యువత ఇలా అడుగుతోంది . . .
రోల్-ప్లేయింగ్ గేమ్స్‌లో ప్రమాదం ఏమైనా ఉందా?
“అది పూర్తిగా కల్పన. మీరు ఒక సమయంలో మెజీషియన్, మరొక సమయంలో ఒక యోధుడూ అవుతారు. మీరు ఎలా ఉండాలని కలలు కంటారో అలా విభిన్న పాత్రల్లో ఉంటారు. వాటికి పరిమితులే లేవు.”—క్రీస్టొఫ్.
ఒక మ్యాగజైన్, జనాదరణ పొందిన ఒక ఫాంటసీ గేమ్స్‌ను వర్ణిస్తూ, “మీరు ఏది కాలేరో అది అవుతారు” అనే నినాదాన్ని ఉదాహరించింది. కాబట్టి, రోల్-ప్లేయింగ్ గేమ్స్ (స్వైరకల్పిత పాత్రల ఆటలు) అనే ఊహాలోకంలోకి పారిపోవడమన్నది లక్షలాది మంది యౌవనుల ఆదరణను ఎంతగానో పొందుతుంది. అయితే, అసలు రోల్-ప్లేయింగ్ గేమ్స్ అంటే ఏమిటి?
జో డ రోల్ (రోల్-ప్లేయింగ్ గేమ్స్) అనే పుస్తకం ప్రకారం, “ప్రతి ఆటగాడు, ఒక రాయబారం సాగించడానికి వెళ్తున్న లేదా అన్వేషణలో ఉన్న పౌరాణిక పాత్రను ధరిస్తాడు, ఊహా లోకంలో సాహసకృత్యం చేయడానికి సంసిద్ధమవుతాడు.” ఈ నియామకాన్ని నెరవేర్చేందుకు అవసరమైన అనుభవాన్నీ, డబ్బునూ, ఆయుధాలనూ లేదా మాంత్రిక శక్తులనూ సంపాదించడం ద్వారా కల్పిత పాత్రకు జీవం పోయాలన్నదే ఈ ఆట లక్ష్యం.
డన్జన్స్ ఆండ్ డ్రాగన్స్a అనే ఆటతో రోల్-ప్లేయింగ్ గేమ్స్ 1970లలో జనాదరణ గలవిగా మారాయి. అప్పటి నుండి, బోర్డ్ గేమ్స్, ట్రేడింగ్ కార్డ్స్, ఇంటరాక్టివ్ బుక్స్, కంప్యూటర్ గేమ్స్, సాహసాలను చేసే లైవ్-యాక్షన్ గేమ్స్ మొదలైనవాటిని భాగంగా చేసుకుంటూ రోల్-ప్లేయింగ్ గేమ్స్ అనేక లక్షల డాలర్ల పరిశ్రమగా వికాసం చెందాయి. రోల్-ప్లేయింగ్ గేమ్స్ ఆడే రెగులర్ ప్లేయర్లు అమెరికాలో 60లక్షల కంటే ఎక్కువ మందీ, యూరప్‌లో కొన్ని లక్షల మందీ ఉన్నారన్నది స్పష్టమే. ఫ్రాన్స్‌లోని అనేక ఉన్నత పాఠశాలల్లో రోల్-ప్లేయింగ్ గేమ్స్ కోసం క్లబ్బులు ఉన్నాయి. జపాన్ విషయమే తీసుకుంటే, రోల్-ప్లేయింగ్ గేమ్సే అక్కడి అత్యంత ప్రజాదరణ పొందిన వీడియో గేమ్స్.
ఈ ఆటలు ఊహాశక్తిని చైతన్యవంతం చేస్తాయనీ, సమస్యల్ని పరిష్కరించుకోగల సామర్థ్యాలను పెంచుతాయనీ, ఒక గుంపుతో సంబంధాలు కలిగి ఉండడానికి ప్రోత్సహిస్తాయనీ న్యాయవాదులు వాదిస్తున్నారు. అయితే, దీన్ని వ్యతిరేకించేవాళ్ళు ఈ ఆటలను ఆత్మహత్యలతోనూ, హత్యలతోనూ, మానభంగాలతోనూ, సమాధులను త్రవ్వడంతోనూ, చెడుతనముతోనూ ముడిపెడుతారు. స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లోని ఇద్దరు యౌవనులు, రోల్-ప్లేయింగ్ గేమ్‌లోని ఒక ఘట్టాన్ని నటిస్తూ 52 సంవత్సరాల వ్యక్తిని చంపారని అనుమానించబడి అరెస్ట్ చేయబడ్డారు. జపాన్‌లోని ఒక టీనేజర్ కూడా అటువంటి ఆటనే ఆడుతూ, ఆట చివర్లో తన తల్లిదండ్రులను చంపి, తన మణికట్టులను నిలువగా కోసుకున్నాడు. నిజమే, ఇలా జరగడం చాలా అరుదే—ఈ గేమ్స్‌లో పాల్గొనేవాళ్ళలో చాలామంది తెలివైనవారే, ఇతరులతో సహవసించడానికి ఇష్టపడేవారే. అయినప్పటికీ, ‘నేను రోల్-ప్లేయింగ్ గేమ్స్ ఆడాలా? జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఏమైనా ఉందా?’ అని యువ క్రైస్తవులు తమను తాము ప్రశ్నించుకోవాలి.
హింసా, నిగూఢతా
రోల్-ప్లేయింగ్ గేమ్స్ వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరుగా ఉంటాయి. ఇవి వివిధ రూపాల్లోనూ, వివిధ అంశాల్లోనూ ఉంటాయి. అయినప్పటికీ, ఎక్కువ మొత్తంలో కాకపోయినా, ఇటువంటి అనేక ఆటల్లో హింస కనిపిస్తుంది. నిజానికి, ఈ ఆటలు సృష్టించే కల్పిత లోకాల్లో, ఆట ముందుకు సాగడానికి లేదా ఆగిపోకుండా ఉండడానికి తరచూ హింసే ఆవశ్యక భాగం అవుతుంది. అయితే, అటువంటి ఆటలు ఆడడం, బైబిలు ఉపదేశంతో ఎలా పొందికగా ఉంటుంది? “బలాత్కారము చేసేవాడ్ని చూచి అసూయపడవద్దు, నీ ప్రవర్తనకు అతడిని ఎన్నటికీ మాదిరిగా చేసుకోవద్దు” అని సామెతలు 3:31 చెబుతుంది. (న్యూ జెరూసలెం బైబిలు) బలాత్కారాన్ని కాక, ‘సమాధానమును వెదకి, దాని వెంటాడమని’ కూడా బైబిలు మనల్ని కోరుతోంది.—1 పేతురు 3:11.
వ్యాకులపరచే మరొక విషయం ఏమిటంటే, ఆటల్లో ఇంద్రజాలం ఎక్కువ మొత్తంలో ఉంటుందన్నదే. తరచుగా, ఆటగాళ్లు మాంత్రికులుగా లేదా ఇంద్రజాల శక్తులుగల ఇతర వ్యక్తులుగా అవ్వగలరు. అంటే అడ్డంకులను లేదా శత్రువులను ఇంద్రజాల విద్య ద్వారా అధిగమించడం జరుగుతుంది. ఒక నివేదిక ప్రకారం, ప్రజాదరణ పొందిన ఒక ఆటలో, “ఆటగాళ్ళు ప్రధాన దూతలను సేవించే దూతల పాత్రను గానీ లేదా దయ్యాల చక్రవర్తులను సేవించే దయ్యాల పాత్రను గానీ తీసుకునే” అవకాశం ఉంది అనీ, “. . . పవిత్రమైనవాటిని చులకనగా చేసే సన్నివేశాలు, దాన్ని రసవత్తరంగా చేస్తాయి” అనీ నివేదించబడింది. కంప్యూటరీకరించబడిన ఒక ఆటలో, ఆటగాడు “సేటన్” అన్న పదాన్ని టైపు చేస్తే అతడు సర్వశక్తులు గలవాడవుతాడు.
