కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g99 9/8 పేజీలు 20-25
  • మృత్యుముఖంలో దేవుని సేవచేయడం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మృత్యుముఖంలో దేవుని సేవచేయడం
  • తేజరిల్లు!—1999
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • మంచి విద్యాభ్యాసంతో ఆశీర్వదించబడడం
  • ఒక క్రొత్త మతోద్యమం
  • నా మొదటి ఖైదులు
  • ఎంతో కాలంపాటు ఎదురుచూసిన ఒక కూటం
  • బాప్తిస్మానికి నడిపించిన సంఘటనలు
  • మళ్ళీ తలెత్తిన హింస
  • తొమ్మిదేళ్లపాటు బాధలను అనుభవించడం
  • స్వాతంత్ర్యం, కానీ మరలా ఖైదుచేయబడడం
  • విడుదల చేయబడ్డాక కూడా హింసించబడ్డాం
  • చివరికి, ప్రకటించడానికి స్వాతంత్ర్యం
  • కఠిన దారిద్ర్యం నుండి అతి సంపన్నస్థితికి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • యెహోవా ఆహ్వానాలను అంగీకరించడం ప్రతిఫలదాయకము
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
  • అవసరత ఎక్కువగా ఉన్న ప్రాంతంలో యాభై సంవత్సరాలకుపైగా సేవ చేయడం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • యెహోవా ప్రేమగల హస్తం క్రింద సేవచేయడం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
తేజరిల్లు!—1999
g99 9/8 పేజీలు 20-25

మృత్యుముఖంలో దేవుని సేవచేయడం

ఝావూ మాన్కోకా చెప్పినది

1961, జూన్‌ 25న, అంగోలాలోని లోండాలో జరుగుతున్న మా క్రైస్తవ కూటాన్ని సైనికులు ఛిన్నాభిన్నం చేశారు. మాలో ముప్పై మందిని తీసుకువెళ్ళి జైలులో వేసి, చావబాదారు. మాలో ఎవరైనా చచ్చారా లేదా అనీ చూడడానికి సైనికులు ప్రతి అరగంటకొకసారి వచ్చి చూసి వెళ్లేవారు. మేము బ్రదికే ఉన్నాం కనుక మా దేవుడు నిజమైన దేవుడై ఉండాలి అని వారిలో కొందరు అనడం వినబడింది.

ఆ దెబ్బలు తిన్న తర్వాత, సావోపోలోలోని జైలులో నేను ఐదు నెలలు ఉన్నాను. ఆ తర్వాత తొమ్మిదేళ్లపాటు నన్ను ఒక జైలు నుంచి మరో జైలుకి పంపించారు. మరనేక దెబ్బలు భరించాను. లేమిని అనుభవించాను. నన్ను అనేకసార్లు ఇంటరాగేట్‌ చేశారు. 1970లో జైలు నుంచి విడుదలైన తర్వాత కొద్ది కాలానికే, నన్ను మళ్ళీ అరెస్టు చేశారు. ఈసారి నన్ను సావొ నికులవు అనే ప్రసిద్ధిగాంచిన మరణ శిబిరానికి పంపించారు. అదిప్పుడు బెంటీయాబ అని పిలువబడుతోంది. నన్ను అక్కడ రెండున్నరేళ్ల పాటు ఉంచారు.

చట్టానికి లోబడే పౌరుడ్నైన నేను, నా బైబిలు ఆధారిత నమ్మకాలను గురించి ఇతరులతో మాట్లాడినంత మాత్రాన ఎందుకు ఖైదు చేయబడ్డాను, దేవుని రాజ్య సువార్త గురించి నేను మొట్ట మొదట ఎక్కడ నేర్చుకున్నాను అని మీరు ఆలోచిస్తుండవచ్చు.

మంచి విద్యాభ్యాసంతో ఆశీర్వదించబడడం

ఉత్తర అంగోలాలో మాకేలా డూ జోంబో పట్టణ సమీప ప్రాంతంలో 1925 అక్టోబరు నెలలో జన్మించాను. 1932లో మా నాన్నగారు మరణించినప్పుడు, మా అమ్మ నన్ను (ఇప్పుడు డెమోక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో అని పిలువబడుతున్న) బెల్జియన్‌ కాంగోలో ఉన్న మా మావయ్య దగ్గరకు పంపించింది. నిజానికి నన్ను పంపించాలని మా అమ్మ కోరుకోలేదు. కానీ, అమ్మకు నన్ను పోషించే స్థోమత లేనందువల్లే పంపించింది.

మా మావయ్య బాప్టిస్టు. బైబిల్ని చదవమని నన్ను ప్రోత్సహించేవాడు. నేను ఆయన చర్చిలో ఒక సభ్యుడ్నే అయినా, నేను నేర్చుకున్న వాటితో నా ఆధ్యాత్మిక ఆకలి తీరలేదు. దేవుని సేవచేయాలని ప్రేరేపించబడలేదు. అయినప్పటికీ మా మావయ్య నన్ను స్కూలుకి పంపించి, మంచి విద్యను ఆర్జించేందుకు నాకు సహాయపడ్డారు. నేను నేర్చుకున్న వాటిలో ఫ్రెంచ్‌ భాష మాట్లాడ్డం ఒకటి. కాలక్రమేణా నేను పోర్చుగీసును కూడా మాట్లాడడం నేర్చుకున్నాను. స్కూలు చదువు అయిపోయిన తర్వాత, (ఇప్పుడు కిన్షాస అని పిలువబడుతున్న) లియోపొల్డివిల్‌లోని సెంట్రల్‌ రేడియో స్టేషన్‌లో రేడియో టెలిగ్రాఫిస్ట్‌గా నాకు ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత నా ఇరవయ్యో ఏట, నేను మారీయ పోవను వివాహం చేసుకున్నాను.

ఒక క్రొత్త మతోద్యమం

అదే సంవత్సరం అంటే 1946లో, బాప్టిస్ట్‌ చర్చికి చెందిన బాగా చదువుకున్న ఒక అంగోలన్‌ గాయక బృంద నాయకుని ప్రభావం నా మీద పడింది. ఉత్తర అంగోలాలో నివసించే, కీకోన్గో భాషను మాట్లాడే ప్రజల్ని విద్యావంతులనుగా తీర్చిదిద్ది, వాళ్లను పైకి తీసుకురావాలని ఎంతో ఆత్రుతను చూపించాడాయన. వాచ్‌ టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ ప్రచురించి, యెహోవాసాక్షులచే పంచిపెట్టబడిన రాజ్యము, లోకానికి నిరీక్షణ అన్న బుక్‌లెట్‌ ప్రతిని ఒకదాన్ని సంపాదించాడు. అది పోర్చుగీసులోకి అనువదించబడిన ప్రతి.

ఆ గాయక బృంద నాయకుడు ఆ బుక్‌లెట్‌ను కీకోన్గో భాషలోనికి అనువదించి, దాన్ని బెల్జియన్‌ కాంగోలో పనిచేస్తున్న మా అంగోలియన్ల ఒక గుంపుతో వారం వారం జరిగే బైబిలు చర్చలను నిర్వహించేందుకు ఉపయోగించేవాడు. కొంతకాలానికి ఆ గాయక బృంద నాయకుడు, అమెరికాలో ఉన్న వాచ్‌ టవర్‌ సొసైటీ ప్రధాన కార్యాలయానికి రాసి, మరిన్ని సాహిత్యాల్ని సంపాదించాడు. అయినా, ఆయన మాకందించే సమాచారం చర్చి బోధలతో మిళితమైవుండేది. కనుక, నిజ క్రైస్తవత్వానికీ, క్రైస్తవమత సామ్రాజ్యపు లేఖనాధారంకాని బోధలకూ మధ్యనున్న వ్యత్యాసాన్ని నేనంత స్పష్టంగా గుర్తించలేకపోయేవాడ్ని.

అయితే, బాప్టిస్టు చర్చిలో నేను అంతవరకు విన్న వాటికి భిన్నంగా వాచ్‌ టవర్‌ సొసైటీ సాహిత్యాల్లో ఉన్న బైబిలు సందేశం ఉందని గుర్తించాను. ఉదాహరణకు, యెహోవా అనే దేవుని స్వకీయ నామానికి బైబిలు అత్యంత ప్రాముఖ్యతను ఇస్తుందనీ, నిజ క్రైస్తవులు సముచితంగానే తమను తాము యెహోవాసాక్షులని పిలుచుకుంటారనీ నేను తెలుసుకున్నాను. (కీర్తన 83:18; యెషయా 43:10-12) అంతేగాక, యెహోవాకు నమ్మకంగా సేవ చేసే వారి కోసం పరదైసు భూమిపై నిత్య జీవాన్ని బైబిలు వాగ్దానం చేసిందన్న దాన్ని బట్టి నా హృదయం ఉప్పొంగింది.—కీర్తన 37:29; ప్రకటన 21:3-5.

బైబిలుకు సంబంధించిన నా జ్ఞానం చాలా పరిమితమైనదైనప్పటికీ, యిర్మీయా ప్రవక్తలాగ నా దేవుడైన యెహోవాను గురించి మాట్లాడాలని అగ్నిలా జ్వలిస్తున్న నా కోరికను అణచుకోలేకపోయాను. (యిర్మీయా 20:9) మా బైబిలు అధ్యయన గుంపులోని సభ్యులు, ఇంటింట ప్రకటించడంలో నాతోపాటు పాల్గొనేవారు. ముద్రిత ఆహ్వాన పత్రాలను ఉపయోగిస్తూ, ప్రజలను ఆహ్వానించి, మా మావయ్య ఇంటి ఆవరణలో బహిరంగ కూటాల్ని కూడా నిర్వహించేవాడ్ని. ఒక్కోసారి 78 మంది కన్నా ఎక్కువమంది హాజరయ్యేవారు. ఆ విధంగా, అంగోలన్‌ గాయక బృంద నాయకుని నాయకత్వం క్రింద ఒక క్రొత్త మతోద్యమం రూపొందించబడింది.

నా మొదటి ఖైదులు

వాచ్‌ టవర్‌ సొసైటీతో సంబంధమున్న ఏ ఉద్యమమైనా సరే, బెల్జియన్‌ కాంగోలో నిషేధించబడిందన్న విషయం నాకు తెలియదు. అలా, 1949 అక్టోబరు 22న మాలో కొందరు అరెస్టు చేయబడ్డారు. మా కేసు విచారణకు రాకముందు, నేను ప్రభుత్వోద్యోగినని జడ్జికి తెలుసు గనుక ఆయన నాతో రహస్యంగా మాట్లాడి నన్ను విడిచిపెట్టేందుకు ఏర్పాట్లను చేయడానికి ప్రయత్నించారు. అయితే నేను విడుదల పొందాలంటే, మా ప్రకటనా పని మూలంగా రూపుదాల్చిన ఉద్యమాన్ని నేను విడనాడాల్సి ఉంటుందని ఆయన అన్నారు. అలా చేయడానికి నేను నిరాకరించాను.

రెండున్నర నెలలపాటు జైల్లో ఉన్న తర్వాత, మాలో అంగోలన్‌ జాతికి చెందిన వారిని మా సొంత దేశాలకు పంపించివేయాలని అధికారులు నిశ్చయించుకున్నారు. అయితే, మేం అంగోలాకు తిరిగి వచ్చినప్పుడు, పోర్చుగీసు వలసరాజ్య అధికారులు కూడా మా కార్యకలాపాలపై అనుమానపు దృష్టిని సారించి, మా స్వాతంత్ర్యాన్ని తగ్గించేశారు. మా ఉద్యమంలో చేరిన సభ్యుల్లో అనేకమంది బెల్జియన్‌ కాంగో నుంచి వచ్చినవారే. చివరకు మాలో 1,000కన్నా ఎక్కువ మంది అంగోలా దేశమంతటా చెదిరిపోవడం జరిగింది.

కొంత కాలానికి, ప్రముఖ మతనాయకుడైన సైమన్‌ కిమ్‌బన్‌జు అనుచరులు కూడా మా ఉద్యమంలో చేర్చుకోబడ్డారు. ఒక ఆత్మ మాధ్యమం ద్వారా మాత్రమే బైబిలు వివరించబడగలదని వాళ్లు నమ్మినందున, వాచ్‌ టవర్‌ బైబిలు సొసైటీ సాహిత్యాలను పఠించడంలో ఆసక్తి చూపించేవారు కాదు. ఇప్పటి వరకూ మా నాయకునిగా ఎంచబడుతున్న గాయక బృంద నాయకునితో సహా, మా ఉద్యమంలోని అనేకమంది, అలాంటి దృక్కోణానికి మద్దతునిచ్చారు. వాచ్‌ టవర్‌ సొసైటీ నిజమైన ప్రతినిధితో మాకు పరిచయమయ్యేలా చేయమని యెహోవాకు పట్టుదలతో ప్రార్థన చేశాను. అలా జరిగితే, బైబిలు సత్యాన్ని అంగీకరించి, లేఖనాధారంలేని ఆచారాలను తిరస్కరించేలా మా ఉద్యమంలో ఉన్న సభ్యులందరూ ఒప్పించబడతారని ఆశించాను.

మాలో కొందరు చేస్తున్న ప్రకటనా పనినిబట్టి ఉద్యమంలోని కొంతమంది సభ్యులు ఆగ్రహం చెందారు. కాబట్టి వాళ్లు నమ్మకద్రోహం చేసి మమ్మల్ని అధికారులకు పట్టి ఇచ్చారు. మేము ఒక రాజకీయోద్యమానికి చెందిన నాయకులమని ఆరోపించారు. తత్ఫలితంగా 1952 ఫిబ్రవరిలో, కార్లూస్‌ ఆగూష్టీన్యూ కాడీ, సాలా రామోస్‌ ఫీలెమోన్‌లతో సహా మాలో అనేకమంది అరెస్టు చేయబడ్డారు. కిటికీలు లేని ఒక చిన్న గదిలో మేం బంధించబడ్డాం. అయినా, స్నేహశీలియైన ఒక గార్డు మా భార్యల దగ్గర నుంచి మాకోసం భోజనాన్ని తీసుకొచ్చేవాడు. అలాగే వాచ్‌ టవర్‌ సొసైటీ బుక్‌లెట్ల మరిన్ని ప్రతులను తయారుచేసేలా ఒక టైప్‌రైటర్‌ తెచ్చి ఇచ్చాడు.

మూడు వారాలు గడిచిన తర్వాత, దక్షిణ అంగోలాలోని బాయే డూస్‌ టీగ్రష్‌ అనే ఎడారికి మమ్మల్ని పంపివేశారు. మాతోపాటు మా భార్యలు కూడా అక్కడికి వచ్చారు. ఒక చేపల కంపెనీలో నాలుగు సంవత్సరాలపాటు వెట్టి చాకిరీ చేసే శిక్షను మాకు విధించారు. బాయే డూస్‌ టీగ్రష్‌లో చేపల పడవలను నిలిపే రేవులేదు గనుక, మా భార్యలు నీటిలో అతి ప్రయాసతో ఉదయం నుంచి రాత్రి వరకూ పడవల నుంచి ఒడ్డుకూ, ఒడ్డు నుంచి పడవలకూ నడుస్తూ బరువైన చేపల బుట్టలను చేరవేసేవారు.

ఆ ఖైదీల శిబిరంలో, మా ఉద్యమానికి చెందిన ఇతర సభ్యులను మేం కనుగొన్నాం. బైబిలును అధ్యయనం చేయడంలో కొనసాగేలా వారిని ఒప్పించడానికి ప్రయత్నించాం. కానీ వాళ్లు గాయక బృంద నాయకుడైన టోకోను అనుసరించడానికే సుముఖత చూపించారు. కొంతకాలానికి, వాళ్లు టోకోయిస్ట్స్‌ అని పిలువబడ్డారు.

ఎంతో కాలంపాటు ఎదురుచూసిన ఒక కూటం

బాయే డూస్‌ టీగ్రష్‌లో ఉండగానే, మేం వాచ్‌ టవర్‌ సొసైటీ నార్తేన్‌ రోడేసియా (ఇప్పుడు జాంబియా) బ్రాంచ్‌ అడ్రస్‌ను కనుక్కొని, సహాయం కోసం అర్థిస్తూ రాశాం. మా ఉత్తరం, దక్షిణ ఆఫ్రికా బ్రాంచ్‌కి పంపించబడింది. ఆ బ్రాంచ్‌, మాకు బైబిలు సత్యం మీద ఆసక్తి ఎలా కలిగిందని అడుగుతూ మాకు జవాబు రాసింది. అమెరికాలో ఉన్న వాచ్‌ టవర్‌ సొసైటీ ప్రధాన కార్యాలయానికి మా గురించి తెలియజేయబడింది. మమ్మల్ని కలుసుకోవడానికి ఒక ప్రత్యేక ప్రతినిధిని పంపించే ఏర్పాట్లు చేయబడ్డాయి. ఆ ప్రతినిధి పేరు జాన్‌ కూక్‌, విదేశాల్లో అనేక సంవత్సరాలపాటు పనిచేసిన అనుభవమున్న మిషనరీ ఆయన.

సహోదరుడు కూక్‌ అంగోలాకు వచ్చిన తర్వాత కొన్ని వారాలకుగాని, పోర్చుగీసు వలసరాజ్య అధికారులు మమ్మల్ని సందర్శించడానికి ఆయనను అనుమతించలేదు. ఆయన 1955 మార్చి 21న బాయే డూస్‌ టీగ్రష్‌కి వచ్చారు, మాతోపాటు ఐదు రోజులు ఉండడానికి ఆయనకు అనుమతి లభించింది. బైబిలు నుంచి ఆయన ఇచ్చిన వివరణలు ఎంతో సంతృప్తికరంగా ఉన్నాయి. యెహోవా దేవుని ఏకైక సత్య సంస్థకు ఆయన ప్రాతినిధ్యంవహిస్తున్నాడని నేను ఒప్పించబడ్డాను. సహోదరుడు కూక్‌, తను వెళ్లిపోయే రోజున “ఈ రాజ్య సువార్త” అనే అంశంపై బహిరంగ ప్రసంగాన్ని ఇచ్చారు. బాయే డూస్‌టీగ్రష్‌ ఛీప్‌ అడ్మినిస్ట్రేటర్‌తోపాటు 82 మంది హాజరయ్యారు. హాజరైన వారిలో ప్రతీ ఒక్కరికీ తలొక ముద్రిత ప్రసంగ ప్రతిని ఇవ్వడం జరిగింది.

సహోదరుడు కూక్‌, అంగోలాలో ఉన్న ఐదునెలల కాలంలో టోకోయిస్ట్‌ల నాయకునితోపాటు అనేకమంది టోకోయిస్ట్‌లను కలుసుకున్నాడు. అయినా, వాళ్లలో అనేకమంది యెహోవాసాక్షులవ్వడానికి ఆసక్తిని చూపించలేదు. అలా నేనూ, నా సహచరులూ అధికారులకు మా స్థానాన్ని సుస్పష్టం చేయాల్సిన నైతిక బాధ్యత ఉందని భావించాం. దాన్ని మేం, 1956 జూన్‌ 6వ తారీఖున “హిస్‌ ఎక్సలెన్‌సీ ద గవర్నర్‌ ఆఫ్‌ ద డిస్ట్రిక్‌ ఆఫ్‌ ముసామడిష్‌” అని సంభోదిస్తూ రాసిన ఒక ఉత్తరంలో తెలియజేశాం. టోకో అనుయాయులతో మాకు ఇక ఎటువంటి సంబంధాలూ లేవనీ, మమ్మల్ని “యెహోవాసాక్షుల సొసైటీ సభ్యులు”గా దృష్టించాలనీ మేం పేర్కొన్నాం. ఆరాధనా స్వాతంత్ర్యాన్ని మాకు దయచేయమని కూడా మేం విజ్ఞప్తి చేసుకున్నాం. అయితే మా శిక్షను తగ్గించడానికి బదులు, దాన్ని మరి రెండు సంవత్సరాలకు పొడిగించారు.

బాప్తిస్మానికి నడిపించిన సంఘటనలు

మేం చివరకు 1958 ఆగస్టు నెలలో విడుదలై, లోండాకు తిరిగి వెళ్తుండగా, యెహోవాసాక్షుల ఒక చిన్న గుంపును కనుగొన్నాం. మేం విడుదలకావడానికి ఒక సంవత్సరం ముందు ఆ గుంపును, జాన్‌ కూక్‌ స్థానంలోకి అంగోలాకు పంపించబడిన మిషనరీ మర్వన్‌ పాస్లో సంస్థీకరించారు. కానీ, మేం అక్కడికి వెళ్లేటప్పటికి అధికారులు ఆయన్ను అక్కడి నుంచి పంపించేశారు. తర్వాత 1959లో, యెహోవాసాక్షుల మరొక మిషనరీ హరీ ఆర్నట్‌ వచ్చారు. అయితే, మాలో ముగ్గురం ఆయన్ని కలుసుకోవడానికి ఎయిర్‌పోర్టులో వేచివుండగా, ఆయన విమానం దిగుతుండగానే అరెస్టు చేయబడ్డారు.

ఈ మధ్యనే బాప్తిస్మం తీసుకున్న పోర్చుగీసు సాక్షులైన మాన్వల్‌ గోన్‌సాల్విష్‌, బెర్టా టేషేర అనే ఇద్దరిని ఇక ముందు కూటాలను జరుపుకోవద్దని హెచ్చరించి విడుదల చేశారు. సహోదరుడు ఆర్నట్‌ను ప్రభుత్వం వెనక్కి పంపించేసింది. నేను ఇప్పటి నుంచీ సాక్షినికానని ప్రకటిస్తూ డాక్యుమెంటుపై సంతకంచేయకపోతే, నన్ను మరలా బాయే డూస్‌ టీగ్రష్‌కి తిరిగి పంపిస్తామని హెచ్చరించారు. ఏడు గంటలపాటు ఇంటరాగేషన్‌ చేసిన తర్వాత, సంతకం చేయకుండానే నన్ను విడుదలచేశారు. అటు తర్వాత ఒక వారానికి నేను, నా స్నేహితులు కార్లొస్‌ కాడి, సాలా ఫిలేమోన్‌లలానే బాప్తిస్మం తీసుకున్నాను. లోండా నగర శివారు ప్రాంతమైన మూసెకె సామ్‌బీజాన్గగ్‌లో ఒక గదిని అద్దెకు తీసుకొన్నాం. అది, అంగోలాలోని యెహోవాసాక్షుల మొదటి సంఘం కూడుకునే స్థలంగా మారింది.

మళ్ళీ తలెత్తిన హింస

కూటాలకు హాజరౌతున్న ఆసక్తిగల ప్రజల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కొంతమంది మాపై నిఘావేయడానికి వచ్చారు. కానీ, వాళ్లు కూటాలను ఆనందించి, తర్వాత యెహోవాసాక్షులుగా మారారు! రాజకీయ పరిస్థితి మారింది. 1961 ఫిబ్రవరి 4న జాతీయోద్యమ గుంపు తలెత్తనారంభించిన తర్వాత, పరిస్థితి మరింత క్లిష్టతరంగా తయారైంది. మా గురించి అపవాదులు అంతటా ప్రచారం చేయబడినప్పటికీ, మార్చి 30న క్రీస్తు మరణ జ్ఞాపకార్థదిన ఆచరణను జరుపుకోవడంలో సఫలీకృతులమయ్యాం. దానికి 130 మంది హాజరయ్యారు.

జూన్‌లో, నేను కావలికోట పఠనాన్ని నిర్వహిస్తుండగా, మిలటరీ పోలీసులు వచ్చి మా కూటాన్ని ఛిన్నాభిన్నం చేశారు. స్త్రీలనూ, పిల్లలనూ విడిచిపెట్టేశారుగానీ, ఉపోద్ఘాతంలో నేను ప్రస్తావించినట్లు 30మంది పురుషులను పట్టుకెళ్లిపోయారు. దుడ్డుకర్రలతో మమ్మల్ని రెండు గంటలపాటు ఏకధాటిగా చితక్కొట్టారు. అటు తర్వాత మూడు నెలలపాటు, నేను రక్తాన్ని కక్కుకున్నాను. నేను చచ్చిపోతానన్న విషయం నాకు రూఢిగా తెలుసు. నిజానికి, నన్ను కొట్టిన వ్యక్తి నాతో నీ చావు ఖాయమని అన్నాడు. చితక్కొట్టబడిన వారిలో అనేకమంది బాప్తీస్మం తీసుకొనని క్రొత్త బైబిలు విద్యార్థులు ఉన్నారు గనుక వారి తరుపున నేను “యెహోవా నీ మందను చూసుకో” అని హృదయపూర్వకంగా ప్రార్థించాను.

యెహోవా కృపవల్ల మాలో ఎవ్వరూ చనిపోలేదు. అది, మిలటరీ సిబ్బందిని ఆశ్చర్యపర్చింది. ఆ సైనికుల్లో కొందరు మన దేవునిని స్తుతించేలా కదిలించబడ్డారు. మేం బ్రతికి బయటపడేటట్టు చేసింది ఆయనేనని వాళ్లన్నారు! బైబిలు విద్యార్థుల్లో అనేకమంది చివరకు బాప్తిస్మం తీసుకున్న సాక్షులు అయ్యారు. వారిలో కొందరు ఇప్పుడు క్రైస్తవ పెద్దలుగా సేవ చేస్తున్నారు. వారిలో ఒకరైన సీల్వెష్ట్రె సీమ్యూన్‌, అంగోలా బ్రాంచి కమిటీ సభ్యుల్లో ఒకరు.

తొమ్మిదేళ్లపాటు బాధలను అనుభవించడం

ప్రారంభంలో నేను ప్రస్తావించినట్టుగా, అటు తర్వాత నేను తొమ్మిదేళ్లపాటు అనేక రీతుల్లో బాధను అనుభవించాను. ఒక జైలునుంచి మరో జైలుకి లేక ఒక కార్మిక శిబిరాన్నుంచి మరో కార్మిక శిబిరానికి తరలించబడ్డాను. ఈ ప్రదేశాలన్నింట్లో, నేను రాజకీయ ఖైదీలకు సాక్ష్యమివ్వగలిగాను. నేడు వారిలో అనేకమంది బాప్తిస్మం పొందిన సాక్షులు. నా భార్య మారీయ, మా పిల్లలూ నాతోపాటు ఉండడానికి అనుమతించబడ్డారు.

మేం సెర్పా పీన్టూ కార్మిక శిబిరం దగ్గర ఉన్నప్పుడు, నలుగురు రాజకీయ ఖైదీలు తప్పించుకొని పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా పట్టుబడ్డారు. తప్పించుకొని పారిపోవాలన్న ఆలోచన కూడా ఖైదీల మనస్సుల్లోకి రాకుండా ఉండేలా ఖైదీలందరి ఎదుటా ఆ నలుగురిని చిత్రహింసలు చేసి చంపేశారు. ఆ తర్వాత శిబిర కమాండర్‌, “ప్రకటిస్తూ ఉండగా నిన్ను గనుక నేను పట్టుకుంటే, తప్పించుకొని పారిపోవడానికి ప్రయత్నించిన వీళ్లకు పట్టిన గతే నీకూ పడుతుంది” అని మారీయ ఎదుటా, మా పిల్లల ఎదుటా నన్ను బెదిరించాడు.

చివరకు 1966 నవంబరు నెలలో, భయంకరమైన మరణ శిబిరమని పేరుగాంచిన సావొ నికులవుకు చేరుకున్నాం. మేం అక్కడకు చేరుకున్నప్పుడు, ఆ శిబిర అడ్మినిస్ట్రేటర్‌ సీడ్‌ అని అంటే, సావొ పౌలొ జైలులో ముఖ్యంగా నన్ను చచ్చేంతగా చితకగొట్టిన వ్యక్తేనని తెలుసుకొని భయకంపితుడ్నయ్యాను! ప్రతీ నెలా అనేకమంది ఒక పద్ధతి ప్రకారంగా హత్యచేయబడేవారు. ఆ అమానుష హత్యల్ని చూసేలా మా కుటుంబం బలవంతం చేయబడింది. ఫలితంగా, మారీయ నరాల బలహీనతతో బాధపడింది. దాన్నుంచి ఆమె ఎన్నటికీ పూర్తిగా కోలుకోలేక పోయింది. చివరకు, మారీయనూ మా పిల్లల్నీ లొండాకు పంపించడానికి నేను అనుమతి సంపాదించగలిగాను. లొండాలో ఉన్న మా ఇద్దరు పెద్దమ్మాయిలు టరేజా, జుయనాలు వాళ్ళను చూసుకున్నారు.

స్వాతంత్ర్యం, కానీ మరలా ఖైదుచేయబడడం

తర్వాతి సంవత్సరం, అంటే 1970 సెప్టెంబరు నెలలో నేను విడుదల చేయబడ్డాను. లొండాలో ఉన్న నా కుటుంబంతోనూ, సహోదరులందరితోనూ మరలా సమైక్యపర్చబడ్డాను. నేనులేని ఈ తొమ్మిదేళ్లలో ప్రకటనా పని ఎంతగా పురోభివృద్ధిచెందిందో చూసి ఆనందంతో నా కళ్లు వర్షించాయి. 1961లో నన్ను జైలుకు తీసికెళ్లిపోయినప్పుడు, లొండాలో ఉన్న సంఘం నాలుగు చిన్న గుంపులతో రూపొందించబడి ఉండేది. యెహోవా సంస్థ పంపించే ప్రయాణ ప్రతినిధి ద్వారా చక్కగా సంస్థీకరించబడి, ప్రతీ ఆరు నెలలకు సహాయం అందించబడే నాలుగు పెద్ద సంఘాలు ఇప్పుడు అక్కడ ఉన్నాయి. నేను స్వతంత్రుడనైనందుకు, ఆనందంతో ఉప్పొంగిపోయాను కానీ, నా స్వాతంత్ర్యం ఎంతో కాలం కొనసాగలేదు.

ఇప్పుడు ఉనికిలోలేకుండా పోయిన ఆ నాటి పోలీస్‌ ఫర్‌ ఇన్వెస్టిగేషన్‌ అండ్‌ డిఫెన్స్‌ ఆఫ్‌ ద స్టేట్‌ (పి.ఐ.డి.ఇ) జనరల్‌ డైరెక్టర్‌ ఒకరోజు నన్ను పిలిచారు. మా అమ్మాయి జుయనా ఎదుట నన్ను కాసేపు పొగిడిన తర్వాత, ఆయన నాకొక డాక్యుమెంటు చేతికిచ్చి సంతకం పెట్టమన్నాడు. ఆ డాక్యుమెంటులో పి.ఐ.డి.ఇ ఇన్ఫార్మర్‌గా నేను చేయాల్సిన పనులు పేర్కొనబడ్డాయి. నేను ఆ సేవలు చేస్తే నాకు అనేకమైన వస్తుదాయక ప్రతిఫలాల్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. నేను సంతకం పెట్టడానికి నిరాకరించినప్పుడు, నన్ను సావొ నికులవుకు తిరిగి పంపించడం జరుగుతుందని బెదిరించారు. అక్కడ నుంచి నేను మరింకెన్నడూ విడుదల చేయబడనని నాతో చెప్పారు.

కేవలం నాలుగు నెలలపాటు స్వేచ్ఛను అనుభవించిన తర్వాత 1971 జనవరిలో, ఆ బెదిరింపులు కార్యరూపం దాల్చాయి. మొత్తంమ్మీద లొండాలో ఉన్న 37 మంది పెద్దలను అరెస్టుచేసి, సావొ నికులవుకు పంపించడం జరిగింది. అక్కడ మేం, ఆగస్టు 1973 వరకూ ఖైదులోనే ఉన్నాం.

విడుదల చేయబడ్డాక కూడా హింసించబడ్డాం

1974లో పోర్చుగల్‌నందు మత స్వాతంత్ర్యం ప్రకటించబడింది. ఆ తర్వాత ఆ స్వాతంత్ర్యం, పోర్చుగల్‌ వలస రాజ్యాలకు విస్తరించబడింది. 1975 నవంబరు 11న అంగోలా, పోర్చుగల్‌ నుంచి స్వాతంత్ర్యాన్ని పొందింది. అదే సంవత్సరం మార్చి నెలలో మేము స్వేచ్ఛగా మా మొదటి ప్రాంతీయ సమావేశాల్ని జరుపుకోగలగడం మాకు ఎంత పులకరింతను కలగజేసిందో! లొండాలోని స్పోర్ట్స్‌ సిటాడల్‌ స్టేడియంలో జరిగిన ఆ ఆనందమయ సమావేశాల్లో బహిరంగ ప్రసంగాన్ని ఇచ్చే ఆధిక్యత నాకు లభించింది.

అయితే, క్రొత్త ప్రభుత్వం మా తటస్థ వైఖరిని వ్యతిరేకించింది. అంగోలా అంతటా అంతర్యుద్ధం విజృంభించింది. పరిస్థితి ఎంతగా విషమించిందంటే శ్వేతజాతీయులైన సాక్షులు దేశాన్ని విడిచిపెట్టి పారిపోవాల్సి వచ్చింది. యెహోవాసాక్షుల పోర్చుగల్‌ బ్రాంచ్‌ నిర్దేశం క్రింద అంగోలాలో జరిగే ప్రకటనా పనిపై ఇన్‌ ఛార్జిగా మా స్థానిక సహోదరుల్లో ముగ్గురుని నియమించడం జరిగింది.

త్వరలోనే నా పేరు వార్తా పత్రికల్లో కెక్కడమూ, రేడియోల్లో వినిపించడమూ మొదలయ్యింది. అంతర్జాతీయ ఏకఛత్రాధిపత్యానికి నేనొక ఏజంటుననీ, అంగోలాలో ఉన్న సాక్షులు ఆయుధాలు పట్టడాన్ని నిరాకరించడానికి నేనే బాధ్యుడ్ననీ నాపై ఆరోపణ చేయబడింది. తత్ఫలితంగా, లొండా రాష్ట్ర గవర్నరు సమక్షానికి నన్ను తీసుకువెళ్ళారు. ప్రపంచవ్యాప్తంగా యెహోవాసాక్షుల తటస్థ వైఖరిని గురించి నేను ఆయనకు గౌరవపూర్వకంగా వివరించాను. యేసు క్రీస్తు తొలి అనుచరులు తీసుకున్న స్థానం అదేనని చెప్పాను. (యెషయా 2:4; మత్తయి 26:52) వలసరాజ్య పాలనా కాలంలో నేను 17 ఏళ్లపాటు జైళ్లలోనూ, కార్మిక శిబిరాల్లోనూ ఉన్నానని తెలియజేసినప్పుడు, ఆయన నన్ను అరెస్టు చేయకూడదని నిర్ణయించుకున్నాడు.

ఆ కాలంలో, అంగోలాలో యెహోవాకు ఒక సాక్షిగా సేవ చేయడానికి ధైర్యం ఉండాలి. నా ఇంటిపై నిఘా ఉండేది గనుక, మా ఇంటిని కూటాల కోసం ఉపయోగించడాన్ని మానివేయాల్సి వచ్చింది. కానీ అపొస్తలుడైన పౌలు చెబుతున్నట్లుగా ‘మేము ఎటుబోయనా శ్రమలనే అనుభవించాం, అయినా ఇరికింపబడలేదు.’ (2 కొరింథీయులు 4:8) మేం పరిచర్యలో ఎన్నడూ నిష్క్రియులం కాలేదు. ప్రయాణ పరిచారకునిగా పనిచేస్తూ, బెంగ్యూలా, వీలా, హ్యుంబొ రాష్ట్రాల్లో ఉన్న సంఘాల్ని బలపరుస్తూ ప్రచారపు పనిలో కొనసాగాను. ఆ సమయంలో నేను సహోదరుడు ఫిలెమోన్‌ అనే మారుపేరుతో ప్రయాణించేవాడ్ని.

1978 మార్చిలో మా ప్రకటనా పని మరలా నిషేధించబడింది. విప్లవాదోన్మాదులు నన్ను చంపడానికి పథకం వేశారన్న విషయం నాకు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. కాబట్టి అంగోలాలోని నైజీరియా రాయబారి కార్యాలయంలో ఉద్యోగిగా పనిచేస్తున్న, నైజీరియా నుంచి వచ్చిన ఒక సాక్షి ఇంట్లో నేను ఆశ్రయాన్ని పొందాను. ఒక నెల తర్వాత, పరిస్థితి కాస్త ప్రశాంతంగా మారినప్పుడు, ప్రయాణ పై విచారణకర్తగా సహోదరులకు సేవ చేయడంలో కొనసాగాను.

నిషేధమున్నా, అంతర్యుద్ధం జరుగుతున్నా మా ప్రకటనా పనికి వేలాది మంది అంగోలా వాసులు ప్రతిస్పందించారు. సాక్షులుగా అవుతున్నవారి సంఖ్య అంతకంతకు పెరుగుతుండడం వల్ల, పోర్చుగల్‌ బ్రాంచ్‌ నిర్దేశం క్రింద అంగోలాలో ప్రకటనా పనిపట్ల శ్రద్ధను తీసుకునేందుకు దేశ వ్యాప్తంగా కమిటీనొకదాన్ని నియమించడం జరిగింది. ఆ సమయంలో, పోర్చుగల్‌కు నేను అనేకసార్లు ప్రయాణం చేశాను. అక్కడ నేను, యోగ్యులైన పరిచారకుల నుంచి విలువైన తర్ఫీదుని పొందాను. అలాగే అవసరమైన వైద్య సంరక్షణను పొందాను.

చివరికి, ప్రకటించడానికి స్వాతంత్ర్యం

నేను కార్మిక శిబిరాల్లో ఉన్నప్పుడు, నేను అలా ప్రకటించుకుంటూ ఉంటే నేనెన్నటికీ విడుదల పొందనని రాజకీయ ఖైదీలు నన్ను తరచూ పరిహసించేవారు. కానీ వాళ్లకు నేను, “ద్వారాన్ని తెరవడానికి యెహోవాకు ఇంకా సమయం ఆసన్నంకాలేదు, అది వచ్చినప్పుడు దాన్నే మనిషీ ఆపుచేయలేడు” అని జవాబిచ్చేవాడ్ని. (1 కొరింథీయులు 16:9; ప్రకటన 3:8) 1991లో సోవియట్‌ యూనియన్‌ కుప్పకూలిపోయిన తర్వాత, ఏ విధమైన ప్రతిబంధాలూ లేకుండా ప్రకటించే అవకాశమనే ఆ ద్వారం విశాలంగా తెరవబడింది. ఆ సమయంలో అంగోలాలో మేం ఎంతో స్వాతంత్ర్యాన్ని అనుభవించనారంభించాం. 1992లో యెహోవాసాక్షుల పని అధికారికంగా చట్టబద్ధంచేయబడింది. చివరకు, 1996లో అంగోలాలో యెహోవాసాక్షుల బ్రాంచ్‌ ఏర్పాటు చేయబడింది. నేను ఆ బ్రాంచ్‌ కమిటీలో ఒక సభ్యునిగా నియమించబడ్డాను.

నేను ఖైదులో మ్రగ్గిపోయిన అనేక సంవత్సరాల కాలంలో, నా కుటుంబం ఎల్లప్పుడూ ఏదో ఒక విధంగా సంరక్షించబడేది. మాకు ఆరుగురు పిల్లలు. వారిలో ఒకరు ఇప్పుడు లేరు. మా ప్రియమైన జుయనా క్యాన్సర్‌ వచ్చి గత సంవత్సరం మరణించింది. మిగిలిన పిల్లల్లో నలుగురు బాప్తిస్మం తీసుకున్న సాక్షులు, కానీ మా ఇంకో అబ్బాయి ఇంకా బాప్తిస్మం తీసుకోలేదు.

1955లో సహోదరుడు కూక్‌ మమ్మల్ని సందర్శించినప్పుడు, దేవుని రాజ్య సువార్తను ప్రకటించే అంగోలి వాసులు మొత్తం నలుగురు ఉండేవారు. నేడు దేశమంతటిలో 38,000కన్నా ఎక్కువ మంది రాజ్య ప్రచారకులు ఉన్నారు. వాళ్లు ప్రతి నెలా 67,000కన్నా ఎక్కువ బైబిలు పఠనాలను నిర్వహిస్తున్నారు. నేడు రాజ్య సువార్తను ప్రకటిస్తున్నవారిలో అనేకులు, మునుపు మమ్మల్ని హింసించినవారే. ఎంతటి ప్రతిఫలమిది, నన్ను సజీవంగా ఉంచినందుకూ, యెహోవా వాక్యాన్ని ప్రకటించాలని అగ్నిలా జ్వలిస్తున్న ప్రగాఢమైన నా కోరికను నెరవేర్చుకునేందుకు నన్ను అనుమతించినందుకూ యెహోవాకు నేనెంత కృతజ్ఞుడనో!—యెషయా 43:12; మత్తయి 24:14.

[22, 23వ పేజీలోని చిత్రం]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

డెమోక్రాటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో

కిన్‌షా

అంగోలా

మాక్విలా డొ జొంబొ

లొండా

సొవొ నికులవు (ఇప్పుడు బెంటియబ)

మొకమెడెస్‌ (ఇప్పుడు నమిబె)

బాయే డూస్‌ టీగ్రష్‌

సెర్పా పిన్టో (ఇప్పుడు మెనొన్‌గ్యు)

[క్రెడిట్‌ లైను]

Mountain High Maps® Copyright © 1997 Digital Wisdom, Inc.

[24, 25వ పేజీలోని చిత్రం]

దిగువ: 1955లో జాన్‌ కూక్‌తో. ఎడమ వైపున సాల ఫిలెమోన్‌

కుడి: 42 ఏళ్ల తర్వాత జాన్‌ కూక్‌తో పునఃకలయిక

[25వ పేజీలోని చిత్రం]

నా భార్య మారీయతో

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి