అధ్యాయం 6
నాశనం చేసే శక్తి—“యెహోవా బలమైన యోధుడు”
1-3. (ఎ) ఇశ్రాయేలీయులకు ఐగుప్తీయుల చేతుల్లో ఎలాంటి ప్రమాదం పొంచివుంది? (బి) యెహోవా తన ప్రజల తరఫున ఎలా పోరాడాడు?
ఇశ్రాయేలీయులు చిక్కుకుపోయారు! అటుపక్క ఇటుపక్క ఎత్తైన పర్వత శిఖరాలు ఉన్నాయి, ముందుకు వెళ్లడానికేమో ఒక పెద్ద సముద్రం అడ్డుంది. వెనకేమో ఐగుప్తీయుల సైన్యం వాళ్లను చంపేయాలని తరుముకుంటూ వస్తుంది.a అయినా, ఆశలు వదిలేసుకోవద్దు అని మోషే దేవుని ప్రజల్ని ప్రోత్సహించాడు. “యెహోవాయే మీ తరఫున పోరాడతాడు” అని వాళ్లకు ధైర్యం చెప్పాడు.—నిర్గమకాండం 14:14.
2 అయితే, మోషే బహుశా యెహోవాకు మొరపెట్టాడు. అప్పుడు యెహోవా, “నువ్వెందుకు నాకు మొరపెడుతూ ఉన్నావు? . . . నువ్వైతే నీ కర్ర పైకెత్తి, సముద్రం మీద నీ చెయ్యి చాపి దాన్ని రెండు పాయలుగా చేయి” అన్నాడు. (నిర్గమకాండం 14:15, 16) అప్పుడు వరుసగా జరిగిన సంఘటనల్ని ఊహించుకోండి. యెహోవా వెంటనే తన దేవదూతతో ఇశ్రాయేలీయుల వెనక్కి వెళ్లమని చెప్పాడు. మేఘస్తంభం కూడా ఇశ్రాయేలీయుల వెనక్కి వెళ్లి నిలబడింది. బహుశా అది ఒక గోడలా పరుచుకుని, ఐగుప్తీయులు వాళ్లమీద దాడి చేయకుండా అడ్డుగా నిలబడి ఉండవచ్చు. (నిర్గమకాండం 14:19, 20; కీర్తన 105:39) మోషే చెయ్యి చాపాడు. బలమైన గాలి వల్ల సముద్రం రెండు పాయలైపోయింది. ఎలాగో తెలీదు కానీ, ఆ నీళ్లు గడ్డకట్టుకుపోయి గోడల్లా నిలిచిపోయాయి. అలా, ఒక పెద్ద జనాంగం నడుచుకుంటూ వెళ్లేంత వెడల్పాటి దారి ఏర్పడింది!—నిర్గమకాండం 14:21; 15:8.
3 అంత అద్భుతం చూశాకైనా, ఫరో మనసు మార్చుకుని తన సైన్యాలతో ఇంటికి వెళ్లిపోతే బాగుండేది. కానీ, ఆ పొగరుబోతు ఫరో ఇశ్రాయేలీయుల మీద దాడి చేయమని ఆజ్ఞాపించాడు. (నిర్గమకాండం 14:23) దాంతో ఐగుప్తీయులు వాళ్లను తరుముకుంటూ నడి సముద్రంలోకి వెళ్లారు. వాళ్ల యుద్ధ కేకలు కాస్తా చావు కేకలుగా మారాయి. ఎందుకంటే, నడి సముద్రంలో వాళ్ల రథాల చక్రాలు ఊడిపోవడం మొదలైంది. ఇశ్రాయేలీయులు ఒడ్డుకు చేరుకోగానే యెహోవా మోషేకు, “ఆ ఐగుప్తీయుల మీదికి, వాళ్ల యుద్ధ రథాల మీదికి, వాళ్ల అశ్వదళం మీదికి నీళ్లు తిరిగి వచ్చేలా నీ చేతిని సముద్రం మీద చాపు” అని ఆజ్ఞాపించాడు. గోడల్లా నిలిచిపోయిన నీళ్లు ఒక్కసారిగా విరుచుకుపడడంతో ఫరో, ఆయన సైన్యాలు జలసమాధి అయిపోయారు!—నిర్గమకాండం 14:24-28; కీర్తన 136:15.
4. (ఎ) ఎర్ర సముద్రం దగ్గర యెహోవా ఏం రుజువు చేసుకున్నాడు? (బి) యెహోవాను యోధునిలా ఊహించుకున్నప్పుడు కొంతమందికి ఎలా అనిపిస్తుంది?
4 ఎర్ర సముద్రం దగ్గర యెహోవా ఇశ్రాయేలీయుల్ని విడిపించడం, నిజంగా చరిత్రలోనే మర్చిపోలేని సంఘటన. అక్కడ యెహోవా ‘బలమైన యోధుడని’ నిరూపించుకున్నాడు. (నిర్గమకాండం 15:3) యెహోవాను అలా ఊహించుకున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? నిజం చెప్పాలంటే యుద్ధం, యోధుడు అనగానే మనకు గుర్తొచ్చేది అది మిగిల్చే గాయాలు, బాధ మాత్రమే. కాబట్టి దేవుడు నాశనం చేసే శక్తిని ఉపయోగిస్తాడంటే, ఆయనకు దగ్గరయ్యే బదులు దూరం అవుతామేమో అని మీరు అనుకోవచ్చు.
ఎర్ర సముద్రం దగ్గర యెహోవా ఒక ‘బలమైన యోధునిలా’ నిరూపించుకున్నాడు
దేవుని యుద్ధాలకు, మనుషుల యుద్ధాలకు తేడా
5, 6. (ఎ) “సైన్యాలకు అధిపతైన యెహోవా” అనే బిరుదు ఎందుకు సరైనది? (బి) దేవుడు చేసే యుద్ధాలకు, మనుషులు చేసే యుద్ధాలకు తేడా ఏంటి?
5 “సైన్యాలకు అధిపతైన యెహోవా” అనే బిరుదు హీబ్రూ లేఖనాల్లో దాదాపు 260 సార్లు, క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో రెండుసార్లు కనిపిస్తుంది. (1 సమూయేలు 1:11) సర్వాధిపతిగా యెహోవా కింద దేవదూతల పెద్ద సైన్యమే ఉంది. (యెహోషువ 5:13-15; 1 రాజులు 22:19) ఆ సైన్యానికి ఉన్న నాశనం చేసే శక్తి అంతా ఇంతా కాదు. (యెషయా 37:36) నిజమే, మనుషుల్ని నాశనం చేయడమంటే అది వినడానికి కాస్త కష్టంగానే ఉంటుంది. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దేవుడు చేసే యుద్ధాలు మనుషులు చేసే అర్థంపర్థంలేని యుద్ధాల్లాంటివి కావు. మిలిటరీ వాళ్లు, రాజకీయ నాయకులు యుద్ధాలు చేస్తూ వాటికి పవిత్రమైన ఉద్దేశాలు అంటగడతారు. కానీ ఎప్పుడైనా మనుషులు చేసే యుద్ధాల వెనక ఉండేది అత్యాశ, స్వార్థమే.
6 మరోవైపు, యెహోవా ఏదో గుడ్డిగా యుద్ధాలు చేసుకుంటూపోయే వ్యక్తి కాదు. ద్వితీయోపదేశకాండం 32:4 ఇలా చెప్తుంది: “ఆయన ఆశ్రయదుర్గం, ఆయన కార్యం పరిపూర్ణం, ఆయన మార్గాలన్నీ న్యాయమైనవి. ఆయన నమ్మకమైన దేవుడు, ఆయన ఎన్నడూ అన్యాయం చేయడు; ఆయన నీతిమంతుడు, నిజాయితీపరుడు.” విపరీతమైన కోపం, క్రూరత్వం, హింస తప్పు అని బైబిలు చెప్తుంది. (ఆదికాండం 49:7; కీర్తన 11:5) కాబట్టి యెహోవా కారణం లేకుండా ఏదీ చేయడు. ఆయన తనకున్న నాశనం చేసే శక్తిని అవసరమైనప్పుడు మాత్రమే, అది కూడా ఇక ఏ దారీ లేదు అనుకున్నప్పుడు మాత్రమే ఉపయోగిస్తాడు. ఆయన యెహెజ్కేలు ప్రవక్తకు ఏం చెప్పాడో గమనించండి: “‘దుష్టుడు చనిపోవడం వల్ల నాకేమైనా సంతోషమా?’ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా అడుగుతున్నాడు. ‘అతను తన మార్గాల నుండి పక్కకుమళ్లి, బ్రతకడమే నాకు ఇష్టం.’”—యెహెజ్కేలు 18:23.
7, 8. (ఎ) యోబు తన కష్టాలకు కారణం ఎవరని అనుకున్నాడు? (బి) యోబు ఆలోచనను ఎలీహు ఎలా సరిదిద్దాడు? (సి) యోబు నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?
7 మరి అలాంటప్పుడు, యెహోవా నాశనం చేసే శక్తిని ఎందుకు ఉపయోగిస్తాడు? ఆ ప్రశ్నకు జవాబు చూసేముందు, నీతిమంతుడైన యోబు ఉదాహరణను గుర్తు తెచ్చుకుందాం. కష్టాలు వచ్చినప్పుడు యోబు గానీ, ఆ మాటకొస్తే ఏ మనిషైనా గానీ యథార్థంగా ఉంటాడా అని సాతాను ప్రశ్న లేవదీశాడు. దానికి జవాబివ్వడం కోసం, సాతాను యోబును పరీక్షించేలా యెహోవా ఒప్పుకున్నాడు. దానివల్ల యోబు ఆరోగ్యం పాడైంది, ఆస్తి పోయింది, ఆఖరికి తన పిల్లలు కూడా చనిపోయారు. (యోబు 1:1–2:8) అసలు ఏం జరుగుతుందో తెలియని యోబు, దేవుడే తనను అన్యాయంగా శిక్షిస్తున్నాడని అనుకున్నాడు. అంతేకాదు, దేవుడు తనను ఎందుకు “గురిగా” చేసుకున్నాడు, ఎందుకు “శత్రువులా” చూస్తున్నాడు అని అడిగాడు.—యోబు 7:20; 13:24.
8 యోబు మాటల్లో తప్పేంటో ఎలీహు అనే యువకుడు బయటపెట్టాడు. అతను ఇలా అన్నాడు: “నువ్వు నిర్దోషివని నీకు అంత నమ్మకమా? ‘నేను దేవుని కన్నా నీతిమంతుణ్ణి’ అని అంటావా?” (యోబు 35:2) అవును, దేవునికన్నా మనకే ఎక్కువ తెలుసని లేదా ఆయన అన్యాయం చేశాడని అనుకోవడం తెలివితక్కువతనం. ఎలీహు ఇలా అన్నాడు: “సత్యదేవుడు చెడుగా ప్రవర్తించడం, సర్వశక్తిమంతుడు తప్పుచేయడం అసాధ్యం!” తర్వాత ఎలీహు ఇంకా ఇలా అన్నాడు: “సర్వశక్తిమంతుణ్ణి అర్థంచేసుకోవడం మన శక్తికి మించింది; ఆయన ఎంతో శక్తిమంతుడు, ఆయన అపారమైన నీతిని, న్యాయాన్ని ఎన్నడూ మీరడు.” (యోబు 34:10; 36:22, 23; 37:23) దీన్నిబట్టి దేవుడు ఎప్పుడైనా యుద్ధాలు చేశాడంటే, దానికి ఖచ్చితంగా మంచి కారణమే ఉంటుందని మనం నమ్మవచ్చు. దీన్ని మనసులో ఉంచుకుని, శాంతికి మూలమైన దేవుడు కొన్నిసార్లు బలమైన యోధునిలా ఎందుకు మారతాడో తెలిపే కొన్ని కారణాల్ని చూద్దాం.—1 కొరింథీయులు 14:33.
శాంతికి మూలమైన దేవుడు ఎందుకు యుద్ధం చేయాల్సి వస్తుంది?
9. పవిత్రుడైన దేవుడు ఎందుకు యుద్ధాలు చేస్తాడు?
9 దేవుణ్ణి “బలమైన యోధుడు” అని స్తుతించిన తర్వాత, మోషే ఇలా అన్నాడు: “యెహోవా, దేవుళ్లలో నీలాంటివాడు ఎవడు? సాటిలేని పవిత్రతను చూపే నీలాంటివాడు ఎవడు?” (నిర్గమకాండం 15:11) హబక్కూకు ప్రవక్త కూడా ఇలా రాశాడు: “నీ కళ్లు చెడును చూడలేనంత స్వచ్ఛమైనవి, నువ్వు దుష్టత్వాన్ని సహించలేవు.” (హబక్కూకు 1:13) యెహోవా ప్రేమగల దేవుడే, అయితే ఆయన పవిత్రత, నీతి, న్యాయం కలిగిన దేవుడు కూడా. కొన్నిసార్లు, ఆ లక్షణాల వల్లే ఆయన నాశనం చేసే శక్తిని ఉపయోగించాల్సి వస్తుంది. (యెషయా 59:15-19; లూకా 18:7) కాబట్టి యెహోవా యుద్ధాలు చేస్తున్నప్పుడు, ఆయన తన పవిత్రతకు మచ్చ తీసుకురావట్లేదు. కానీ ఆయన పవిత్రుడు కాబట్టే యుద్ధాలు చేస్తున్నాడు.—నిర్గమకాండం 39:30.
10. ఆదికాండం 3:15 లో చెప్పిన శత్రుత్వం ఎప్పుడు మాత్రమే ఆగుతుంది? దానివల్ల నీతిమంతులైన మనుషులకు ఎలాంటి ప్రయోజనాలు వస్తాయి?
10 మొదటి మానవ జంట అయిన ఆదాము, హవ్వ దేవుని మీద తిరగబడిన తర్వాత ఏం జరిగిందో ఆలోచించండి. (ఆదికాండం 3:1-6) యెహోవా వాళ్ల అవినీతిని చూసీచూడనట్టు వదిలేసి ఉంటే, ఆయన విశ్వసర్వాధిపతిగా ఒక మెట్టు కిందకు దిగినట్టే. ఆయన నీతిగల దేవుడు కాబట్టి, వాళ్లకు మరణశిక్ష వేయాల్సిన బాధ్యత ఆయనకు ఉంటుంది. (రోమీయులు 6:23) మొట్టమొదటి బైబిలు ప్రవచనంలో తన సేవకులకు, అలాగే “సర్ప” సంతానానికి అంటే సాతానును అనుసరించేవాళ్లకు మధ్య శత్రుత్వం ఉంటుందని ఆయన ముందే చెప్పాడు. (ప్రకటన 12:9; ఆదికాండం 3:15) ఆ శత్రుత్వం ఎప్పుడు పోతుందంటే, సాతాను తలను చితక్కొట్టినప్పుడు మాత్రమే. (రోమీయులు 16:20) దానివల్ల నీతిమంతులైన మనుషులకు మెండైన దీవెనలు వస్తాయి, భూమికి పట్టిన సాతాను పీడ విరగడైపోతుంది, భూమంతా పరదైసుగా మారడానికి దారి తెరుచుకుంటుంది. (మత్తయి 19:28) అయితే, అప్పటివరకు సాతానుతో చేతులు కలిపినవాళ్లు దేవుని ప్రజలకు భౌతికంగా, ఆధ్యాత్మికంగా హాని చేయడానికి చూస్తూనే ఉంటారు. అందుకే, అప్పుడప్పుడు యెహోవా తన ప్రజల్ని కాపాడడానికి పోరాడాల్సి వచ్చింది.
చెడుతనాన్ని తీసేయడానికి దేవుడు రంగంలోకి దిగాడు
11. దేవుడు భూమంతటా ఒక జలప్రళయాన్ని ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది?
11 యెహోవా అలా రంగంలోకి దిగిన ఒక సందర్భం, నోవహు కాలంలో వచ్చిన జలప్రళయం. ఆదికాండం 6:11, 12 ఇలా చెప్తుంది: “సత్యదేవుని దృష్టిలో భూమి పాడైపోయింది, అది దౌర్జన్యంతో నిండిపోయింది. అవును, దేవుడు భూమిని చూసినప్పుడు అది పాడైపోయి ఉంది; భూమ్మీద ఉన్న ప్రజలందరూ చాలా చెడిపోయారు.” భూమ్మీద మిగిలివున్న కాస్త మంచితనాన్ని కూడా చెడ్డవాళ్లు ఊదిపారేస్తే దేవుడు ఊరుకుంటాడా? లేదు. హింసించేవాళ్లను, తప్పుడు పనులు చేసేవాళ్లను భూమ్మీద నుండి కడిగి పారేయడానికే యెహోవా ఒక జలప్రళయాన్ని తీసుకురావాల్సి వచ్చింది.
12. (ఎ) అబ్రాహాము “సంతానం” గురించి యెహోవా ముందే ఏం చెప్పాడు? (బి) యెహోవా అమోరీయుల్ని ఎందుకు నాశనం చేయాల్సి వచ్చింది?
12 ఇంకో ఉదాహరణ, కనానీయులది. అబ్రాహాము సంతానం వల్ల భూమ్మీద ఉన్న కుటుంబాలన్నీ దీవెన సంపాదించుకుంటాయి అని యెహోవా చెప్పాడు. ఆ సంకల్పంలో భాగంగా, అబ్రాహాము వంశస్థులకు కనాను దేశం ఇస్తానని యెహోవా చెప్పాడు. అప్పట్లో, ఆ దేశంలో అమోరీయులు అనే ప్రజలు ఉండేవాళ్లు. మరి వాళ్లను వాళ్ల దేశం నుండి వెళ్లగొట్టడం అన్యాయం కాదా? ‘అమోరీయుల పాపం సంపూర్ణమయ్యే’ వరకు, అంటే దాదాపు 400 ఏళ్ల వరకు వాళ్లను వెళ్లగొట్టనని యెహోవా ముందే చెప్పాడు.b (ఆదికాండం 12:1-3; 13:14, 15; 15:13, 16; 22:18) ఆ సమయంలో, అమోరీయులు పీకల్లోతు వరకు తప్పుడు పనుల్లో మునిగిపోయారు. కనాను విగ్రహారాధనకు, హింసకు, దిగజారిపోయిన పనులకు నిలయంగా మారింది. (నిర్గమకాండం 23:24; 34:12, 13; సంఖ్యాకాండం 33:52) ఆఖరికి వాళ్లు పిల్లల్ని బలివ్వడం కూడా మొదలుపెట్టేశారు. పవిత్రుడైన దేవుడు అలాంటి చెడ్డవాళ్ల మధ్యకు తన ప్రజల్ని వెళ్లనిస్తాడా? లేదు! ఆయన ఇలా అన్నాడు: “ఆ దేశం అపవిత్రమైపోయింది, ఆ దేశ ప్రజలు చేసిన తప్పుకు నేను వాళ్లను శిక్షిస్తాను, ఆ దేశం దాని నివాసుల్ని బయటికి కక్కేస్తుంది.” (లేవీయకాండం 18:21-25) యెహోవా ముందు-వెనక చూసుకోకుండా వాళ్లందర్నీ చంపుకుంటూ వెళ్లిపోయాడా? లేదు. మంచి మనసున్న కనానీయుల్ని అంటే రాహాబు, గిబియోనీయులు లాంటి వాళ్లను ఆయన నాశనం చేయలేదు.—యెహోషువ 6:25; 9:3-27.
యెహోవా తన పేరు కోసం పోరాడతాడు
13, 14. (ఎ) యెహోవా తన పేరును పవిత్రపర్చుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? (బి) యెహోవా తన పేరు మీద పడిన నిందను ఎలా తీసేశాడు?
13 యెహోవా పవిత్రుడు, కాబట్టి ఆయన పేరు కూడా పవిత్రమైనదే. (లేవీయకాండం 22:32) “నీ పేరు పవిత్రపర్చబడాలి” అని ప్రార్థించమని యేసు తన శిష్యులకు నేర్పించాడు. (మత్తయి 6:9) ఏదెనులో జరిగిన తిరుగుబాటు వల్ల యెహోవా పేరుకు మచ్చ వచ్చింది, ఆయనకు అసలు పరిపాలించే హక్కు ఉందా అనే మాట వచ్చింది. యెహోవా అలాంటి నిందను, తిరుగుబాటును చూసి చేతులు కట్టుకుని కూర్చోడు. తన పేరు మీద పడిన మచ్చను తీసేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.—యెషయా 48:11.
14 మళ్లీ ఒకసారి ఇశ్రాయేలీయుల ఉదాహరణ ఆలోచించండి. అబ్రాహాము సంతానం ద్వారా భూమ్మీదున్న కుటుంబాలన్నీ దీవెన సంపాదించుకుంటాయి అని దేవుడు వాగ్దానం చేశాడు కదా. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో బానిసలుగా ఉన్నంత కాలం, ఆ వాగ్దానం వట్టి మాటగానే మిగిలిపోయింది. కానీ వాళ్లను ఐగుప్తు నుండి విడిపించి, వాళ్లను ఒక జనాంగంగా చేయడం ద్వారా యెహోవా తన పేరు మీద పడిన నిందను తుడిచేశాడు. అందుకే దానియేలు ప్రవక్త ఇలా ప్రార్థించాడు: ‘మా దేవా, యెహోవా, బలమైన చేతితో నీ ప్రజల్ని ఐగుప్తు దేశం నుండి బయటికి తీసుకొచ్చి, ఈ రోజు వరకు నీ కోసం ఒక పేరు సంపాదించుకున్నావు.’—దానియేలు 9:15.
15. బబులోనులో బందీలుగా ఉన్న యూదుల్ని యెహోవా ఎందుకు కాపాడాడు?
15 ఆసక్తికరంగా, యెహోవా తన పేరు కోసం రంగంలోకి దిగాల్సిన ఇంకో సందర్భం వచ్చినప్పుడు దానియేలు అలా ప్రార్థించాడు. ఆ సమయంలో దేవుని మాట వినని యూదులు బందీలుగా వెళ్లారు. అయితే ఈసారి వాళ్లు వెళ్లింది, బబులోనుకి. వాళ్ల సొంత రాజధాని నగరమైన యెరూషలేము పాడైపోయింది. యూదుల్ని వాళ్ల సొంత దేశానికి తీసుకొస్తే యెహోవా పేరుకు మహిమ వస్తుందని దానియేలుకు తెలుసు. అందుకే, ఇలా ప్రార్థించాడు: “యెహోవా, మమ్మల్ని క్షమించు. యెహోవా, మా మొర విని మమ్మల్ని రక్షించు! నా దేవా, నీకే మహిమ కలిగేలా ఆలస్యం చేయకు, ఎందుకంటే నీ నగరానికి, నీ ప్రజలకు నీ పేరే పెట్టబడింది.”—దానియేలు 9:18, 19.
యెహోవా తన ప్రజల తరఫున పోరాడతాడు
16. యెహోవా తన పేరును పవిత్రపర్చుకుంటాడు అంటే, దానర్థం ఆయన తన గురించి తప్ప ఇంకెవ్వరినీ పట్టించుకోడనా?
16 యెహోవా తన పేరును పవిత్రపర్చుకుంటాడు అంటే, ఆయన తన గురించి తప్ప ఇంకెవ్వరినీ పట్టించుకోడనా? కాదు. ఆయన పవిత్రుడు, న్యాయాన్ని ప్రేమిస్తాడు కాబట్టి తన ప్రజల్ని కాపాడతాడు. ఉదాహరణకు, ఆదికాండం 14వ అధ్యాయం చూడండి. అక్కడ నలుగురు రాజులు యుద్ధానికి వచ్చి అబ్రాహాము సహోదరుని కొడుకైన లోతును, అతని కుటుంబాన్ని తీసుకెళ్లిపోయారని చూస్తాం. యెహోవా సహాయంతో, అబ్రాహాము ఆ శక్తిమంతులైన రాజుల్ని చిత్తుగా ఓడించాడు! “యెహోవా యుద్ధాలు అనే పుస్తకంలో” రాసిన మొదటి యుద్ధం ఇదే అయ్యుండవచ్చు. ఈ పుస్తకంలో, బహుశా బైబిల్లో నమోదుకాని కొన్ని యుద్ధాలు కూడా ఉండి ఉంటాయి. (సంఖ్యాకాండం 21:14) అయితే, యెహోవా ఇంకా బోలెడు విజయాలు సాధించబోతున్నాడు.
17. కనాను దేశంలోకి అడుగుపెట్టిన తర్వాత యెహోవా ఇశ్రాయేలీయుల తరఫున పోరాడాడా? ఉదాహరణలు ఇవ్వండి.
17 ఇశ్రాయేలీయులు కనాను దేశంలోకి అడుగుపెట్టడానికి కాస్త ముందు, “మీ దేవుడైన యెహోవా మీకు ముందుగా వెళ్లి, మీ తరఫున పోరాడతాడు; ఆయన ఐగుప్తులో మీ కళ్లముందు చేసినట్టే చేస్తాడు” అని మోషే ధైర్యం చెప్పాడు. (ద్వితీయోపదేశకాండం 1:30; 20:1) మోషే తర్వాత వచ్చిన యెహోషువతో మొదలుపెట్టి న్యాయాధిపతుల కాలంలో, అలాగే నమ్మకమైన యూదా రాజుల కాలంలో యెహోవా తన ప్రజల తరఫున పోరాడుతూనే ఉన్నాడు. వాళ్ల శత్రువుల మీద తిరుగులేని విజయాలు ఇస్తూనే ఉన్నాడు.—యెహోషువ 10:1-14; న్యాయాధిపతులు 4:12-17; 2 సమూయేలు 5:17-21.
18. (ఎ) యెహోవా అసలేం మారలేదని తెలుసుకోవడం మనకు ఎందుకు సంతోషాన్ని ఇస్తుంది? (బి) ఆదికాండం 3:15 లో చెప్పిన శత్రుత్వం ముగింపుకు చేరినప్పుడు ఏం జరుగుతుంది?
18 యెహోవా అసలేం మారలేదు; ఈ భూమిని శాంతి విలసిల్లే పరదైసుగా మార్చాలన్న ఆయన ఉద్దేశం కూడా మారలేదు. (ఆదికాండం 1:27, 28) ఆయన ఇప్పటికీ చెడును చీదరించుకుంటాడు. అదే సమయంలో, ఆయన తన ప్రజల్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తాడు, త్వరలోనే వాళ్ల తరఫున చర్య తీసుకుంటాడు. (కీర్తన 11:7) నిజానికి ఆదికాండం 3:15 లో చెప్పిన శత్రుత్వం, అతిత్వరలో భయంకరమైన మలుపు తిరగబోతుంది. ఆ సమయంలో యెహోవా తన పేరును పవిత్రపర్చుకోవడానికి, తన ప్రజల్ని కాపాడడానికి మరోసారి ‘బలమైన యోధునిలా’ మారతాడు!—జెకర్యా 14:3; ప్రకటన 16:14, 16.
19. (ఎ) దేవుడు నాశనం చేసే శక్తిని ఉపయోగించడం చూసి మనం ఆయనకు దూరం అవ్వాలా? ఒక ఉదాహరణ చెప్పండి. (బి) దేవుడు మన తరఫున పోరాడడానికి సిద్ధంగా ఉన్నాడని తెలుసుకున్నాక మనకు ఏం అనిపించాలి?
19 ఒక ఉదాహరణ చూడండి: ఒక కుటుంబం మీద క్రూరమృగం దాడిచేసినప్పుడు, ఆ యజమాని మృగం మీదికి దూకి దాన్ని చంపేశాడు. అతను చేసిన పనికి అతని భార్యాపిల్లలు దూరమైపోతారా? లేదు, నిజానికి ప్రాణాన్ని కూడా లెక్కచేయకుండా ప్రేమ చూపించినందుకు వాళ్లు కృతజ్ఞతతో నిండిపోతారు. అదేవిధంగా, దేవుడు నాశనం చేసే శక్తిని ఉపయోగించడం చూసి మనం ఆయనకు దూరమైపోవాల్సిన అవసరం లేదు. మన తరఫున పోరాడి మనల్ని కాపాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనకు ఆయన మీద ప్రేమ ఉప్పొంగాలి, ఆయనకున్న అంతులేని శక్తి మీద గౌరవం పెరగాలి. అలా “మనం దైవభయంతో, సంభ్రమాశ్చర్యాలతో దేవుడు అంగీకరించే పవిత్రసేవ చేయగలుగుతాం.”—హెబ్రీయులు 12:28.
‘బలమైన యోధుడికి’ దగ్గరవ్వండి
20. యెహోవా ఎందుకు యుద్ధాలు చేశాడో పూర్తిగా అర్థం కానప్పుడు, మనం ఏం చేయాలి? ఎందుకు?
20 నిజమే, ప్రతీ సందర్భంలో యెహోవా ఎందుకు యుద్ధాలు చేశాడో బైబిలు పూసగుచ్చినట్టు చెప్పట్లేదు. కానీ ఒక విషయం మాత్రం ఖాయం: యెహోవా ఎప్పుడూ నాశనం చేసే శక్తిని అన్యాయంగా, ఇష్టమొచ్చినట్టుగా, క్రూరంగా ఉపయోగించడు. బైబిల్లో ఏదైనా చదువుతున్నప్పుడు దాని ముందు-వెనక ఉన్న వచనాలు పరిశీలించడం వల్ల, లేదా కొన్ని వివరాలు తెలుసుకోవడానికి పరిశోధన చేయడం వల్ల మనం విషయాన్ని సరిగ్గా చూడగలుగుతాం. (సామెతలు 18:13) ఒకవేళ మన దగ్గర వివరాలన్నీ లేకపోయినా, యెహోవా గురించి ఎక్కువ తెలుసుకుని, ఆయన అమూల్యమైన లక్షణాల గురించి ధ్యానిస్తే చాలు, ఎలాంటి సందేహాలైనా పటాపంచలైపోతాయి. ఆయన గురించి తెలుసుకుంటూ ఉంటే, ఆయన మీద నమ్మకం పెంచుకోవడానికి బోలెడు కారణాలు దొరుకుతాయి.—యోబు 34:12.
21. యెహోవా అప్పుడప్పుడు ‘బలమైన యోధునిలా’ మారినా, ఆయన మనసు ఎలాంటిది?
21 యెహోవా పరిస్థితిని బట్టి అప్పుడప్పుడు ‘బలమైన యోధునిలా’ మారినా, ఆయన మనసు మాత్రం ఎప్పుడూ యుద్ధాల్ని ఇష్టపడదు. పరలోక రథానికి సంబంధించిన ఒక దర్శనంలో, యెహోవా తన శత్రువులతో పోరాడడానికి సిద్ధమౌతున్నట్టు యెహెజ్కేలు చూశాడు. అయినప్పటికీ, యెహోవా చుట్టూ శాంతికి గుర్తుగా ఉండే ఒక ఇంద్రధనుస్సు కూడా ఉంది. (ఆదికాండం 9:13; యెహెజ్కేలు 1:28; ప్రకటన 4:3) అవును యెహోవా ప్రశాంతంగా, నెమ్మదిగా ఉంటాడు. “దేవుడు ప్రేమ” అని అపొస్తలుడైన యోహాను రాశాడు. (1 యోహాను 4:8) యెహోవాకున్న లక్షణాలన్నీ సమపాళ్లలో ఉన్నాయి. శక్తితోపాటు ప్రేమ కూడా ఉన్న అలాంటి దేవునికి దగ్గరవ్వడం ఎంత గొప్ప వరమో కదా!
a యూదా చరిత్రకారుడైన జోసిఫస్ చెప్పినదాని ప్రకారం, హెబ్రీయుల్ని “600 రథాలు, 50,000 మంది గుర్రపురౌతులు, 2,00,000 మంది కాలినడక సైనికులు తరిమారు.”—జ్యూయిష్ ఆంటిక్విటీస్, II, 324 [xv, 3].
b ఇక్కడ “అమోరీయులు” అనే పదం కనానులో ఉన్న ప్రజలందర్నీ సూచిస్తుండవచ్చు.—ద్వితీయోపదేశకాండం 1:6-8, 19-21, 27; యెహోషువ 24:15, 18.