కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w97 6/15 పేజీలు 4-8
  • బైబిలును దేవుడు ఎలా ప్రేరేపించాడు?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • బైబిలును దేవుడు ఎలా ప్రేరేపించాడు?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ప్రయాసతో కూడిన ప్రయత్నం అవసరం
  • ఆచరణాత్మక సలహాలు—ఎవరి నుండి?
  • మానవ రచయితలు—ఎందుకు?
  • ‘పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపించబడ్డారు’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2012
  • ‘దేవుని వాక్యంలో’ ఉన్న తెలివి
    యెహోవాకు దగ్గరవ్వండి
  • బైబిల్ని నిజంగా దేవుడే “ప్రేరేపించాడా?”
    తేజరిల్లు!—2017
  • ప్రేమించే దేవుని నుండి వచ్చిన ఉత్తరం
    గొప్ప బోధకుడు—ఆయన దగ్గర నేర్చుకోండి
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
w97 6/15 పేజీలు 4-8

బైబిలును దేవుడు ఎలా ప్రేరేపించాడు?

సమాచార వినిమయం అనేది చరిత్ర అంతటిలోకెల్లా నేడు అత్యంత ఆసక్తిదాయకంగా ఉంది. టెలిఫోన్‌లు, ఫ్యాక్స్‌ మిషన్‌లు, కంప్యూటర్‌లు—సందేశాలను ప్రపంచంలోని ఏ స్థలానికైనా పంపగలిగే, అదీ క్షణాల్లో పంపగలిగే సమయం వస్తుందని సంవత్సరాల క్రితం ఎవరు ఊహించివుంటారు?

అయితే మానవులు అనుకరణ చేయలేని, ఎంతో ఆసక్తిని రేకెత్తించే విధమైన సమాచార వినిమయ పద్ధతి మరొకటి ఉంది, అదే దైవ ప్రేరేపణ. తన లిఖిత వాక్యమైన పరిశుద్ధ బైబిలును వ్రాసేందుకు యెహోవా కనీసం 40 మంది మానవ రచయితలను ప్రేరేపించాడు. మానవులకు ఏ విధంగా రకరకాల సంభాషణా మాధ్యమాలు అందుబాటులో ఉన్నాయో, అదే విధంగా యెహోవా కూడా లేఖనాలను ప్రేరేపించేందుకు అనేక సంభాషణా పద్ధతులను ఉపయోగించాడు.

చెప్పి వ్రాయించడం. దేవుడు ప్రత్యేక సందేశాలను పంపించాడు, వాటిని తర్వాత బైబిలు వృత్తాంతంలో చేర్చడం జరిగింది.a ఉదాహరణకు, ధర్మశాస్త్ర నిబంధనగా రూపొందిన కట్టడలను పరిశీలించండి. “ఈ వాక్యములను వ్రాసికొనుము; ఏలయనగా ఈ వాక్యములనుబట్టి నేను నీతోను ఇశ్రాయేలీయులతోను నిబంధన చేసియున్నాను” అని యెహోవా మోషేతో చెప్పాడు. (నిర్గమకాండము 34:27) ‘దేవదూతల ద్వారా పొందిన’ ఆ “వాక్యములను” మోషే వ్రాసి ఉంచాడు మరి మనం నేడు వాటిని బైబిలులోని నిర్గమకాండము, లేవీయకాండము, సంఖ్యాకాండము మరియు ద్వితీయోపదేశకాండములలో కనుగొనగలము.—అపొస్తలుల కార్యములు 7:53.

యెషయా, యిర్మీయా, యెహెజ్కేలు, ఆమోసు, నహూము మరియు మీకాలతో సహా అనేకమంది ఇతర ప్రవక్తలు దేవదూతల ద్వారా దేవుని నుండి ప్రత్యేక సందేశాలను అందుకున్నారు. కొన్నిసార్లు ఈ వ్యక్తులు తమ వర్తమానాలను “యెహోవా సెలవిచ్చునదేమనగా” అనే పదబంధంతో ప్రారంభించారు. (యెషయా 37:6; యిర్మీయా 2:2; యెహెజ్కేలు 11:5; ఆమోసు 1:3; మీకా 2:3; నహూము 1:12) తర్వాత వారు దేవుడు చెప్పిన వాటికి లిఖిత రూపాన్నిచ్చారు.

దర్శనాలు, కలలు మరియు పారవశ్యములు. దర్శనము అంటే ఒక వ్యక్తి మెలకువగా ఉన్నప్పుడు, ఏదైనా అసాధారణమైన మూలం ద్వారా ఓ ప్రతిరూపాన్ని, దృశ్యాన్ని లేక సందేశాన్ని అతడి మనస్సుపై గాఢంగా ముద్రించడం. ఉదాహరణకు, పేతురు, యాకోబు, యోహానులు “మేలుకొనినప్పుడు” రూపాంతరం చెందిన యేసు యొక్క దర్శనాన్ని చూశారు. (లూకా 9:28-36; 2 పేతురు 1:16-21) కొన్ని సందర్భాల్లో ఒక సందేశం కల లేక రాత్రి స్వప్నం ద్వారా అందించబడి, దానినందుకుంటున్న వ్యక్తి నిద్రిస్తుండగా అతడి ఉపచేతనపై ముద్ర వేయబడేది. దానియేలు అలా తన ‘పడకమీద పరుండియుండగా’ తనకు ‘కలిగిన దర్శనములను’ గురించి వ్రాస్తున్నాడు. దాన్ని “నేను నా కలలో గమనిస్తూ పడుకుని ఉండగా” అని అనువాదకుడైన రోనాల్డ్‌ ఎ. నాక్స్‌ అనువదించాడు.—దానియేలు 4:10.

యెహోవా పారవశ్యాన్ని కలిగించినప్పుడు దానిననుభవిస్తున్న వ్యక్తి కనీసం సగం మెలకువగా ఉన్నప్పటికీ గాఢమైన ఏకాగ్రతలో ఉంటాడన్నది రుజువౌతుంది. (అపొస్తలుల కార్యములు 10:9-16 పోల్చండి.) బైబిలులో “పారవశ్యం” (ఎక్స్‌టేసిస్‌) అని అనువదించబడిన గ్రీకు పదం యొక్క అర్థం ‘తీసివేయడం లేక స్థానభ్రంశం చెందడం.’ మనస్సును దాని మామూలు స్థాయికి వెలుపల ఉంచడమనే భావాన్ని కలిగివుంది. అలా, పారవశ్యంలో ఉన్న వ్యక్తి తన దర్శనాన్ని పూర్తిగా పొందుతూ ఉంటాడు, అతడి చుట్టూ ఉన్న పరిస్థితులు అతడి స్మృతిపథంలో ఉండవు. “పరదైసులోనికి కొనిపోబడి, వచింప శక్యము కాని మాటలు వినెను; ఆ మాటలు మనుష్యుడు పలుకకూడదు” అని అపొస్తలుడైన పౌలు వ్రాసినప్పుడు ఆయన అలాంటి పారవశ్యంలోనే ఉండివుంటాడు.—2 కొరింథీయులు 12:2-4.

దేవుడు చెప్పి వ్రాయించిన వాటిని వ్రాసిన వారికి భిన్నంగా, దర్శనాలను లేక కలలను అందుకున్న వారు లేక పారవశ్యాలను అనుభవించిన వారు తరచూ తాము చూసిన వాటిని తమ స్వంత మాటల్లో వివరించే భాషాస్వేచ్ఛను కొంత కలిగివున్నారు. హబక్కూకుకు ఇలా చెప్పబడింది: “చదువువాడు పరుగెత్తుచు [“అనర్గళంగా,” NW] చదువ వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలకమీద స్పష్టముగా వ్రాయుము.”—హబక్కూకు 2:2.

బైబిలులోని ఈ భాగాలు, చెప్పి వ్రాయించిన వాటిలా సంపూర్తిగా ప్రేరేపించబడలేదని దీని అర్థమా? ఎంత మాత్రం కాదు. యెహోవా తన ఆత్మ ద్వారా ప్రతి రచయిత యొక్క మనఃఫలకంపై తన సందేశాన్ని గాఢంగా ముద్రించాడు, ఆ విధంగా మానవుని తలంపులుకాక దేవుని తలంపులే అందజేయబడ్డాయి. సరైన పదాలను ఎంపిక చేసుకునేందుకు యెహోవా రచయితను అనుమతించినప్పటికీ, ఎలాంటి ప్రాముఖ్యమైన సమాచారం కూడా వదిలిపెట్టబడకుండా ఉండేందుకు, తత్ఫలితంగా ఆ వాక్యములు దేవునివేనని సరిగ్గానే దృష్టించబడేందుకు యెహోవా రచయితల మనస్సులనూ హృదయాల్నీ నడిపించాడు.—1 థెస్సలొనీకయులు 2:13.

దైవిక ప్రకటన. బైబిలునందు ప్రవచనాలు—అంటే చరిత్ర ముందుగానే బయల్పర్చబడి, వ్రాయబడటమని అర్థం—ఉన్నాయి, అది అల్ప మానవ సామర్థ్యానికి అతీతమైన విషయం. ఒక ఉదాహరణ “గ్రేకులరాజు” అయిన అలెగ్జాండర్‌ ది గ్రేట్‌ ఏలికూలడం గురించి దాదాపు 200 సంవత్సరాలకు ముందే ప్రవచించబడింది! (దానియేలు 8:1-8, 20-22) మానవ నేత్రాలతో ఎన్నడూ వీక్షించబడని సంఘటనలను కూడా బైబిలు బయల్పరుస్తోంది. భూమ్యాకాశాల సృష్టి ఇందుకొక ఉదాహరణ. (ఆదికాండము 1:1-27; 2:7, 8) మరి పరలోకంలో జరిగిన సంభాషణలు అంటే యోబు గ్రంథంలో వ్రాయబడినటువంటివి కూడా అందులోవున్నాయి.—యోబు 1:6-12; 2:1-6.

దేవుని ద్వారా రచయితకు సూటిగా బయల్పర్చబడనప్పుడు, అలాంటి సంఘటనలు దేవునిచే ఇతరులకు తెలుపబడ్డాయి, అలా అవి మౌఖిక లేక లిఖిత చరిత్రలో ఒక భాగమయ్యాయి, అలా అవి బైబిలులో ఒక భాగమయ్యేంత వరకూ ఒక తరం నుండి మరొక తరానికి అందించబడుతూ వచ్చాయి. (7వ పేజీలోని బాక్సు చూడండి.) ఏది ఏమైనప్పటికీ, అలాంటి సమాచారానికంతటికీ యెహోవాయే మూలమని మరియు రచయితల వృత్తాంతాలు తప్పులతో, అతిశయోక్తులతో, లేక కల్పితకథలతో కలుషితం చేయబడకుండా ఆయన రచయితలను నడిపించాడని మనం నిశ్చయతను కలిగి ఉండవచ్చు. ప్రవచనాన్ని గురించి పేతురు ఇలా వ్రాశాడు: “మనుష్యులు పరిశుద్ధాత్మవలన ప్రేరేపింపబడినవారై దేవుని మూలముగ పలికిరి.”b—2 పేతురు 1:21.

ప్రయాసతో కూడిన ప్రయత్నం అవసరం

బైబిలు రచయితలు “పరిశుద్ధాత్మవలన ప్రేరేపింప”బడినప్పటికీ, వారు కూడా జాగ్రత్తగా ఆలోచించి పని చేయవలసిన అవసరం ఎంతైనా ఉండినది. ఉదాహరణకు, సొలొమోను “ఆలోచించి సంగతులు పరిశీలించి అనేక సామెతలను అనుక్రమపరచెను. [ఆయన] యింపైన మాటలు చెప్పుటకు పూనుకొనెను, సత్యమునుగూర్చిన మాటలు యథార్థభావముతో వ్రాయుటకు పూనుకొనెను.”—ప్రసంగి 12:9, 10.

