చాలా సంవత్సరాల తర్వాత ఫలించిన విత్తనాలు
ఫిబ్రవరి 8, 1999 తేజరిల్లు!లోని “ఏడుగురు కొడుకుల్ని పెంచడంలోని సవాళ్లు, ఆశీర్వాదాలు” అన్న శీర్షిక ఫలితంగా ఈ క్రింది ఉత్తరం అందింది.
ప్రియమైన సహోదరీ, సహోదరుడైన డిక్మాన్లకు
నేను ఇప్పుడే మీ కథను చదివాను. అది చదివిన తర్వాత నాకు ఈ ఉత్తరం వ్రాయవలసివచ్చింది. సంవత్సరాల క్రితం మిస్సిసిపిలో ఉన్నప్పుడు [1960-61] మీ కుటుంబం నాకు తెలుసు. వాస్తవానికి, నేను మీ అబ్బాయిలతో పాటు కలిసి స్కూలుకి వెళ్ళేదాన్ని, అప్పుడప్పుడు మీ ఇంటికి వచ్చి, మీ అబ్బాయిలతో ఆడుకునేదాన్ని. కాని, నా లేత మనస్సులో చాలా లోతుగా ముద్రించబడిన విషయాలు ఇవి కావు. మీ అబ్బాయిలు తమ క్రైస్తవ మనస్సాక్షిని బట్టి స్కూల్లో జెండా వందనం చేయలేదన్న వాస్తవాన్ని బట్టి అంత చిన్న వయస్సులో కూడా నేనెంతో ముగ్ధురాలినయ్యాను. నేను గ్రాన్డ్వ్యూ బాప్టిస్ట్ చర్చి సభ్యురాలినైనప్పటికీ, తన నిలకడను గూర్చి మీ అబ్బాయిల్లో ఒకరు నాకు వివరించినప్పడు అది సరియైనదని నాకు తెలుసు.
పారడైస్ లోస్ట్ టు పారడైస్ రీగెయిన్డ్a అనే పుస్తకాన్ని వారిలో ఒకరు ఇవ్వడమో లేక నేనే దాన్ని దొంగిలించడమో జరిగింది. మొత్తానికి ఆ పుస్తకాన్ని ఎలా పొందానో నాకు గుర్తులేదు, కాని నేను ఆ పుస్తకాన్నంతా చదివేశాను. అప్పట్లో, నాకది మంచి కథల పుస్తకంగా అనిపించింది అంతే. సత్యపు విత్తనాలు నాటబడ్డాయని గానీ, సంవత్సరాలుగా అవి మనస్సులో నిద్రాణంగా ఉండిపోతాయని గానీ అప్పట్లో నాకు తెలియలేదు.
1964లో మా కుటుంబం ఉత్తరానికి తరలిపోయింది. నేను చర్చికి వెళ్ళటం మానేశాను. మతంలో ఉన్న వేషధారణ నా భ్రమను తొలగించింది. కనుక సంస్థీకృత మతంతో ఎలాంటి సంబంధం పెట్టుకోకూడదని చాలా సంవత్సరాల వరకూ అనుకున్నాను.
సంవత్సరాల తర్వాత, జీవిత ఉద్దేశాన్ని గురించి నేను గంభీరంగా ఆలోచించటం మొదలుపెట్టినప్పుడు, సృష్టికర్తతో నాకొక సంబంధం ఉండాలని కోరుకుంటున్నానని గుర్తించాను. ఆ సంబంధం మతసంబంధ వేషధారణ లేనిదై ఉండాలని కోరుకున్నాను. సంవత్సరాల క్రితం నాలో విత్తబడిన సత్యపు విత్తనాలు మొలకెత్తడం మొదలెట్టాయి, అప్పటికీ నాకా విషయం తెలియదు.
నాకు పరలోకానికి వెళ్ళాలని లేదన్న వాస్తవాన్ని గురించిన బాధతో నా మనస్సు విలవిల్లాడిపోయేది; ఇక్కడే ఈ భూమిపైనే జీవించాలని కోరుకునేదాన్ని. ఈ గ్రహమే ఒక అందమైన అద్భుతమైన సృష్టి గనుక, దేవుడు దీన్ని ఎందుకు నాశనం చేయాలి? అని నాకనిపించేది. యేసును దేవునిగా నేను తలంచేదాన్ని కాదు. ఒకవేళ ఆయనే దేవుడైతే, ఆయన బల్యర్పణ అబద్ధపు బల్యర్పణ అయ్యుండేది. నేను బాప్టిస్ట్ చర్చిలో నేర్చుకున్న వాటితో నా ఈ ఆలోచనలూ అనుభూతులూ, నమ్మకాలూ—మీరు ఏమంటే అవి—రాజీపడలేకపోయాయి. గనుక, నేను ప్రార్థన చేయటం మొదలుపెట్టాను, నిజంగా ప్రార్థించాను, యెహోవా వెంటనే చర్యగైకొన్నాడు. అలా ప్రార్థించిన కొన్ని రోజులకే సాక్షులు మా గుమ్మం ముందుకు వచ్చారు, వెంటనే ఒక బైబిలు పఠనం ప్రారంభమైంది. మీ కుటుంబంతో పరిచయం ఏర్పడినప్పటి నుంచి పఠనాన్ని నేను ప్రారంభించేంత వరకూ నాకసలు యెహోవాసాక్షులతో సంబంధం లేకపోయినప్పటికీ, మీ అబ్బాయిల పట్లా, సరియైనదాని కోసం నిలకడగా ఉండడంలో వాళ్ళ ధైర్యం పట్లా నాకున్న గౌరవం ఇప్పటికీ పోలేదు. ఒకసారి నేను పఠించడాన్ని ప్రారంభించి, జ్ఞానాన్ని ఆర్జించడం మొదలుపెట్టాక, ప్రతీదీ నాకర్థవంతంగా అనిపించింది. నా జీవితాన్ని పరిశీలించుకొనేందుకు నాకు ఒకటిన్నర సంవత్సరాలు పట్టింది. చివరకు నేను 1975లో బాప్తిస్మం తీసుకున్నాను.
మనకు కూడా తెలియకుండానే మన ప్రవర్తన ఎలా ఒక సాక్ష్యాన్ని ఇవ్వగలదన్న సమాచారాన్ని గురించి పరిశీలిస్తున్నప్పుడెల్లా, నేను మీ కుటుంబాన్ని గురించి తలుస్తుంటాను. రాజ్య విత్తనాలు ఎక్కడ లేక ఎప్పుడు వేరుపారతాయో మనకు అన్నిసార్లు తెలియదు గనుక అనేక రాజ్య విత్తనాలను చల్లే ప్రాముఖ్యతను మనం పరిశీలిస్తున్నప్పుడు, ఇది ఎంత సత్యం అన్నది నా వ్యక్తిగత అనుభవం ద్వారా నాకు తెలుసు.
మీరు అప్పట్లో యెహోవా ప్రజల్లో ఉన్నందుకూ మీరు విశ్వాసాల విషయమై నమ్మకంగా ఉన్నందుకూ మీకు కృతజ్ఞతలను చెప్పాలనుకుంటున్నాను. మీరు మీకు తెలియకుండానే ఒకరు సత్యాన్ని కనుగొనడానికి సహాయం చేశారు. మీ ప్రవర్తన, నమ్మకాలు అలాగే మీ పిల్లల ప్రవర్తనా, నమ్మకాల్లోనూ సత్యాన్ని ప్రకాశించనివ్వండి. మీరు ఎక్కడ ఉన్నారో, ఏమి చేస్తున్నారో తెలుసుకోలేనేమోనని, మీకు కృతజ్ఞతలు తెల్పుకోగలనోలేదో అని అనుకున్నాను. మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
మిక్కుటమైన క్రైస్తవ ప్రేమతో,
ఎల్. ఓ.
[అధస్సూచీలు]
a వాచ్‌టవర్ బైబిల్ ఆండ్ ట్రాక్ట్ సొసైటీ వారు 1958లో ప్రచురించారు; ఇప్పుడు ముద్రించబడటం లేదు.