కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • lv అధ్యా. 1 పేజీలు 4-15
  • ‘దేవుణ్ణి ప్రేమించడం’ అంటే ఏమిటి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ‘దేవుణ్ణి ప్రేమించడం’ అంటే ఏమిటి?
  • ‘దేవుని ప్రేమలో నిలిచి ఉండండి’
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ‘దేవుణ్ణి ప్రేమించడం’ అంటే ఏమిటి?
  • ‘ఆయన ఆజ్ఞలకు’ లోబడతాం
  • “ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు”
  • దేవుని ప్రేమ ఎప్పటికీ ఉంటుంది
    దేవుని ప్రేమలో ఎప్పటికీ నిలిచివుండండి
  • మిమ్మల్ని ప్రేమించే దేవుణ్ణి ప్రేమించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2006
  • ‘దేవుని ప్రేమలో నిలిచి ఉండండి’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2009
  • హృదయంలో ప్రేమకు సంబంధించిన ధర్మవిధి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
మరిన్ని
‘దేవుని ప్రేమలో నిలిచి ఉండండి’
lv అధ్యా. 1 పేజీలు 4-15
సముద్రం దగ్గర సూర్యాస్తమయం అవుతున్న చక్కని దృశ్యం

1వ అధ్యాయం

‘దేవుణ్ణి ప్రేమించడం’ అంటే ఏమిటి?

“మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట; ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు.”—1 యోహాను 5:3.

1, 2. యెహోవా దేవుణ్ణి మీరెందుకు ప్రేమిస్తున్నారు?

మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారా? మీరిప్పటికే మీ జీవితాన్ని యెహోవాకు సమర్పించుకొనివుంటే దానికి మీరు అవుననే జవాబిస్తారు. యెహోవాయే ముందుగా మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం సహజంగానే ఆయనను ప్రేమిస్తాం. ఎందుకంటే బైబిలు, “[యెహోవాయే] మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము” అని చెబుతోంది.—1 యోహాను 4:19.

2 మనపై ప్రేమ ఉందని చూపించడానికి యెహోవాయే చొరవ తీసుకుని ఎన్నో చేశాడు. మనం నివసించడానికి అందమైన భూమినిచ్చాడు. జీవించడానికి అవసరమైనవన్నీ అనుగ్రహిస్తున్నాడు. (మత్తయి 5:43-48) మరి ముఖ్యంగా మన ఆధ్యాత్మిక అవసరాలు కూడా తీరుస్తున్నాడు. ఆయన తన వాక్యమైన బైబిలును ఇచ్చాడు. అంతేకాదు ప్రార్థించే అవకాశాన్ని కల్పించాడు. మనం ప్రార్థించినప్పుడు ఆలకిస్తాననీ, మనకు సహాయం చేయడానికి పరిశుద్ధాత్మ శక్తిని ఇస్తాననీ హామీ ఇస్తున్నాడు. (కీర్తన 65:2; లూకా 11:13) అన్నిటికన్నా ముఖ్యంగా, మనల్ని పాపమరణాలనే దాసత్వం నుండి విడిపించడానికి తనకెంతో ప్రియమైన ఒక్కగానొక్క కుమారుణ్ణి పంపించాడు. యెహోవా ప్రేమ నిజంగా అపారమైనది.—యోహాను 3:16; రోమీయులు 5:8 చదవండి.

3. (ఎ) దేవుని ప్రేమలో నిలిచి ఉండాలంటే మనమేమి చేయాలి? (బి) మనం ఏ ప్రాముఖ్యమైన ప్రశ్న వేసుకోవాలి? దీనికి జవాబు ఎక్కడ లభిస్తుంది?

3 తన ప్రేమనుండి మనమెప్పటికీ ప్రయోజనం పొందుతూ ఉండాలని యెహోవా ఇష్టపడుతున్నాడు. కానీ మనమలా ప్రయోజనం పొందుతామా లేదా అనేది మన చేతుల్లోనే ఉంది. ‘నిత్యజీవార్థమై దేవుని ప్రేమలో నిలిచి ఉండండి’ అని దేవుని వాక్యం మనల్ని ప్రోత్సహిస్తోంది. (యూదా 20, 21) ‘నిలిచి ఉండండి’ అనే మాటలను బట్టి చూస్తే మనకు దేవునిపట్ల ఉన్న ప్రేమను క్రియల్లో చూపించాలని తెలుస్తుంది. కాబట్టి మనం, ‘నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని క్రియల్లో ఎలా చూపించాలి?’ అనే ప్రాముఖ్యమైన ప్రశ్న వేసుకోవాలి. దీనికి జవాబు అపొస్తలుడైన యోహాను దేవుని ప్రేరణతో రాసిన ఈ మాటల్లో కనిపిస్తుంది: “మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట; ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు.” (1 యోహాను 5:3) మనం దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నామో చూపించాలనుకుంటాం కాబట్టి, ఈ మాటల అర్థమేమిటో మనం సరిగ్గా గ్రహించాలి.

‘దేవుణ్ణి ప్రేమించడం’ అంటే ఏమిటి?

4, 5. మీరు ఎప్పుడు దేవుణ్ణి ప్రేమించడం మొదలుపెట్టారో వివరించండి.

4 పై పేరాలో చూసినట్లుగా, అపొస్తలుడైన యోహాను ‘దేవుణ్ణి ప్రేమించడం’ అంటే ఏమిటో వివరించాడు. తర్వాతి పేరాల్లో మనం ఆయన చెప్పిన మాటలను నిశితంగా పరిశీలిస్తాం. అయితే దానికి ముందు, మీరెప్పుడు యెహోవాను ప్రేమించడం మొదలుపెట్టారో మీకు గుర్తుందా?

ఒకతను ప్రార్థిస్తున్నాడు
దేవునికి చేసుకున్న సమర్పణకు సూచనగా ఒకతను నీళ్లల్లో బాప్తిస్మం తీసుకుంటున్నాడు

యెహోవాకు ప్రేమతో విధేయత చూపించే జీవితానికి, సమర్పించుకుని బాప్తిస్మం తీసుకోవడమే తొలిమెట్టు

5 యెహోవా గురించి, ఆయన ఉద్దేశాల గురించి మొదటిసారి తెలుసుకుని, ఆయనను నమ్మడం మొదలుపెట్టిన సమయాన్ని ఒకసారి గుర్తుచేసుకోండి. మీరు పాపులుగా ఉన్నందువల్ల యెహోవాతో ఎలాంటి సంబంధం ఏర్పర్చుకోలేకపోయారు, అయినా ఆదాము కోల్పోయిన పరిపూర్ణతను మీరు పొంది నిత్యం జీవించేలా క్రీస్తు ద్వారా దేవుడు ఒక ఏర్పాటు చేశాడని అర్థం చేసుకున్నారు. (మత్తయి 20:28; రోమీయులు 5:12, 18) మన కోసం చనిపోవడానికి తనకెంతో ప్రియమైన ఒకగానొక్క కుమారుణ్ణి పంపించి యెహోవా దేవుడు ఎంత గొప్ప త్యాగం చేశాడో మీరు గ్రహించారు. మీ హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది. దాంతో మిమ్మల్ని అంతగా ప్రేమిస్తున్న దేవుణ్ణి మీరు ప్రేమించడం మొదలుపెట్టారు.—1 యోహాను 4:9, 10 చదవండి.

6. (ఎ) నిజమైన ప్రేమను ఎలా చూపించాలి? (బి) దేవునిమీద ప్రేమతో మీరు ఏ నిర్ణయం తీసుకున్నారు?

6 తర్వాత ఆ ప్రేమ రానురాను నిజమైన అనుబంధంగా మారింది. నిజమైన ప్రేమ అంటే కేవలం మనసులోని భావనా కాదు, ఒట్టి మాటలూ కాదు. దేవుణ్ణి నిజంగా ప్రేమించడమంటే, “నేను యెహోవాను ప్రేమిస్తున్నాను” అనడం మాత్రమే సరిపోదు. విశ్వాసాన్ని క్రియల్లో చూపించినట్లే, నిజమైన ప్రేమను కూడా క్రియల్లో చూపించాలి. (యాకోబు 2:26) నిజానికి, మనం ప్రేమించేవారికి ఇష్టమైన పనులు చేయడం ద్వారా మనకు వారిపై ప్రేమ ఉందని చూపిస్తాం. కాబట్టి మీరెప్పుడైతే యెహోవాను ప్రేమించడం మొదలుపెట్టారో, అప్పుడే మీ పరలోక తండ్రికి ఇష్టమైన విధంగా జీవించాలని మీరు నిర్ణయించుకున్నారు. మీరు బాప్తిస్మం తీసుకున్న యెహోవాసాక్షా? అలాగైతే, దేవునిపై మీకు ప్రగాఢమైన ప్రేమ, భక్తి ఉన్నాయి కాబట్టే, మీరు జీవితంలో అతి ప్రాముఖ్యమైన ఒక నిర్ణయం తీసుకున్నారు. అంటే మీరు యెహోవాకు ఇష్టమైన రీతిగా జీవించాలనే కోరికతో ఆయనకు సమర్పించుకుని, దానికి సూచనగా బాప్తిస్మం తీసుకున్నారు. (రోమీయులు 14:7, 8 చదవండి.) ఆ సమర్పణకు తగినట్లుగా జీవించాలంటే ఏమి చేయాలో వివరిస్తూ అపొస్తలుడైన యోహాను చెప్పిన మాటలను మనమిప్పుడు పరిశీలిద్దాం.

‘ఆయన ఆజ్ఞలకు’ లోబడతాం

7. (ఎ) దేవుడు ఇచ్చిన ఆజ్ఞల్లో కొన్ని చెప్పండి. (బి) మీరు వాటిని పాటిస్తున్నారని ఎలా చూపిస్తారు?

7 దేవుని “ఆజ్ఞలను గైకొనుటయే” ఆయనను ప్రేమించడం అని యోహాను చెప్పాడు. దేవుని ఆజ్ఞలు ఏమిటి? యెహోవా తన వాక్యమైన బైబిల్లో సూటిగా మనకెన్నో ఆజ్ఞలిచ్చాడు. ఉదాహరణకు, తాగుబోతుతనం, వ్యభిచారం, విగ్రహారాధన, దొంగతనం, అబద్ధాలాడడం వంటివి చేయకూడదని ఆయన ఆజ్ఞాపించాడు. (1 కొరింథీయులు 5:11; 6:18; 10:14; ఎఫెసీయులు 4:27, 28; కొలొస్సయులు 3:9) దేవుని ఆజ్ఞల్ని పాటించడంలో బైబిలు స్పష్టంగా పేర్కొంటున్న నైతిక ప్రమాణాలకు తగ్గట్టుగా జీవించడం కూడా ఇమిడివుంది.

8, 9. ఒక విషయానికి సంబంధించిన సూటియైన ఆజ్ఞ బైబిల్లో లేకపోయినా యెహోవా ఇష్టాయిష్టాలేమిటో మనకెలా తెలుస్తుంది? ఒక ఉదాహరణ ఇవ్వండి.

8 యెహోవా హృదయాన్ని సంతోషపెట్టాలంటే ఆయన సూటిగా ఇచ్చిన ఆజ్ఞలను పాటిస్తే సరిపోదు. జీవితంలో ప్రతీదీ ఇలాచేయాలి, అలాచేయాలి అని యెహోవా మనల్ని కట్టుదిట్టం చేయడు. కాబట్టి, రోజులో చేసే ప్రతిదానికీ సంబంధించిన సూటియైన ఆజ్ఞలు బైబిల్లో మనకు కనిపించవు. అలాంటి సందర్భాల్లో మనమేం చేస్తే యెహోవా సంతోషిస్తాడో ఎలా తెలుస్తుంది? దేవుని ఆలోచనా విధానమేమిటో బైబిలు స్పష్టంగా వివరిస్తోంది. బైబిలును జాగ్రత్తగా చదివితే యెహోవా వేటిని ఇష్టపడతాడో, వేటిని అసహ్యించుకుంటాడో తెలుసుకుంటాం. (కీర్తన 97:10 చదవండి; సామెతలు 6:16-19) మనకు ఎలాంటి స్వభావముంటే, ఎలా ప్రవర్తిస్తే ఆయనిష్టపడతాడో గ్రహిస్తాం. యెహోవా వ్యక్తిత్వం గురించి, విధానాల గురించి మనమెంతగా తెలుసుకుంటే అంతగా ఆయనలా ఆలోచించగలుగుతాం. ఆయన ఆలోచనల ప్రకారమే నిర్ణయాలు తీసుకుంటాం, ప్రవర్తిస్తాం. ఒక విషయానికి సంబంధించిన సూటియైన ఆజ్ఞ ఏదీ బైబిల్లో కనిపించకపోయినా, యెహోవా ‘చిత్తమేమిటో గ్రహిస్తాం.’—ఎఫెసీయులు 5:17.

9 ఉదాహరణకు, విపరీతమైన దౌర్జన్యం లేదా దుర్నీతి ఎక్కువగా ఉండే సినిమాలు, టీవీ కార్యక్రమాలు చూడొద్దనే సూటియైన ఆజ్ఞ బైబిల్లో మనకెక్కడా కనిపించదు. అయితే అలాంటి ఆజ్ఞ నిజంగా అవసరమంటారా? వాటి విషయంలో యెహోవా అభిప్రాయమేమిటో మనకు తెలుసు. దౌర్జన్యం చేసేవారు లేదా ‘బలాత్కారాసక్తులు యెహోవాకు అసహ్యులు’ అని బైబిలు స్పష్టంగా చెబుతోంది. (కీర్తన 11:5) “వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును” అని కూడా చెబుతోంది. (హెబ్రీయులు 13:4) బైబిల్లోని ఆ మాటల గురించి జాగ్రత్తగా ఆలోచిస్తే ఆయన ఇష్టాయిష్టాలేమిటో మనకు స్పష్టంగా తెలుస్తాయి. కాబట్టి దేవుడు అసహ్యించుకునేవాటిని ఆకర్షణీయంగా చూపించే సినిమాలు, కార్యక్రమాలు చూసి ఆనందించాలని కోరుకోం. అవి కేవలం వినోదం కోసమే, వాటిని చూస్తే ప్రమాదమేమీ లేదని ఈ లోకం అంటోంది. కానీ అలాంటి అనైతిక వినోదానికి దూరంగా ఉంటే యెహోవా సంతోషిస్తాడని మనకు తెలుసు.a

10, 11. (ఎ) మనమెందుకు యెహోవాకు లోబడాలి? (బి) ఆయనకు మనం ఎలాంటి విధేయత చూపిస్తాం?

10 అసలెందుకు మనం దేవుని ఆజ్ఞల్ని పాటించాలి? ప్రతీరోజు దేవుని దృష్టిలో సరైనదే ఎందుకు చేయాలి? దేవుడు శిక్షిస్తాడన్న భయంతో లేదా ఆయన చెప్పినట్లు చేయకపోతే కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్న బెదురుతో కాదు. (గలతీయులు 6:7) బదులుగా, యెహోవాకు లోబడే సందర్భం వస్తే, ఆయన మీద మనకున్న ప్రేమను చూపించడానికి అదొక సదవకాశం అనుకుంటాం. పిల్లవాడు తన తండ్రిని సంతోషపెట్టేందుకు ప్రయత్నించినట్లే మనం కూడా యెహోవాను సంతోషపెట్టాలని కోరుకుంటాం. (కీర్తన 5:12) ఆయన మన తండ్రి, మనమాయన్ని ప్రేమిస్తున్నాం. “యెహోవా కటాక్షము” పొందేలా జీవిస్తున్నామన్న సంతృప్తి, సంతోషం నిజానికి సాటిలేనివి.—సామెతలు 12:2.

11 అందుకే దేవుని ఆజ్ఞల్ని పాటించాల్సి వచ్చినప్పుడు మనం సణగం, షరతులు పెట్టం లేదా ఏవో కొన్నిటినే పాటించాలనుకోం.b దేవుని ఆజ్ఞలు మనకు అనుకూలంగా ఉన్నప్పుడు లేదా పాటించడం అంత కష్టం కానప్పుడు మాత్రమే లోబడాలనుకోం. బదులుగా మనం ‘హృదయపూర్వకంగా లోబడతాం.’ (రోమీయులు 6:17) “నీ ఆజ్ఞలనుబట్టి నేను హర్షించెదను అవి నాకు ప్రియములు” అని బైబిల్లో రాసిన కీర్తనకర్తలాగే మనమూ అనుకుంటాం. (కీర్తన 119:47) అవును, మనం ఇష్టపూర్వకంగా యెహోవాకు విధేయత చూపిస్తాం. ఎలాంటి షరతులు పెట్టకుండా సంపూర్ణంగా లోబడాలని యెహోవా కోరుతున్నాడు, అందుకాయన అర్హుడని కూడా మనకు తెలుసు. (ద్వితీయోపదేశకాండము 12:32) దేవుణ్ణి ప్రేమించి, అనేక సంవత్సరాలు ఆయనకు నమ్మకంగా లోబడిన ప్రాచీనకాల నోవహు గురించి మాట్లాడుతూ, “నోవహు అట్లు చేసెను, దేవుడు అతని కాజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను” అని బైబిలు చెబుతోంది. (ఆదికాండము 6:22) యెహోవా తన వాక్యంలో నోవహు గురించి ఏమి చెప్పాడో, మన గురించి కూడా అలాగే చెప్పాలని కోరుకుంటాం.

12. మనమెలా లోబడితే యెహోవా హృదయం సంతోషిస్తుంది?

12 మనం ఇష్టపూర్వకంగా లోబడితే యెహోవాకు ఎలా అనిపిస్తుంది? ఆయన ‘హృదయం సంతోషిస్తుంది’ అని బైబిలు చెబుతోంది. (సామెతలు 27:11) మరి మనం లోబడితే విశ్వానికే సర్వాధిపతియైన యెహోవా సంతోషిస్తాడా? ఖచ్చితంగా! ఎందుకంటే ఆయన మనల్ని సొంతగా నిర్ణయాలు తీసుకోగల స్వేచ్ఛతో సృష్టించాడు. అంటే దేవునికి లోబడాలో వద్దో మనమే నిర్ణయించుకోవచ్చు. (ద్వితీయోపదేశకాండము 30:15, 16, 19, 20) మన పరలోక తండ్రియైన యెహోవామీదున్న ప్రేమతో మనస్ఫూర్తిగా ఆయనకు లోబడాలనుకున్నప్పుడు ఆయన ఖచ్చితంగా సంతోషిస్తాడు. (కీర్తన 147:11) అంతేకాకుండా మనం దేవునికి లోబడినప్పుడు మన జీవన విధానాన్ని మరెంతో మెరుగుపర్చుకుంటాం.

“ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు”

13, 14. దేవుని “ఆజ్ఞలు భారమైనవి కావు” అని ఎందుకు చెప్పవచ్చు? ఒక ఉదాహరణతో వివరించండి.

13 యెహోవా ఆజ్ఞల గురించి మాట్లాడుతూ అపొస్తలుడైన యోహాను, “ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు” అని అభయమిస్తున్నాడు. ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌లో ఈ మాటలు “ఆయన ఆజ్ఞలు కష్టమైనవి కావు” అని అనువదించబడ్డాయి. యెహోవా ఆజ్ఞలు కఠినమైనవిగా లేదా అణచివేసేవిగా ఉండవు.c ఆయన ఆజ్ఞలేవీ అపరిపూర్ణ మానవులు పాటించలేనంత కష్టమైనవి కావు.

14 ఒక ఉదాహరణతో మనమా విషయాన్ని అర్థం చేసుకుందాం. మీ ప్రాణస్నేహితుడు ఇల్లు మారుతున్నాడనుకుందాం. సామాన్లు అట్టపెట్టెల్లో సర్దివున్నాయి. వాటిలో కొన్ని ఒకరే మోసుకెళ్ళగలిగేంత తేలిగ్గా ఉంటే, మరికొన్ని ఇద్దరిద్దరు మోసుకెళ్లేంత బరువుగా ఉన్నాయి. వాటిలో కొన్నిటిని తీసుకువెళ్ళి ఫలానాచోట పెట్టమని ఆయన మిమ్మల్ని అడిగాడు. మీరు మోయలేనివాటిని తీసుకెళ్లమని అడుగుతాడా? అడగడు. ఎందుకంటే మీకు దెబ్బలు తగలడం ఆయనకు ఇష్టంలేదు. అదే విధంగా ప్రేమ, దయగల మన దేవుడు మనం పాటించలేనంత కష్టమైన ఆజ్ఞల్ని ఇవ్వనే ఇవ్వడు. (ద్వితీయోపదేశకాండము 30:11-14) ఎందుకంటే మన పరిమితులేమిటో ఆయనకు తెలుసు, “మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసేయున్నది మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసికొనుచున్నాడు.”—కీర్తన 103:14.

15. యెహోవా మన మేలు కోసమే ఆజ్ఞలు ఇచ్చాడని ఎందుకు నమ్మవచ్చు?

15 యెహోవా ఆజ్ఞలు ఖచ్చితంగా భారమైనవి కావు. వాటిని మన మేలు కోసమే ఇచ్చాడు. (యెషయా 48:17 చదవండి.) అందుకే పూర్వం మోషే, “మనకు నిత్యము మేలు కలుగుటకై యెహోవా నేటివలె మనలను బ్రదికించునట్లు మన దేవుడైన యెహోవాకు భయపడి యీ కట్టడలనన్నిటిని గైకొనవలెనని మన కాజ్ఞాపించెను” అని ఇశ్రాయేలీయులతో చెప్పాడు. (ద్వితీయోపదేశకాండము 6:24) కాబట్టి శాశ్వత ప్రయోజనం కలగాలనే ఉద్దేశంతోనే యెహోవా మనకు కూడా తన ఆజ్ఞల్ని ఇచ్చాడని నమ్మవచ్చు. మన మేలు గురించి కాకపోతే దేవుడు దేనిగురించి ఆలోచిస్తాడు చెప్పండి! యెహోవా దేవునికి అపారమైన జ్ఞానం ఉంది కాబట్టి మనకు మేలైనదేదో ఆయనకు బాగా తెలుసు. (రోమీయులు 11:33) ఆయన ప్రేమాస్వరూపి. (1 యోహాను 4:8) అది ఆయన సహజ లక్షణం. ఏది చేసినా ప్రేమతోనే చేస్తాడు, ఏది చెప్పినా ప్రేమతోనే చెప్తాడు. ప్రేమతోనే తన సేవకులకు ఆజ్ఞలన్నీ ఇస్తాడు.

16. నీచమైన ఈ లోక ప్రభావాలు మనమీదున్నా, మనం అపరిపూర్ణులమైనా దేవునికి లోబడడం ఎలా సాధ్యం?

16 అంతమాత్రాన దేవునికి లోబడడం చాలా సులభమని కాదు. “దుష్టుని” అధీనంలోవున్న నీచమైన ఈ లోక ప్రభావాలను మనం ఎదిరించాలి. (1 యోహాను 5:19) దేవుని ఆజ్ఞలకు లోబడకుండా మనల్ని అడ్డగించే అపరిపూర్ణతతో కూడా పోరాడాలి. (రోమీయులు 7:21-25) కానీ మనకు దేవుని మీద ప్రేమ ఉంటే తప్పకుండా అలా చేయగలం. ప్రేమతో తనకు లోబడాలనుకునే ప్రజలను యెహోవా ఆశీర్వదిస్తాడు. “తనకు విధేయులైన వారికి” పరిశుద్ధాత్మ శక్తినిస్తాడు. (అపొస్తలుల కార్యములు 5:32) ఆ పరిశుద్ధాత్మ శక్తి, మనం దేవునికి లోబడేందుకు సహాయపడే చక్కని లక్షణాలను అలవర్చుకునేందుకు తోడ్పడుతుంది.—గలతీయులు 5:22.

17, 18. (ఎ) ఈ పుస్తకంలో మనమేమి తెలుసుకుంటాం? దానికి ముందు మనమే విషయాలు గుర్తుంచుకోవాలి? (బి) తర్వాతి అధ్యాయంలో ఏ విషయాన్ని పరిశీలిస్తాం?

17 ఈ పుస్తకంలో మనం యెహోవా సూత్రాలు, నైతిక ప్రమాణాల గురించేకాక మనమెలా జీవించాలని ఆయన కోరుతున్నాడో తెలుసుకుంటాం. అయితే, దానికన్నా ముందు మనం కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోవాలి. మనం మనస్ఫూర్తిగా తనకు లోబడాలని ఆయన కోరుతున్నాడు కాబట్టి తన ఆజ్ఞలను, సూత్రాలను పాటించాలని యెహోవా మనల్ని బలవంతం చేయడు. మనం ఇప్పుడు అనేక ప్రయోజనాలు పొందేందుకు, అలాగే భవిష్యత్తులో నిత్యజీవం పొందేందుకు అర్హులయ్యేలా జీవించాలని యెహోవా కోరుతున్నాడు. అంతేకాక యెహోవాకు మనస్ఫూర్తిగా లోబడే సందర్భాలొస్తే, వాటిని ఆయన మీద మనకున్న ప్రేమను చూపించడానికి దొరికిన సదవకాశాలుగా భావిద్దాం.

18 మంచిచెడులు తెలుసుకోవడానికి యెహోవా ప్రేమతో మనకు మనస్సాక్షి అనే వరాన్నిచ్చాడు. అయితే మనస్సాక్షి మనల్ని సరిగ్గా నడిపించాలంటే దానికి శిక్షణ ఇవ్వాలి. ఈ విషయాన్నే మనం తర్వాతి అధ్యాయంలో పరిశీలిస్తాం.

a మంచి వినోదాన్ని ఎలా ఎంచుకోవాలో తెలుసుకునేందుకు ఈ పుస్తకంలోని 6వ అధ్యాయం చూడండి.

b దుష్టాత్మలు కూడా దేవునికి లోబడుతున్నాయి, కానీ ఇష్టపూర్వకంగా కాదు. దయ్యం పట్టిన వ్యక్తుల్లోనుండి బయటకు రమ్మని యేసు ఆజ్ఞాపించినప్పుడు ఇష్టం లేకపోయినా అవి ఆయన అధికారాన్ని గుర్తించి ఆయన మాటలకు లోబడాల్సి వచ్చింది.—మార్కు 1:27; 5:7-13.

c “భారమైన” అని 1 యోహాను 5:3 లో అనువదించబడిన గ్రీకు పదం, అపొస్తలుల కార్యములు 20:29,30 లో “క్రూరమైన” అని అనువదించబడింది. ఇతరుల్ని తప్పుదారి పట్టించాలనే ఉద్దేశంతో ‘వంకర మాటలు పలికే’ మతభ్రష్టుల గురించి మాట్లాడుతూ అక్కడ క్రూరమైన అనే పదం ఉపయోగించబడింది.

మీరు వీటికి ఏమని జవాబిస్తారు?

  • తన ఆరాధకులు ఎలాంటి విధేయత చూపించాలని యెహోవా కోరుతున్నాడు? అది మన మేలు కోసమే అని ఎందుకు చెప్పవచ్చు?—ద్వితీయోపదేశకాండము 5:28-33.

  • మనం యెహోవాకు లోబడడమనేది ఆయన దృష్టిలో ఎంత ప్రాముఖ్యం?—1 సమూయేలు 15:22, 23.

  • దేవునికి లోబడే విషయంలో యేసు మాదిరి నుండి మనమేమి నేర్చుకోవచ్చు?—యోహాను 8:29.

  • మనం యెహోవాకు విధేయత చూపించడం ఎందుకు సరైనది?—ప్రకటన 4:10, 11.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి