సంభాషణను ఆటంకపర్చే వారికి మీరెలా ప్రత్యుత్తరమివ్వవచ్చును
వ్యాఖ్యానములు: యెహోవా దేవుని యెడల, క్రీస్తుయేసు పాలించు రాజ్యం యెడల ప్రజలు కనబరచే దృక్పథం మీదనే వారి బావిజీవితాలు ఆధారపడియున్నవి. దేవుని రాజ్య వర్తమానము ఉత్కంఠభరితమై యుండి, మానవజాతి ఆధారపడదగిన ఏకైక నిరీక్షణను సూచిస్తున్నది. అది జీవితాల్ని మార్చగల వర్తమానం. దానిని ప్రతివారు వినాలని మనం కోరుకుంటాం. దానిని కేవలము కొద్దిమంది మాత్రమే అభినందనా పూర్వకంగా గైకొంటారని మనం గ్రహిస్తున్నాం, అయితే ప్రజలు సరియైన ఎంపికచేసుకోవాలంటే, వారు కనీసం దాన్ని వినాలని మనకు తెలుసు. అయినప్పటికిని అందరూ దాన్ని వినాలని ఇష్టపడరు, పైగా మనం వారిని బలవంతపెట్టడానికి ప్రయత్నించం. కాని సంభాషణను ఆటంకపర్చేవారితో వివేకముతో వ్యవహరిస్తే వారిని మరలా చర్చకు అవకాశమిచ్చే వారిగా మార్చుటకు తరచూ సాధ్యపడుతుంది. వర్తమానమునకు అర్హులైన వారిని వెదికే తమ ప్రయత్నమందు కొంతమంది అనుభవజ్ఞులైన సాక్షుల ఉదాహరణలు ఇక్కడ కొన్ని ఇవ్వబడ్డాయి. (మత్తయి 10:11) ఈ తలంపును మనస్సులో ఉంచుకుని, నీవు మాట్లాడే వ్యక్తిపై నీ నిజమైన శ్రద్ధను తెలియజేసే విధంగా నీ స్వంత మాటల్లో దానిని వ్యక్తపర్చుము. నీవలా చేస్తే, సహృదయులు నీవు చెప్పే వర్తమానాన్ని విని, జీవము కొరకు యెహోవా ప్రేమతోచేసిన ఏర్పాట్లవైపు వారిని ఆకర్షించుటకు ఆయన చేసేదానికి వారు అభినందనా పూర్వకంగా ప్రతిస్పందిస్తారనే నమ్మకాన్ని కల్గియుండగలవు.—యోహాను 6:44; అపొ. 16:14.
‘నాకు ఇష్టం లేదు’
• ‘అంటే, మీకు బైబిలు నందు ఇష్టం లేదంటారా లేక సాధారణంగా మతమంటేనే మీకు ఇష్టం లేదా, ఏమంటారు? మరేం లేదు, నేనలా ఎందుకు అడుగుతున్నానంటే, ఒకప్పుడు మతాసక్తిపరులైననూ, చర్చిల్లో తాము చూసే వేషధారణనుబట్టి (లేదా, మతమనేది డబ్బు సంపాదించడానికి మరో విధమైన వ్యాపారమని భావించడం; లేదా, రాజకీయాల్లో మతప్రస్తావన; తదితర విషయాలను అంగీకరించక పోవడాన్నిబట్టి) ఇప్పుడసలు చర్చికే వెళ్లని అనేకమందిని మేము కలిశాము. బైబిలు కూడ అలాంటి క్రియలను ఆమోదించడం లేదుగాని, నమ్మకంతో మనం భవిష్యత్తులోనికి చూడగల ఏకైక ఆధారాన్ని అది అందిస్తుంది.’
• ‘మరో మతమందు శ్రద్ధలేదనేది మీ భావమైతే, దాన్ని నేను అర్థం చేసుకోగలను. అయితే యుద్ధం మన జీవితాలకు కలిగించిన దానిదృష్ట్యా మనం ఎదురుచూడగల భవిష్యత్తును గూర్చి (లేదా, మాదక ద్రవ్యాల బారిన పడకుండా మన పిల్లల్ని మనమెలా కాపాడగలము; లేదా, మనం భయం లేకుండా వీధుల్లో నడువగల్గునట్లు నేరం తదితర విషయాల్లో ఏంచేయగలమనే విషయమందు) బహుశ మీరు శ్రద్ధకలిగి ఉండవచ్చు. మనమాశించగల నిజమైన పరిష్కారమేదైనా ఉందంటారా?’
• ‘మీరిప్పటికే ఒక మతాన్ని కలిగియున్నందువలన అలా అంటున్నారా? . . . ప్రతివారు ఒకే మతానికి చెందియుండే కాలమెప్పుడైనా వస్తుందంటారా, మీరేమంటారు? . . . దానికేది అడ్డువస్తుందని మీరంటారు? . . . అది అర్థసహితమైనదై యుండాలంటే, దానికి ఎలాంటి పునాది అవసరమంటారు?’
• ‘నేనా విషయాన్ని అర్థంచేసుకోగలను. కొన్ని సంవత్సరాల క్రితం నేనుకూడ అలానే భావించాను. అయితే విషయాల్ని భిన్నంగా దృష్టించడానికి నాకు సహాయపడిన దాన్ని బైబిల్లో చదివాను. (అదేమిటో ఆ వ్యక్తికి చూపండి.)’
• ‘చనిపోయిన మీ ప్రియులను మీరు మళ్లీ ఎలా చూడగలరో (లేదా, జీవితంయొక్క నిజమైన సంకల్పమేమిటో; లేదా, మన కుటుంబాలను సమైక్యంగా ఉంచుకోవడానికి అదెట్లు సహాయపడగలదో తదితర విషయాల్ని) నేను బైబిలునుండి చూపిస్తే మీరిష్టపడతారా?’
• ‘ఏదైనా కొనాల్సివస్తుందని మీరనుకుంటే, నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టనులెండి. నేను వ్యాపారం నిమిత్తం రాలేదండి. అయితే రోగం, నేరం లేకుండా నిజంగా మిమ్మల్ని ప్రేమించే పొరుగువారితోపాటు భూపరదైసులో జీవించే అవకాశం పొందుట మీకిష్టమేనా?’
[• ‘యెహోవాసాక్షులు వచ్చినప్పుడు సాధారణంగా మీరలానే అంటారా?’ . . . మేమిలా ఎందుకొస్తున్నాము లేదా మేము చెప్పేదేమిటని మీరెప్పుడైనా తలంచారా? . . . క్లుప్తంగా చెప్పాలంటే, నాకు తెలిసిన ఒక విషయం మీరుకూడా తెలుసుకోవాలని మీ దగ్గరకు వచ్చాను. ఈ ఒక్కసారికి మీరెందుకు వినకూడదు?’]
‘మతమంటే నాకిష్టం లేదు’
• ‘మీ ఉద్దేశాన్ని నేనర్థం చేసుకోగలను. నిజం చెప్పాలంటే, చర్చీలు ఈ లోకాన్ని సురక్షితంగా జీవించే స్థలంగా ఉంచడం లేదు, మీరేమంటారు? . . . అయితే మీరు దేవున్ని నమ్ముతారా?’
• ‘చాలామందికి మీకున్న అభిప్రాయమే ఉంది. నిజానికి మతం వారికి ఎలాంటి సహాయమూ చేయలేదు. మేము అందరిని కలవడానికి అదొక కారణము—ఎందుకంటే చర్చీలు దేవున్ని గూర్చిన సత్యాన్ని, మానవజాతి యెడల ఆయనకున్న అద్భుత సంకల్పాన్ని ప్రజలకు చెప్పలేదు.’
• ‘కాని మీ భవిష్యత్తును గూర్చి మీరు తప్పక ఆసక్తి కల్గియుంటారని మాత్రం నాకు తెలుసు. లోకంలో ఈనాడున్న పరిస్థితులను బైబిలు ముందే ప్రవచించిందని మీకు తెలుసా? . . . అంతేకాదు వాటి ఫలితమేమిటో కూడా అది తెలియజేసింది.’
• ‘మీరెప్పుడూ అలానే అనుకునేవారా? . . . భవిష్యత్తును గూర్చి మీరేమనుకుంటున్నారు?’
‘యెహోవాసాక్షులంటే నాకిష్టం లేదండి’
• ‘చాలామంది మాతో అలానే అంటారు. చాలామంది మమ్మును ఆహ్వానించరని మాకు తెలిసినా మేమెందుకిలా స్వచ్ఛందంగా ప్రజలయొద్దకు వెళ్తామో మీరెప్పుడైనా ఆలోచించారా? (అన్ని జనాంగముల ప్రజలను వేరుచేసే పని జరుగుతున్నదని, ఈ విషయంలో రాజ్యవర్తమానానికి వారిచ్చే ప్రత్యుత్తరం ఒక ప్రాముఖ్యమైన సంగతని మత్తయి 25:31-33లోని సారాంశాన్ని లేదా రాజ్యవర్తమానానికి ప్రజలిచ్చే ప్రత్యుత్తరాన్నిబట్టి, ప్రతివారు మహాశ్రమలు తప్పించుకోవడానికో లేదా దేవునిచే నాశనం చేయబడ్డానికో “గురుతు” వేయబడుతున్నారని వివరిస్తూ యెహెజ్కేలు 9:1-11లోని సారాంశాన్ని తెల్పుము.)’
• ‘నేను అర్థంచేసుకోగలను, ఎందుకంటే మొదట నేనుకూడ అలానే అనుకున్నాను. అయితే, కేవలం మర్యాదకొరకు వారుచెప్పే విషయాన్ని ఒకసారి విందామని నిర్ణయించుకున్నాను. తీరాచూస్తే వారినిగూర్చిన నిజం నేను వినలేదని గ్రహించాను. (సాధారణంగా వినే ఒక అబద్ధ ఆరోపణను ప్రస్తావించి, మనం నమ్మే విషయాన్ని వివరించండి.)’
• ‘మా ఇంటికి వచ్చిన సాక్షితో నేనుకూడ ఈ మధ్యే అలా అన్నాను. అయితే అతడు వెళ్లకముందు, తాను జవాబివ్వలేడని నేననుకున్న ప్రశ్న ఒకటి అతన్నడిగాను. అదేంటో మీకూ తెలుసుకోవాలనుందా? . . . (ఉదాహరణకు: కయీనుకు భార్య ఎక్కడ దొరికింది?)’ (నిజంగా అటువంటి అనుభవం పొందిన వారు ఉపయోగించదగింది.)
• ‘మీరొకవేళ మతభక్తి గలవారైతే, నేనా విషయాన్ని అర్థంచేసుకోగలను. మీ మతమంటే నిస్సందేహంగా మీకెంతో అభిమానం ఉండొచ్చు. అయితే మనమిరువురం కూడ ఈ విషయంపై (యుక్తమైన అంశాన్ని పేర్కొనండి,) శ్రద్ధ కల్గియున్నామని మీరంగీకరిస్తారనుకుంటాను.’
[• ‘అయితే నిస్సందేహంగా మీరొక మతాన్ని నమ్ముతుండవచ్చు. అదేంటో నేను తెలుసుకోవచ్చా? . . . మీ విశ్వాసానికి చెందిన ప్రజలతో మాట్లాడ్డానికి మేమానందిస్తాము. దీన్నిగూర్చి మీరేమనుకుంటారు (మీ సంభాషణ అంశాన్ని ప్రస్తావించండి)?’]
• సరే, నేనర్థంచేసుకోగలను. అయితే మేము ప్రతివారిని కలవడంలోగల కారణమేమంటే, ప్రజలు శాంతిగా కలిసిమెలసి జీవించాలని ఆశించే ఓ కుటుంబం మాది. పోరాటాల్నిగూర్చి, బాధల్నిగూర్చి ప్రతిరాత్రివచ్చే వార్తలు వినివినీ మేము విసిగివేసారిపోయాము. బహుశ మీరుకూడా అలాగే విసిగిపోయి ఉండొచ్చు. . . . అయితే అవసరమైన మార్పు ఎవరు తేగలరు? . . . బైబిలు వాగ్దానాలందు మాకు ప్రోత్సాహం లభించింది.’
[• ‘మీ అభిప్రాయాన్ని నాకు తెలియజేస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను. మాలో మీరిష్టపడని విషయమేమిటో దయచేసి చెప్పగలరా? మేము ప్రతిదాన్ని బైబిలునుండి చూపించడమా లేక మిమ్మల్ని సందర్శించడానికి రావడమా, ఏది?’]
‘నాకు నా స్వంత మతముంది’
• ‘నీతిని ప్రేమించే ప్రజలు భూమిపై నిరంతరం జీవించే కాలమొస్తుందని మీ మతం బోధిస్తుందో లేదో దయచేసి మీరు నాకు చెప్పగలరా? . . . అదెంత చక్కని ఆలోచన, కదండీ? . . . ఇది బైబిల్లోనేవుంది చూడండి. (కీర్తన 37:29; మత్తయి 5:5; ప్రక. 21:4)’
• ‘ఈ విషయంలో ప్రతివ్యక్తి తన స్వంత నిర్ణయం తీసుకోవాలని నేను ఒప్పుకుంటాను. అయితే దేవుడు తన సత్యారాధికులు ఒక నిర్దిష్టమైన ప్రజగా ఉండాలని అపేక్షిస్తున్నాడనే విషయం మీకు తెలుసా? ఇక్కడ యోహాను 4:23, 24 ఏంచెబుతుందో గమనించండి. దేవున్ని “సత్యంతో” ఆరాధించడమంటే అర్థమేమిటి? . . . ఏది నిజమో ఏది కాదో తెలుసుకొనేలా మనకు సహాయపడ్డానికి దేవుడు మనకేమిచ్చాడు? . . . (యోహాను 17:17) అంతేకాదు అది వ్యక్తిగతంగా మనకెంత ప్రాముఖ్యమో గమనించండి. (యోహాను 17:3)’
[• ‘మీ జీవితమంతటిలో మీరు మతభక్తిగల వారిగానే ఉన్నారా? . . . మానవజాతి ఎప్పుడైనా ఒకేమతమందు ఐక్యపర్చబడుతుందని మీరనుకుంటున్నారా? . . . ఇక్కడ ప్రకటన 5:13లో వ్రాయబడిన దాని దృష్ట్యా ఈ విషయాన్ని గూర్చి నేనెంతో ఆలోచించాను. . . . ఇక్కడ చిత్రీకరింపబడిన వారిలో మనమూ ఉండాలంటే మనమేంచేయాలి?’]
• ‘మీవలెనే ఆత్మీయ సంగతులందు ఆసక్తిగలవారిని కలుసుకోవాలనే ఆశతో వస్తున్నాను. కాని ఈనాడు అనేకమంది అలాలేరు. సమస్త దుష్టత్వాన్ని నిర్మూలించి దేవుడు ఈ భూమిని కేవలం నీతిని ప్రేమించే ప్రజలు మాత్రమే నివసించే స్థలంగా మారుస్తాడనే బైబిలు వాగ్దానం విషయంలో మీ అభిప్రాయమేమిటి? మీకది ఆమోదయోగ్యంగా ఉందా?’
• ‘మీరు చర్చి కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటారా? . . . చర్చిలో ఈ మధ్య జరిగే కూటాలకు ఎక్కువమంది వస్తున్నారా? . . . తమ దైనందిన జీవితంలో దేవుని వాక్యాన్ని అన్వయించే నిజమైన కోరికను అనేకమంది సభ్యులు చూపించడాన్ని మీరు గమనిస్తున్నారా? (లేదా, లోకం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం విషయంలో సభ్యులమధ్య ఏకతలంపును మీరు చూస్తున్నారా?) వ్యక్తిగత గృహ బైబిలు ఉపదేశం సహాయకరంగా ఉన్నట్లు మేము కనుగొన్నాము.’
• ‘మీ మతంతో మీరు సంతృప్తిగా ఉన్నట్లు కన్పిస్తున్నది. కాని ప్రపంచ పరిస్థితుల విషయంలో అనేకమంది ప్రజలు సంతృప్తికరంగా లేరు. బహుశ మీ విషయంలో కూడ అది నిజమైయుండవచ్చు, మీరేమంటారు? . . . ఇదంతా దేనికి నడిపిస్తుందంటారు?’
