సదాకాలం జీవించాలని మీరు ఆశించగలరా?
“మానవుని ఆయుష్షు యొక్క గరిష్ట పరిమితిని మహా అయితే 115 నుండి 120 సంవత్సరాలుగా నిర్ణయించేదేదో మానవ శరీరం లోపల జరుగుతోంది. [ఆయుష్షుకు] పరిమితి ఉంది, కానీ దాన్ని ఏది నిర్ణయిస్తుందో మాకు ఐడియా లేదు” అని కణజీవ శాస్త్రవేత్త అయిన డాక్టర్ జేమ్స్ ఆర్. స్మిత్ పేర్కొన్నారు. కాబట్టి, మానవ జీవితపు పరుగు పందెపు “ఫినిష్ లైన్‌ను ఇంకా దూరానికి పొడిగించే మార్గాన్ని శాస్త్రజ్ఞులు ఇంకా కనుగొనవలసి ఉంది, ఇంకా ఎవరూ దాని గురించి ఆలోచించకపోవడం”లో ఆశ్చర్యమేమీ లేదు అని జీవశాస్త్రవేత్త అయిన డాక్టర్ రాగర్ గాస్డన్ అంటున్నారు. మార్పు ఏమైనా సంభవించబోతోందా?
“నిజంగా పెద్ద ప్రశ్న”ను ఎదుర్కోవడం
వృద్ధాప్యం రాకుండా చేస్తామన్న వాగ్దానాలతో కూడిన సిద్ధాంతాల కొరతేమీ లేదు. కానీ, ఈ సిద్ధాంతాలన్నీ “డమ్మీ బుల్లెట్ల వంటివని తేలిపోతుంది” అని అంటున్న, అమెరికాలోని వృద్ధుల సమాజపు ప్రెసిడెంట్ అయిన డాక్టర్ జీన్ డి. కోహెన్‌తో చాలామంది నిపుణులు ఏకీభవిస్తారు. ఎందుకని? ఒక విషయమేమిటంటే, “వృద్ధాప్యానికీ, దాని అనివార్య ఫలితంగా వచ్చే మరణానికీ కారణమౌతున్నదేమిటో ఇప్పటికీ ఎవరికీ తెలియదు, రోగానికి కారణం మీకు తెలియనప్పుడు దానిని నివారించడానికి ప్రయత్నించడం చీకట్లో రాయి విసరడం వంటిదే” అని యు.ఎస్. న్యూస్ & వాల్డ్ రిపోర్ట్‌లో విజ్ఞానశాస్త్ర రచయిత అయిన నాన్సీ షూట్ అంటున్నారు. వృద్ధాప్యం అనేది ఒక నిగూఢ ప్రశ్నగానే ఉంటోందని డాక్టర్ గాస్డన్ కూడా పేర్కొంటున్నారు: “ఇది మనందరిలోనూ గోచరమౌతుంది, కానీ దాని ప్రాథమిక స్వభావం మాత్రం ఒక మర్మంగానే ఉంటోంది. అసలు ఇది ఎందుకు సంభవిస్తుంది అనే పెద్ద ప్రశ్నకు, నిజంగా పెద్ద ప్రశ్న”ను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు అని ఆయన పేర్కొన్నారు.a
స్పష్టంగా, మానవులు ఎంత వేగంగా పరుగెత్తగలరు, ఎంత ఎత్తు నుండి దూకగలరు, ఎంత లోతుకు డైవ్ చేయగలరు అన్న వాటికి ఒక పరిమితి ఉంది, అలాగే, కేవలం మానవ ఆలోచనా సామర్థ్యం ద్వారా, తార్కిక శక్తి ద్వారా ఎంత మేరకు వివరించగలరు అనే దానికి కూడా పరిమితి ఉంది. “ఎందుకు అన్న నిజంగా పెద్ద ప్రశ్న”కు సమాధానం ఇవ్వడం అనేది మానవుని సామర్థ్య పరిమితికి మించిన విషయం. కాబట్టి, ఈ నిస్సహాయ మానవ జ్ఞానానికి అతీతమైన ఒక మూలం వైపుకు తిరగడమే ఈ ప్రశ్నకు సమాధానాన్ని కనుగొనే ఏకైక మార్గం. ఖచ్చితంగా, వివేకంతో కూడిన ప్రాచీన పుస్తకమైన బైబిలు సలహా ఇస్తున్నది మీరు అలా చేయాలనే. “జీవపు ఊట”యైన సృష్టికర్తను గురించి మాట్లాడుతూ, “మీరు యెహోవాను వెదికితే, మీరాయనను కనుగొంటారు” అని బైబిలు మనకు హామీ ఇస్తుంది. (కీర్తన 36:9; 2 దినవృత్తాంతములు 15:2, పరిశుద్ధ బైబల్) అయితే, దేవుని వాక్యమైన బైబిలును పరిశోధిస్తే, మానవుడు మరణించడానికి గల నిజమైన కారణమేదన్నది వెల్లడౌతుంది?
మరణానికి మూల కారణం
దేవుడు మొదటి మానవుల్ని సృష్టించినప్పుడు ఆయన “వారి హృదయాల్లో శాశ్వత కాలమును గురించిన స్పృహను” ఉంచాడని బైబిలు మనకు చెబుతుంది. (ప్రసంగి 3:11, బెక్) అయితే, సృష్టికర్త మానవుని మొదటి తల్లిదండ్రులకు ఎల్లకాలం జీవించాలనే కోరిక కంటే ఎక్కువే ఇచ్చాడు; ఆయన వారలా జీవించే అవకాశాన్ని కూడా ఇచ్చాడు. వారు పరిపూర్ణ శరీరంతోనూ, మనస్సుతోనూ సృష్టించబడ్డారు, వారు ప్రశాంతమైన పరిసరాల్లో జీవితాన్ని ఆస్వాదించారు. ఈ మొదటి మానవులు ఎల్లకాలం జీవించాలనీ, కాలక్రమేణా, వాళ్ళకు జన్మించే పరిపూర్ణులైన సంతానంతో భూమి నిండాలనీ సృష్టికర్త ఉద్దేశించాడు.—ఆదికాండము 1:28; 2:15.
అయినప్పటికీ, ఫినిష్ లైన్ లేని—అంతం లేని—జీవితమనేది షరతుతో కూడినది. అది దేవునికి విధేయత చూపడం మీద ఆధారపడి ఉంది. ఆదాము దేవునికి అవిధేయతను చూపిస్తే, ఆయన ‘నిశ్చయముగా చనిపోతాడు’ అన్నది షరతులో ఉంది. (ఆదికాండము 2:16, 17) విషాదకరమైన విషయమేమిటంటే, మొదటి మానవులు అవిధేయతను చూపారు. (ఆదికాండము 3:1-6) “ఆజ్ఞాతిక్రమమే పాపము” గనుక, అలా చేయడం వల్ల వారు పాపులయ్యారు. (1 యోహాను 3:4) “పాపమువలన వచ్చు జీతము మరణము” కనుక, దాని ఫలితంగా, వాళ్ళు అనంత కాలం జీవించే ఉత్తరాపేక్షను కోల్పోయారు. (రోమీయులు 6:23) కనుక, దేవుడు మొదటి మానవులపై శిక్ష విధించినప్పుడు, ‘మీరు మన్నే గనుక తిరిగి మన్నైపోదురు’ అని వాళ్ళతో చెప్పాడు.—ఆదికాండము 3:19.
కనుక, మొదటి మానవులు పాపం చేసిన తర్వాత, ముందు చెప్పబడినట్లుగా ఆ పాపపు ప్రభావం వారి జన్యువుల్లో చొచ్చుకుపోయింది, అలా ఫినిష్ లైన్ వేయబడింది. దాని ఫలితంగా, వారు వృద్ధాప్యానికీ లోనుకావడం మొదలయ్యింది. మరణం దాని పర్యవసానం. దానికి తోడు, మొదటి మానవులు ఏదెను అని పిలువబడిన తమ మొదటి పరదైసు గృహం నుండి వెళ్ళగొట్టబడిన తర్వాత, తమ జీవితాలపై హానికరమైన ప్రభావాన్ని చూపే మరొక కారకమును ఎదుర్కోవలసి వచ్చింది—ఏదెనుకు వెలుపల హర్డిల్‌వంటి పరిసరాల్లో జీవించవలసి వచ్చింది. (ఆదికాండము 3:16-19, 23, 24) లోపభరితమైన వారసత్వమూ, కష్టతరమైన పరిసరాలూ రెండూ కలిసి, మొదటి మానవులనూ, అదేవిధంగా వారి భవిష్యత్ సంతతివారినీ బాధించాయి.
శిక్ష విధించడమూ, వాగ్దానం చేయడమూ
మొదటి మానవులు పిల్లలకు జన్మనివ్వక మునుపే, వారి జీవితాల్లో ఈ హానికర మార్పులు సంభవించాయి గనుక, వారు తమ వంటి సంతానానికే—అపరిపూర్ణులైన, పాపభరితులైన, వృద్ధాప్య ప్రక్రియకు లోనయ్యే సంతానానికే—జన్మనివ్వగల్గారు. “మనుష్యులందరు పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను” అని బైబిలు చెబుతుంది. (రోమీయులు 5:12; పోల్చండి కీర్తన 51:5.) “మనం మన కణ నిర్మాణంలో లిఖించబడిన మన సొంత మరణ వారెంట్‌లను మోస్తున్నాము” అని ద బాడీ మెషీన్—యువర్ హెల్త్ ఇన్ పెర్‌స్పెక్టివ్ అనే పుస్తకం అభిప్రాయపడుతుంది.
అయినప్పటికీ, ఫినిష్ లైన్ లేని జీవితాన్ని, అంటే వృద్ధాప్యమూ, మరణమూ లేని జీవితాన్ని పొందే ఆశే లేదని దీనర్థం కాదు. మొదటగా, మానవ జీవితాన్నీ, సంభ్రమాశ్చర్యాలను గొలిపేంతటి వివిధ రకాల జీవ రూపాలనూ సృష్టించిన అన్నివిధాలా బుద్ధిశాలియైన సృష్టికర్త, ఏ విధమైన జన్యు సంబంధ క్రమరాహిత్యాలనైనా నయం చేయగలడనీ, మానవుడు ఎల్లకాలం జీవించేందుకు అవసరమైన శక్తిని ఇవ్వగలడనీ నమ్మడం సహేతుకమైనదే. రెండవదిగా, సృష్టికర్త వాగ్దానం చేసింది కూడా ఖచ్చితంగా అదే. దేవుడు, మొదటి మానవులపై మరణ శిక్షను విధించిన తర్వాత, మానవులు ఎల్లకాలం జీవించాలన్న తన ఉద్దేశం మారలేదని ఆయన అనేక సార్లు వెల్లడి చేశాడు. ఉదాహరణకు, “నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు వారు దానిలో నిత్యము నివసించెదరు” అని ఆయన హామీ ఇస్తున్నాడు. (కీర్తన 37:29) ఈ వాగ్దాన నెరవేర్పును మీరు కూడా అనుభవించాలంటే, మీరేమి చేయవలసిన అవసరం ఉంది?
మీ జీవితాన్ని శాశ్వత కాలానికి పొడిగించుకోవడం ఎలాగంటే
ఆసక్తికరంగా, గ్రంథకర్త అయిన రానాల్డ్ కోట్యులక్ 300 మందికి పైగా వైద్య పరిశోధకులను ఇంటర్వ్యూ చేసిన తర్వాత, “ప్రజల ఆరోగ్యాన్ని, వారు ఎంత కాలం జీవిస్తారన్న దాన్ని అత్యంత ప్రాముఖ్యంగా వాళ్ళ ఆదాయం, వృత్తి, విద్య నిర్ణయిస్తాయన్న విషయం ఎంతోకాలంగా శాస్త్రవేత్తలకు తెలుసు. . . . అయితే, దీర్ఘాయువును అన్నింటికన్నా ముఖ్యంగా నిర్ణయించే కారకం విద్యే” అని ఆయన పేర్కొన్నారు. “ప్రాణాంతకమైన వ్యాధులు సోకేలా చేసే సూక్ష్మజీవులకు వ్యతిరేకంగా పోరాడేందుకు కావలసిన బలాన్ని, మనం భుజించే ఆహారం, మన వ్యాధినిరోధక వ్యవస్థకు ఇస్తున్నట్లే, విద్య, మనం హానికరమైన ఎంపికలను చేసుకోకుండా మనల్ని కాపాడుతుంది” అని ఆయన వివరించారు. ఒక పరిశోధకుడు చెప్పినట్లు, “మీరు విద్య సహాయంతో, మీరు మీ ప్రపంచంలో ఎలా సాగిపోవాలో, రాగల అవరోధాలను” ఎలా “అధిగమించాలో నేర్చుకుంటారు.” కనుక, గ్రంథకర్త అయిన కోట్యులక్ చెబుతున్నట్లు, ఒక విధంగా చెప్పాలంటే, “ఆరోగ్యకరమైన, దీర్ఘకాల జీవితానికి రహస్యం” విద్యే.
భవిష్యత్తులో నిత్యజీవాన్ని సాధించేందుకు అవసరమైన మొట్టమొదటి చర్య కూడా విద్యే—అదే బైబిలు విద్య. “అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము” అని యేసుక్రీస్తు అన్నాడు. (యోహాను 17:3) సృష్టికర్త అయిన యెహోవా దేవుని గురించిన, యేసుక్రీస్తును గురించిన, దేవుడు చేసిన విమోచన క్రయధన బలి ఏర్పాటును గురించిన జ్ఞానాన్ని పొందడమే, నిత్యజీవపు మార్గంలో వెళ్ళేందుకు మొదటి చర్య తీసుకొనేలా ఒకరిని సిద్ధం చేసే ఏకైక విద్య.—మత్తయి 20:28; యోహాను 3:16.
యెహోవాసాక్షులు బైబిలు విద్యా కార్యక్రమాన్ని నిర్వహిస్తారు, జీవాన్నిచ్చే బైబిలు జ్ఞానాన్ని పొందేందుకు అది మీకు సహాయం చేయగలదు. ఈ ఉచిత కార్యక్రమాన్ని గురించి మరింత ఎక్కువ నేర్చుకొనేందుకుగాను వారి రాజ్యమందిరాలను దర్శించండి, లేదా మీకు అనుకూలమైన సమయంలో మిమ్మల్ని దర్శించమని వారిని అడగండి. జీవితం హర్డిల్స్ వల్ల ఆటంకపరచబడని, ఫినిష్ లైన్ వల్ల పరిమితం చేయబడని సమయం సమీపించిందనేందుకు కొండంత రుజువు బైబిలులో ఉందని మీరు చూస్తారు. నిజమే, మరణం సహస్రాబ్దాలుగా ఏలుతోంది, కానీ అది త్వరలోనే శాశ్వతంగా అణచివేయబడుతుంది. వృద్ధులకు, యౌవనులకు ఎంతటి పులకరింపజేసే ఉత్తరాపేక్ష ఇది !
[అధస్సూచీలు]
a వృద్ధాప్యం ఎలా వస్తుందన్న దానిని వివరించేందుకుగాను వార్ధక్య శాస్త్రవేత్తలు అనేక విభిన్న సిద్ధాంతాలను రూపొందించారు (లెక్కించగా 300 కంటే ఎక్కువే ఉన్నాయి!). అయితే, అసలు వృద్ధాప్యం ఎందుకు వస్తుందో ఈ సిద్ధాంతాలు వివరించడంలేదు.
[13వ పేజీలోని చిత్రాలు]
నిత్యజీవాన్ని పొందేందుకు మొదటి మెట్టు బైబిలు విద్యే