అధ్యాయం 8
చక్కదిద్దే శక్తి—యెహోవా “అన్నిటినీ కొత్తవిగా” చేస్తున్నాడు
1, 2. ఈ రోజుల్లో మనుషులు ఏమేం పోగొట్టుకుంటున్నారు? దానివల్ల వాళ్లకు ఎలా అనిపిస్తుంది?
ఒక పిల్లాడికి తనకు ఇష్టమైన బొమ్మ పోయినప్పుడు లేదా విరిగినప్పుడు, అతను కేర్‌ర్ . . . అని ఏడ్వడం మొదలుపెడతాడు. అది చూసినప్పుడు మనకూ బాధగా అనిపిస్తుంది! కానీ వాళ్ల అమ్మ గానీ నాన్న గానీ దాన్ని వెతికి ఇచ్చినప్పుడు లేదా బాగుచేసినప్పుడు, అతని ముఖం ఆనందంతో వెలిగిపోతుంది. నిజానికి, ఆ బొమ్మను బాగుచేయడం వాళ్ల అమ్మకి లేదా నాన్నకి పెద్ద విషయమేం కాకపోవచ్చు. కానీ ఆ పిల్లాడికి మాత్రం అది చాలా ఆశ్చర్యంగా, అద్భుతంగా అనిపిస్తుంది. ఎందుకంటే, పోయింది అనుకున్నది దొరికింది, పాడైంది అనుకున్నది బాగైంది!
2 యెహోవా బెస్ట్ తండ్రి. పోయింది, పాడైంది అనుకున్నదాన్ని తన పిల్లలకు తిరిగిచ్చే శక్తి ఆయనకు ఉంది. అయితే, మనం ఇక్కడ బొమ్మ గురించి మాట్లాడుకోవట్లేదు. ‘ఈ ప్రమాదకరమైన, కష్టమైన కాలాల్లో,’ ఆ బొమ్మ కన్నా ఎన్నోరెట్లు విలువైనవాటిని మనం పోగొట్టుకుంటున్నాం. (2 తిమోతి 3:1-5) ఉదాహరణకు, చాలామంది తమకు సొంతం అనుకున్న ఇళ్లను, ఆస్తిని, ఉద్యోగాల్ని, ఆఖరికి ఆరోగ్యాన్ని కూడా పోగొట్టుకుంటున్నారు. కొన్నిసార్లు ఈ భూమిని పాడుచేస్తున్నవాళ్ల వల్ల, ఒక్కో జంతువు అంతరించిపోవడం చూసినప్పుడు మనకు చాలా బాధేస్తుంది. కానీ అన్నిటికంటే గట్టి దెబ్బ ఎప్పుడు తగులుతుందంటే, మనకు ఇష్టమైనవాళ్లు చనిపోయినప్పుడు. ఆ బాధను మాటల్లో చెప్పలేం, ఎవరో మన చేతుల్ని కట్టేసినట్టు అయిపోతుంది.—2 సమూయేలు 18:33.
3. అపొస్తలుల కార్యాలు 3:21 లో మన మనసుకు హాయినిచ్చే ఏ మాటలు ఉన్నాయి? యెహోవా ఆ మాటల్ని దేని ద్వారా నెరవేరుస్తాడు?
3 ఇలాంటప్పుడు, యెహోవాకున్న చక్కదిద్దే శక్తి గురించి తెలుసుకుంటే మనసుకు హాయిగా అనిపిస్తుంది! యెహోవా తన పిల్లలైన మనకోసం చక్కదిద్దబోయే విషయాలు చాలా ఉన్నాయి. వాటిని ఈ అధ్యాయంలో చూస్తాం. నిజానికి, యెహోవా ‘అన్నిటినీ చక్కదిద్దాలి’ అనుకుంటున్నాడని బైబిలు చెప్తుంది. (అపొస్తలుల కార్యాలు 3:21) యెహోవా వాటన్నిటినీ తన కుమారుడైన యేసుక్రీస్తు పరిపాలించే మెస్సీయ రాజ్యం ద్వారా సరిచేస్తాడు. ఆ రాజ్యం పరలోకంలో 1914 నుండి పరిపాలించడం మొదలుపెట్టిందని అనడానికి చాలా రుజువులున్నాయి.a (మత్తయి 24:3-14) ఇంతకీ ఆయన ఏమేం చక్కదిద్దబోతున్నాడు? ఆయన చక్కదిద్దబోయే కొన్ని అద్భుతమైన విషయాల గురించి ఇప్పుడు చూద్దాం. దానిలో ఒకటి, ఆయన ఇప్పటికే చేసేశాడు. ముందుముందు ఆయన భారీ స్థాయిలో చాలా చేయబోతున్నాడు.
స్వచ్ఛారాధనను గాడిలో పెట్టడం
4, 5. క్రీస్తు పూర్వం 607 లో దేవుని ప్రజలకు ఏం జరిగింది? యెహోవా వాళ్లకు ఏమని మాటిచ్చాడు?
4 యెహోవా ఇప్పటికే చక్కదిద్దిన ఒక విషయం, స్వచ్ఛారాధన. దానిగురించి ఎక్కువ తెలుసుకోవడానికి, మనం యూదా రాజుల చరిత్ర గురించి ఆలోచిద్దాం. అలా తెలుసుకుంటున్నప్పుడు, యెహోవాకున్న చక్కదిద్దే శక్తి గురించి ఎన్నో కొత్త విషయాల్ని మనం చూస్తాం.—రోమీయులు 15:4.
5 క్రీస్తు పూర్వం 607 లో యెరూషలేము నాశనమైనప్పుడు, నమ్మకమైన యూదులకు ఎలా అనిపించి ఉంటుందో ఊహించండి. వాళ్లకు ఎంతో ఇష్టమైన ఊరు వల్లకాడు అయింది, దాని గోడలు కూలిపోయాయి. అంతకన్నా ఘోరమైన విషయం ఏంటంటే, సొలొమోను కట్టించిన ఆలయం కూలిపోయింది, దాని వైభవమంతా మట్టిలో కలిసిపోయింది. స్వచ్ఛారాధనకు ఈ భూమి మొత్తంలో ఒకేఒక్క కేంద్రం అదే. (కీర్తన 79:1) యెరూషలేములో బ్రతికి బయటపడిన వాళ్లను బబులోనుకు బందీలుగా తీసుకెళ్లారు. వాళ్ల ఊరు మొత్తం, అడవి జంతువులు తిరిగే స్థలంగా మారింది. (యిర్మీయా 9:11) మనుషుల వైపు నుండి చూస్తే ఇక అంతా అయిపోయింది అనిపించింది. (కీర్తన 137:1) కానీ ఈ నాశనం గురించి చాలాకాలం క్రితం చెప్పిన యెహోవాయే, వాళ్లు పోగొట్టుకున్న ప్రతీదాన్ని అణాపైసలతో సహా తిరిగిస్తానని మాటిచ్చాడు.
6-8. (ఎ) హీబ్రూ ప్రవక్తలు ఏ విషయాన్ని మళ్లీమళ్లీ రాశారు? ఆ ప్రవచనాలు మొదట ఎలా నెరవేరాయి? (బి) అవి మన కాలంలో ఎలా నెరవేరాయి?
6 నిజానికి, అన్నిటినీ చక్కదిద్దడం గురించి హీబ్రూ ప్రవక్తలు పదేపదే రాశారు.b యెహోవా ఆ ప్రాంతాన్ని మళ్లీ బాగుచేస్తానని, మనుషులు అందులో ఉంటారని, భూమి మంచి పంటను ఇస్తుందని, వాళ్లను క్రూరమృగాల నుండి అలాగే శత్రువుల దాడుల నుండి కాపాడతానని ఆ ప్రవక్తల ద్వారా మాటిచ్చాడు. ఒక్కమాటలో చెప్పాలంటే, ఆ దేశమంతా అందమైన పరదైసులా మారుతుంది! (యెషయా 65:25; యెహెజ్కేలు 34:25; 36:35) కానీ అన్నిటికి మించి సత్యారాధన మళ్లీ మొదలౌతుందని, వాళ్లు ఆలయాన్ని తిరిగి కడతారని ఆయన చెప్పాడు. (మీకా 4:1-5) ఈ ప్రవచనాలు, బందీలుగా ఉన్న యూదులకు ఊపిరి పోశాయి. వాళ్లు బబులోనులో 70 ఏళ్ల బానిసత్వాన్ని సహించడానికి ఆ మాటలు ఎంతో సహాయం చేశాయి.
7 చివరికి, చక్కదిద్దే సమయం రానే వచ్చింది. బబులోనులో బందీలుగా ఉన్న యూదులు విడుదలై, యెరూషలేముకు తిరిగొచ్చి యెహోవా ఆలయాన్ని మళ్లీ కట్టారు. (ఎజ్రా 1:1, 2) స్వచ్ఛారాధనకు అంటిపెట్టుకుని ఉన్నంత కాలం యెహోవా వాళ్లను ఆశీర్వదించాడు, వాళ్ల భూములు పచ్చగా కళకళలాడాయి. యెహోవా వాళ్లను శత్రువుల నుండి, దాదాపు 70 ఏళ్లుగా అక్కడ తిరుగుతున్న క్రూరమృగాల నుండి కాపాడాడు. యెహోవాకున్న చక్కదిద్దే శక్తిని చూసి, వాళ్లు సంతోషంతో ఎగిరిగంతేసి ఉంటారు! కానీ యెహోవా చెప్పిన మాటలకు అది మొదటి నెరవేర్పు, చిన్న నెరవేర్పు మాత్రమే. అసలైన నెరవేర్పు ‘చివరి రోజుల్లో’ అంటే మన కాలంలో జరుగుతుంది. దేవుడు ఎప్పుడో మాటిచ్చిన దావీదు వారసుడు సింహాసనం మీద కూర్చున్నప్పుడు అది జరుగుతుంది.—యెషయా 2:2-4; 9:6, 7.
8 యేసు 1914 లో పరలోకంలో రాజైన కొంతకాలానికే, భూమ్మీదున్న దేవుని నమ్మకమైన ప్రజల ఆధ్యాత్మిక అవసరాల్ని తీర్చడం మొదలుపెట్టాడు. క్రీస్తు పూర్వం 537 లో పర్షియా రాజైన కోరెషు బబులోను నుండి యూదుల్ని విడిపించినట్టే, యేసు కూడా ప్రపంచ అబద్ధమత సామ్రాజ్యమైన “మహాబబులోను” గుప్పిట్లో నుండి తన అనుచరుల్ని విడిపించాడు. (ప్రకటన 18:1-5; రోమీయులు 2:29) స్వచ్ఛారాధన 1919 నుండి మళ్లీ గాడిలో పడింది. (మలాకీ 3:1-5) అప్పటినుండి, యెహోవా ప్రజలు శుద్ధీకరించిన ఆధ్యాత్మిక ఆలయంలో సేవచేస్తున్నారు. ఆధ్యాత్మిక ఆలయం అంటే స్వచ్ఛారాధన కోసం దేవుడు చేసిన ఏర్పాటు. ఇప్పుడు మనకు ఎందుకు అది ప్రాముఖ్యం?
ఆధ్యాత్మికంగా చక్కదిద్దడం—అది ఎందుకు ప్రాముఖ్యం?
9. అపొస్తలులు చనిపోయిన తర్వాత స్వచ్ఛారాధనకు ఏమైంది? కానీ మన కాలంలో యెహోవా ఏం చేశాడు?
9 ఒకసారి చరిత్రలోకి వెళ్తే, మొదటి శతాబ్దంలోని క్రైస్తవులు ఎన్నో ఆధ్యాత్మిక ఆశీర్వాదాల్ని అనుభవించారు. కానీ, సత్యారాధన కలుషితం అయిపోతుందని యేసు అలాగే అపొస్తలులు ముందే చెప్పారు. (మత్తయి 13:24-30; అపొస్తలుల కార్యాలు 20:29, 30) అపొస్తలులు చనిపోయిన తర్వాత క్రైస్తవ మత సామ్రాజ్యం పుట్టుకొచ్చింది. దాని నాయకులు అన్యమత బోధల్ని, ఆచారాల్ని వాళ్ల ఆరాధనలో కలుపుకున్నారు. ఉదాహరణకు, అర్థంపర్థంలేని త్రిత్వ సిద్ధాంతాన్ని బోధించారు, పాపాల్ని పాస్టర్ల ముందు ఒప్పుకోవాలని, ప్రార్థన కూడా యెహోవాకు కాకుండా మరియకు లేదా వేర్వేరు “పరిశుద్ధులకు” (సెయింట్లకు) చేయాలని చెప్పారు. అలా ప్రజలు దేవునికి దగ్గరవ్వకుండా వాళ్లు అడ్డుగోడ కట్టేశారు. కొన్ని వందల సంవత్సరాలు ఇదే నడుస్తూ వచ్చింది. మరి యెహోవా ఏం చేశాడు? అబద్ధ మత బోధలు, ఆచారాలు స్వచ్ఛారాధనను తొక్కేసి ఊపిరాడకుండా చేస్తుంటే యెహోవా రంగంలోకి దిగి, పడిపోయిన స్వచ్ఛారాధనను తిరిగి నిలబెట్టాడు! ఇదే మన కాలంలో జరిగిన అతి గొప్ప మార్పు అని చెప్పవచ్చు.
10, 11. (ఎ) ఆధ్యాత్మిక పరదైసులో ఏ రెండు విషయాలు ఉన్నాయి? మీరు దాంట్లో ఉండాలంటే ఏం చేయాలి? (బి) ఆధ్యాత్మిక పరదైసులోకి యెహోవా ఎలాంటివాళ్లను తెచ్చాడు? వాళ్లకు ఏ గొప్ప అవకాశం దొరుకుతుంది?
10 యెహోవా అలా చేయడం వల్ల, ఇప్పుడు నిజ క్రైస్తవులు ఆధ్యాత్మిక పరదైసులో హాయిగా ఉంటున్నారు. ఆ పరదైసు రోజురోజుకీ ఇంకా అందంగా తయారౌతుంది. ఇంతకీ ఆ పరదైసులో ఏమేం ఉన్నాయి? ముఖ్యంగా, రెండు విషయాలు ఉన్నాయి. మొదటిది, నిజ దేవుడైన యెహోవాకు చేసే స్వచ్ఛమైన ఆరాధన. ఎలాంటి అబద్ధాలు, మాయమాటలు లేకుండా స్వచ్ఛంగా తనను ఆరాధించే వరాన్ని ఆయన మనకు ఇచ్చాడు. ఆయన మనకు ఆధ్యాత్మిక ఆహారాన్ని కూడా ఇస్తున్నాడు. దీనివల్ల మన పరలోక తండ్రైన యెహోవా గురించి తెలుసుకోగలుగుతాం, ఆయన్ని సంతోషపెట్టగలుగుతాం, ఆయనకు ఇంకా దగ్గరవ్వగలుగుతాం. (యోహాను 4:24) ఆధ్యాత్మిక పరదైసులో ఉండే రెండో విషయం, ప్రజలు. యెషయా ముందే చెప్పినట్లు, “రోజుల చివర్లో” తన ఆరాధకులు ఎలా శాంతిగా ఉండాలో యెహోవా నేర్పిస్తున్నాడు. ఆయన యుద్ధాలు చేయకూడదని చెప్తున్నాడు. లోపాలు ఉన్నప్పటికీ “కొత్త వ్యక్తిత్వాన్ని” ధరించుకోవడానికి ఆయన మనకు సహాయం చేస్తున్నాడు. ఆయన మన కృషికి తోడుగా పవిత్రశక్తిని ఇచ్చి, అందమైన లక్షణాల్ని పుట్టిస్తున్నాడు. (ఎఫెసీయులు 4:22-24; గలతీయులు 5:22, 23) మీరు ఎప్పుడైతే ఆయన పవిత్రశక్తికి తగ్గట్టు పని చేస్తారో, అప్పుడు నిజంగా ఆధ్యాత్మిక పరదైసులో భాగమౌతారు.
11 యెహోవా ఆ ఆధ్యాత్మిక పరదైసులోకి తనకు ఇష్టమైనవాళ్లను తీసుకొచ్చాడు. వాళ్లు ఎవరంటే: తనను ప్రేమించేవాళ్లు, శాంతిని ప్రేమించేవాళ్లు, “దేవుని నిర్దేశం తమకు అవసరమని గుర్తించేవాళ్లు.” (మత్తయి 5:3) ఇలాంటివాళ్లకు ఇంకా గొప్ప అద్భుతాన్ని చూసే అవకాశం దొరుకుతుంది. అదేంటంటే యెహోవా మనుషుల్ని, భూమంతటినీ చక్కదిద్దడం.
“ఇదిగో! నేను అన్నిటినీ కొత్తవిగా చేస్తున్నాను”
12, 13. (ఎ) అన్నిటినీ కొత్తవిగా చేస్తానని యెహోవా చెప్పిన ప్రవచనాలు, అక్షరార్థంగా కూడా నెరవేరతాయని ఎందుకు చెప్పవచ్చు? (బి) ఏదెనులో చెప్పినట్టు భూమి విషయంలో యెహోవా ఆలోచన ఏంటి? అది మనకు భవిష్యత్తు మీద ఎలాంటి ఆశను ఇస్తుంది?
12 పైన చెప్పిన చాలా ప్రవచనాల్ని యెహోవా అక్షరార్థంగా కూడా నెరవేరుస్తాడు. ఉదాహరణకు, దేవుడు జబ్బు పడినవాళ్లను, కుంటివాళ్లను, గుడ్డివాళ్లను, చెవిటివాళ్లను బాగుచేస్తాడని, ఆఖరికి మరణాన్ని కూడా శాశ్వతంగా మింగేస్తాడని యెషయా రాశాడు. (యెషయా 25:8; 35:1-7) ప్రాచీన ఇశ్రాయేలీయుల విషయంలో అవి అక్షరార్థంగా జరగలేదు. కానీ, మన కాలంలో అవి ఆధ్యాత్మికంగా నెరవేరడం మనం చూశాం. కాబట్టి అవి భవిష్యత్తులో పూర్తిస్థాయిలో అక్షరాలా నిజమౌతాయని మనం నమ్మవచ్చు. అదెలా?
13 ఏదెను తోటలో ఉన్నప్పుడే, భూమి విషయంలో తన ఆలోచన ఏంటో యెహోవా స్పష్టంగా చెప్పాడు: ఈ భూమ్మీద మనుషులంతా సంతోషంగా, ఆరోగ్యంగా, ఐక్యంగా ఉండాలని ఆయన కోరుకున్నాడు. ఆదాముహవ్వలు భూమిని, దాని మీదున్న ప్రాణులన్నిటినీ జాగ్రత్తగా చూసుకుంటూ భూమి మొత్తాన్ని పరదైసుగా మార్చాలి. (ఆదికాండం 1:28) కానీ ఇప్పుడున్న భూమి యెహోవా అనుకున్న దానికి చాలా వేరుగా ఉంది. అయినప్పటికీ యెహోవా అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది, అందులో ఏ ఢోకా లేదు. (యెషయా 55:10, 11) యెహోవా నియమించిన యేసు, తన మెస్సీయ రాజ్యం ద్వారా భూపరదైసును తీసుకురాబోతున్నాడు.—లూకా 23:43.
14, 15. (ఎ) యెహోవా ఎలా “అన్నిటినీ కొత్తవిగా” చేస్తాడు? (బి) పరదైసులో జీవితం ఎలా ఉంటుంది? వాటిలో మీకు ఏది బాగా నచ్చింది?
14 ఈ భూమి మొత్తం అందమైన పరదైసులా మారితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి! ఆ సమయం గురించి యెహోవా ఇలా చెప్పాడు: “ఇదిగో! నేను అన్నిటినీ కొత్తవిగా చేస్తున్నాను.” (ప్రకటన 21:5) ఇంతకీ ఆ మాటలకు అర్థమేంటి? యెహోవా ఈ చెడ్డ వ్యవస్థను పూర్తిగా నాశనం చేసేసిన తర్వాత “కొత్త ఆకాశం, కొత్త భూమి” ఉంటాయి. కొత్త ఆకాశం అంటే పరలోకం నుండి పరిపాలించే ఒక కొత్త ప్రభుత్వం, కొత్త భూమి అంటే భూమ్మీద యెహోవాను ప్రేమిస్తూ ఆయన ఇష్టం చేసే ప్రజలు. (2 పేతురు 3:13) సాతాను, అతని చెడ్డదూతలు ఇక ఏమీ చేయలేరు. (ప్రకటన 20:3) ఇన్ని వేల సంవత్సరాల్లో మొట్టమొదటిసారిగా, మనుషులకు పట్టిన ఆ తుప్పు, చెద, పీడ వదిలిపోతాయి. ఆరోజు ఎంత ప్రశాంతంగా, హాయిగా ఉంటుందో కదా!
15 చివరికి, దేవుడు మొదట కోరుకున్నట్లు మనందరం ఈ అందమైన భూమిని జాగ్రత్తగా చూసుకుంటాం. భూమికి సహజంగానే, దానికి అదే రిపేరు చేసుకునే శక్తి ఉంది. మనుషులు కలుషితం చేయడం ఆపేసినప్పుడు సరస్సులు, నదులు వాటంతట అవే శుభ్రమౌతాయి. యుద్ధాలు ఆగిపోయినప్పుడు, రక్తంతో ఎరుపెక్కిన భూమి పచ్చగా మారి కళకళలాడుతుంది. రకరకాల మొక్కలు, జంతువులు ఉన్న పార్కులా ఈ భూమంతటినీ మార్చడం ఎంత బాగుంటుందో కదా! అక్కడ అందరూ ప్రకృతిని ప్రేమించేవాళ్లే ఉంటారు కాబట్టి జంతువులకు, మొక్కలకు ఏ హానీ జరగదు. ఆఖరికి చిన్నపిల్లలు కూడా క్రూరమృగాలకు భయపడరు.—యెషయా 9:6, 7; 11:1-9.
16. పరదైసులో యెహోవా మిమ్మల్ని ఎలా కొత్తగా చేస్తాడు?
16 యెహోవా మనల్ని కూడా కొత్తగా చేస్తాడు. హార్‌మెగిద్దోన్ దాటినవాళ్లు, ప్రపంచవ్యాప్తంగా అందరూ అద్భుతరీతిలో బాగవ్వడం చూస్తారు. యేసు భూమ్మీద ఉన్నప్పుడు చేసినట్టే అప్పుడు కూడా, దేవుడు ఇచ్చిన శక్తితో గుడ్డివాళ్లకు చూపును, చెవిటివాళ్లకు వినికిడిని, కుంటివాళ్లకు, లేవలేనివాళ్లకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు. (మత్తయి 15:30) ముసలివాళ్లకు యౌవనంలో ఉన్న శక్తి, ఆరోగ్యం, బలం వస్తాయి. (యోబు 33:25) ముడతలు పోయి చర్మం కోమలంగా అవుతుంది, కాళ్లూచేతులకు శక్తి వస్తుంది, కండరాలు బలంగా అవుతాయి. నమ్మకంగా ఉన్న మనుషులందరూ వాళ్లలో నుండి పాపం, అపరిపూర్ణత మెల్లమెల్లగా పోవడం గమనిస్తారు. యెహోవాకున్న ఈ గొప్ప చక్కదిద్దే శక్తిని బట్టి, ఆయనకు థ్యాంక్స్ చెప్పకుండా ఉండలేం! ఆ సమయంలో యెహోవా చక్కదిద్దే ఒక విషయం గురించి ఇప్పుడు చూద్దాం. అది మన మనసును తాకుతుంది.
చనిపోయినవాళ్లకు ప్రాణం పోయడం
17, 18. (ఎ) యేసు సద్దూకయ్యుల్ని ఎందుకు గద్దించాడు? (బి) పునరుత్థానం చేయమని ఏలీయా ఏ పరిస్థితుల్లో యెహోవాను అడిగాడు?
17 క్రీస్తు శకం మొదటి శతాబ్దంలో, సద్దూకయ్యులు అనే మత నాయకులు పునరుత్థానాన్ని నమ్మలేదు. యేసు వాళ్లను ఇలా గద్దించాడు: “మీకు లేఖనాలూ తెలియవు, దేవుని శక్తీ తెలీదు. అందుకే మీరు పొరబడుతున్నారు.” (మత్తయి 22:29) అవును, యెహోవాకు చనిపోయినవాళ్లను తిరిగిలేపే శక్తి ఉందని లేఖనాలు చెప్తున్నాయి. అదెలా?
18 ఏలీయా రోజుల్లో ఏం జరిగిందో ఒకసారి ఊహించుకోండి. ఒక విధవరాలు, ఉలుకు-పలుకు లేకుండా పడివున్న తన ఒక్కగానొక్క బాబును చేతిలో పట్టుకుని ఉంది. ఆ బాబు చనిపోయాడు. కొంతకాలంగా వాళ్ల ఇంట్లో అతిథిగా ఉంటున్న ఏలీయా ప్రవక్తకు, అది చూసి గుండెలో పిడుగు పడినట్టు అనిపించివుంటుంది. ఇంతకుముందు ఆ బాబు ఆకలితో చనిపోకుండా ఏలీయా కాపాడాడు. ఏలీయాకు, ఆ బుడ్డోడికి మంచి చనువు ఉండి ఉంటుంది. పిల్లాడు చనిపోవడం చూసి ఆ తల్లి గుండె బద్దలైంది. భర్త చనిపోయాక, అతని జ్ఞాపకంగా ఆమెకు మిగిలిందల్లా ఆ పిల్లాడే. ముసలితనంలో ఆ పిల్లాడు తనను చూసుకుంటాడని ఆమె కోటి ఆశలతో ఉండి ఉంటుంది. బాధలో ఉన్న ఆమె, తను ఏదో తప్పు చేయడం వల్లే ఇలా శిక్ష అనుభవిస్తున్నానేమో అని భయపడింది. ఇన్ని ఆలోచనలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఆమెను చూసి ఏలీయా తట్టుకోలేకపోయాడు. ఆమె చేతుల్లో నుండి బిడ్డను జాగ్రత్తగా తీసుకుని తన గదిలోకి వెళ్లాడు. అక్కడ ఆయన ఆ పిల్లాడికి తిరిగి ప్రాణం పోయమని యెహోవాకు ప్రార్థించాడు.—1 రాజులు 17:8-21.
19, 20. (ఎ) యెహోవా దేన్నైనా వెనక్కి తీసుకురాగలడని నమ్ముతున్నట్లు అబ్రాహాము ఎలా చూపించాడు? ఎందుకు? (బి) ఏలీయా విశ్వాసాన్ని యెహోవా ఎలా దీవించాడు?
19 పునరుత్థానాన్ని నమ్మిన మొట్టమొదటి వ్యక్తి ఏలీయా కాదు. దానికన్నా కొన్ని వందల సంవత్సరాల క్రితమే, చనిపోయినవాళ్లను యెహోవా తిరిగి లేపగలడని అబ్రాహాము నమ్మాడు. ఎందుకు? అబ్రాహాముకు 100 ఏళ్లు, శారాకు 90 ఏళ్లు ఉన్నప్పుడు అద్భుతరీతిలో వాళ్లకు పిల్లల్ని కనే సామర్థ్యాన్ని యెహోవా ఇచ్చాడు. (ఆదికాండం 17:17; 21:2, 3) వాళ్ల బాబు పెరిగి పెద్దయిన తర్వాత, అతన్ని బలిగా ఇవ్వమని యెహోవా అడిగాడు. తను ఎంతో ఇష్టపడిన ఇస్సాకును యెహోవా తిరిగి బ్రతికించగలడని అబ్రాహాము నమ్మాడు. (హెబ్రీయులు 11:17-19) ఆ అపారమైన విశ్వాసం వల్లే, అబ్రాహాము తన కొడుకును బలిగా ఇవ్వడానికి పర్వతం ఎక్కే ముందు తన సేవకులతో ధైర్యంగా ఇలా అన్నాడు: ‘నేనూ, అబ్బాయి అక్కడికి వెళ్లి, మీ దగ్గరికి తిరిగొస్తాం.’—ఆదికాండం 22:5.
“ఇదిగో, నీ కుమారుడు బ్రతికాడు”!
20 అబ్రాహాము ఇస్సాకును బలిగా అర్పించబోతుంటే యెహోవా వద్దని ఆపాడు. కాబట్టి అక్కడ పునరుత్థానం చేయాల్సిన అవసరం రాలేదు. కానీ ఇక్కడ ఏలీయా విషయానికొస్తే, ఆ విధవరాలి కొడుకు అప్పటికే చనిపోయాడు. ఎంతోసేపు గడవకముందే, యెహోవా ఏలీయా విశ్వాసాన్ని మెచ్చి ఆ బాబును తిరిగి లేపాడు! ఏలీయా ఆ బాబును తీసుకుని తల్లి చేతిలో పెడుతూ, “ఇదిగో, నీ కుమారుడు బ్రతికాడు” అన్నాడు. ఆ మాటల్ని ఆమె ఎప్పటికీ మర్చిపోయి ఉండదు!—1 రాజులు 17:22-24.
21, 22. (ఎ) బైబిల్లో పునరుత్థానాల గురించి రాయడానికి గల ఉద్దేశం ఏంటి? (బి) పరదైసులో పునరుత్థానం ఏ స్థాయిలో జరుగుతుంది? దాన్ని ఎవరు చేస్తారు?
21 అలా బైబిలు చరిత్రలోనే మొట్టమొదటిసారిగా, యెహోవా తన శక్తిని ఉపయోగించి చనిపోయిన వ్యక్తికి ఊపిరి పోశాడు. తర్వాత ఆయన ఎలీషాకు, యేసుకు, పౌలుకు, పేతురుకు కూడా చనిపోయినవాళ్లను తిరిగిలేపే శక్తిని ఇచ్చాడు. నిజమే, అలా పునరుత్థానమైన వాళ్లు కొంతకాలం తర్వాత మళ్లీ చనిపోయారు. కానీ, ఇవన్నీ భవిష్యత్తులో జరగబోయే అద్భుతమైన వాటికి ఒక శాంపిల్ మాత్రమే.
22 పరదైసులో యేసే ‘పునరుత్థానం, జీవం’ అవుతాడు. (యోహాను 11:25, అధస్సూచి) ఆయన భూమ్మీద కొన్ని కోట్ల మందిని పునరుత్థానం చేసి, వాళ్లకు పరదైసు భూమ్మీద ఎప్పటికీ జీవించే అవకాశం ఇస్తాడు. (యోహాను 5:28, 29) ఒక్కసారి ఆలోచించండి, ఎప్పుడో కళ్లు మూసిన మన స్నేహితులు-బంధువులు మన కళ్ల ముందుకు వచ్చి నిలబడతారు, మనల్ని హత్తుకుంటారు, పరదైసు అంతటా నవ్వుల పువ్వులు పూస్తాయి! అప్పుడు మనుషులంతా యెహోవాకున్న చక్కదిద్దే శక్తిని స్తుతిస్తారు.
23. యెహోవా తన శక్తిని తిరుగులేని విధంగా ఎలా చూపించాడు? అది భవిష్యత్తు గురించి ఏ గ్యారంటీ ఇస్తుంది?
23 అవన్నీ అక్షరాలా నిజమౌతాయి అనడానికి యెహోవా గట్టి గ్యారంటీ ఇచ్చాడు. అదేంటంటే, ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తును దేవదూతలందరికన్నా శక్తిమంతుడిగా పునరుత్థానం చేసి, తన తర్వాత తనంతటి వాడిని చేశాడు. అలా యెహోవా తన శక్తిని తిరుగులేని విధంగా చూపించాడు. పునరుత్థానమైన యేసును కొన్ని వందల కళ్లు చూశాయి. (1 కొరింథీయులు 15:5, 6) వ్యతిరేకులు కూడా దాన్ని చచ్చినట్టు ఒప్పుకోవాల్సిందే, ఎందుకంటే రుజువులు అలా ఉన్నాయి మరి. అవును, పోయిన ప్రాణాన్ని యెహోవా తిరిగి ఇవ్వగలడు.
24. యెహోవా చనిపోయినవాళ్లను పునరుత్థానం చేస్తాడని మనం ఎందుకు గట్టి నమ్మకంతో ఉండవచ్చు? మనందరికీ ఏ అమూల్యమైన నిరీక్షణ ఉంది?
24 యెహోవాకు చనిపోయినవాళ్లను తిరిగిలేపే శక్తే కాదు, అలా చేయాలనే కోరిక కూడా ఉంది. నిజానికి, చనిపోయినవాళ్లను చూడాలని యెహోవా ఎంతో కోరుకుంటున్నాడని యోబు పవిత్రశక్తి ప్రేరణతో అన్నాడు. (యోబు 14:15) అంత ప్రేమగా తన శక్తిని ఉపయోగించాలని తపిస్తున్న దేవునికి మీరు దగ్గరవ్వాలని అనుకోవట్లేదా? కానీ గుర్తుపెట్టుకోండి, యెహోవా చక్కదిద్దే వాటిలో పునరుత్థానం అనేది ఒక్క విషయం మాత్రమే. యెహోవా “అన్నిటినీ కొత్తవిగా” చేస్తున్నప్పుడు మీరూ అక్కడ ఉండవచ్చు. అప్పటివరకు, యెహోవాకు దగ్గరౌతూ ఆ అమూల్యమైన నిరీక్షణను కాపాడుకోండి.—ప్రకటన 21:5.
a “అన్నిటినీ చక్కదిద్దే సమయాలు,” మెస్సీయ రాజ్యం స్థాపించబడి, రాజైన దావీదు వారసుడు సింహాసనం మీద కూర్చున్నప్పుడు మొదలయ్యాయి. దావీదు వారసుడు ఎప్పటికీ పరిపాలిస్తాడని యెహోవా ముందే మాటిచ్చాడు. (కీర్తన 89:35-37) కానీ క్రీస్తు పూర్వం 607 లో బబులోను యెరూషలేమును నాశనం చేసిన తర్వాత, దావీదు వంశస్థులు ఎవరూ దేవుని సింహాసనం మీద కూర్చోలేదు. ఈ భూమ్మీద దావీదు వారసుడిగా పుట్టిన యేసు, పరలోకంలో సింహాసనం మీద కూర్చున్నాడు. అప్పుడాయన, బైబిలు చాలాకాలం క్రితం వాగ్దానం చేసిన రాజు అయ్యాడు.
b ఉదాహరణకు మోషే, యెషయా, యిర్మీయా, యెహెజ్కేలు, హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్యా, మీకా, జెఫన్యా వీళ్లంతా దీని గురించి రాశారు.