ప్రపంచ పరిశీలన
నైతిక విలువల పునరాగమనమా?
“చైనీయులు వివాహేతర లైంగిక సంబంధాల్ని అంతకంతకూ సహిస్తూపోతున్నా, అక్కడి టీనేజర్లు మాత్రం అటువంటి ప్రవర్తనకు విరుద్ధంగా ఉన్నారు” అని ఇటీవల చైనాలో జరిపిన ఒక సర్వేలో వెల్లడైందని చైనా టుడే అనే పత్రిక నివేదిస్తుంది. ఈ వివరాలు దాదాపు 8,000 మంది ప్రజలపై చేసిన అభిప్రాయ సేకరణలో తేలాయి. “టీనేజర్లలో ఐదింట మూడు వంతుల మంది, లైంగిక వ్యవహారాన్ని కొనసాగిస్తూ ఇతరుల వివాహాల్లో చిచ్చుపెడుతున్న ప్రజల్ని ఆర్థికపరంగానైనా లేదా మరితర విధాల్లోనైనా శిక్షించాల్సిందేనని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా 37 నుండి 45 ఏండ్ల వయస్సుగల వారిలో 70 శాతం మంది మాత్రం అటువంటి కార్యకలాపాలకు శిక్ష ఉండాలని భావించటం లేదు” అని ఆ సర్వే చూపిస్తుంది.
దయాపూర్వక చర్యల చార్టు
“పిల్లలు కనీసం నాలుగేండ్ల వయస్సు వచ్చేంత వరకు ప్రాథమికంగా స్వార్థపరులుగా ఉంటారు, వారు అప్పుడప్పుడే తదనుభూతిని పెంపొందించుకుంటారు” అని ద టొరొంటో స్టార్‌లోని ఒక నివేదిక చెబుతుంది. ఇతరులంటే పట్టింపు కల్గివుండేందుకు పిల్లలకు సహాయం చేసేందుకు వారికి ఇంట్లోనే దయాపూర్వక చర్యల్లో శిక్షణనివ్వాలని సలహా ఇవ్వబడింది. పిల్లలు ప్రతి రోజు స్వచ్ఛందంగా చేసే కనీసం రెండు మంచి పనుల్ని కుటుంబ సభ్యులు ఒక చార్టుమీద వ్రాయవచ్చు. తమ పిల్లలు ఏదైనా పనిని దయాపూర్వకంగా చేయడాన్ని తల్లిదండ్రులు గమనించినప్పుడు చార్టుమీద దాన్ని వ్రాయవచ్చు. ఇతర పిల్లల్ని ఏడిపించే సమస్యని త్రిప్పికొట్టటానికి అనేక స్కూళ్లలో ఇటువంటి చార్టుల్ని ఉపయోగిస్తున్నారు. విద్యార్థులు కూడా ఇతర పిల్లలు చేసే దయాపూర్వకమైన కార్యాల్ని చూసినప్పుడు వాటిని చార్టుల్లో వ్రాయమని ప్రోత్సహించడం జరిగింది. పైన పేర్కొన్న నివేదిక ప్రకారం, “ఇలా చేయటం పిల్లలు జాలిగల గుణాన్ని గుర్తించటానికి సహాయపడుతుంది, ఇది జాలిగల గుణాన్ని ఎలా కలిగివుండాలో, దాన్ని ఇతరులపట్ల ఎలా ప్రదర్శించాలో నేర్చుకోవటానికి మీకు కీలకం.”
