కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • lv అధ్యా. 3 పేజీలు 28-40
  • దేవుడు ప్రేమిస్తున్నవారిని ప్రేమించండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దేవుడు ప్రేమిస్తున్నవారిని ప్రేమించండి
  • ‘దేవుని ప్రేమలో నిలిచి ఉండండి’
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • దేవుడు ఎవరిని ప్రేమిస్తాడు?
  • బైబిల్లోని ఉదాహరణల నుండి మనమేమి నేర్చుకోవచ్చు?
  • ఎవరిని స్నేహితులుగా ఎంచుకోవాలి?
  • సమస్యలొచ్చినప్పుడు ఏమిచేయాలి?
  • కొందరితో సహవాసం ఎందుకు మానేయాలి?
  • దేవుణ్ణి ప్రేమించేవాళ్లను స్నేహితులుగా ఎంచుకోండి
    దేవుని ప్రేమలో ఎప్పటికీ నిలిచివుండండి
  • “యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను”
    వాళ్లలా విశ్వాసం చూపించండి
  • మంచి స్నేహితులను మనమెలా ఎంచుకోవచ్చు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2012
  • యోనాతాను ‘దేవుని సహాయముతో జయించాడు’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
మరిన్ని
‘దేవుని ప్రేమలో నిలిచి ఉండండి’
lv అధ్యా. 3 పేజీలు 28-40
పిక్నిక్‌లో సరదాగా గడుపుతున్న కొందరు దైవభక్తిగల ప్రజలు

3వ అధ్యాయం

దేవుడు ప్రేమిస్తున్నవారిని ప్రేమించండి

“జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానముగలవాడగును.”—సామెతలు 13:20.

1-3. (ఎ) బైబిలు ఏ విషయాన్ని సరిగ్గానే చెబుతుంది? (బి) మనపై మంచి ప్రభావం చూపించే స్నేహితుల్ని మనమెలా ఎంచుకోవచ్చు?

ఒక విధంగా చెప్పాలంటే మనం స్పంజిలాంటి వాళ్లమే. స్పంజి నీటిని పీల్చుకున్నట్లే, మనం చుట్టూ ఉన్నవాళ్ల నుంచి ఎన్నో నేర్చుకుంటాం. కొన్నిసార్లు అనుకోకుండానే దగ్గరి స్నేహితుల అభిప్రాయాలను, ఆలోచనలను, గుణగణాలను అలవర్చుకుంటాం.

2 “జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానముగలవాడగును మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును” అని బైబిలు సరిగ్గానే చెబుతోంది. (సామెతలు 13:20) ‘సహవాసం’ అనే పదం సన్నిహితుల మధ్య ఉండే ‘ప్రేమానురాగాల్ని’ సూచిస్తోందని ఒక బైబిలు రెఫరెన్సు పుస్తకం వివరిస్తోంది. మనం ప్రేమించేవారిలా ఉండడానికే ప్రయత్నిస్తామని మీరంగీకరించరా? వాళ్ళంటే మనం ఇష్టపడతాం కాబట్టే మంచైనా చెడైనా వారినుండే ఎంతో నేర్చుకుంటాం.

3 దేవుని ప్రేమలో నిలిచివుండాలంటే మనపై మంచి ప్రభావం చూపించే స్నేహితులనే ఎంచుకోవాలి. ఎలా ఎంచుకోవచ్చు? ఎలాగంటే, దేవుడు ప్రేమిస్తున్నవారిని ప్రేమిస్తూ, ఆయన స్నేహితులనే మన స్నేహితులుగా చేసుకోవాలి. ఒక్కసారి ఆలోచించండి, యెహోవా ఇష్టపడే లక్షణాలున్న వ్యక్తులకు మించిన మంచి స్నేహితులు మనకెక్కడ దొరుకుతారు? కాబట్టి, దేవుడు ఎలాంటివారిని ప్రేమిస్తాడో చూద్దాం. అది తెలుసుకున్నప్పుడు మనపై మంచి ప్రభావం చూపించే స్నేహితుల్ని ఎంచుకోగలుగుతాం.

దేవుడు ఎవరిని ప్రేమిస్తాడు?

4. (ఎ) యెహోవా తన స్నేహితులను జాగ్రత్తగా ఎంచుకోవడం ఎందుకు తప్పుకాదు? (బి) అబ్రాహామును ఆయన ‘నా స్నేహితుడు’ అని ఎందుకు పిలిచాడు?