• ‘బైబిలు చదవడం మీకిష్టమేనా? . . . క్రమంగా దాన్ని చదవడానికి మీకు సమయముంటుందా?’
• ‘నాతో మీరలా చెప్పాడాన్ని నేనభినందిస్తాను. మన మతమేదైననూ, ప్రపంచ శాంతిని గూర్చి (లేదా, మన పిల్లల్ని చెడు ప్రభావాలనుండి కాపాడే మార్గాల్ని గూర్చి; లేదా, ఒకరినొకరు నిజంగా ప్రేమించే పొరుగువారిని కలిగివుండడాన్ని గూర్చి; లేదా, ఇతర ప్రజలతో మంచి సంబంధాల్ని కలిగివుండడాన్ని, ఆలాగే ప్రతివారు ఒత్తిడిక్రింద ఉన్నప్పుడు అది తేగల సవాలును గూర్చి) మనమందరము శ్రద్ధకలిగియున్నామనే విషయాన్ని మీరంగీకరిస్తారని నేననుకుంటున్నాను.’
• ‘మీకు మతాసక్తి ఉన్నందుకు నాకు సంతోషంగా ఉంది. ఈనాడు అనేకమంది మతాన్ని గంభీరంగా తీసుకోరు. కొందరైతే దేవుడే లేడని తలస్తారు. అయితే, మీకు బోధింపబడిన ప్రకారం దేవుడెటువంటి వ్యక్తని మీరనుకుంటున్నారు? . . . బైబిలు ఆయన వ్యక్తిగత నామాన్ని మనకు తెలియజేస్తుంది మీరేచూడండి. (నిర్గ. 6:3; కీర్తన 83:18)’
[• ‘ప్రకటించడానికి యేసు తన శిష్యులను పంపినప్పుడు, ఆయన వారితో భూమిమీది ప్రతి ప్రాంతమునకు వెళ్లుడని చెప్పాడు, కాబట్టి వారు తమదికాని వివిధ మతాల ప్రజలను కలుసుకునేవారు. (అపొ. 1:8) అయితే నీతికొరకు ఆకలి దప్పులుగల వారు వింటారని ఆయనకు తెలుసు. మన కాలాల్లో ప్రకటింపబడునని ఆయన చెప్పిన ప్రత్యేక వర్తమానమేమి? (మత్తయి 24:14) ఆ రాజ్యము మనకే భావం కలిగియుంది?’]
‘మేము కూడా క్రైస్తవులమే’
• ‘అలానా, నాకెంతో సంతోషంగా ఉంది. అయితే ప్రతియింటకి వెళ్లి ప్రజలను కలుసుకుంటూ యేసు కూడా ఇలాంటి పనే చేశాడని, శిష్యులును అదేవిధంగా చేయాలని ఆయన ఆజ్ఞాపించాడని నిస్సందేహంగా మీక్కూడా తెలిసుంటుంది. వారు చేసిన ప్రకటన పని ముఖ్యాంశమేమిటో మీకు తెలుసా? . . . మేమీనాడు దాన్ని గూర్చి మాట్లాడ్డానికే వచ్చాము. (లూకా 8:1; దాని. 2:44)’
• ‘అయితే కొండమీది ప్రసంగమందు యేసు చెప్పిన విషయంలోని గంభీరతను మీరు గుణగ్రహిస్తారని నేను నమ్ముతున్నాను. ఆయన సూటిగా చెప్పిననూ, ప్రేమపూర్వకంగా ఇలా . . . (మత్తయి 7:21-23) కాబట్టి మనమేమని ప్రశ్నించుకోవాలంటే, పరలోక తండ్రి చిత్తం నాకెంత బాగుగా తెలుసు? (యోహాను 17:3)’
‘పనితొందరలో ఉన్నాను’
• ‘అయితే నేను క్లుప్తంగానే చెప్తాను. నేను మీతో ఒక ప్రాముఖ్యమైన అంశం మాట్లాడ్డానికొచ్చాను. (ఒకటి రెండు వాక్యాల్లో, మీ చర్చయొక్క సారాంశం చెప్పండి.)’
• ‘పర్వాలేదు. మీకు అనుకూలంగావుండే మరో సమయంలో వచ్చి మాట్లాడతాలెండి. అయితే నేను వెళ్లకముందు, నిజంగా మనమాలోచించగల ఒక ప్రాముఖ్య విషయాన్ని తెల్పే ఒకేఒక లేఖనాన్ని మీకు చదివి వినిపిస్తాను.’
• ‘నేను అర్థంచేసుకోగలను. తల్లిగా (లేదా, ఉద్యోగస్థునిగా; లేదా, విద్యార్థిగా) నాక్కూడా చాలా పనులన్నాయి. అందువల్ల నేను క్లుప్తంగానే చెప్తాను. మనందరము ఒక గంభీరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాము. దేవుడు ప్రస్తుత దుష్ట విధానాన్ని నాశనంచేసే కాలానికి మనం అతిసమీపంగా ఉన్నామని బైబిలు తెల్పుతుంది. అయితే రక్షింపబడేవారు ఉంటారు. అందువలన ప్రశ్నేమంటే వారిలో మనమూ ఉండాలంటే మీరైనా, నేనైనా ఏమిచేయాలి? బైబిలు ఆ ప్రశ్నకు సమాధానమిస్తుంది. (జెఫన్యా 2:2, 3)’
• ‘మీకు తెలుసోలేదో, మేమందుకే అందరిని కలుస్తున్నాము. మనందరం పనితొందరలో ఉన్నాము, ఎంత పనిరద్దీ అంటే కొన్నిసార్లు ప్రాముఖ్యమైన సంగతుల్ని సహితం మనం నిర్లక్ష్యం చేస్తుంటాము, ఏమంటారు? . . . నేను చాలా క్లుప్తంగా చెప్తాను, అయితే మీరు కనీసం ఈ వచనాన్ని ఆసక్తిగా వింటారని నేను నమ్ముతున్నాను. (లూకా 17:26, 27) మనలో ఎవరూ అలాంటి పరిస్థితిలో ఉండాలని ఇష్టపడరు, కాబట్టి బైబిలుచెప్పే విషయాల్ని పరిశీలించడానికి పనితొందరగల మన జీవితాల్లో సమయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. (సాహిత్యం అందించండి.)’
• ‘మీ ఇరుగుపొరుగువారిని కొంతమందిని సందర్శించి, ఒక అరగంట తర్వాత మేము మరలా వస్తే మీకు వీలవుతుందా?’
[• ‘అయితే మీకు ఇబ్బంది కల్గించను లెండి. వీలుంటే నేను మరోరోజు వస్తాను. అయితే నేను వెళ్లకముందు, మేము ప్రత్యేకంగా అందిస్తున్న పుస్తకాన్ని మీకు చూపించాలనుకుంటున్నాను. (ఆ నెలకొరకైన అందింపు పుస్తకాన్ని చూపించండి.) ఈ సాహిత్యంలో (ఒకటి రెండు ప్రశ్నల్ని ప్రస్తావించి) ఇటువంటి ప్రశ్నలకు బైబిలిచ్చే జవాబుల్ని మీకు తెల్పే పాఠ్యభాగాలున్నాయి.’]
• ‘క్షమించండి మీకనుకూలంగా లేని సమయంలో వచ్చాను. బహుశ మీకు తెలుసనుకుంటా నేనొక యెహోవాసాక్షిని. మీతో ఒక ప్రాముఖ్యమైన బైబిలు అంశం మాట్లాడుదామని వచ్చాను. మీకిప్పుడు సమయం లేదంటున్నారు కాబట్టి, (అంశంచెప్పి) ఈ విషయాన్ని చర్చించే ఈ కరపత్రం మీకిచ్చి వెళ్లాలనుకుంటున్నాను. దాన్ని చదవడానికి ఎక్కువ సమయం పట్టదు, గాని అదిమీకెంతో ఆసక్తికరంగా ఉంటుంది.’
[• ‘నేను అర్థంచేసుకోగలను. అన్ని పనులూ చేసుకోవడానికి అసలు సమయమే చాలనట్లన్పిస్తుంది. కాని మీరు నిత్యమూ జీవించగల్గితే జీవితమెంత భిన్నంగా ఉంటుందో మీరెప్పుడైనా ఆలోచించారా? అది వింతగా అన్పించవచ్చు. అయితే అది సాధ్యమే అని వివరించే ఒకేఒక బైబిలు వచనాన్ని నేను మీకు చూపిస్తాను. (యోహాను 17:3) కాబట్టి, మనమిప్పుడు చేయవలసింది దేవుని గూర్చి, ఆయన కుమారుని గూర్చిన జ్ఞానం సంపాదించుకొనుటే. మేమందుకే ఈ సాహిత్యాలందిస్తున్నాము.’]
‘మీరెందుకిలా తరచు కలుస్తుంటారు’
• ‘ఎందుకంటే బైబిల్లో సూచించినట్లుగా మనం అంత్యదినాల్లో జీవిస్తున్నామని మా నమ్మకం. మన ప్రస్తుత పరిస్థితుల ఫలితాన్ని గూర్చి మనందరం ఆలోచించడం ప్రాముఖ్యమని మేము భావిస్తున్నాము. (ఇటీవలనే జరిగిన లేదా ప్రస్తుత పరిస్థితుల ఒకటి రెండు సంగతులు ప్రస్తావించండి.) కాబట్టి ప్రశ్నేమంటే, ఈ విధానాంతము నుండి మనం రక్షింపబడాలంటే మనమేమి చేయాలి?’
• ‘ఎందుకంటే మేము దేవున్ని, మా పొరుగువారిని ప్రేమిస్తాము. మనందరం చేయాల్సింది అదేకదా?’
‘మీరు చేసే పని నాకు బాగాతెలుసు’
• ‘మీరలా చెప్పడం నాకు ఆనందంగా వుంది. మీ సన్నిహిత బంధువులు లేదా స్నేహితులైవరైనా సాక్షులుగా ఉన్నారా? . . . మేము బైబిలునుండి బోధించే విషయాల్ని, అంటే మనం “అంత్యదినములలో” జీవిస్తున్నామని, త్వరలోనే దేవుడు దుష్టులను నాశనం చేస్తాడని, ఒకరినొకరు నిజంగా ప్రేమించే పొరుగువారితోను, పరిపూర్ణ ఆరోగ్యంతోను ప్రజలు నిత్యము జీవించే పరదైసుగా ఈ భూమి మారుతుందని మీరు నమ్ముతారా?’
‘మా దగ్గర డబ్బులేదు’
• ‘మేము విరాళాలు సేకరించడం లేదండి. మేము ఉచిత గృహ బైబిలు పఠనాలు నిర్వహిస్తున్నాము. దానిలో చర్చించబడే ఒక అంశమిదే. (ప్రస్తుతం అందిస్తున్న సాహిత్యంలోని ఒక అధ్యాయం పేరు ఉపయోగించండి). మేము దాన్నెలాచేస్తామో మీకు కొద్దినిమిషాలు చూపించమంటారా? దానికి మీరేం డబ్బివ్వక్కర్లేదు.’
• ‘మాకు ప్రజలంటేనే ఆసక్తి గాని, డబ్బంటే కాదు. (చర్చను కొనసాగిస్తూ, సాహిత్యాలలో ఒకదాన్ని చూపించి అది వారికెలా ప్రయోజనకరం కాగలదో వివరించండి. వారు నిజమైన ఆసక్తిని కనబరచి, దాన్ని చదువుమని వాగ్దానం చేస్తే, దాన్ని వారికివ్వండి. అది యుక్తమని మీరనుకుంటే, మన ప్రపంచవ్యాప్త సేవకు ఆర్థిక మద్దతు ఎలా లభిస్తుందో వివరించండి.)’
‘నేను బౌద్ధమతస్థుడను’ అని ఎవరైనా అంటే
• ఇతర బౌద్ధమతస్థులందరి నమ్మకాలు ఈ వ్యక్తి నమ్మకాలు ఒకటేననే తీర్మానానికి రావద్దు. జపాన్దేశ బౌద్ధమతానికి దక్షిణాసియాలోని బౌద్ధ మతానికి తేడావుంది. వారివారి దృక్పథాలు వ్యక్తుల్నిబట్టి కూడా ఉంటాయి. అయితే, సాధారణంగా ఈ క్రింది అంశాలు సహాయకరంగా ఉండవచ్చు: (1) బౌద్ధమతం నిత్యుడగు దేవున్ని, సృష్టికర్తను ఒక వ్యక్తిగా గుర్తించదు. కాని బౌద్ధమతస్థులనేకులు ప్రతిమల్ని, బుద్ధవిగ్రహాల్ని ఆరాధిస్తారు. (2) గౌతమ సిద్ధార్థునికే బుద్ధుడని పేరుపెట్టి, అనుచరులకు ఆయననొక మత ఆదర్శంగా, అనుసరించదగిన వ్యక్తిగా దృష్టిస్తారు. మానవ దృష్టితో మానవాళిని అధ్యయనం చేయుట ద్వారా జ్ఞానోదయం పొందమని, ఆలాగే సమస్త కోరికలను త్యజించుటకు మనస్సును అధీనంలో పెట్టుకొనుట ద్వారా బాధల మూలకారణాల్ని ఖండించుమని ఆయన ప్రోత్సహించాడు. ఈ విధంగా ఒకడు వివిధ రూపాల పునర్జన్మను తప్పించుకుని నిర్వాణం పొందవచ్చునని ఆయన బోధించాడు. (3) బౌద్ధమతస్థులు తమ పూర్వికులను ఆరాధిస్తారు, ఎందుకంటే వారే తమ జీవాధారమని వారి నమ్మకము.
సంభాషణా సూచనలు: (1) బౌద్ధమతస్థులతో మాట్లాడేటప్పుడు, మీరు క్రైస్తవమత సామ్రాజ్యంలో భాగంకాదని స్పష్టం చేయండి. (2) బౌద్ధమతస్థులు “పరిశుద్ధ గ్రంథాల్ని” గౌరవిస్తారు, అందుకే వారు సాధారణంగా బైబిలును గౌరవిస్తారు. బౌద్ధుల తత్వమేమిటో అదేపనిగా చర్చించే బదులు, బైబిలు నందలి ప్రోత్సాహకరమైన వర్తమానాన్ని అందించండి. బైబిలు కేవలం మానవ తత్వంతో నిండిందికాదని, మానవ సృష్టికర్తయైన యెహోవా దేవుని అధికార వాక్యమని వారికి తెల్పండి. ఈ పరిశుద్ధ గ్రంథమగు బైబిలునుండి ఆసక్తిదాయకమైన అంశాన్ని చూపించవచ్చానని మర్యాదగా అడగండి. (3) అనేకమంది బౌద్ధమతస్థులు శాంతినందు, కుటుంబ జీవనమందు మిక్కిలి శ్రద్ధకలిగియుండి, నైతిక జీవితాల్ని జీవించాలని కోరుకుంటారు. (4) మానవజాతి ఎదుర్కొంటున్న సమస్యలకు నిజమైన పరిష్కారముగా భూమిపై నెలకొల్పబడే నీతియుక్తమైన పరలోక ప్రభుత్వాన్ని గూర్చి బైబిలు సూచిస్తున్నదని చూపించండి. అది భూమి భవిష్యత్తును, భూపరదైసులో నిత్యమూ జీవించే అద్భుతకరమైన ఉత్తరాపేక్షను వివరిస్తుంది. (5) జీవారంభాన్ని, జీవితార్థాన్ని, మృతుల స్థితిని, పునరుత్థాన నిరీక్షణను, దుష్టత్వం ఉండడానికిగల కారణాన్ని బైబిలు వివరిస్తుందని మీరు సూచించవచ్చును. దేవుని వాక్యమందలి స్పష్టమైన సత్యాల్ని దయాపూర్వకంగా వివరిస్తే, గొర్రెవంటివారు మెప్పుతో సహృదయులై ప్రతిస్పందిస్తారు.
