బైబిలు ఉద్దేశము
వివాహ భాగస్వామిని ఎంపిక చేసుకోవడం ఎలాగంటే
“నువ్వు పెళ్ళి చేసుకోవడాన్ని గురించి ఎప్పుడైనా ఆలోచించావా?” అని పెళ్ళి కాని ఒక అమ్మాయిని అడగడం జరిగింది. “ఆలోచించావా? అని అడుగుతున్నారా? నేను వ్యాకులపడుతుంటాను” అని ఆమె వెంటనే జవాబు చెప్పింది.
ఈ అమ్మాయి ఇచ్చిన క్లుప్త వ్యాఖ్య, ప్రేమా సహచర్యాల కోసమైన ప్రజల కోరికను గురించి ఎంతగానో చెబుతుంది. వివాహ భాగస్వామిని కనుగొనడం, జీవితంలోని అత్యంత ప్రాముఖ్యమైన విషయాల్లో ఒకటి అని అనేకులు తలంచుతారు. కనుక, వివాహ భాగస్వామిని కనుగొనడానికి ప్రజలకు సహాయపడేందుకు రూపకల్పన చేయబడిన అనేక సేవా సంస్థలు, ప్రపంచవ్యాప్తంగా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. అయితే, ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో, విచ్ఛిన్నమైన వివాహాల సంఖ్య, విజయవంతమౌతున్న వివాహాల సంఖ్యను మించిపోతున్నాయి.
పాశ్చాత్య దేశాల్లో, వివాహ భాగస్వామిని స్వయంగా ఎంపిక చేసుకోవడం చాలా సాధారణం. మరొకవైపు, ఆసియాలోని కొన్ని ప్రాంతాల్లోను, ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లోను పెద్దలు నిశ్చయించిన వివాహాలను చేసుకోవడం ఇప్పటికీ ఆచారంగా జరుగుతోంది. ఏది ఏమైనా వివాహ జతను ఎంపిక చేసుకునే విషయాన్ని తేలికగా తీసుకోకూడదు. వివాహ జతను ఎంపిక చేసుకోవడంలో తీసుకునే నిర్ణయం ఒక వ్యక్తిని సంతోషభరితుడుగానైనా, విషాదభరితుడుగానైనా చేయవచ్చు. ఒకరు తన జీవితంలో తీసుకునే మరే ఇతర నిర్ణయాలు కూడా దీనంతగా ప్రభావం చూపలేవు. ప్రేమపూర్వకమైన వివాహం, జీవితాన్ని సంతృప్తికరమైనదిగా సుసంపన్నమైనదిగా చేస్తుంది. మరోవైపు, కలహాలతో నిండి ఉండే వివాహ బంధం ఎడతెగక బాధనూ ఒత్తిడినీ కలిగిస్తుంది.—సామెతలు 21:19; 26:21.
ఇతరుల్లాగే, నిజక్రైస్తవులు తమ వివాహ బంధం ఆనందాన్నీ, సంతృప్తినీ ఇవ్వాలని కోరుకుంటారు. వాళ్ళు, దేవుడ్ని ప్రీతిపరచాలనీ ఘనపరచాలనీ కూడా కోరుకుంటారు. (కొలొస్సయులు 3:23) మన నిజమైన అవసరాలేంటి, మనకు ఏది క్షేమకరము అన్నది వివాహ వ్యవస్థ యొక్క సృష్టికర్తగా, మూలకర్తగా, దేవునికి క్షుణ్ణంగా తెలుసు. (ఆదికాండము 2:22-24; యెషయా 48:17-19) అంతేకాక, మానవుడు ఉనికిలోకి వచ్చి, వేలాది సంవత్సరాలు గడుస్తుండగా, కోట్లాది వైవాహిక జీవితాలను, మంచి వాటిని, చెడ్డవాటిని ఆయన చూశాడు. ఎలాంటి ఎంపిక సఫలంగా ఉంటుంది, ఎలాంటి ఎంపిక విఫలమౌతుంది అన్నది ఆయనకు తెలుసు. (కీర్తన 32:8) క్రైస్తవులు, జ్ఞానాన్ని ఆధారం చేసుకుని ఎంపిక చేసుకునేందుకు సహాయపడగల స్పష్టమైన, వాస్తవికమైన సూత్రాలను, తన వాక్యమైన బైబిలు ద్వారా ఆయన తెలియజేశాడు. ఈ సూత్రాలు కొన్ని ఏవి?
బాహ్య రూపాన్ని మించి చూడండి
తాను వివాహం చేసుకునే వ్యక్తిని ఎంపిక చేసుకునే స్వాతంత్ర్యం ఉన్న ప్రాంతాల్లో, తమకు భాగస్వాములు కాగల వ్యక్తులు మామూలుగా తారసపడడమో, స్నేహితులో కుటుంబ సభ్యులో పరిచయం చేయడమో జరుగుతుంది. ప్రణయాసక్తి అనేది తరచూ మొదట శారీరక ఆకర్షణ వల్ల కలుగుతుంది. ఇది నిజంగానే సహజమైన, శక్తివంతమైన ప్రేరకంగా ఉంటున్నప్పటికీ, వివాహాన్ని గురించి ఆలోచించేటప్పుడు, బాహ్య రూపం కన్నా లోతుగా చూడాలని బైబిలు మనల్ని ప్రోత్సాహపరుస్తుంది.
“అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును” అని సామెతలు 31:30 చెబుతుంది. “దేవుని దృష్టికి మిగుల విలువగలది”యైన “సాధువైనట్టియు, మృదువైనట్టియునైన గుణమను అక్షయాలంకారముగల హృదయపు అంతరంగ స్వభావము” గురించి అపొస్తలుడైన పేతురు మాట్లాడాడు. (1 పేతురు 3:4) అవును, వివాహ జత కానున్న వ్యక్తి యొక్క శరీర సౌందర్యం కన్నా, ఆధ్యాత్మిక లక్షణాలు, అంటే దేవుని ఎడల ఆ వ్యక్తికున్న అంకిత భావం, దేవుడి మీద ఉన్న ప్రేమ, క్రైస్తవ వ్యక్తిత్వం అనేవి చాలా ముఖ్యం. ఒకే విధమైన ఆధ్యాత్మిక లక్ష్యాలున్నటువంటి, దేవుని ఆత్మ ఫలాలను చూపేందుకు శ్రమించేటువంటి వ్యక్తిని ఎంచుకుంటూ, వాస్తవిక దృష్టితో ఎంపిక చేసుకునేందుకు సమయాన్ని తీసుకోవడం ప్రాముఖ్యం. ఇది సంతోషకరమైన వివాహ ఐక్యానికి హామీ ఇవ్వడం కన్నా ఇంకా ఎంతో ఎక్కువే తోడ్పడుతుంది.—సామెతలు 19:2; గలతీయులు 5:22, 23.
‘ప్రభువునందు మాత్రమే పెండ్లిచేసుకోండి’
మీరు పెళ్ళి చేసుకోవాలనుకునే వ్యక్తికీ, మీకూ ఒకే లక్ష్యాలూ, నమ్మకాలూ ఉండడం ప్రాముఖ్యం. వివాహ జీవితం అంటే ఒక పెద్ద సవాలే, ఇద్దరూ తమ ప్రవర్తనలోను, దృక్పథాల్లోను అనేక సవరింపులు చేసుకోవలసిన అవసరం ఉంటుంది. మీకూ మీ భాగస్వామికీ ప్రవర్తనలోనూ దృక్పథాల్లోను ఎన్ని పోలికలుంటే, సవరింపులు చేసుకోవడం అంత సులభంగా ఉంటుందన్నది సహేతుకమైన విషయం.
“మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి” అని అపొస్తలుడైన పౌలు క్రైస్తవులకు ఎందుకు ఉద్బోధించాడో గ్రహించేందుకు ఇది మనకు సహాయపడుతుంది. (2 కొరింథీయులు 6:14) ఒకరు, తనకున్నటువంటి విశ్వాసం లేని బైబిలు సూత్రాల అవగాహన లేని వ్యక్తిని వివాహం చేసుకుంటే, ఘర్షణలు, అసమ్మతులు తలెత్తుతాయని పౌలుకు తెలుసు. ‘ప్రభువునందే పెండ్లి చేసుకోండి’ అన్న ఉద్బోధ చాలా సహేతుకమైనది. (1 కొరింథీయులు 7:39) అది దేవుని ఆలోచనా సరళిని ప్రతిబింబిస్తుంది. దాన్ని వివేకంతో అనుసరించేవాళ్ళు అలాంటి తీవ్రమైన చిక్కు పరిస్థితులను, సమస్యలను నివారించుకుంటారు.—సామెతలు 2:1, 9.
పెద్దలు నిశ్చయించిన పెళ్ళిళ్ళు
ఇప్పటికీ పెద్దలు నిశ్చయించిన వివాహాలను చేసుకోవడమే ఆనవాయితీగా ఉన్న ప్రాంతాల విషయం ఏమిటి? ఉదాహరణకు, దక్షిణ ఇండియాలో, 80 శాతం వివాహాలు తల్లిదండ్రులు నిశ్చయించిన వివాహాలేనని కొందరు అంచనా వేస్తున్నారు. క్రైస్తవ తల్లిదండ్రులు ఈ ఆచారాన్ని పాటించాలా వద్దా అన్నది వ్యక్తిగతంగా నిర్ణయించుకోవలసిన విషయం. ఏది ఏమైనప్పటికీ, అన్నింటినీ ఆధ్యాత్మిక విలువలు శాసిస్తున్నప్పుడు, అలాంటి వివాహ ఏర్పాట్లు విజయవంతమౌతాయి.
పెద్దలు నిశ్చయించే పెళ్ళిళ్ళను ఇష్టపడేవాళ్ళు, తమ నిర్ణయాన్ని అనుభవజ్ఞులైన, పరిణతి చెందిన వారి చేతికి అప్పగిస్తున్నామని భావిస్తారు. “తమ పిల్లల వయస్సును బట్టి, వాళ్ళ అనుభవరాహిత్యాన్ని బట్టి, వాళ్ళు తమ భవిష్యత్ జత యొక్క ఆధ్యాత్మిక పరిణతిని సరైన విధంగా అంచనావేయగలరు అన్న నమ్మకాన్ని వారిపై ఉంచలేమని కొంతమంది తల్లిదండ్రులు అనుకుంటారు” అని ఆఫ్రికాలోని ఒక క్రైస్తవ సంఘపెద్ద అంటున్నారు. “పిల్లలకు జీవితంలో అనుభవం లేదు, వాళ్ళు నిర్ణయాలను భావోద్వేగపరంగా తీసుకుంటారు” అని ఇండియాలోని ఒక ప్రయాణ పైవిచారణకర్త అంటున్నారు. తమ పిల్లల గురించి మరెవరి కన్నా ఎక్కువగా తల్లిదండ్రులకు తెలుసు కనుక, తమ పిల్లల కోసం వివేకయుక్తమైన ఎంపికను చేసే స్థానంలో తాము ఉన్నామని తల్లిదండ్రులు భావిస్తారు. వాళ్ళు అబ్బాయి దృక్కోణాన్ని, అమ్మాయి దృక్కోణాన్ని లెక్కలోకి తీసుకోవడం వివేకయుక్తమైన పని.
అయినప్పటికీ, ఈ విషయంలో తల్లిదండ్రులు బైబిలు సూత్రాలను అలక్ష్యం చేసినప్పుడు, తర్వాత వివాహ జీవితంలో ఇబ్బందులు ఎదురైతే బాధలను అనుభవించాల్సి రావచ్చు. జత కానున్న వ్యక్తులు ఒకరినొకరు ముందే తెలుసుకునే అవకాశం అంతగా దొరకనందు వల్ల సమస్యలు కలుగవచ్చు. అలా సమస్యలు వచ్చినప్పుడు, “తల్లిదండ్రుల మీదకు నెట్టడానికి మొగ్గు చూపుతారు” అని ఇండియాలోని ఒక క్రైస్తవ తండ్రి వివరిస్తున్నారు.
పెళ్ళి కుదుర్చుతున్న క్రైస్తవ తల్లిదండ్రులు, పెళ్ళి ఉద్దేశమేమిటన్న ప్రశ్నకు జవాబును గురించి తప్పనిసరిగా ఆలోచించాలి. వివాహభాగస్వామిని ఎంపిక చేయడంలో, భౌతికమైన లక్ష్యాలుగానీ, హోదాను గురించిన ఆశగానీ నియంత్రిస్తున్నట్లయితే, సమస్యలు తలెత్తుతాయి. (1 తిమోతి 6:9) కనుక, ‘ఈ ఎంపిక, ఇరువురికీ సంతోషాన్నీ, ఆధ్యాత్మిక ఆరోగ్యాన్నీ ఇచ్చేందుకా? లేక, కుటుంబ హోదాను గానీ, సంపదను గానీ పెంచేందుకా? లేక ఆర్థిక ప్రయోజనాలను సమకూర్చేందుకా? అని పెళ్ళి కుదిర్చేవాళ్ళు ప్రశ్నించుకోవలసి ఉంది.—సామెతలు 20:21.
బైబిలు ఉపదేశం స్పష్టమైనది, ప్రయోజనకరమైనది. వివాహభాగస్వామిని గురించి ఆలోచిస్తున్నప్పుడు, పెద్దలు కుదుర్చుతున్నదైనా, లేక తమకై తాము ఎంచుకున్నదైనా సరే, జత కానున్న వ్యక్తి యొక్క మంచితనం, ఆధ్యాత్మికతా ముఖ్య విషయమై ఉండాలి. ఇలా చేసినప్పుడు, వివాహ వ్యవస్థ యొక్క మూలకర్తయైన యెహోవా దేవుడు ఘనపర్చబడతాడు, పెళ్ళి చేసుకుంటున్నవాళ్ళు గట్టిదైన ఆధ్యాత్మికమైన పునాదిని వేసుకున్నవారౌతారు. (మత్తయి 7:24, 25) ఇది సంతోషకరమైన మేలైన కుటుంబ బంధానికి ఎంతగానో దోహదపడుతుంది.