అధ్యాయం 18
‘దేవుని వాక్యంలో’ ఉన్న తెలివి
1, 2. యెహోవా మనకు ఏ ఉత్తరం రాశాడు? ఎందుకు?
ఎక్కడో దూరంలో ఉంటున్న మీవాళ్లు ఎవరైనా మీకు ఉత్తరం రాశారా? మనకు ఇష్టమైనవాళ్లు ఎంతో ప్రేమగా ఉత్తరం రాసినప్పుడు, మన ఆనందానికి హద్దులు ఉండవు. వాళ్లు ఎలా ఉన్నారో, వాళ్ల జీవితం ఎలా సాగుతుందో, వాళ్లు ఏం చేయాలనుకుంటున్నారో తెలుసుకోవాలని మనం కోరుకుంటాం. అలా మాట్లాడుకోవడం దూరాన్ని దూరం చేస్తుంది, బంధాల్ని దగ్గర చేస్తుంది.
2 అలాంటిది, మనం ఎంతో ప్రేమించే యెహోవాయే స్వయంగా మనకు ఉత్తరం రాస్తే, ఇంకెంత హ్యాపీగా ఉంటుందో కదా? ఒకవిధంగా, యెహోవా మనకు ఒక ఉత్తరం రాశాడు. అదే, ఆయన వాక్యమైన బైబిలు. అందులో ఆయన ఎలాంటివాడో, ఏం చేశాడో, ఏం చేయబోతున్నాడో చెప్పాడు, ఇంకా బోలెడు విషయాలు చెప్పాడు. యెహోవా మనకు దగ్గరవ్వాలని అనుకుంటున్నాడు కాబట్టి, తన వాక్యాన్ని ఇచ్చాడు. ఎంతో తెలివైన యెహోవా మనతో మాట్లాడడానికి ఒక చక్కని పద్ధతిని ఉపయోగించాడు. బైబిలు రాసిన విధానంలో, దాంట్లో ఉన్న విషయాల్లో యెహోవాకున్న సాటిలేని తెలివి కనిపిస్తుంది.
ఎందుకు రాయించాడు?
3. యెహోవా మోషేకు ధర్మశాస్త్రాన్ని ఎలా ఇచ్చాడు?
3 యెహోవా మనుషులకు తన మాటల్ని రాసిచ్చే బదులు, ఆయనే నేరుగా పరలోకంలో నుండి మాట్లాడి ఉంటే భలే ఉండేది అని కొంతమంది అనుకుంటారు. నిజానికి, యెహోవా కొన్నిసార్లు దేవదూతల్ని ఉపయోగించుకుని పరలోకం నుండి మాట్లాడాడు. ఉదాహరణకు, ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు ఆయన అదే చేశాడు. (గలతీయులు 3:19) ఆయన పరలోకం నుండి మాట్లాడినప్పుడు ఆ స్వరం విని ఇశ్రాయేలీయులు ఎంతగా భయపడ్డారంటే, వాళ్లు యెహోవాను తమతో నేరుగా మాట్లాడవద్దని, కావాలంటే మోషే ద్వారా మాట్లాడమని అడిగారు. (నిర్గమకాండం 20:18-20) అలా, దాదాపు 600 నియమాలు ఉన్న ధర్మశాస్త్రాన్ని యెహోవా ప్రతీ మాట చెప్పి మోషేతో రాయించాడు.
4. వట్టి నోటి మాటతోనే దేవుని నియమాల్ని తర్వాతి తరాలకు అందించడం ఎందుకు సరైన పద్ధతి కాదు?