రోల్-ప్లేయింగ్ గేమ్స్ ఆడడంలో తప్పేమీ లేదనీ, మరీ ఎక్కువసేపు ఆడనంతవరకు పొరపాటేమీ లేదనీ కొందరు క్రైస్తవ యౌవనస్థులు తర్కిస్తారు. “ఇది కేవలం ఒక ఆట మాత్రమే” అని ఒక యౌవనస్థుడు అంటున్నాడు. అది కేవలం ఆటే కావచ్చు. కానీ, నిగూఢ విద్యలో పాల్గొనవద్దని దేవుడు ఇశ్రాయేలీయులను హెచ్చరించాడు. ‘శకునముచెప్పు సోదెగాడైనను, మేఘశకునములనుగాని సర్ప శకునములనుగాని చెప్పువాడైనను, చిల్లంగివాడైనను, మాంత్రికుడైనను, ఇంద్రజాలకుడైనను కర్ణపిశాచి నడుగువాడైనను, దయ్యములయొద్ద విచారణచేయు వాడైనను . . . యెహోవాకు హేయుడు’ అని మోషేకు ఇవ్వబడిన ధర్మశాస్త్రం ప్రకటించింది.—ద్వితీయోపదేశకాండము 18:10-12.
నిగూఢ విద్యను పురికొల్పే ఏ ఆటనైనా ఆడడం వివేకవంతమైనదేనా? మాంత్రిక శక్తులు గల పాత్రలను పోషించడం అంటే “సాతానుయొక్క గూఢమైన సంగతులను” తరచి చూడడమని కాదా? (ప్రకటన 2:24) “ఒక రోల్-ప్లేయింగ్ గేమ్‌ను ఒక రోజంతా ఆడిన తర్వాత ఇంటి వెలుపలికి రావాలంటే భయమేసింది. నేను బయటికి వస్తే, నా మీద ఎవరన్నా దాడి చేస్తారేమో అని అనిపించింది” అని ఒక యౌవనస్థుడు ఒప్పుకుంటున్నాడు. అటువంటి నాశనకరమైన భయాన్ని కలుగజేసే ఏ ఆటైనా ఆరోగ్యకరమైనదేనా?
ఇతర కారకాలు
“కాలము సంకుచితమై యున్నది” అని 1 కొరింథీయులు 7:29 చెబుతుంది. కనుక, ప్రాముఖ్యంగా వ్యాకులపరచే మరొక విషయం, రోల్-ప్లేయింగ్ గేమ్స్ కోసం ఎంతో సమయం బద్ధుడై ఉండవలసి వస్తుందన్నదే. కొన్ని ఆటలు పూర్తవ్వడానికి గంటలు, రోజులు, అంతెందుకు వారాలు కూడా పడుతాయి. అంతకంటే ఎక్కువగా, వాటిలోని పాత్రలు, ఆడేవాళ్ళు పూర్తిగా లీనమైపోయేలా ఉంటాయి. వాటికి బానిసలయ్యేలా కూడా చేస్తాయి, దాంతో మిగతావన్నీ ప్రక్కకు నెట్టబడతాయి. “నేను ఒక్కొక్క ఘట్టాన్ని పూర్తి చేస్తున్న కొలది, మరింత కఠినమైన సవాళ్ళు కావాలనీ, మరింత వాస్తవికంగా ఉండాలనీ కోరుకున్నాను, నిజంగానే నాకు ఆ ఆట ఒక వ్యసనంగా మారింది” అని ఒక యౌవనస్థుడు ఒప్పుకుంటున్నాడు. అటువంటి వ్యసనం ఒక యౌవనస్థుడి స్కూలు చదువులనూ, ఆధ్యాత్మిక కార్యకలాపాలనూ ఎలా బాధించవచ్చు?—ఎఫెసీయులు 5:15-17.
జపాన్‌లోని ఒక యౌవనస్థుడు, “నేను ఆటలో తర్వాత ఏం జరుగుతుందన్న దాని గురించే ఎప్పుడూ ఆలోచించేవాడ్ని, నేను ఆడనప్పుడు కూడా ఆలోచించేవాడ్ని. స్కూల్లోనూ, కూటాల్లోనూ ఎప్పుడూ ఆట గురించిన ఆలోచనలు కందిరీగల్లా కమ్ముకునేవి. చివరికి నేనిక దేని గురించీ ఆలోచించలేని స్థాయికి చేరుకున్నాను. నాకు ఆధ్యాత్మికత బొత్తిగా లేకుండా పోయింది” అని గుర్తు చేసుకుంటున్నాడు. “వాస్తవ లోకం నుండి ఎంతో దూరం” అయ్యాను అని మొదట్లో ప్రస్తావించబడిన క్రిస్టొఫ్ అంటున్నాడు. నిజమే, ‘నవ్వడానికీ, ఆడడానికీ సమయం’ ఉంది. కానీ, వినోదం, ఆధ్యాత్మిక కార్యకలాపాల స్థానాన్ని తీసుకోవడానికి అనుమతించాలా?—ప్రసంగి 3:4.
ఈ ఆట ఏ విధమైన స్ఫూర్తిని ప్రోత్సహిస్తుందో కూడా ఆలోచించండి. ఫ్రాన్సులోని ఒక మ్యాగజైన్ ఒక రోల్-ప్లేయింగ్ గేమ్ గురించి చెబుతూ, “వివిధ రీతుల్లో కృశింపజేసేటువంటి, అనారోగ్యకరమైనటువంటి, కుటిలమైనవంటి అనుభవాలను మీరు ఎదుర్కుంటారు, అవి మిమ్మల్ని భయభ్రాంతుల్ని చేసేలా, లోకాన్ని గూర్చిన మీ దృక్కోణాన్ని శాశ్వతంగా మార్చివేసేలా ఉద్దేశించబడి, ఆ విధంగా సంస్థీకరించబడుతాయి” అని ప్రశంసిస్తోంది. ఇటువంటి స్ఫూర్తి, “దుష్టత్వము విషయమై శిశువులుగా ఉండుడి” అన్న బైబిలు సలహాతో పొందికగా ఉంటుందా? (1 కొరింథీయులు 14:20) చివరకు, తాను ఆడే ఆటలు “క్రైస్తవ నైతికతకు పొందికగా లేవు” అనే నిర్ధారణకు వచ్చాడు క్రిస్టొఫ్. “నేను ఒకవైపు ప్రకటనా పనికి వెళ్తూ, కూటాలకు హాజరవుతూ, క్రైస్తవ ప్రేమ వంటి మంచి విషయాలను నేర్చుకుంటూ, మరొకవైపు క్రైస్తవత్వంతో ఎటువంటి పొందికా లేని పాత్రను ఎలా పోషించగలను. అది పూర్తిగా తర్కవిరుద్ధమైనది” అని కూడా అతడు అన్నాడు.
భ్రమా లేక వాస్తవమా?
అనేకమంది యౌవనస్థులు వాస్తవం నుండి పారిపోయే మార్గంగా ఈ ఆటలకు దగ్గరవుతున్నారు. కానీ, ఇలా ఊహాలోకంలో మునిగిపోవడం ఆరోగ్యకరమేనా? “భవిష్యత్తు విషయమై అనిశ్చితత్వంతో నిండి ఉన్న వాస్తవ లోకం . . . వాస్తవానికి ఉనికిలో లేకపోయినప్పటికీ ఉన్నట్లు అనిపించే లోకాలకు—మీరు చివరకు నియమాలపై కూడా పట్టు సాధించగల లోకానికి, మీరెవరో, మీరు ఏమై ఉండాలనుకుంటున్నారో దానికి సారూప్యంగా ఉండే పాత్రకు మీరు జీవం పోయగల లోకానికి—పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది” అని ఫ్రెంచ్ సమాజ శాస్త్రవేత్త అయిన లారంట్ ట్రేమల్ వ్యాఖ్యానించారు. “ఆట ఆడడంలో, ప్రమాదకరమైన జీవితాన్ని గడుపుతున్నామనీ, లోకాన్ని పునర్నిర్మిస్తున్నామనీ యౌవనస్థులు అనుకుంటారు. వాస్తవానికి, నిజంగా కలిగే ఏ విధమైన ప్రమాదాన్నైనా ఎదుర్కునే శక్తిని వాళ్ళు పొందలేదు. వాళ్ళు సమాజం నుండి, దాని పరిధుల నుండి దూరంగా పారిపోతున్నారు” అని మానసిక ఆరోగ్య నిపుణుడైన ఎటీ బూజిన్ అభిప్రాయపడుతున్నారు.
చివరకు, ఇటువంటి పలాయన వాదం కేవలం నిరాశానిస్పృహలకే నడిపిస్తుంది. ఎందుకంటే ఆ ఆట ముగిసిన తర్వాత, వాళ్ళు నిజ జీవితాన్ని ఎదుర్కోవలసిందే. వాళ్లు చివరకు ఈ వాస్తవాలను ఎదుర్కొని తీరాల్సిందే. కల్పిత పాత్రలో మీరు సాధించిన ఎంతో గొప్ప విజయం గానీ, మీరు చూపించిన సాహసం గానీ మీ నిజ జీవితంలోని వైఫల్యతనూ, సాధారణ పరిస్థితినీ మార్చలేవు. చేయవలసిన తెలివైన పని ఏమిటంటే, జీవితంలోని నిజాలను ఎదుర్కోవడమే—నేరుగా ఎదుర్కోవడమే! నిజజీవిత పరిస్థితులను ఎదుర్కోవడం ద్వారా మీ గ్రహణ శక్తులకు పదును పెట్టుకోండి. (హెబ్రీయులు 5:14) మీరు మీ సమస్యలను ఎదుర్కొనగలిగేలా మీకు శక్తినివ్వగల ఆధ్యాత్మిక లక్షణాలను పెంపొందించుకోండి. (గలతీయులు 5:22, 23) అలా చేయడం వల్ల, ఏ విధమైన ఆట ఆడడం ద్వారా కలిగే దాని కన్నా ఎంతో ఎక్కువ సంతృప్తీ, ప్రతిఫలమూ కలుగుతాయి.
అలా అని రోల్-ప్లేయింగ్ గేమ్స్ ఇమిడి ఉన్న అన్ని ఆటలూ హానికరమైనవని కాదు. ఎంతో కాలం క్రితం, బైబిలు కాలాల్లోని చిన్న పిల్లలు కొంత మేరకు స్వైరకల్పనా, రోల్-ప్లేయింగూ ఇమిడి ఉన్న ఆటలను ఆడేవారు, యేసు కూడా వాటిని గమనించాడు. (లూకా 7:32) అయితే, నిర్దోషమైన వినోదాన్ని యేసు ఖండించలేదు. అయితే, క్రైస్తవ యౌవనస్థులు తమ తల్లిదండ్రులతో పాటు ‘ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షిస్తూ ఉండాలి.’ (ఎఫెసీయులు 5:10) ఒక ఆటను గురించి ఆలోచించేటప్పుడు, ‘ఇది “శరీరకార్యముల”కు ప్రతిబింబంగా ఉందా? ఇది దేవునికీ నాకూ మధ్యగల సంబంధానికి ప్రతిబంధకాన్ని కలిగిస్తుందా?’ అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. (గలతీయులు 5:19-21) ఇటువంటి కారకాలను గురించి ఆలోచించడం ద్వారా, రోల్-ప్లేయింగ్ గేమ్స్ విషయమై మీరు వివేకంతో కూడిన నిర్ణయాన్ని తీసుకోగలరు.
[అధస్సూచీలు]
a మార్చి 22, 1982, తేజరిల్లు! (ఆంగ్లం) లోని పేజీలు 26-7 చూడండి.
[15వ పేజీలోని చిత్రాలు]
రోల్-ప్లేయింగ్ గేమ్స్ ఏ విధమైన స్ఫూర్తిని పెంపొందిస్తాయి?