తల్లిదండ్రులు ఏమంటున్నారంటే . . .
మీకు నర్సరీకి వెళ్తున్న పిల్లవాడు ఉన్నాడా? అలాగైతే, మీకు కొన్ని సవాళ్లు ఎదురౌతాయి. వాడు పేచీ పెడితే ఏమి చేయాలో, తప్పొప్పుల గురించి బోధించి, వాణ్ణి సరైన క్రమశిక్షణలో ఎలా పెట్టాలో మీకు పాలుపోకపోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో కొంతమంది తల్లిదండ్రులు ఏమి చేశారో చూద్దాం.
పేచీలు
“రెండేళ్లప్రాయంలో పిల్లవాడు తను అడిగింది తల్లిదండ్రులు ఇవ్వాల్సిందేనని అనుకుంటాడు. మా బాబు అలాగే చేసేవాడు. అడిగింది ఇవ్వకపోతే, చేతికి అందింది విసిరేసేవాడు. వాడు మా మొదటి సంతానం కాబట్టి, అప్పటికి మాకు అనుభవం లేదు, వాణ్ణి ఎలా అదుపులో పెట్టాలో మాకు అస్సలు అర్థమయ్యేది కాదు. ఇది మామూలేనని వేరేవాళ్లు అన్నా, మా ఆందోళన మాత్రం తగ్గలేదు.”—సూజన్, కెన్యా.
“రెండేళ్లు వచ్చేసరికి మా కూతురు నేలమీద పడి అరిచి గీపెట్టేది. ఏడుపు లంకించుకునేది, దొరికిన వస్తువునల్లా తన్నేది. దాని వాలకం చూసి ఎంతో విసిగొచ్చేది! ఎంత బుజ్జగించినా ఊరుకునేది కాదు. అలాంటప్పుడు, దాన్ని దాని గదిలోకి తీసుకువెళ్లి, కోపం తగ్గాక బయటకు రమ్మని, అప్పుడు మాట్లాడతామని నెమ్మదిగా చెప్పేవాళ్లం. దాని కోపం తగ్గాక నేనుగానీ, మావారుగానీ దాని గదిలోకి వెళ్లి, అలా ఎందుకు ప్రవర్తించకూడదో అర్థమయ్యేలా వివరించేవాళ్లం. ఈ పద్ధతి బాగా పనిచేసింది. ఒకసారైతే అది క్షమించమని దేవునికి ప్రార్థించడం కూడా విన్నాం. కొన్నాళ్లకు అది పేచీలు పెట్టడం తగ్గించింది, ఆ తర్వాత పూర్తిగా మానేసింది.”—యోలాండా, స్పెయిన్.
“బుడతలు తాము హద్దులు దాటి ఎంతవరకు వెళ్లగలరో ప్రయోగించి చూస్తారు. మనం చేయొద్దని నిక్కచ్చిగా చెప్పినదాన్ని చేయనిస్తే, వాళ్లు అయోమయంలో పడతారు. మనం ఎప్పుడూ ఒకేమాటకు కట్టుబడి ఉంటే, అరిచి గీపెట్టడం వల్ల తమకు కావాల్సింది దొరకదని మెల్లమెల్లగా అర్థంచేసుకుంటారు.” —నీల్, బ్రిటన్.
క్రమశిక్షణ
“ఐదేళ్లలోపు పిల్లలు జాగ్రత్తగా వింటున్నారో లేదో తెలుసుకోవడం కష్టమే. అందుకే, వాళ్లకు చెప్పిందే మళ్లీమళ్లీ చెబుతుండాలి. అలా కొన్నిసార్లు కాదు చాలాసార్లు చేయాలి. హావభావాలతో, నిక్కచ్చిగా లెక్కలేనన్నిసార్లు చెప్పిందే చెప్పాలి.”—సెర్జ్, ఫ్రాన్స్.
