కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • cl అధ్యా. 5 పేజీలు 47-56
  • సృష్టించే శక్తి—“ఆయనే భూమ్యాకాశాల్ని . . . తయారుచేశాడు”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సృష్టించే శక్తి—“ఆయనే భూమ్యాకాశాల్ని . . . తయారుచేశాడు”
  • యెహోవాకు దగ్గరవ్వండి
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • “మీ కళ్లు పైకెత్తి ఆకాశాన్ని చూడండి”
  • “ఆయన తన శక్తితో భూమిని చేశాడు”
  • “ఊపిరి తీసుకునే ప్రతీ ప్రాణి”
  • యెహోవాకున్న సృష్టించే శక్తి నుండి ఏం నేర్చుకోవచ్చు?
  • సాటిలేని మన సౌరకుటుంబం ఎలా ఉనికిలోకి వచ్చింది?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
  • ఒక చిన్న బ్రహ్మాండం
    తేజరిల్లు!—1992
  • సృష్టిని చేయడానికి పరిశుద్ధాత్మ ఉపయోగించబడింది
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2011
  • నక్షత్రాలకు, మానవునికి—ఏమైన సంబంధం ఉన్నదా?
    తేజరిల్లు!—1994
మరిన్ని
యెహోవాకు దగ్గరవ్వండి
cl అధ్యా. 5 పేజీలు 47-56
గోధుమ పొలం మీదుగా ఉదయిస్తున్న సూర్యుడు.

అధ్యాయం 5

సృష్టించే శక్తి—“ఆయనే భూమ్యాకాశాల్ని . . . తయారుచేశాడు”

1, 2. సూర్యుడు యెహోవాకున్న సృష్టించే శక్తికి ఒక రుజువని ఎలా చెప్పవచ్చు?

రాత్రిపూట మీరు ఎప్పుడైనా చలిమంట వేసుకున్నారా? మీరు కొంచెం దూరంలో ఉండి, చేతులు చాపుతూ వెచ్చదనాన్ని ఆస్వాదించి ఉంటారు. ఒకవేళ మంటకి మరీ దగ్గరగా వెళ్లిపోతే మీకు ఆ వేడి సెగ తగులుతుంది. దూరంగా వెళ్లిపోతేనేమో చల్లగాలికి వణుకు వచ్చేస్తుంది.

2 ప్రతీరోజు మనల్ని వెచ్చగా ఉంచే “మంట” ఒకటుంది. అది భూమికి దాదాపు 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది!a అదే సూర్యుడు. అంత దూరంలో ఉన్నా మనకు దాని వేడి తెలుస్తుందంటే, దానికి ఎంత శక్తి ఉందో కదా! అయినా ఆ భగభగ మండే కొలిమి చుట్టూ భూమి సరైన దూరంలో ఉండి తిరుగుతుంది. దగ్గరగా వెళ్తే భూమ్మీదున్న నీరంతా ఆవిరైపోతుంది, లేదా దూరంగా వెళ్తే మొత్తం గడ్డ కట్టుకుపోతుంది. కొంచెం ముందుకు వెళ్లినా, వెనక్కి వెళ్లినా భూమ్మీద జీవం అనేదే లేకుండా పోతుంది. సూర్యకాంతి జీవానికి ఎంతో ప్రాముఖ్యం. అది చాలా స్వచ్ఛమైనది, దానివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అది ఇచ్చే వెలుగు మనకు ఎంతో ఆనందాన్ని తీసుకొస్తుంది.—ప్రసంగి 11:7.

3. సూర్యుడు మనకు ఏ ముఖ్యమైన విషయం నేర్పిస్తున్నాడు?

3 అయితే మన జీవితాలు సూర్యుని చుట్టూ తిరుగుతున్నప్పటికీ, చాలామంది సూర్యుణ్ణి పెద్దగా పట్టించుకోరు. అలా, అది చెప్పే ఒక ముఖ్యమైన విషయాన్ని వినలేకపోతున్నారు. “వెలుగును, సూర్యుణ్ణి నువ్వే చేశావు” అని బైబిలు యెహోవా గురించి చెప్తుంది. (కీర్తన 74:16) అవును, “భూమ్యాకాశాల్ని” తయారుచేసిన దేవునికి సూర్యుడు మహిమ తెస్తున్నాడు. (కీర్తన 19:1; 146:6) యెహోవాకున్న అద్భుతమైన సృష్టించే శక్తి గురించి చాటిచెప్పే కోటానుకోట్ల నక్షత్రాల్లో, సూర్యుడు ఒకటి మాత్రమే. ఇప్పుడు కాసేపు నక్షత్రాల వైపు తొంగిచూసి తర్వాత భూమి దగ్గరికి, అందులోని జీవరాసుల దగ్గరికి వెళ్దాం.

యెహోవా “వెలుగును, సూర్యుణ్ణి” చేశాడు

“మీ కళ్లు పైకెత్తి ఆకాశాన్ని చూడండి”

4, 5. సూర్యుడు ఎంత పెద్ద నక్షత్రం? దానికి ఎంత శక్తి ఉంది? అదే అతిపెద్ద నక్షత్రమా?

4 మీకు తెలిసేవుంటుంది, మన సూర్యుడు ఒక నక్షత్రం. రాత్రిపూట మనం చూసే నక్షత్రాల కన్నా అది కొంచెం పెద్దగా కనిపిస్తుంది, ఎందుకంటే మిగతా నక్షత్రాలతో పోలిస్తే అది భూమికి కొంచెం దగ్గర్లో ఉంటుంది. దానికి ఎంత శక్తి ఉందో మీకు తెలుసా? సూర్యుని మధ్య భాగంలో, దాదాపు 1 కోటి 50 లక్షల డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత ఉంటుంది. సూర్యుని మధ్య భాగం నుండి, సూది మొన అంత చిన్న ముక్కను తీసుకొచ్చి భూమ్మీద పెడితే, దాని చుట్టూ 140 కిలోమీటర్ల దూరం వరకు ఎవ్వరం నిలబడలేం! ప్రతీ సెకనుకు సూర్యుని నుండి వచ్చే శక్తి, కొన్ని కోట్ల అణుబాంబులు పేలితే వచ్చే శక్తితో సమానం.

5 సూర్యుడు ఎంత పెద్దగా ఉంటాడంటే, అందులో మన భూమి లాంటి గ్రహాలు 13 లక్షల వరకు పడతాయి. అందుకని సూర్యుడే అతిపెద్ద నక్షత్రం అని చెప్పగలమా? లేదు. సైంటిస్టుల్ని అడిగితే, అది పసుపు రంగులో ఉండే బుల్లి నక్షత్రం అని చెప్తారు. “నక్షత్రాల్లో కూడా ఒక్కో నక్షత్రం వైభవం వేరు” అని అపొస్తలుడైన పౌలు రాశాడు. (1 కొరింథీయులు 15:41) దైవప్రేరణతో రాసిన ఆ మాటలు ఎంత నిజమో ఆయనకు కూడా తెలిసి ఉండదు. అయితే ఒక నక్షత్రం ఉంది, అది ఎంత పెద్దదంటే ప్రస్తుతం సూర్యుడున్న స్థానంలో దాన్ని పెడితే, భూమి దాని లోపలికి వెళ్లిపోతుంది. ఇంకో నక్షత్రం ఎంత పెద్దదంటే, భూమిని కూడా దాటేసి శనిగ్రహం దాకా వెళ్లిపోతుంది. భూమి నుండి శనిగ్రహం చాలా దూరం ఉంటుంది. ఎంత దూరం అంటే, సైంటిస్టులు ఒక రాకెట్‌ని పంపించినప్పుడు, అది శనిగ్రహం చేరుకోవడానికి నాలుగు సంవత్సరాలు పట్టింది! ఒక పవర్‌ఫుల్‌ తుపాకీ నుండి కాల్చిన బుల్లెట్‌ ఎంత వేగంతో వెళ్తుందో, ఆ రాకెట్‌ అంతకన్నా 40 రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణించింది.

6. విశ్వంలో లెక్కలేనన్ని నక్షత్రాలు ఉన్నాయని బైబిలు ఎలా చెప్తుంది?

6 నక్షత్రాలు ఎంత పెద్దగా ఉన్నాయో తెలుసుకోవడం కన్నా, అవి ఎన్ని ఉన్నాయో తెలుసుకున్నప్పుడు ఇంకా ఎక్కువ ఆశ్చర్యపోతాం. నక్షత్రాల్ని లెక్కపెట్టడం, “సముద్రంలోని ఇసుకను” కొలవడమంత అసాధ్యమని బైబిలు చెప్తుంది. (యిర్మీయా 33:22) దీన్నిబట్టి, మన కంటికి కనిపించే వాటికి మించి ఎన్నో నక్షత్రాలు ఉన్నాయని అర్థమౌతుంది. ఒకవేళ ఈ మాటలు రాసిన యిర్మీయా రాత్రిపూట ఆకాశాన్ని చూస్తూ నక్షత్రాల్ని లెక్కపెట్టడానికి ప్రయత్నిస్తే, ఆయన మహా అయితే ఒక మూడు వేలు లెక్క పెట్టగలుగుతాడేమో అంతే. ఎందుకంటే, మబ్బులు ఏం లేనప్పుడు టెలిస్కోప్‌ సహాయం లేకుండా మన కంటితో మనం చూడగలిగేవి అన్ని మాత్రమే. గట్టిగా చెప్పాలంటే, పిడికిలి ఇసుకలో ఎన్ని ఇసుక రేణువులు ఉంటాయో అన్ని అన్నమాట. నిజానికి, సముద్రంలో ఇసుక రేణువులు ఉన్నంత ఎక్కువగా ఆకాశంలో నక్షత్రాలు ఉన్నాయి.b వాటిని లెక్కపెట్టగలిగే వాళ్లు ఎవరైనా ఉన్నారా?

ఒక టెలిస్కోప్‌ నుండి తీసిన మిలమిలలాడే నక్షత్రాలు, నక్షత్రవీధుల చిత్రం.

“ఆయన వాటన్నిటినీ పేరు పెట్టి పిలుస్తాడు”

7. మన నక్షత్రవీధిలో ఉన్న నక్షత్రాల సంఖ్య గురించి, విశ్వంలో ఉన్న నక్షత్రవీధుల సంఖ్య గురించి సైంటిస్టులు ఏం చెప్తున్నారు?

7 ఆ ప్రశ్నకు యెషయా 40:26 జవాబిస్తుంది: “మీ కళ్లు పైకెత్తి ఆకాశాన్ని చూడండి. వీటిని ఎవరు సృష్టించారు? వాటిలో ఒక్కోదాన్ని లెక్కపెడుతూ వాటి సైన్యాన్ని బయటికి తీసుకొస్తున్న దేవుడే కదా; ఆయన వాటన్నిటినీ పేరు పెట్టి పిలుస్తాడు.” అలాగే “నక్షత్రాల సంఖ్యను ఆయన లెక్కపెడుతున్నాడు” అని కీర్తన 147:4 చెప్తుంది. ఇంతకీ “నక్షత్రాల సంఖ్య” ఎంత? దానికి జవాబివ్వడం అంత ఈజీ కాదు. ఒక్క పాలపుంత నక్షత్రవీధిలోనే (మిల్కీ వే గెలాక్సీ) పదివేల కోట్లకు పైగా నక్షత్రాలు ఉంటాయని సైంటిస్టులు అంచనా వేశారు.c ఇంకా ఎక్కువే ఉండొచ్చని ఇంకొంతమంది సైంటిస్టులు చెప్తున్నారు. అయితే మన నక్షత్రవీధితో పాటు ఇంకా ఎన్నో నక్షత్రవీధులు ఉన్నాయి, వాటిలో ఇంకా ఎక్కువ నక్షత్రాలు ఉన్నాయి. మొత్తం ఎన్ని నక్షత్రవీధులు ఉన్నాయో తెలుసా? సైంటిస్టుల అంచనా ప్రకారం, కొన్ని వేలకోట్ల నుండి లక్షలకోట్ల దాకా ఉన్నాయి. ఎన్ని నక్షత్రవీధులు ఉన్నాయో చెప్పడమే కష్టమంటే, ఇక వాటన్నిటిలో కలిపి సరిగ్గా ఎన్ని వేలకోట్ల నక్షత్రాలు ఉన్నాయో చెప్పడం జరగని పని. అయితే, అవి ఖచ్చితంగా ఎన్ని ఉన్నాయో యెహోవాకు తెలుసు. అంతేకాదు, ప్రతీ ఒక్క నక్షత్రాన్ని ఆయన పేరుపెట్టి పిలుస్తున్నాడు!

8. (ఎ) పాలపుంత నక్షత్రవీధి ఎంత పెద్దగా ఉంటుంది? (బి) నక్షత్రవీధుల, నక్షత్రాల, గ్రహాల కదలికల్ని యెహోవా ఎలా శాసిస్తున్నాడు?

8 నక్షత్రవీధులు ఎంత పెద్దగా ఉంటాయో తెలుసుకుంటే, మనకు ఆశ్చర్యంతో కళ్లు తిరుగుతాయి. పాలపుంత నక్షత్రవీధి ఎంత పెద్దదంటే, కాంతి వేగంతో ప్రయాణిస్తే దాని ఈ చివర నుండి ఆ చివరకు వెళ్లడానికి మనకు దాదాపు లక్ష సంవత్సరాలు పడుతుంది. ఇంకొన్ని నక్షత్రవీధులైతే, మన నక్షత్రవీధి కన్నా ఎన్నోరెట్లు పెద్దవి. యెహోవా ఏదో ఒక వస్త్రాన్ని పరిచినట్టుగా “ఆకాశాన్ని” పరుస్తాడని బైబిలు చెప్తుంది. (కీర్తన 104:2) అలాగే ఆయన నక్షత్రవీధుల, నక్షత్రాల, గ్రహాల కదలికల్ని శాసిస్తాడు. అంతరిక్షంలో ఉండే అతిచిన్న ధూళి దగ్గర్నుండి అతిపెద్ద నక్షత్రవీధి వరకు, ప్రతీది యెహోవా పెట్టిన నియమాల ప్రకారమే కదులుతుంది. (యోబు 38:31-33) చూడడానికి ఆ కదలికలు, చక్కగా కూర్చిన డాన్స్‌లా ఉంటాయని సైంటిస్టులు చెప్తారు! మరి, వీటన్నిటిని సృష్టించిన వ్యక్తి గురించి ఒకసారి ఆలోచించండి. ఆయనకున్న అద్భుతమైన శక్తి గురించి చెప్పడానికి మనకు మాటలు సరిపోవు.

“ఆయన తన శక్తితో భూమిని చేశాడు”

9, 10. సౌర వ్యవస్థను, జూపిటర్‌ని, భూమిని, చంద్రుణ్ణి సరైన స్థానాల్లో పెట్టడం యెహోవాకున్న శక్తి గురించి ఏం చెప్తుంది?

9 మన ఇల్లు అయిన భూమి, యెహోవాకున్న సృష్టించే శక్తి గురించి చెప్తుంది. ఇంతపెద్ద విశ్వంలో భూమిని ఎక్కడ పెట్టాలో యెహోవా సరిగ్గా అక్కడే పెట్టాడు. జీవంతో నిండిన భూమి లాంటి గ్రహం ఉండడానికి, చాలా నక్షత్రవీధులు అనువుగా ఉండవని కొంతమంది సైంటిస్టులు చెప్తున్నారు. చాలావరకు పాలపుంత నక్షత్రవీధి కూడా, ప్రాణులు ఉండడానికి అనువైన చోటేం కాదు. పాలపుంత నక్షత్రవీధి మధ్యలోకి వెళ్తే అది నక్షత్రాలతో కిక్కిరిసిపోయి ఉంటుంది, రేడియేషన్‌ ఎక్కువగా ఉంటుంది, అలాగే ఒక నక్షత్రం ఇంకో నక్షత్రానికి గుద్దుకునే ప్రమాదాలు చాలా ఉంటాయి. ఆ నక్షత్రవీధి అంచుల్లో కూడా జీవ మనుగడకు అవసరమయ్యేవి లేవు. మరీ చివరకి కాకుండా, మరీ మధ్యకి కాకుండా మన సౌర వ్యవస్థ సరైన చోటులో ఉంది.

10 భూమికి దూరంగా, దాన్ని కాపాడే ఒక పెద్ద గ్రహం ఉంది. అదే జూపిటర్‌ (గురుగ్రహం). భూమి కన్నా అది వెయ్యిరెట్లు పెద్దగా ఉంటుంది, కాబట్టి దాని గురుత్వాకర్షణ శక్తి కూడా ఎక్కువగానే ఉంటుంది. దానివల్ల ఏంటి ఉపయోగం? అది అంతరిక్షంలో తిరిగే తోకచుక్కలు, ఉల్కలు లాంటివి భూమిని ఢీకొట్టకుండా తన వైపుకు లాగేసుకుంటుంది లేదా అవతలికి విసిరేస్తుంది. ఒకవేళ జూపిటర్‌ లేకపోతే, వేగంగా వచ్చే ఆ ఉల్కలు, తోకచుక్కలు, భూమిని ఢీకొట్టే ప్రమాదం పదివేల రెట్లు ఎక్కువగా ఉంటుందని సైంటిస్టులు చెప్తున్నారు. జూపిటర్‌ కన్నా భూమికి దగ్గరగా ఉండే ఒక ఉపగ్రహం, చంద్రుడు. అది అందంగా ఉంటూ రాత్రిపూట వెన్నెల ఇవ్వడమే కాకుండా, భూమి ఎప్పుడూ ఒక వైపుకు కాస్త వంగి ఉండేలా సహాయం చేస్తుంది. అలా వంగి ఉండడం వల్లే, ప్రతీ సంవత్సరం రుతువులు ఏ టైంకి రావాలో ఆ టైంకి దాదాపు వచ్చేస్తాయి. అది జీవుల పాలిట వరం!

11. భూమి చుట్టూ ఉండే వాతావరణం మనకు ఎలా రక్షణ కల్పిస్తుంది?

11 భూమిని తయారుచేసిన విధానంలో, యెహోవాకున్న శక్తి అణువణువునా కనిపిస్తుంది. భూమి చుట్టూ దుప్పటిలా కప్పివుండే వాతావరణం సంగతే తీసుకోండి. సూర్యుని నుండి మంచి కిరణాలు అలాగే హానికరమైన కిరణాలు వస్తాయి. అయితే, హానికరమైన కిరణాలు భూ వాతావరణంలోని పైపొరను తాకినప్పుడు, అక్కడున్న ఆక్సిజన్‌ వాయువు ఓజోన్‌లా మారుతుంది. అలా తయారైన ఓజోన్‌ పొర, చాలావరకు సూర్యుని నుండి వచ్చే హానికరమైన కిరణాల్ని పీల్చేసుకుంటుంది. అలా భూమికి ఒక గొడుగులా రక్షణ కల్పిస్తుంది!

12. నీటిచక్రం యెహోవాకున్న సృష్టించే శక్తి గురించి ఏం చెప్తుంది?

12 వాతావరణం వల్ల పొందే ఎన్నో ప్రయోజనాల్లో అది ఒకటి మాత్రమే. వాతావరణం అంటే, భూమి చుట్టూ ఉండే రకరకాల వాయువుల సమాహారం. ఆ వాయువుల వల్లే భూమ్మీదున్న ప్రాణులు ఊపిరి పోసుకోగలుగుతున్నాయి. వాతావరణం వల్ల జరిగే ఇంకో అద్భుతం, నీటిచక్రం. సూర్యుని వేడి వల్ల మహాసముద్రాల్లో, సముద్రాల్లో ఉన్న నీళ్లు ఆవిరైపోతాయి. ఒక 70 కిలోమీటర్ల ఎత్తు, లోతు, వెడల్పు ఉన్న ట్యాంకులో ఎన్ని నీళ్లు పడతాయో, అన్ని నీళ్లు ప్రతీ సంవత్సరం ఆవిరౌతున్నాయి. ఆవిరైన నీళ్లు మేఘాలుగా మారతాయి, అవి గాలికి అటు-ఇటు చెదిరిపోతాయి. అలా ఫిల్టర్‌ అయిన నీళ్లు వర్షంలా, మంచులా, ఐస్‌లా కురుస్తూ నదుల్లోకి, సముద్రాల్లోకి చేరతాయి. అదే విషయం ప్రసంగి 1:7 చెప్తుంది: “నదులన్నీ సముద్రంలోకి ప్రవహిస్తున్నాయి, కానీ సముద్రం నిండట్లేదు. అవి ఎక్కడ మొదలయ్యాయో అక్కడికే తిరిగెళ్లి, మళ్లీ ప్రవహించడం మొదలుపెడతాయి.” యెహోవా మాత్రమే ఇలాంటి ఒక చక్రాన్ని ఏర్పాటు చేయగలడు.

13. మొక్కల్లో, మట్టిలో యెహోవాకున్న సృష్టించే శక్తి ఎలా కనిపిస్తుంది?

13 జీవం ఉన్న ప్రతీచోట, సృష్టికర్తకున్న శక్తి కనిపిస్తుంది. కొన్ని చెట్లు 30 అంతస్తుల బిల్డింగ్‌ కంటే పొడవుగా ఉంటాయి. మహాసముద్రాల్లో ఉండే ఇంకొన్ని మొక్కలు మైక్రోస్కోప్‌లో పెట్టి చూస్తే గానీ కనిపించవు, కానీ మనం పీల్చే ఆక్సిజన్‌ చాలావరకు వాటి నుండే వస్తుంది. అంత పెద్దచెట్ల నుండి ఇంత చిన్నమొక్కల వరకు, అన్నిట్లో యెహోవాకున్న సృష్టించే శక్తి కనిపిస్తుంది. ఇక మట్టి విషయానికొస్తే అందులో చాలా పురుగులు, ఫంగస్‌, సూక్ష్మజీవులు ఉంటాయి. అవన్నీ కలిసి పనిచేస్తూ మొక్కల్ని ఎదిగేలా చేస్తాయి. అందుకే, మట్టికి లేదా నేలకు “శక్తి” ఉందని బైబిలు చెప్తుంది.—ఆదికాండం 4:12, అధస్సూచి.

14. ఒక చిన్న పరమాణువులో కూడా ఎంత శక్తి ఉంటుంది?

14 యెహోవాయే “తన శక్తితో భూమిని చేశాడు,” అందులో సందేహమే లేదు. (యిర్మీయా 10:12) ఆయన తయారుచేసిన అతిచిన్న వాటిలో కూడా ఆయన శక్తి కనిపిస్తుంది. ఉదాహరణకు, పది లక్షల పరమాణువుల్ని (atoms) పక్కపక్కన పెట్టినా, కనీసం ఒక వెంట్రుకంత మందం కూడా ఉండవు. పరమాణువే అంత చిన్నదంటే, ఇక దాని కేంద్రకం (nucleus) ఎంత చిన్నగా ఉంటుందో అర్థం చేసుకోండి. ఒక పరమాణువుని 14 అంతస్తుల బిల్డింగ్‌ అనుకుంటే, దాని కేంద్రకం ఏడో అంతస్తులో ఉన్న నలుసు అంత ఉంటుంది. అయినా, అంత చిన్న కేంద్రకమే అణుబాంబు పేలినప్పుడు విడుదలయ్యే టన్నుల కొద్దీ శక్తికి మూలం!

“ఊపిరి తీసుకునే ప్రతీ ప్రాణి”

15. వేర్వేరు అడవి జంతువుల గురించి చెప్తూ యెహోవా యోబుకు ఏ పాఠం నేర్పించాడు?

15 భూమ్మీదున్న రకరకాల జంతువుల్లో కూడా, యెహోవాకున్న సృష్టించే శక్తి కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. 148వ కీర్తనలో, యెహోవాను స్తుతించే వేర్వేరు వాటిలో ‘అడవి జంతువులు, సమస్త సాధు జంతువులు’ ఉన్నాయని 10వ వచనం చెప్తుంది. యెహోవా ఒక సందర్భంలో యోబుతో మాట్లాడుతూ సింహం, చారల గుర్రం, అడవి ఎద్దు, బహేమోత్‌ (లేదా, నీటి గుర్రం), లివ్యాతన్‌ (బహుశా మొసలి అయ్యుండవచ్చు) గురించి చెప్పాడు. ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడు? అంత భారీగా, భయంకరంగా, బలంగా ఉన్న జంతువులకే మనిషి భయపడితే, వాటిని సృష్టించిన యెహోవాకు ఇంకెంత భయపడాలి?—యోబు 38-41 అధ్యాయాలు.

16. యెహోవా సృష్టించిన కొన్ని పక్షుల్ని చూసినప్పుడు మీకేం అనిపిస్తుంది?

16 కీర్తన 148:10 “ఎగిరే పక్షుల” గురించి కూడా చెప్తుంది. పక్షుల్లో అసలు ఎన్ని రకాలు ఉన్నాయో ఒకసారి ఆలోచించండి! నిప్పుకోడి “గుర్రాన్ని, దాని రౌతును చూసి ఎగతాళిగా నవ్వుతుంది” అని యెహోవా యోబుతో చెప్పాడు. ఎనిమిది అడుగుల ఎత్తుండే ఈ పక్షి ఎగరలేకపోవచ్చు కానీ, గంటకు 65 కిలోమీటర్ల వేగంతో పరుగెత్తగలదు. కాలు తీసి కాలు పెట్టేలోపు అది 15 అడుగుల దూరాన్ని దాటేయగలదు! (యోబు 39:13, 18) ఇంకోవైపు, ఆల్‌బెట్రాస్‌ అనే పక్షి సముద్రం పైన గాలిలో ఎగురుతూ, చాలావరకు తన జీవితాన్ని అక్కడే గడిపేస్తుంది. దాని రెండు రెక్కల్ని దాదాపు 11 అడుగుల పొడవునా చాపి, ఆకాశంలో ఒక విమానంలా చెక్కర్లు కొడుతూ ఉంటుంది. అది రెక్కలు ఆడించకుండా గంటలు-గంటలు గాలిలోనే ఉండగలదు. మరోవైపు, రెండే రెండు అంగుళాల పక్షి కూడా ఉంది. అదే ప్రపంచంలో అతిచిన్న పక్షి. దాని పేరు బీ హమ్మింగ్‌ బర్డ్‌. అది సెకనుకు 80 సార్లు రెక్కలు ఆడిస్తుంది! వీటిని చూస్తే రత్నాలకే రెక్కలొచ్చి ఎగురుతున్నట్టు, మెరుస్తూ కనిపిస్తాయి. అవి హెలికాప్టర్‌లా ఒకేచోట కదలకుండా రెక్కలు ఆడించగలవు, ఆఖరికి వెనక్కి కూడా ఎగరగలవు.

17. నీలి తిమింగలం ఎంత పెద్దగా ఉంటుంది? యెహోవా సృష్టించిన జంతువుల్ని చూసినప్పుడు మనకు ఎలా అనిపిస్తుంది?

17 “సముద్రప్రాణులు” కూడా యెహోవాను స్తుతిస్తున్నాయని కీర్తన 148:7 చెప్తుంది. ఉదాహరణకు, ఈ భూగ్రహంలో ఉండే అతిపెద్ద జంతువైన నీలి తిమింగలం గురించి ఆలోచించండి. “అగాధ జలాల్లో” ఈదుతూ ఉండే ఈ తిమింగలం, 100 అడుగులు లేదా అంతకన్నా ఎక్కువ పొడవు ఉంటుంది. దాని బరువు, 30 పెద్ద ఏనుగులంత ఉంటుంది. దాని నాలుక ఒక్కటే, ఒక ఏనుగంత బరువు ఉంటుంది. దాని గుండె ఒక చిన్న కారు అంత సైజులో ఉంటుంది. ఇంత పెద్ద గుండె నిమిషానికి కేవలం 9 సార్లే కొట్టుకుంటుంది. అదే హమ్మింగ్‌ బర్డ్‌ గుండె అయితే, నిమిషానికి దాదాపు 1,200 సార్లు కొట్టుకుంటుంది. ఈ నీలి తిమింగలంలో ఒక రక్తనాళం ఎంత పెద్దగా ఉంటుందంటే, అందులో ఒక పిల్లాడు దూరి పాకేయవచ్చు. నిజంగా ఇవన్నీ చూసినప్పుడు, కీర్తనల పుస్తకంలో ఆఖరి వచనం చెప్తున్నట్టు చేయాలనిపిస్తుంది: “ఊపిరి తీసుకునే ప్రతీ ప్రాణి యెహోవాను స్తుతించాలి.”—కీర్తన 150:6.

యెహోవాకున్న సృష్టించే శక్తి నుండి ఏం నేర్చుకోవచ్చు?

18, 19. భూమ్మీద యెహోవా చేసిన ప్రాణులు ఎలా వైవిధ్యంగా ఉన్నాయి? సృష్టి యెహోవాకున్న సర్వాధిపత్యం గురించి ఏం నేర్పిస్తుంది?

18 యెహోవా తనకున్న సృష్టించే శక్తిని ఉపయోగించే విధానం నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? ఆయన ఎంత అద్భుతంగా, వైవిధ్యంగా సృష్టించాడో చూస్తే మనకు మతిపోతుంది. ఒక కీర్తనకర్త ఇలా రాశాడు: “యెహోవా, నీ పనులు అసంఖ్యాకం! . . . నువ్వు చేసినవాటితో భూమి నిండిపోయింది.” (కీర్తన 104:24) ఆ మాటలు ఎంత నిజమో కదా! సైంటిస్టులు భూమ్మీద పది లక్షల కంటే ఎక్కువ జీవజాతులు ఉన్నాయని గుర్తించారు. గుర్తించింది కొన్నే, కానీ ఇంకా ఎన్ని ఉండవచ్చో వాళ్లకే తెలీదు. ఒక ఆర్టిస్టుకి అప్పుడప్పుడు ఐడియాలన్నీ ఆవిరైపోయి, కొత్తవి తట్టకపోవచ్చు. కానీ యెహోవా కొత్తగా, సరికొత్తగా ఆలోచిస్తూ ఎన్నో వైవిధ్యమైన వాటిని చేయగలడు. కొత్తవి చేసే విషయంలో ఆయన ఐడియాలకు అంతే లేదు!

19 యెహోవా తనకున్న సృష్టించే శక్తిని ఉపయోగించే విధానం, మనకు ఆయన సర్వాధిపత్యం గురించి నేర్పిస్తుంది. “సృష్టికర్త” అన్న ఒక్క పదమే, ఆయన ఈ విశ్వమంతటి కన్నా వేరు అని చెప్తుంది. ఎందుకంటే, విశ్వమంతా ఆయన సృష్టిస్తే వచ్చిందే. ఆయన ఒక్కగానొక్క కుమారుడు కూడా ఆయనతో పాటు “ప్రధానశిల్పిగా” పనిచేశాడు. కానీ, యేసు సృష్టించాడు అనో, సృష్టికర్త అనో బైబిలు ఎప్పుడూ చెప్పలేదు. (సామెతలు 8:30; మత్తయి 19:4) నిజానికి ఆయన “మొత్తం సృష్టిలో మొట్టమొదట పుట్టినవాడు.” (కొలొస్సయులు 1:15) యెహోవా సృష్టికర్త కాబట్టి విశ్వం మొత్తాన్ని ఏలే హక్కు ఆయనకు మాత్రమే ఉంది.—రోమీయులు 1:20; ప్రకటన 4:11.

20. యెహోవా విశ్రాంతి తీసుకున్నాడు అంటే అర్థమేంటి?

20 యెహోవా తనకున్న సృష్టించే శక్తిని ఉపయోగించడం ఆపేశాడా? ఆరో రోజున యెహోవా సృష్టించే పనిని ఆపి, “అప్పటివరకు చేస్తూ వచ్చిన పని నుండి ఆయన ఏడో రోజున విశ్రాంతి తీసుకోవడం మొదలుపెట్టాడు” అని బైబిలు చెప్తుంది. (ఆదికాండం 2:2) ఏడో “రోజు” వేల సంవత్సరాల పాటు ఉంటుందని, అది తన కాలంలో కూడా కొనసాగుతోందని అపొస్తలుడైన పౌలు అర్థం చేసుకున్నాడు. (హెబ్రీయులు 4:3-6) యెహోవా “విశ్రాంతి” తీసుకుంటున్నాడు అంటే పూర్తిగా పని చేయడం ఆపేశాడనా? లేదు, యెహోవా పని చేయడం ఎప్పుడూ ఆపడు. (కీర్తన 92:4; యోహాను 5:17) కాబట్టి, ఆయన విశ్రాంతి తీసుకున్నది భూమికి సంబంధించిన సృష్టి పని నుండి మాత్రమే. అయితే, ఆయన ఉద్దేశాల్ని నెరవేర్చే పని మాత్రం అంతరాయం లేకుండా కొనసాగుతూనే ఉంది. ఆ పనిలో, పవిత్ర లేఖనాల్ని ప్రేరేపించి రాయించడం, ‘కొత్త సృష్టిని’ సిద్ధం చేయడం లాంటివి ఉన్నాయి. “కొత్త సృష్టి” గురించి 19వ అధ్యాయంలో చూస్తాం.—2 కొరింథీయులు 5:17.

21. శాశ్వతకాలం పాటు జీవిస్తూ యెహోవాకున్న సృష్టించే శక్తిని గమనిస్తున్నప్పుడు, మనకు ఎలా అనిపిస్తుంది?

21 విశ్రాంతి రోజు పూర్తి అయినప్పుడు, యెహోవా భూమ్మీద చేసిన పనంతా చూసి ఆరు సృష్టి రోజుల ముగింపులో చెప్పినట్టే “చాలా బాగుంది” అని చెప్తాడు. (ఆదికాండం 1:31) భవిష్యత్తులో ఆయన తనకున్న అంతులేని శక్తిని ఉపయోగించి ఏమేం చేస్తాడో వేచి చూడాల్సిందే. ఏదేమైనా, ఆయనకున్న సృష్టించే శక్తిని ఎలా ఉపయోగిస్తాడో చూసి మనం ఆశ్చర్యపోవడం అయితే ఖాయం. సృష్టి ద్వారా యెహోవా గురించి ఇంకాఇంకా తెలుసుకోవడానికి మనకు శాశ్వతకాలం ఉంటుంది. (ప్రసంగి 3:11) మన గొప్ప సృష్టికర్త గురించి తెలుసుకునే కొద్దీ, ఆయన మీద గౌరవం పెరుగుతుంది, అలాగే ఆయనకు దగ్గరౌతాం కూడా.

a దాన్ని అర్థం చేసుకోవడానికి ఇలా ఆలోచించండి: అంత దూరం కారులో వెళ్లాలనుకుంటే, గంటకు 160 కిలోమీటర్ల వేగంతో 24 గంటలూ ప్రయాణించినా వంద కంటే ఎక్కువ సంవత్సరాలు పడుతుంది!

b అన్ని నక్షత్రాలు ఉన్నాయని అప్పట్లో వాళ్లకు ఎలా తెలుసు? అప్పట్లో ప్రజలు ఏదోక టెలిస్కోప్‌ లాంటిది ఉపయోగించే ఉంటారని కొంతమంది అంటారు. అయితే వాళ్లు ఒక విషయం మర్చిపోతున్నారు, విశ్వంలో లెక్కపెట్టలేనన్ని నక్షత్రాలు ఉన్నాయని చెప్పింది యెహోవా. ఆయనే బైబిలుకు రచయిత. ఆయన చెప్తే వాళ్లు రాశారే గానీ, ఏ టెలిస్కోప్‌ను వాడలేదు.—2 తిమోతి 3:16.

c కేవలం పదివేల కోట్ల నక్షత్రాల్ని లెక్కపెట్టడానికి మీకు ఎంత సమయం పడుతుందో ఆలోచించండి. సెకనుకు ఒక నక్షత్రం చొప్పున 24 గంటలూ లెక్కపెట్టుకుంటూ పోతే, అవి పూర్తి చేయడానికి మీకు 3,171 సంవత్సరాలు పడుతుంది!

ధ్యానించడానికి ప్రశ్నలు

  • కీర్తన 8:3-9 యెహోవా చేసిన సృష్టి మనలో ఎలా వినయాన్ని పుట్టిస్తుంది?

  • కీర్తన 19:1-6 యెహోవాకున్న సృష్టించే శక్తిని చూసినప్పుడు మనకు ఏం చేయాలనిపిస్తుంది? ఎందుకు?

  • మత్తయి 6:25-34 యెహోవాకున్న సృష్టించే శక్తి గురించి ఆలోచిస్తే, ఆందోళనను ఎలా తరిమికొట్టవచ్చు, జీవితంలో ముఖ్యమైన వాటికి ఎలా మొదటిస్థానం ఇవ్వవచ్చు?

  • అపొస్తలుల కార్యాలు 17:22-31 విగ్రహారాధన తప్పని, దేవుడు మనకు దూరంగా ఉండడని యెహోవాకున్న సృష్టించే శక్తి ఎలా నేర్పిస్తుంది?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి