దీర్ఘకాలం జీవించండి ఆరోగ్యంగా ఉండండి
మానవ జీవితమనేది ఒక సుదీర్ఘమైన హర్డిల్ రేస్ అని ఊహించుకోండి. హర్డిల్ రేస్ అనే పరుగు పందెంలో రన్నర్‌లు దారికడ్డంగా ఉన్న హర్డిల్స్ మీదుగా దూకుతూ పరుగెత్తాలి. రన్నర్లంతా పరుగు పందాన్ని ఒకేసారి ప్రారంభిస్తారు; కానీ దారికడ్డుగా ఉన్న హర్డిల్స్‌ని దూకుతున్నప్పుడు, ఆ హర్డిల్స్ అప్పుడప్పుడు వాళ్ళకు తగులుతుంటాయి. రన్నర్ల పరుగు వేగం నెమ్మదిగా తగ్గుతూ ఉంటుంది. అలా ఆ పందెం జరుగుతుండగా, అనేకమంది పందెం నుంచి విరమించుకుంటారు.
అదేవిధంగా, మానవ జీవితానికి ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంది, జీవిత మార్గం పొడవునా పెద్ద హర్డిల్స్ ఉన్నాయి. మానవుడు తన జీవితపు పరుగు పందెంలో ఒక దాని తర్వాత మరొకటి చొప్పున హర్డిల్స్‌ని ఎదుర్కొంటూనే ఉంటాడు. ప్రతి అడ్డంకూ అతడ్ని బలహీనుడ్ని చేస్తుంది. కాలక్రమేణా, అతడు జీవిత పందాన్నే విడిచి పెట్టేస్తాడు. హర్డిల్స్ ఎంత ఎత్తుగా ఉంటే అంత త్వరగా అతడు తన జీవితపు పరుగు పందెం నుండి నిష్క్రమిస్తాడు లేదా మరణిస్తాడు. అతడు అభివృద్ధి చెందిన దేశాల్లో జీవిస్తున్నట్లయితే, దాదాపు 75 ఏళ్ళ వయస్సులో జీవిత పందాన్నుంచి నిష్క్రమిస్తాడు. ఈ కాలవ్యవధే, సగటు మానవ జీవితకాలం అని పిలువబడుతుంది.a దీన్ని, పరుగుపందెంలో అనేకమంది రన్నర్లు పరుగెత్తగల్గే దూరంతో పోల్చవచ్చు. (పోల్చండి కీర్తన 90:10.) అయితే, కొంతమంది అంతకన్నా ఎక్కువకాలం పరుగెడుతారు, కానీ వాళ్ళలో కొందరు మాత్రమే ప్రపంచ వార్తల్లో పతాక స్థానాన్ని ఆక్రమించే ఒక అరుదైన ఫీటును చేరుకుంటారు—గరిష్ట మానవ జీవితాయుష్కాలం వరకు, అంటే 115 నుంచి 120 సంవత్సరాల వరకు ఉంటారు.
హర్డిల్స్‌ను గుర్తించడం
ఇప్పటి ప్రజలు, ఈ శతాబ్దపు ఆరంభంలో ఆ నాటి ప్రజలు జీవించగలిగిన దానికన్నా దాదాపు రెండురెట్ల ఎక్కువ కాలం జీవించగలుగుతున్నారు. ఎందుకని? ఎందుకంటే, ప్రాథమికంగా మానవుడు హర్డిల్స్‌ని కొంచెం క్రిందికి దించుకోగలిగాడు. అయితే, హర్డిల్స్ ఏవి? వాటిని కాస్త క్రిందికి దించుకోవచ్చా?
అలవాట్లు, పరిసరాలు, వైద్య సంరక్షణ అనేవి మానవుని సంభవనీయ జీవితకాలాన్ని బాధించే ప్రధానమైన హర్డిల్స్‌లో లేక కారకాల్లో కొన్ని అని ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క ప్రజా ఆరోగ్య నిపుణుడు ఒకరు వివరించారు.b కనుక, మీ అలవాట్లు ఎంత మంచిగా ఉంటాయో, మీ పరిసరాలు ఎంత ఆరోగ్యకరంగా ఉంటాయో, మీ వైద్య సంరక్షణ ఎంత మెరుగ్గా ఉంటుందో, హర్డిల్స్ కూడా అంత తక్కువ ఎత్తులో ఉంటాయి, మీ జీవితకాలం కూడా అంత ఎక్కువగా కొనసాగవచ్చు. ప్రజల పరిస్థితులు చాలా వేర్వేరుగా ఉన్నప్పటికీ, సిడ్నీలోని బ్యాంకు డైరెక్టర్ నుంచి సావొపౌలొలో రోడ్డుమీద అమ్ముకుంటూ తిరిగే వాళ్ళ వరకూ—ప్రతి ఒక్కరూ—తమ జీవితంలోని హర్డిల్స్‌ని కొంచెం క్రిందికి దించుకోవడానికి ఏదో ఒకటి చేయగలరు. ఎలా?
మీ జీవితపు పరుగు పందాన్ని బాధించే అలవాట్లు
“ఆరోగ్యకరమైన మంచి అలవాట్లున్న వ్యక్తులు దీర్ఘకాలంపాటు జీవించడమే కాక, అటువంటి వ్యక్తులలో అశక్తత తాత్కాలికంగా నిలిపివేయబడి, జీవితపు చరమాంకపు సంవత్సరాల్లోకి నెట్టివేయబడుతుంది” అని ద న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ నివేదించింది. నిజానికి, తినడం, త్రాగడం, నిద్రపోవడం, పొగత్రాగడం, వ్యాయామం వంటి అలవాట్లలో మార్పులు చేసుకోవడం ద్వారా మొదటి హర్డిల్‌ను క్రిందికి దించుకోవచ్చు. ఉదాహరణకు, వ్యాయామ అలవాట్లనే తీసుకోండి.
శారీరక-వ్యాయామ అలవాట్లు. మితమైన శారీరక వ్యాయామం ఎంతో ప్రయోజనకరమైనదిగా ఉండగలదు. (“ఎంత వ్యాయామం, ఎటువంటి వ్యాయామం?” అనే బాక్స్‌ను చూడండి.) పెద్దవయస్కులు, ‘వయో వృద్ధుల’తో సహా తాము కోల్పోయిన బలాన్నీ శక్తినీ తిరిగి పొందేందుకు, ఇంట్లోనూ ఇంటి చుట్టు ప్రక్కలా చేసే సరళమైన వ్యాయామాలు సహాయపడతాయని అధ్యయనాలు చూపుతున్నాయి. ఉదాహరణకు, 72 నుంచి 98 ఏళ్ళ లోపు వృద్ధుల గుంపొకటి, కేవలం పది వారాల పాటు బరువుల్ని ఎత్తే (వెయిట్ లిఫ్టింగ్) వ్యాయామాలను కొన్నింటిని చేసిన తర్వాత తాము వేగంగా నడవగలుగుతున్నట్లు, మెట్లను సునాయాసంగా ఎక్కగలుగుతున్నట్లు కనుగొన్నారు. ఇందులో ఆశ్చర్యమేమీ లేదు ! వ్యాయమంలో పాల్గొన్న వారి కండరాలు రెండింతలు కన్నా ఎక్కువగా బలపడ్డాయని ఆ వ్యాయామ కార్యక్రమానంతరం జరిపిన పరీక్షలు చూపిస్తున్నాయి. దాదాపు 70 ఏళ్ల దాక వయస్సుండి, ఎప్పుడూ కూర్చొని ఉండే స్త్రీల గుంపు, వారానికి రెండుసార్లు చొప్పున వ్యాయామం చేశారు. ఒక సంవత్సరంపాటు అలా చేసిన తర్వాత, వాళ్ళ కండరాలు పెరిగాయి, శక్తిని పుంజుకున్నారు, సమతుల్యతను పొందారు, ఎముకలు బలపడ్డాయి. “మేము ఆ వ్యాయామాన్ని వాళ్ళతో ప్రారంభించినప్పుడు, వాళ్ళ స్నాయు బంధనాలూ, అస్థి బంధనాలూ వేరైపోతాయేమోననీ, కండరాలు తెగిపోతాయేమోననీ భయపడ్డాము. కానీ, నిజానికి వాళ్ళు మరింత బలాన్ని పుంజుకున్నారు. మరింత ఆరోగ్యవంతులు అయ్యారు” అని ఆ అధ్యయనాలను నిర్వహించిన ఫిజియోలజిస్ట్ మిరియమ్ నెల్సన్ అన్నారు.
“వ్యాయామం, వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదిపరుస్తుంది, జీవితాయుష్షును పెంచుతుంది. మరణానికి ముందు అతి తరుచుగా జరిగే విషయమైన [ఇతరులపై] ఆధారపడవలసి వచ్చే కాలవ్యవధిని తగ్గిస్తుంది” అని వృద్ధాప్యం మీదా, వ్యాయామం మీదా జరిపిన అనేక శాస్త్రీయ అధ్యయనాల ఫలితాలను సంక్షిప్తపరిచిన ఒక టెక్ట్స్ పుస్తకం తెలియజేస్తోంది.
మానసిక వ్యాయామ అలవాట్లు. “వాడండి లేకపోతే నష్టపోతారు” అన్న సూక్తి కండరాలకు మాత్రమేగాక, మనస్సుకు కూడా వర్తిస్తున్నట్లు కన్పిస్తుంది. వృద్ధాప్యంతోపాటు కాస్తంత మతిమరుపు వస్తున్నప్పటికీ, వృద్ధాప్యపు ప్రభావాలతో తగిన విధంగా వ్యవహరించేలాగున వృద్ధుల మెదడు తనను తాను కావలసినట్లు మలుచుకునే స్వభావంతోనే ఉంటుందని యు.ఎస్. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆన్ ఏజింగ్ నిర్వహించిన అధ్యయనాలు చూపిస్తున్నాయి. కాబట్టి, నాడీశాస్త్ర ప్రొఫెసర్ అయిన డాక్టర్ ఆంటోనియో ఆర్. దామాసియో, “వృద్ధులు అర్థవంతమైన, ఆరోగ్యకరమైన మానసిక జీవితాలను కొనసాగించగలరు” అనే నిర్ధారణకు వచ్చారు. వృద్ధుల మెదడు పరిస్థితులకు అనుగుణ్యంగా మారడంలో కొనసాగడానికి ఏది దోహదపడుతుంది?