“మా నలుగురు పిల్లలు ఒకే వాతావరణంలో పెరిగినా, వాళ్లు ఆ వయసులో ఒక్కొక్కరు ఒక్కోలా ప్రవర్తించేవారు. ఒక కూతురేమో మమ్మల్ని బాధపెట్టానని తనకు అనిపిస్తే చాలు ఏడ్చేసేది; మరో కూతురైతే, హద్దులు దాటి ఎంతవరకు వెళ్లగలదో చూసేది. కొన్నిసార్లు కోపంగా చూస్తే లేదా మందలిస్తే సరిపోతుంది. మరికొన్నిసార్లు దండించాల్సివస్తుంది.”—నేతన్, కెనడా.
“తల్లిదండ్రులు అస్సలు రాజీపడకూడదు. అలాగని మొండిగా, కటువుగా ఉండకూడదు. పిల్లవాడు తన తప్పు తెలుసుకుని నిజంగా బాధపడితే, వాడి పరిస్థితిని అర్థంచేసుకుని శిక్ష తగ్గించడం మంచిది.”—మాట్యు, ఫ్రాన్స్.
“నేను ఎక్కువ కట్టుబాట్లు విధించను, కానీ ఉన్నవాటిని మాత్రం మార్చను. హద్దులు దాటితే ఏమౌతుందో మా మూడేళ్ల అబ్బాయికి తెలుసు. అందుకే, వాడు జాగ్రత్తగా ఉంటాడు. నేను అలసిపోయినప్పుడు, వాడి తప్పులను చూసీచూడనట్లు వదిలేయవచ్చు. కానీ కట్టుబాట్ల విషయంలో ఎప్పుడూ ఒకేవిధంగా ఉండాలి కాబట్టి, నాకు కష్టమైనా వాణ్ణి సరిదిద్దుతాను. కట్టుబాట్లు అన్ని సమయాల్లో పాటించడం చాలా ప్రాముఖ్యం.”—నటలీ, కెనడా.
ఎప్పుడూ ఒకేలా ఉండండి
“తల్లిదండ్రులు ఎప్పుడూ ఒకేలా ఉండకపోతే పిల్లలు దాన్ని బాగా గుర్తుపెట్టుకుంటారు.”—మిల్టన్, బొలీవియా.
“కొన్నిసార్లు ఒక ప్రశ్నకు ఎప్పుడూ ఒకే జవాబు ఇస్తానో లేదో తెలుసుకోవడానికి మా అబ్బాయి దాన్నే పలువిధాలుగా అడుగుతుంటాడు. నేనొకటి, వాళ్లమ్మ ఒకటి చెబితే, దానిలో లొసుగు ఉందనుకుని, వాడికి ఇష్టమొచ్చినట్లు చేస్తాడు.”—ఆన్గ్‌కేల్, స్పెయిన్.
“నేను సంతోషంగా ఉన్నప్పుడు మా అబ్బాయి తప్పు చేసినా కొన్నిసార్లు చూసీచూడనట్టు వదిలేసేదాన్ని. అదే చిరాకుగా ఉన్నప్పుడు, కఠినంగా శిక్షంచేదాన్ని. కానీ అలాచేస్తే, ఇంకా చెడు చేయమని వాణ్ణి ప్రోత్సహించినదాన్ని అవుతానని గ్రహించాను.”—గ్యాంగ్-ఆక్, కొరియా.
“తప్పు ఎప్పుడైనా తప్పేనని, అది ఎప్పుడూ ఒప్పుకాదని చిన్నపిల్లలు అర్థంచేసుకోవడం అవసరం.”—ఆన్టాన్యూ, బ్రెజిల్.
“తల్లిదండ్రులు ఎప్పుడూ ఒకేలా ఉండకపోతే, వాళ్లు తనకు అసలు అర్థంకారని వాళ్ల మూడ్‌ని బట్టి వాళ్ల నిర్ణయాలు మారుతుంటాయని పిల్లవాడు అనుకుంటాడు. కానీ తల్లిదండ్రులు తమ ప్రమాణాలకు కట్టుబడి ఉంటే, తప్పు ఎప్పుడూ తప్పేనని వాడికి అర్థమౌతుంది. పిల్లల్లో భద్రతాభావాన్ని కలిగించి, వాళ్లపట్ల ప్రేమ చూపించడానికి ఇదో పద్ధతి.”—జిల్మార్, బ్రెజిల్.