4 యెహోవా స్నేహితులను చాలా జాగ్రత్తగా ఎంచుకుంటాడు. అలా ఎంచుకోవడం తప్పంటారా? కానేకాదు, ఎందుకంటే విశ్వసర్వాధిపతిగా ఆయనకు ఆ హక్కు ఉంది, ఆయనకు స్నేహితులుగా ఉండడానికి మించిన గౌరవం మరొకటి లేదు. మరి ఆయన ఎలాంటివారిని స్నేహితులుగా ఎంచుకుంటాడు? తనను నమ్మి, తనపై పూర్తి విశ్వాసముంచే వారికే యెహోవా దగ్గరౌతాడు. గొప్ప విశ్వాసం చూపించిన పూర్వీకుడు అబ్రాహాము విషయమే తీసుకోండి. కొడుకును బలి ఇవ్వమని అడగడంకన్నా పెద్ద పరీక్ష ఉండదు.a అయినప్పటికీ ‘మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడు’ అనే పూర్తి విశ్వాసంతో ఇస్సాకును బలిగా అర్పించడానికి అబ్రాహాము సిద్ధపడ్డాడు. (హెబ్రీయులు 11:17-19) అంతటి విశ్వాసాన్ని, విధేయతను చూపించాడు కాబట్టే, యెహోవా ఆప్యాయంగా అబ్రాహామును ‘నా స్నేహితుడు’ అని పిలిచాడు.—యెషయా 41:8; యాకోబు 2:21-23.

5. తనపట్ల యథార్థంగా ఉండేవారిని యెహోవా ఎలా చూస్తాడు?

5 మనస్ఫూర్తిగా విధేయత చూపించడమే యెహోవాకు ఎంతో ప్రాముఖ్యం. ఎలాంటి పరిస్థితుల్లోనైనా తనపట్ల యథార్థంగా ఉండేవారిని ఆయన ప్రేమిస్తాడు. (2 సమూయేలు 22:26 చదవండి.) ప్రేమపూర్వకంగా తనకు లోబడేవారిని యెహోవా ఎంతో ఇష్టపడతాడని మొదటి అధ్యాయంలో చూశాం. కాబట్టి సామెతలు 3:32 “యథార్థవంతులకు ఆయన తోడుగా నుండును” అని చెబుతోంది. తను చెప్పేది నమ్మకంగా చేసేవారిని యెహోవా దేవుడు ఆప్యాయంగా తన “గుడారములో” అతిథులుగా ఉండడానికి ఆహ్వానిస్తాడు. అంటే తనను ఆరాధిస్తూ, ఏ సమయంలోనైనా తనకు ప్రార్థించే సదవకాశం ఇస్తాడు.—కీర్తన 15:1-5.

6. (ఎ) యేసును ప్రేమిస్తున్నామని మనమెలా చూపించవచ్చు? (బి) తన కుమారుణ్ణి ప్రేమించేవారిని యెహోవా ఎలా చూస్తాడు?

6 తన ఒక్కగానొక్క కుమారుడైన యేసును ప్రేమించేవారిని యెహోవా ప్రేమిస్తాడు. “ఒకడు నన్ను ప్రేమించినయెడల వాడు నామాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకువచ్చి వానియొద్ద నివాసము చేతుము” అని యేసు చెప్పాడు. (యోహాను 14:23) మరి యేసును ప్రేమిస్తున్నామని మనమెలా చూపించవచ్చు? సువార్త ప్రకటిస్తూ శిష్యులను చేయమనే ఆజ్ఞతోసహా ఆయనిచ్చిన ఆజ్ఞలన్నిటినీ పాటిస్తే ఆయనను ప్రేమిస్తున్నామని చూపించవచ్చు. (మత్తయి 28:19, 20; యోహాను 14:15, 21) అంతేకాదు, అపరిపూర్ణులమైనా మనం శాయశక్తులా మాటల్లో, చేతల్లో ఆయనలా ఉంటూ ఆయన “అడుగుజాడల్లో” నడిస్తే కూడా ఆయనను ప్రేమిస్తున్నామని చూపించవచ్చు. (1 పేతురు 2:21) క్రీస్తుపట్ల ప్రేమతో ఆయనలా ఉండేందుకు ప్రయత్నించేవారిని చూసి యెహోవా ఎంతో సంతోషిస్తాడు.

7. యెహోవా స్నేహితుల్నే మన స్నేహితులుగా చేసుకోవడం ఎందుకు మంచిది?

7 యెహోవా తన స్నేహితుల్లో విశ్వాసం, విధేయత, యథార్థత వంటి లక్షణాలు ఉండాలని కోరుకుంటాడు. అంతేగాక వారు యేసును, ఆయన జీవన విధానాన్ని ప్రేమించాలని ఆశిస్తాడు. కాబట్టి మనలో ప్రతీ ఒక్కరం ఇలా ప్రశ్నించుకోవాలి: ‘నా స్నేహితుల్లో అలాంటి లక్షణాలు ఉన్నాయా, వారు యేసు అనుసరించిన జీవన విధానాన్నే అనుసరిస్తున్నారా? యెహోవా స్నేహితుల్నే నా స్నేహితులుగా చేసుకున్నానా?’ అలా చేసుకోవడమే మంచిది. దైవలక్షణాల్ని అలవర్చుకొని, ఉత్సాహంగా రాజ్య సువార్తను ప్రకటించేవారితో మనం స్నేహం చేస్తే వారి మంచి ప్రభావం మనపై ఉండి, మనమూ వారిలా దేవునికి ఇష్టమైన విధంగా జీవించాలనుకుంటాం.—33వ పేజీలోని “మంచి స్నేహితులంటే ఎవరు?” అనే బాక్సు చూడండి.

మంచి స్నేహితులంటే ఎవరు?

ఇద్దరు మంచి స్నేహితులు మాట్లాడుకుంటున్నారు

సూత్రం: “నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును.”—సామెతలు 17:17.

ఈ ప్రశ్నలు వేసుకోండి . . .

  • నా స్నేహితులు యెహోవాకు, యేసుకు కూడా స్నేహితులేనా?—యోహాను 15:14, 16; యాకోబు 2:23.

  • నేను మంచి లక్షణాలు అలవర్చుకోవడానికి నా స్నేహితులు నాకు సహాయం చేస్తారా?—1 కొరింథీయులు 15:33.

  • అవసరమైతే నన్ను సరిదిద్దేంత ప్రేమ వాళ్ళలో ఉందా?—కీర్తన 141:5; సామెతలు 27:6.

  • నా మాటలు, క్రియలు నేను మంచి స్నేహితుణ్ణని చూపిస్తున్నాయా?—సామెతలు 12:18; 1 యోహాను 3:16-18.

బైబిల్లోని ఉదాహరణల నుండి మనమేమి నేర్చుకోవచ్చు?

8. (ఎ) నయోమి రూతుల, (బి) ముగ్గురు హెబ్రీ యువకుల, (సి) పౌలు తిమోతిల స్నేహంలో మీకు ఏ విషయం బాగా నచ్చింది?

8 మంచి స్నేహితుల్ని ఎంచుకొని ప్రయోజనం పొందిన చాలామంది ఉదాహరణలు బైబిల్లో ఉన్నాయి. మీరు బైబిల్లో నయోమి, ఆమె కోడలు రూతు గురించి, బబులోనులో ప్రాణస్నేహితులుగా మెలిగిన ముగ్గురు హెబ్రీ యువకుల గురించి, పౌలు తిమోతిల స్నేహం గురించి చదవొచ్చు. (రూతు 1:16; దానియేలు 3:17, 18; 1 కొరింథీయులు 4:17; ఫిలిప్పీయులు 2:20-22) అయితే మనమిప్పుడు దావీదు యోనాతానుల గొప్ప స్నేహం గురించి చూద్దాం.

9, 10. ఏయే కారణాలనుబట్టి దావీదు యోనాతానులు స్నేహితులయ్యారు?

9 దావీదు గొల్యాతును చంపిన తర్వాత, “యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను; యోనాతాను దావీదును తనకు ప్రాణస్నేహితునిగా భావించుకొని అతని ప్రేమించెను” అని బైబిలు చెబుతోంది. (1 సమూయేలు 18:1) అలా వారిమధ్య స్నేహం చిగురించింది. వారిద్దరి వయసుల్లో చాలా తేడావున్నా, యుద్ధభూమిలో యోనాతాను మరణించేంత వరకు వారు ప్రాణ స్నేహితులుగానే ఉన్నారు.b (2 సమూయేలు 1:26) వారు ప్రాణ స్నేహితులవడానికి కారణమేమిటి?

10 వారిద్దరికీ దేవుని మీద ప్రేమ, ఆయన పట్ల నమ్మకంగా ఉండాలనే బలమైన కోరిక ఉన్నందువల్లే ప్రాణ స్నేహితులయ్యారు. వారిద్దరూ దేవుణ్ణి సంతోషపెట్టాలని కోరుకున్నారు. ఇద్దరిలోనూ మంచి లక్షణాలు ఉండడంతో మిత్రులయ్యారు. యెహోవా నామాన్ని ఘనపర్చిన దావీదు ధైర్యసాహసాలను చూసి యోనాతాను ముగ్ధుడయ్యాడు. అలాగే యోనాతాను పెద్దవాడైనప్పటికీ దావీదును రాజుగా చేయడానికి యెహోవా చేసిన ఏర్పాట్లతో సహకరించి, నిస్వార్థంగా తన క్షేమమే కోరినందుకు దావీదు ఆయనను గౌరవించాడు. ఆ తర్వాత యోనాతాను తండ్రియైన సౌలు నుండి దావీదుకు ఒక సమస్య ఎదురైంది. చెడ్డవాడైన ఆ రాజునుండి తప్పించుకునేందుకు అరణ్యంలోకి పారిపోయిన దావీదు నిరాశానిస్పృహలకు లోనయ్యాడు. అప్పుడు యోనాతాను తన స్నేహితుని పట్ల ఎంతో నమ్మకంగా ఉండి స్వయంగా ‘దావీదు నొద్దకు వెళ్ళి, దేవుని బట్టి ఆయనను బలపరిచాడు.’ వారి స్నేహం గొప్పదనడానికి ఇదొక మంచి ఉదాహరణ. (1 సమూయేలు 23:16, 17) తన ప్రాణ స్నేహితుడు తన దగ్గరకొచ్చి తనను ఓదార్చినప్పుడు దావీదు ఎంత సంతోషించి వుంటాడో ఊహించండి!c

11. దావీదు యోనాతానుల నుండి స్నేహం గురించి మనమేమి నేర్చుకోవచ్చు?

11 దావీదు యోనాతానుల స్నేహం నుండి మనమేమి నేర్చుకోవచ్చు? ముఖ్యమైన విషయమేమిటంటే స్నేహితులిద్దరికీ ఆధ్యాత్మిక విషయాలపట్ల ఆసక్తి ఉండాలి. మన స్నేహితులకు కూడా మన నమ్మకాలే ఉండాలి, నైతిక విషయాల గురించి మనలాగే ఆలోచించాలి, దేవునికి నమ్మకంగా సేవ చేయాలనే కోరిక ఉండాలి. అలా ఉన్నప్పుడు వారితో మన ఆలోచనల్ని, అనుభూతుల్ని, అనుభవాలను పంచుకుని పరస్పరం ప్రోత్సహించుకొనే అవకాశముంటుంది. (రోమీయులు 1:11, 12 చదవండి.) తోటి ఆరాధకుల్లో అలాంటి వాళ్ళుంటారు. అంటే రాజ్యమందిరానికొచ్చే ఎవరినైనా స్నేహితులుగా చేసుకోవచ్చనా? కాదు.

ఎవరిని స్నేహితులుగా ఎంచుకోవాలి?

12, 13. (ఎ) తోటి క్రైస్తవుల్లో స్నేహితులను ఎంచుకునేటప్పుడు కూడా ఎందుకు జాగ్రత్తగా ఉండాలి? (బి) మొదటి శతాబ్దపు సంఘాల్లో ఎలాంటి సమస్య ఉండేది? దాని విషయంలో పౌలు తీవ్రంగా ఏమని హెచ్చరించాడు?

12 మనం దేవునికి దగ్గరయ్యేందుకు తోడ్పడే స్నేహితులే కావాలంటే, సంఘంలో కూడా స్నేహితుల్ని ఎంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇదేంటని ఆశ్చర్యపోవాలా? అక్కర్లేదు. ఒకే చెట్టుకున్న కొన్ని కాయలు పండడానికి కాస్త ఎక్కువ సమయం పట్టినట్లే, సంఘంలో కొంతమంది క్రైస్తవులకు దేవునితో దగ్గరి సంబంధాన్ని ఏర్పర్చుకోవడానికి కాస్త ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి ప్రతీ సంఘంలో ఆధ్యాత్మికంగా ఒకొక్కరి పరిస్థితి ఒక్కోవిధంగా ఉంటుంది. (హెబ్రీయులు 5:12–6:3) అలాగని కొత్తవారికి దూరంగా ఉండమని కాదు. వారు ఆధ్యాత్మికంగా ఎదగాలనే ఉద్దేశంతో మనం వారికి ఓపికతో, ప్రేమతో సహాయం చేస్తాం.—రోమీయులు 14:1; 15:1.

13 సహవాసం విషయంలో మనం కొన్నిసార్లు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొందరి ప్రవర్తన సరిగా ఉండకపోవచ్చు. మరికొందరు ఫిర్యాదుచేసే స్వభావాన్ని అలవర్చుకొని ఉండవచ్చు. సా.శ. మొదటి శతాబ్దంలోని సంఘాల్లో కూడా ఇలాంటి సమస్యే ఉండేది. ఆ సంఘాల్లో ఎక్కువమంది నమ్మకంగా ఉన్నా, కొంతమంది మాత్రం తప్పుదారిపట్టారు. ఉదాహరణకు కొరింథు సంఘంలోని కొంతమంది కొన్ని క్రైస్తవ బోధలను ఒప్పుకోలేదు, అందుకే అపొస్తలుడైన పౌలు “మోసపోకుడి. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును” అని ఆ సంఘాన్ని హెచ్చరించాడు. (1 కొరింథీయులు 15:12, 33) అలాగే తోటి క్రైస్తవుల్లో కూడా కొందరి ప్రవర్తన సరిగా ఉండదని, అలాంటి వారి సహవాసానికి దూరంగా ఉండమని పౌలు తిమోతిని హెచ్చరించాడు.—2 తిమోతి 2:20-22 చదవండి.

14. స్నేహం గురించి పౌలు ఇచ్చిన హెచ్చరికలో మనకెలాంటి పాఠం ఉంది?

14 పౌలు ఇచ్చిన హెచ్చరికలో మనకెలాంటి పాఠం ఉంది? సంఘంలో గానీ, బయట గానీ మనపై చెడు ప్రభావం చూపించేవాళ్ళతో సన్నిహితంగా సహవసించకూడదు. (2 థెస్సలొనీకయులు 3:6, 7, 14) యెహోవాతో మన సంబంధాన్ని కాపాడుకోవాలి. స్పంజిలాగే మనం మన స్నేహితుల స్వభావాన్ని, లక్షణాల్ని ఇట్టే అలవర్చుకుంటామని గుర్తుంచుకోండి. స్పంజిని మురికి నీళ్లలో ముంచి అది మంచి నీటిని పీల్చుకుంటుందని అనుకోం కదా, అలాగే మనపై చెడు ప్రభావం చూపించేవాళ్లతో స్నేహం చేస్తే మంచి అలవాట్లు అబ్బుతాయని అనుకోకూడదు.—1 కొరింథీయులు 5:6.

తోటి ఆరాధకుల్లోనే మీకు మంచి స్నేహితులు దొరుకుతారు

15. సంఘంలో ఆధ్యాత్మిక విషయాలకు ప్రాధాన్యతనిచ్చే స్నేహితులు దొరకాలంటే ఏమి చేయాలి?

15 మంచి విషయమేమిటంటే, సంఘంలో మనకు చాలామంది మంచి స్నేహితులు దొరుకుతారు. (కీర్తన 133:1) కానీ ఆధ్యాత్మిక విషయాలకు ప్రాధాన్యతనిచ్చే స్నేహితులు దొరకాలంటే ఏమి చేయాలి? మీరు దైవిక లక్షణాల్ని అలవర్చుకొని, ఆయన ఇష్టపడేలా జీవిస్తుంటే మీలాగే ఆలోచించేవారు మీకు దగ్గరౌతారు. అదే సమయంలో మీరు కూడా చొరవ తీసుకొని స్నేహితులను సంపాదించుకొనే ప్రయత్నం చేయాలి. (34వ పేజీలో “మేమెలా మంచి స్నేహితులను సంపాదించుకున్నాం?” అనే బాక్సు చూడండి.) మీరిష్టపడే లక్షణాలున్నవారికోసం చూడండి. “మీ హృదయములను విశాలపరచుకొనుడి” అనే బైబిలు ఉపదేశాన్ని పాటిస్తూ తెగ, జాతి, సంస్కృతి అనే తేడా లేకుండా అందరితోనూ స్నేహం చేయడానికి ప్రయత్నించండి. (2 కొరింథీయులు 6:13; 1 పేతురు 2:17 చదవండి.) కేవలం మీ తోటి వయస్కులతోనే స్నేహం చేయకండి. యోనాతాను దావీదుకన్నా చాలా పెద్దవాడని చూశాం కదా. పెద్దవాళ్లకెంతో అనుభవం, జ్ఞానం ఉంటుంది కాబట్టి వాళ్లతో స్నేహం చేయడం ఫలదాయకంగా ఉంటుంది.

మేమెలా మంచి స్నేహితులను సంపాదించుకున్నాం?

“సంఘంలో ఎవరితో స్నేహం చేయాలన్నా ఒకప్పుడు నాకు చాలా కష్టంగా ఉండేది. క్రమంగా పరిచర్యకు వెళ్ళడం వల్ల నేను ఓపికను, సహనాన్ని, స్వయంత్యాగ స్వభావాన్ని అలవర్చుకున్నాను. దానికి ఇంకా కృషిచేస్తూనే ఉన్నాను. అది గమనించి నాలాగే ఆలోచించేవారు నాకు దగ్గరయ్యారు. నాకిప్పుడు కొంతమంది మంచి స్నేహితులున్నారు.”—శివానీ.

“సంఘంలో స్నేహితులు దొరకాలని నేను ప్రార్థించాను. అయితే చాలాకాలం వరకు ఆ ప్రార్థనకు జవాబు దొరకలేదు అనిపించింది. నిజానికి స్నేహితుల్ని సంపాదించుకోవడానికి నేనే ఏమీ చేయట్లేదని, ఎవరి దగ్గరకు వెళ్ళి మాట్లాడడం లేదని గ్రహించాను. ప్రార్థనతో పాటు దానికి తగిన చర్యలు తీసుకున్నప్పుడు యెహోవా నా ప్రార్థనలకు జవాబిచ్చాడని అనిపించింది.”—రయెన్‌.

సమస్యలొచ్చినప్పుడు ఏమిచేయాలి?

16, 17. సంఘంలో ఎవరైనా మనల్ని బాధపెడితే సంఘంతో సహవసించడం ఎందుకు మానేయకూడదు?

16 సంఘంలో ఒక్కొక్కరిదీ ఒక్కో వ్యక్తిత్వం ఒక్కో నేపథ్యం కాబట్టి, అప్పుడప్పుడు సమస్యలు రాకతప్పవు. సంఘంలో ఎవరైనా ఏమైనా అంటే లేదా ఏదైనా చేస్తే మనకు బాధ కలగవచ్చు. (సామెతలు 12:18) కొన్నిసార్లు ఇతరులతో పడకపోవడం వల్ల, అపార్థాలవల్ల లేదా అభిప్రాయ భేదాలవల్ల సమస్యలు తలెత్తవచ్చు. అలాగని సంఘంతో సహవసించడం మానేస్తామా? యెహోవాను, ఆయన ప్రేమిస్తున్నవారిని నిజంగా ప్రేమిస్తే అలా మానేయం.

17 యెహోవా మన సృష్టికర్త, మనం జీవించడానికి అవసరమైనవన్నీ సమకూరుస్తున్న దేవుడు కాబట్టి మనమాయనను ప్రేమించాలి, ఆయనపట్ల సంపూర్ణ భక్తి కలిగివుండాలి. (ప్రకటన 4:10, 11) అంతేకాదు, ఆయన ఇష్టపూర్వకంగా ఉపయోగిస్తున్న సంఘానికి కూడా మనం నమ్మకంగా మద్దతివ్వాలి. (హెబ్రీయులు 13:17) కాబట్టి సంఘంలో ఎవరైనా మనల్ని బాధపెడితే, దానికి నిరసనగా సంఘంతో సహవసించడం మానేయం. అయినా అలా మానేయడంలో అర్థమేమైనా ఉంటుందా? మనల్ని బాధపెట్టింది యెహోవా దేవుడు కాదు కదా! యెహోవా పట్ల మనకున్న ప్రేమ ఆయనను గానీ ఆయన ప్రజలను గానీ విడిచి వెళ్లనివ్వదు.—ప్రసంగి 7:9.

18. (ఎ) సంఘంలో శాంతియుత వాతావరణాన్ని కాపాడేందుకు మనమేమి చేయవచ్చు? (బి) సరైన కారణమున్నప్పుడు క్షమించడం ఎలాంటి ఆశీర్వాదాలు తెస్తుంది?

18 మనకు తోటి ఆరాధకులపట్ల ప్రేమ ఉంటే సంఘంలో శాంతియుత వాతావరణానికి తోడ్పడతాము. తాను ప్రేమిస్తున్నవారు పరిపూర్ణంగా ఉండాలని యెహోవా ఆశించడు, మనమూ అలా ఆశించకూడదు. మనలో ప్రేమవుంటే చిన్నచిన్న తప్పులను మన్నిస్తాం, అపరిపూర్ణులుగా అందరం తప్పులు చేస్తామని గుర్తుంచుకుంటాం. (సామెతలు 17:9; 1 పేతురు 4:8) ఎల్లప్పుడూ ‘ఒకరి నొకరం క్షమించుకుంటాం.’ (కొలొస్సయులు 3:13) ఈ సలహాను పాటించడం అన్ని సమయాల్లో అంత సులభంగా ఉండదు. ఎవరైనా బాధపెట్టినప్పుడు దాన్నే మనసులో ఉంచుకుంటే అది పగగా మారవచ్చు. ఆ కోపంలో మనం వారితో సరిగా ఉండకుండా ఏదోక రీతిలో వారిని శిక్షిస్తున్నామనుకుంటాం. నిజానికి, పగ పెంచుకోవడం మనకే హానికరం. సరైన కారణమున్నప్పుడు క్షమించడం మనకెన్నో ఆశీర్వాదాలు తెస్తుంది. (లూకా 17:3, 4) అలా చేయడం వల్ల మన మనసు ప్రశాంతంగా ఉంటుంది, సంఘంలో శాంతియుత వాతావరణం ఉంటుంది, అన్నిటికన్నా మిన్నగా యెహోవాతో మన సంబంధం పాడవదు.—మత్తయి 6:14, 15; రోమీయులు 14:19.

కొందరితో సహవాసం ఎందుకు మానేయాలి?

19. ఎలాంటి పరిస్థితులు తలెత్తినప్పుడు ఒక వ్యక్తితో సహవాసం మానుకోవాల్సి ఉంటుంది?

19 సంఘంలో ఎవరైనా దేవుని నియమాన్ని ఉల్లంఘించి పశ్చాత్తాపం చూపించకపోతే లేదా విశ్వాసభ్రష్టులై తప్పుడు సిద్ధాంతాలు బోధిస్తే వాళ్ళను సంఘం నుండి బహిష్కరిస్తారు. కొందరు కావాలని సంఘం విడిచి వెళ్ళిపోతారు. అలాంటివాళ్ళతో సహవసించకూడదని సంఘ పెద్దలు చెప్పవచ్చు. దేవుని వాక్యం కూడా వాళ్ళతో “సాంగత్యము చేయకూడదు” అని స్పష్టంగా చెబుతోంది.d (1 కొరింథీయులు 5:11-13 చదవండి; 2 యోహాను 9-11) వాళ్ళు మన స్నేహితులో లేదా బంధువులో అయితే వాళ్ళతో సహవాసం మానేయడం చాలా కష్టంగా ఉండవచ్చు. యెహోవా పట్ల, ఆయన నీతిసూత్రాల పట్ల నమ్మకంగా ఉండడమే ప్రాముఖ్యమని చూపిస్తూ వాళ్ళతో సహవసించడం మానేస్తామా? మనం నమ్మకంగా ఆయన మాట వింటూ ఉండడమే యెహోవాకు ఇష్టమని మర్చిపోకూడదు.

20, 21. (ఎ) బహిష్కరించడం ఒక ప్రేమగల ఏర్పాటు అని ఎందుకు చెప్పవచ్చు? (బి) మనం ఎందుకు స్నేహితుల్ని చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి?

20 బహిష్కరించడం అనేది నిజానికి యెహోవా చేసిన ఒక ప్రేమగల ఏర్పాటు. పశ్చాత్తాపం చూపించని వ్యక్తిని బహిష్కరించినప్పుడు మనకు యెహోవా పట్ల ప్రేమ ఉందని, ఆయన పరిశుద్ధ నామం పట్ల, ఆయన నియమాల పట్ల గౌరవం ఉందని చూపిస్తాము. (1 పేతురు 1:14-16) అలాగని ఎందుకు చెప్పవచ్చు? ఎందుకంటే బహిష్కరించడం సంఘాన్ని సురక్షితంగా ఉంచుతుంది. ఉద్దేశపూర్వకంగా పాపం చేసినవాళ్ల హానికర ప్రభావం నుండి నమ్మకమైన సంఘ సభ్యులకు రక్షణ లభిస్తుంది. అంతేగాక తాము దుష్ట లోకంలోనేవున్నా సంఘంలో సురక్షితంగా ఉన్నామనే ధైర్యంతో క్రైస్తవులు ఆరాధనను కొనసాగించగలుగుతారు. (1 కొరింథీయులు 5:7; హెబ్రీయులు 12:15, 16) ప్రేమ ఉండడంవల్లే తప్పిదస్థుని మీద క్రమశిక్షణా చర్య తీసుకోబడుతుంది. అతడు తన తప్పు తెలుసుకొని, యెహోవా దగ్గరకు తిరిగి వచ్చేలా సహాయం చేయాలనే ఉద్దేశంతోనే అలా చేయబడుతుంది.—హెబ్రీయులు 12:11.

21 స్నేహితులు మనపై ఎంతో ప్రభావం చూపిస్తారన్నది తెలిసిందే. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా స్నేహితుల్ని ఎంచుకోవాలి. యెహోవాకు స్నేహితులుగా ఉన్నవారినే స్నేహితులుగా చేసుకొని, దేవుడు ప్రేమిస్తున్నవారిని ప్రేమించినప్పుడు మనకు మంచి స్నేహితులే దొరుకుతారు. వారినుండి మంచి విషయాలు నేర్చుకుంటే, వారిలాగే ఎల్లప్పుడూ యెహోవాకు ఇష్టమైన విధంగా జీవించగలుగుతాం.

a యెహోవా తన ఏకైక కుమారుణ్ణి త్యాగపూరితంగా బలి ఇవ్వబోతున్నాననే విషయాన్ని అబ్రాహాము, ఇస్సాకుల గురించిన వృత్తాంతంలో వెల్లడిచేశాడు. (యోహాను 3:16) కానీ, అబ్రాహాము బలి ఇవ్వబోతుండగా యెహోవా జోక్యం చేసుకొని ఓ పొట్టేలును చూపించాడు. అప్పుడు అబ్రాహాము ఇస్సాకుకు బదులు దాన్ని బలిచ్చాడు.—ఆదికాండము 22:1, 2, 9-13.

b గొల్యాతును చంపినప్పుడు దావీదు కేవలం ‘బాలుడు.’ అయితే యోనాతాను మరణించే నాటికి దావీదుకు దాదాపు 30 ఏళ్లు. (1 సమూయేలు 17:33; 31:2; 2 సమూయేలు 5:4) యోనాతాను దాదాపు 60 ఏళ్ల వయసులో చనిపోయాడు కాబట్టి, ఆయన దావీదుకన్నా దాదాపు 30 ఏళ్లు పెద్దవాడు అని చెప్పవచ్చు.

c మొదటి సమూయేలు 23:16, 17⁠లో ఉన్నట్లుగా, దావీదును ఓదార్చడానికి యోనాతాను ఈ ఐదు విషయాల గురించి మాట్లాడాడు: (1) సౌలు ప్రయత్నాలు విఫలమౌతాయని చెప్పాడు. (2) భయపడవద్దని ప్రోత్సహించాడు. (3) దేవుడు చెప్పినట్లే రాజవుతాడని గుర్తుచేశాడు. (4) తాను సహకారిగా ఉంటానని వాగ్దానం చేశాడు. (5) ఆ విషయం సౌలుకు కూడా తెలుసని చెప్పాడు.

d బహిష్కరించబడిన లేదా సహవాసం మానుకున్న వ్యక్తులతో ఎలా వ్యవహరించాలో ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి అనుబంధంలో 237-239 పేజీలు చూడండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి