అధ్యాయం 7
కాపాడే శక్తి—“దేవుడే మన ఆశ్రయం”
1, 2. క్రీస్తు పూర్వం 1513 లో ఇశ్రాయేలీయులు సీనాయి ప్రాంతంలో అడుగుపెట్టినప్పుడు, ఎలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నారు? యెహోవా వాళ్లకు ఎలా ధైర్యం చెప్పాడు?
క్రీస్తు పూర్వం 1513 మొదట్లో, ఇశ్రాయేలీయులు సీనాయి ప్రాంతంలో అడుగుపెట్టారు. చెప్పాలంటే వాళ్లు ప్రమాదపు అంచున ఉన్నారు. వాళ్లముందు ఒక భయంకరమైన ప్రయాణం ఉంది. వాళ్లు “విషసర్పాలూ తేళ్లూ తిరిగే . . . భయంకరమైన మహా ఎడారి గుండా” అడుగులు సాగించాలి. (ద్వితీయోపదేశకాండం 8:15) దాంతోపాటు శత్రుదేశాల నుండి కూడా వాళ్లకు ప్రమాదం పొంచి ఉంది. వాళ్లను ఈ పరిస్థితుల్లోకి తెచ్చింది యెహోవాయే. మరి ఆయన వాళ్ల దేవుడు కదా, ఆయన వాళ్లను కాపాడగలడా?
2 ఆ సమయంలో యెహోవా చెప్పిన మాటలు వాళ్లకు కొండంత బలాన్ని ఇచ్చి ఉంటాయి. ఆయన ఇలా అన్నాడు: “మిమ్మల్ని గద్ద రెక్కల మీద మోసుకుంటూ నా దగ్గరికి తెచ్చుకోవడానికి నేను ఐగుప్తీయులకు ఏమి చేశానో మీరే స్వయంగా చూశారు.” (నిర్గమకాండం 19:4) యెహోవా వాళ్లను గద్దలా తన రెక్కల మీద మోసుకుంటూ, ఐగుప్తు నుండి సురక్షితంగా తీసుకొచ్చానని తన ప్రజలకు గుర్తుచేశాడు. “గద్ద రెక్కలు” దేవుని కాపుదలను వర్ణించడానికి సరిగ్గా సరిపోతాయని చెప్పడానికి ఇంకొన్ని కారణాలు కూడా ఉన్నాయి.
3. “గద్ద రెక్కలు” దేవుని కాపుదలను వర్ణించడానికి ఎందుకు సరిగ్గా సరిపోతాయి?
3 గద్దకు పెద్దపెద్ద, బలమైన రెక్కలు ఉంటాయి. అవి ఎగరడానికే కాదు ఇంకా చాలా వాటికి ఉపయోగపడతాయి. ఎండగా ఉన్నప్పుడు తల్లిపక్షి ఆ రెక్కల్ని దాదాపు ఏడు అడుగులు బారుగా చాపి, ఒక గొడుగులా చేస్తుంది. అలా తన చిట్టిచిట్టి పిల్లల్ని భగభగ మండే సూర్యుని నుండి కాపాడుతుంది. చలిగా ఉన్నప్పుడేమో, ఆ రెక్కల్ని పిల్లల చుట్టూ కప్పి వాటిని వెచ్చగా ఉంచుతుంది. గద్ద తన పిల్లల్ని కాపాడినట్టే, యెహోవా కూడా అప్పుడే ఎదుగుతున్న ఇశ్రాయేలు జనాంగాన్ని భద్రంగా కాపాడాడు. ఇప్పుడు ఈ ఎడారిలో కూడా, వాళ్లు నమ్మకంగా ఉన్నంతకాలం ఆయన బలమైన రెక్కల కింద ఆశ్రయం పొందుతూనే ఉంటారు. (ద్వితీయోపదేశకాండం 32:9-11; కీర్తన 36:7) అయితే, ఇప్పుడు కూడా దేవుడు మనల్ని అలాగే కాపాడతాడని మనం అనుకోవచ్చా?
కాపాడతానని దేవుడు మాటిస్తున్నాడు
4, 5. కాపాడతానని దేవుడు ఇచ్చిన మాటను మనం ఎందుకు పూర్తిగా నమ్మవచ్చు?
4 యెహోవాకు తన సేవకుల్ని కాపాడే సత్తా ఖచ్చితంగా ఉంది. ఆయన ‘సర్వశక్తిగల దేవుడు,’ అంటే ఆయన శక్తిని ఎవ్వరూ అడ్డుకోలేరు. (ఆదికాండం 17:1) ఎగసిపడుతున్న కెరటాల్ని ఎలాగైతే ఎవ్వరూ ఆపలేరో, అలాగే యెహోవాను తన శక్తిని ఉపయోగించకుండా ఎవ్వరూ ఆపలేరు. ఆయనకు ఏది ఇష్టమో అది చేయగలడు. అయితే ప్రశ్న ఏంటంటే, ‘తన శక్తిని ఉపయోగించి తన ప్రజల్ని కాపాడడం ఆయనకు ఇష్టమేనా?’
5 ఇష్టమే! ఆయన అలా కాపాడతానని మాట కూడా ఇచ్చాడు. కీర్తన 46:1 ఇలా చెప్తుంది: “దేవుడే మన ఆశ్రయం, మన బలం, కష్టకాలాల్లో ఆయన ఎప్పుడూ సహాయం చేస్తాడు.” ఆయన “అబద్ధమాడలేని దేవుడు” కాబట్టి, కాపాడతానని ఆయనిచ్చిన మాటను మనం పూర్తిగా నమ్మవచ్చు. (తీతు 1:2) యెహోవా తన ప్రజల్ని కాపాడతానని చెప్పడానికి కొన్ని ఉదాహరణలు ఉపయోగించాడు. వాటిలో కొన్నిటిని ఇప్పుడు చూద్దాం.
6, 7. (ఎ) బైబిలు కాలాల్లో ఒక కాపరి తన గొర్రెల్ని ఎలా కాపాడేవాడు? (బి) యెహోవాకు తన గొర్రెల్ని కాపాడాలనే, సంరక్షించాలనే కోరిక ఉందని బైబిలు ఏ ఉదాహరణ ద్వారా చూపిస్తుంది?
6 యెహోవా మన కాపరి, “మనం ఆయన ప్రజలం, ఆయన మేపే గొర్రెలం.” (కీర్తన 23:1; 100:3) గొర్రెలు చాలా నిస్సహాయంగా ఉంటాయి. బైబిలు కాలాల్లో ఒక కాపరి తన గొర్రెల్ని సింహాలు, తోడేళ్లు, ఎలుగుబంట్లు, అలాగే దొంగల నుండి కాపాడడానికి చాలా ధైర్యంగా ఉండాల్సి వచ్చేది. (1 సమూయేలు 17:34, 35; యోహాను 10:12, 13) అయితే గొర్రెల్ని కాస్తున్నప్పుడు, మృదువుగా ఉండాల్సిన సందర్భాలు కూడా వచ్చేవి. ఉదాహరణకు, ఒక గొర్రె మందకు దూరంగా ఈనినప్పుడు దయగల కాపరి ఆ తల్లిగొర్రెను కంటికి రెప్పలా కాపాడుతూ, అప్పుడే పుట్టిన బుజ్జి గొర్రెపిల్లను జాగ్రత్తగా మంద దగ్గరికి తీసుకొచ్చేవాడు.
“వాటిని తన గుండెల మీద మోస్తాడు”
7 ఒక కాపరితో పోల్చుకోవడం ద్వారా, యెహోవా మనల్ని కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు చూపిస్తున్నాడు. (యెహెజ్కేలు 34:11-16) ఈ పుస్తకంలోని 2వ అధ్యాయంలో చూశాం కదా, యెషయా 40:11 యెహోవా గురించి ఇలా చెప్తుంది: “గొర్రెల కాపరిలా ఆయన తన మంద బాగోగులు చూసుకుంటాడు. గొర్రెపిల్లల్ని ఆయన తన బాహువుతో సమకూరుస్తాడు, వాటిని తన గుండెల మీద మోస్తాడు.” ఇంతకీ ఆ గొర్రెపిల్ల కాపరి “గుండెల” మీదకు, అంటే ఆయన పైవస్త్రపు మడతల్లోకి ఎలా వచ్చింది? బహుశా ఆ గొర్రెపిల్ల కాపరి దగ్గరికి వెళ్లి, ఆయన కాళ్లను తట్టి ఉంటుంది. కానీ దాన్ని వంగి తీసుకుని భద్రంగా, మృదువుగా తన పైవస్త్రపు మడతల్లో పెట్టుకున్నది మాత్రం కాపరే. మన గొప్ప కాపరి అయిన యెహోవా మనల్ని కాపాడాలని ఎంతగా కోరుకుంటున్నాడో, ఈ ఉదాహరణ కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది కదా!
8. (ఎ) ఎవర్ని కాపాడతానని దేవుడు మాటిస్తున్నాడు? ఆ విషయాన్ని సామెతలు 18:10 ఎలా చూపిస్తుంది? (బి) దేవుని పేరును ఆశ్రయించడం అంటే ఏంటి?
8 అయితే, దేవుడు కాపాడతానని మాటిస్తున్నది తనకు దగ్గరయ్యేవాళ్లకే. సామెతలు 18:10 ఇలా చెప్తుంది: “యెహోవా పేరు బలమైన బురుజు. నీతిమంతుడు దానిలోకి పరుగెత్తి సురక్షితంగా ఉంటాడు.” బైబిలు కాలాల్లో తలదాచుకోవడానికి, సురక్షితంగా ఉండడానికి కొన్నిసార్లు ఎడారిలో బురుజులు కట్టేవాళ్లు. కానీ, ఒక వ్యక్తి ఆ బురుజులోకి పరుగెత్తుకుని వెళ్లి సురక్షితంగా ఉంటాడా లేదా అనేది అతని చేతుల్లోనే ఉంటుంది. దేవుని పేరును ఆశ్రయించే విషయంలో కూడా అంతే. అంటే దానర్థం దేవుని పేరును జపించాలని కాదు. ఊరికే అలా జపిస్తూ ఉండడానికి దేవుని పేరేమీ శక్తులున్న ఒక మంత్రం కాదు. బదులుగా ఆ పేరును ధరించిన వ్యక్తిని మనం తెలుసుకోవాలి, నమ్మాలి, ఆయన నీతి ప్రమాణాలకు తగ్గట్టు జీవించాలి. మనం విశ్వాసంతో తనవైపు తిరిగినప్పుడు, మనల్ని కాపాడే ఒక బురుజులా ఉంటానని ఆయన చెప్తున్నాడు. యెహోవా ఎంత దయగలవాడో కదా!
“మా దేవుడు . . . మమ్మల్ని రక్షించగలడు”
9. యెహోవా తన సేవకుల్ని కాపాడతానని కేవలం మాటిచ్చి ఊరుకున్నాడా?
9 యెహోవా తన ప్రజల్ని కాపాడతానని మాటివ్వడమే కాదు, బైబిలు కాలాల్లో చాలాసార్లు తన ప్రజల్ని కాపాడే సత్తా ఉందని అద్భుతరీతిలో చూపించాడు. ఇశ్రాయేలు చరిత్రనే తీసుకుంటే, యెహోవా బలమైన “చెయ్యి” మహామహా శత్రువుల్నే మట్టి కరిపించింది. (నిర్గమకాండం 7:4) అయితే, యెహోవా తన ప్రజల్లో ఒక్కొక్కరిని కాపాడడానికి కూడా తన శక్తిని ఉపయోగించాడు.
10, 11. యెహోవా తన సేవకుల్లో ఒక్కొక్కరిని కాపాడడానికి తన శక్తిని ఉపయోగిస్తాడని ఏ బైబిలు ఉదాహరణల్ని బట్టి చెప్పవచ్చు?
10 షద్రకు, మేషాకు, అబేద్నెగో అనే ముగ్గురు హెబ్రీ యువకులు నెబుకద్నెజరు రాజు తయారు చేయించిన బంగారు ప్రతిమకు మొక్కడానికి ఒప్పుకోలేదు. అప్పుడు కోపంతో ఆ రాజు వాళ్లను మండే కొలిమిలో పడేస్తానని బెదిరించాడు. “నా చేతుల్లో నుండి ఏ దేవుడు మిమ్మల్ని రక్షించగలడు?” అని భూమ్మీద అత్యంత శక్తిమంతుడిగా ఉన్న నెబుకద్నెజరు దెప్పిపొడిచాడు. (దానియేలు 3:15) అప్పుడు ఆ హెబ్రీ యువకులు ఇలా అన్నారు: “మేము ఒకవేళ కొలిమిలో పడేయబడితే, మేము సేవిస్తున్న మా దేవుడు దానిలో నుండి మమ్మల్ని రక్షించగలడు.” (దానియేలు 3:17) దేవునికి తమను కాపాడే శక్తి ఉందని ఆ ముగ్గురు హెబ్రీ యువకులు పూర్తిగా నమ్మారు. కానీ, దేవుడు తమను కాపాడాలని వాళ్లు ఆశించలేదు. నిజానికి, మండే కొలిమిని ఇంతకుముందు కన్నా ఏడురెట్లు ఎక్కువ వేడిగా చేయమని నెబుకద్నెజరు ఆజ్ఞాపించాడు. కానీ, వాళ్ల దేవుని శక్తి ముందు అది ఎందుకూ పనికి రాకుండా పోయింది. ఆయన వాళ్లను కాపాడాడు. దాంతో, “ఆయనలా రక్షించగలిగే దేవుడు వేరే ఎవ్వరూ లేరు” అని నెబుకద్నెజరు చచ్చినట్టు ఒప్పుకున్నాడు.—దానియేలు 3:29.
11 యెహోవా తనకున్న కాపాడే శక్తిని అద్భుతరీతిలో చూపించిన ఇంకో సంఘటన చూద్దాం. ఆయన తన ఒక్కగానొక్క కుమారుడి ప్రాణాన్ని, యూదా కన్య అయిన మరియ గర్భంలో పెట్టాడు. మరియ ‘గర్భవతియై కుమారుణ్ణి కంటుందని’ ఒక దేవదూత ఆమెకు చెప్పాడు. అదెలా జరుగుతుందో వివరిస్తూ ఆ దేవదూత ఇలా అన్నాడు: “పవిత్రశక్తి నీ మీదికి వస్తుంది, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది.” (లూకా 1:31, 35) ఆ సమయంలో దేవుని కుమారునికి కాపుదల చాలా అవసరం. మరియ కడుపులో ఉన్న ఆ పిండానికి ఆమెకున్న పాపం, అపరిపూర్ణత అంటుకుంటాయా? పురిట్లో ఉండగానే సాతాను ఆ బిడ్డను పొట్టన పెట్టుకుంటాడా? అసాధ్యం! యెహోవా ఒక విధంగా మరియ చుట్టూ కంచె వేశాడు. కాబట్టి ఏ అపరిపూర్ణత గానీ, శక్తి గానీ, మనిషి గానీ, ఆఖరికి చెడ్డదూత గానీ ఆ ఎదుగుతున్న పిండాన్ని నాశనం చేయలేవు. అది ఆమె కడుపులో ఊపిరిపోసుకున్న క్షణం నుండే యెహోవా కాపాడాడు. యేసు పెరిగి పెద్దవుతున్నప్పుడు కూడా యెహోవా ఆయన్ని కాపాడుతూనే ఉన్నాడు. (మత్తయి 2:1-15) తాను అనుకున్న సమయం వచ్చేవరకు, తన ప్రియ కుమారుని మీద ఒక్క గీత కూడా పడకుండా యెహోవా చూసుకున్నాడు.
12. బైబిలు కాలాల్లో యెహోవా కొంతమందిని ఎందుకు అద్భుతరీతిలో కాపాడాడు?
12 యెహోవా కొంతమందిని ఎందుకు అంత అద్భుతరీతిలో కాపాడాడు? చాలావరకు యెహోవా వాళ్లను కాపాడడానికి కారణం, తన సంకల్పాన్ని నెరవేర్చడమే. ఉదాహరణకు, పిల్లాడైన యేసు ప్రాణాలతో ఉంటేనే కదా దేవుని సంకల్పం నెరవేరేది, మనుషులందరూ ప్రయోజనం పొందేది. దేవుడు తన సేవకుల్ని కాపాడిన ఇలాంటి ఉదాహరణలు బైబిల్లో పుట్టలుపుట్టలు ఉన్నాయి. “మన సహనం వల్ల, లేఖనాలు ఇచ్చే ఊరట వల్ల మనం నిరీక్షణ కలిగివుండాలని” అవన్నీ మనకు బోధించడానికే రాయబడ్డాయి. (రోమీయులు 15:4) అవును, మన సర్వశక్తిగల దేవుడైన యెహోవా మీద మన విశ్వాసాన్ని ఈ ఉదాహరణలు పెంచుతాయి. మరి ఈ రోజుల్లో దేవుడు మనల్ని ఎలా కాపాడతాడు?
యెహోవా మనకు కష్టం వాసన తెలీకుండా చూసుకుంటాడా?
13. యెహోవా మనకోసం అద్భుతాల మీద అద్భుతాలు చేయాల్సిన అవసరం ఉందా? వివరించండి.
13 దేవుడు మనల్ని కాపాడతానని మాట ఇచ్చాడంటే, దానర్థం ఆయన మన జీవితంలో అద్భుతాల మీద అద్భుతాలు చేస్తాడని కాదు. ఈ లోకంలో మనకు కష్టం వాసన తెలీకుండా చూసుకుంటానని దేవుడు గ్యారంటీ ఇవ్వట్లేదు. పేదరికం, యుద్ధం, అనారోగ్యం, మరణం లాంటి తీవ్రమైన కష్టాలు చాలామంది నమ్మకమైన సేవకుల్ని ఊపిరాడకుండా చేశాయి. తన శిష్యులు విశ్వాసం కారణంగా చంపబడే అవకాశం కూడా ఉందని యేసు సూటిగా చెప్పాడు. అందుకే అంతం వరకు సహిస్తూ ఉండమని యేసు పదేపదే చెప్పాడు. (మత్తయి 24:9, 13) ఒకవేళ యెహోవా తన శక్తిని ఉపయోగించి చీటికిమాటికి మన విషయంలో అద్భుతాలు చేసుకుంటూ పోతే, సాతాను ఖచ్చితంగా ఆయన్ని నిలదీస్తాడు, మనం ఏదో ఆశించే దేవుని మీద భక్తి చూపిస్తున్నామని నిందిస్తాడు.—యోబు 1:9, 10.
14. యెహోవా తన సేవకులందర్నీ ఒకేలా కాపాడడు అని చెప్పడానికి ఏ ఉదాహరణలు ఉన్నాయి?
14 బైబిలు కాలాల్లో కూడా, యెహోవా తన కాపాడే శక్తిని ఉపయోగించి తన సేవకుల్లో ప్రతీఒక్కరిని శత్రువుల చేతిలో చనిపోకుండా అడ్డుకోలేదు. ఉదాహరణకు, దాదాపు క్రీస్తు శకం 44 లో హేరోదు, అపొస్తలుడైన యాకోబును చంపాడు. కానీ ఆ తర్వాత కొంతకాలానికే, యెహోవా పేతురును “హేరోదు చేతిలో నుండి” తప్పించాడు. (అపొస్తలుల కార్యాలు 12:1-11) ఇక యాకోబు సహోదరుడైన యోహాను విషయానికొస్తే ఆయన పేతురు కన్నా, యాకోబు కన్నా ఎక్కువ కాలం బ్రతికాడు. కాబట్టి మన దేవుడు తన సేవకులందర్నీ ఒకేలా కాపాడాలని మనం ఎదురుచూడలేం. పైగా “అనుకోని సమయాల్లో, అనుకోని సంఘటనలు” మనందరి మీద ఊడిపడతాయి. (ప్రసంగి 9:11) మరింక, యెహోవా ఈ రోజుల్లో మనల్ని ఎలా కాపాడతాడు?
యెహోవా మన ప్రాణాల్ని కాపాడతాడు
15, 16. (ఎ) యెహోవా తన ఆరాధకుల్ని ఒక గుంపుగా కాపాడతాడు అనడానికి ఏ రుజువులు ఉన్నాయి? (బి) యెహోవా తన సేవకుల్ని ఇప్పుడు, అలాగే “మహాశ్రమ” సమయంలో కాపాడతాడని మనం ఎందుకు నమ్మకంతో ఉండవచ్చు?
15 ముందుగా, యెహోవా మన ప్రాణాల్ని ఎలా కాపాడతాడో ఆలోచించండి. యెహోవా తన ఆరాధకుల్ని ఒక గుంపుగా కాపాడతాడని మనం ఎదురుచూడవచ్చు. యెహోవా కాపాడకపోతే మనం సాతానుకు ఆహారమైపోతాం. ఒకసారి ఆలోచించండి: ఈ భూమ్మీద నుండి సత్యారాధనను తీసేసేవరకు ‘ఈ లోక పరిపాలకుడైన’ సాతాను కళ్లు చల్లబడవు. (యోహాను 12:31; ప్రకటన 12:17) ఈ భూమ్మీద కొన్ని పెద్దపెద్ద ప్రభుత్వాలు మన ప్రకటనా పనిని నిషేధించాయి, మనల్ని నామరూపాల్లేకుండా చేయడానికి ప్రయత్నించాయి. అయినా, యెహోవా ప్రజలు గట్టిగా నిలబడ్డారు, మానకుండా ప్రీచింగ్ చేస్తూనే ఉన్నారు! వాళ్లు కొద్దిమందే ఉన్నా, దిక్కుతోచని వాళ్లలా కనిపిస్తున్నా, మహామహా దేశాలు కూడా వాళ్ల పనిని ఎందుకు ఆపలేకపోయాయి? ఎందుకంటే, యెహోవా వాళ్ల చుట్టూ తన బలమైన రెక్కల్ని అడ్డుగా పెట్టి వాళ్లను కాపాడాడు!—కీర్తన 17:7, 8.
16 మరి రాబోయే “మహాశ్రమ” సంగతేంటి? అప్పుడు దేవుడు మన ప్రాణాల్ని కాపాడతాడా? దేవుని తీర్పులు అమలయ్యేటప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎంతైనా “దైవభక్తిగల ప్రజల్ని కష్టాల నుండి ఎలా తప్పించాలో, తీర్పు రోజున జరిగే నాశనం కోసం అనీతిమంతుల్ని ఎలా వేరుగా ఉంచాలో యెహోవాకు తెలుసు” కదా. (ప్రకటన 7:14; 2 పేతురు 2:9) ఆలోగా మనం రెండు విషయాల్ని బల్లగుద్ది చెప్పవచ్చు. మొదటిది, భూమ్మీద ఉన్న తన నమ్మకమైన సేవకుల్ని సాతాను తుడిచిపెట్టేస్తుంటే యెహోవా చేతులు కట్టుకుని కూర్చోడు. రెండోది, యథార్థంగా ఉన్నవాళ్లకు నీతి విలసిల్లే కొత్తలోకంలో శాశ్వత జీవితాన్ని యెహోవా ఇస్తాడు. అవసరమైతే వాళ్లను పునరుత్థానం చేసిమరీ ఆ బహుమతిని ఇస్తాడు. చనిపోయినవాళ్లు దేవుని జ్ఞాపకంలో పదిలంగా ఉన్నారు. వాళ్లు ఉండడానికి అంతకన్నా సురక్షితమైన చోటు ఇంకోటి ఉంటుందా?—యోహాను 5:28, 29.
17. యెహోవా మనల్ని తన వాక్యం ద్వారా ఎలా కాపాడతాడు?
17 ఇప్పుడు కూడా యెహోవా మన ప్రాణాల్ని కాపాడుతున్నాడు. అదెలా? సజీవమైన తన “వాక్యం” ద్వారా! గాయపడిన హృదయాల్ని నయం చేసే, జీవితాల్ని మార్చేసే శక్తి దానికి ఉంది. (హెబ్రీయులు 4:12) అందులో ఉన్న సూత్రాల్ని పాటిస్తే, కొన్ని విషయాల్లో మనం మన ప్రాణాల్ని కాపాడుకోవచ్చు. యెషయా 48:17 ఇలా చెప్తుంది: ‘యెహోవా అనే నేనే నీకు ప్రయోజనం కలిగేలా బోధిస్తున్నాను.’ మనం దేవుని వాక్యానికి తగ్గట్టు జీవిస్తే ఖచ్చితంగా మన ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవచ్చు, ఆయుష్షును పెంచుకోవచ్చు. ఉదాహరణకు లైంగిక పాపానికి, అపవిత్రతకు దూరంగా ఉండమని బైబిలు చెప్తుంది. ఇప్పుడు ఆ సలహా పాటించాం అనుకోండి మనం అపవిత్రమైన పనులకు, మన శరీరాన్ని పాడుచేసే అలవాట్లకు దూరంగా ఉంటాం. ఆ అలవాట్లు వదులుకోలేకే, దేవుడంటే లెక్కలేని చాలామంది వాళ్ల జీవితాల్ని నిలువునా పాడు చేసుకుంటున్నారు. (అపొస్తలుల కార్యాలు 15:29; 2 కొరింథీయులు 7:1) కానీ, దేవుని వాక్యమైన బైబిలు మనల్ని కాపాడుతున్నందుకు ఎంతో సంతోషించాలి!
యెహోవా మనల్ని ఆధ్యాత్మికంగా కాపాడతాడు
18. యెహోవా మనల్ని ఆధ్యాత్మికంగా ఎలా కాపాడతాడు?
18 అన్నిటికన్నా ముఖ్యంగా, యెహోవా మనల్ని ఆధ్యాత్మికంగా కాపాడతాడు. మన ప్రేమగల దేవుడు మనకు ఆధ్యాత్మిక హాని కలిగించే వాటినుండి మనల్ని కాపాడతాడు. అదెలా? కష్టాల్ని సహించడానికి, ఆయనతో ఉన్న స్నేహాన్ని కాపాడుకోవడానికి మనకేం కావాలో అవన్నీ ఇవ్వడం ద్వారా అలా చేస్తాడు. ఆ విధంగా యెహోవా ఏదో మన డెబ్బై, ఎనభై సంవత్సరాల జీవితం గురించి కాదుగానీ మన శాశ్వత జీవితం గురించి ఆలోచిస్తున్నాడు. దాన్ని కాపాడాలన్నదే ఆయన కోరిక. మనల్ని ఆధ్యాత్మికంగా కాపాడడానికి ఆయన ఇచ్చినవాటిలో కొన్నిటిని ఇప్పుడు చూద్దాం.
19. మనకు వచ్చే ఎలాంటి కష్టాన్నైనా ఢీ కొట్టడానికి పవిత్రశక్తి మనకు ఎలా సహాయం చేస్తుంది?
19 యెహోవా మన ‘ప్రార్థనలు వినే దేవుడు.’ (కీర్తన 65:2) ఈ లోకంలో ఒత్తిళ్లు మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్టు అనిపించినప్పుడు, మన మనసులో ఉన్నదంతా యెహోవాకు చెప్తే మనసు తేలిక పడుతుంది. (ఫిలిప్పీయులు 4:6, 7) ఆయన మన కష్టాల్ని అద్భుతరీతిలో మాయం చేయకపోవచ్చు. కానీ మనస్ఫూర్తిగా మనం చేసే ప్రార్థనలు విని, ఆ కష్టాల్లో నుండి గట్టెక్కడానికి కావాల్సిన తెలివిని ఆయన ఇవ్వవచ్చు. (యాకోబు 1:5, 6) అంతకుమించి, తనను అడిగేవాళ్లకు యెహోవా పవిత్రశక్తిని ఇస్తాడు. (లూకా 11:13) ఆ శక్తివంతమైన పవిత్రశక్తి వల్ల మనకు వచ్చే ఏ కష్టాన్నైనా, సమస్యనైనా మనం ఢీ కొట్టవచ్చు. అది మనలో “అసాధారణ శక్తి” నింపుతుంది. దానివల్ల యెహోవా అతిత్వరలో కొత్తలోకంలో ఈ కష్టాలన్నీ తీసేసేవరకు, వాటిని తట్టుకోగలుగుతాం.—2 కొరింథీయులు 4:7.
20. యెహోవాకున్న కాపాడే శక్తిని మన బ్రదర్స్‌సిస్టర్స్ ద్వారా ఎలా రుచిచూడవచ్చు?
20 కొన్నిసార్లు యెహోవాకున్న కాపాడే శక్తిని మన తోటి బ్రదర్స్‌సిస్టర్స్ ద్వారా రుచిచూడవచ్చు. యెహోవా మనల్ని ‘ప్రపంచవ్యాప్త సహోదర బృందంలోకి’ ఆహ్వానించాడు. (1 పేతురు 2:17; యోహాను 6:44) మనం వాళ్లు చూపించే ప్రేమలో మునిగితేలుతున్నాం, పవిత్రశక్తి దేవుని ప్రజల్ని కడిగిన ముత్యంలా చేయడం కళ్లారా చూస్తున్నాం. ఆ పవిత్రశక్తి ప్రేమ, దయ, మంచితనం లాంటి అందమైన, ఆకర్షణీయమైన లక్షణాల్ని మనలో పుట్టిస్తుంది. (గలతీయులు 5:22, 23) అందుకే మనం ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు, తోటి బ్రదరో సిస్టరో వచ్చి మనకు ఉపయోగపడే సలహా ఇచ్చి ఉంటారు, లేదా మనకు బాగా కావాల్సిన మంచి మాటల్ని చెప్పి ఉంటారు. ఒక రకంగా వాళ్ల వెనకుండి యెహోవాయే మనల్ని కాపాడుతున్నందుకు, మనమీద శ్రద్ధ చూపిస్తున్నందుకు ఆయనకు థ్యాంక్స్ చెప్పవచ్చు.
21. (ఎ) “నమ్మకమైన, బుద్ధిగల దాసుడి” ద్వారా యెహోవా మనకు ఎలాంటి ఆధ్యాత్మిక ఆహారాన్ని సమయానికి పెడుతున్నాడు? (బి) మనల్ని ఆధ్యాత్మికంగా కాపాడడానికి యెహోవా ఇచ్చినవాటి నుండి మీరు ఎలా ప్రయోజనం పొందారు?
21 యెహోవా మనల్ని కాపాడడానికి ఇంకొకటి కూడా ఇచ్చాడు, అదే ఆధ్యాత్మిక ఆహారం. మనం తన వాక్యమైన బైబిలు నుండి బలం పొందేలా యెహోవా ‘నమ్మకమైన, బుద్ధిగల దాసుణ్ణి’ నియమించాడు. నమ్మకమైన దాసుడు కావలికోట, తేజరిల్లు! లాంటి ముద్రిత ప్రచురణల ద్వారా, అలాగే jw.org వెబ్‌సైట్ ద్వారా, మీటింగ్స్, సమావేశాల ద్వారా మనకు “తగిన సమయంలో” ఆధ్యాత్మిక ఆహారం పెడుతున్నాడు. సరిగ్గా మనకేం కావాలో, ఎప్పుడు కావాలో అప్పుడు పెడుతున్నాడు. (మత్తయి 24:45) మీటింగ్స్‌లో ఏదైనా కామెంట్‌లో గానీ, ప్రసంగంలో గానీ, ఆఖరికి ప్రార్థనలో గానీ ఏదైనా విషయం విని ‘అబ్బా! ఇది సరిగ్గా నాకోసమే’ అని మీకెప్పుడైనా అనిపించిందా? మన పత్రికల్లో వచ్చిన ఏదైనా ఆర్టికల్, మీ మనసును తాకి మీ జీవితాన్ని మార్చేసిందా? గుర్తుంచుకోండి, యెహోవా మనల్ని ఆధ్యాత్మికంగా కాపాడడం కోసమే ఇలాంటివన్నీ ఇస్తున్నాడు.
22. యెహోవా ఎప్పుడూ తన శక్తిని దేనికోసం ఉపయోగిస్తాడు? అది మనకు మంచే చేస్తుందని ఎందుకు చెప్పవచ్చు?
22 యెహోవా “తనను ఆశ్రయించేవాళ్లందరికీ . . . ఒక డాలు.” (కీర్తన 18:30) ఇప్పటివరకు మనం చూసినట్టు, యెహోవా తనకున్న కాపాడే శక్తిని ఉపయోగించి మనకు ఏ కష్టం రాకుండా అడ్డంగా నిలబడిపోడు. అదే తన సంకల్పాన్ని నెరవేర్చడం కోసమైతే, ఆయన ఖచ్చితంగా తనకున్న కాపాడే శక్తిని ఉపయోగిస్తాడు. ఇప్పుడు కాకపోతే భవిష్యత్తులో అయినా అది మనకు మంచే చేస్తుంది. మనం తనకు దగ్గరై తన ప్రేమలో మునిగితేలితే, అసలు కష్టం ఊసే తెలియని శాశ్వత జీవితాన్ని ఆయన మనకిస్తాడు. అంత గొప్ప జీవితంతో పోలిస్తే ఇప్పుడు మనకొచ్చే కష్టాలు “కొంతకాలమే ఉంటాయి, అవి చాలా చిన్నవి.”—2 కొరింథీయులు 4:17.