చిత్తశుద్ధిగల బౌద్ధమతస్థుల ప్రయోజనార్థమే ఇన్ సెర్చ్ ఆఫ్ ఎ ఫాదర్ అనే చిన్నపుస్తకం ప్రత్యేకంగా తయారుచేయబడింది.
‘నేను హిందువును’ అని ఎవరైనా అంటే
• హిందూమత తత్వం ఒక చిక్కుముడిగా ఉండి సాధారణ న్యాయతర్కనకు అంత సులభంగా లోబడేదికాదని మీరు తెలుసుకోవాలి. ఈ క్రింది అంశాలు మీ మనస్సులో ఉంటే మీకు సహాయకరంగా ఉండొచ్చు: (1) బ్రహ్మదేవునికి మూడు రూపాలున్నాయని, అంటే బ్రహ్మ సృష్టికర్తని, విష్ణువు సంరక్షకుడని, శివుడు నాశనకర్తని హిందువులు బోధిస్తారు. అయితే వ్యక్తిగతంగా ప్రత్యేకంగా ఒక దేవుడున్నాడని హిందువులు తలంచరు. (2) ప్రకృతి సంబంధమైన ప్రతిదానికి అమర్త్యమైన ఆత్మ ఉంటుందని, అట్టి ఆత్మ అనంత పునర్జన్మల చక్రంలో తిరుగుతుంటుందని, దాని పునర్జన్మ రూపం దాని క్రియల్ని (కర్మని) బట్టి ఉంటుందని, ఈ “అనంత చక్రం” నుండి విడుదల కేవలం శరీర కోరికలన్నింటిని చంపుకోవడం ద్వారానే సిద్ధిస్తుందని, అలా దాన్ని సాధిస్తే ఆత్మ పరమాత్మలో లీనమైపోతుందని హిందువులు నమ్ముతారు. (3) సాధారణంగా, హిందువులు ఇతర మతాల్ని గౌరవిస్తారు. వారు భిన్న సిద్ధాంతాల్ని బోధించిననూ, అన్నిమతాలు ఒకే సత్యానికి దారితీస్తాయని హిందువులు విశ్వసిస్తారు.
హిందూమత తత్వ చిక్కుముడిని చర్చించడానికి ప్రయత్నించే బదులు, పరిశుద్ధ బైబిలునందున్న సంతృప్తికరమైన సత్యాల్ని అందించండి. జీవము కొరకు యెహోవా ప్రేమతో చేసిన ఏర్పాట్లు అన్ని తరగతుల ప్రజలకు తెరువబడివున్నాయి, ఆయన వాక్యమందలి స్పష్టమైన సత్యాలు, నీతికొరకు ఆకలి దప్పులుగల ప్రజల హృదయాల్ని చేరతాయి. కేవలం బైబిలు మాత్రమే భవిష్యత్తుకొరకు నిజమైన నిరీక్షణ నిస్తున్నది; కేవలం బైబిలు మాత్రమే మానవజాతి ఎదుర్కొంటున్న ప్రాముఖ్యమైన ప్రశ్నలకు నిజంగా సంతృప్తికరమైన జవాబులనిస్తున్నది. ఆ జవాబులు వినే అవకాశాన్ని వారికివ్వండి. హిందూ ఋగ్వేదం శ్లోకం, 10. 121 పైవిలాసమందు “తెలియబడని దేవునికి” అని వ్రాసివుండడం ఆసక్తికరమైన విషయం. కొన్ని సందర్భాల్లో దీనిని సూచించడం యుక్తంగా ఉంటుంది. (అపొ. 17:22, 23 పోల్చండి.) ఆసక్తదాయకమైన విషయమేమంటే, హిందూ దేవుడగు విష్ణు, గ్రీకు వర్ణములలోని 6వ అక్షరం లేకుండా అయితే ఇష్ణు అని చదువుబడుతుంది. దీనికి కల్దీయుల భాషలో “నోవహు అనే మనిషి” అని అర్థం. నోవహు కాలమందలి భౌగోళిక జలప్రళయ ప్రాముఖ్యతను గూర్చి బైబిలుచెప్పే విషయాన్ని సూచించండి.
విడుదలకు నడుపు దైవీక సత్యమార్గము, కురుక్షేత్రం నుండి అర్మగెద్దోను వరకు—మరియు మీరు జీవముతో తప్పించుకొనుట అనే చిన్నపుస్తకాలు, ఆలాగే మన సమస్యలు వాటిని పరిష్కరించుటకు ఎవరు సహాయము చేయుదురు? అనే బ్రోషర్ సహృదయంగల హిందువులకు మిక్కిలి ప్రయోజనకరంగా ఉంటాయి.
‘నేను యూదుడను’ అని ఎవరైనా అంటే
• మొట్టమొదట, యూదునిగా ఆ వ్యక్తి తననుతాను ఎలా దృష్టించుకొనుచున్నాడో రూఢిగా తెలుసుకోండి. ఎందుకంటె, చాలామంది కేవలం మతబిరుదు కొరకే యూదులుగా ఉంటున్నారు.
మనస్సులో ఉంచుకోవడానికి ప్రయోజనకరమైన కొన్ని అంశాలు ఇక్కడ యివ్వబడ్డాయి: (1) మతాసక్తిగల యూదులు దేవుని నామాన్ని ఉచ్చరించడాన్ని నిషేధిస్తారు. (2) అనేకమంది యూదులు “బైబిలును” క్రైస్తవ గ్రంథమని తలస్తారు, అయితే మీరు “హెబ్రీలేఖనాలని,” “లేఖనాలని,” లేదా “తోరా” అని మాట్లాడితే సమస్య ఉత్పన్నం కాదు. (3) పారంపర్యాచారం వారి విశ్వాసానికి కేంద్రభాగం, ఆలాగే అనేకమంది యూదులు వాటిని లేఖనాల అధికారముతో సమానంగా దృష్టిస్తారు. (4) యేసు పేరిట క్రైస్తవమత సామ్రాజ్యం యూదులను అతిక్రూరంగా హింసించడాన్ని వారు యేసుక్రీస్తుకు ముడిపెడతారు. (5) యూదులు విశ్రాంతి దినాన్ని ఆచరించాలని దేవుడు కోరుచున్నాడని వారు తరచు నమ్ముతారు, ఆ రోజు డబ్బు ఇచ్చిపుచ్చుకోవడం సహితం చేయకూడదనే నమ్మకం కూడా ఉంది.
సంభాషించడానికి సాధారణ విషయంగా మీరిట్లనవచ్చు: (1) ‘మన మతమేదైననూ, నేడు మనం లోకంలో ఎన్నోకష్టాల్ని ఎదుర్కొంటున్నామనే విషయాన్ని మీరు నిస్సందేహంగా అంగీకరిస్తారు. ఈ తరం ఎదుర్కొంటున్న పెద్ద సమస్యలకు నిజంగా ఒక శాశ్వత పరిష్కారముంటుందని మీరు నమ్ముతారా? (కీర్తన 37:10, 11, 29; కీర్తన 146:3-5; దాని. 2:44)’ (2) ‘మేము క్రైస్తవమత సామ్రాజ్యానికి సంబంధించిన వాళ్లం కాము, మేము త్రిత్వాన్ని విశ్వసించం అయితే అబ్రాహాము దేవున్ని ఆరాధిస్తాం. మేము ప్రత్యేకంగా మత సత్యం విషయంలో ఆసక్తి కలిగివున్నాము. విశేషంగా యూదులమధ్య నమ్మకాల విషయంలో పెద్ద విభేదాలున్న దృష్ట్యా, ఏది సత్యమో మీరెలా తీర్మానించగలరు? . . . (ద్వితీ. 4:2; యెషయా 29:13, 14; కీర్తన 119:160)’ (3) ‘తన సంతానము ద్వారా అన్ని జనాంగములు ఆశీర్వదించబడునని దేవుడు అబ్రాహాముకు చేసిన వాగ్దానమందు మేము మిక్కిలి శ్రద్ధ కలిగియున్నాము. (ఆది. 22:18)’
ఒకవేళ ఆ వ్యక్తి దేవునియందు అపనమ్మకాన్ని వ్యక్తపరిస్తే, అతడన్ని సమయాల్లో అలానే భావిస్తున్నాడా అని అడగండి. ఆ పిమ్మట బహుశ దేవుడు దుష్టత్వాన్ని, బాధను ఎందుకు అనుమతించాడో చర్చించండి. నాజీ విపత్తును గూర్చిన జ్ఞాపకాలు అనేకమంది యూదులు ఈ విషయంలో చింత కలిగియుండుటకు కారణమయ్యాయి.
దేవుని నామమును ఉపయోగించే ప్రాముఖ్యతను గూర్చి మీరు చర్చించినట్లయితే, దాన్నిగూర్చి ఆ వ్యక్తి భావాల్ని మొదట కనుక్కోండి. నిర్గమకాండము 20:7 దేవుని నామాన్ని వ్యర్థంగా ఉపయోగించడాన్ని నిషేధిస్తుంది, అయితే అది ఆ నామాన్ని గౌరవప్రదంగా ఉపయోగించడాన్ని నిషేధించుట లేదు. ఆ పిమ్మట నిర్గమకాండము 3:15 (లేదా కీర్తన 135:13); 1 రాజులు 8:41-43; యెషయా 12:4; యిర్మీయా 10:25; మలాకీ 3:16 వంటి వచనాల్ని తర్కించండి.
మెస్సీయను గూర్చి మీరు చర్చించినప్పుడు: (1) ఆయన గుర్తింపును గూర్చికాక, ఆయన భవిష్యత్ పాలన క్రిందవుండే ఆశీర్వాదములను మొదట చర్చించండి. (2) ఆ తర్వాత మెస్సీయను వ్యక్తిగా సూచించే వచనాలపై తర్కించండి. (ఆది. 22:17, 18; జెకర్యా 9:9, 10; దాని. 7:13, 14) (3) మెస్సీయ రెండు రాకడలను గూర్చి మీరు చర్చించాల్సి ఉంటుంది. (దానియేలు 7:13, 14కు దానియేలు 9:24-26కు మధ్యగల తేడా చూపండి.) (4) యేసును సూచించినప్పుడు, దేవుని సంకల్పాల ప్రగతిపూర్వక నైజాన్ని నొక్కితెల్పే సందర్భమందు మాత్రమే అలాచేయండి. యేసు బోధించిన కాలం, ఆలయం యిక ఎన్నటికీ నిర్మించబడకుండా రెండవసారి నాశనం కావడానికి దేవుడు అనుమతించిన కాలం కాదుగాని, ధర్మశాస్త్రం, ప్రవక్తల మాటలు నెరవేరు కాలమని, ఆలాగే వారు విశ్వాసులైన వ్యక్తులను మహిమగల భవిష్యత్తుకు నడిపించే కాలమని యేసు నొక్కితెల్పాడు.