“సమృద్ధి నుండి అందరికీ ప్రయోజనం లభించడం లేదు”
ఐక్యరాజ్య సమితి అభివృద్ది కార్యక్రమం లేక యుఎన్డిపి సంపుటీకరించిన హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ 1998 అనే వార్షిక నివేదిక, వస్తు వినిమయంలో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన అసాధారణమైన పెరుగుదలపై అవధానాన్ని నిలిపింది. భూగోళవ్యాప్తంగా చెప్పాలంటే, మనమిప్పుడు ఆర్థిక సరుకులను 1950లో కన్నా ఆరు రెట్లు ఎక్కువగానూ, 1975లో కన్నా రెండు రెట్లు ఎక్కువగానూ వినియోగిస్తున్నామని అది వెల్లడిచేసింది. వినిమయంలో ఇంత పెరుగుదల ఉన్నా, “సమృద్ధి నుండి అందరికీ ప్రయోజనం లభించడం లేదు” అని యుఎన్డిపి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయిన జేమ్స్ గుస్టావ్ స్పెత్ అంటున్నారు.
ఉదాహరణకు: ప్రపంచ జనాభాలోని నిరుపేదలైన 20 శాతంమంది కన్నా, అత్యంత ధనికులైన 20 శాతంమంది చేపలను ఏడు రెట్లు ఎక్కువగా తింటున్నారు, మాంసాన్ని 11 రెట్లు ఎక్కువగా తింటున్నారు, విద్యుచ్ఛక్తిని 17 రెట్లు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు, టెలిఫోన్ కనెక్షన్లను 49 రెట్లు ఎక్కువగా కల్గివున్నారు, కాగితాన్ని 77 రెట్లు కన్నా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు, కార్లను 149 రెట్లు ఎక్కువగా కల్గివున్నారు.
కనుగొనబడిన ఈ విషయాలపై వ్యాఖ్యానిస్తూ, భూ సహజవనరులు తరిగిపోయే వేగాన్ని నెమ్మదిపరచేందుకు పారిశ్రామికీకరణ ప్రపంచం దాని వినిమయ పద్ధతులను మార్చుకోవలసిన అవసరం ఉందని యు.ఎన్. రేడియో పేర్కొంది. అదే సమయంలో, ప్రపంచంలోని బీద దేశాలు భూ వనరుల నుండి మరింత ప్రయోజనం పొందగలిగేలా సంపన్నదేశాలు తమ సంపదను బీదదేశాలతో మరెక్కువగా పంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎంత మేరకు పంచుకోవలసిన అవసరం ఉంది?
పారిశ్రామికీకరణ జరిగిన దేశాలు తాము ప్రస్తుతం ఇస్తున్న అభివృద్ధి సహాయాన్ని రెట్టింపు చేస్తే—ప్రతి సంవత్సరంగా ఇచ్చే 5,000 కోట్ల డాలర్లను 10,000 కోట్ల డాలర్లుగా పెంచితే—ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేదవాళ్ళందరూ ఆహారాన్నీ, ఆరోగ్యాన్నీ, విద్యనూ, వసతినీ పొందగల్గుతారని మిస్టర్ స్పెత్ అంచనా వేస్తున్నారు. అదనంగా 5,000 కోట్ల డాలర్లు అంటే చాలా పెద్ద మొత్తమేనని అనిపించవచ్చు. కాని, “యూరప్, కేవలం సిగరెట్ల కొరకే సంవత్సరానికి అంత మొత్తం ఖర్చుపెడుతుంది, అమెరికా, ఆ మొత్తంలో సగాన్ని నేడు మద్యపానీయాల కోసం ఖర్చు పెడుతుంది” అని మిస్టర్ స్పెత్ గుర్తుచేస్తున్నారు.
అయితే, ఈ గ్రహం మీద ఉన్న వనరులను సరి సమానంగా పంచుకునేందుకు చేసే సమైక్య కృషి, బాధాకరమైన ఈ పేదరికాన్ని తుదముట్టడించడంలో ఒక గొప్ప సహాయమౌతుంది. దానికి ఏం అవసరం? “తుది విశ్లేషణలో తేలినదేమిటంటే, [దానికి] కావలసినది హృదయాలు, మనస్సులు, అభిలాషలు మారడమే”నని ఐక్యరాజ్య సమితి అధికారి ఒకరు తన అభిప్రాయాన్ని వ్యక్తపర్చారు. దానితో చాలామంది ఏకీభవించినప్పటికీ, వాళ్లు, నేటి విధాన-నిర్మాణ సంస్థలకు ఎంత మంచి ఉద్దేశం ఉన్నా అలాంటి మార్పులను తీసుకు రాలేవనీ, దురాశలాంటి లక్షణాలను మార్చే విషయమైతే ఇక చెప్పనక్కర లేదనీ గ్రహిస్తారు.
అయినప్పటికీ, మానవ కుటుంబపు భవిష్యత్ గురించీ, మన గ్రహపు భవిష్యత్ గురించీ కలత చెందుతున్న ప్రజలకు నిరీక్షణ ఉంది. మానవ సమస్యలతో సఫలంగా వ్యవహరిస్తానని భూమిని సృజించిన సృష్టికర్త వాగ్దానం చేశాడని తెలుసుకోవడం ఎంతో ధైర్యాన్నిస్తుంది. “అప్పుడు భూమి దాని ఫలములిచ్చును దేవుడు మా దేవుడు మమ్మును ఆశీర్వదించును. దేశములోను పర్వత శిఖరములమీదను సస్య సమృద్ధి కలుగును” అని కీర్తనల రచయిత ముందే చెబుతున్నాడు. (కీర్తన 67:6; 72:16) అవును, అప్పుడు భూనివాసుల్లో ప్రతి ఒక్కరికీ “సమృద్ధి నుండి ప్రయోజనం లభిస్తుంది”!