కొందరు బైబిలు రచయితలు తమ సమాచారానికి తగిన రుజువులను అందించేందుకు ఎంతో ఎక్కువ పరిశోధన చేయవలసి వచ్చింది. ఉదాహరణకు, లూకా తన సువార్త వృత్తాంతాన్ని గురించి ఇలా వ్రాశాడు: “మొదటనుండి తరచి పరిష్కారముగా తెలిసికొనియున్న . . . వాటినిగూర్చి వరుసగా [రచించాను].” నిజమే, విశ్వాసయోగ్యమైన చారిత్రాత్మక ప్రతులను కనుగొనేందుకు మరియు బ్రదికివున్న శిష్యులు మరియు బహుశ యేసు తల్లియైన మరియ వంటి నమ్మదగిన ప్రత్యక్ష సాక్షులను వాకబు చేసేందుకు లూకాకు సహాయం చేస్తూ ఆయన ప్రయత్నాలను దేవుని పరిశుద్ధాత్మ ఆశీర్వదించింది. ఆ సమాచారాన్ని కచ్చితంగా రికార్డు చేసేందుకు అప్పుడు దేవుని పరిశుద్ధాత్మ లూకాకు సహాయం చేసింది.—లూకా 1:1-4.

లూకా సువార్తకు భిన్నంగా, యోహాను సువార్త ప్రత్యక్ష సాక్షి వృత్తాంతం, యేసు మరణించిన దాదాపు 65 సంవత్సరాల తర్వాత ఆయన దాన్ని వ్రాశాడు. సమయం గడిచే కొలది యోహాను జ్ఞాపకశక్తి బలహీనం కాకుండా ఉండేందుకు యెహోవా ఆత్మ దాన్ని పదును పెట్టిందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. యేసు తన అనుచరులకు వాగ్దానం చేసిన దానితో ఇది పొందికగా ఉంటుంది: “ఆదరణకర్త, అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయును.”—యోహాను 14:26.

కొన్ని సందర్భాలలో బైబిలు రచయితలు, మునుపటి చారిత్రక రచయితలు ప్రత్యక్షంగా చూసి వ్రాసిన విషయాల డాక్యుమెంట్ల నుండి కూడా కొన్ని సంగతులను ఎత్తి వ్రాశారు, అయితే ఆ చారిత్రక రచయితల్లో అందరూ ప్రేరేపించబడిన వారు కాదు. యిర్మీయా మొదటి మరియు రెండవ రాజుల గ్రంథాలను చాలా వరకూ ఈ విధంగానే సంగ్రహపరిచాడు. (2 రాజులు 1:18) మొదటి మరియు రెండవ దినవృత్తాంతముల గ్రంథాల కొరకు సమాచారాన్ని సేకరించేందుకు ఎజ్రా కనీసం 14 ప్రేరేపితం కాని మూలాలను సూచించాడు, అందులో “దావీదు రాజు వృత్తాంత గ్రంథము” మరియు “యూదా ఇశ్రాయేలు రాజుల గ్రంథ”ము కూడా ఇమిడివున్నాయి. (1 దినవృత్తాంతములు 27:24; 2 దినవృత్తాంతములు 16:11) మోషే “యెహోవా యుద్ధముల గ్రంథము” నుండి కూడా ఉల్లేఖించాడు, బహుశ అది దేవుని ప్రజలు చేసిన యుద్ధాల విశ్వసనీయమైన వృత్తాంతం అయి ఉంటుంది.—సంఖ్యాకాండము 21:14, 15.

అలాంటి సందర్భాల్లో, విశ్వసనీయమైన సమాచారాన్ని మాత్రమే ఎంపిక చేసుకునేందుకు బైబిలు రచయితలను ప్రేరేపిస్తూ పరిశుద్ధాత్మ క్రియాశీలంగా ఇమిడివుండేది, అలా ఎంపిక చేసుకోబడిన ఆ సమాచారం తర్వాత ప్రేరేపిత బైబిలు వృత్తాంతంలో భాగమయ్యింది.

ఆచరణాత్మక సలహాలు—ఎవరి నుండి?

నిశితమైన వ్యక్తిగత గమనింపులపై ఆధారపడిన ఆచరణాత్మక సలహాల సంపదను బైబిలు కలిగివుంది. ఉదాహరణకు, సొలొమోను ఇలా వ్రాశాడు: “అన్నపానములు పుచ్చుకొనుటకంటెను, తన కష్టార్జితముచేత సుఖపడుటకంటెను నరునికి మేలుకరమైనదేదియు లేదు. ఇదియును దేవునివలన కలుగునని నేను తెలిసికొంటిని.” (ప్రసంగి 2:24) వివాహాన్ని గురించి తానిచ్చిన సలహా తన “అభిప్రాయము” ప్రకారము ఉందని పౌలు పేర్కొన్నాడు, అయితే ఆయనిలా జతచేశాడు: “దేవుని ఆత్మ నాకును కలిగియున్నదని తలంచుకొనుచున్నాను.” (1 కొరింథీయులు 7:25, 39, 40) “తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున” పౌలు ఆ సంగతులను వ్రాశాడని అపొస్తలుడైన పేతురు అన్నాడు, కాబట్టి పౌలు వాస్తవంగా దేవుని ఆత్మను కలిగివున్నాడు. (ఇటాలిక్కులు మావి.) (2 పేతురు 3:15, 16) అలా, దేవుని ఆత్మ ద్వారా నడిపింపబడిన వాడై పౌలు తన అభిప్రాయాన్ని తెలియజేశాడు.

బైబిలు రచయితలు అలాంటి వ్యక్తిగత ఉద్దేశాలను వ్యక్తం చేసినప్పుడు, వారు ఇదివరకే తమకు అందుబాటులో ఉన్న లేఖనాల అధ్యయనం మరియు అన్వయింపును పరిగణలోకి తీసుకుని వారలా చేశారు. వారి వ్రాతలు దేవుని ఆలోచనావిధానంతో పొందిక కలిగి ఉన్నాయనే నిశ్చయతను మనం కలిగివుండవచ్చు. వారు వ్రాసివుంచిన సంగతులు దేవుని వాక్యంలో భాగమయ్యాయి.

తప్పుడు ఆలోచనావిధానాన్ని కలిగివున్న కొందరి వ్యాఖ్యానాలు కూడా బైబిలులో ఉన్నాయి. (యోబు 15:15ను 42:7తో పోల్చండి.) అయితే అవి మొత్తం విషయాన్ని పూర్తిగా తెలియజేయకపోయినప్పటికీ, దేవుని సేవకులు కలతతో కూడిన భావాలను వ్యక్తం చేసిన కొన్ని వ్యక్తీకరణలు కూడా అందులో ఇమిడి ఉన్నాయి.c అలాంటి వ్యక్తిగత వ్యాఖ్యానాలను చేసేటప్పుడు, విషయాలను కచ్చితంగా వ్రాసేందుకు అలా తప్పుడు తర్కాలను గుర్తించి, బయల్పరిచేందుకు వీలయ్యే విధంగా ఆ యా రచయితలు దేవుని ఆత్మ ద్వారా నడిపించబడ్డారు. అంతేకాకుండా, రచయిత యొక్క ఆలోచనావిధానం యుక్తమైనదా కాదా అనే విషయాన్ని, ప్రతి దృష్టాంతంలోనూ ఆ యా పూర్వాపర సందర్భం సహేతుకమైన ఏ పాఠకునికైనా స్పష్టం చేస్తాయి.

క్లుప్తంగా చెప్పాలంటే, బైబిలంతా కూడా దేవుని సందేశమని మనం నమ్మకం కలిగి ఉండవచ్చు. వాస్తవానికి, అందులో ఉన్నదంతా తన సంకల్పానికి తగిన విధంగా ఉండేలా యెహోవా నిశ్చయపర్చుకున్నాడు మరియు తనను సేవించాలని కోరుకునే వారికి ఆవశ్యకమైన సూచనలను అందించాడు.—రోమీయులు 15:4.

మానవ రచయితలు—ఎందుకు?

బైబిలును వ్రాసేందుకు యెహోవా మానవులను ఉపయోగించడం ఆయన గొప్ప జ్ఞానాన్ని చూపిస్తుంది. దీన్ని పరిశీలించండి: దేవుడు ఆ పనిని ఒకవేళ దేవదూతలకు అప్పగించి ఉంటే బైబిలు అంతే రమణీయంగా ఉండేదా? దేవుని లక్షణాలను మరియు ఆయన వ్యవహారాలను గురించి ఒక దేవదూత దృక్కోణం నుండి చదవడం ఎంతో ఉత్తేజకరంగా ఉంటుందనే విషయం వాస్తవమే. అయితే మానవ హస్తం అసలు లేకుంటే, బైబిలు వర్తమానాన్ని అవగాహన చేసుకోవడం మనకు కష్టం అయివుండేది.

ఉదాహరణకు: రాజైన దావీదు వ్యభిచారమూ హత్యా చేశాడని అయితే ఆ తర్వాత పశ్చాత్తాపపడ్డాడని బైబిలు క్లుప్తంగా చెప్పవచ్చు. అయినప్పటికీ, తన క్రియల విషయమై ఆయన హృదయవిదారకమైన కలతను వ్యక్తం చేయడాన్ని మరియు యెహోవాను క్షమాపణ కొరకు వేడుకోవడాన్ని దావీదు యొక్క స్వంత మాటల్లో వినగల్గడం ఎంత శ్రేష్ఠంగా ఉందో కదా! “నా పాపమెల్లప్పుడు నాయెదుట నున్న”దని, “దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు” అని ఆయన వ్రాశాడు. (కీర్తన 51:3, 17) కాబట్టి, మానవ హస్తం దానికి చేకూర్చగల ఆప్యాయతా, వైవిధ్యం మరియు రమణీయత అందులో ఉన్నాయి.

అవును, యెహోవా తన వాక్యాన్ని మనకు ఇచ్చేందుకు చక్కని మార్గాన్నే ఎన్నుకున్నాడు. బలహీనతలూ లోపాలూ ఉన్న మానవులు ఉపయోగించుకోబడినప్పటికీ, వారి వ్రాతల్లో ఎలాంటి తప్పులూ ఉండకుండేలా వారు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడ్డారు. అలా, బైబిలుకు అత్యంత గొప్ప విలువవుంది. దాని సలహాలు శ్రేష్ఠమైనవి, భవిష్యత్తులో భూమిపైకి రాబోయే పరదైసును గురించిన దాని ప్రవచనాలు ఆధారపడదగినవి.—కీర్తన 119:105; 2 పేతురు 3:13.

ప్రతిరోజు దేవుని వాక్యంలోని కొంతభాగం చదవడాన్ని ఒక అలవాటుగా ఎందుకు చేసుకోకూడదు? పేతురు ఇలా వ్రాశాడు: “నిర్మలమైన వాక్యమను పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము, ఆ పాలను అపేక్షించుడి.” (1 పేతురు 2:3) అది దేవుని ద్వారా ప్రేరేపించబడినది గనుక, ప్రతిలేఖనము “దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడియుండునట్లు . . . ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై యున్నది” అని మీరు గుర్తిస్తారు.—2 తిమోతి 3:16, 17.

[అధస్సూచీలు]

a కనీసం ఒక సందర్భంలో, అంటే పది ఆజ్ఞలను ఇచ్చే సందర్భంలో అందులోని సమాచారం “దేవుని వ్రేలితో” సూటిగా వ్రాయబడింది. ఆ తర్వాత మోషే ఆ వాక్యాలను గ్రంథపు చుట్టలలోకి లేక ఇతర వాటిపైకి ఎత్తి వ్రాశాడు.—నిర్గమకాండము 31:18; ద్వితీయోపదేశకాండము 10:1-5.

b ఇక్కడ “ప్రేరేపింపబడిన” అని అనువదించబడిన గ్రీకు పదమైన ఫేరో అపొస్తలుల కార్యములు 27:15, 17 నందు మరొక రూపంలో, గాలి చేత కొట్టుకుపోయిన ఒక ఓడను వర్ణించేందుకు ఉపయోగించబడింది. కాబట్టి పరిశుద్ధాత్మ బైబిలు రచయితలకు ‘మార్గనిర్దేశాన్నిచ్చింది.’ అబద్ధపు సమాచారాన్ని నిరాకరించి కేవలం వాస్తవాలైన వాటినే అంగీకరించేందుకు అది వారిని నడిపించింది.

