అధ్యాయం 16
“న్యాయంగా” ఉంటూ దేవునితో నడవండి
1-3. (ఎ) మనం యెహోవాకు ఎందుకు రుణపడి ఉన్నాం? (బి) మనల్ని ప్రేమతో కాపాడిన యెహోవా, మన నుండి తిరిగి ఏం అడుగుతున్నాడు?
మీరు ఒక మునిగిపోతున్న ఓడలో ఉన్నట్టు ఊహించుకోండి. మీరు ఇక ప్రాణాల మీద ఆశలు వదిలేసుకున్నారు, సరిగ్గా అప్పుడే ఒకాయన వచ్చి మిమ్మల్ని నీళ్లలో నుండి బయటికి లాగాడు. ఆయన మిమ్మల్ని కాపాడిన తర్వాత, “ఏం కంగారు పడకండి మీరు బాగానే ఉన్నారు” అని చెప్పినప్పుడు, మీరు హాయిగా ఊపిరి పీల్చుకుంటారు కదా! ఆయనకు జీవితాంతం రుణపడి ఉండాలని మీరు కోరుకుంటారు. నిజం చెప్పాలంటే, ఆయన చేసిన మేలును మీ జీవితంలో మర్చిపోరు.
2 ఒకవిధంగా యెహోవా మన కోసం అలాంటిదే చేశాడు. ఖచ్చితంగా, మనం ఆయనకు రుణపడి ఉన్నాం. ఎందుకంటే, మనల్ని పాపమరణాల ఊబి నుండి బయటికి లాగడానికి ఆయన విమోచన క్రయధనాన్ని ఇచ్చాడు. ఆ అమూల్యమైన బలి మీద విశ్వాసం ఉంచితే పాపక్షమాపణ, అలాగే శాశ్వత జీవితం పొందవచ్చని తెలుసుకుని హాయిగా ఊపిరి పీల్చుకోవచ్చు. (1 యోహాను 1:7; 4:9) మనం 14వ అధ్యాయంలో చూసినట్లుగా, విమోచన క్రయధనం ద్వారా యెహోవా గొప్ప స్థాయిలో ప్రేమను, న్యాయాన్ని చూపించాడు. మరి మనం ఆయనకు తిరిగి ఏం ఇవ్వగలం?
3 మనల్ని ప్రేమతో కాపాడిన యెహోవా, మన నుండి తిరిగి ఏం అడుగుతున్నాడో తెలుసుకోవడం మంచిది. యెహోవా మీకా ప్రవక్త ద్వారా ఇలా చెప్తున్నాడు: “ఓ మనిషీ, ఏది మంచిదో ఆయన నీకు తెలియజేశాడు. బదులుగా యెహోవా నిన్నేమి అడుగుతున్నాడు? న్యాయంగా నడుచుకోవడం, విశ్వసనీయతను ప్రేమించడం, అణకువ కలిగి నీ దేవునితో నడవడం, ఇంతే కదా!” (మీకా 6:8) చూశారా? యెహోవా తిరిగి అడుగుతున్న వాటిలో ఒకటి, “న్యాయంగా నడుచుకోవడం.” దాన్ని మనం ఎలా చేయవచ్చు?
“నిజమైన నీతికి” తగ్గట్టు ఉండడం
4. మనం తన నీతి ప్రమాణాలకు తగ్గట్టు జీవించాలన్నది యెహోవా కోరికని మనకెలా తెలుసు?
4 ఏది తప్పు, ఏది ఒప్పు అనే విషయంలో మనం తన ప్రమాణాలకు తగ్గట్టు జీవించాలని యెహోవా కోరుతున్నాడు. ఆయన ప్రమాణాలు నీతిగలవి, న్యాయమైనవి కాబట్టి వాటిని పాటిస్తే మనం నీతిన్యాయాల్ని పాటిస్తున్నట్టే. యెషయా 1:17 ఇలా చెప్తుంది: “మంచి చేయడం నేర్చుకోండి, న్యాయం జరిగించండి.” అంతేకాదు, “నీతిని వెదకండి” అని బైబిలు సలహా ఇస్తుంది. (జెఫన్యా 2:3) “నిజమైన నీతికి, విశ్వసనీయతకు అనుగుణంగా దేవుని ఇష్టప్రకారం సృష్టించబడిన కొత్త వ్యక్తిత్వాన్ని” ధరించుకోమని కూడా బైబిలు ప్రోత్సహిస్తుంది. (ఎఫెసీయులు 4:24) నిజమైన నీతికి లేదా న్యాయానికి తగ్గట్టు జీవించాలంటే హింసకు, అపవిత్రతకు, లైంగిక పాపానికి దూరంగా ఉండాలి. ఎందుకంటే, ఇలాంటివన్నీ దేవుని పవిత్రమైన ప్రమాణాలకు పూర్తి వ్యతిరేకమైనవి.—కీర్తన 11:5; ఎఫెసీయులు 5:3-5.
5, 6. (ఎ) యెహోవా ప్రమాణాలు పాటించడం తలకు మించిన భారం కాదని ఎందుకు చెప్పవచ్చు? (బి) నీతిగా ఉండడానికి మనం ఎప్పుడూ కృషి చేస్తూనే ఉండాలని బైబిలు ఎలా చూపిస్తుంది?
5 యెహోవా నీతి ప్రమాణాల్ని పాటించడం మన తలకు మించిన భారమా? కాదు. యెహోవా మీద గుండెల నిండా ప్రేమ ఉంటే, ఆయన ప్రమాణాల్ని పాటించడానికి చిర్రుబుర్రులాడం. మనం దేవుణ్ణి, ఆయన లక్షణాలన్నిటినీ ప్రేమిస్తాం కాబట్టి ఆయనకు నచ్చేలా జీవించాలనుకుంటాం. (1 యోహాను 5:3) యెహోవా “నీతికార్యాల్ని ప్రేమిస్తాడు” అని గుర్తుతెచ్చుకోండి. (కీర్తన 11:7) మనం నిజంగా యెహోవాలా న్యాయాన్ని లేదా నీతిని చూపించాలంటే ఆయన ప్రేమించేవాటిని ప్రేమించడం, ఆయన అసహ్యించుకునే వాటిని అసహ్యించుకోవడం నేర్చుకోవాలి.—కీర్తన 97:10.
6 మనం అపరిపూర్ణులం కాబట్టి నీతిగా ఉండడం అంత తేలికేమీ కాదు. మనం పాత వ్యక్తిత్వాన్ని దాని అలవాట్లతో సహా తీసిపారేసి, కొత్త వ్యక్తిత్వాన్ని వేసుకోవాలి. ఆ కొత్త వ్యక్తిత్వం, సరైన జ్ఞానంతో “అంతకంతకూ కొత్తదౌతూ ఉంటుంది” అని బైబిలు చెప్తుంది. (కొలొస్సయులు 3:9, 10) “అంతకంతకూ కొత్తదౌతూ ఉంటుంది” అనే మాటల్ని బట్టి, కొత్త వ్యక్తిత్వాన్ని వేసుకోవడం అనేది ఎప్పుడూ జరుగుతూనే ఉంటుందని, దానికి చాలా కృషి అవసరమని అర్థమౌతుంది. మనం సరైనది చేయడానికి ఎంత ప్రయాసపడినా, కొన్నిసార్లు మన పాపపు స్వభావం వల్ల మన ఆలోచనల్లో, మాటల్లో, లేదా పనుల్లో తడబడుతూ ఉంటాం.—రోమీయులు 7:14-20; యాకోబు 3:2.
7. నీతిగా ఉండడానికి మనం చేసే ప్రయత్నాల్లో కొన్నిసార్లు ఓడిపోయినా ఎలా ఆలోచించాలి?
7 నీతిగా ఉండడానికి మనం చేసే ప్రయత్నాల్లో కొన్నిసార్లు ఓడిపోతే, అప్పుడెలా? నిజమే, మనం చేసిన తప్పును సమర్థించుకోవడానికి సాకులు చెప్పం. అలాగని, తప్పు చేశాం కాబట్టి యెహోవా సేవచేసే అర్హత ఇక మనకు లేదని డీలాపడిపోం. నిజంగా పశ్చాత్తాపపడే వాళ్లను క్షమించడానికి కరుణగల మన దేవుడు ఒక ఏర్పాటు చేశాడు. అపొస్తలుడైన యోహాను ఇలా చెప్పాడు: “మీరు పాపం చేయకుండా ఉండాలని ఈ విషయాలు మీకు రాస్తున్నాను.” అయితే, మనల్ని అర్థం చేసుకుని ఇంకా ఇలా అన్నాడు: “ఒకవేళ ఎవరైనా [వారసత్వంగా వచ్చిన అపరిపూర్ణత వల్ల] పాపం చేసినా, తండ్రి దగ్గర మనకు ఒక సహాయకుడు ఉన్నాడు, ఆయనే . . . యేసుక్రీస్తు.” (1 యోహాను 2:1) అవును, మనం పాపం చేసినా, తిరిగి ఆయన సేవను సంతోషంగా చేయగలిగేలా యెహోవా యేసు ద్వారా విమోచన క్రయధనం ఏర్పాటు చేశాడు. ఇదంతా చూసిన తర్వాత, యెహోవాను సంతోషపెట్టడానికి చేయగలిగినదంతా చేయాలని మీకు అనిపించట్లేదా?
మంచివార్తకు, దేవుని న్యాయానికి ఉన్న సంబంధం
8, 9. మంచివార్త ప్రకటించడానికి, యెహోవా న్యాయానికి సంబంధం ఏంటి?
8 దేవుని రాజ్యం గురించిన మంచివార్తను సాధ్యమైనంత ఎక్కువగా ప్రకటించడం ద్వారా మనం న్యాయాన్ని, మరిముఖ్యంగా దేవుని న్యాయాన్ని చూపించవచ్చు. ఇంతకీ యెహోవా న్యాయానికి, మంచివార్త ప్రకటించడానికి సంబంధం ఏంటి?
9 యెహోవా చెప్పాపెట్టకుండా ఈ చెడ్డ వ్యవస్థ మీదికి అంతం తీసుకురాడు. ఆయన ఖచ్చితంగా ముందస్తు హెచ్చరిక ఇస్తాడు. అంతం వచ్చే ముందు ఏం జరుగుతుందో చెప్తూ, యేసు ఒక ప్రవచనంలో ఇలా అన్నాడు: “అన్నిదేశాల్లో ముందుగా మంచివార్త ప్రకటించబడాలి.” (మార్కు 13:10; మత్తయి 24:3) ఇక్కడ “ముందుగా” అనే పదాన్ని బట్టి, ప్రపంచవ్యాప్తంగా ప్రకటనా పని జరగడంతో పాటు, దాని తర్వాత వేరే సంఘటనలు కూడా జరుగుతాయని అర్థమౌతుంది. ఆ సంఘటనల్లో ఒకటి, ముందే చెప్పిన మహాశ్రమ. అప్పుడు చెడ్డవాళ్లు నాశనమై, నీతి విలసిల్లే కొత్తలోకానికి దారి తెరుచుకుంటుంది. (మత్తయి 24:14, 21, 22) కాబట్టి, యెహోవా చెడ్డవాళ్లకు అన్యాయం చేశాడు అని ఎవ్వరూ ఆయన మీద నిందలు వేయలేరు. ముందే హెచ్చరిక ఇవ్వడం ద్వారా, వాళ్లు తమ ప్రవర్తనను మార్చుకోవడానికి, నాశనాన్ని తప్పించుకోవడానికి యెహోవా బోలెడన్ని అవకాశాలు ఇస్తున్నాడు.—యోనా 3:1-10.
10, 11. మంచివార్త ప్రకటిస్తే మనం దేవునిలా న్యాయం చూపించినట్టు ఎలా అవుతుంది?
10 మనం మంచివార్త ప్రకటించడం ద్వారా దేవునిలా న్యాయాన్ని ఎలా చూపిస్తాం? మొదటిగా, వాళ్లు రక్షణ పొందేలా సహాయం చేస్తున్నామంటేనే మనం సరైనది, న్యాయమైనది చేస్తున్నట్టు. మునిగిపోతున్న ఓడ గురించి మళ్లీ ఒకసారి గుర్తుతెచ్చుకోండి. ఎవరో మిమ్మల్ని నీళ్లల్లో నుండి పైకి లాగి, పడవలో సురక్షితంగా కూర్చోబెట్టారు. ఇప్పుడు, ఇంకా నీళ్లల్లో కొట్టుమిట్టాడుతున్న వాళ్లకు సహాయం చేయాలని మీరు కోరుకోరా? అదేవిధంగా, ఈ చెడ్డ లోకపు నీళ్లల్లో ఇంకా కొట్టుమిట్టాడుతున్న వాళ్ల విషయంలో మనకు ఒక బాధ్యత ఉంది. నిజమే, చాలామంది మనం చెప్పేది వినరు. కానీ యెహోవా ఓపిక పట్టినంత కాలం, ఆ ప్రజలు “పశ్చాత్తాపపడి” రక్షణ పొందేలా వాళ్లకు అవకాశం ఇవ్వాల్సిన బాధ్యత మనకుంది.—2 పేతురు 3:9.
11 రెండోదిగా, పక్షపాతం లేకుండా మనం కలిసే ప్రతీ ఒక్కరికి మంచివార్త ప్రకటించడం ద్వారా కూడా యెహోవాలా న్యాయాన్ని చూపిస్తాం. “దేవునికి పక్షపాతం లేదు . . . ప్రతీ జనంలో, తనకు భయపడి సరైనది చేసేవాళ్లను ఆయన అంగీకరిస్తాడు” అని గుర్తుతెచ్చుకోండి. (అపొస్తలుల కార్యాలు 10:34, 35) మనం ఆయనలా న్యాయాన్ని చూపించాలంటే, ప్రజల గురించి ముందే ఒక అభిప్రాయానికి వచ్చేయకూడదు. బదులుగా వాళ్ల జాతి, హోదా, లేదా డబ్బు చూడకుండా మంచివార్త ప్రకటించాలి. అలా, మంచివార్త విని దానికి లోబడే అవకాశాన్ని మనం అందరికీ ఇస్తాం.—రోమీయులు 10:11-13.
మనం వేరేవాళ్లతో ఎలా ఉండాలి?
12, 13. (ఎ) మనం ఎందుకని తొందరపడి వేరేవాళ్లకు తీర్పు తీర్చకూడదు? (బి) “తీర్పు తీర్చడం ఆపేయండి,” “విమర్శించడం మానేయండి” అని యేసు ఇచ్చిన సలహాకు అర్థమేంటి? (అధస్సూచి కూడా చూడండి.)
12 యెహోవా మనతో ఎలా ఉంటాడో మనం వేరేవాళ్లతో అలా ఉండడం ద్వారా కూడా న్యాయాన్ని చూపించవచ్చు. వేరేవాళ్ల లోపాల్ని వేలెత్తి చూపిస్తూ, వాళ్ల ఉద్దేశాల్ని ప్రశ్నిస్తూ తీర్పు తీర్చడం చాలా తేలిక. కానీ యెహోవా ఏమాత్రం కరుణ లేకుండా మన ఉద్దేశాల్ని తప్పుబడుతూ, మన లోపాల్ని భూతద్దంలో పెట్టి చూడాలని మనలో ఎవరిమైనా కోరుకుంటామా? లేదు, యెహోవా ఎప్పటికీ అలా చేయడు. కీర్తనకర్త ఇలా రాశాడు: “యెహోవా, నువ్వు తప్పుల్ని గమనిస్తూ ఉంటే, యెహోవా, ఎవరు నిలవగలరు?” (కీర్తన 130:3) న్యాయం, కరుణ గల దేవుడు మన లోపాల మీద మనసుపెట్టడని తెలుసుకోవడం సంతోషంగా అనిపించట్లేదా? (కీర్తన 103:8-10) మరి, మనం వేరేవాళ్లతో ఎలా ఉండాలి?
13 దేవుని న్యాయం, కరుణ మీద కృతజ్ఞత ఉంటే మనకు సంబంధంలేని విషయాల్లో లేదా అంతగా ప్రాముఖ్యంకాని విషయాల్లో దూరిపోయి, వేరేవాళ్లకు తీర్పు తీర్చం. కొండమీది ప్రసంగంలో యేసు ఇలా హెచ్చరించాడు: “తీర్పు తీర్చడం ఆపేయండి, అప్పుడు మీకు తీర్పు తీర్చబడదు.” (మత్తయి 7:1) లూకా సువార్తలో, ఆ మాటతో పాటు యేసు చెప్పిన ఈ మాట కూడా గమనిస్తాం: “విమర్శించడం మానేయండి, అప్పుడు మీరు అస్సలు విమర్శించబడరు.”a (లూకా 6:37) అపరిపూర్ణ మనుషులు గబుక్కున వేరేవాళ్లకు తీర్పు తీర్చేస్తూ ఉంటారని యేసుకు తెలుసు. ఆయన మాటల్ని వింటున్నవాళ్లలో ఎవరికైనా ఈ అలవాటు ఉంటే దాన్ని వెంటనే మానేయాలి.
మనం పక్షపాతం లేకుండా అందరికీ మంచివార్త ప్రకటించినప్పుడు, యెహోవాలా న్యాయాన్ని చూపిస్తాం
14. మనం ఎందుకు ‘తీర్పు తీర్చడం ఆపేయాలి’?
14 మనం ఎందుకు ‘తీర్పు తీర్చడం ఆపేయాలి’? ఒక కారణం ఏంటంటే, మనకు ఆ అధికారం లేదు. శిష్యుడైన యాకోబు ఇలా రాశాడు: “నియమాలు ఇచ్చే వ్యక్తి, తీర్పు తీర్చే వ్యక్తి ఒక్కడే.” ఆయనే యెహోవా. కాబట్టి యాకోబు సూటిగా ఇలా అడిగాడు: “సాటిమనిషికి తీర్పు తీర్చడానికి నువ్వెవరు?” (యాకోబు 4:12; రోమీయులు 14:1-4) ఇంకో కారణం ఏంటంటే, మనం పాపులం కాబట్టి అన్నిసార్లూ న్యాయంగా తీర్పు తీర్చలేం. వివక్ష, అహం దెబ్బతినడం, అసూయ, మనమే నీతిమంతులం అనుకోవడం లాంటివాటి వల్ల మనం సాటిమనుషుల్ని చూసే చూపు మారిపోవచ్చు. మనకు ఇంకొన్ని పరిమితులు ఉన్నాయి, వాటి గురించి ఆలోచిస్తే మనం వేరేవాళ్లలో తప్పులు వెదకకుండా ఉంటాం. ఉదాహరణకు, మనం హృదయాల్ని చదవలేం, అలాగే వేరేవాళ్ల పరిస్థితులేంటో మనకు పూర్తిగా తెలీదు. అలాంటప్పుడు బ్రదర్స్‌సిస్టర్స్ ఉద్దేశాల్ని తప్పు పట్టడానికి, వాళ్లు దేవుని సేవలో పడుతున్న ప్రయాసను వేలెత్తి చూపించడానికి మనం ఎవరం? కాబట్టి మన బ్రదర్స్‌సిస్టర్స్ లోపాల మీద కాకుండా, యెహోవాలా వాళ్లలో ఉన్న మంచి మీద మనసుపెట్టడం ఎంత నయమో కదా!
15. దేవుని ఆరాధకుల మధ్య ఎలాంటి మాటలకు, పనులకు చోటులేదు? ఎందుకు?
15 మన కుటుంబం సంగతేంటి? బాధాకరంగా, శాంతికి నిలయంగా ఉండాల్సిన ఇల్లే ఈ రోజుల్లో కఠినమైన తీర్పులు తీర్చే చోటులా మారిపోయింది. భర్తలు, భార్యలు, లేదా తల్లిదండ్రులు ఇంట్లోవాళ్లకు తీర్పు తీర్చేస్తూ వాళ్ల మీద నోరు పారేసుకుంటున్నారు, చేయి చేసుకుంటున్నారు. కానీ మాటల తూటాలు, శృతిమించిన వెటకారం, కొట్టడం లాంటివాటికి దేవుని ఆరాధకుల మధ్య చోటులేదు. (ఎఫెసీయులు 4:29, 31; 5:33; 6:4) “తీర్పు తీర్చడం ఆపేయండి,” “విమర్శించడం మానేయండి” అని యేసు ఇచ్చిన సలహా మనం ఇంట్లో ఉన్నప్పుడు కూడా వర్తిస్తుంది. న్యాయంగా ఉండడమంటే, యెహోవా మనతో ప్రవర్తిస్తున్నట్టే మనం వేరేవాళ్లతో ప్రవర్తించడం అని గుర్తుతెచ్చుకోండి. మన దేవుడు మనతో ఎప్పుడూ క్రూరంగా, కఠినంగా ఉండడు. ఆయన తనను ప్రేమించేవాళ్ల మీద “వాత్సల్యం” కురిపిస్తాడు. (యాకోబు 5:11) మనం చూసి నేర్చుకోవడానికి ఎంత గొప్ప ఉదాహరణో కదా!
“న్యాయం కోసం” పనిచేసే పెద్దలు
16, 17. (ఎ) పెద్దలు ఎలా ఉండాలని యెహోవా కోరుకుంటున్నాడు? (బి) తప్పు చేసిన వ్యక్తి నిజమైన పశ్చాత్తాపం చూపించకపోతే ఏం చేయాలి? ఎందుకు?
16 న్యాయంగా ఉండాల్సిన బాధ్యత మనందరికీ ఉంది, మరిముఖ్యంగా సంఘ పెద్దలకు ఉంది. “అధిపతులు” లేదా పెద్దల గురించి యెషయా ఒక ప్రవచనంలో ఏం చెప్పాడో చూడండి: “ఇదిగో! రాజు నీతి కోసం రాజ్యపాలన చేస్తాడు, అధిపతులు న్యాయం కోసం పరిపాలన చేస్తారు.” (యెషయా 32:1) అవును, సంఘ పెద్దలు న్యాయం కోసం పనిచేయాలని యెహోవా కోరుకుంటున్నాడు. దాన్ని వాళ్లు ఎలా చేయవచ్చు?
17 నీతిగా లేదా న్యాయంగా ఉండడం అంటే సంఘాన్ని పవిత్రంగా ఉంచడం అని ఈ అర్హులైన పురుషులకు తెలుసు. కొన్నిసార్లు ఘోరమైన తప్పుల విషయంలో సంఘ పెద్దలు తీర్పు తీర్చాల్సి వస్తుంది. అలాంటప్పుడు, వీలైనంత వరకు కరుణ చూపించాలన్నదే యెహోవా కోరికని వాళ్లు గుర్తుంచుకుంటారు. అందుకే, తప్పు చేసిన వ్యక్తి పశ్చాత్తాపపడేలా సహాయం చేయడానికి వాళ్లు ప్రయత్నిస్తారు. కానీ, వాళ్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా అతను నిజమైన పశ్చాత్తాపం చూపించకపోతే, అప్పుడేంటి? పరిపూర్ణ న్యాయంతో, దేవుని వాక్యం ఈ గట్టి చర్య తీసుకోమని చెప్తుంది: “ఆ దుష్టుణ్ణి మీ మధ్య నుండి తొలగించండి.” అంటే వాళ్లు అతన్ని సంఘం నుండి తొలగిస్తారు. (1 కొరింథీయులు 5:11-13; 2 యోహాను 9-11) అది వాళ్లకూ బాధే. కానీ సంఘాన్ని నైతికంగా, ఆధ్యాత్మికంగా పవిత్రంగా ఉంచాలి కాబట్టి వాళ్లు తప్పక అలా చేస్తారు. అయినా సరే, ఏదోకరోజు అతను తప్పు తెలుసుకుని సంఘానికి తిరిగొస్తాడని వాళ్లు కొండంత ఆశతో ఉంటారు.—లూకా 15:17, 18.
18. పెద్దలు బైబిలు ఆధారంగా సలహా ఇస్తున్నప్పుడు ఏం మనసులో ఉంచుకుంటారు?
18 న్యాయం కోసం పనిచేయడం అంటే, అందులో అవసరమైనప్పుడు బైబిలు ఆధారంగా సలహా ఇవ్వడం కూడా ఉంది. నిజమే, సంఘ పెద్దలు వేరేవాళ్లలో తప్పులు వెదకరు. అవకాశం దొరికితే చాలు సరిదిద్దాలని చూడరు. కానీ ఒక బ్రదర్ “తెలియక తప్పటడుగు” వేయవచ్చు. అప్పుడు పెద్దలు “సౌమ్యంగా అతన్ని సరైన దారిలోకి తీసుకురావడానికి” ప్రయత్నిస్తారు. ఎందుకంటే, యెహోవా ఎప్పుడూ న్యాయాన్ని క్రూరంగా, కఠినంగా చూపించడని వాళ్లకు తెలుసు. (గలతీయులు 6:1) కాబట్టి తప్పు చేసిన వ్యక్తిని పెద్దలు ఎప్పుడూ తిట్టరు, మాటల తూటాలతో గాయపర్చరు. బదులుగా ప్రేమతో సలహా ఇస్తే, దాన్ని తీసుకునే వ్యక్తి కూడా ప్రోత్సాహం పొందుతాడు. సూటిగా గద్దింపు ఇస్తున్నప్పుడు కూడా, అంటే ఒక తెలివితక్కువ పనివల్ల ఎలాంటి నష్టాలు వస్తాయో నిక్కచ్చిగా చెప్తున్నప్పుడు కూడా, సంఘ పెద్దలు ఒక విషయం గుర్తుపెట్టుకుంటారు. అదేంటంటే, తప్పు చేసిన వ్యక్తి కూడా యెహోవా మందలోని ఒక గొర్రే.b (లూకా 15:7) కాబట్టి సలహాను లేదా గద్దింపును నిజమైన ప్రేమతో ఇచ్చినప్పుడు, అలాగే ప్రేమగా, దయగా ఇచ్చినప్పుడు తప్పు చేసిన వ్యక్తి తన ప్రవర్తనను మార్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
19. పెద్దలు ఏ నిర్ణయాలు తీసుకుంటారు? దేని ఆధారంగా తీసుకుంటారు?
19 పెద్దలు తోటి బ్రదర్స్‌సిస్టర్స్‌కి సంబంధించిన విషయాల్లో తరచూ నిర్ణయాలు తీసుకుంటారు. ఉదాహరణకు, సంఘంలో ఫలానా బ్రదర్‌ని సంఘ పెద్దగా లేదా సంఘ పరిచారకుడిగా సిఫారసు చేయాలా వద్దా అనేది పెద్దలు ఎప్పటికప్పుడు కలిసి మాట్లాడుకుంటారు. పక్షపాతం చూపించకుండా ఉండడం ఎంత ప్రాముఖ్యమో వాళ్లకు తెలుసు. పెద్దలు అలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు, తమకు ఏమనిపిస్తుంది అని కాదుగానీ, ఆ బ్రదర్ బైబిలు చెప్తున్న అర్హతల్ని చేరుకున్నాడా లేదా అని చూస్తారు. అలా వాళ్లు “ముందే ఒక నిర్ణయానికి రాకుండా, పక్షపాతం చూపించకుండా” ఉంటారు.—1 తిమోతి 5:21.
20, 21. (ఎ) పెద్దలు ఎలా ఉండడానికి కృషిచేస్తారు? ఎందుకు? (బి) ‘కృంగినవాళ్లకు’ పెద్దలు ఎలా సహాయం చేయవచ్చు?
20 పెద్దలు వేరేవిధాలుగా కూడా యెహోవాలా న్యాయాన్ని చూపిస్తారు. పెద్దలు న్యాయం కోసం పనిచేస్తారు అని చెప్పిన తర్వాత, వాళ్ల గురించి యెషయా ఇలా అన్నాడు: “ప్రతీ ఒక్కరు గాలికి చాటైన చోటులా, తుఫాను నుండి దాక్కునే చోటులా, నీళ్లులేని దేశంలో నీళ్ల కాలువలా, ఎండిపోయిన దేశంలో పెద్ద బండ నీడలా ఉంటారు.” (యెషయా 32:1, 2) అంటే పెద్దలు తోటి బ్రదర్స్‌సిస్టర్స్‌కి ఓదార్పును, సేదదీర్పును ఇచ్చే ఊటలా ఉండడానికి కృషిచేస్తారు.
21 ఈ రోజుల్లో, సమస్యల సుడిగుండంలో చిక్కుకుపోయిన చాలామందికి ప్రోత్సాహం అవసరం. సంఘ పెద్దలారా, ‘కృంగినవాళ్లకు’ మీరు ఎలా సహాయం చేయవచ్చు? (1 థెస్సలొనీకయులు 5:14) వాళ్లు చెప్పేది వింటూ వాళ్ల బాధను అర్థం చేసుకోండి. (యాకోబు 1:19) ఏమో, మనసులో ఉన్న ఆందోళనంతా ఎవరో ఒకరికి చెప్పుకోవాలని వాళ్లు అనుకుంటున్నారేమో. (సామెతలు 12:25) యెహోవా అలాగే తోటి బ్రదర్స్‌సిస్టర్స్ వాళ్లను ఇష్టపడుతున్నారని, విలువైనవాళ్లుగా చూస్తున్నారని, వాళ్లను ప్రేమిస్తున్నారని భరోసా ఇవ్వండి. (1 పేతురు 1:22; 5:6, 7) ఇంకా, మీరు వాళ్లతో కలిసి ప్రార్థించవచ్చు, వాళ్ల కోసం ప్రార్థించవచ్చు. మీరు వాళ్లకోసం మనసారా ప్రార్థించడం విన్నప్పుడు, వాళ్లకు ప్రాణం లేచొస్తుంది. (యాకోబు 5:14, 15) కృంగినవాళ్లకు సహాయం చేయడానికి మీరు ప్రేమతో చేసే ప్రయత్నాల్ని, న్యాయంగల దేవుడు చూడకుండా పోడు.
పెద్దలు కృంగినవాళ్లను బలపర్చినప్పుడు యెహోవాలా న్యాయం చూపిస్తారు
22. మనం ఏయే విధాలుగా యెహోవాలా న్యాయం చూపించవచ్చు? అలా చేస్తే యెహోవాకు ఎలా అనిపిస్తుంది?
22 నిజంగా, మనం యెహోవాలా న్యాయం చూపిస్తే ఆయనకు ఇంకాఇంకా దగ్గరౌతాం! మనం ఆయన నీతి ప్రమాణాల్ని పాటించడం ద్వారా, ప్రాణాలు కాపాడే మంచివార్తను అందరికీ ప్రకటించడం ద్వారా, వేరేవాళ్ల లోపాల మీద కాకుండా మంచి మీద మనసుపెట్టడం ద్వారా యెహోవాలా న్యాయం చూపిస్తాం. పెద్దలారా, మీరు సంఘ పవిత్రతను కాపాడినప్పుడు, బైబిలు ఆధారంగా బలపర్చే సలహా ఇచ్చినప్పుడు, పక్షపాతం లేకుండా నిర్ణయాలు తీసుకున్నప్పుడు, కృంగినవాళ్ల భుజం తట్టినప్పుడు మీరు దేవునిలా న్యాయం చూపిస్తున్నారు. తన ప్రజలు “న్యాయంగా” ఉంటూ, తనతో నడవడానికి ప్రయత్నించడం యెహోవా పరలోకం నుండి చూసి ఎంత మురిసిపోతాడో కదా!
a ఆ మాటల్ని “తీర్పు తీర్చడం మొదలుపెట్టకండి,” “విమర్శించడం మొదలుపెట్టకండి” అని అర్థం వచ్చేలా “తీర్పు తీర్చకండి,” “విమర్శించకండి” అని కొంతమంది అనువదించారు. కానీ బైబిలు రచయితలు మాత్రం “తీర్పు తీర్చడం ఆపేయండి,” “విమర్శించడం మానేయండి” అని రాశారు. దాన్నిబట్టి యేసు మాటల్ని వింటున్నవాళ్లు అప్పటికే అవి చేస్తూ ఉన్నారని, వాటిని ఇప్పుడు మానేయాలని అర్థమౌతుంది.
b 2 తిమోతి 4:2 లో పెద్దలు కొన్నిసార్లు ‘గద్దించాలి, గట్టిగా హెచ్చరించాలి, ప్రోత్సహించాలి’ అని బైబిలు చెప్తుంది. ఇక్కడ “ప్రోత్సహించు” అని అనువదించిన గ్రీకు పదం పారాకేలియో. దానికి సంబంధించిన పారాక్లేటోస్ అనే గ్రీకు పదానికి, మన తరఫున వాదించి మనకు సహాయం చేసే లాయర్ అనే అర్థముంది. కాబట్టి, పెద్దలు గట్టి దిద్దుబాటు ఇస్తున్నప్పుడు కూడా, తప్పు చేసిన వ్యక్తి తిరిగి యెహోవాకు దగ్గరయ్యేలా సహాయం చేసేవాళ్లుగానే ఉండాలి.