అధ్యాయం 19
“పవిత్ర రహస్యంలో . . . దేవుని తెలివి”
1, 2. ఏ “పవిత్ర రహస్యం” మనకు ఆసక్తి కలిగిస్తుంది? ఎందుకు?
రహస్యాలు! అవి ఆసక్తిని, ఆరాటాన్ని, కుతూహలాన్ని కలిగిస్తాయి కాబట్టి మనుషులు తరచూ వాటిని కడుపులో దాచుకోలేరు. కానీ బైబిలు ఇలా చెప్తుంది: “విషయాన్ని రహస్యంగా ఉంచడం దేవునికి ఘనత.” (సామెతలు 25:2) అవును, సర్వాధిపతిగా, సృష్టికర్తగా మనుషుల నుండి కొన్ని రహస్యాల్ని దాచివుంచి సరైన సమయంలో చెప్పే హక్కు యెహోవాకు ఉంది.
2 అయితే ఆసక్తి, కుతూహలం కలిగించే ఒక రహస్యాన్ని యెహోవా తన వాక్యంలో చెప్పాడు. అదే, “[దేవుని] సంకల్పం గురించిన పవిత్ర రహస్యం.” (ఎఫెసీయులు 1:9) అది మన కుతూహలం తీర్చడమే కాదు, మనల్ని రక్షణకు నడిపిస్తుంది, అలాగే యెహోవాకున్న అంతుచిక్కని తెలివిలో కొంచెం మనకు రుచి చూపిస్తుంది.
యెహోవా కొంచెంకొంచెంగా రహస్యాన్ని బయటపెట్టాడు
3, 4. ఆదికాండం 3:15 లో ఉన్న ప్రవచనం ఏ ఆశను నింపింది? అందులో ఉన్న మెలిక లేదా “రహస్యం” ఏంటి?
3 ఆదాముహవ్వలు ఎప్పుడైతే పాపం చేశారో, పరదైసు భూమంతా పరిపూర్ణ మనుషులతో నిండి ఉండాలన్న యెహోవా సంకల్పం కొట్టుకుపోయినట్టు అనిపించింది. కానీ దేవుడు చిటికెలో దానికి పరిష్కారం ఆలోచించి ఇలా చెప్పాడు: “నేను నీకూ [సర్పానికి] స్త్రీకీ, నీ సంతానానికీ ఆమె సంతానానికీ మధ్య శత్రుత్వం పెడతాను. ఆయన నీ తలను చితగ్గొడతాడు, నువ్వు ఆయన మడిమె మీద కొడతావు.”—ఆదికాండం 3:15.
4 ఆ మాటలు కొంచెం తికమకగా ఉన్నాయి కదా. అసలు ఆ స్త్రీ ఎవరు? సర్పం ఎవరు? సర్పం తలను చితగ్గొట్టే ఆ “సంతానం” ఎవరు? ఇవేవీ ఆదాముహవ్వలకు తెలీదు. కానీ ఆ మాటలు, ఆదాముహవ్వల పిల్లల్లో నమ్మకంగా ఉండేవాళ్లకు ఒక ఆశను ఇచ్చాయి. ఎప్పటికైనా నీతే గెలుస్తుంది. యెహోవా సంకల్పం నిజమౌతుంది. కానీ ఎలా? ఆ . . . అదే ఇక్కడ మెలిక! బైబిలు దాన్ని “పవిత్ర రహస్యంలో దాచబడివున్న దేవుని తెలివి” అని అంటుంది.—1 కొరింథీయులు 2:7.
5. పవిత్ర రహస్యాన్ని యెహోవా కొంచెంకొంచెంగా ఎందుకు బయటపెట్టాడో ఒక ఉదాహరణ చెప్పండి.
5 యెహోవా “రహస్యాల్ని వెల్లడిచేసే” దేవుడు కాబట్టి, పవిత్ర రహస్యానికి సంబంధించిన వివరాల్ని సమయం వచ్చినప్పుడు ఆయనే చెప్తాడు. (దానియేలు 2:28) ఆయన దాన్ని కొంచెంకొంచెంగా, మెల్లమెల్లగా బయటపెడతాడు. దీన్ని అర్థం చేసుకోవడానికి ఈ ఉదాహరణ చూడండి: ఒక పిల్లాడు వాళ్ల డాడీని, “నేను ఎక్కడినుండి వచ్చాను డాడీ?” అని అడిగాడు. అప్పుడు వాళ్ల డాడీ ప్రేమగా, తెలివిగా, ఆ పిల్లాడి వయసుకు ఎంత చెప్తే అర్థమౌతుందో అంతే చెప్తాడు. ఆ పిల్లాడు పెరిగి పెద్ద అవుతున్నప్పుడు, ఇంకా ఎక్కువ వివరాల్ని వాళ్ల డాడీ చెప్తాడు. అలాగే యెహోవా కూడా తన ఇష్టం గురించి, సంకల్పం గురించి ఎప్పుడు చెప్తే తన ప్రజలు బాగా అర్థం చేసుకుంటారో అప్పుడే చెప్తాడు.—సామెతలు 4:18; దానియేలు 12:4.
6. (ఎ) ఒప్పందాలు లేదా కాంట్రాక్టులు ఎందుకు రాసుకుంటారు? (బి) యెహోవా మనుషులతో ఎందుకు ఒప్పందాలు చేశాడు?
6 యెహోవా ఆ రహస్యాన్ని ఎలా బయటపెట్టాడు? ఆయన వరుసగా కొన్ని ఒప్పందాలు లేదా కాంట్రాక్టులు చేసి దాన్ని బయటపెట్టాడు. మీరు కూడా ఏదోక సమయంలో అంటే ఇల్లు కొనుక్కునేటప్పుడో, అప్పు తీసుకునేటప్పుడో, లేదా అప్పు ఇచ్చేటప్పుడో కాంట్రాక్టు రాసుకుని ఉంటారు. అలా రాసుకోవడం వల్ల అటువైపువాళ్లు-ఇటువైపువాళ్లు అందులో ఉన్నట్టే చేస్తారని చట్టబద్ధమైన గ్యారంటీ ఉంటుంది. కానీ యెహోవా ఎందుకు మనుషులతో ఇలా ఒప్పందాలు లేదా కాంట్రాక్టులు చేసుకోవాలి? ఆయన నోటి మాటే పెద్ద గ్యారంటీ కదా. నిజమే, కానీ చాలా సందర్భాల్లో దేవుడు దయతో తన నోటి మాటకు అదనపు గ్యారంటీగా చట్టబద్ధమైన కాంట్రాక్టులు కూడా చేశాడు. ఉక్కులాంటి ఈ ఒప్పందాలు, యెహోవా మాటిచ్చినవి నిజంగా జరుగుతాయని అపరిపూర్ణ మనుషులకు ఇంకా గట్టి భరోసా ఇస్తాయి.—హెబ్రీయులు 6:16-18.
అబ్రాహాముతో చేసిన ఒప్పందం
7, 8. (ఎ) యెహోవా అబ్రాహాముతో ఏ ఒప్పందం చేశాడు? దానివల్ల పవిత్ర రహస్యంలోని ఏ విషయం బయటపడింది? (బి) వాగ్దాన సంతానం వచ్చే కుటుంబం గురించి యెహోవా ఎలా కొద్దికొద్దిగా బయటపెట్టాడు?
7 ఏదెను తోట నుండి ఆదాముహవ్వల్ని పంపేసిన 2,000 కన్నా ఎక్కువ సంవత్సరాల తర్వాత, తనను నమ్మకంగా సేవించిన అబ్రాహాముతో యెహోవా ఇలా అన్నాడు: ‘నేను నీ సంతానాన్ని ఖచ్చితంగా ఆకాశ నక్షత్రాలంతమంది అయ్యేలా చేస్తాను. నువ్వు నా మాట విన్నావు కాబట్టి నీ సంతానం ద్వారా భూమ్మీదున్న అన్నిదేశాల ప్రజలు దీవెన సంపాదించుకుంటారు.’ (ఆదికాండం 22:17, 18) యెహోవా కేవలం మాట ఇవ్వడమే కాదు, చట్టబద్ధంగా ఒక ఒప్పందం కూడా చేశాడు, పైపెచ్చు దానికి గ్యారంటీగా ప్రమాణం కూడా చేశాడు. (ఆదికాండం 17:1, 2; హెబ్రీయులు 6:13-15) సర్వోన్నత ప్రభువైన యెహోవా మనుషుల్ని దీవిస్తానని ఒక కాంట్రాక్టు రాయడం ఎంత గొప్ప విషయమో గదా!
