శైశవదశ నుండి కౌమారదశ వరకు పిల్లలను ఎలా పెంచాలి?
“పిల్లలకు ఐదేళ్లు వచ్చేంతవరకు వాళ్లు మీ సంరక్షణలోనే ఉంటారు కాబట్టి, వాళ్లకు మంచిబుద్ధులు నేర్పించడం సులువే. ఒక్కసారి వాళ్లు స్కూలుకు వెళ్లడం మొదలుపెట్టాక, రకరకాల ప్రవర్తన, మాటతీరు ఉన్న ప్రజలను చూస్తారు.”—వాల్టర్, ఇటలీ.
పిల్లలు పెరిగే కొద్దీ బయటి ప్రపంచంతో వాళ్లకు పరిచయం పెరుగుతుంది. తాము ఆడుకునే పిల్లలతో, తోటి విద్యార్థులతో, బంధువులతో మాట్లాడే అవకాశం దొరుకుతుంది. పైన ప్రస్తావించిన వాల్టర్ అన్నట్లు ముందులా ఇప్పుడు మీ పిల్లవాడికి మీరే లోకం కాదు, వాడిమీద ఇతరుల ప్రభావం కూడా ఉంటుంది. అందుకే, పెద్దవాళ్ల మాట వినడం, మంచిమర్యాదలు కలిగివుండడం ఎంత అవసరమో పిల్లలకు ఈ దశలో తప్పకుండా నేర్పించాలి. తప్పొప్పుల గురించి కూడా చెప్పాలి.
ఈ లక్షణాలన్నీ ఒక్కసారిగా వాటంతటవే అలవడవు. మీరు ‘తప్పులు సరిదిద్దుతూ, అవసరమైతే గద్దిస్తూ, ప్రోత్సహిస్తూ, సహనంతో బోధించాల్సి’ రావచ్చు. (2 తిమోతి 4:2, పరిశుద్ధ బైబల్: తెలుగు ఈజీ-టు-రీడ్ వర్షన్) దేవుడు తన నియమాల గురించి ఇశ్రాయేలులోని తల్లిదండ్రులకు ఇలా ఆజ్ఞాపించాడు: ‘నువ్వు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, ఇంట్లో కూర్చున్నప్పుడు, త్రోవలో నడిచేటప్పుడు, పడుకునేటప్పుడు, లేచేటప్పుడు వాటి గురించి మాట్లాడాలి.’ (ద్వితీయోపదేశకాండము 6:6, 7) ఆ మాటలు చెబుతున్నట్లు, పిల్లలకు ఎప్పుడూ బోధిస్తూ ఉండాలి.
పిల్లలను పెంచడంలో ఎన్నో సాధకబాధకాలు ఉంటాయి. వాటిలో కొన్నిటిని ఇప్పుడు చూద్దాం.
వినడానికి సమయం
‘మాట్లాడడానికి సమయం కలదు’ అని బైబిలు చెబుతోంది. అలాగే వినడానికి కూడా ఒక సమయముంది. (ప్రసంగి 3:1, 7) మీరుగానీ, వేరేవాళ్లుగానీ మాట్లాడినప్పుడు శ్రద్ధగా వినేలా మీ పిల్లలకు ఎలా శిక్షణనివ్వవచ్చు? ఈ విషయంలో మీరే ఆదర్శంగా ఉండాలి. వేరేవాళ్లు చెప్పేదే కాదు, మీ పిల్లలు చెప్పేది కూడా మీరు శ్రద్ధగా వింటారా?
పిల్లలు ఒకదానిమీద ఎక్కువసేపు మనసుపెట్టలేరు. వాళ్లతో మాట్లాడుతున్నప్పుడు కొన్నిసార్లు మీ ఓపిక నశించవచ్చు. పిల్లలంతా ఒకేలా ఉండరు కాబట్టి, మీ పిల్లలను జాగ్రత్తగా గమనించి, వాళ్లతో ఎలా మాట్లాడితే బావుంటుందో ఆలోచించండి. బ్రిటన్‌లో ఉంటున్న డేవిడ్ ఇలా అంటున్నాడు: “నేను చెప్పింది తిరిగి చెప్పమని మా పాపను అడుగుతాను. దానివల్ల, ఆమె మునుపటికన్నా ఇప్పుడు చక్కగా వింటోంది.”
యేసు తన శిష్యులకు బోధిస్తున్నప్పుడు, ‘మీరెలా వింటున్నారో చూసుకోండి’ అని అన్నాడు. (లూకా 8:18) పెద్దవాళ్లే జాగ్రత్తగా వినాలంటే, ఇక పిల్లల సంగతి వేరే చెప్పనక్కర్లేదు.
‘ఒకరినొకరు క్షమించుకోండి’
‘ఎవరైనా తనకు హానిచేశారని ఒకరనుకుంటే ఒకరినొకరు సహిస్తూ ఒకరినొకరు క్షమించుకోండి’ అని బైబిలు చెబుతోంది. (కొలొస్సయులు 3:13) పిల్లలకు క్షమాగుణాన్ని ఎలా నేర్పించాలి?
ఈ విషయంలో కూడా మీరు ఆదర్శంగా ఉండాలి. మిమ్మల్ని నొప్పించిన వాళ్లను మీరు క్షమించడం మీ పిల్లలు చూడాలి. రష్యావాసి అయిన మర్యీన అలా చేయడానికి కృషిచేస్తోంది. ఆమె ఇలా అంటోంది: “మేము ఇతరులను క్షమించడానికీ పట్టువిడుపులు చూపించడానికీ, అనవసరంగా కోప్పడకుండా ఉండడానికీ కృషిచేస్తాం. ఈ విషయంలో మా పిల్లలకు ఆదర్శంగా ఉండాలనుకుంటున్నాం. అంతేకాదు, నేను ఏదైనా పొరపాటు చేస్తే, క్షమించమని పిల్లలను అడుగుతాను. వాళ్లు కూడా ఇతరులతో అలాగే వ్యవహరించడం నేర్చుకోవాలనేదే నా కోరిక.”
పెద్దవాళ్లయ్యేసరికి ఇతరులతో వచ్చే సమస్యలను పరిష్కరించుకోవడం, ఇతరులను క్షమించడం పిల్లలకు తెలియాలి. అందుకే, ఇతరులను అర్థంచేసుకోవడం, తప్పులు ఒప్పుకోవడం పిల్లలకు ఇప్పటినుండే నేర్పించాలి. ఎదిగేకొద్దీ అది వాళ్లకెంతో ఉపయోగపడుతుంది.
కృతజ్ఞత చూపించండి
ఈ ‘అపాయకరమైన కాలాల్లో’ స్వార్థపరులే ఎక్కువగా ఉన్నారు. (2 తిమోతి 3:1, 2) అందుకే, పిల్లల్లో చిన్నప్పటి నుండే కృతజ్ఞతాభావం అలవడేలా చూడాలి. కృతజ్ఞత చూపించమని అపొస్తలుడైన పౌలు కూడా చెప్పాడు.—కొలొస్సయులు 3:15.
పిల్లలు చిన్నప్పటినుండే మంచిమర్యాదలు చూపించడం, ఇతరుల అవసరాలను గుర్తించడం నేర్చుకోగలరు. వాళ్లకు అది నేర్పించాలంటే ఏమి చేయాలి? పేరెంట్స్ మ్యాగజైన్లో డాక్టర్ కైల్ ప్రూవట్ ఇలా రాశాడు: “మీ పిల్లలకు కృతజ్ఞత చూపించడం నేర్పించాలంటే, మీరు ఇంట్లోవాళ్ల పట్ల ఎప్పుడూ కృతజ్ఞత చూపించడం వాళ్లు గమనించాలి. ఇతరులు మీకు సహాయం చేసినప్పుడు, మీ అవసరాలు గుర్తించి, మీ కోసం ఏవైనా పనులు చేసిపెట్టినప్పుడు వాటిని మీరెంత మెచ్చుకుంటున్నారో చెప్పాలి . . . దీనికి ఎంతో కృషి చేయాలి.”
బ్రిటన్‌వాసి అయిన రిచర్డ్ అలా చేయడానికి కృషి చేస్తున్నాడు. ఆయనిలా అంటున్నాడు: “టీచర్లు, తాతామామ్మల వంటివాళ్లు మాతో దయగా ప్రవర్తించినప్పుడు, వాళ్లకు ఎలా కృతజ్ఞతలు తెలపాలో మేమిద్దరం నేర్పిస్తాం. ఎవరైనా భోజనానికి పిలిస్తే, వాళ్లకు కృతజ్ఞతలు తెలపడానికి ఒక చిన్న కార్డు తయారుచేస్తాం. పిల్లలందరూ దానిమీద సంతకం చేస్తారు, లేదా బొమ్మలు వేస్తారు.” పిల్లలు కృతజ్ఞత, దయ చూపించడం నేర్చుకుంటే, పెద్దయ్యాక ఇతరులతో చిరకాల బంధాలను ఏర్పర్చుకోగలుగుతారు.
‘శిక్షించడం మానకండి’
పిల్లలు ఎదిగేకొద్దీ, తాము చేసే పనులకు పర్యవసానాలు ఎదుర్కోక తప్పదని వాళ్లు తెలుసుకోవాలి. ఇంట్లోనేకాదు స్కూల్లో, సమాజంలో పెద్దవాళ్లకు జవాబు చెప్పాల్సిన బాధ్యత పిల్లలకు కూడా ఉంటుంది. అందుకే, తాము చేసే పనులనుబట్టే పర్యవసానాలు కూడా ఉంటాయని పిల్లలకు నేర్పించాలి. (గలతీయులు 6:7) ఎలా నేర్పించాలి?
‘శిక్షించడం మానకండి’ అని బైబిలు చెబుతోంది. (సామెతలు 23:13) ఫలానా తప్పుకు ఫలానా శిక్ష పడుతుందని పిల్లవాడికి చెప్పివుంటే, వాడు తప్పు చేసినప్పుడు ఆ శిక్ష వేయడానికి వెనకాడకండి. “ఎప్పుడూ ఒకేలా ప్రవర్తించాలి, లేకపోతే పిల్లవాడు పరిస్థితిని తనకు ఇష్టమొచ్చినట్టు మలచుకోవచ్చని అనుకుంటాడు” అని అర్జెంటీనాలో ఉంటున్న నార్మా అంటోంది.
మాట వినకపోతే ఎలాంటి పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందో పిల్లలకు ముందే అర్థమయ్యేలా చెబితే, ఆ తర్వాత పిల్లవాడు మాట విననప్పుడు గంటల తరబడి వాడితో వాదించాల్సిన పరిస్థితి రాదు. పిల్లలకు కట్టుబాట్లే కాదు, వాటిని పాటించకపోతే వచ్చే పర్యవసానాలు కూడా తెలిసివుండాలి. అంతేకాదు తప్పుచేస్తే, శిక్ష అనుభవించక తప్పదని కూడా వాళ్లకు అర్థంకావాలి. అప్పుడే మీరు వేసే శిక్షకు వాళ్లు అడ్డుచెప్పరు.
మనం పిల్లవాణ్ణి కోపంతో శిక్షిస్తే అనుకున్న ఫలితాలు రావు. బైబిలు ఇలా చెబుతోంది: ‘సమస్తమైన ద్వేషం, కోపం, క్రోధం, అల్లరి, దూషణ విసర్జించండి.’ (ఎఫెసీయులు 4:31) వాళ్లకు వేసే శిక్ష అతి క్రూరంగా లేదా శారీరకంగా, మానసికంగా గాయపర్చే విధంగా అస్సలు ఉండకూడదు.
పిల్లవాడు మీ సహనాన్ని పరీక్షించినప్పుడు మీ కోపాన్ని ఎలా అదుపులో ఉంచుకోవచ్చు? న్యూజిలాండ్వాసి అయిన పీటర్ ఇలా అంటున్నాడు: “అది అంత సులభమేమీ కాదు. అయినా, మనం సహనం కోల్పోయినందుకు కాదుగానీ వాడు తప్పు చేసినందుకే శిక్షిస్తున్నామని పిల్లవాడు తెలుసుకోవాలి.”
తప్పును సరిదిద్దడంవల్ల ముందుముందు ఎంత మేలు జరుగుతుందో తమ పిల్లలు గ్రహించేలా పీటర్, ఆయన భార్య సహాయం చేస్తారు. ఆయన ఇలా అంటున్నాడు: “పిల్లలు మాకెంతో చిరాకు పుట్టించేలా ప్రవర్తించినా, వాళ్లు చేసిన తప్పుల గురించి కాదుగానీ, ప్రవర్తించాల్సిన తీరు గురించే మాట్లాడతాం.”
సహేతుకంగా ఉండండి
తన ప్రజలను ‘న్యాయంగా’ అంటే తగినవిధంగా శిక్షిస్తానని దేవుడు చెప్పాడు. (యిర్మీయా 46:28) తప్పుకు తగ్గ శిక్షే వేయాలి, అలా చేస్తేనే మంచి ఫలితాలొస్తాయి. క్రైస్తవులకు పౌలు ఇలా రాశాడు: ‘మీ సహనాన్ని [“సహేతుకతను,” NW] తెలియనివ్వండి.’—ఫిలిప్పీయులు 4:5.
సహేతుకతను చూపించాలంటే, మీ పిల్లలను శిక్షిస్తున్నప్పుడు వాళ్ల ఆత్మాభిమానాన్ని దెబ్బతినకుండా జాగ్రత్తపడడం కూడా అవసరం. ఇటలీవాసి అయిన సాన్టీ ఇలా అంటున్నాడు: “మా అమ్మాయినిగానీ, మా అబ్బాయినిగానీ ఎప్పుడూ కించపర్చను. సమస్యకు అసలు కారణమేమిటో తెలుసుకుని, దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నిస్తాను. వేరేవాళ్ల ముందు మా పిల్లల్ని సరిదిద్దను. వీలైనంతవరకు తోబుట్టువుల ముందు కూడా అలా చేయను. నలుగురిలో ఉన్నప్పుడుగానీ, ఒంటరిగా ఉన్నప్పుడుగానీ వాళ్ల లోపాలను ఎత్తిచూపి ఎగతాళి చేయను.”
సహేతుకంగా ఉండడం ఎంత తెలివైన పనో పైన చెప్పుకున్న రిచర్డ్‌కి అర్థమైంది. ఆయనిలా అంటున్నాడు: “తప్పు చేసిన ప్రతీసారి శిక్ష పెంచుకుంటూ పోకూడదు. ఒకసారి శిక్షించిన తర్వాత, పిల్లవాడి తప్పును అదేపనిగా ఎత్తిచూపకూడదు.”
పిల్లలను పెంచడానికి ఎంతో కష్టపడాలి, ఎన్నో త్యాగాలు చేయాలి. అయితే, దానివల్ల ఎన్నో మంచి ఫలితాలొస్తాయి. ఆ విషయం రష్యాలో ఉంటున్న యెలేనాకు అర్థమైంది. ఆమె ఇలా అంటోంది: “మా అబ్బాయితో ఎక్కువ సమయం గడిపేలా పార్ట్‌టైం ఉద్యోగం చూసుకున్నాను. అది కొంచెం కష్టమే, ఆర్థికంగా కూడా కొంత నష్టపోవాల్సి వస్తుంది. కానీ వాడి ముఖంలో ఆనందం చూసినప్పుడు, మా మధ్య ఉన్న బంధం బలపడుతోందని గ్రహించినప్పుడు నేను చేసిన త్యాగాలు వృథాకాలేదని అనిపిస్తుంది.”
[11వ పేజీలోని క్యాప్షన్]
పిల్లలు ఇతరుల అవసరాలను గుర్తించడం నేర్చుకోగలరు
[12వ పేజీలోని క్యాప్షన్]
మీ పిల్లలను శిక్షిస్తున్నప్పుడు వాళ్ల ఆత్మాభిమానం దెబ్బతినకుండా జాగ్రత్తపడండి