మెదడులో పదివేల కోట్ల మెదడు కణాలూ లేక నాడీకణాలూ, వాటి మధ్య లక్షలాది కోట్ల కనెక్షన్లూ ఉంటాయి. ఈ కనెక్షన్లు, టెలిఫోన్ లైన్లలా పనిచేస్తూ, నాడీకణాలు ఒకదానితో మరొకటి “మాట్లాడు”కోగల్గేలా చేస్తాయి. అలా నాడీకణాలు ఇతరత్రా వాటితోపాటూ జ్ఞాపకశక్తిని కూడా సృష్టిస్తాయి. మెదడు వృద్ధాప్యానికి ఎదుగుతుండగా, నాడీకణాలు చనిపోతాయి. (“మెదడు కణాలను గురించిన ఒక క్రొత్త వీక్షణం” అనే బాక్సును చూడండి.) అయినప్పటికీ, వృద్ధాప్యానికి ఎదిగిన మెదడు, తను కోల్పోయిన నాడీకణాల స్థానాన్ని భర్తీచేసుకోగలదు. ఒక నాడీకణం చనిపోయినప్పుడల్లా దాని ప్రక్కనున్న నాడీకణాలు ఇతర నాడీకణాలతో క్రొత్త కనెక్షన్లను ఏర్పరుచుకొని, చనిపోయిన నాడీకణం నిర్వర్తించిన పనిని నిర్వహిస్తూ ప్రతిస్పందిస్తాయి. ఆ విధంగా, నిజానికి మెదడు తనకు ఇవ్వబడిన పని సంబంధిత బాధ్యతను తనలోని ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి బదిలీ చేస్తుంది. కాబట్టి, మెదడుతో యువత చేయగల్గుతున్న పనులనే అనేకమంది వృద్ధులు కూడా చేస్తారు, కాకపోతే ఆ పనులను చేయడానికి వాళ్లు మెదడులోని వేర్వేరు భాగాలను ఉపయోగిస్తుండవచ్చు. కొన్ని విషయాల్లో, వృద్ధాప్యంలో ఉన్న ఒక వ్యక్తి మెదడు వృద్ధ టెన్నిస్ ఆటగాడిలా ప్రవర్తిస్తుంది. వృద్ధ టెన్నిస్ ఆటగాడు, తన వేగం తగ్గిపోవడం వల్ల కలిగే నష్టాన్ని పూరించుకునేందుకు, తనకు ఉండి, యువ టెన్నిస్ ఆటగాళ్లలో లేని నైపుణ్యాలను ఆశ్రయిస్తాడు. ఆయన, జూనియర్ ఆటగాళ్ళు ఉపయోగించే టెక్నిక్‌లకు భిన్నమైన టెక్నిక్‌లను ఉపయోగిస్తున్నప్పటికీ కూడా స్కోరును పెంచుకుంటాడు. వృద్ధాప్యంలో ఉన్న మెదడు కూడా కొంతమేరకు అలాగే ప్రవర్తిస్తుంది.
వృద్ధులు తమ లక్ష్యసాధనకు ఏమి చేయగలరు? 70 నుండి 80 ఏళ్ళ మధ్య వయస్సున్న 1,000 కన్నా ఎక్కువ మంది వృద్ధులను అధ్యయనం చేసిన తర్వాత, వృద్ధులు తమ మేధో సంబంధ నైపుణ్యాలను నిలుపుకోగలిగేలా నిర్ణయించే కారకాల్లో మానసిక వ్యాయామం ఒకటని వార్ధక్య పరిశోధకుడైన డాక్టర్ మెర్లిన్ ఆల్బర్ట్ కనుగొన్నారు. (“మనస్సును మలచుకోగలిగేలా ఉంచుకోండి” అనే బాక్సును చూడండి.) మానసిక వ్యాయామం మెదడులోని ‘కనెక్షన్లను’ సజీవంగా ఉంచుతుంది. మరో వైపున, “ప్రజలు ఉద్యోగ విరమణ పొంది, విషయాలను తేలిగ్గా తీసుకోవడానికి నిశ్చయించుకున్నప్పుడు, ప్రపంచంలో జరుగుతున్న దాన్ని తామిక పట్టించుకోనక్కర్లేదని చెబుతున్నప్పుడు” మానసికంగా కృశించడం ప్రారంభమౌతుందని నిపుణులు చెబుతున్నారు.—ఇన్‌సైడ్ ద బ్రెయిన్.
కాబట్టి శుభవార్త ఏమిటంటే, “మన అదుపులో ఉన్న కారకాలు లేదా మనం మెరుగుపరచుకోగల కారకాలు, వృద్ధాప్యాన్ని విజయవంతంగా గడపగలిగేలా మన సామర్థ్యాన్ని పెంచుతాయి” అని వార్ధక్య విజ్ఞాన శాస్త్రవేత్త అయిన డాక్టర్ జాక్ రో అన్నారు. అంతేగాక, మంచి అలవాట్లను అలవర్చుకోవడాన్ని ఇప్పటికైనా ఆరంభించవచ్చు, సమయం మించిపోలేదు. “మీ జీవితంలో ఎక్కువ భాగం అనారోగ్యకరమైన అలవాట్లతో గడిపి, ఆ తర్వాతి సంవత్సరాల్లో ఆ అలవాట్లను మార్చుకొన్నప్పటికీ, ఆరోగ్యకరమైన జీవన శైలి మూలంగా కలిగే కనీసం కొన్ని ప్రతిఫలాలనైనా మీరు అనుభవిస్తారు” అని అంటున్నారు ఒక పరిశోధకుడు.
పరిసరాలను బట్టి కూడా వ్యత్యాసం ఉంటుంది
నేడు లండన్ నగరంలో పుట్టిన ఒక అమ్మాయిని మధ్య యుగాలనాటి లండన్ నగరానికి పంపిస్తే, ఆమె యొక్క సంభవనీయ జీవిత కాలం నేటి సంభవనీయ జీవిత కాలం కంటే సగం తక్కువ ఉంటుంది. ఆ వ్యత్యాసానికి కారణం ఆ అమ్మాయి భౌతిక పరిస్థితిలో ఆకస్మిక మార్పు సంభవించడం కాదు గానీ, పరిసరాలు, వైద్య సంరక్షణ అనే ఎత్తైన హర్డిల్‌లో హఠాత్తుగా వచ్చిన మార్పే. మొదట పరిసరాలనే తీసుకుందాం.
భౌతిక పరిసరాలు. గతంలో, మానవుని భౌతిక పరిసరాలు—ఉదాహరణకు, అతని ఇల్లు—ఆరోగ్యానికి చాలా హానికరంగా ఉండేది. అయితే ఇటీవలి దశాబ్దాలలో, భౌతిక పరిసరాల మూలంగా కలిగే అపాయాలు తగ్గించి వేయబడ్డాయి. చక్కని పరిసర పారిశుద్ధ్యమూ, సురక్షిత మంచినీళ్ళూ, ఇంట్లో ఉండే హానికరమైన క్రిమికీటకాదుల తగ్గుదలా మానవుని పరిసరాలను మెరుగుపరిచాయి, అతని ఆరోగ్యాన్ని పెంచాయి, అతని ఆయుష్కాలాన్ని పొడిగించాయి. ఫలితంగా, ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో మానవుడు ఎక్కువ కాలం జీవించగలుగుతున్నాడు.c అయితే, ఈ హర్డిల్‌ను కాస్త క్రిందికి దించుకోవడంలో, ఇంట్లో ప్లంబింగ్ [నీటి పంపులు, సింక్‌లూ, డ్రెయినేజ్ సౌకర్యాలు] చేయించడం కన్నా ఇంకా ఎక్కువే ఇమిడి ఉంది. ఇందుకు ఆరోగ్యకరమైన సామాజిక, మత సంబంధమైన పరిసరాలను కాపాడుకోవడం కూడా అవసరం.
