ప్రపంచ పరిశీలన
బ్రెజిల్‌లో 10-13 ఏళ్లలోపు స్కూలు పిల్లల్లో దాదాపు 17 శాతం మంది ఇతరులను కొట్టారు లేదా వాళ్ల చేతుల్లో తన్నులు తిన్నారు.—ఆ ఎస్టాడా డ సౌన్ పౌలూ, బ్రెజిల్.
అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, మూత్రపిండాల్లో రాళ్లు, కాలేయ సమస్యలు 12 ఏళ్లలోపు పిల్లల్లో కనబడుతున్నాయి. దానికి ముఖ్య కారణాలు ఏమిటి? ఎక్కువసేపు కూర్చుని ఉండే జీవన విధానం, ఎక్కువగా చిరుతిళ్లు తినడం, అధిక బరువు.—ఎబిసి, స్పెయిన్.
ఒక పిల్లవాణ్ణి పెంచడానికయ్యే ఖర్చు: 2008లో పుట్టిన ఒక పిల్లవాణ్ణి 18 ఏళ్లు వచ్చేవరకు పెంచడానికి అమెరికాలోని ఒక మధ్య తరగతి కుటుంబానికి “దాదాపు $221,190 [రూ. 98,91,617] (ద్రవ్యోల్బణాన్ని బట్టి మారిస్తే $291,570 [రూ. 1,30,39,010])” ఖర్చు అవుతుందని ఒక ప్రభుత్వం అంచనా వేసింది. —యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్, అమెరికా.
ఆడడం మర్చిపోయారు
బ్రిటన్‌లోని ప్రతీ ఐదుగురు తల్లిదండ్రుల్లో ఒకరు “తమ పిల్లలతో ఆడుకోవడం మరచిపోయారు” అని ఇటీవల జరిగిన ఒక సర్వేలో తేలింది. ప్రతీ ముగ్గురిలో ఒకరు ఆట బోరు కొట్టిస్తుందనో, అంత సమయం లేదనో, ఆటలు తెలియవనో చెప్పారు. తల్లిదండ్రులు పిల్లలతో కలిసి చక్కగా ఆడుకోవడానికి ముఖ్యంగా నాలుగు అంశాలు దోహదపడతాయని క్లినికల్ సైకాలజిస్ట్, ప్రొఫెసర్ టాన్య బైరన్ అంది. అవేమిటంటే పిల్లలు కొత్త విషయాలను నేర్చుకోవాలి, సృజనాత్మకత పెంచుకోవాలి, ఇతరులతో ఎలా మెలగాలో, ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలి. ప్రతీ ముగ్గురు తల్లిదండ్రుల్లో ఒకరు తమ పిల్లలతో కలిసి కంప్యూటర్ గేములు ఆడడానికి ఇష్టపడుతున్నారు. కానీ చాలామంది యౌవనులు మాత్రం వాటిని ఒంటరిగా ఆడుకోవడానికే మొగ్గుచూపుతున్నారు. 5 నుండి 15 ఏళ్లలోపు పిల్లలు, ఆరుబయట లేదా బోర్డ్ మీద ఆడే ఆటలను తల్లిదండ్రులతో కలిసి ఆడడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు.
బెడ్‌టైం కథలు
పిల్లలు పడుకునేముందు వాళ్లకు కథలు చదివి వినిపించడానికి తీరికలేని తండ్రులకు ఇంటర్నెట్ సర్వీసు ఒక సౌలభ్యం కల్పిస్తోంది. ‘తండ్రులు తాము చదివిన కథను రికార్డు చేసి, హైటెక్ సాఫ్ట్‌వేర్ సహాయంతో దానికి సంగీతం, ఇతరత్రా సౌండ్ ఎఫెక్ట్స్‌ను జోడించి, ఈ-మెయిల్‌లో ఆ ఆడియో ఫైల్‌ను తమ పిల్లలకు పంపించే అవకాశముంది’ అని సిడ్నీ డెయిలీ టెలిగ్రాఫ్ చెబుతోంది. కుటుంబ బాంధవ్యాలను అధ్యయనం చేసే నిపుణులు ఈ విషయంలో సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఆస్ట్రేలియాలోని న్యూకాసిల్ విశ్వవిద్యాలయంలో ఒక ఫ్యామిలీ రీసర్చ్ ప్రోగ్రామ్‌కు నాయకత్వం వహిస్తున్న డాక్టర్ రిచర్డ్ ఫ్లేచ్చర్ ఇలా అన్నాడు: “పిల్లలకు దగ్గరయ్యేందుకు చదివి వినిపించడం చాలా ముఖ్యం.” అలా దగ్గరవ్వాలంటే తండ్రులు పిల్లలతో మాట్లాడాలి, వాళ్లను ప్రేమతో దగ్గరకు తీసుకోవాలి, వాళ్లతో కలిసి సరదాగా గడపాలి. మీరు పంపించే ఏ ఈ-మెయిలూ, పిల్లలతో కూర్చుని చదివి వినిపించడంతో సాటిరాదని ఆయన అన్నాడు.