అధ్యాయం 11
“ఆయన మార్గాలన్నీ న్యాయమైనవి”
1, 2. (ఎ) యోసేపుకు ఎలాంటి ఘోరమైన అన్యాయాలు జరిగాయి? (బి) యెహోవా వాటిని ఎలా సరిచేశాడు?
అది మామూలు అన్యాయం కాదు. అందగాడైన ఒక కుర్రాడు ఏ తప్పూ చేయకపోయినా, చీకటి జైలుగదిలో మగ్గుతున్నాడు. అతను రేప్ చేయబోయాడని తప్పుడు నింద మోపారు. కానీ అన్యాయానికి బలవ్వడం అతనికి కొత్తేమీ కాదు. అతనే యోసేపు. కొన్ని సంవత్సరాల క్రితం, అతనికి 17 ఏళ్లు ఉన్నప్పుడు సొంత అన్నలే కుట్రపన్ని దాదాపు చంపినంత పని చేశారు. తర్వాత అతను దేశంకాని దేశంలో బానిస అయిపోయాడు. అక్కడ తన యజమాని భార్య, అతని మీద కన్నేసింది. కానీ యోసేపు లొంగకపోయేసరికి, ఆ కోపంతో ఆమె అతని మీద తప్పుడు నింద మోపింది. అలా అతను జైలుకు వెళ్లాడు. బాధాకరమైన విషయం ఏంటంటే, ఆ సమయంలో యోసేపుకు సహాయం చేసేవాళ్లు ఎవరూ లేరు అన్నట్టు అనిపిస్తుంది.
2 కానీ, ‘నీతిన్యాయాల్ని ప్రేమించే’ దేవుని కళ్లు ఇదంతా చూస్తున్నాయి. (కీర్తన 33:5) జరుగుతున్న అన్యాయాల్ని సరిచేయడానికి యెహోవా రంగంలోకి దిగి, యోసేపు విడుదలయ్యేలా పరిస్థితుల్ని మలుపు తిప్పాడు. యెహోవా అంతటితో సరిపెట్టుకోకుండా జైల్లో ఖైదీగా ఉన్న అతన్ని తెల్లారేసరికి ఒక గొప్ప స్థానంలో కూర్చోబెట్టి, పెద్ద హోదా ఇచ్చాడు. (ఆదికాండం 40:15; 41:41-43; కీర్తన 105:17, 18) చివరికి, యోసేపు పేరు మీద పడిన బురదంతా పోయింది. అతను తనకున్న గొప్ప స్థానాన్ని దేవుని ప్రజల్ని కాపాడడానికి ఉపయోగించాడు.—ఆదికాండం 45:5-8.
యోసేపు అన్యాయంగా జైల్లో మగ్గిపోయాడు
3. వేరేవాళ్లు మనతో న్యాయంగా ఉండాలని మనందరం ఎందుకు కోరుకుంటాం?
3 యోసేపు కథ మన హృదయాన్ని తాకుతుంది. ఎందుకంటే, మనలో ప్రతీఒక్కరం అన్యాయాన్ని చూసుంటాం లేదా దానికి బలై ఉంటాం. నిజానికి వేరేవాళ్లు మనతో నీతిగా, న్యాయంగా ఉండాలని మనందరం కోరుకుంటాం. అందులో ఆశ్చర్యం లేదు, ఎందుకంటే యెహోవా మనల్ని తన స్వరూపంలో అంటే తన లక్షణాలతో సృష్టించాడు. ఆయనకున్న ముఖ్యమైన లక్షణాల్లో న్యాయం ఒకటి. (ఆదికాండం 1:27) యెహోవా గురించి బాగా తెలుసుకోవాలంటే, ఆయన న్యాయానికి ఎంత విలువిస్తాడో మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు ఆయన పనుల్ని బాగా అర్థం చేసుకుంటాం, ఆయనకు ఇంకాఇంకా దగ్గరౌతాం.
న్యాయం అంటే ఏంటి?
4. మనుషుల వైపు నుండి చూస్తే, న్యాయం అంటే ఏంటి?
4 మనుషుల వైపు నుండి చూస్తే, న్యాయం అంటే రూల్స్‌ని అందరికీ సమానంగా అన్వయించడం. రైట్ అండ్ రీజన్—ఎథిక్స్ ఇన్ థియరీ అండ్ ప్రాక్టీస్ అనే పుస్తకం ఇలా చెప్తుంది: “చట్టాల్ని, నియమాల్ని, హక్కుల్ని, బాధ్యతల్ని అందరికీ ఒకేలా వర్తించేలా చేసి వాళ్ల పనుల్ని బట్టి శిక్షించడం లేదా ప్రతిఫలం ఇవ్వడమే న్యాయం.” కానీ యెహోవా వైపు నుండి చూస్తే, న్యాయం అంటే ఏ ఫీలింగ్స్ లేకుండా, ఏదో తప్పదన్నట్లుగా రూల్స్‌ని అన్వయించడం కాదు.
5, 6. (ఎ) “న్యాయం” అని అనువదించిన హీబ్రూ, గ్రీకు పదాలకు అర్థమేంటి? (బి) దేవుడు న్యాయంగా ప్రవర్తిస్తాడంటే ఏంటి దానర్థం?
5 యెహోవాకున్న న్యాయం గురించి లోతుగా తెలియాలంటే ఆ పదానికి బైబిల్లో ఉపయోగించిన హీబ్రూ, గ్రీకు పదాల్ని పరిశీలించడం మంచిది. దానికి హీబ్రూ లేఖనాల్లో ముఖ్యంగా మూడు పదాల్ని వాడారు. అందులో ఎక్కువగా వాడిన ఒక పదాన్ని “సరైనది” అని అనువదించారు. (ఆదికాండం 18:25) మిగతా రెండు పదాల్ని చాలావరకు “నీతి” అని అనువదించారు. క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో “నీతి” అని అనువదించిన పదానికి “సరిగ్గా లేదా న్యాయంగా ఉండడం” అని అర్థం. కాబట్టి నీతికి, న్యాయానికి రెండిటికి దాదాపు ఒకేలాంటి అర్థం ఉంది.—ఆమోసు 5:24.
6 కాబట్టి దేవుడు న్యాయంగా ప్రవర్తిస్తాడు అని బైబిలు చెప్తుందంటే, ఆయన సరైనది చేస్తాడు, పైగా ఎలాంటి పక్షపాతం లేకుండా అలా చేస్తాడు అని అర్థం. (రోమీయులు 2:11) అలా కాకుండా యెహోవా ఇంకోలా ప్రవర్తించడాన్ని మనం కలలో కూడా ఊహించలేం. యెహోవా గురించి బాగా తెలిసిన ఎలీహు ఇలా అన్నాడు: “సత్యదేవుడు చెడుగా ప్రవర్తించడం, సర్వశక్తిమంతుడు తప్పుచేయడం అసాధ్యం!” (యోబు 34:10) అవును, యెహోవా అన్యాయం చేయడం అసాధ్యం. ఎందుకు? రెండు ముఖ్యమైన కారణాల్ని చూద్దాం.
7, 8. (ఎ) అన్యాయం చేయడం యెహోవాకు ఎందుకు చేతకాదు? (బి) యెహోవా నీతిగా లేదా న్యాయంగా ప్రవర్తించడానికి రెండు కారణాలు ఏంటి?
7 మొదటి కారణం ఏంటంటే, యెహోవా పవిత్రుడు. మనం 3వ అధ్యాయంలో చూసినట్టు యెహోవా పూర్తిస్థాయిలో పవిత్రుడు, నిజాయితీపరుడు. కాబట్టి అవినీతి, అన్యాయం చేయడం ఆయనకు చేతకాదు. దానర్థం ఏంటో ఒకసారి ఆలోచించండి. మన పరలోక తండ్రి పవిత్రుడు కాబట్టి, ఆయన ఎన్నడూ తన పిల్లలకు అన్యాయం చేయడని మనం పూర్తి నమ్మకంతో ఉండవచ్చు. యేసుకు కూడా అలాంటి నమ్మకమే ఉంది. ఆయన భూమ్మీద గడిపిన చివరి రాత్రి ఇలా ప్రార్థించాడు: “పవిత్రుడివైన తండ్రీ, . . . నీ సొంత పేరును బట్టి వాళ్లను [శిష్యుల్ని] కాపాడు.” (యోహాను 17:11) లేఖనాల్లో ‘పవిత్రుడైన తండ్రి’ అనే బిరుదు యెహోవాకు తప్ప ఇంకెవ్వరికీ వర్తించదు. పవిత్రత విషయంలో యెహోవాకు పోటీ, సాటి ఎవ్వరూ లేరు కాబట్టి ఆయన్ని అలా పిలవడం సరైనదే. ఎలాంటి పాపం లేకుండా నూటికి నూరుశాతం స్వచ్ఛత, శుద్ధత ఉన్న అలాంటి తండ్రి చేతుల్లో తన శిష్యులు సురక్షితంగా ఉంటారని యేసు పూర్తిగా నమ్మాడు.—మత్తయి 23:9.
8 రెండో కారణం ఏంటంటే, యెహోవాకు నిస్వార్థమైన ప్రేమ ఉంది. అది ఆయన నైజం. ఆ ప్రేమ వల్లే ఆయన నీతిగా, న్యాయంగా ప్రవర్తిస్తాడు. మరోవైపు జాతి అహంకారం, వివక్ష, పక్షపాతం లాంటి అన్యాయపు ఛాయలు ప్రేమకు వ్యతిరేక లక్షణాలైన అత్యాశ, స్వార్థం నుండే పుడతాయి. బైబిలు, ప్రేమకు నిలువెత్తు రూపమైన దేవుని గురించి ఇలా మాటిస్తుంది: “యెహోవా నీతిమంతుడు; ఆయన నీతికార్యాల్ని ప్రేమిస్తాడు.” (కీర్తన 11:7) యెహోవాయే స్వయంగా తన గురించి ఇలా చెప్తున్నాడు: “యెహోవానైన నేను న్యాయాన్ని ప్రేమిస్తాను.” (యెషయా 61:8) మన దేవుడు సరైనది లేదా న్యాయమైనది చేయడంలో సంతోషిస్తాడని తెలుసుకోవడం ఓదార్పుగా అనిపించట్లేదా?—యిర్మీయా 9:24.
కరుణ, పరిపూర్ణ న్యాయం
9-11. (ఎ) దేవుని న్యాయానికి, కరుణకి ఉన్న సంబంధం ఏంటి? (బి) యెహోవా పాపులైన మనుషుల మీద న్యాయాన్ని అలాగే కరుణను ఎలా చూపించాడు?
9 యెహోవాకున్న మిగతా లక్షణాలన్నిటి లాగే, ఆయన న్యాయం కూడా పరిపూర్ణమైనది. అందులో వేలెత్తి చూపించడానికి అవకాశమే లేదు. యెహోవాను స్తుతిస్తూ మోషే ఇలా అన్నాడు: “ఆయన ఆశ్రయదుర్గం, ఆయన కార్యం పరిపూర్ణం, ఆయన మార్గాలన్నీ న్యాయమైనవి. ఆయన నమ్మకమైన దేవుడు, ఆయన ఎన్నడూ అన్యాయం చేయడు; ఆయన నీతిమంతుడు, నిజాయితీపరుడు.” (ద్వితీయోపదేశకాండం 32:3, 4) అవును, యెహోవా ఎప్పుడూ పరిపూర్ణ స్థాయిలో న్యాయంగా ఉంటాడు. అంటే అటు తప్పుల్ని చూసీచూడనట్లు వదిలేయడు, ఇటు ప్రతీదాన్ని భూతద్దంలో పెట్టి చూడడు.
10 దేవుని న్యాయానికి, కరుణకి దగ్గరి సంబంధం ఉంది. కీర్తన 116:5 ఇలా చెప్తుంది: “యెహోవా కనికరం గలవాడు, నీతిమంతుడు [“న్యాయవంతుడు,” పవిత్ర గ్రంథము కతోలిక అనువాదము]; మన దేవుడు కరుణ గలవాడు.” అవును, యెహోవాకు అటు కరుణ, ఇటు న్యాయం రెండూ ఉన్నాయి. ఆ రెండు లక్షణాలు ఒకదానికొకటి వ్యతిరేకమైనవి కావు. ఆయన కరుణ చూపిస్తే న్యాయం నీరుగారిపోయినట్టు కాదు, అలాగని ఆయన కరుణ చూపించకపోతే ఆయన న్యాయం ఏదో మరీ కఠినంగా ఉంటుందని కాదు. బదులుగా, ఆయన ఒకే సమయంలో, కొన్నిసార్లైతే ఒకే పనిలో ఆ రెండు లక్షణాల్ని కలిపి చూపించగలడు. ఒక ఉదాహరణ చూడండి.
11 మనుషులందరికీ వారసత్వంగా పాపం వచ్చింది కాబట్టి, మనకు మరణమనే శిక్ష రావడం సరైనదే. (రోమీయులు 5:12) కానీ యెహోవాకు పాపులు చనిపోవడం ఇష్టంలేదు. ఆయన ‘క్షమించడానికి సిద్ధంగా ఉండే దేవుడు, కనికరం, కరుణ గలవాడు.’ (నెహెమ్యా 9:17) అయినప్పటికీ, ఆయన పవిత్రుడు కాబట్టి పాపాన్ని సహించలేడు. మరి వారసత్వంగా పాపం వచ్చిన మనుషుల మీద ఆయన కరుణను ఎలా చూపించగలడు? దానికి జవాబే, మనుషుల్ని రక్షించడానికి ఆయన చేసిన విమోచన క్రయధనం అనే ఏర్పాటు. అది బైబిల్లో ఉన్న అమూల్యమైన సత్యాల్లో ఒకటి. దేవుడు ప్రేమతో చేసిన ఈ ఏర్పాటు గురించి 14వ అధ్యాయంలో ఇంకా ఎక్కువగా తెలుసుకుంటాం. ఈ ఒక్క ఏర్పాటుతోనే యెహోవా ఒకవైపు న్యాయాన్ని, మరోవైపు కరుణను పూర్తిస్థాయిలో చూపించాడు. ఈ ఏర్పాటు వల్ల యెహోవా తన పరిపూర్ణ న్యాయానికి అంటిపెట్టుకుని ఉంటూనే, పశ్చాత్తాపం చూపించిన పాపుల మీద కరుణ కూడా చూపించగలడు.—రోమీయులు 3:21-26.
యెహోవా న్యాయం మనల్ని ఆయనకు దగ్గర చేస్తుంది
12, 13. (ఎ) యెహోవాకున్న న్యాయం మనల్ని ఆయనకు ఎందుకు దగ్గర చేస్తుంది? (బి) దావీదు యెహోవాకున్న న్యాయం గురించి ఏ ముగింపుకు వచ్చాడు? అది మనకెలా బలాన్ని ఇస్తుంది?
12 యెహోవాకున్న న్యాయం మనల్ని భయపెట్టి ఆయనకు దూరం చేయదు గానీ, మనల్ని ఆకర్షించి ఆయనకు దగ్గర చేస్తుంది. యెహోవా న్యాయాన్ని లేదా నీతిని కనికరంతో చూపిస్తాడని బైబిలు చెప్తుంది. యెహోవా ఎలా న్యాయాన్ని చూపిస్తాడో ఇప్పుడు కొన్ని మంచిమంచి ఉదాహరణలు చూద్దాం.
13 యెహోవా పరిపూర్ణ న్యాయం గలవాడు కాబట్టి తన సేవకులకు నమ్మకంగా, విశ్వసనీయంగా ఉంటాడు. యెహోవా న్యాయంలో ఉన్న ఈ కోణాన్ని, కీర్తనకర్త అయిన దావీదు స్వయంగా రుచి చూశాడు. తన సొంత అనుభవం వల్ల, అలాగే దేవుని మార్గాల్ని అధ్యయనం చేయడం వల్ల దావీదు ఏ ముగింపుకు వచ్చాడు? ఆయన ఇలా అన్నాడు: “యెహోవా న్యాయాన్ని ప్రేమిస్తాడు, ఆయన తన విశ్వసనీయుల్ని విడిచిపెట్టడు. వాళ్లు ఎప్పటికీ కాపాడబడతారు.” (కీర్తన 37:28) ఆ మాటలు మనకు కొండంత బలాన్ని ఇస్తున్నాయి కదా! మన దేవుడు తనకు విశ్వసనీయంగా ఉన్నవాళ్లను ఒక్క క్షణం కూడా విడిచిపెట్టడు. ఆయన మనకు దగ్గరగా ఉంటాడని, ప్రేమగా చూసుకుంటాడని నమ్మడానికి ఆయన న్యాయమే గ్యారంటీ!—సామెతలు 2:7, 8.
14. అనాథలు, విధవరాళ్ల మీద యెహోవాకున్న శ్రద్ధ ఆయన ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ధర్మశాస్త్రంలో ఎలా కనిపిస్తుంది?
14 యెహోవా న్యాయాన్ని ప్రేమిస్తాడు కాబట్టి, బాధల్లో ఉన్నవాళ్ల అవసరాలు పట్టించుకుంటాడు. పేదలు, అనాథలు, విధవరాళ్ల మీద యెహోవాకున్న శ్రద్ధ ఆయన ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ధర్మశాస్త్రంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఉదాహరణకు, అనాథలు, విధవరాళ్ల కోసం ధర్మశాస్త్రంలో యెహోవా కొన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశాడు. (ద్వితీయోపదేశకాండం 24:17-21) అలాంటివాళ్లకు జీవితం ఎంత కష్టంగా సాగుతుందో ఆయనకు తెలుసు. కాబట్టి యెహోవాయే స్వయంగా వాళ్లకు తండ్రిగా, న్యాయమూర్తిగా, రక్షకుడిగా ఉంటూ “తండ్రిలేని పిల్లలకు, విధవరాళ్లకు న్యాయం తీరుస్తాడు.”a (ద్వితీయోపదేశకాండం 10:18; కీర్తన 68:5) అలాంటి స్త్రీలను, పిల్లల్ని బాధపెడితే వాళ్ల మొరను ఖచ్చితంగా వింటానని యెహోవా ఇశ్రాయేలీయుల్ని హెచ్చరించాడు. ఆయన ఇలా అన్నాడు: “అప్పుడు నా కోపం రగులుకుంటుంది.” (నిర్గమకాండం 22:22-24) కోపం యెహోవాకున్న ముఖ్యమైన లక్షణాల్లో ఒకటి కాదు. అయినా, ఎవరైనా కావాలని అన్యాయం చేస్తే మాత్రం ఆయనకు న్యాయంగానే కోపం వస్తుంది. మరిముఖ్యంగా దీనులకు, నిస్సహాయులకు అన్యాయం చేస్తే ఆయనకు ఇంకా కోపం వస్తుంది.—కీర్తన 103:6.
15, 16. యెహోవాలో పక్షపాతం లేదు అనడానికి ఒక చక్కటి రుజువేంటి?
15 యెహోవా ‘ఎవ్వరి విషయంలోనూ పక్షపాతం చూపించనని, లంచం తీసుకోనని’ కూడా మనకు హామీ ఇస్తున్నాడు. (ద్వితీయోపదేశకాండం 10:17) అధికారం, పలుకుబడి ఉన్న చాలామంది మనుషులు డబ్బుని లేదా పైరూపాన్ని చూసి తీర్పు తీరుస్తారు. కానీ యెహోవా ఎప్పుడూ వాటికి తలవంచడు. ఆయనలో రవ్వంత కూడా వివక్ష గానీ, పక్షపాతం గానీ లేవు. యెహోవాలో పక్షపాతం లేదు అనడానికి ఒక చక్కటి రుజువు చూడండి. ఆయన తనకు ఆరాధకులై శాశ్వత జీవితం పొందే గొప్ప అవకాశాన్ని ఏదో కొద్దిమంది గొప్పవాళ్లకే ఇవ్వలేదు. కానీ “ప్రతీ జనంలో, తనకు భయపడి సరైనది చేసేవాళ్లను ఆయన అంగీకరిస్తాడు.” (అపొస్తలుల కార్యాలు 10:34, 35) రంగు, రూపం, జాతి, దేశం అనే తేడా లేకుండా ఆయన ప్రతీ ఒక్కరికీ ఈ గొప్ప అవకాశాన్ని తెరిచే పెట్టాడు. నిజమైన న్యాయం అంటే ఇదే కదా?
16 యెహోవాకున్న పరిపూర్ణ న్యాయంలో మనం పరిశీలించాల్సిన, గౌరవించాల్సిన ఇంకొక కోణం కూడా ఉంది. అదే, తన నీతి ప్రమాణాల్ని తప్పేవాళ్లతో ఆయన ప్రవర్తించే విధానం.
శిక్షించకుండా అస్సలు విడిచిపెట్టడు
17. ఈ లోకంలో జరుగుతున్న అన్యాయాల్ని చూసి మనం యెహోవాకున్న న్యాయాన్ని ఎందుకు అనుమానించకూడదు?
17 కొంతమంది ఇలా అనవచ్చు: ‘యెహోవా అవినీతిని చూసి తట్టుకోలేని వాడైతే, మరి ఈ లోకంలో అన్యాయం, బాధలు, అవినీతి ఎందుకు పెరిగిపోతున్నాయి?’ ఇలాంటి అన్యాయాల్ని చూసి మనం యెహోవాకున్న న్యాయాన్ని అనుమానించాల్సిన అవసరం లేదు. ఈ చెడ్డ లోకంలో జరుగుతున్న చాలా అన్యాయాలకు కారణం, మనుషులకు ఆదాము నుండి వచ్చిన పాపమే. అపరిపూర్ణ మనుషులు ఎవరి దారి వాళ్లు చూసుకుని పాపంలోకి వెళ్లిపోతుంటే, ప్రపంచంలో అన్యాయం కాక ఇంకేం ఉంటుంది? అయితే, పరిస్థితి త్వరలోనే మారుతుంది.—ద్వితీయోపదేశకాండం 32:5.
18, 19. కావాలనే తన నీతి ప్రమాణాల్ని తప్పేవాళ్లను యెహోవా ఎప్పటికీ సహిస్తూ ఉండడని ఎలా చెప్పవచ్చు?
18 నిజమే, తనకు మనస్ఫూర్తిగా దగ్గరయ్యేవాళ్ల మీద యెహోవా గొప్ప కరుణ చూపిస్తాడు, కానీ తన పవిత్రమైన పేరుకు మచ్చ తీసుకొచ్చే పరిస్థితిని ఆయన ఎప్పటికీ సహిస్తూ ఉండడు. (కీర్తన 74:10, 22, 23) న్యాయవంతుడైన దేవుడు వెక్కిరించబడడు; కావాలనే పాపం చేసినవాళ్లకు తగిన ప్రతిఫలం లేదా శిక్ష రాకుండా ఆయన అడ్డుపడడు. యెహోవా “కరుణ, కనికరం గల దేవుడు; ఓర్పును, అపారమైన విశ్వసనీయ ప్రేమను చూపించే దేవుడు; ఎంతో సత్యవంతుడు; . . . అయితే దోషిని శిక్షించకుండా అస్సలు విడిచిపెట్టడు.” (నిర్గమకాండం 34:6, 7) ఆ మాటలకు తగ్గట్టే, కొన్నిసార్లు కావాలనే తన నీతి ప్రమాణాల్ని తప్పినవాళ్లను శిక్షించడం అవసరమని యెహోవాకు అనిపించింది.
19 ఉదాహరణకు, ఇశ్రాయేలీయుల విషయమే తీసుకోండి. వాగ్దాన దేశంలో స్థిరపడిన తర్వాత కూడా, ఇశ్రాయేలీయులు పదేపదే యెహోవాకు ఎదురుతిరిగారు. వాళ్ల చెడ్డ పనులు తనను ‘బాధపెట్టినా,’ ఆయన వాళ్లను వెంటనే నాశనం చేయలేదు. (కీర్తన 78:38-41) బదులుగా, వాళ్ల ప్రవర్తనను మార్చుకునే ఎన్నో అవకాశాల్ని ఆయన కరుణతో వాళ్లముందు పెట్టాడు. ఆయన వాళ్లను ఇలా బతిమాలాడు: “దుష్టుడు చనిపోవడం వల్ల నాకు సంతోషం కలగదు, కానీ అతను తన ప్రవర్తన మార్చుకుని జీవిస్తూ ఉంటేనే నాకు సంతోషం . . . మీ చెడు మార్గాల్ని విడిచిపెట్టి వెనక్కి తిరగండి; ఇశ్రాయేలు ఇంటివాళ్లారా, మీరు ఎందుకు చనిపోవాలి?” (యెహెజ్కేలు 33:11) జీవం విలువైనది కాబట్టి, ఇశ్రాయేలీయుల్ని తమ చెడు ప్రవర్తన మార్చుకోమని చెప్పడానికి యెహోవా పదేపదే ప్రవక్తల్ని పంపించాడు. కానీ ఎక్కువశాతం ఆ మొండి ప్రజలు వినలేదు, మారలేదు. చివరికి తన పవిత్రమైన పేరు కోసం, ఆ పేరు వెనకున్న వ్యక్తి కోసం యెహోవా వాళ్లను శత్రువుల చేతికి అప్పగించాడు.—నెహెమ్యా 9:26-30.
20. (ఎ) యెహోవా ఇశ్రాయేలీయులతో ప్రవర్తించిన తీరు నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? (బి) బైబిలు, యెహోవా న్యాయానికి గుర్తుగా సింహాన్ని ఉపయోగించడం ఎందుకు సరైనది?
20 యెహోవా ఇశ్రాయేలీయులతో ప్రవర్తించిన తీరు నుండి, మనం ఆయన గురించి చాలా విషయాలు నేర్చుకోవచ్చు. అన్నిటినీ చూసే ఆయన కళ్లు అవినీతి జరిగినా చూస్తాయని, దాన్నిబట్టి ఆయన చాలా బాధపడతాడని మనం నేర్చుకోవచ్చు. (సామెతలు 15:3) అంతేకాదు, ఏ చిన్న ఆధారం దొరుకుతుందా కరుణ చూపిద్దాం అని ఆయన వెతుకుతూ ఉంటాడు. అలాగే ఆయన తీర్పు తీర్చేటప్పుడు తొందరపడడు. చాలామంది యెహోవాకున్న ఓర్పును అపార్థం చేసుకుని, ఇక ఆయన చెడ్డవాళ్లను ఎప్పటికీ శిక్షించడేమో అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ఆయన ఓర్పుకు హద్దు ఉందని ఆయన ఇశ్రాయేలీయులతో ప్రవర్తించిన తీరును బట్టి అర్థమౌతుంది. నీతి విషయంలో యెహోవా నిక్కచ్చిగా ఉంటాడు. మనుషులు కొన్నిసార్లు సరైనదాని వైపు నిలబడే ధైర్యం లేక, న్యాయం చేయడానికి వెనకడుగు వేస్తారు. కానీ దేవుడు మాత్రం అలా కాదు. అందుకే బైబిలు, ఆయన న్యాయం గురించి మాట్లాడుతున్నప్పుడు ధైర్యానికి మారుపేరైన సింహంతో పోలుస్తుంది.b (యెహెజ్కేలు 1:10; ప్రకటన 4:7) ఈ భూమ్మీద అన్యాయమే లేకుండా చేస్తానని యెహోవా మాటిచ్చాడు. ఆయన ఆ మాట మీద నిలబడతాడని మనం నమ్మకంతో ఉండవచ్చు. అవును, ఆయన తీర్పుతీర్చే విధానం గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే: అవసరమైన చోట నిక్కచ్చిగా ఉంటాడు, సాధ్యమైన చోటల్లా కరుణ చూపిస్తాడు.—2 పేతురు 3:9.
న్యాయాన్ని ప్రేమించే దేవునికి దగ్గరవ్వండి
21. యెహోవాకున్న న్యాయం గురించి ఆలోచిస్తున్నప్పుడు మనం ఆయన్ని ఎలా ఊహించుకోవాలి? ఎందుకు?
21 యెహోవాకున్న న్యాయం గురించి ఆలోచిస్తున్నప్పుడు, మనం ఆయన్ని తప్పు చేసినవాళ్లకు తీర్పుతీర్చే ఎలాంటి ఫీలింగ్స్ లేని ఒక మొండి జడ్జిలా ఊహించుకోకూడదు. ప్రేమగా, అదే సమయంలో నిక్కచ్చిగా ఉంటూ, తన పిల్లలకు ఎప్పుడూ మేలు చేసే ఒక తండ్రిలా ఆయన్ని ఊహించుకోవాలి. ఎందుకంటే యెహోవా నీతి, న్యాయం కలిగిన తండ్రి. ఆయన సరైనదాని విషయంలో నిక్కచ్చిగా ఉంటూనే తన సహాయం, క్షమాపణ అవసరమైన తన పిల్లల మీద గొప్ప కనికరం కూడా చూపిస్తాడు.—కీర్తన 103:10, 13.
22. న్యాయం వల్ల యెహోవా మనకు ఏ నిరీక్షణ ఇచ్చాడు? ఎందుకు?
22 యెహోవా న్యాయాన్ని చూపిస్తాడంటే, దానర్థం ఆయన తప్పు చేసినవాళ్లకు శిక్షలు వేసుకుంటూ పోడని తెలుసుకోవడం ఎంత సంతోషంగా ఉందో కదా! న్యాయం వల్లే, యెహోవా మనకు ఒక అద్భుతమైన నిరీక్షణను సాధ్యం చేశాడు. అదే, ‘నీతి నివసించే’ లోకంలో పరిపూర్ణమైన, శాశ్వతమైన జీవితం. (2 పేతురు 3:13) ఎందుకంటే, తన న్యాయం వల్ల యెహోవా ఎప్పుడు ఎవర్ని రక్షిద్దామా అనే చూస్తాడు తప్ప, ఎవర్ని శిక్షిద్దామా అని కాదు. నిజంగా యెహోవాకున్న న్యాయాన్ని లోతుగా గమనిస్తే, ఆయనకు ఇంకా దగ్గరౌతాం! యెహోవా ఈ అద్భుతమైన లక్షణాన్ని ఎలా చూపించాడో తర్వాతి అధ్యాయాల్లో ఇంకాస్త దగ్గర నుండి చూద్దాం.
a ఇక్కడ “తండ్రిలేని పిల్లలు” అని అంటున్నప్పుడు యెహోవా తండ్రిలేని అబ్బాయిల్నే కాదు, తండ్రిలేని అమ్మాయిల్ని కూడా శ్రద్ధగా చూసుకుంటాడని అర్థమౌతుంది. యెహోవా సెలోపెహాదు కూతుళ్ల విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని ధర్మశాస్త్రంలో రాయించాడు. కొడుకులు లేకుండానే సెలోపెహాదు చనిపోయాడు, కాబట్టి ఆయన ఆస్తి కూతుళ్లకు రావాలని యెహోవా నిర్ణయించాడు. ఆ తీర్పు, తర్వాతి తరాల్లో కూడా తండ్రిలేని అమ్మాయిల హక్కుల్ని కాపాడే ఒక శాసనం అయింది.—సంఖ్యాకాండం 27:1-8.
b ఆసక్తికరంగా, తన మాట వినని ఇశ్రాయేలీయుల మీద తీర్పు అమలు చేస్తున్నప్పుడు, యెహోవా తనను సింహంతో పోల్చుకున్నాడు.—యిర్మీయా 25:38; హోషేయ 5:14.