యువత ఇలా అడుగుతోంది . . .
నేను మరింత కలివిడిగా ఎందుకు ఉండలేకపోతున్నాను?
“బిడియం అశక్తులనుగా చేస్తుంది. మీరు అధిగమించవలసింది, మిమ్మల్ని వీడని ఈ భయాన్నే. ఇది చాలా నిజం.”—రిచడ్.a
“నేను ఎదుగుతున్న కొలది నా బిడియం నాకు నిజంగా ఒక సమస్యై కూర్చుంది. నేను నాదైన చిన్న లోకంలో ఉన్నట్లుగా ఉండేది.”—18 ఏళ్ళ ఎలిజబెత్.
‘నాలో ఏమైనా లోపముందా? నేనెందుకు మరింత కలివిడిగా ఉండలేకపోతున్నాను?’ అని మిమ్మల్ని మీరు కొన్నిసార్లు ప్రశ్నించుకుంటారా? పైన ఉదాహరించబడిన రిచడ్‌లాగే, క్రొత్తవాళ్ళను కలిసినప్పుడు మీకు కూడా వణుకు పుడుతుండవచ్చు, లేదా బెంబేలెత్తిపోవచ్చు. అధికారం ఉన్నవాళ్ళ మధ్య మీరు ఉన్నప్పుడు, మీకు భయం కలుగుతుండవచ్చు. మీ అనుభూతులను, లేక మీ అభిప్రాయాలను వ్యక్తం చేసే అవకాశం మీకిచ్చినప్పుడు, ఇతరులు మీ గురించి ఏమనుకుంటారో అని కంగారుతో మీరు మౌనం పాటిస్తుండవచ్చు. “నాకు అంతగా పరిచయం లేనివారి దగ్గరికి వెళ్లి మాట్లాడటం చాలా కష్టంగా ఉంటుంది.” అని ట్రేసీ అనే అమ్మాయి ఒప్పుకుంటుంది.
అలాంటి అనుభూతుల వెనుక ఉన్నదేమిటి? సమస్య ఏమిటో అర్థం చేసుకోవడమే, దానిని జయించేందుకు మొదటి మెట్టు. (సామెతలు 1:5) “చుట్టూ ప్రజలున్నప్పుడు నేను ఎందుకలా ఇబ్బందిగా ఫీలవుతానో నాకు తెలియదు. నాకున్న సమస్య ఏమిటో ఇప్పుడు నేను గుర్తించాను, దాన్ని అధిగమించడానికి నేనిక కృషి చేయగలను” అని ఒక స్త్రీ అంటోంది. ఇతరులతో కలివిడిగా ఉండడం కష్టంగా ఉన్నట్లు కొంతమంది యౌవనస్థులకు అనిపించడానికి గల కొన్ని కారణాలను మనం చూద్దాం.
బిడియమనే సమస్య
బిడియమే సర్వ సాధారణ సమస్య కావచ్చు. అందరితో కలివిడిగా ఉండే వ్యక్తి సాధారణంగా వివిధ స్నేహాలను ఆస్వాదిస్తాడు. ఇతరులతో కలవలేని బిడియస్థుడు ఏకాకిని, ఒంటరివాడిని అని ఫీలవుతాడు. “నేను ఎదుగుతున్న కొలది నా బిడియం నాకు నిజంగా ఒక సమస్యై కూర్చుంది. నేను నాదైన చిన్న లోకంలో ఉన్నట్లుగా ఉండేది” అని 18 ఏళ్ళ ఎలిజబెత్ అంటోంది. “నన్ను ఎవరూ గమనించడం నాకు ఇష్టముండేది కాదు. జనాదరణ పొందడం ఎంత ప్రాముఖ్యం అనుకుంటున్నారన్నది సున్నా నుండి ఐదు వరకు అంకెలో చెప్పమని మా టీచర్ అన్నారు. సున్నా అంటే ఏ మాత్రం ప్రాముఖ్యం కాదు, ఐదు అంటే చాలా ప్రాముఖ్యం అని అర్థం. స్కూల్లో చాలా ఆదరణ పొందిన అమ్మాయిలందరూ ఐదు అని అన్నారు. నేను సున్నా అన్నాను. నాకు ఎంత బిడియమంటే, అందరి చేత గుర్తించబడడం అంటే చాలా భయమేస్తుంది. ఇతరులకు మీరు నచ్చకపోవచ్చన్న భయం వల్లే, ఇతరులు మిమ్మల్ని గమనించాలని కానీ, అందరి శ్రద్ధా మీపైనే ఉండాలని కానీ మీరు కోరుకోరు” అని హైస్కుల్లో మొదటి సంవత్సరంలో తాను అనుభవించిన మానసిక ఒత్తిడిని డయాన్ గుర్తు చేసుకుంటుంది.
కాస్త బిడియంగా ఉండడమన్నది చెడ్డ విషయమేమీ కాదు. బిడియానికి, వినయంతో, అంటే మన పరిమితులను గురించిన ఎరుకతో దగ్గరి సంబంధం ఉంది. వాస్తవానికి, ‘వినయం కలిగి మీ దేవునితో కలిసి నడవండి’ అని బైబిలు మనకు ఆజ్ఞాపిస్తుంది. (మీకా 6:8, పరిశుద్ధ బైబిల్) ఆధిపత్యం చెలాయించేటువంటి, దాడి చేసేటువంటి, అతిగా కోరేటువంటి వ్యక్తితో ఉండడం కన్నా, నమ్రతగల కాస్త బిడియంగల వ్యక్తితో ఉండడమే హాయిగా ఉంటుంది. “మాటలాడుటకు సమయము” కలదు అన్నది ఎలాగ నిజమో, అలాగే, “మౌనముగా నుండుటకు” కూడా సమయము “కలదు.” (ప్రసంగి 3:7) బిడియస్థులైనవాళ్ళకు మౌనంగా ఉండడమన్నది కష్టమేమీ కాదు. ఎందుకంటే, వాళ్ళు మామూలుగా, ‘వినుటకు వేగిరపడువారుగాను, మాటలాడుటకు నిదానించువారుగాను’ ఉంటారు గనుక, ఇతరులు వారిని మంచి శ్రోతలుగా మెచ్చుకుంటారు.—యాకోబు 1:19.
అయితే, ఎంతో తరచుగా, మరీ మౌనంగా ఉండేటువంటి, అతి బిడియస్థులుగా ఉండేటువంటి, లేక మునగదీసుకుని ఉండేటువంటి యౌవనస్థులకు, స్నేహితులను సంపాదించుకోవడం కష్టంగా ఉంటుంది. మరి కొందరి విషయానికి వస్తే, విపరీతమైన బిడియం సామాజిక ఒంటరితనాన్ని, ఒక రచయిత అన్నట్లు, “న్యూరోటిక్ స్వయంకృత బంధకాన్ని” సృష్టించగలదు.—సామెతలు 18:1.
బిడియం—సాధారణంగా ఉండే సమస్య
మీరు బిడియంతో బాధపడుతున్నట్లైతే, అది చాలా సాధారణమైన సమస్య అని గ్రహించండి. హైస్కూల్ విద్యార్థులపైనా, కాలెజ్ విద్యార్థులపైనా జరిపిన ఒక అధ్యయనంలో, “82 శాతం మంది విద్యార్థులు, తమ జీవితంలో ఏదో ఒక సందర్భంలో తమను తాము బిడియస్థులుగా ఎంచుకున్నారు.” (ఈస్ట్‌వుడ్ ఆట్‌వాటర్ వ్రాసిన అడోలసెన్స్) బైబిలు కాలాల్లోని కొందరికి కూడా బిడియం అనేది ఒక సమస్యగా ఉండేది. మోషే, తిమోతి వంటి ఉన్నతిని సాధించిన పురుషులు కూడా బిడియం అనే సమస్యతో పోరాడి ఉంటారు.—నిర్గమకాండము 3:11, 13; 4:1, 10, 13; 1 తిమోతి 4:12; 2 తిమోతి 1:6-8.
ప్రాచీన ఇశ్రాయేలు జనాంగపు మొదటి రాజైన సౌలు విషయమే తీసుకోండి. సాధారణంగా సౌలు చాలా ధైర్యవంతుడు. తన తండ్రి యొక్క గాడిదలు తప్పిపోగా, వాటిని తిరిగి తీసుకువచ్చేందుకు, ఆయన చాలా ధైర్యంగా బయలుదేరాడు. (1 సమూయేలు 9:3, 4) కానీ ఆయనను జనాంగానికి రాజుగా అభిషేకం చేసినప్పుడు, అకస్మాత్తుగా ఆయనను బిడియం ఆవరించింది. ఆయన, ఆహ్లాదంతో వస్తున్న గుంపుకు ఎదురు వెళ్ళే బదులు సామానులో దాక్కున్నాడు!—1 సమూయేలు 10:20-24.
సౌలుకు ఆత్మవిశ్వాసం లేకపోవడం ఆశ్చర్యకరంగా అనిపించవచ్చు. ఆయన ఆకర్షణీయంగా, అందంగా ఉండే యువకుడు అని బైబిలు వర్ణిస్తుంది. అంతెందుకు, “అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరులకంటె ఎత్తు గలవాడు” అని కూడా అది అంటుంది. (1 సమూయేలు 9:2) అంతేకాదు, రాజుగా ఆయన పరిపాలనను దేవుడు దీవిస్తాడని దేవుని ప్రవక్త ఆయనకు భరోసా ఇచ్చాడు కూడా. (1 సమూయేలు 9:17, 20) అయినప్పటికీ, సౌలుకు అంతా అనిశ్చితంగా ఉన్నట్లు అనిపించింది. నువ్వు రాజవుతావని చెప్పినప్పుడు, “నేను బెన్యామీనీయుడను కానా? నా గోత్రము ఇశ్రాయేలీయుల గోత్రములలో స్వల్పమైనదికాదా? నా యంటి వారు బెన్యామీను గోత్రపు ఇంటివారందరిలో అల్పులు కారా? నాతో ఈలాగున ఎందుకు పలుకుచున్నావు?” అని ఆయన వినయంగా బదులిచ్చాడు.—1 సమూయేలు 9:21.
సౌలులాంటి వాళ్ళకే ఆత్మవిశ్వాసం కొరవడితే, మీకు కొన్నిసార్లు ఆత్మవిశ్వాసం కొరవడడంలో ఆశ్చర్యపడవలసిన పని లేదు. శరీరం త్వరగా మార్పులకు గురయ్యే జీవిత ఘట్టంలో యౌవనస్థులైన మీరు ఉన్నారు. వయోజనుల లోకంలో ఎలా నడుచుకోవాలన్నది మీరు ఇప్పుడిప్పుడే నేర్చుకోవడం మొదలుపెడుతున్నారు. అందుకనే, అందరూ మిమ్మల్నే గమనిస్తున్నారేమోనని అనిపించడమూ, అప్పుడప్పుడు అభద్రతా భావం కలగడమూ సహజమే. “వయోజనులు అవ్వడం మొదలుపెడుతున్నప్పుడు, చాలా మంది యౌవనస్థులు బిడియపడే కాలఘట్టంలో అడుగుపెడతారు. అప్పుడు వాళ్ళు కల్పిత ప్రేక్షకులను ఊహించుకుని బిడియపడుతూ ఉంటారు. ఇతరులు తమను గమనిస్తున్నారని, తమ రూపాన్ని గురించి, పనులను గురించి వాళ్ళు అదే పనిగా గమనిస్తున్నారనీ నమ్మడాన్నే కల్పిత ప్రేక్షకులు అని నేనంటున్నాను” అని పేరెంట్స్ అనే పత్రికలో, డా. డేవిడ్ ఎల్‌కైండ్ వ్రాశారు.
యౌవనస్థులను వాళ్ళ తోటివాళ్లు తరచూ బాహ్య రూపాన్ని బట్టి నిర్ణయిస్తారు, గనుక, వాళ్ళు తమ రూపాన్ని గురించి బాధపడుతుంటారు. (పోల్చండి 2 కొరింథీయులు 10:7.) అయితే, తమ రూపాన్ని గురించి అతిగా చింతించడం అనారోగ్యకరం. ఫ్రాన్స్‌లోని లీల్య అనే యువతి ఈ విషయంలో తన సొంత అనుభవాన్ని గుర్తుచేసుకుంటోంది: “చాలామంది యౌవనస్థులకుండే సమస్య నాకూ ఉండేది. నాకు ఆక్నీలు, అంటే మొటిమలు ఉండేవి! ఎలా కనబడుతున్నాం అన్న దాన్ని గురించి మీరు బాధపడుతున్నప్పుడు, ఇతరుల దగ్గరికి వెళ్లడానికి సాహసం చేయరు.”
చెడ్డ వలయం
బిడియస్థులు అపార్థం చేసుకోబడుతారు గనుక, ఏకాంత వలయంలో సులభంగా చిక్కుకుపోగలరు. అడోలసెన్స్ అనే పుస్తకం, “బిడియస్థులైన వయోజనులు స్నేహితుల్ని సంపాదించడంలో సమస్యను ఎదుర్కొంటారు, ఎందుకంటే ఇతరులు పొరపాటుగా వారిని ప్రతికూలమైన రీతిలో దృష్టిస్తారు. కలవని వ్యక్తులని, బోరెత్తించేవారని, అనాసక్తులని, తమను తాము అధికులుగా ఎంచుకునేవారని, పప్పుముద్దలని, వైరులు అని బిడియస్థులు భావించబడతారు. వాళ్ళతో అలాంటి భావంతో వ్యవహరించబడినప్పుడు, వాళ్ళు మరింత ఒంటరితనాన్నీ, ఏకాంతతనూ, కృంగుదలనూ అనుభవిస్తారు” అని చెబుతుంది. అలా వాళ్ళు మరింత బిడియస్థులుగా వ్యవహరిస్తారు. అలా వ్యవహరించడంతో, వాళ్ళు ఇతరులను తక్కువవారిగా ఎంచుతారు తమను తాము ప్రముఖులుగా ఎంచుకుంటారు అన్న తలంపు మరింత బలపడుతుంది.
నిజమే, ఒక క్రైస్తవుడుగా మీరు, ‘లోకమునకును మనుష్యులకును వేడుకగా ఉన్నారు’ గనుక, మీరు ఇతరుల్లో ఎలాంటి అభిప్రాయాన్ని కలిగిస్తున్నారన్న విషయంలో శ్రద్ధగలవారై ఉండాలి. (1 కొరింథీయులు 4:9) మీరు ఇతరులతో మాట్లాడేటప్పుడు కళ్ళలోకి చూడకుండా తప్పించుకుంటున్నారా? మీరు నిలబడే తీరూ, మీ శరీర కదలికలూ, మిమ్మల్ని ఒంటరిగా వదిలేయాలని మీరు కోరుకుంటున్నారన్న సందేశాన్ని ఇస్తున్నాయా? అలాగైతే, ఇతరులు మీ గురించి తప్పుగా వ్యాఖ్యానించవచ్చనీ, మిమ్మల్ని తప్పించుకు తిరగడానికి మొగ్గు చూపుతారనీ గ్రహించండి. అలాంటి పరిస్థితిలో, మీరు స్నేహాలను అభివృద్ధి చేసుకోవడం మరింత కష్టమౌతుంది.
ఇతర కారకాలు
అయినప్పటికీ, ఎక్కడ విఫలమౌతామోనన్న భయం మరో సాధారణ సమస్య. నిజమే, మీకు అనుభవంలేని ఒక క్రొత్త పనిని చేసేటప్పుడు, కొంచెం అభద్రతా భావం కలగడమూ, కాస్త జంకడమూ సహజమే. అయితే కొంత మందిలో ఇవి మరీ విపరీతంగా ఉంటాయి. గేయల్ అనే యౌవనస్థురాలికి అలాంటిదే ఉండేది, ఆమె దాన్నే సామాజిక భయం అని అంటుంది. “నేను క్లాసులో జవాబులు చెప్పేదాన్ని కాను. ‘ఆమె చెయ్యెత్తదు. మాట్లాడదు’ వంటి మాటలను తల్లిదండ్రులతో నిరంతరం చెప్పేవారు. అలా చేయడం నాకు ఎంతో అసౌకర్యంగానూ, ఒత్తిడిగాను ఉంటుంది. ఇప్పటికీ నాకు అది చాలా కష్టంగా ఉంది” అని ఆమె అంటోంది. తప్పిపోతానేమోనన్న భయం అశక్తులనుగా చేస్తుంది. “ఎక్కడ తప్పులు చేస్తానో అని భయపడుతూ ఉంటాను. నేను ఏమి చేస్తున్నానో నాకు నిజంగానే తెలియదు” అని పీటర్ అనే యౌవనస్థుడు అంటున్నాడు. తోటివయస్కులు క్రూరంగా ఏడిపించడమూ, విమర్శించడమూ వ్యక్తిగత భయాలను అధికం చేసి, బిడియస్థుడైన యౌవనస్థుని ఆత్మవిశ్వాసానికి శాశ్వతమైన హానిని కలిగించగలవు.
సమాజంలో ఇతరులతో వ్యవహరించే నైపుణ్యాలు లేకపోవడం మరొక సాధారణ సమస్య. క్రొత్తవాళ్ళతో ఏమని మాట్లాడాలో తెలియనందువల్లే కావచ్చు, బహుశా మీరు వాళ్ళతో పరిచయం చేసుకోవడానికి జంకుతున్నది. పెద్దవాళ్ళు సహితం నలుగురి మధ్యా వ్యవహరించేందుకు కొన్నిసార్లు ఇబ్బందిగా ఫీలవుతారని తెలుసుకోవడం మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు. ఫ్రెడ్ అనే ఒక వ్యాపారి ఇలా అంటున్నారు: “వ్యాపార లోకంలో, నేను నిజంగా బాగా చేసే కార్యాలను ఎలా చేయాలో నాకు తెలుసు. నేను కేవలం వ్యాపారం గురించి మాట్లాడుతున్నట్లయితే, మంచి అభిప్రాయాన్ని కలిగించడంలో, నాకు ఎలాంటి ఆటంకమూ లేదు. అయితే అదే మనుష్యులతో నేను సామాజిక సంభాషణలను జరపాలంటే కొంచెం జంకుతాను. బోరెత్తించే వ్యక్తిగా, సాధారణ సంభాషణలకు పనికిరానివాడిగా, లేదా మరీ యాంత్రికమైనవాడిగా, అనాసక్తికరమైనవాడిగా నేను ముద్రవేయబడవచ్చు.”
మీరు బిడియస్థులైనా, ఆత్మవిశ్వాసం కొరవడినవారైనా, లేదా సమాజంలో వ్యవహరించడం కష్టంగా ఉన్నవారైనా మీరు మరింత కలివిడిగా ఉండేందుకు నేర్చుకోవడం చాలా ప్రయోజనకరం. “హృదయములను విశాలపరచుకొనుడి” అనీ, ఇతరుల గురించి తెలుసుకోండి అనీ క్రైస్తవులను బైబిలు ప్రోత్సహిస్తుంది ! (2 కొరింథీయులు 6:13) మీరా పనిని ఎలా చేయగలరు? ఈ విషయం తర్వాతి సంచికలో చర్చించబడుతుంది.
[అధస్సూచీలు]
a కొన్ని పేర్లు మార్చబడ్డాయి.
[16వ పేజీలోని చిత్రం]
తామేదో గొప్పవాళ్ళమని అనుకుంటున్నారని బిడియస్థుల గురించి తరచూ తలంచబడుతుంది
[16వ పేజీలోని చిత్రం]
ఎక్కడ విఫలమౌతామేమోనన్న భయం, యౌవనస్థులు సామాజికంగా మునగదీసుకుని ఉండడానికి కారణమౌతుంది