‘నేను నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాలంతమంది అయ్యేలా చేస్తాను’
8 ఆ ఒప్పందాన్ని బట్టి, సంతానం అబ్రాహాము వంశం నుండి వస్తాడని, అంటే ఆ సంతానం ఒక మనిషి అని అర్థమైపోయింది. కానీ ఆయన ఎవరు? కొంతకాలానికి, అబ్రాహాము కొడుకుల్లో ఇస్సాకు ద్వారా ఈ సంతానం వస్తాడని యెహోవా చెప్పాడు. ఆ తర్వాత ఇస్సాకు ఇద్దరు కొడుకుల్లో, యెహోవా యాకోబును ఎంచుకున్నాడు. (ఆదికాండం 21:12; 28:13, 14) తర్వాత యాకోబు తన 12 మంది కొడుకుల్లో ఒకరి గురించి ఈ ప్రవచనం చెప్పాడు: “షిలోహు [లేదా, “అది ఎవరికి చెందుతుందో ఆయన,” అధస్సూచి] వచ్చేవరకు యూదా దగ్గర నుండి రాజదండం తొలగిపోదు, అతని కాళ్ల మధ్య నుండి అధికార దండం తొలగిపోదు. జనాల విధేయత అతనికే చెందుతుంది.” (ఆదికాండం 49:10) దాన్నిబట్టి ఆ సంతానం, యూదా గోత్రం నుండి వచ్చే ఒక రాజు అని మనకు తెలిసిపోయింది!
ఇశ్రాయేలుతో చేసిన ఒప్పందం
9, 10. (ఎ) యెహోవా ఇశ్రాయేలు జనాంగంతో ఏ ఒప్పందం చేశాడు? ఆ ఒప్పందం వాళ్లను ఎలా కాపాడింది? (బి) మనుషులకు విమోచన క్రయధనం అవసరమని ధర్మశాస్త్రం ఎలా చూపించింది?
9 క్రీస్తు పూర్వం 1513 లో, పవిత్ర రహస్యంలోని మరిన్ని వివరాల్ని తెలియజేయడానికి యెహోవా రంగం సిద్ధం చేశాడు. అబ్రాహాము వంశస్థులైన ఇశ్రాయేలు జనాంగంతో యెహోవా ఒక ఒప్పందం చేశాడు. మోషే ధర్మశాస్త్రం ఇప్పుడు అమల్లో లేకపోయినా, వాగ్దాన సంతానం రావాలనే యెహోవా ఉద్దేశాన్ని నెరవేర్చడంలో అది బాగా ఉపయోగపడింది. ఎలా? మూడు విధానాలు చూద్దాం. మొదటిగా, ధర్మశాస్త్రం అడ్డుగోడలా నిలబడి వాళ్లను కాపాడింది. (ఎఫెసీయులు 2:14) దానిలో ఉన్న నియమాలు యూదుల్ని, అన్యుల్ని వేరుగా ఉంచాయి. అలా వాగ్దాన సంతానం వచ్చే గోత్రాన్ని అది నిలబెట్టింది. దానివల్ల, యెహోవా అనుకున్న సమయంలో మెస్సీయ యూదా గోత్రంలో పుట్టేంతవరకు, ఇశ్రాయేలు జనాంగం కొట్టుకుపోకుండా ఉంది.
10 రెండోదిగా, మనుషులకు విమోచన క్రయధనం అవసరమని ధర్మశాస్త్రం స్పష్టంగా చూపించింది. ధర్మశాస్త్రం పరిపూర్ణమైనది కాబట్టి, పాపులైన మనుషులు దాన్ని పూర్తిగా పాటించలేరని అది గుర్తుచేసింది. అందుకే, “దేవుడు ఎవరి గురించైతే వాగ్దానం చేశాడో ఆ సంతానం వచ్చేవరకు, మనుషుల పాపాల్ని వెల్లడిచేయడానికి” ధర్మశాస్త్రం ఉపయోగపడింది. (గలతీయులు 3:19) ధర్మశాస్త్రం, పాపాల్ని తాత్కాలికంగా ప్రాయశ్చిత్తం చేయడానికి జంతు బలుల్ని అర్పించవచ్చని చెప్పింది. కానీ, “ఎద్దుల రక్తం, మేకల రక్తం పాపాల్ని తీసేయడం అసాధ్యం” అని పౌలు రాశాడు కాబట్టి, ఆ బలులన్నీ క్రీస్తు విమోచన క్రయధన బలికి ఒక నీడ మాత్రమే. (హెబ్రీయులు 10:1-4) కాబట్టి, ధర్మశాస్త్రం నమ్మకమైన యూదుల్ని ‘క్రీస్తు దగ్గరికి నడిపించే సంరక్షకునిగా’ పనిచేసింది.—గలతీయులు 3:24.
