఎందుకు చెప్పవచ్చు? (బి) దానిని మనస్సాక్షితో ఎలా పోల్చవచ్చు?
ఒక నావికుడు మహా సముద్రంలో ఓడ నడిపిస్తున్నాడు. ఒక పైలట్ ఆకాశంలో దట్టంగా అలుముకున్న మబ్బుల్ని ఛేదిస్తూ విమానం నడిపిస్తున్నాడు. వాళ్ల దగ్గర సాధారణంగా అధునాతమైన సాంకేతిక పరికరాలు ఉంటాయి. అవి లేనప్పుడు, కనీసం దిక్సూచి అనే పరికరం కూడా ఉండకపోతే వారు ఘోర ప్రమాదంలోపడే అవకాశం ఉంది.
2 దిక్సూచి అనే పరికరం పైకి మామూలు గడియారంలా కనబడుతుంది. దానిలోని అయస్కాంతపు ముల్లు ఎప్పుడూ ఉత్తర దిక్కును చూపిస్తుంటుంది. అది సరిగ్గా పనిచేసినప్పుడే, ముఖ్యంగా మ్యాప్ సహాయంతో సరిగ్గా ఉపయోగించినప్పుడే మనం ప్రమాదాన్ని తప్పించుకుంటాం. ఒక విధంగా చూస్తే యెహోవా మనకు అమూల్య వరంగా ఇచ్చిన మనస్సాక్షి కూడా ఆ దిక్సూచి లాంటిదే. (యాకోబు 1:17) మనస్సాక్షే లేకపోతే జీవన ప్రయాణంలో మనకు దిక్కుతోచదు. మనస్సాక్షి సరిగ్గా ఉంటే మనల్ని అది సరైన మార్గంలో నడిపిస్తుంది. అసలు మనస్సాక్షి అంటే ఏమిటి? అదెలా పని చేస్తుంది? అనే విషయాలను మనమిప్పుడు పరిశీలిద్దాం. ఆ తర్వాత మనం, (1) మన మనస్సాక్షికి ఎలా శిక్షణనివ్వవచ్చు? (2) ఇతరుల మనస్సాక్షిని ఎందుకు పట్టించుకోవాలి? (3) మంచి మనస్సాక్షిని కాపాడుకోవడం వల్ల వచ్చే ప్రయోజనాలేంటి? అనే ప్రశ్నలకు కూడా జవాబులు తెలుసుకుందాం.
మనస్సాక్షి అంటే ఏమిటి, అదెలా పని చేస్తుంది?
3. (ఎ) “మనస్సాక్షి” అని అనువదించబడిన గ్రీకు పదానికి అర్థం ఏమిటి? (బి) మనుష్యుల్లోని ఏ ప్రత్యేకమైన సామర్థ్యం గురించి అది తెలియజేస్తోంది?
3 బైబిల్లో ‘మనస్సాక్షి’ అని అనువదించబడిన గ్రీకు పదానికి ‘మన గురించి మనకు తెలిసి ఉండడం’ అని అర్థం. భూమ్మీదున్న మరే ప్రాణులకూ దేవుడు ఆ వరాన్ని ఇవ్వలేదు. మనల్ని మనం నిశితంగా పరిశీలించుకుని నైతిక విషయాల్లో సరిగ్గా ఉన్నామో లేదో తెలుసుకొనే సామర్థ్యం మనకుంది. మనలో న్యాయమూర్తిలా పనిచేసే ఈ మనస్సాక్షి మన పనులను, మన ఆలోచనలను, మన నిర్ణయాలను విశ్లేషిస్తుంది. మంచి నిర్ణయాలు తీసుకునేలా అది మనల్ని ప్రేరేపిస్తుంది, చెడు నిర్ణయం తీసుకుంటున్నప్పుడు గద్దిస్తుంది. సరైన నిర్ణయం తీసుకున్నప్పుడు మెచ్చుకుంటుంది, తప్పుడు నిర్ణయం తీసుకున్నప్పుడు బాధిస్తుంది.
4, 5. (ఎ) ఆదాము హవ్వలిద్దరికీ మనస్సాక్షి ఉందని ఎలా చెప్పవచ్చు? (బి) వారు దేవుని ఆజ్ఞను మీరడం వల్ల ఏమి జరిగింది? (సి) క్రీస్తు పూర్వం కూడా నమ్మకస్థులు తమ మనస్సాక్షిని బట్టి నడుచుకున్నారని ఎవరి ఉదాహరణలను బట్టి చెప్పవచ్చు?
4 స్త్రీపురుషులను సృష్టించినప్పుడే దేవుడు వారికి మనస్సాక్షినిచ్చాడు. ఆదాము హవ్వలిద్దరూ తమకు మనస్సాక్షి ఉందని చూపించారు. పాపం చేసిన తర్వాత వారు సిగ్గుతో తలవంచుకున్నప్పుడు ఆ విషయం స్పష్టమయ్యింది. (ఆదికాండము 3:7, 8) మనస్సాక్షి గద్దించినా, వారు తమను సరిదిద్దుకోలేకపోయారు. ఎందుకంటే, వారు ఉద్దేశపూర్వకంగానే దేవుని ఆజ్ఞను మీరారు. వారు యెహోవా దేవునిపై తిరుగుబాటు చేసి కావాలనే ఆయనకు విరోధులయ్యారు. పరిపూర్ణ మానవులుగా వాళ్ళు చేస్తున్నదేమిటో వాళ్ళకు పూర్తిగా తెలుసు. అందుకే వాళ్ళు మళ్లీ దేవునికి దగ్గరవ్వలేకపోయారు.
5 ఆదాము హవ్వల్లా కాకుండా చాలామంది అపరిపూర్ణ మానవులు తమ మనస్సాక్షి చెప్పింది విన్నారు. ఉదాహరణకు నమ్మకస్థుడైన యోబు, “నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును నా ప్రవర్తన అంతటి విషయములో నా హృదయము నన్ను నిందింపదు” అని చెప్పాడు.a (యోబు 27:6) ఆయన తన మనస్సాక్షి చెప్పిన దానిని బట్టి సరిగా ప్రవర్తించాడు, చక్కని నిర్ణయాలు తీసుకున్నాడు. అందుకే తన మనస్సాక్షి అపరాధ భావంతో తనను ‘నిందించడం’ లేదని సంతోషంగా చెప్పాడు. యోబు మనస్సాక్షి స్పందించిన తీరుకు దావీదు మనస్సాక్షి స్పందించిన తీరుకు మధ్య తేడా గమనించండి. యెహోవా దేవుడు రాజుగా నియమించిన సౌలుపట్ల అమర్యాదగా ప్రవర్తించినప్పుడు, “దావీదు మనస్సు నొచ్చు[కుంది].” (1 సమూయేలు 24:5) ఆయన మనస్సాక్షి అలా నొచ్చుకోవడం నిశ్చయంగా దావీదుకు మేలు చేసింది. ఎందుకంటే ఇంకెప్పుడూ అలా అమర్యాదగా ప్రవర్తించకూడదని ఆయన గ్రహించాడు.
6. దేవుడు మానవులందరికీ మనస్సాక్షి అనే వరమిచ్చాడని ఎలా చెప్పవచ్చు?
6 యెహోవా తన సేవకులకు మాత్రమే మనస్సాక్షి అనే వరాన్నిచ్చాడా? దీనికి జవాబు అపొస్తలుడైన పౌలు దైవ ప్రేరణతో రాసిన ఈ మాటల్లో కనిపిస్తుంది: “ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసినయెడల వారు ధర్మశాస్త్రము లేనివారైనను, తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అట్టివారి మనస్సాక్షి కూడ సాక్ష్యమిచ్చుచుండగను, వారి తలంపులు ఒక దానిమీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పులేదని చెప్పుచుండగను, ధర్మశాస్త్రసారము తమ హృదయములయందు వ్రాయబడినట్టు చూపుచున్నారు.” (రోమీయులు 2:14, 15) యెహోవా ఆజ్ఞలేమిటో అస్సలు తెలియనివారు కూడా కొన్నిసార్లు తమ మనస్సాక్షి చెప్పింది విని దేవుని సూత్రాలకు అనుగుణంగా ప్రవర్తిస్తారు.
7. మనస్సాక్షి మనల్ని కొన్నిసార్లు ఎందుకు తప్పుదారి పట్టించవచ్చు?
7 అయితే, మనస్సాక్షి కొన్నిసార్లు మనల్ని తప్పుదారి పట్టించే ప్రమాదముంది. ఎందుకు? దిక్సూచిని ఏదైనా ఇనుప వస్తువు దగ్గర పెడితే అది ఉత్తర దిక్కును చూపించకుండా వేరే దిక్కుకు మళ్లుతుంది. అంతేకాక, మ్యాపు లేకుండా దానిని ఉపయోగిస్తే దాదాపు వ్యర్థం. అలాగే, మనలో స్వార్థ కోరికలు ఎక్కువగా ఉంటే మనస్సాక్షి మనల్ని తప్పుదారి పట్టించే అవకాశముంది. అంతేకాక, దానిని దేవుని వాక్యంలోని ఖచ్చితమైన నిర్దేశాలకు అనుగుణంగా ఉపయోగించకపోతే మనం ప్రాముఖ్యమైన చాలా విషయాల్లో తప్పొప్పులను గ్రహించలేం. కాబట్టి మన మనస్సాక్షి సరిగా పనిచేయాలంటే మనకు యెహోవా పరిశుద్ధాత్మ శక్తి నిర్దేశం అవసరం. “పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతోకూడ సాక్ష్యమిచ్చుచున్నది” అని అపొస్తలుడైన పౌలు రాశాడు. (రోమీయులు 9:1) మన మనస్సాక్షి యెహోవా పరిశుద్ధాత్మ శక్తి నిర్దేశాన్ని అంగీకరిస్తుందో లేదో మనకెలా తెలుస్తుంది? అందుకు మనం మన మనస్సాక్షికి శిక్షణ ఇవ్వాలి.
మనస్సాక్షికి ఎలా శిక్షణ ఇవ్వవచ్చు?
8. (ఎ) కొన్నిసార్లు హృదయ కోరికలు మనస్సాక్షిని ఏమి చేసే అవకాశముంది? (బి) నిర్ణయాలు తీసుకునేముందు మనం ముఖ్యంగా దేని గురించి ఆలోచించాలి? (సి) ఒక క్రైస్తవుడు తీసుకున్న నిర్ణయాన్నిబట్టి అతని మనస్సాక్షి బాధించనంతమాత్రాన అది సరైనదే అని ఎందుకు చెప్పలేం? (అధస్సూచి చూడండి.)
8 మనస్సాక్షి నిర్దేశానుసారంగా మనమెలా నిర్ణయాలు తీసుకోవచ్చు? కొందరు తమ మనసుకు నచ్చింది చేస్తారు. తర్వాత ఏదైనా జరిగితే, “నాకేం బాధ లేదు, నేనేం తప్పు చేయలేదు” అంటారు. అయితే మన హృదయ కోరికలు ఎంతో బలంగా ఉండి కొన్నిసార్లు మన మనస్సాక్షిని తప్పుదారి పట్టిస్తాయి. అందుకే “హృదయము అన్నిటికంటె మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధికలది, దాని గ్రహింపగలవాడెవడు?” అని బైబిలు చెబుతోంది. (యిర్మీయా 17:9) కాబట్టి మనం కేవలం హృదయ కోరికలను బట్టే నిర్ణయాలు తీసుకోకూడదు. ఏదైనా నిర్ణయం తీసుకునేముందు అది యెహోవా దేవునికి ఇష్టమో కాదో ఆలోచించాలి.b
9. (ఎ) దైవభయం అంటే ఏమిటి? (బి) దైవభయం ఉంటే, నిర్ణయాలు తీసుకునే ముందు మనమేమి చేస్తాం?
9 మన మనస్సాక్షికి శిక్షణనిస్తే, మన ఇష్ట ప్రకారం కాక, దైవభయంతో ఆయన ఇష్ట ప్రకారమే నిర్ణయాలు తీసుకుంటాం. దీనికి సంబంధించి ఒక ఉదాహరణను పరిశీలిద్దాం. నమ్మకమైన అధికారియైన నెహెమ్యాకు యెరూషలేము ప్రజల దగ్గర న్యాయంగా పన్నులు, సుంకం వసూలుచేసే అధికారం ఉంది. అయినా ఆయనలా చేయలేదు. ఎందుకు? ఎందుకంటే, యెహోవా ప్రజల్ని బాధిస్తే ఆయన ఆగ్రహానికి గురౌతానేమోనని భయపడ్డాడు. అందుకే ఆయన “దేవుని భయము చేత నేనాలాగున చేయలేదు” అన్నాడు. (నెహెమ్యా 5:15) కాబట్టి దైవభయం అంటే మన పరలోక తండ్రిని బాధపెడతామేమో అనే హృదయపూర్వక భయం ఉండడం ప్రాముఖ్యం. అలాంటి దైవభయం ఉంటేనే, మనం నిర్ణయాలు తీసుకునే ముందు వాటి గురించి దేవుని వాక్యం ఏమి చెబుతోందో పరిశీలించడానికి ప్రయత్నిస్తాం.
10, 11. (ఎ) మద్యం తాగడానికి సంబంధించి బైబిల్లో ఎలాంటి సూత్రాలున్నాయి? (బి) వాటిని పాటించేందుకు దేవుడు మనకెలా సహాయం చేస్తాడు?
10 ఉదాహరణకు, మద్యం తాగే విషయాన్నే తీసుకోండి. పార్టీలకు వెళ్లినప్పుడు, మనలో చాలామంది అక్కడ మద్యం తాగాలో, వద్దో నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. ముందుగా తాగడం గురించి బైబిలు ఏమి చెబుతోందో, దానికి సంబంధించి బైబిల్లో ఎలాంటి సూత్రాలు ఉన్నాయో తెలుసుకోవాలి. ఒక విషయమేమిటంటే, మితంగా మద్యం తాగడాన్ని బైబిలు ఖండించడం లేదు. నిజానికి ద్రాక్షారసం యెహోవా ఇచ్చిన బహుమానమని అది చెబుతోంది. (కీర్తన 104:14, 15) అయితే త్రాగుబోతుతనాన్ని, అల్లరితో కూడిన ఆటపాటల్ని బైబిలు ఖండిస్తోంది. (లూకా 21:34; రోమీయులు 13:13) అంతేకాక, జారత్వం, వ్యభిచారం వంటి ఇతర ఘోరమైన పాపాల్లాగే త్రాగుబోతుతనం కూడా ఒక పాపమేనని బైబిలు చెబుతోంది.c—1 కొరింథీయులు 6:9, 10.
11 అలాంటి బైబిలు సూత్రాలను క్రైస్తవులు తమ జీవితంలో పాటిస్తూ మనస్సాక్షికి శిక్షణనిస్తారు. అప్పుడది మంచి లేదా చెడు చేసినప్పుడు వెంటనే స్పందిస్తుంది. పార్టీలో మద్యం తాగాలో, వద్దో నిర్ణయించుకోవాల్సి వచ్చినప్పుడు మనం ఈ ప్రశ్నలు వేసుకోవాలి: ‘అదెలాంటి పార్టీ? ఆ పార్టీ అదుపుతప్పి, అల్లరితో కూడిన ఆటపాటలతో నిండిపోయే అవకాశం ఉందా? అక్కడ నేనెలా ప్రవర్తిస్తాను? మద్యం తాగాలని ఆశపడతానా? సమస్యల్ని మర్చిపోయేందుకు లేదా వాటిని తప్పించుకునేందుకు తాగాలనుకుంటానా? మితిమీరి తాగకుండా అదుపు చేసుకోగలనా?’ బైబిలు సూత్రాల గురించి, వాటిని తెలుసుకున్నప్పుడు కలిగే సందేహాల గురించి ఆలోచిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా సహాయం చేయమని యెహోవా దేవునికి ప్రార్థించాలి. (కీర్తన 139:23, 24 చదవండి.) అలా చేస్తే యెహోవా సహాయాన్ని పొందడమేకాదు, ఆయన సూత్రాల ప్రకారం మన మనస్సాక్షికి కూడా శిక్షణ ఇస్తాం. అయితే నిర్ణయాలు తీసుకునే ముందు మరో విషయం గురించి కూడా జాగ్రత్తగా ఆలోచించాలి.
ఇతరుల మనస్సాక్షిని ఎందుకు పట్టించుకోవాలి?
మద్యం తాగాలో వద్దో నిర్ణయించుకోవడానికి బైబిలు శిక్షిత మనస్సాక్షి మీకు సహాయం చేస్తుంది
12, 13. (ఎ) క్రైస్తవుల్లో కూడా ఒక్కొక్కరి మనస్సాక్షి ఎందుకు భిన్నంగా ఉంటుంది? (బి) అలాంటి తేడా ఉంటే మనమేమి చేయకూడదు?
12 క్రైస్తవుల్లో కూడా మనస్సాక్షి స్పందించే తీరు చాలా భిన్నంగా ఉంటుంది. కొన్నిసార్లు అది మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు. ఫలానా వాడుక లేదా ఆచారం ఒకరికి తప్పనిపిస్తే, మరొకరికి అనిపించకపోవచ్చు, బహుశా దాన్ని చేయడానికి ఇష్టపడొచ్చు. మద్యం తాగే విషయాన్నే తీసుకుంటే, ఒకరు కొంతమంది స్నేహితులతో కలిసి ఏదైనా సాయంకాలం సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కాస్త మద్యం తాగేందుకు ఇష్టపడవచ్చు. మరొకరు దాన్ని ఇష్టపడకపోవచ్చు. ఎందుకీ తేడా? ఈ తేడాలనుబట్టి మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి?
13 చాలా కారణాలనుబట్టి ప్రజల అభిప్రాయాలు వేర్వేరుగా ఉంటాయి. వారు పుట్టి పెరిగిన పరిస్థితులు భిన్నంగా ఉండవచ్చు. ఉదాహరణకు, కొంతమందికి గతంలో తమ బలహీనతను ఎంత కష్టపడి జయించారో గుర్తుంటుంది. (1 రాజులు 8:38, 39) అలా కష్టపడి, తాగడం మానుకున్నవారు ముఖ్యంగా దాని విషయంలో బాగా ఆలోచిస్తారు. అలాంటి వ్యక్తి మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు ఆయనకు మద్యం ఇచ్చారనుకోండి. ఆయన వద్దంటే మీరు బాధపడతారా? లేదు తీసుకోవాల్సిందే అని పట్టుబడతారా? అలా పట్టుబట్టరు. ఆయన ఎందుకు వద్దంటున్నాడో అందరిముందు చెప్పకపోవచ్చు. కారణాలు మీకు తెలిసినా, తెలియకపోయినా ఆ సహోదరుని మీదున్న ప్రేమతో ఆయనను బలవంతపెట్టకూడదు.
14, 15. (ఎ) మొదటి శతాబ్దపు సంఘంలోని క్రైస్తవుల మనస్సాక్షి ఏ విషయంలో భిన్నంగా ఉంది? (బి) దాని దృష్ట్యా పౌలు ఏమి చేయమని చెప్పాడు?
14 మొదటి శతాబ్దంలోని క్రైస్తవుల్లో కూడా ఒక్కొక్కరి మనస్సాక్షి ఒక్కో విధంగా ఉందని అపొస్తలుడైన పౌలు చెప్పాడు. ఆ కాలంలో కొందరు క్రైస్తవులు విగ్రహాలకు అర్పించిన ఆహారం విషయంలో కలతచెందారు. (1 కొరింథీయులు 10:25) అలాంటి ఆహారాన్ని దుకాణంలో కొన్నప్పుడు పౌలు మనస్సాక్షి గద్దించలేదు. ఎందుకంటే ఆయన దృష్టిలో విగ్రహాలు నిర్జీవమైనవి. ఆహారమిచ్చేది యెహోవాయే కాబట్టి, అది ఆయనదే గానీ విగ్రహాలకు చెందినది కాదు. అయితే తాను అనుకున్నట్లే అందరూ అనుకోరని పౌలు గ్రహించాడు. కొందరు, క్రైస్తవులు కాకముందు ఎక్కువగా విగ్రహారాధన చేసివుండవచ్చు. అందువల్ల, విగ్రహారాధనకు సంబంధించిన ప్రతీదీ వారికి అభ్యంతరకరంగా ఉండవచ్చు. పౌలు ఈ సమస్యనెలా పరిష్కరించాడు?
15 “బలవంతులమైన మనము, మనలను మనమే సంతోషపరచుకొనక, బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై యున్నాము. క్రీస్తుకూడ తన్ను తాను సంతోషపరచుకొనలేదు” అని పౌలు అన్నాడు. (రోమీయులు 15:1, 3) క్రీస్తులాగే మన సంతోషాన్నే చూసుకోకుండా ఇతరుల మనస్సాక్షిని పట్టించుకోవాలి. ఈ విషయాన్నే ప్రస్తావిస్తూ, క్రీస్తు తన ప్రాణమిచ్చి సంపాదించుకున్న విలువైన గొర్రెలను అభ్యంతరపర్చే బదులు తాను మాంసం తినడమే మానేస్తానని పౌలు అన్నాడు.—1 కొరింథీయులు 8:13; 10:23, 24, 31-33 చదవండి.
16. ఒకరి మనస్సాక్షికి ఏదైనా తప్పనిపిస్తే, తమలా ఆలోచించనివారిని ఎందుకు విమర్శించకూడదు?
16 ఏదైనా ఒక విషయం తమ మనస్సాక్షికి తప్పనిపిస్తే అందరూ అలాగే ఆలోచించాలని ఎవరూ పట్టుబట్టకూడదు, ఇతరుల్ని విమర్శించకూడదు. (రోమీయులు 14:10 చదవండి.) మన మనస్సాక్షి చెప్పేదాన్నిబట్టి మనలో ఏదైనా తప్పుందో లేదో చూసుకోవాలి కానీ వేరేవాళ్లలో తప్పులు వెతకకూడదు. “మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు” అని యేసు చెప్పిన మాటలను గుర్తుంచుకోవాలి. (మత్తయి 7:1) సంఘ సభ్యులెవ్వరూ మనస్సాక్షికి సంబంధించిన వ్యక్తిగత విషయాల్లో ఇతరులతో వివాదాలకు దిగకూడదు. ఒకరినొకరం నిందించుకునే బదులు మనం ప్రేమా ఐక్యతల కోసం పాటుపడుతూ పరస్పర క్షేమాభివృద్ధి కోసం కృషిచేస్తాం.—రోమీయులు 14:19.
మంచి మనస్సాక్షివల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి?
మంచి మనస్సాక్షి జీవన ప్రయాణంలో మనకు దారిచూపిస్తూ మనసు ప్రశాంతంగా ఉండేలా, సంతోషాన్ని పొందేలా సహాయం చేస్తుంది
17. నేడు చాలామంది మనస్సాక్షికి ఏమి జరిగింది?
17 ‘నిర్మలమైన మనస్సాక్షి కలిగివుండండి’ అని అపొస్తలుడైన పేతురు రాశాడు. (1 పేతురు 3:15, 16) యెహోవా దేవుని దృష్టిలో నిర్మలమైన అంటే మంచి మనస్సాక్షి కలిగివుండడం గొప్ప వరం. నేడు చాలామందికి అలాంటి మనస్సాక్షి లేదు. పౌలు “వాతవేయబడిన మనస్సాక్షిగల” వాళ్ళ గురించి మాట్లాడాడు. (1 తిమోతి 4:3) వాత వేసినచోట చర్మం కాలి, మచ్చపడి ఆ భాగం మొద్దుబారుతుంది. ఒక విధంగా చెప్పాలంటే చాలామంది మనస్సాక్షి అలాగే వాతవేయబడి మొద్దుబారిపోయింది. అందుకే అది వారిని తప్పు చేస్తున్నప్పుడు హెచ్చరించదు, అడ్డుపడదు, తర్వాత అపరాధ భావాలతో బాధించదు. అయినా వాళ్లు అదేం పట్టనట్టు హాయిగా జీవించేస్తున్నారు.
18, 19. (ఎ) సిగ్గు, అపరాధ భావాలు కలగడంలో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి? (బి) గతంలో చేసిన పాపాల విషయంలో పశ్చాత్తాపపడినా మనస్సాక్షి ఇంకా తీవ్రంగా బాధిస్తుంటే మనమేమి చేయాలి?
18 నిజానికి, మనస్సాక్షి కొన్నిసార్లు అపరాధ భావాలు కలిగించి మనం తప్పుచేస్తున్నామని చూపిస్తుంది. అలాంటి భావాలవల్ల ఒక పాపి పశ్చాత్తాపపడితే, అతను చేసిన ఘోరమైన పాపాలు కూడా క్షమించబడతాయి. ఉదాహరణకు, దావీదు రాజు ఘోరమైన పాపంచేసినా, మనస్ఫూర్తిగా పశ్చాత్తాపపడినప్పుడు దేవుడు క్షమించాడు. అలాంటి తప్పును ఇంకెప్పుడూ చేయకూడదని, యెహోవా ఆజ్ఞలకు లోబడాలని గట్టిగా తీర్మానించుకున్న తర్వాత సొంత అనుభవం ద్వారా యెహోవా ‘దయాళుడనీ, క్షమించుటకు సిద్ధమనస్సుగలవాడనీ’ తెలుసుకున్నాడు. (కీర్తన 51:1-19; 86:5) మనం పశ్చాత్తాపపడి, దేవుడు క్షమించిన తర్వాత కూడా సిగ్గుతో, అపరాధ భావాలతో కుమిలిపోతుంటే ఏమిచేయాలి?
19 తప్పు చేసిన చాలాకాలం తర్వాత కూడా కొన్నిసార్లు మనస్సాక్షి ఆ వ్యక్తిని అపరాధ భావాలతో తీవ్రంగా బాధిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు, దోషారోపణ చేస్తున్న మనస్సాక్షికన్నా యెహోవా గొప్పవాడని అర్థంచేసుకోవాలి. దేవుడు ప్రేమిస్తాడని, క్షమిస్తాడని చెప్పి ఇతరుల్ని ప్రోత్సహించే మనం, మన విషయంలో కూడా దేవుడలాగే చేస్తాడని నమ్మి, ఆయన క్షమించినప్పుడు అంగీకరించాలి. (1 యోహాను 3:19, 20 చదవండి.) అప్పుడు, మనలోని అపరాధ భావాలు తొలగిపోయి మనసు ప్రశాంతంగా ఉంటుంది, సంతోషం మన సొంతమౌతుంది. ఒకప్పుడు ఘోరమైన పాపం చేసిన చాలామంది అలాంటి సంతోషాన్నే అనుభవిస్తూ మంచి మనస్సాక్షిని కాపాడుకుంటూ యెహోవా దేవుని సేవలో కొనసాగుతున్నారు.—1 కొరింథీయులు 6:11.
20, 21. (ఎ) మీకు ఏ విధంగా సహాయం చేసేందుకు ఈ పుస్తకం రూపొందించబడింది? (బి) క్రైస్తవులముగా మనకెలాంటి స్వేచ్ఛవుంది? అయితే దానిని ఎలా ఉపయోగించాలి?
20 అలా సంతోషంగా దేవుని సేవలో కొనసాగడానికే కాక, సాతాను పరిపాలిస్తున్న ఈ కల్లోలభరిత లోకపు అంత్యదినాలలో మంచి మనస్సాక్షితో జీవించేలా దోహదపడేందుకే ఈ పుస్తకం రూపొందించబడింది. ప్రతీరోజూ ఎదుర్కొనే వివిధ పరిస్థితుల్లో మీరు బైబిల్లోని ఏ ఆజ్ఞల గురించి, సూత్రాల గురించి ఆలోచించాలో, పాటించాలో ఈ పుస్తకంలో వివరించడం కష్టం. అంతేకాక, మనస్సాక్షికి సంబంధించిన విషయాల్లో ఇది తప్పు ఇది సరి అని సూటిగా చెప్పే నియమాలుండాలని అనుకోకూడదు. మీరు దైనందిన జీవితంలో దేవుని వాక్యానుసారంగా ఎలా నడుచుకోవాలో అర్థం చేసుకోవడానికి సహాయం చేయాలనేదే ఈ పుస్తకం ఉద్దేశం. అలా చేస్తే మీరు మంచి లేదా చెడు చేస్తున్నప్పుడు వెంటనే స్పందించేలా దానికి మీరు శిక్షణనివ్వగలుగుతారు. మోషే ధర్మశాస్త్రంలో ఉన్నట్టుగా రాతపూర్వక నియమాలనుబట్టి కాదుగానీ, ‘క్రీస్తు నియమాన్ని’ అనుసరించేవారు ఎక్కువగా మనస్సాక్షినిబట్టి, సూత్రాలనుబట్టి జీవించాలి. (గలతీయులు 6:2) అలా యెహోవా క్రైస్తవులకు ఎంతో స్వేచ్ఛనిచ్చాడు. అయితే మనమా స్వేచ్ఛను ‘దుష్టత్వాన్ని కప్పిపెట్టేందుకు’ ఉపయోగించకూడదని ఆయన వాక్యం గుర్తుచేస్తోంది. (1 పేతురు 2:16) అయితే ఆ స్వేచ్ఛను, అవకాశం వచ్చినప్పుడల్లా యెహోవా మీద మనకున్న ప్రేమను వ్యక్తపర్చడానికే ఉపయోగించాలి.
21 యెహోవా దేవుని గురించి మొదటిసారి తెలుసుకున్నప్పుడు మీరు ‘జ్ఞానేంద్రియాలను’ ‘సాధకము చేసుకోవడం’ మొదలుపెట్టారు. (హెబ్రీయులు 5:14) మీరిప్పుడు బైబిలు సూత్రాల ప్రకారం మంచిగా ఎలా జీవించవచ్చో ప్రార్థనాపూర్వకంగా ఆలోచిస్తూ, దాని ప్రకారం ప్రవర్తిస్తుంటే ఆ ప్రాముఖ్యమైన ప్రక్రియను కొనసాగిస్తారు. అలా బైబిలు సూత్రాలకు అనుగుణంగా శిక్షణ ఇవ్వబడిన మీ మనస్సాక్షి దైనందిన జీవితంలో మీకెంతో సహాయం చేస్తుంది. ప్రయాణికుడికి దిక్సూచి సహాయం చేసినట్లే, మన పరలోక తండ్రిని సంతోషపెట్టే నిర్ణయాలు తీసుకునేందుకు మన మనస్సాక్షి మనకు సహాయం చేస్తుంది. దేవుని ప్రేమలో నిలిచివుండాలంటే అదెంతో ప్రాముఖ్యం.
a హెబ్రీ లేఖనాల్లో ‘మనస్సాక్షి’ అనే మాట నేరుగా ఎక్కడా కనిపించదు. అయితే ఈ ఉదాహరణ చూపిస్తున్నట్లుగా మనస్సాక్షిని సూచించే వేరే పదాలు ఉపయోగించబడ్డాయని స్పష్టంగా తెలుస్తోంది. ‘హృదయం’ అనే పదం సాధారణంగా మన అంతరంగాన్ని సూచిస్తుంది. అయితే ఇలాంటి లేఖనాల్లో అది అంతరంగాన్ని మాత్రమే కాదుగానీ మనస్సాక్షిని కూడా సూచిస్తుంది. క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో ‘మనస్సాక్షి’ అని అనువదించబడిన గ్రీకు పదం దాదాపు 30సార్లు కనిపిస్తుంది.
b మనస్సాక్షి నొచ్చుకోనంత మాత్రాన మనం తీసుకున్న నిర్ణయం ఎప్పుడూ సరైనదే అవుతుందని బైబిలు చెప్పడం లేదు. ఉదాహరణకు, “నాయందు నాకు ఏ దోషమును కానరాదు; అయినను ఇందువలన నీతిమంతుడనుగా ఎంచబడను, నన్ను విమర్శించువాడు ప్రభువే” అని పౌలు అన్నాడు. (1 కొరింథీయులు 4:4) పౌలులా క్రైస్తవులను హింసించేవారు కూడా తాము చేస్తున్నది దేవునికి ఇష్టమనే అనుకుంటారు. అలా చేస్తున్నప్పుడు వారి మనస్సాక్షి వారిని బాధించకపోవచ్చు. కాబట్టి, మన నిర్ణయాన్నిబట్టి మన మనస్సాక్షి బాధించనప్పుడే, దేవుని దృష్టిలో కూడా సరైనదిగా ఉన్నప్పుడే అది మంచి నిర్ణయమని చెప్పవచ్చు.—అపొస్తలుల కార్యములు 23:1; 2 తిమోతి 1:3.
c తాగుడుకు అలవాటుపడినవాళ్ళకు మితంగా తాగి ఊరుకోవడం సాధ్యంకాదని చాలామంది డాక్టర్లు చెబుతున్నారు. అంటే తాగుడు అలవాటైనవాళ్ళకు “మితం” అంటే అసలు తాగకూడదనే అర్థం.