4 కానీ, మోషే ఆ నియమాలన్నీ రాయకపోయి ఉంటే ఏం జరిగేది? దేవుడు చెప్పిన ప్రతీ నియమాన్ని పొల్లుపోకుండా, మర్చిపోకుండా మోషే ఇశ్రాయేలీయులకు చెప్పగలిగేవాడా? వాళ్లు అవన్నీ గుర్తుపెట్టుకుని వాళ్ల పిల్లలకు, మనవళ్లకు, మునిమనవళ్లకు చెప్పగలిగేవాళ్లా? వట్టి నోటి మాటతోనే అవన్నీ తర్వాతి తరాలకు వెళ్లాలంటే కష్టం. దేవుని నియమాల్ని ఉన్నదున్నట్టుగా తర్వాతి తరాలకు అందించడానికి అది సరైన పద్ధతి కాదు. ఇలా ఆలోచించండి: మీరు పదిమందిని వరుసగా నిలబెట్టారు. మొదటి వ్యక్తికి మీరు ఒక కథ చెప్పారు, ఆ వ్యక్తి దాన్ని రెండో వ్యక్తికి చెప్పాలి, రెండో వ్యక్తి మూడో వ్యక్తికి అలా పదిమంది దాకా ఆ కథ వెళ్లాలి. చివరికి పదో వ్యక్తి చెవినపడే సరికి మొదట చెప్పిన కథకు, పదో వ్యక్తి విన్న కథకు చాలా తేడా ఉంటుంది. కానీ దేవుని ధర్మశాస్త్రానికి మాత్రం అలా జరగలేదు.
5, 6. యెహోవా తన మాటల్ని ఏం చేయమని మోషేకు చెప్పాడు? యెహోవా బైబిల్ని రాయించడం ఒక వరమని ఎందుకు చెప్పవచ్చు?
5 యెహోవా చాలా తెలివిగా ఆలోచించి, మోషే చేత తన మాటల్ని రాయించాడు. ఆయన మోషేకు ఇలా చెప్పాడు: “ఈ మాటల్ని నువ్వు రాసిపెట్టాలి, ఎందుకంటే ఈ మాటల ప్రకారమే నేను నీతో, అలాగే ఇశ్రాయేలీయులతో ఒప్పందం చేస్తున్నాను.” (నిర్గమకాండం 34:27) అలా క్రీస్తు పూర్వం 1513 లో, బైబిల్ని రాయడం మొదలైంది. ఆ తర్వాత 1,610 సంవత్సరాల్లో యెహోవా దాదాపు 40 మంది మనుషులతో ‘ఎన్నో సందర్భాల్లో, ఎన్నో పద్ధతుల్లో మాట్లాడి’ బైబిల్ని రాయించాడు. (హెబ్రీయులు 1:1) ఆ సమయంలో నకలు రాసేవాళ్లు, లేఖనాల్ని ఉన్నదున్నట్టుగా భద్రపర్చాలనే ఆలోచనతో చాలా కష్టపడి, జాగ్రత్తగా వాటన్నిటినీ కాపీలు రాసిపెట్టారు.—ఎజ్రా 7:6; కీర్తన 45:1.
6 యెహోవా బైబిల్ని రాయించడం నిజంగా ఒక వరం. మీకు ఇష్టమైనవాళ్లు ఎప్పుడైనా మీ మనసును తాకే ఉత్తరం రాశారా? బహుశా ఆ ఉత్తరం మీకు చాలా ఓదార్పును ఇచ్చి ఉంటుంది. మీరు దాన్ని భద్రంగా దాచుకుని, మళ్లీమళ్లీ చదివి ఉంటారు. యెహోవా మనకు ఇచ్చిన ఉత్తరం కూడా అంతే. యెహోవా తన మాటల్ని రాయించడం ద్వారా మనం వాటిని రోజూ చదవగలుగుతున్నాం, ధ్యానించగలుగుతున్నాం. (కీర్తన 1:2) అంతేకాదు, మనకు అవసరమైనప్పుడు “లేఖనాలు ఇచ్చే ఊరట” కూడా పొందుతాం.—రోమీయులు 15:4.
ఎందుకు మనుషులతో రాయించాడు?
7. యెహోవా మనుషులతో బైబిల్ని రాయించడంలో ఆయన తెలివి ఎలా కనిపిస్తుంది?
7 యెహోవా తెలివిగా తన వాక్యాన్ని మనుషులతో రాయించాడు. ఒకసారి ఆలోచించండి: ఒకవేళ యెహోవా బైబిల్ని దేవదూతలతో రాయించి ఉంటే, ఇప్పుడు ఉన్నట్లే అది మన మనసుకు హత్తుకుని ఉండేదా? నిజమే, దేవదూతలు యెహోవా గురించి గొప్పగా రాసి ఉండేవాళ్లేమో. వాళ్లు ఆయన్ని ఎందుకు ఆరాధిస్తున్నారో, భూమ్మీద ఆయన్ని ఎవరెవరు నమ్మకంగా సేవిస్తున్నారో రాసి ఉండేవాళ్లేమో. కానీ మనకంటే ఎక్కువ జ్ఞానం, అనుభవం, బలం ఉన్న దేవదూతలు రాసినవాటిని మనం నిజంగా అర్థం చేసుకోగలిగే వాళ్లమా?—హెబ్రీయులు 2:6, 7.
8. బైబిలు రచయితలకు యెహోవా ఏ అవకాశాన్ని ఇచ్చాడు? (అధస్సూచి కూడా చూడండి.)
8 యెహోవా బైబిల్ని మనుషుల చేత రాయించడం ద్వారా, సరిగ్గా మనకు అవసరమైన పుస్తకాన్ని ఇచ్చాడు. ఈ పుస్తకాన్ని “దేవుడు ప్రేరేపించాడు,” అయినా అది మనుషుల ఫీలింగ్స్‌ని హత్తుకునేలా ఉంది. (2 తిమోతి 3:16) ఆయన దాన్ని ఎలా చేశాడు? చాలా సందర్భాల్లో, రచయిత తన సొంత తెలివితేటలతో “మనోహరమైన పదాల్ని ఎంచుకొని, సత్యమైన మాటల్ని ఉన్నదున్నట్టు” రాసేలా యెహోవా అవకాశం ఇచ్చాడు. (ప్రసంగి 12:10, 11) అందుకే బైబిల్లో ఒక్కో పుస్తకం ఒక్కో రీతిలో ఉంటుంది. దాన్ని గమనిస్తే అది రాసిన వ్యక్తి పుట్టిపెరిగిన వాతావరణం, మనస్తత్వం కనిపిస్తాయి.a అయినా, వీళ్లందరూ “పవిత్రశక్తితో ప్రేరేపించబడి, దేవుని నుండి వచ్చిన విషయాలు మాట్లాడారు.” (2 పేతురు 1:21) కాబట్టి బైబిలు నిజంగా “దేవుని వాక్యమే.”—1 థెస్సలొనీకయులు 2:13.
“లేఖనాలన్నిటినీ దేవుడు ప్రేరేపించాడు”
9, 10. బైబిలు ఎందుకు మన హృదయాల్ని తాకుతుంది?
9 బైబిల్ని రాయడానికి యెహోవా మనుషుల్ని ఉపయోగించడం వల్ల, అది మన హృదయాల్ని తాకుతుంది, మనసుల్ని తట్టి లేపుతుంది. దాన్ని రాసింది మనలాంటి ఫీలింగ్స్ ఉన్న మనుషులే. అపరిపూర్ణత వల్ల వాళ్లు కూడా మనలాంటి కష్టాలు, ఒత్తిళ్లే ఎదుర్కొన్నారు. కొన్నిసార్లు వాళ్ల సొంత ఫీలింగ్స్‌ని, జీవితంలో వాళ్లు చూసిన ఆటుపోటుల్ని రాసేలా పవిత్రశక్తి వాళ్లను ప్రేరేపించింది. (2 కొరింథీయులు 12:7-10) కాబట్టి వాళ్ల సొంత అనుభవాల్ని, వాళ్ల మాటల్లోనే రాశారు. అలా ఏ దేవదూతా రాయలేడు.
10 ఉదాహరణకు, ఇశ్రాయేలు రాజైన దావీదు గురించే తీసుకోండి. ఆయన కొన్ని ఘోరమైన పాపాలు చేసిన తర్వాత, తన మనసులో ఉన్న బాధంతా చెప్తూ, దేవుని క్షమాపణ కోరుతూ ఒక కీర్తన రాశాడు. ఆయన ఇలా రాశాడు: “నా పాపం పోయేలా నన్ను శుభ్రం చేయి. నా అపరాధాలు నాకు బాగా తెలుసు, నా పాపం ఎప్పుడూ నా ఎదుటే ఉంది. నేను పుట్టడమే దోషంతో పుట్టాను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది. నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకు; నీ పవిత్రశక్తిని నా నుండి తీసేయకు. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి; దేవా, విరిగి నలిగిన హృదయాన్ని నువ్వు తిరస్కరించవు.” (కీర్తన 51:2, 3, 5, 11, 17) కీర్తనకర్త ఆవేదన మీకు అర్థమౌతుందా? గుండెల్ని పిండేసే ఇలాంటి ఫీలింగ్స్‌ని అపరిపూర్ణ మనుషులు తప్ప ఇంకెవరు రాయగలరు?