11. ధర్మశాస్త్ర ఒప్పందం ఇశ్రాయేలు జనాంగానికి ఏ గొప్ప అవకాశాన్ని తెరిచింది? కానీ ఆ జనాంగం దాన్ని చేతులారా ఎలా పోగొట్టుకుంది?
11 మూడోదిగా, ధర్మశాస్త్ర ఒప్పందం ఇశ్రాయేలు జనాంగానికి ఒక గొప్ప అవకాశాన్ని తెరిచింది. ఆ ఒప్పందానికి నమ్మకంగా కట్టుబడి ఉంటే, వాళ్లు “యాజకులతో రూపొందిన రాజ్యంగా, పవిత్ర జనంగా” అవుతారని యెహోవా చెప్పాడు. (నిర్గమకాండం 19:5, 6) ఆ తర్వాతి కాలంలో, యాజకులతో రూపొందే పరలోక రాజ్యంలో మొదటి సభ్యులు ఇశ్రాయేలు జనాంగం నుండే వచ్చారు. కానీ ఒక జనాంగంగా చూస్తే ఇశ్రాయేలీయులు ధర్మశాస్త్ర ఒప్పందానికి కట్టుబడి లేరు, మెస్సీయను వద్దనుకున్నారు, దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని చేతులారా పోగొట్టుకున్నారు. మరి యాజకులుగా రూపొందే రాజ్యంలో మిగతావాళ్లను యెహోవా ఎవరితో నింపుతాడు? అసలు ఆ రాజ్యానికి, వాగ్దాన సంతానానికి సంబంధం ఏంటి? పవిత్ర రహస్యంలోని ఈ వివరాల్ని సమయం వచ్చినప్పుడు యెహోవా బయటపెడతాడు.
దావీదుతో చేసిన రాజ్య ఒప్పందం
12. యెహోవా దావీదుతో ఏ ఒప్పందం చేశాడు? దానివల్ల పవిత్ర రహస్యంలోని ఏ విషయం బయటపడింది?
12 క్రీస్తు పూర్వం 11వ శతాబ్దంలో, యెహోవా చేసిన మరో ఒప్పందం వల్ల పవిత్ర రహస్యంలోని ఇంకో విషయం బయటపడింది. నమ్మకంగా ఉన్న రాజైన దావీదుకు యెహోవా ఇలా మాటిచ్చాడు: ‘నీ సంతానాన్ని రాజును చేసి అతని రాజ్యాన్ని స్థిరపరుస్తాను. నేను అతని రాజ్య సింహాసనాన్ని ఎప్పటికీ స్థిరపరుస్తాను.’ (2 సమూయేలు 7:12, 13; కీర్తన 89:3) ఇప్పుడు, వాగ్దాన సంతానం దావీదు కుటుంబం నుండే వస్తాడని తెలిసిపోయింది. అయినా, ఒక మామూలు మనిషి శాశ్వతంగా పరిపాలించగలడా? (కీర్తన 89:20, 29, 34-36) ఒక మానవ రాజు మనుషులందర్నీ పాపం నుండి, మరణం నుండి విడిపించగలడా?
13, 14. (ఎ) కీర్తన 110 ప్రకారం, తాను అభిషేకించిన రాజుకు యెహోవా ఏమని మాటిచ్చాడు? (బి) రాబోతున్న సంతానం గురించి ప్రవక్తల ద్వారా యెహోవా ఇంకా ఏ వివరాల్ని బయటపెట్టాడు?
13 పవిత్రశక్తి ప్రేరణతో దావీదు ఇలా రాశాడు: “యెహోవా నా ప్రభువుతో ఇలా అన్నాడు: ‘నేను నీ శత్రువుల్ని నీ పాదపీఠంగా చేసేవరకు నా కుడిపక్కన కూర్చో. నువ్వు మెల్కీసెదెకు లాంటి యాజకుడివి, నువ్వు ఎప్పటికీ యాజకుడిగా ఉంటావు!’ అని యెహోవా ఒట్టేసి ప్రమాణం చేశాడు, ఆయన తన మనసు మార్చుకోడు.” (కీర్తన 110:1, 4) దావీదు అన్న ఆ మాటలు, వాగ్దాన సంతానానికి అంటే మెస్సీయకు సరిగ్గా సరిపోతాయి. (అపొస్తలుల కార్యాలు 2:35, 36) ఈ రాజు యెరూషలేము నుండి కాదుగానీ, పరలోకంలో యెహోవా “కుడిపక్కన” కూర్చుని పరిపాలిస్తాడు. పైగా ఇశ్రాయేలు ప్రాంతం ఒక్కటే కాదు, భూమంతటినీ పరిపాలించే హక్కును యెహోవా ఆయనకు ఇస్తాడు. (కీర్తన 2:6-8) ఇక్కడ ఇంకో విషయం బయటపడింది. మెస్సీయ ‘మెల్కీసెదెకు లాంటి యాజకుడిగా’ ఉంటాడని యెహోవా ఒట్టేసి ప్రమాణం చేశాడని గమనించండి. అబ్రాహాము కాలంలో రాజుగా, యాజకుడిగా సేవచేసిన మెల్కీసెదెకులా మెస్సీయ కూడా అటు రాజుగా, ఇటు యాజకుడిగా సేవచేస్తాడు. ఆయన నేరుగా దేవుని నుండే ఆ నియామకం పొందుతాడు!—ఆదికాండం 14:17-20.
14 సంవత్సరాలు గడుస్తుండగా, పవిత్ర రహస్యంలోని ఇంకొన్ని వివరాల్ని యెహోవా తన ప్రవక్తల ద్వారా బయటపెట్టాడు. ఉదాహరణకు, మెస్సీయ తన ప్రాణాన్ని బలిగా అర్పిస్తాడని యెషయా చెప్పాడు. (యెషయా 53:3-12) ఇంకా, మెస్సీయ ఎక్కడ పుడతాడో మీకా ముందే చెప్పాడు. (మీకా 5:2) అలాగే మెస్సీయ సరిగ్గా ఎప్పుడు కనిపిస్తాడో, ఎప్పుడు చనిపోతాడో దానియేలు ప్రవచించాడు.—దానియేలు 9:24-27.
పవిత్ర రహస్యం బయటపడిపోయింది!
15, 16. (ఎ) యెహోవా కుమారుడు ఎలా “ఒక స్త్రీకి పుట్టాడు”? (బి) యేసుకు తన మానవ తల్లిదండ్రుల నుండి వారసత్వంగా ఏం వచ్చింది? వాగ్దాన సంతానంగా ఆయన ఎప్పుడు వచ్చాడు?
15 ఆ ప్రవచనాలు ఎలా నెరవేరతాయి అనేది, మెస్సీయ కనిపించేంత వరకు చిక్కుముడిలా ఉండిపోయింది. గలతీయులు 4:4 ఇలా చెప్తుంది: “నిర్ణయించిన సమయం వచ్చినప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపించాడు, ఆ కుమారుడు ఒక స్త్రీకి పుట్టాడు.” క్రీస్తు పూర్వం 2 లో, ఒక దేవదూత యూదా కన్య అయిన మరియ దగ్గరికి వచ్చి ఇలా చెప్పాడు: “ఇదిగో! నువ్వు గర్భవతివై కుమారుణ్ణి కంటావు, ఆయనకు నువ్వు యేసు అని పేరు పెట్టాలి. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడని పిలవబడతాడు. ఆయన తండ్రైన దావీదు సింహాసనాన్ని యెహోవా దేవుడు ఆయనకు ఇస్తాడు. . . . పవిత్రశక్తి నీ మీదికి వస్తుంది, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. అందుకే పుట్టబోయే బిడ్డ పవిత్రుడని, దేవుని కుమారుడని పిలవబడతాడు.”—లూకా 1:31, 32, 35.
16 తర్వాత, యెహోవా తన కుమారుడి ప్రాణాన్ని పరలోకం నుండి మరియ గర్భంలోకి మార్చాడు. అలా యేసు ఒక స్త్రీకి పుట్టాడు. మరియ అపరిపూర్ణురాలైనా యేసుకు ఆ అపరిపూర్ణత రాలేదు, ఎందుకంటే ఆయన “దేవుని కుమారుడు.” అయితే, ఆయనకు మానవ తల్లిదండ్రుల నుండి వారసత్వంగా వచ్చింది ఒకటుంది. యేసు తల్లిదండ్రులిద్దరూ దావీదు వంశస్థులే కాబట్టి, దావీదుకు వారసుడిగా అన్ని చట్టబద్ధమైన హక్కులు యేసుకు వచ్చాయి. (అపొస్తలుల కార్యాలు 13:22, 23) క్రీస్తు శకం 29 లో, యేసు బాప్తిస్మం తీసుకున్నప్పుడు యెహోవా ఆయన్ని పవిత్రశక్తితో అభిషేకించి ఇలా చెప్పాడు: “ఈయన నా ప్రియ కుమారుడు.” (మత్తయి 3:16, 17) మొత్తానికి సంతానం వచ్చేశాడు! (గలతీయులు 3:16) అంటే పవిత్ర రహస్యంలోని చాలా వివరాల్ని బయటపెట్టే సమయం వచ్చేసింది.—2 తిమోతి 1:10.
17. ఆదికాండం 3:15 లో ఉన్నవాళ్లు ఎవరో ఎలా బయటపడింది?
17 ఆదికాండం 3:15 లో ఉన్న సర్పం సాతాను అని, సర్ప సంతానమేమో సాతానును అనుసరించేవాళ్లు అని యేసు తన పరిచర్యలో చెప్పాడు. (మత్తయి 23:33; యోహాను 8:44) వాళ్లందరూ ఎలా శాశ్వతంగా నాశనమౌతారు అనే వివరాలు ఆ తర్వాత బయటపడ్డాయి. (ప్రకటన 20:1-3, 10, 15) అందులో ఉన్న స్త్రీ ఏమో, “పైనున్న యెరూషలేము” లేదా దేవుని భార్య; అంటే దేవదూతలతో ఉన్న యెహోవా సంస్థలోని పరలోక భాగం.a—గలతీయులు 4:26; ప్రకటన 12:1-6.
కొత్త ఒప్పందం
18. ‘కొత్త ఒప్పందానికి’ ఉన్న ఉద్దేశం ఏంటి?
18 పవిత్ర రహస్యంలో బహుశా అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన ఒక విషయాన్ని, యేసు చనిపోయే ముందురోజు రాత్రి బయటపెట్టాడు. ఆయన తన నమ్మకమైన శిష్యులకు “కొత్త ఒప్పందం” గురించి చెప్పాడు. (లూకా 22:20) ధర్మశాస్త్ర ఒప్పందంలాగే, ఈ కొత్త ఒప్పందం ఉద్దేశం కూడా ‘యాజకులతో రూపొందిన రాజ్యాన్ని’ తయారు చేయడమే. (నిర్గమకాండం 19:6; 1 పేతురు 2:9) అయితే, ఈ ఒప్పందం ఇశ్రాయేలు జనాంగంతో కాదుగానీ, ఆధ్యాత్మిక ఇశ్రాయేలుతో అంటే “దేవుని ఇశ్రాయేలుతో” కుదర్చబడింది. అందులో క్రీస్తుకు నమ్మకంగా ఉన్న అభిషిక్త అనుచరులు మాత్రమే ఉంటారు. (గలతీయులు 6:16) ఈ కొత్త ఒప్పందంలో ఉన్నవాళ్లు యేసుతో కలిసి, మనుషులందరికీ ఆశీర్వాదాల్ని తీసుకొస్తారు!
19. (ఎ) ‘యాజకులతో రూపొందిన రాజ్యాన్ని’ తయారు చేయడంలో కొత్త ఒప్పందం ఎందుకు విజయం సాధిస్తుంది? (బి) అభిషిక్త క్రైస్తవుల్ని “కొత్త సృష్టి” అని బైబిలు ఎందుకు పిలుస్తుంది? క్రీస్తుతోపాటు పరలోకంలో ఎంతమంది పరిపాలిస్తారు?
19 మనుషుల్ని పరిపాలించడానికి ‘యాజకులతో రూపొందిన రాజ్యాన్ని’ తయారు చేయడంలో ఈ కొత్త ఒప్పందం ఎందుకు విజయం సాధిస్తుంది? ఎందుకంటే, అది క్రీస్తు శిష్యుల్ని పాపులని, దోషులని ఖండించే బదులు, యేసు ఇచ్చిన బలి ద్వారా వాళ్ల పాపాలకు క్షమాపణ దొరికేలా అవకాశం తెరుస్తుంది. (యిర్మీయా 31:31-34) యెహోవా వాళ్లను నీతిమంతులుగా ఎంచిన తర్వాత, తన పరలోక కుటుంబంలోకి దత్తత తీసుకుంటాడు, పవిత్రశక్తితో అభిషేకిస్తాడు. (రోమీయులు 8:15-17; 2 కొరింథీయులు 1:21) అలా వాళ్లు ‘సజీవమైన నిరీక్షణ కలిగివుండేలా కొత్తగా జన్మిస్తారు. కళంకం లేని, వాడిపోని జీవం పరలోకంలో వాళ్ల కోసం భద్రపర్చబడి ఉంది.’ (1 పేతురు 1:3, 4) భూమ్మీద కాకుండా పరలోకంలో జీవించడం అనేది మనుషులకు పూర్తిగా కొత్త కాబట్టి, బైబిలు అభిషిక్త క్రైస్తవుల్ని “కొత్త సృష్టి” అని పిలుస్తుంది. (2 కొరింథీయులు 5:17) భవిష్యత్తులో ఆ 1,44,000 మంది పరలోకం నుండి మనుషుల్ని పరిపాలిస్తారని బైబిలు చెప్తుంది.—ప్రకటన 5:9, 10; 14:1-4.
20. (ఎ) క్రీస్తు శకం 36 లో, పవిత్ర రహస్యంలోని ఏ విషయాన్ని యెహోవా బయటపెట్టాడు? (బి) దేవుడు అబ్రాహాముకు మాటిచ్చిన ఆశీర్వాదాల్ని ఎవరెవరు అనుభవిస్తారు?
20 యేసుతో పాటు ఈ అభిషిక్తులు కూడా “అబ్రాహాము సంతానం” అవుతారు.b (గలతీయులు 3:29) ఇందుకోసం యెహోవా మొదట యూదుల్ని ఎంచుకున్నాడు. కానీ క్రీస్తు శకం 36 లో, పవిత్ర రహస్యంలోని ఇంకో విషయం బయటికొచ్చింది: అన్యులకు అంటే యూదులుకాని వాళ్లకు కూడా పరలోక నిరీక్షణ ఉంటుంది. (రోమీయులు 9:6-8; 11:25, 26; ఎఫెసీయులు 3:5, 6) మరి అబ్రాహాముకు దేవుడు మాటిచ్చిన ఆశీర్వాదాల్ని అభిషిక్తులు మాత్రమే అనుభవిస్తారా? లేదు, ఎందుకంటే యేసు లోకమంతటా ఉన్న ప్రజల కోసం బలి అర్పించాడు. (1 యోహాను 2:2) తర్వాత, యెహోవా ఇంకో విషయాన్ని కూడా బయటపెట్టాడు. అదేంటంటే, లెక్కపెట్టలేనంత “గొప్పసమూహం” ఈ వ్యవస్థ అంతాన్ని తప్పించుకుంటుంది. (ప్రకటన 7:9, 14) అంతేకాదు, చనిపోయిన కోట్లమంది ప్రజలు తిరిగి బ్రతికి, పరదైసులో శాశ్వతకాలం జీవించే అవకాశం పొందుతారు!—లూకా 23:43; యోహాను 5:28, 29; ప్రకటన 20:11-15; 21:3, 4.
పవిత్ర రహస్యంలో కనిపించే దేవుని తెలివి
21, 22. పవిత్ర రహస్యంలో యెహోవా తెలివి ఎలా కనిపిస్తుంది?
21 ఈ పవిత్ర రహస్యం, ‘ఎన్నో విధాల్లో కనిపించే దేవుని తెలివికి’ ఒక అద్భుతమైన ఉదాహరణ. (ఎఫెసీయులు 3:8-10) ఈ రహస్యాన్ని రూపొందించడంలో, దాన్ని కొంచెంకొంచెంగా బయటపెట్టడంలో యెహోవాకున్న తెలివిని మనం అర్థం చేసుకోవచ్చు! ఆయన ఎంత తెలివిగలవాడు అంటే, అన్ని విషయాలూ ఒకేసారి చెప్తే మనుషులు అర్థం చేసుకోలేరని, కొంచెంకొంచెంగా బయటపెడుతూ వాళ్లు తన మీద నమ్మకాన్ని చూపించుకునేలా అవకాశం ఇచ్చాడు.—కీర్తన 103:14.
22 యేసును రాజుగా ఎంచుకోవడంలో కూడా యెహోవాకున్న సాటిలేని తెలివి కనిపిస్తుంది. వేరే ఏ దేవదూత లేదా మనిషి కన్నా యెహోవా కుమారుడు నమ్మదగినవాడు. ఆయన భూమ్మీద మనిషిగా జీవించినప్పుడు చాలా రకాల కష్టాలు పడ్డాడు, కాబట్టి మనుషుల సమస్యల్ని పూర్తిగా అర్థం చేసుకోగలడు. (హెబ్రీయులు 5:7-9) మరి యేసుతో కలిసి పరిపాలించేవాళ్ల సంగతేంటి? వందల సంవత్సరాలుగా యెహోవా అన్ని జాతుల నుండి, భాషల నుండి, సంస్కృతుల నుండి ఆడవాళ్లను, మగవాళ్లను ఎంచుకుని అభిషేకించాడు. వాళ్లు చూడని కష్టం అంటూ ఏదీలేదు. (ఎఫెసీయులు 4:22-24) మనల్ని అర్థం చేసుకుని, సహాయం చేసే అలాంటి రాజుల, యాజకుల పరిపాలనలో జీవించడం చాలా బాగుంటుంది!
23. పవిత్ర రహస్యానికి సంబంధించి క్రైస్తవులకు ఏ ఛాన్సు దొరికింది?
23 అపొస్తలుడైన పౌలు ఇలా రాశాడు: “ఎన్నో యుగాలుగా, ఎన్నో తరాలుగా దాచబడిన పవిత్ర రహస్యం . . . దేవుని పవిత్రులకు బయల్పర్చబడింది.” (కొలొస్సయులు 1:26) అవును, యెహోవా అభిషేకించిన పవిత్రులు ఈ పవిత్ర రహస్యం గురించి చాలా విషయాలు తెలుసుకున్నారు, వాటిని లక్షలమందితో పంచుకున్నారు. యెహోవా “తన సంకల్పం గురించిన పవిత్ర రహస్యాన్ని మనకు తెలియజేశాడు.” (ఎఫెసీయులు 1:9) మనందరికీ భలే ఛాన్సు దొరికింది కదా! కాబట్టి ఈ అద్భుతమైన రహస్యాన్ని వేరేవాళ్లతో పంచుకుందాం, అలాగే యెహోవాకున్న సాటిలేని తెలివి గురించి తెలుసుకునేలా సహాయం చేద్దాం!
a “దైవభక్తికి సంబంధించిన పవిత్ర రహస్యం” కూడా యేసు విషయంలో బయటపడింది. (1 తిమోతి 3:16) అసలు ఎవరైనా యెహోవాకు పూర్తి యథార్థంగా ఉండగలరా అనేది చాలాకాలంపాటు ఒక రహస్యంగా, చిక్కుముడిగా ఉండిపోయింది. సాతాను తెచ్చిన ప్రతీ పరీక్షలో యథార్థంగా ఉండడం ద్వారా యేసు ఆ చిక్కుముడిని విప్పాడు.—మత్తయి 4:1-11; 27:26-50.
b వాళ్లతోనే యేసు “రాజ్యం గురించి . . . ఒప్పందం” కూడా చేశాడు. (లూకా 22:29, 30) ఒకవిధంగా యేసు ఈ ‘చిన్నమందతో’ ఒక కాంట్రాక్టు చేసుకున్నాడు. అదేంటంటే, వాళ్లు అబ్రాహాము సంతానంలో రెండో భాగంగా తనతో కలిసి పరలోకంలో పరిపాలిస్తారు.—లూకా 12:32.