పావురాయి పోస్టు, ఇప్పటికీ ప్రాక్టికలే
ఇండియాలోని ఒరిస్సా రాష్ట్రంలో పోలీసు డిపార్ట్‌మెంటుకి అధునాతనమైన కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లే ఉన్నాయి, అయినా అది 800 పావురాలతో కూడిన తన “పావురాల విభాగం”ను ఇప్పటికీ మూసేయటం లేదు అని ద ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిస్తుంది. ఒరిస్సాలోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అయిన మిస్టర్ బి. బి. పాండా చెబుతున్న దాని ప్రకారం వరదలు, తుపానులు వంటి సమయాల్లో పావురాలు గత 50 సంవత్సరాలుగా సమాచార వినిమయానికి ఒక మాధ్యమంగా పనిచేశాయి, ఇంకా ఇప్పటికి కూడా వైర్‌లెస్ కమ్యూనికేషన్‌లు పాడైపోయినప్పుడు ఉపయోగకరంగా ఉన్నాయి. ఉదాహరణకు 1982లో వరదలు బాంకీ పట్టణాన్ని సర్వనాశనం చేసినప్పుడు ఆ పట్టణానికీ కటక్‌లోని జిల్లా ముఖ్యకార్యాలయానికీ పావురాలే ఏకైక సమాచార సాధనంగా ఉపయోగపడ్డాయి. హోమర్ అని పిలువబడే బెల్జియం జాతి పావురంతో ఒరిస్సాలోని మొట్టమొదటి పావురాల విభాగం 1946లో ప్రారంభించబడింది. అది ఎక్కడా ఆగకుండా దాదాపు 80 నుండి 90 కిలోమీటర్ల వేగంతో 800 కిలోమీటర్ల వరకు ఎగురగలదు. ఈ పక్షులు 15 నుండి 20 సంవత్సరాలు జీవిస్తాయి. ఒరిస్సాలో ఇవి ప్రస్తుతం 34 మంది కానిస్టేబుళ్ళ సంరక్షణలో మూడు కేంద్రాల్లో ఉన్నాయి. “సెల్యులార్ ఫోన్ల ఈ యుగంలో పావురాలు పాతకాలం నాటివిగా అన్పించవచ్చు, కానీ అవి ఒరిస్సా రాష్ట్రానికి చాలా నమ్మకంగా సేవలనందిస్తున్నాయి” అని మిస్టర్ పాండా అంటున్నారు.
పాఠశాల విద్యలేని పిల్లలు
ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 1948లో స్వీకరించిన యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ విద్యాహక్కు అనేది ప్రాథమిక హక్కు అని నిర్వచించింది. దీని సంబంధంగా ఎన్నో మెచ్చుకోదగిన ప్రయత్నాలు జరిగినప్పటికీ ఆ లక్ష్యం ఇంకా ఎంతో దూరంలో ఉంది. “యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్‌ను స్వీకరించి యాభై సంవత్సరాలు గడిచాయి, అయినప్పటికీ ప్రాథమిక విద్యను పొందాల్సిన వయస్సులో ఉన్న 13 కోట్లమంది పిల్లలు పాఠశాలకు హాజరు కావటంలేదు” అని జర్మనీలోని దినపత్రిక ఆల్గమైన్ సైటూంగ్ మైంట్స్ నివేదిస్తుంది. “ప్రపంచంలోని పిల్లల్లో 20 శాతంమందికి ప్రాథమిక విద్య అందలేదని దీన్ని బట్టి తెలుస్తుంది.” జర్మనీలోని ఐక్యరాజ్య సమితి పిల్లల నిధికి అధ్యక్షుడైన రైన్‌హార్ట్ ష్లాగిన్ట్‌వైట్ చెబుతున్న దాని ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిల్లల్నందర్నీ ప్రాథమిక పాఠశాలకు పంపించటానికి 700 కోట్ల డాలర్లు ఖర్చవుతుంది. ఈ డబ్బు, యూరప్‌లోని ప్రజలు ఒక్క సంవత్సరంలో ఐస్ క్రీమ్ కోసం చేసే ఖర్చుకన్నా లేదా అమెరికాలోని ప్రజలు ఒక్క సంవత్సరంలో సౌందర్యవర్థక వస్తువులపై చేసే ఖర్చుకన్నా చాలా తక్కువ. ఇక ప్రపంచం మొత్తంమీద ఆయుధాల కోసం వెచ్చించే డబ్బుతో పోలిస్తే అది వెలవెలబోతుంది.
ఆసియాలో విపత్తులు ఎక్కువ
“గత సంవత్సరం ప్రపంచంలో సంభవించిన 10 అతిపెద్ద విపత్తుల్లో ఆరు విపత్తులు ఆసియాలోనే జరిగాయి. వాటి మూలంగా 27,000 మంది ప్రాణాలు పోయాయి, 3 వేల 8 వందల కోట్ల డాలర్ల నష్టం జరిగింది” అని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తెలియజేస్తుంది. ఈ విపత్తుల్లో బంగ్లాదేశ్, చైనాలలో వచ్చిన వినాశకరమైన వరదలు ఉన్నాయి, ఇండోనేషియాలో సంభవించిన దావానలాలు ఉన్నాయి. ఈ దావానలాల మూలంగా పొరుగు దేశాలకు కూడా పొగలు ప్రాకాయి. “ప్రపంచంలోని వేరే ఏ ప్రాంతంకన్నా ఆసియాలోనే ఎక్కువగా ప్రకృతి విపత్తులు సంభవించాయి” అని ఆసియా పసిఫిక్ ప్రాంతాల కోసమైన ఐక్యరాజ్య సమితి ఆర్థిక, సాంఘిక కమిషన్ తెలియజేస్తుంది. “ప్రాముఖ్యంగా ఆసియాలో, ప్రకృతి విపత్తుల ప్రమాదాన్ని తక్కువ చేయటం 21వ శతాబ్దంలో ఒక పెద్ద సవాలుగా ఉంటుంది.”
మీకు మీరే ఎందుకు చక్కిలిగింతలు పెట్టుకోలేరు?
“సరైన స్థలంలో చక్కిలిగింతలు పెడితే ఒక దృఢకాయుడు కూడా ఏమీ చేయలేడు. కానీ ఈ విషయంలో మరీ సున్నితంగా ఉన్న వ్యక్తి, కనీసం తనకు తాను చక్కిలిగింతలు పెట్టుకోలేడన్న వాస్తవాన్నిబట్టి ఓదార్పును పొందవచ్చు” అని ది ఎకానమిస్ట్ చెబుతుంది. ఎందుకలా? ఇటీవల జరిపిన ఒక పరిశోధన ప్రకారం దానికి జవాబు సెరిబెల్లమ్‌లో ఉంది. ఈ సెరిబెల్లమ్ కండరాల చర్యల్ని సమన్వయపరిచే మన మెదడులోని ఒక భాగం. ఈ సెరిబెల్లమ్ చర్యల్ని సమన్వయం చేయటం మాత్రమే కాక, ఆ చర్యల పరిణామాల్ని కూడా ముందే ఊహించగలుగుతుంది. అందుకని మనల్ని మనం చక్కిలిగింతలు పెట్టుకోవటానికి ప్రయత్నించినప్పుడు మెదడులోని సెరిబెల్లమ్, దీని మూలంగా కలిగే పరిణామాల్ని ముందే ఊహించి మన భావనల్ని అణచివేస్తుంది. అలాకాక, వేరేవాళ్ళు చక్కిలిగింతలు పెట్టినప్పుడు, దాని మూలంగా కలిగే ప్రేరణకూ సెరిబెల్లమ్ వేసే లెక్కలకు పొంతన ఉండదు గనుక మన భావాలను అణచివేయటం సాధ్యం కాదు. ఈ విషయంపైనే ద న్యూయార్క్ టైమ్స్‌లోని ఒక శీర్షిక క్లుప్తంగా ఇలా చెబుతుంది: “మన మెదడు, ఏ చక్కిలిగింతలు మనకై మనం పెట్టుకుంటామో చెప్పేయగలదు, తద్వారా అది వీటికి తక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. ఆ విధంగా అది వెలుపలి నుండి కలిగే మార్పులను మరింత సులభంగా గ్రహించగలుగుతుంది, ఎందుకంటే బహుశ అవి మరింత అత్యవసరమైనవి కావచ్చు.”
మోర్స్ కోడ్‌కి వారసుడు
మోర్స్ కోడ్ 1832లో కనిపెట్టబడింది. అది “వాణిజ్యం అభివృద్ధి చేయడంలోను చివరికి చరిత్రలోను ప్రాముఖ్యమైన పాత్రను నిర్వహించింది” అని ప్రపంచంలోని ఓడల రవాణాను క్రమబద్దీకరించే ఐక్యరాజ్య సమితిలోని సంస్థకు చెందిన రోజర్ కోహ్న్ చెబుతున్నాడు. టైటానిక్ ఓడ 1912లో, మూడు చుక్కలు, మూడు అడ్డుగీతలు, మూడు చుక్కలతో కూడిన SOS అనే సంకేతాన్ని పంపించినప్పటి నుండి ప్రమాదంలో చిక్కుకున్న ఓడలు దాన్ని అంతర్జాతీయ ప్రమాణంగా ఉపయోగిస్తున్నాయి అని ద టొరొంటో స్టార్ చెబుతుంది. కానీ 1999, ఫిబ్రవరి 1 నుండి ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ ద్వారా ప్రవేశపెట్టబడిన ఒక క్రొత్త ఉపగ్రహ వ్యవస్థ, ఓడల్లో ఉన్న ఉపగ్రహ ఉపకరణంపైని “హాట్” మీటను నొక్కినప్పుడు, సమాచారం “ప్రపంచం నలుమూలలా ఉన్న ప్రమాద సంరక్షణా కేంద్రాల నెట్‌వర్క్‌కు” ఆటోమేటిక్‌గా పంపించేస్తుంది. ఈ సమాచారంలో ఓడకు ఉన్న తొమ్మిది అంకెల గుర్తింపు సంఖ్యతోపాటు, “సమయం, ఓడ పొజీషన్, ప్రమాదం వివరణ—మామూలు వివరణ లేదా అగ్నిప్రమాదం, నీళ్లు నిండటం, ఓడదొంగలకు గురికావడం వంటివి ఉన్న నిర్దుష్టమైన 12 వర్గీకరణలతో కూడిన వివరణ” ఉన్నాయని స్టార్ చెబుతుంది. గతస్మృతుల్ని జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఇంకా ఇలా అంటుంది: “మోర్స్ కోడ్‌ని చరిత్రలోని కొన్ని శుభవార్తల్ని ప్రసారం చేయటానికి కూడా ఉపయోగించటం జరిగింది: అది రెండు ప్రపంచ యుద్ధాల్లోనూ యుద్ధవిరమణ సందేశాల్ని ప్రసారం చేయటానికి ఉపయోగించబడింది.”
బూట్ల మూలంగా ఆరోగ్య సమస్యలు
“ప్రతి ఆరుగురిలో ఒకరికి పాదాలకు సంబంధించి గంభీరమైన సమస్యలు ఉన్నాయని, దీనిక్కారణం తరచు వారు వేసుకునే బూట్లేనని వైద్య నిపుణులు చెబుతున్నారు” అని ద టొరొంటో స్టార్ నివేదిస్తుంది. మోకాళ్ళలో నొప్పి, తుంటి భాగంలో నొప్పి, వీపు క్రింది భాగంలో నొప్పి, తలనొప్పులు వంటివి కూడా మీ బూట్లను పరీక్షగా చూసుకోమనే సందేశాన్ని అందిస్తున్నట్లే. “గుర్తుంచుకోవల్సిన అత్యంత ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, మీ పాదాలకు అనుగుణ్యంగా బూట్లు మారవు, బూట్లకు అనుగుణ్యంగా మీ పాదాలు మారతాయి” అని స్టార్ అంటుంది. “మీ పాదాలకు అనుగుణ్యంగా మారతాయన్న తలంపుతో బూట్లను కొనుక్కోకండి. దుకాణంలో మీకు అవి సౌకర్యవంతంగా అన్పించకపోతే వాటిని అసలు కొనకండి.” బూట్లను మధ్యాహ్నం పూట కొనుక్కోండి, ఎందుకంటే “పగటిపూట సమయం గడుస్తుండగా పాదాలు సాధారణంగా కాస్తంత వాస్తాయి. “బూటు వెడల్పు మీ మడిమెకు సరిపోతుందో లేదో చూసుకోవడం కాక మీ కాలిబొటన వ్రేలు ప్రక్కనుండే బుడిపెకు సరిపోతుందో లేదో చూసుకోండి.” పాదాలకు సంబంధించి, పాదాల ఆకారం మారటానికి సంబంధించి స్త్రీలల్లోనే ఎక్కువ సమస్యలు కనబడుతున్నాయి. దీనిక్కారణం స్త్రీలలో 90 శాతంమంది “మరీ చిన్నగా ఉన్న లేదా మరీ బిగుతుగా ఉన్న బూట్లను వేసుకుంటారు,” అంతేగాక “ఎత్తైన హీల్సు సాధారణంగా పాదాల ఆకృతికి సంబంధించి చాలా గంభీరమైన సమస్యలకు దారితీస్తాయి.” ఆ పత్రిక ఇంకా ఇలా అంటుంది: “నొప్పి అనేది పాదాలకు నష్టం జరిగిపోయిన తర్వాతే కలుగుతుందని కూడా గుర్తుంచుకోవటం ప్రాముఖ్యం.”
చైనాలో బైబిలు ప్రచురణ
“గత రెండు దశాబ్దాల్లో చైనా 2 కోట్లకు పైగా బైబిళ్ళను ఉత్పత్తి చేసింది. అంతేకాదు, 1990ల ప్రారంభం నుండి ఆ దేశంలో బైబిలు అత్యంత ప్రజాదరణ పొందిన పుస్తకాల్లో ఒకటైంది” అని షిన్వా వార్తా సంస్థ చెబుతుంది. సాంఘిక శాస్త్రాల చైనా అకాడమీ క్రిందనున్న ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వరల్డ్ రెలీజియన్స్‌కు చెందిన ప్రొఫెసర్ ఫంగ్ జిన్‌యువాన్ చెప్పే దాని ప్రకారం, చైనాలోని క్రైస్తవులు రెండు ప్రతులను కొనుక్కోవటానికి హక్కు ఉంది. దాదాపు 20 సంపుటులు ఇప్పటికే ముద్రితమయ్యాయి, “వీటితోపాటు చైనీస్ భాషలోని ఇంగ్లీషు సంపుటులు, సాంప్రదాయికమైన సరళీకృతమైన అక్షరాల్లో చైనీస్ సంపుటులు, మైనారిటీ భాషల్లోని సంపుటులు, అలాగే చేత్తో సులభంగా పట్టుకుపోగలవీ బల్లమీద పెట్టుకోగల పరిమాణంలోనివీ ఉన్నాయి.” వీటికితోడు, బైబిలు కథలున్న అనేక పుస్తకాలు ప్రచురించబడ్డాయి, ఇవి బైబిళ్ళ అమ్మకాల్ని మించిపోగలవని అంచనాలు ఉన్నాయి. “ఈ దేశంలో తొలి 1990ల నుండి అత్యంత ప్రభావవంతమైన పుస్తకాల లిస్టులో 32వ స్థానంలో ఉంది” అని ఆ శీర్షిక చెబుతుంది, కానీ “సాధారణంగా మతం పాశ్చాత్య దేశాల్లోని ప్రజలపైకన్నా చైనాలోని ప్రజలపై తక్కువ ప్రభావాన్ని చూపిస్తోంది.”