ఎందుకు మనుషుల గురించి ఉంది?
11. యెహోవా ఎందుకని చాలామంది జీవిత కథల్ని బైబిల్లో రాయించాడు?
11 బైబిలు మన హృదయాన్ని అంతగా తాకడానికి ఇంకో కారణం ఏంటంటే, అందులో చాలామట్టుకు నిజంగా జీవించిన మనుషుల గురించి ఉంది. వాళ్లలో యెహోవాను సేవించినవాళ్లు కొందరైతే, సేవించనివాళ్లు కొందరు. మనం వాళ్ల అనుభవాల గురించి, వాళ్ల కష్టసుఖాల గురించి బైబిల్లో చదువుతాం. ఇంకా, వాళ్లు తీసుకున్న నిర్ణయాల వల్ల చివరికి ఏమైందో చూస్తాం. ఇలాంటి కథలు “మనకు బోధించడానికే రాయబడ్డాయి.” (రోమీయులు 15:4) యెహోవా మన హృదయాలకు హత్తుకునేలా బోధించడానికి ఇలా నిజ జీవిత కథల్ని ఉపయోగించాడు. కొన్ని ఉదాహరణలు చూడండి.
12. బైబిల్లో నమ్మకంగా లేనివాళ్ల గురించి రాయించడం వల్ల మనకేంటి ప్రయోజనం?
12 మనం బైబిల్లో నమ్మకంగా లేనివాళ్ల గురించి, చెడ్డవాళ్ల గురించి, వాళ్లకు వచ్చిన నష్టాల గురించి చూస్తాం. ఈ కథల వల్ల, ఫలానా చెడ్డ లక్షణం చూపించడం ఎందుకు తప్పో మనకు ఇట్టే అర్థమైపోతుంది. ఉదాహరణకు, నమ్మకద్రోహం చేయొద్దు అని బైబిలు సూటిగా ఆజ్ఞ ఇచ్చే బదులు, యేసుకు వెన్నుపోటు పొడిచిన యూదా ఉదాహరణ చూపించి, ఇలా చేయకండి అని చెప్పడం ఇంకా బాగుంటుంది కదా? (మత్తయి 26:14-16, 46-50; 27:3-10) ఇలాంటి కథలు మన హృదయాన్ని తాకుతాయి, చెడ్డ లక్షణాల్ని గుర్తుపట్టి వాటిని వదిలించుకోవడానికి సహాయం చేస్తాయి.
13. మంచి లక్షణాల్ని అర్థం చేసుకోవడానికి బైబిలు ఎలా సహాయం చేస్తుంది?
13 దేవునికి నమ్మకంగా ఉన్న ఎంతోమంది సేవకుల గురించి కూడా బైబిల్లో ఉంది. మనం వాళ్ల భక్తి గురించి, విశ్వసనీయత గురించి చదువుతాం. మనం దేవునికి దగ్గరవ్వడానికి ఏ లక్షణాలు పెంచుకోవాలని అనుకుంటున్నామో, ఆ లక్షణాలకు మారుపేరుగా నిలిచినవాళ్ల గురించి చూస్తాం. ఉదాహరణకు, విశ్వాసాన్నే తీసుకోండి. విశ్వాసం అంటే ఏంటో, దేవుణ్ణి సంతోషపెట్టాలంటే అది ఎంత ముఖ్యమో బైబిలు చెప్తుంది. (హెబ్రీయులు 11:1, 6) అయితే, విశ్వాసాన్ని పనుల్లో కొట్టొచ్చినట్టు చూపించినవాళ్ల ఉదాహరణలు కూడా అందులో ఉన్నాయి. ఇస్సాకును బలిగా ఇవ్వడానికి సిద్ధమైనప్పుడు అబ్రాహాము చూపించిన విశ్వాసం గురించి ఒకసారి ఆలోచించండి. (ఆదికాండం 22వ అధ్యాయం; హెబ్రీయులు 11:17-19) అలాంటి కథల వల్ల విశ్వాసమంటే ఏంటో మనం ఇంకా బాగా అర్థం చేసుకుంటాం. యెహోవా ఎంత తెలివిగలవాడంటే ఈ మంచి లక్షణాల్ని పెంచుకోమని చెప్పడమే కాదు, వాటిని ఎలా చూపించాలో కూడా ఉదాహరణలతో చెప్పాడు!
14, 15. ఆలయానికి వచ్చిన ఒకామె గురించి బైబిలు ఏం చెప్తుంది? దాన్నుండి మనం యెహోవా గురించి ఏం తెలుసుకోవచ్చు?
14 బైబిల్లో ఉన్న ఈ నిజ జీవిత కథలు, యెహోవా వ్యక్తిత్వం గురించి ఏదోకటి చెప్తూనే ఉంటాయి. యేసు ఆలయంలో చూసిన ఒకామె గురించి బైబిలు ఏం చెప్తుందో చూడండి. ఆయన ఆలయంలో కానుకల పెట్టెల దగ్గర కూర్చుని, కానుకలు వేస్తున్న ప్రజల్ని గమనిస్తున్నాడు. చాలామంది ధనవంతులు వచ్చి “తమ సంపదల్లో నుండి కొంచెం వేశారు.” కానీ, ఆయన చూపు ఒక పేద విధవరాలి మీద నుండి కదల్లేదు. ఆమె “చాలా తక్కువ విలువగల రెండు చిన్న నాణేలు వేసింది.”b ఆమె దగ్గరున్న డబ్బంతా ఇక అదే. అచ్చం యెహోవాలా ఆలోచించే యేసు ఇలా అన్నాడు: “కానుక పెట్టెల్లో డబ్బులు వేసిన వాళ్లందరి కన్నా ఈ పేద విధవరాలే ఎక్కువ వేసింది.” అక్కడున్న వాళ్ల విరాళాలన్నీ కలిపితే ఎంత అవుతుందో, అంతకంటే ఎక్కువ ఈమె వేసిందని యేసు అన్నాడు.—మార్కు 12:41-44; లూకా 21:1-4; యోహాను 8:28.
15 ఆ రోజు ఆలయంలో ఉన్నవాళ్లందర్నీ వదిలేసి, ఈ పేద విధవరాలు ఒక్కదాని గురించే యెహోవా బైబిల్లో రాయించడం మీకు ఆశ్చర్యంగా అనిపించట్లేదా? మనం చేసే చిన్న పనిని కూడా మెచ్చుకుంటానని యెహోవా ఈ ఉదాహరణ ద్వారా చెప్తున్నాడు. మనం ఇచ్చేది వేరేవాళ్ల కన్నా తక్కువే కావచ్చు, కానీ మనం ఇవ్వగలిగింది ఇచ్చినప్పుడు యెహోవా సంతోషంగా దాన్ని తీసుకుంటాడు. మనసుకు హత్తుకునే ఈ సత్యాన్ని నేర్పించడానికి, యెహోవాకు ఇంతకన్నా మంచి మార్గం కనిపించి ఉండదు!
బైబిల్లో ఏం లేవు?
16, 17. యెహోవా బైబిల్లో ఏం రాయించలేదో ఆలోచించినప్పుడు కూడా ఆయన తెలివి ఎలా కనిపిస్తుంది?
16 మనకు ఇష్టమైనవాళ్లకు ఉత్తరం రాస్తున్నప్పుడు చాలా చెప్పాలని ఉంటుంది. కానీ అన్ని విషయాలూ రాయలేం కాబట్టి, బాగా ఆలోచించి ఏవి ముఖ్యమో అవే రాస్తాం. అదేవిధంగా, యెహోవా కూడా బైబిల్లో కొంతమంది వ్యక్తుల గురించి, కొన్ని సందర్భాల గురించి రాయించాడు. అయితే, వాటి గురించి చెప్తున్నప్పుడు కొన్నిసార్లు బైబిలు పూసగుచ్చినట్లు ప్రతీ వివరాన్ని చెప్పట్లేదు. (యోహాను 21:25) ఉదాహరణకు, యెహోవా తీర్పు తీర్చే విధానం గురించి మనకు వచ్చే ప్రతీ ప్రశ్నకు బైబిల్లో జవాబు దొరకకపోవచ్చు. అయితే, యెహోవా బైబిల్లో ఏం రాయించలేదో ఆలోచిస్తే కూడా ఆయన తెలివి అర్థమౌతుంది. అదెలా?
17 బైబిలు ఎలా రాయబడిందంటే, అది మన హృదయాన్ని పరీక్షిస్తుంది. హెబ్రీయులు 4:12 ఇలా చెప్తుంది: “దేవుని వాక్యం [లేదా, సందేశం] సజీవమైనది, చాలా శక్తివంతమైనది. రెండువైపులా పదునున్న ఎలాంటి ఖడ్గం కన్నా పదునైనది. అది ఎంత లోతుగా దూసుకెళ్తుందంటే, ఒక మనిషి పైకి కనిపించేదానికీ అతని అంతరంగానికీ మధ్యవున్న తేడాను బయటపెడుతుంది; . . . హృదయంలోని ఆలోచనల్ని, ఉద్దేశాల్ని వెల్లడిచేస్తుంది.” అవును, బైబిల్లోని సందేశం మన హృదయంలోకి దూసుకెళ్లి మన అసలైన ఆలోచనల్ని, ఉద్దేశాల్ని బయటపెడుతుంది. బైబిల్లో తప్పులు వెతకాలని చదివేవాళ్లు, దానిలో పూర్తి వివరాలు లేకపోవడం చూసి ముఖం చిన్నబుచ్చుకుంటారు. అంతేకాదు, యెహోవాలో ప్రేమ, న్యాయం, తెలివి నిజంగా ఉన్నాయా అని కూడా ప్రశ్నిస్తారు.
18, 19. (ఎ) బైబిల్లో మనకు వచ్చే ప్రశ్నలకు జవాబులు వెంటనే దొరకకపోతే, మనం ఎందుకు చిన్నబుచ్చుకోకూడదు? (బి) దేవుని వాక్యమైన బైబిల్ని అర్థం చేసుకోవాలంటే దాన్ని ఎలా చదవాలి? అందులో యెహోవా గొప్ప తెలివి ఎలా కనిపిస్తుంది?
18 అలా కాకుండా, మనం బైబిల్ని మంచి మనసుతో జాగ్రత్తగా చదివినప్పుడు, మొత్తంగా బైబిలు యెహోవాను ఎలా చూపిస్తుందో మనకు అర్థమౌతుంది. కాబట్టి ఫలానా సందర్భం గురించి మనకు వచ్చిన ప్రశ్నలకు, బైబిల్లో వెంటనే సమాధానం దొరకకపోయినా మనం చిన్నబుచ్చుకోం. దీన్ని అర్థం చేసుకోవడానికి ఇలా ఆలోచించండి: మీరు ఒక పెద్ద పజిల్‌ని పూర్తి చేస్తున్నారు. మొదట్లో మీకు కావాల్సిన ఒక ముక్క అందులో దొరకలేదు, లేదా దానిలో ఒక ముక్కను ఎక్కడ పెట్టాలో మీకు తెలియలేదు. అయితే దాన్ని వదిలేసి మీరు మిగతా ముక్కల్ని పెట్టేశారు కాబట్టి, దాని పూర్తి చిత్రం ఎలా ఉంటుందో మీకు అర్థమైపోతుంది. అదేవిధంగా, మనం బైబిలు చదువుతున్నప్పుడు యెహోవా ఎలాంటివాడో కొంచెంకొంచెంగా తెలుసుకుంటాం. దానివల్ల మనకు యెహోవా గురించి ఒక చిత్రం వస్తుంది. కొన్ని సందర్భాల్లో యెహోవా ఎందుకలా ప్రవర్తించాడో, లేదా ఆయన చేసిన పని ఆయన వ్యక్తిత్వానికి ఎలా సరిపోతుందో మనకు అర్థం కాకపోవచ్చు. అయినా, మనం అప్పటికే యెహోవా గురించి బైబిల్లో బోలెడన్ని విషయాలు నేర్చుకున్నాం కాబట్టి ఆయన ఏదైనా ప్రేమగా, నీతిగా, న్యాయంగానే చేసుంటాడని మనకు అర్థమౌతుంది.
19 కాబట్టి దేవుని వాక్యమైన బైబిల్ని అర్థం చేసుకోవాలంటే మనం మంచి మనసుతో, సరైన ఉద్దేశంతో చదవాలి, అధ్యయనం చేయాలి. అందులో మీకు యెహోవా గొప్ప తెలివి కనిపించట్లేదా? తెలివితేటలు ఉన్న మనుషులు “తెలివిగలవాళ్లకు, మేధావులకు” మాత్రమే అర్థమయ్యే పుస్తకాల్ని రాయగలరు. కానీ కేవలం మంచి మనసున్న వాళ్లకే అర్థమయ్యే పుస్తకాన్ని రాయాలంటే మాత్రం, అది ఎంతో తెలివిగల యెహోవాకే సాధ్యం!—మత్తయి 11:25.
బ్రతకడానికి కావాల్సిన “తెలివిని” నేర్పే పుస్తకం
20. మనం ఎలా బ్రతకాలో యెహోవా మాత్రమే ఎందుకు చెప్పగలడు? బైబిల్లో ఏ ఖజానా ఉంది?
20 మనం ఎలా బ్రతకాలో యెహోవా తన వాక్యమైన బైబిల్లో చెప్తున్నాడు. ఆయన మన సృష్టికర్త కాబట్టి, మన అవసరాలేంటో మనకన్నా బాగా ఆయనకే తెలుసు. ఒక మనిషికి కావాల్సిందల్లా ఏంటి? సంతోషంగా ఉండాలి, అందరూ మనల్ని ప్రేమించాలి, మనం అందరితో బాగుండాలి, ఇంతే కదా. అప్పుడైనా ఇప్పుడైనా మనుషులందరూ కోరుకునేది అదే. అలా బ్రతకడానికి సహాయం చేసే ‘తెలివైన’ సలహాల ఖజానా బైబిల్లో ఉంది. (సామెతలు 2:7) ఈ పుస్తకంలోని ప్రతీ సెక్షన్‌లో, బైబిలిచ్చే తెలివైన సలహాల్ని మనం ఎలా పాటించవచ్చో వివరించే ఒక అధ్యాయం ఉంటుంది. అయితే వాటిలో ఒక్క ఉదాహరణ ఇప్పుడు చూద్దాం.
21-23. కోపాన్ని, పగను మనసులో పెట్టుకోకుండా ఉండడానికి బైబిల్లో ఏ తెలివైన సలహాలు ఉన్నాయి?
21 ఎవరైనా వాళ్ల మనసులో పగ ప్రతీకారాలు పెట్టేసుకుని, చివరికి వాళ్లే నష్టపోవడం మీరు చూసే ఉంటారు. మనసులో పగ పెట్టుకుంటే పెద్ద బరువును మోస్తున్నట్టే. ఆ బరువును దించేసుకోకుండా అలానే మోస్తూ ఉంటే అది మన ఆలోచనల్ని తినేస్తుంది, మనశ్శాంతి లేకుండా చేస్తుంది, మన ఆనందాన్ని దోచేసుకుంటుంది. కోపాన్ని మనసులోనే దాచుకోవడం వల్ల గుండె జబ్బులు, ఇంకా వేరే రకమైన వ్యాధులు వస్తాయని పరిశోధనలు చూపిస్తున్నాయి. అయితే ఆ పరిశోధనలు జరపడానికి చాలాకాలం ముందే, బైబిలు తెలివిగా ఈ సలహా ఇచ్చింది: “కోపం మానుకో, ఆగ్రహం విడిచిపెట్టు.” (కీర్తన 37:8) దాన్ని మనమెలా చేయవచ్చు?
22 దేవుని వాక్యమైన బైబిలు ఈ తెలివైన సలహా ఇస్తుంది: “మనిషి లోతైన అవగాహన అతని కోపాన్ని చల్లారుస్తుంది, తప్పును పట్టించుకోకుండా ఉండడం అతనికి ఘనతను తెస్తుంది.” (సామెతలు 19:11) లోతైన అవగాహన అంటే విషయాన్ని పైపైన కాకుండా లోతుల్లోకి వెళ్లి చూడడం. లోతైన అవగాహనలో అర్థం చేసుకోవడం కూడా ఉంది. ఒక వ్యక్తి ఏదైనా అన్నా, ఏమైనా చేసినా ఆయన ఎందుకలా చేసి ఉంటాడా అని మనం ఆలోచించడానికి అది సహాయం చేస్తుంది. ఆయన పరిస్థితులు, ఉద్దేశాలు, ఫీలింగ్స్ ఏంటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఇక ఆయన మీద కోపం పెట్టుకోం, ఆయన్ని శత్రువులా చూడం.
23 బైబిలు ఈ తెలివైన సలహా కూడా ఇస్తుంది: “ఒకరి విషయంలో ఒకరు సహనం చూపిస్తూ, మనస్ఫూర్తిగా ఒకరినొకరు క్షమించుకుంటూ ఉండండి.” (కొలొస్సయులు 3:13) “ఒకరి విషయంలో ఒకరు సహనం చూపిస్తూ” ఉండడమంటే వేరేవాళ్ల లక్షణాలు, పనులు మనకు ఎంత చిరాకు పుట్టించినా వాటిని తట్టుకుంటూ భరించడం. అలా సహనం చూపించడం వల్ల అయినదానికి-కానిదానికి వాళ్ల మీద పగ పెంచుకోకుండా ఉంటాం. ఇకపోతే, “క్షమించడం” అంటే పగను పూర్తిగా తీసేసుకోవడం అని అర్థం. క్షమించడానికి ఆధారం ఉన్నప్పుడు మనం ఇతరుల్ని క్షమించాలని మన తెలివైన తండ్రి కోరుతున్నాడు. అది వాళ్ల మంచి కోసమే కాదు, మనకు కూడా మనశ్శాంతి, ప్రశాంతత మిగులుతాయి. (లూకా 17:3, 4) నిజంగా దేవుని వాక్యమైన బైబిల్లో ఎంత తెలివైన సలహాలు ఉన్నాయో కదా!
24. యెహోవా ఇచ్చే తెలివైన సలహాల్ని మనం పాటించినప్పుడు ఏమౌతుంది?
24 యెహోవాకున్న అపారమైన ప్రేమ వల్ల, ఆయన మనతో మాట్లాడాలని తపిస్తున్నాడు. దానికి ఆయన ఒక చక్కని పద్ధతిని ఎంచుకున్నాడు. అదేంటంటే, పవిత్రశక్తితో ప్రేరేపించి కొంతమంది మనుషులతో ఆయన ఒక ఉత్తరాన్ని రాయించాడు. కాబట్టి, ఆ ఉత్తరంలో ప్రతీ అక్షరం వెనక ఉన్నది స్వయంగా యెహోవా తెలివే. ఆ తెలివి ‘ఎంతో నమ్మదగినది.’ (కీర్తన 93:5) కాబట్టి ఆ తెలివైన సలహాల్ని మనం పాటించినప్పుడు, అలాగే వాటిని వేరేవాళ్లకు చెప్పినప్పుడు మనకు తెలియకుండానే తెలివైన దేవునికి దగ్గరైపోతాం. యెహోవాకున్న గొప్ప తెలివికి అద్దంపట్టే ఇంకో ఉదాహరణను తర్వాతి అధ్యాయంలో చూస్తాం. అదేంటంటే, యెహోవా జరగబోయేదాన్ని ముందే చెప్పగలడు, తను అనుకున్నదాన్ని నిజం చేయగలడు.
a ఉదాహరణకు, దావీదు ఒక గొర్రెల కాపరి కాబట్టి ఆయన ఎక్కువగా గొర్రెల్ని కాపాడడం, సంరక్షించడం లాంటివాటి గురించి రాశాడు. (కీర్తన 23) మత్తయి పన్ను వసూలు చేసేవాడు కాబట్టి, ఆయన మాటలు సంఖ్యల చుట్టూ, డబ్బుల చుట్టూ తిరిగాయి. (మత్తయి 17:27; 26:15; 27:3) లూకా ఒక డాక్టర్ కాబట్టి, ఆయన రోగాల గురించి చాలా స్పష్టంగా రాశాడు.—లూకా 4:38; 14:2; 16:20.
b ఆ నాణేన్ని లెప్టాన్ అంటారు. అప్పట్లో చెలామణి అవుతున్న యూదా నాణేల్లో, అన్నిటికన్నా తక్కువ విలువగలది ఇదే. ఈ రెండు నాణేల విలువ, ఒకరోజు పనిచేస్తే వచ్చే కూలిలో 64వ వంతుతో సమానం. వాటికి అతి చవకగా దొరికే, పేదవాళ్లు ఆహారంగా తినే ఒక పిచ్చుక కూడా రాదు.