సామాజిక పరిసరాలు. మీరు ఎవరితో అయితే కలిసి జీవిస్తారో, పనిచేస్తారో, తింటారో, ఆరాధిస్తారో, ఆడతారో వాళ్ళతోనే మీ సామాజిక పరిసరాలు రూపొందించబడుతాయి. సురక్షితమైన మంచినీరు మీకు అందుబాటులో ఉన్నప్పుడు మీ భౌతిక పరిసరాలు మెరుగుపడుతాయి; అదేవిధంగా, మీకు విలువైన సహవాసులు ఉన్నప్పుడు—ఇది చాలా ప్రాముఖ్యమైన కారకాల్లో ఒకటి—మీ సామాజిక పరిసరాలు మెరుగుపడవచ్చు. ఇతరులతో మీ ఆనందాలనూ, దుఃఖాలనూ, కలలనూ, ఆశాభంగాల్నీ పంచుకోవడం, పరిసరాలు అనే హర్డిల్‌ని కొంచెం క్రిందికి దించుకొని, మీరు ఎక్కువ కాలం జీవించే దిశగా సాగిపోయేందుకు సహాయం చేస్తుంది.
అయితే, దీనికి భిన్నంగా జరగుతుందన్నది కూడా నిజమే. సహవాస లేమి, ఒంటరితనానికీ సమాజం నుండి వేరై ఉండడానికీ కారణమవ్వవచ్చు. మీ చుట్టూ ఉన్న ప్రజల నుంచి మీకు ఏ విధమైన శ్రద్ధ లభించకుండా మీరు జీవిస్తున్నట్లయితే, అది మీరు కృశించిపోవడానికి కారణమవుతుంది. వృద్ధుల ఆశ్రమంలో నివసిస్తున్న ఒక వృద్ధురాలు, “నాకు 82 ఏళ్లు, నేను ఈ ఆశ్రమంలో 16 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. వాళ్ళు మమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు, కానీ ఒంటరితనాన్ని భరించడం కొన్నిసార్లు ఎంతో కష్టంగా ఉంటుంది” అని తనకు పరిచయం ఉన్న ఒకరికి వ్రాసింది. విచారకరంగా, ఈ వృద్ధ స్త్రీ పరిస్థితి, అనేకమంది వృద్ధుల పరిస్థితికి—ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లోని వృద్ధుల పరిస్థితికి ఉదాహరణగా ఉంది. వాళ్లు జీవిస్తున్న సామాజిక పరిసరాలు, వృద్ధులను భరిస్తాయి కానీ, వాళ్ళను ఏ మాత్రం మెచ్చుకోవు. ఫలితంగా, “ఒంటరితనమనేది, అభివృద్ధి చెందిన దేశాల్లో వృద్ధుల క్షేమానికి ఎడతెగని బెదిరింపుగా ఉన్న ప్రధాన సమస్యల్లో ఒకటి”గా ఉందని ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆన్ ఏజింగ్‌కు చెందిన జేమ్స్ కాయెక అన్నారు.
నిజమే, తప్పనిసరి ఉద్యోగవిరమణ, అశక్తులవ్వడం, దీర్ఘకాల స్నేహితులను కోల్పోవడం, లేదా వివాహజత మరణం వంటి—మిమ్మల్ని ఒంటరితనానికి గురయ్యేలా చేసే పరిస్థితులను మీరు తొలగించలేకపోయినప్పటికీ, ఈ హర్డిల్‌ను మీరు వ్యవహరించగల్గేంత స్థాయికి తగ్గించేందుకు అవసరమైన కొన్ని చర్యలను చేపట్టగలరు. మొదటి చర్యగా, ఒంటరితనమన్న అనుభూతికి కారణం వృద్ధాప్యం కాదని గుర్తుంచుకోండి; కొంతమంది యౌవనులు కూడా ఒంటరితనంతో బాధపడతారు. సమస్యలకు కారణం వృద్ధులవ్వడం కాదు, సామాజికంగా ఎవ్వరితోనూ కలవకుండా వేరుగా ఉండడమే. వేరుగా ఉండే మానసిక ప్రవృత్తికి వ్యతిరేకంగా పోరాడేందుకు మీరేమి చేయగలరు?
“మీ సహచర్యం ఇతరులకు ఆహ్లాదకరంగా ఉండేలా చూసుకోండి. ఫిర్యాదులు చేసే వ్యక్తితో సహవసించడాన్ని ఎవరూ ఆస్వాదించలేరు. మీరు ఉత్సాహంగా ఉండడానికి ప్రయత్నించవలసిన అవసరం ఉంది. దానికి గట్టిగా కృషి చేయడం అవసరం అన్నది నిజమే. మీరు చేసే ప్రయత్నానికి ఫలితం ఉంటుంది. “దయ చూపిస్తే దయ చూపించబడుతుంది” అని విధవరాలైన ఒక వృద్ధస్త్రీ సలహా ఇస్తోంది. “నేను కలుసుకునే ప్రజలు వాళ్ళు వృద్ధులైనా లేదా యౌవనులైనా సరే వారితో సంభాషించడానికి కావాల్సిన సామాన్యమైన కొన్ని అంశాలు నా దగ్గరుండేందుకు గాను, సమాచారాన్ని అందజేసే పత్రికలను చదవడం ద్వారా, వార్తా విశేషాలను చూడడం ద్వారా ప్రస్తుతం జరుగుతున్న విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను” అని కూడా ఆమె అంటోంది.
మరికొన్ని ఇతర సలహాలు: ఇతరులకు ఏది ఇష్టమో దాంట్లో ఆసక్తి కలిగివుండడానికి నేర్చుకోండి. దానికి సంబంధించిన ప్రశ్నలు అడగండి. సాధ్యమైనంత మేరకు, ఉదారంగా ఉండండి. మీకు ఇవ్వడానికి వస్తుపరంగా ఏమీ లేకపోతే, సహాయపడడానికి మిమ్మల్ని మీరే ఇచ్చుకోండి. ఇవ్వడంలో సంతోషం ఉంది. ఉత్తరాలను వ్రాయండి. ఏదైన ఒక వ్యాపకాన్ని పెట్టుకోండి. తమ ఇంటికి రమ్మనిగానీ లేక తమతోపాటు బయటకు రమ్మనిగానీ పిలిచిన ఆహ్వానాల్ని అంగీకరించండి. మీ ఇంటిని ఆహ్లాదకరంగానూ, అతిథులను ఆహ్వానించేదిగానూ ఉంచండి. అవసరంలో ఉన్నవారి దగ్గరకి వెళ్ళండి, వాళ్ళకు సహాయం చేయండి.
మత సంబంధ పరిసరాలు. “జీవితార్థాన్నీ, ప్రాధాన్యతనూ” కనుగొనేందుకూ, “సంతోషం,” “తనతో ఉపయోగముందనే స్పృహ,” “జీవితంలో గొప్ప సంతృప్తి,” “సమాజాన్ని గురించిన, సంక్షేమాన్ని గురించిన స్పృహ” అంటే ఏమిటో అనుభవంలో తెలుసుకునేందుకూ మత సంబంధ కార్యకలాపాలు వృద్ధులకు సహాయపడతాయని అనేక రుజువులు సూచిస్తున్నాయి. ఎందుకని? లేటర్ లైఫ్—ద రియాలిటీస్ ఆఫ్ ఏజింగ్ అనే పుస్తకం ఇలా వివరిస్తోంది: “మత సంబంధ విశ్వాసం, ప్రజలకు జీవితాన్ని గురించిన అవగాహననూ, అలాగే దృక్పథాలను గురించిన, విలువలను గురించిన, నమ్మకాలను గురించిన అవగాహననూ ఇస్తుంది. అవి, వాళ్ళు తమ చుట్టూ ఉన్న లోకాన్ని గురించి వ్యాఖ్యానించేందుకూ, అర్థం చేసుకునేందుకూ సహాయం చేస్తాయి.” అంతేగాక, మత సంబంధ కార్యకలాపాలు, వృద్ధులు ఇతరులతో సంబంధాలను కలిగి ఉండేలా చేస్తాయి. ఆ విధంగా, “సామాజికంగా వేరయ్యే సాధ్యతను, ఒంటరిగా అయ్యే సాధ్యతను తగ్గిస్తాయి.”
యెహోవాసాక్షుల సంఘంలో సభ్యులుగా ఉన్న 80 ఏళ్ళ విధవరాళ్ళైన ల్వీజ్, ఎవ్లన్‌లకిద్దరికీ దశాబ్దాలుగా తెలిసివున్న విషయాలను ఈ అధ్యయనాలు కేవలం రూఢిపరిచాయంతే. “నేను మా రాజ్యమందిరంలోd అందరితో, యౌవనులతోనూ, వృద్ధులతోనూ మాట్లాడడాన్ని ఆస్వాదిస్తాను. కూటాలు విద్యను బోధిస్తాయి. కూటాల తర్వాత కలుసుకున్నప్పుడు మా మధ్య ఆనందంతో కూడిన నవ్వులు వెల్లివిరుస్తాయి. అది ఆహ్లాదకరమైన సమయం” అని ల్వీజ్ అంటున్నారు. ఎవ్లన్ కూడా తన మత సంబంధ కార్యక్రమాల నుంచి ప్రయోజనాన్ని పొందుతోంది. “నా ఇరుగు పొరుగు ప్రాంతాల్లో ఉన్న ప్రజలతో బైబిలు గురించి మాట్లాడడానికి వెళ్ళడం, నేను ఏకాకిగా కాకుండా ఉంచుతుంది. అంతకన్నా ఎక్కువగా, అది నన్ను సంతోషపరుస్తుంది. జీవితం యొక్క నిజమైన అర్థాన్ని తెలుసుకొనేందుకు ఇతరులకు సహాయం చేయడమనేది సంతృప్తికరమైన పని” అని ఆమె అన్నారు.
స్పష్టంగా, ల్వీజ్, ఎవ్లన్‌ల జీవితానికి ఒక ఉద్దేశం ఉంది. దాని వల్ల, క్షేమంగా ఉన్నామని వాళ్ళకు కలిగే అనుభూతులు, పరిసరాలు అనే రెండవ హర్డిల్‌ని కొంచెం క్రిందికి దించుకుని, ముందుకు సాగిపోయేందుకు వాళ్ళకు సహాయం చేస్తాయి.—పోల్చండి కీర్తన 92:13, 14.
ఎంతో మంది కోలుకోవడానికి సహాయపడుతున్న, తక్కువ ఖర్చయ్యే వైద్య సంరక్షణ—లభ్యం
ఈ శతాబ్దంలో వైద్యశాస్త్రం సాధించిన పురోభివృద్ధులు, వైద్య సంరక్షణ లేమి అనే మూడవ హర్డిల్‌ని ఆకస్మికంగా కొంచెం క్రిందికి దించినా, ప్రపంచవ్యాప్తంగా దించలేదు. అనేక పేద దేశాల్లో, “నిజానికి సంభవనీయ జీవితకాలం,1975-1995 సంవత్సరాల మధ్య కాలంలో తగ్గిపోయింది” అని ద వాల్డ్ హెల్త్ రిపోర్ట్ 1998 పేర్కొంటోంది. “తక్కువ అభివృద్ధి చెందిన దేశాల్లోని ప్రజల్లో ప్రతి నలుగురిలో ముగ్గురు, అర్ధ శతాబ్దం క్రిందటి భూగోళవ్యాప్త సంభవనీయ జీవిత కాలానికి సమానమైన 50 ఏళ్లకన్నా ముందే చనిపోతున్నారు” అని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరక్టర్ జనరల్ వ్యాఖ్యానించారు.
అయినప్పటికీ, బీద దేశాల్లో ఇప్పుడు చాలామంది వృద్ధులూ, యౌవనులూ లభ్యమౌతున్న, తమ స్థోమతకు తగిన వైద్య సంరక్షణా సదుపాయాన్ని ఉపయోగించుకోవడం ద్వారా ఈ హర్డిల్ ప్రభావాన్ని తగ్గించుకోగల్గుతున్నారు. ఉదాహరణకు, క్షయవ్యాధి (టీబీ) చికిత్సలో వచ్చిన క్రొత్త విధానాన్నే తీసుకోండి.
ప్రపంచవ్యాప్తంగా ఎయిడ్స్, మలేరియా, అలాగే ఉష్ణమండల ప్రాంతపు వ్యాధులూ కలిసి బలితీసుకునే ప్రజల మొత్తం సంఖ్యకన్నా ఎక్కువ మందిని—రోజుకు 8,000 మందిని—టీబీ బలి తీసుకుంటోంది. ప్రతి 100 మంది టీబీ వ్యాధిగ్రస్తుల్లో 95 మంది, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో నివసిస్తున్నారు. ఇప్పుడు, దాదాపు రెండు కోట్లమంది ప్రజలు తీవ్రమౌతున్న టీబీతో బాధ పడుతున్నారు, రాబోయే పది సంవత్సరాల్లో దాదాపు మూడు కోట్లమంది—బొలీవియాలోనూ, కంబోడియాలోనూ, మలావీలోనూ ఉన్న జనాభాలను కలిపితే ఎంతమందో అంతమంది—దీనివల్ల మరణించవచ్చు.
ఆసుపత్రిలో ఉండవలసిన అవసరంగానీ లేదా అత్యున్నత సాంకేతిక వైద్య సదుపాయాల అవసరంగానీ లేకుండా ఆరు నెలల్లో టీబీని తగ్గించే ఒక పథకాన్ని తాను రూపొందించినట్లు ప్రకటించడానికి 1997లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇష్టపడడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. “ధనిక దేశాల్లోనే కాక, ప్రపంచంలోని అతి పేద దేశాల్లో కూడా టీబీ వ్యాధిని నిర్మూలించేందుకు తగిన ఉపకరణాలూ, పథకాలూ తన దగ్గర ఉన్నాయని మొదటిసారిగా ప్రపంచం నిరూపించుకుంది” అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రచురణలో ఒకటైన టీబీ ట్రీట్‌మెంట్ అబ్సర్వర్ చెబుతోంది. ఈ పథకాన్ని డాట్స్e అని అంటారు. “ఈ దశాబ్దపు ప్రజా ఆరోగ్యపు పురోభివృద్ధుల్లో అన్నింటి కన్నా పెద్ద పురోభివృద్ధి” అని కొందరు దీన్ని వర్ణించడం జరిగింది.
అయితే, ఈ పథకానికి అయ్యే ఖర్చు, సాధారణంగా టీబీ చికిత్సకు అయ్యే ఖర్చు కంటే చాలా తక్కువ, ప్రాముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో దీని ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి. “ఎంతో ఎక్కువ మంది టీబీ రోగులు కోలుకోవడానికి డాట్స్ నిర్విరామంగా సహాయపడుతున్నట్లుగా, టీబీని అదుపులో పెట్టే మరే ఇతర పథకం కూడా సహాయపడలేదు. కడు బీద దేశాల్లో కూడా 95 శాతం వరకు టీబీ రోగులు కోలుకోవడానికి డాట్స్ సహాయపడుతుంది,” అని ప్రపంచ ఆరోగ్య సంస్థవారి గ్లోబల్ టీబీ ప్రోగ్రామ్ డైరెక్టర్ అయిన డాక్టర్ అరాటా కోచీ అన్నారు. 1997 ముగింపుకు వచ్చే సరికి, డాట్స్ పథకం 89 దేశాల్లో అవలంబించబడింది. ఈనాడు ఆ సంఖ్య 96కు పెరిగింది. తక్కువ అభివృద్ధి చెందిన దేశాల్లోని కోట్లాది మంది పేద ప్రజలను ఈ పథకం చేరుతుందనీ, ఆ విధంగా జీవిత పందెంలో మూడవ హర్డిల్‌ను కొంచెం క్రిందికి తగ్గించేందుకు అది వారికి సహాయం చేస్తుందనీ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆశిస్తుంది.
మానవుడు, తన అలవాట్లను మార్చుకోవడం ద్వారా, తన పరిసరాలను మెరుగుపరచుకోవడం ద్వారా, వైద్య సంరక్షణను అధికం చేసుకోవడం ద్వారా నిజంగానే తన గటు జీవితకాలాన్నీ, సంభవనీయ జీవిత కాలాన్నీ పొడిగించుకోగలడు. ప్రశ్న ఏమిటంటే, మానవుడు ఒకనాటికి గరిష్ఠ మానవ జీవితకాలాన్ని—బహుశా ఫినిష్ లైన్ లేకుండా అనంత కాలానికి పొడిగించుకోవడం సాధ్యమౌతుందా?
[అధస్సూచీలు]
a “సంభవనీయ జీవితకాలం,” “సగటు జీవితకాలం” అనే పదబంధాలు తరచుగా మార్చి మార్చి ఉపయోగించబడుతున్నప్పటికీ, వాటి మధ్య తేడా ఉంది. “సగటు జీవితకాలం,” ఒక జనాభాకు చెందిన ప్రజలు వాస్తవంగా జీవించే సరాసరి సంవత్సరాల సంఖ్యను సూచిస్తుండగా, “సంభవనీయ జీవితకాలం,” ఒక వ్యక్తి ఇంత కాలం జీవిస్తాడు అని ఎదురుచూడగల సంవత్సరాల సంఖ్యను సూచిస్తుంది. ఆ విధంగా, సగటు జీవితకాలం ఆధారంగా సంభవనీయ జీవితకాలాన్ని అంచనా వేస్తారు.
b అదుపులోపెట్టగల ఈ కారకాలతోపాటు మానవుని మారని, వంశానుగత జన్యు నిర్మాణం అతని ఆరోగ్యంపైనా, ఆయుష్కాలంపైనా స్పష్టంగా ప్రభావం చూపగలదు. ఇది తర్వాతి శీర్షికలో చర్చించబడుతుంది.
c సరళమైన పద్ధతుల ద్వారా ఇంటి పరిసరాలను ఎలా అభివృద్ధి చేసుకోవచ్చన్న విషయంపై మరింత సమాచారం కోసం తేజరిల్లు! సెప్టెంబరు 22, 1988 (ఆంగ్లం) సంచికలోని, “పరిశుభ్రత అనే సవాలును ఎదుర్కోవడం” అనే శీర్షికనూ, ఏప్రిల్ 8, 1995 సంచికలోని “మీ ఆరోగ్యాన్ని ఏది నిర్ణయిస్తుంది—మీరేమి చేయగలరు” అనే శీర్షికనూ చూడండి.
d యెహోవాసాక్షులు వారం వారం కూటాలను జరుపుకొనే స్థలాన్ని రాజ్యమందిరం అంటారు. ఈ కూటాలకు అందరూ ఆహ్వానితులే, చందాలు సేకరించబడవు.
e డాట్స్ అన్నది డైరెక్ట్‌లీ అబ్సర్వ్‌డ్ ట్రీట్‌మెంట్ షార్ట్-కోర్స్ అనే మాటల మొదటి అక్షరాల నుండి ఏర్పడిన పదం. డాట్స్ పథకాన్ని గురించిన అదనపు సమాచారం కోసం జూన్ 8, 1999 తేజరిల్లు!లోని “క్షయ—దానిపై సాగించే పోరాటంలో ఒక క్రొత్త ఆయుధం,” అనే శీర్షికను చూడండి.
[6వ పేజీలోని బాక్సు/చిత్రం]
ఎంత వ్యాయామం, ఎటువంటి వ్యాయామం?
“ప్రతిరోజు ముప్పై నిమిషాలు మితంగా వ్యాయామం చేయాలనుకోవడం మంచి లక్ష్యం,” అని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆన్ ఏజింగ్ (NIA) చెబుతోంది. అయితే వ్యాయామం ఒకేసారి 30 నిమిషాలు పాటు చేయనక్కరలేదు. ఒకేసారి 30 నిమిషాలు చేస్తే ఏ ఫలితం వస్తుందో అదే ఫలితం, పది నిమిషాల చొప్పున మూడు సార్లు చేసినా వస్తుందని చెప్పబడుతుంది. మీరు ఏ విధమైన వ్యాయామం చేయగలరు? “లిఫ్టులో వెళ్ళే బదులు మెట్లెక్కి వెళ్ళడం, డ్రైవింగ్ చేసే బదులు నడవడం వంటి చిన్న చిన్న పనులు చేస్తే, రోజుకి 30 నిమిషాల వ్యాయామం అవ్వగలదు. ఇంటి పరిసరాల్లో నేల మీద పడి ఉన్న ఆకులను ఒక చోటకు ఊడ్వడం, పిల్లలతో చురుకుగా ఆడడం, తోటపని, అంతెందుకు ఇంటి పనులు చేయడం ద్వారా కూడా, చేయవలసినంత వ్యాయామం అవుతుంది” అని NIA వారి డోన్ట్ టేక్ ఇట్ ఈజీ: ఎక్సర్సైజ్! అనే చిన్న పుస్తకం సిఫారసు చేసింది. అవును, ఒక వ్యాయామ కార్యక్రమం ప్రారంభించే ముందు డాక్టర్‌ను సంప్రదించడం తెలివైన పని.
[చిత్రం]
మితమైన శారీరక వ్యాయామం, వృద్ధులు బలాన్నీ శక్తినీ తిరిగి పొందేందుకు సహాయం చేయగలదు
[7వ పేజీలోని బాక్సు/చిత్రం]
మనస్సును మలుచుకోగలిగేలా ఉంచుకోండి
వేలాది మంది వృద్ధ ప్రజలను కలుపుకుని చేసిన వైజ్ఞానిక అధ్యయనాలు, వృద్ధులు తమ మనస్సును మలుచుకోగలిగేలా ఉంచుకునేందుకు సహాయం చేసే అనేక కారకాలను కనుగొన్నాయి. ఈ కారకాల్లో “చదవడంలో, ప్రయాణించడంలో, సాంస్కృతిక కార్యక్రమాల్లో, విద్యాభ్యాసం చేయడంలో, క్లబ్బుల్లో, వృత్తి సంబంధ సమాజాల్లో క్రియాశీలంగా నిమగ్నం కావడం” ఇమిడి ఉంది. “సాధ్యమైనన్ని రకాల పనులను చేయండి.” “మీ పనిని చేస్తూ ఉండండి. ఆపివేయకండి.” “టీవీని కట్టేయండి.” “ఏదైన ఒక కోర్సులో చేరండి.” ఇటువంటి క్రియాశీలతలు మనిషిని మానసికంగా లేవనెత్తడమే కాక, మెదడులో క్రొత్త నాడీకణ కేంద్రాలను సృష్టిస్తాయి కూడా.
[చిత్రం]
మనస్సును మలుచుకోగలిగేదిగా ఉంచుకొనేందుకు మానసిక వ్యాయామం సహాయం చేస్తుంది
[8వ పేజీలోని బాక్సు/చిత్రం]
వృద్ధులకు ఆరోగ్య చిట్కాలు
క్రింద ఇవ్వబడిన వివేకవంతమైన సలహాలను అనుసరించడం ద్వారా “ఆరోగ్యంతో ఉండగల అవకాశాలను, ఎక్కువకాలం జీవించగల అవకాశాలను మెరుగుపరచుకోవచ్చు” అని ఆరోగ్యం, మానవ సేవల యు.ఎస్. విభాగంలోని ఒక శాఖయైన ద నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆన్ ఏజింగ్ చెబుతుంది.
● పండ్లు, కూరగాయలు గల సంతులిత ఆహారం తీసుకోండి.
● మీరు మద్యపానాలను తీసుకుంటున్నట్లయితే, మితంగా తీసుకోండి.
● పొగత్రాగకండి. ఇప్పటికీ మించిపోలేదు, మానేయండి.
● క్రమంగా వ్యాయామం చేయండి. వ్యాయామ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు డాక్టర్‌ను సంప్రదించండి.
● కుటుంబంతోనూ, స్నేహితులతోనూ సంబంధాలను కొనసాగించండి.
● పనుల్లోనూ, ఆటపాటల్లోనూ, సమాజంలోనూ చురుగ్గా ఉండండి.
● జీవితం పట్ల అనుకూల దృక్పథంతో ఉండండి.
● మీకు సంతోషం కలిగించే వాటిని చేయండి.
● ఆరోగ్య పరీక్షలను క్రమంగా చేయించుకోండి.
[9వ పేజీలోని బాక్సు]
మెదడు కణాలను గురించిన ఒక క్రొత్త వీక్షణం
“జీవితంలోని ప్రతిరోజూ, మెదడులోని ప్రతిచోట మెదడు కణాలను కోల్పోతూ ఉంటామని అనుకొనేవాళ్ళం. నిజమే, ఆకస్మికంగా కాకపోయినా, ఆరోగ్యకరంగా వయస్సు మళ్ళుతున్నప్పుడు, మెదడులో ఎంపిక చేయబడిన కొన్ని ప్రాంతాల్లో కణాలు నష్టమౌతుంటాయి” అని మానసిక, నాడీకణ శాస్త్రవేత్త అయిన డాక్టర్ మార్లీన్ ఆల్బర్ట్ అంటున్నారు. అంతేకాకుండా, మానవుడు తన మెదడులో క్రొత్త కణాలను పెంచుకోలేడని ఎంతో కాలంగా ఉన్న నమ్మకం సరైనది కాదు, అది “పూర్తిగా వాస్తవ విరుద్ధం” అని సైంటిఫిక్ అమెరికన్ నవంబరు 1998 సంచిక నివేదిస్తోంది. వృద్ధులు కూడా “తమ మెదడులో వందలాది నాడులను అదనంగా సృష్టించుకోగలరు” అనడానికి రుజువులను సేకరించామని నాడీ మండల శాస్త్రవేత్తలు అంటున్నారు.
[11వ పేజీలోని బాక్సు]
వృద్ధులు మరింత వివేకంగలవారా?
“వృద్ధుల దగ్గర వివేకం లేదా, దీర్ఘాయువు వలన అవగాహన ఉండదా?” అని బైబిలు అడుగుతోంది. (యోబు 12:12, NW) దీనికి సమాధానం ఏమిటి? “అంతర్‌దృష్టి, వివేచన, గ్రహణ శక్తి, పరస్పర విరుద్ధమైన విలువలను తూచి చూసి, సమస్యను పరిష్కరించే మంచి పద్ధతులను ఆవిష్కరించగల శక్తి” వంటి గుణాలను కొలిచేందుకు పరిశోధకులు వృద్ధులను అధ్యయనం చేశారు. యు.ఎస్. న్యూస్ & వాల్డ్ రిపోర్ట్ అభిప్రాయం ప్రకారం, “వృద్ధులు, మరింత సాలోచనతో కూడిన చక్కని సలహాలను ఇస్తూ అన్ని విధాల్లోను తమ వివేకాన్ని కనబరుస్తూ, యౌవనస్థులను మించిపోతున్నారు” అని ఆ అధ్యయనం చూపించింది. “తరచుగా యౌవనస్థుల కంటే వృద్ధులే నిర్ణయాలు తీసుకోవడానికి ఎక్కువ సమయం తీసుకుంటున్నప్పటికీ, సాధారణంగా వాళ్ళే మేలైన నిర్ణయాన్ని తీసుకుంటారు” అని కూడా అధ్యయనాలు చూపిస్తున్నాయి. కనుక, బైబిలు పుస్తకమైన యోబు గ్రంథం సూచిస్తున్నట్లు, అనుభవం గురువు.
[6వ పేజీలోని చిత్రం]
మానవ జీవితం హర్డిల్స్ ఉన్న పరుగు పందెం లాంటిది
[9వ పేజీలోని చిత్రం]
“మీ సహచర్యం ఇతరులకు ఆహ్లాదకరంగా ఉండేలా చూసుకోండి” అని ఒక విధవరాలు సలహా ఇస్తోంది
[10వ పేజీలోని చిత్రాలు]
“జీవితపు పరమార్థాన్ని తెలుసుకొనేందుకు ఇతరులకు సహాయం చేయడమనేది సంతృప్తికరమైన పని.”—ఎవ్లన్
[10వ పేజీలోని చిత్రాలు]
“నేను మా రాజ్యమందిరంలో అందరితో, యౌవనులతోను, వృద్ధులతోను మాట్లాడడాన్ని ఆస్వాదిస్తాను.”—ల్వీజ్