“కొన్నిసార్లు, నలుగురిలో పిల్లలు ఏమి అడిగినా తల్లిదండ్రులు మొహమాటానికిపోయి అడిగింది ఇచ్చేస్తారు. అలాంటి పరిస్థితులను పిల్లలు అలుసుగా తీసుకుంటారు. నేను ఒకసారి దేన్నయినా కాదన్నానంటే, ఎంత బతిమాలినా ఒప్పుకోనని మా బాబుకు ముందే చెబుతాను.”—చాన్గ్-సాక్, కొరియా.
“తల్లిదండ్రులిద్దరూ ఒకేమాటమీద నిలబడాలి. మా ఇద్దరికీ ఏదైనా ఒక విషయం మీద ఏకాభిప్రాయం లేకపోతే వాడు లేనప్పుడు మాట్లాడుకుని పరిష్కరించుకుంటాం. తల్లిదండ్రుల మధ్య ఏకాభిప్రాయం లేకపోతే పిల్లలు దాన్ని వెంటనే పసిగట్టగలుగుతారు. వాళ్లు ఆ పరిస్థితిని అలుసుగా తీసుకోవడానికి ప్రయత్నిస్తారు.”—కెసూస్, స్పెయిన్.
“తల్లిదండ్రుల మధ్య ఏకాభిప్రాయం ఉందనీ, వాళ్లు తన చేతుల్లో కీలుబొమ్మలుకారని పిల్లవాడికి అర్థమైతే వాడు క్షేమంగా ఉన్నట్లే. తను మాట వింటే ఏమి జరుగుతుందో, వినకపోతే ఏమి జరుగుతుందో వాడికి తెలిసిపోతుంది.”—డామారిస్, జర్మనీ.
“ఎప్పుడూ ఒకేలా ఉండాలంటే ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని కూడా మేము గ్రహించాం. అలాచేస్తే, మా మాటను నమ్మవచ్చని దానికి అర్థమౌతుంది.” —హెన్‌డ్రిక్, జర్మనీ.
“నా యజమాని ఉద్యోగ నియమాలను అదేపనిగా మారుస్తూ ఉంటే, నాకు కోపమొస్తుంది. పిల్లలకు కూడా అలాగే అనిపిస్తుంది. వాళ్లకు నియమాలు తెలిసినప్పుడు, అవి మారవనే నమ్మకం కలిగినప్పుడు క్షేమంగా ఉన్నారన్న భావన వాళ్లలో కలుగుతుంది. చెప్పినట్లు చేయకపోతే ఏమౌతుందో కూడా వాళ్లకు తెలియాలి. అందులో కూడా ఏ మార్పూ ఉండదని వాళ్లు గుర్తించాలి.”—గ్లెన్, కెనడా.
[8వ పేజీలోని క్యాప్షన్]
మీ మాట, ‘అవునంటే అవును కాదంటే కాదు అన్నట్లు ఉండాలి.’—యాకోబు 5:12
[9వ పేజీలోని క్యాప్షన్]
ఓ కుటుంబ కథ
అవాంఛిత గర్భధారణ మేమెలా సర్దుకుపోయామంటే . . .
టామ్, యూన్హీ హాన్ చెప్పిన మాటలు
టామ్: మా పెళ్లయిన ఆరు నెలలకే నా భార్య గర్భవతి అయింది. తనను ఓదార్చి, తనలో ధైర్యాన్ని నింపాలి కాబట్టి నేను పైకి ప్రశాంతంగానే ఉన్నాను. కానీ లోలోపల ఎంత ఆందోళనపడ్డానో చెప్పలేను.
యూన్హీ: నాకు ఏమీ పాలుపోలేదు. ఎంతో భయమేసింది. ఒకటే ఏడ్చాను. తల్లిని అవడానికి నేనిప్పుడు సిద్ధంగా లేనని, అది నావల్ల కాదని అనుకున్నాను.
టామ్: నేను కూడా తండ్రి అవడానికి సిద్ధంగా లేననుకున్నాను. కానీ, ఇతర తల్లిదండ్రులతో మాట్లాడిన తర్వాత అవాంఛిత గర్భం మామూలేనని మాకు అర్థమైంది. అమ్మానాన్నలు అవడంలో ఉన్న ఆనందం గురించి ఇతరుల అభిప్రాయం కూడా తెలిసింది. మెల్లమెల్లగా నా భయాందోళనలు పటాపంచలయ్యాయి, పాప కోసం ఎదురుచూడడం మొదలుపెట్టాను.
యూన్హీ: అమన్డ పుట్టాక కొత్త సవాళ్లు ఎదురయ్యాయి. అది గుక్కపెట్టి ఒకటే ఏడ్చేది, నాకు కొన్నివారాలపాటు రాత్రిళ్లు నిద్ర కరువైంది. ఆకలి వేసేది కాదు. చాలా నీరసంగా ఉండేది. నలుగుర్లోకి వెళ్లబుద్ధయ్యేది కాదు. అలాగని ఒక్కదాన్నే ఇంట్లో కూర్చుంటే లాభం లేదనిపించింది. అందుకే, చంటిపిల్లల తల్లులతో సమయం గడిపాను. నా పరిస్థితి గురించి వారితో మాట్లాడిన తర్వాత, నాకే కాదు చాలామందికి అలాంటి సమస్యలు ఉన్నాయని అర్థమైంది.
టామ్: కుటుంబ కార్యకలాపాలు ఎప్పటిలాగే సజావుగా కొనసాగేలా చూశాను. అంటే, యెహోవాసాక్షులమైన మేము పరిచర్యకు, క్రైస్తవ కూటాలకు క్రమం తప్పకుండా వెళ్లాలనుకున్నాం. చిన్నపాప ఉంటే అనుకోని ఖర్చులు ఎన్నో ఉంటాయి. అప్పుల్లో కూరుకుపోతే మామీద ఒత్తిడి పెరుగుతుంది కాబట్టి ఉన్నంతలో సర్దుకుపోయాం.
యూన్హీ: పాప అల్లరిచేస్తుంది కాబట్టి దాన్ని తీసుకుని పరిచర్యకు వెళ్లడం కష్టమని మొదట్లో అనుకున్నాను. నిజానికి చిన్నపిల్లలను ప్రజలు ఇష్టపడతారు. అది తెలిశాక పరిచర్యకు వెళ్లడం మొదలుపెట్టాను, పాప ఆటంకమేమీ కాదని అప్పుడు అర్థమైంది.
టామ్: పిల్లలు ‘యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం, బహుమానం’ అని బైబిలు చెబుతోంది. (కీర్తన 127:3) పిల్లలు విలువైన బహుమానమని ఆ మాటల్ని బట్టి నాకు అర్థమైంది. మనం స్వాస్థ్యాన్ని (ఆస్తిని) ఎలాగైనా ఉపయోగించుకోవచ్చు. దాన్ని సరిగ్గా ఉపయోగించుకునే అవకాశముంది లేదా పాడుచేసుకునే ప్రమాదముంది. పిల్లల ఎదుగుదలలో ప్రతీ దశ ప్రత్యేకమైనది, ఒకసారి అది దాటిపోయిందంటే తిరిగి రాదు కాబట్టి నేను ప్రతీ దశలో మా చిన్నారి వెన్నంటే ఉండాలని తెలుసుకుంటున్నాను.
యూన్హీ: జీవితంలో ఊహించనివి ఎన్నో జరుగుతాయి. అనుకోకుండా పాప పుట్టడం కూడా అలాంటిదే. కానీ అది సంతోషాన్ని ఇస్తుంది. అమన్డకు ఇప్పుడు ఆరేళ్లు. తను లేని జీవితాన్ని అస్సలు ఊహించలేను!
[క్యాప్షన్]
తమ పాప అమన్డతో టామ్, యూన్హీ