c ఉదాహరణల కొరకు, 1 రాజులు 19:4ను 14, 18 వచనాలతో పోల్చండి; యోబు 10:1-3; కీర్తన 73:12, 13, 21; యోనా 4:1-3, 9; హబక్కూకు 1:1-4, 13.

[7వ పేజీలోని బాక్సు/చిత్రం]

మోషేకు సమాచారం ఎక్కడనుండి లభించింది?

మోషే బైబిలునందలి ఆదికాండము గ్రంథాన్ని వ్రాశాడు, అయితే ఆయన వ్రాసిన విషయాలన్నీ కూడా ఆయన జన్మించక ముందు ఎంతోకాలం క్రితం జరిగినవే. అయితే ఆయనకు అలాంటి సమాచారం ఎక్కడనుండి లభించింది? అది ఆయనకు దేవుని ద్వారా సూటిగా బయల్పర్చబడి ఉండవచ్చు, లేక కొన్ని సంఘటనలను గురించిన సమాచారం ఒక తరం నుండి తర్వాతి తరానికి మౌఖికంగా అందించబడి ఉండవచ్చు. మునుపటి కాలాల్లో మానవులు ఎక్కువ జీవితాయుస్సును కలిగి ఉండేవారు గనుక, ఆదికాండములో మోషే వ్రాసిన దాంట్లో అధికభాగం ఆదాము నుండి వచ్చినదై ఉంటుంది, వారిద్దరికి మధ్యన కేవలం ఐదుగురు వ్యక్తులు మాత్రమే అంటే మెతూషెలా, షేము, ఇస్సాకు, లేవి మరియు అమ్రాములు మాత్రమే ఉన్నారు.

అదనంగా, మోషే లిఖిత వృత్తాంతాలను పరిశోధించి ఉంటాడు. ఈ విషయంలో, మోషే తాను ఎవరి గురించి చర్చించబోతున్నాడో ఆ వ్యక్తి పేరును ప్రస్తావించిన తర్వాత “వంశావళి యిదే” అనే పదాలను ఉపయోగించడం గమనించదగిన విషయం. (ఇటాలిక్కులు మావి.) (ఆదికాండము 6:9; 10:1; 11:10, 27; 25:12, 19; 36:1, 9; 37:2) ఇక్కడ “వంశావళి” అని అనువదించబడిన హెబ్రీ పదమైన టొహ్లేధోహ్‌త్‌ అప్పటికే ఉనికిలో ఉన్న లిఖిత చారిత్రాత్మక ప్రతిని సూచిస్తుందని, ఆ ప్రతినే మోషే తన వ్రాతలకు మూలంగా ఉపయోగించి ఉండవచ్చు అని కొందరు పండితులు చెబుతున్నారు. అయితే ఈ విషయాన్ని కచ్చితంగా చెప్పలేము.

ఆదికాండము పుస్తకంలో ఉన్న సమాచారం, పైన ప్రస్తావించబడిన మూడు పద్ధతుల్లోనూ సంపాదించబడి ఉండవచ్చు—అంటే కొంత సూటిగా బయల్పర్చబడటం ద్వారా, కొంత మౌఖికంగా అందించబడినవి మరికొంత వ్రాతపూర్వక రికార్డుల ద్వారా వచ్చినదై ఉండవచ్చు. ముఖ్యమైన విషయం ఏమంటే, యెహోవా ఆత్మ మోషేను పురికొల్పింది. కాబట్టి ఆయన వ్రాసినది దేవుని వాక్యంగా సరైన రీతిలోనే దృష్టించబడగలదు.

[4వ పేజీలోని చిత్రం]

బైబిలును వ్రాసేందుకు దేవుడు మానవులను విభిన్న రీతుల్లో ప్రేరేపించాడు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి