కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g99 7/8 పేజీలు 14-20
  • ప్రాణాంతకమైన తుపాను నుండి రక్షించబడటం!

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రాణాంతకమైన తుపాను నుండి రక్షించబడటం!
  • తేజరిల్లు!—1999
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • మిచ్‌ హోండురాస్‌ను దెబ్బతీయటం
  • మిచ్‌ కోపోగ్రతను ఎల్‌ సాల్వేడర్‌ చవిచూడటం
  • మిచ్‌ నికరాగ్వా వైపుకు సాగడం
  • గ్వాటిమాలలో తీవ్రత
  • మిచ్‌—అది వచ్చిన తర్వాతి పరిస్థితులు
  • సహాయక చర్యలు చేపట్టడం పవిత్రసేవలో ఒక భాగం
    దేవుని రాజ్యం పరిపాలిస్తోంది!
  • ఈనాడు యెహోవా చేసే రక్షణకార్యాలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • ఆండ్రూ తుఫాను నాశనం చేయలేనివి
    తేజరిల్లు!—1993
తేజరిల్లు!—1999
g99 7/8 పేజీలు 14-20

ప్రాణాంతకమైన తుపాను నుండి రక్షించబడటం!

మిచ్‌ తుపాను తీసుకువచ్చిన విధ్వంస కాండ అన్న వార్త గత సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా వార్తాపత్రికల్లో ప్రధాన శీర్షికగా వచ్చింది. అయితే, ప్రాణాంతకమైన ఈ తుపాను యొక్క బాధితులకు ఉపశమనాన్ని తీసుకురావడానికి యెహోవాసాక్షులు చేసిన సాహసోపేతమైన ప్రయత్నాలకు ఎక్కువ అవధానం ఇవ్వబడలేదు. దుర్భరమైన పరిస్థితుల క్రింద కూడా నిజక్రైస్తవత్వం, సహోదరత్వం ఎలా విజయవంతం కాగలవో ఈ క్రింది నివేదిక చూపుతుంది.

కరీబియన్‌కు నైరృతి నున్న సముద్రజలాల నుండి 1998 అక్టోబర్‌ 22న ఒక ప్రాణాంతకమైన తుపాను బయల్దేరింది. తీవ్రమైన సముద్రపు గాలులు లేచాయి. 24 గంటల్లో అవి ప్రచండమైన తుపానుగా మారాయి. ఎంతోకాలంపాటు భయంతో, బాధతో గుర్తుంచుకొనే పేరు దానికి ఇవ్వబడింది, అదే మిచ్‌. బలాన్ని పుంజుకొని మిచ్‌ తూర్పు వైపుకు కదిలింది. అక్టోబర్‌ 26 కల్లా అది 5వ కేటగిరీకి చెందిన తుపానుగా మారింది, దీని గాలులు గంటకు 290 కిలోమీటర్ల వేగంతోనూ, పెనుగాలులు గంటకు 320 కిలోమీటర్ల వేగంతోనూ వీచాయి.

మొదటిగా, మిచ్‌ జమైకా, కేమన్‌ దీవులపై దాడి చేసేందుకు సంసిద్ధమైనట్లు అనిపించింది. కానీ ఈ ప్రాణాంతకి పశ్చిమంగా తిరిగి, మధ్య అమెరికా సముద్రతీర ప్రాంతమైన బెలీజ్‌ వైపుకు తిన్నగా మళ్ళింది. అయితే, దాడి చేయడానికి బదులు మిచ్‌ బెదిరిస్తూ హోండురాస్‌ ఉత్తర సముద్ర తీర ప్రాంతం వైపుకు తిరిగింది. తర్వాత ఈ ప్రాణాంతకి హఠాత్తుగా కదిలింది. అక్టోబర్‌ 30న మిచ్‌ హోండురాస్‌ను చుట్టుముట్టి మరణ, నాశనాలతో దాన్ని ఊడ్చిపెట్టేసింది.

మిచ్‌ హోండురాస్‌ను దెబ్బతీయటం

మిచ్‌ తన రాకను కుంభవర్షం ద్వారా తెలియజేసింది. “అక్టోబర్‌ 31న, మధ్యరాత్రి దాదాపు ఒంటిగంటకు మేము ఒక పెద్ద ఉరుములాంటి శబ్దాన్ని విన్నాము. ఒక చిన్న వాగు ప్రచండ ప్రవాహంగా మారింది ! లోపల చిక్కుకుపోయి కేకలు వేస్తున్న నివాసులతోపాటు రెండు ఇళ్ళను తుడిచిపెట్టేసింది,” అని టెగూసిగల్ఫాలో నివసిస్తున్న పూర్తికాల సువార్తికుడైన బీక్టర్‌ అబలార్‌ గుర్తు చేసుకుంటున్నాడు. నగరంలోని మరొక భాగంలో, మట్టి దిబ్బ వచ్చి పడటం మూలంగా, యెహోవాసాక్షులతో బైబిలును పఠిస్తున్న 8మందితో సహా కనీసం 32మంది ప్రజలు మరణించారు. అయితే, బాప్తిస్మం తీసుకున్న సాక్షులు ఎవరూ మరణించలేదు.

హోండురాస్‌ అధికారులు ఈ సంక్షోభస్థితికి వెంటనే ప్రతిస్పందించి, శరణార్థ శిబిరాలను ఏర్పాటు చేశారు. డజను కంటే ఎక్కువ దేశాల నుండి వచ్చిన అంతర్జాతీయ సహాయక బృందం కూడా రంగంలోకి దిగింది. “కాబట్టి మనకు సమయము దొరకినకొలది అందరియెడలను, విశేషముగా విశ్వాసగృహమునకు చేరినవారియెడలను మేలు చేయుదము” అన్న బైబిలు వచనాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ యెహోవాసాక్షులు కూడా అదేవిధంగా సహాయ కార్యక్రమాల్లో ముందుకెళ్లారు. (గలతీయులు 6:10) అత్యవసర సహాయక కమిటీలు ఏర్పాటు చేయబడ్డాయి. సముద్ర తీర ప్రాంతపు పట్టణాల్లో పరిస్థితి ఎంత దయనీయంగా ఉందన్న విషయాన్ని గుర్తించి, సాక్షులు ఒక రక్షణ శిబిరాన్ని నెలకొల్పారు.

ఎడ్గార్డో అకోస్టా అనే సాక్షి ఇలా గుర్తు చేసుకుంటున్నారు: అక్టోబరు 31, శనివారం నాడు మేము ఒక చిన్న పడవలో వరద వచ్చిన ప్రాంతాలకు వెళ్ళాము. మేము ఇద్దరు సహోదరులను రక్షించగలిగినప్పటికీ, మేము సహోదరులనందర్నీ రక్షించాలంటే మాకు ఒక పెద్ద పడవ అవసరమని గ్రహించాము.a కాబట్టి, మేము ఒక పెద్ద పడవను తీసుకుని ఆదివారం ఉదయాన్నే రెండవసారి ప్రయాణాన్ని మొదలు పెట్టాము. చివరికి, కొంతమంది పొరుగువారితో సహా సంఘంలోని ప్రతీ ఒక్కరిని, అంటే మొత్తం 189 మందిని ప్రమాద స్థలం నుండి కాపాడగలిగాము.”

లా హంటా అనే ప్రాంతానికి దగ్గరలో జరిగిన రక్షణ కార్యకలాపాల్లో క్వాన్‌ ఆల్బారాడో సహాయం చేశాడు. ఆయనిలా గుర్తు చేసుకుంటున్నాడు: “‘సహాయం చేయండి ! రక్షించండి !’ అని ప్రజలు కేకలు వేయడాన్ని మేము విన్నాము. ఇది నేనెన్నడూ చవిచూడని అత్యంత భయంకరమైన అనుభవం. సహోదరులు పూర్తిగా చిక్కుకుపోయారు. అనేకమంది ఇంటి పైకప్పులు మీది కెక్కారు.” తప్పించుకుని జీవించిన మారీయా బోనీయా ఇలా వివరిస్తుంది: “మా చుట్టూ ఉన్న నీళ్ళు సముద్రంలా ఉన్నాయి. మేమందరం ఏడుస్తున్నాము.” అయితే, రక్షణ కార్యక్రమాలు సఫలీకృతమయ్యాయి. తప్పించుకుని జీవించిన అంబెర్టో ఆల్బారాడో ఇలా చెబుతున్నాడు: “సహోదరులు మమ్మల్ని కేవలం రక్షించడమే కాదుగానీ మాకు ఆశ్రయాన్ని, ఆహారాన్ని, వస్త్రాలను కూడా ఇచ్చారు.” అంబెర్టో ఇంకా ఇలా గుర్తు చేసుకుంటున్నాడు: “రక్షణ కార్యక్రమాలను పరిశీలిస్తున్న ఒక వ్యక్తి, తమను రక్షించేందుకు తమ చర్చీల నుండి ఎవ్వరూ రాలేదు కానీ, కేవలం యెహోవాసాక్షులు మాత్రమే వచ్చారని అన్నాడు. ఇప్పుడు ఆయన యెహోవాసాక్షులదే నిజమైన మతమని ఒప్పుకుంటున్నాడు!”

లా లీమా అనే పట్టణంలో యెహోవాసాక్షుల ఒక గుంపు ఒక ఇంటిలో చిక్కుకుపోయింది. తమ చుట్టూ నీళ్ళు పెరిగిపోతుండటంతో వాళ్ళు ఇంటి పైకప్పు విప్పి, ఇంటి దూలాల మీదికి ఎక్కారు. గాబీ అనే ఒక సాక్షి ఇలా వివరిస్తుంది: “మా దగ్గర కొద్ది రోజులకు సరిపోయే ఆహార పదార్థాలు ఉన్నాయి. అవి అయిపోయినప్పుడు కొబ్బరి కాయలు తీసుకురావడం కోసం ఒక సహోదరుడు తన ప్రాణాలకు తెగించి నీళ్ళలోకి దిగాడు. మేము మా బాధ నుండి తేరుకోవడానికి రాజ్య గీతాలను పాడాము.” పరిచర్య సేవకుడైన జాన్‌ ఇలా గుర్తు చేసుకుంటున్నాడు: “మేము తప్పించుకుంటామని అస్సలు ఊహించలేదు. కాబట్టి, మేము కావలికోట అనే బైబిలు పత్రికను చదవాలని నిర్ణయించుకున్నాము. మేమందరం కలిసి పఠించడం బహుశా ఇదే చివరిసారి కాబోలు అనుకుని మేమందరం ఏడ్చేశాము. ఆ పఠనం మేము సహించడానికి మమ్మల్ని బలపర్చింది.” రక్షణ బృందాల ద్వారా కాపాడబడేంత వరకు అంటే ఎనిమిది రోజుల పాటు వాళ్ళు సహించారు.

అనేకమంది వరద బాధితులు సురక్షితంగా, సజీవంగా ఉన్నప్పటికీ, చేదు అనుభవాలను రుచి చూడవలసి వచ్చింది. లిలియన్‌ అనే ఒక సాక్షి ఇలా ఒప్పుకుంటుంది: “బట్టలు, సామగ్రి, కుటుంబపు ఫోటోల వంటి వ్యక్తిగత సంపదను కోల్పోవడం నిజంగా ఎంతో బాధాకరం. నా ఇల్లు బురద, చెత్త, చివరకు పాములతో నిండివుండటం చూసినప్పుడు ఆ పరిస్థితి నిజంగా భయంకరం !” అయితే, క్రైస్తవ సహోదరత్వం వెల కట్టలేనిదని మరొకసారి నిరూపించబడింది. లిలియన్‌ ఇలా వివరిస్తుంది: “సహాయం చేయడానికి సహోదరులు వచ్చారు, ‘వాళ్ళు చేసిన దానికి మనం ఎలా ఋణం తీర్చుకోగలం’ అని సాక్షి కాని నా భర్త అడిగారు. అప్పుడు, ‘నువ్వు నాకు కృతజ్ఞతలు చెప్పనక్కరలేదు, ఎందుకంటే నేను నీ సహోదరిని’ అని ఒక సహోదరి నాతో అన్నది.”

మిచ్‌ కోపోగ్రతను ఎల్‌ సాల్వేడర్‌ చవిచూడటం

మిచ్‌ తుపాను పశ్చిమంగా ఎల్‌ సాల్వేడర్‌ వైపుకు సాగుతూ, కొంత బలాన్ని కోల్పోయింది. కానీ, అది ఇంకా చంపే శక్తిని కలిగి ఉంది. ఆ సమయంలో ఎల్‌ సాల్వేడర్‌లోని యెహోవాసాక్షులు “దైవిక జీవిత మార్గము” అనే జిల్లా సమావేశానికి హాజరయ్యేందుకు పథకం వేసుకోవడంలో బిజీగా ఉన్నారు. దాదాపు 40,000 మంది హాజరు అవుతారని అంచనా వేయబడింది. మిచ్‌ రావడంతో సహోదరులందరూ సమావేశానికి హాజరయ్యే అవకాశాలు తగ్గిపోయాయి. నదులు పొంగి పొర్లి, పంట పొలాలను, రోడ్లను, ఇళ్ళను ముంచేశాయి. అటవీ నిర్మూలనతో బలహీనం కావడం వల్ల, కొండలు పెద్ద పెద్ద మట్టి దిబ్బలుగా మారిపోయాయి.

చీలాంగరా పట్టణంలోని యెహోవాసాక్షుల సంఘంలో, నెల్సన్‌ ఫ్లోర్స్‌ సంఘ పైవిచారణకర్తగా పని చేస్తున్నారు. అక్టోబరు 31, శనివారం ఉదయం ఆయన లేచి చూసేటప్పటికి నదికి అవతల ఉండే చీలాంగరా ఇప్పుడక్కడ లేదు! ఐదు వందల ఇళ్ళు కొట్టుకుపోయాయి! తన ఆధ్యాత్మిక సహోదరుల ప్రాణాల గురించిన భయంతోనూ, తన సొంత భద్రతను గురించిన కొద్దిపాటి ఆలోచనతోనూ నెల్సన్‌ పొంగి పొర్లుతున్న నదిలోకి దూకాడు. “నేను అవతలి వైపుకు చేరుకుని, లేచి నిలబడి, పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. ఇంటింటికీ ప్రకటిస్తూ నేను ప్రతిరోజు ఆ ప్రాంతం గుండానే వెళ్ళేవాడ్ని, కానీ నేను ఆ ప్రాంతాన్ని గుర్తుపట్టగల ఒక్క ఆనవాలు కూడా లేదు!” అని నెల్సన్‌ గుర్తు చేసుకుంటున్నాడు.

ఆ రాత్రి చీలాంగరాలో దాదాపు 150 మంది ప్రజలు చనిపోయారు. అందులో యెహోవాసాక్షులతో బైబిలును పఠిస్తున్న అనేకమంది కూడా ఉన్నారు. అయితే, బాప్తిస్మం తీసుకున్న సాక్షులు ఎవ్వరూ మరణించలేదు.

రక్షణ కార్యక్రమాలు వెంటనే ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాలను వ్యవస్థీకరించడంలో సహాయాన్ని అందించిన ఆరీస్టిడిస్‌ ఎస్ట్రాడా ఇలా గుర్తు చేసుకుంటున్నాడు: “మేము చీలాంగరాకు వెళ్ళడానికి అనుమతించబడలేదు. నీళ్ళు ఇంకా ఎక్కువవుతున్నాయి! అక్కడ సహాయాన్ని అర్థిస్తూ, తమ స్వంత ప్రాణాలను కాపాడుకోవడానికి పారిపోతున్న రక్షణ బృందంచే విడిచిపెట్టబడిన ప్రజలను నేనెన్నడూ మరువలేను, కానీ రక్షణార్థ కార్యకర్తల సహాయం వారికి లభించనందువల్ల వాళ్ళు తమ ప్రాణాలను కోల్పోయారు.” అయితే, కొంత కాలానికి సహోదరులందరూ భద్రంగా తప్పించబడ్డారు. రాజ్యమందిరాలు శరణార్థ కేంద్రాలుగా ఉపయోగపడ్డాయి. అదనంగా, సాక్షులు గాయపడిన, నిరాశ్రయులైన సాక్షుల పేర్ల కోసం లిస్టులను పరిశీలించేందుకు సాక్షులను ఆసుపత్రుల వద్ద, పాఠశాలల వద్ద, ఇతర ప్రాంతాలవద్ద నియమించారు. స్థానిక సంఘాలు వెంటనే అవసరమైన వస్తువులను సరఫరా చేశాయి.

అయితే, సేకరణా కేంద్రాలకు వస్తువులను సరఫరా చేయడం అన్నివేళలా అంత సులభమేమీ కాలేదు. కొరింటో అనే పట్టణం నుండి సహోదరులు తమ పంట పొలాల్లో పండిన వాటిని తీసుకుని బయల్దేరారు, అయితే మార్గమధ్యలో ఒక మట్టి దిబ్బ అడ్డుపడింది. మరి పరిష్కారం ఏమిటి? వాళ్ళు దాన్ని త్రవ్వి మార్గాన్ని ఏర్పర్చుకున్నారు! మొదట్లో, బయటివారు అనుమానంగా చూశారు! కానీ, కొంత సేపటికి వాళ్ళు ముందుకు వచ్చి, మార్గాన్ని ఏర్పర్చడంలో సహాయం చేయడానికి కదిలించబడ్డారు. కొరింటో నుండి బయలుదేరిన సహోదరులు తాము చేరవలసిన స్థానానికి బురదతో చేరుకున్నారు, కానీ తమ విరాళాన్ని అందజేయగలిగినందుకు సంతోషించారు.

వాచ్‌ టవర్‌ సొసైటీ యొక్క బ్రాంచి కార్యాలయం ఒక సేకరణా కేంద్రంగా పనిచేసింది. విరాళాలను అందజేయడంలో సహాయం చేసిన వారిలో ఒకరైన గిల్‌బెర్టో ఇలా గుర్తు చేసుకుంటున్నాడు: “ఇది నమ్మశక్యం కానిది ! అనేకానేక వాహనాలు బ్రాంచి కార్యాలయానికి రావడంతో, పార్కింగ్‌ స్థలాల్లోనూ, బ్రాంచి కార్యాలయం ఉన్న వీధిలోనూ ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు వాలంటీర్లను నియమించవలసి వచ్చింది.” దాదాపు 25 టన్నుల బట్టలు, 10 టన్నుల ఆహారం విరాళంగా ఇవ్వబడినట్లు అంచనా వేయబడింది. బట్టలను వేరుచేసి రవాణా చేయడానికి 15మంది వాలంటీర్లు ఒక వారం రోజుల పాటు పని చేయవలసి వచ్చింది.

మిచ్‌ నికరాగ్వా వైపుకు సాగడం

మిచ్‌ నికరాగ్వా సరిహద్దు ప్రాంతం మీద కూడా కుంభవర్షాన్ని కురిపించగలిగేంత దగ్గరకు వచ్చింది. వేల కొలది ఇళ్ళు నాశనమైపోయాయి, రోడ్లు కొట్టుకుపోయాయి. పోసల్టీగా పట్టణానికి దగ్గరలో ఒక మట్టి దిబ్బ మొత్తం గ్రామాలను, 2,000 కంటే ఎక్కువమంది ప్రజలను సజీవ సమాధి చేసింది.

నికరాగ్వాలోని సాక్షులు జరిగిన దుర్ఘటనను గురించి తెలుసుకొన్నప్పుడు, ఒక పెద్ద సహాయ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. తమ సహోదరులను కనుగొనేందుకు వాలంటీర్లు మరణాంతకమైన, ప్రమాదకరమైన స్థలానికి పంపబడ్డారు! ఒక్కో సహోదరుడు సామాగ్రితో ఉన్న ఒక్కొక్క బరువైన సంచిని మోస్తున్న సాక్షుల రెండు బృందాలు, ఒకటి లీయోన్‌ నుండి (పోసల్టీగాకు దక్షిణంగా ఉన్న ఒక పట్టణం), మరొకటి చీచీగాల్పా నుండి (పోసల్టీగాకు ఉత్తరంగా ఉన్న ఒక పట్టణం) పోసల్టీగాకు పంపబడ్డాయి. అక్కడకు వెళ్లే దారి దుర్గమంగా ఉందని రక్షణ కార్యకర్తలు హెచ్చరించారు, కానీ సహోదరులు వెళ్ళాలని దృఢంగా నిశ్చయించుకున్నారు.

నవంబరు 2, సోమవారం ఉదయాన, లీయోన్‌ నుండి వచ్చిన సహోదరులు ట్రక్కు నిండుగా సామాగ్రిని నింపుకుని, పాడైపోయిన బ్రిడ్జ్‌ వరకు వచ్చారు. ట్రక్కులోని సామాగ్రిని క్రిందకు దించిన తర్వాత, సహోదరులు రెండు గుంపులుగా సైకిళ్ల మీద బయలుదేరారు: ఒక గుంపు పోసల్టీగాకు, మరొకటి వరదతో మునిగిపోయిన టెలీకా అని పిలువబడే పట్టణానికి వెళ్ళాయి. సహోదరులు ప్రార్థన చేసి ప్రయాణం ప్రారంభించారు. “ప్రార్థన అయిన తర్వాత, మేము గొప్ప శక్తిని పొందినట్లు భావించాము,” అని కాపాడటానికి బయల్దేరినవారిలో ఒకరు చెప్పారు. వాళ్లకు అది అవసరమే. వాళ్ళు పెద్ద పెద్ద గోతులను, అప్పుడప్పుడు మట్టిదిబ్బలను దాటుతూ, కొన్నిసార్లు సైకిళ్ళను తమ భుజాలపై మోస్తూ వెళ్ళారు. పడిపోయిన చెట్లు తరచుగా వారి మార్గానికి అడ్డుపడేవి. నీటిలో తేలుతున్న శవాల రోత పుట్టించే దృశ్యాన్ని కూడా వాళ్ళు భరించవలసి వచ్చింది.

ఆశ్చర్యకరంగా, లీయోన్‌, చీచీగాల్పాల నుండి సైకిళ్ళ మీద బయలు దేరిన వారు కూడా పోసల్టీగాకు సరిగ్గా అదే సమయానికి చేరుకున్నారు! రక్షణ బృందంలో ఒక సభ్యుడైన నెర్యో లోపెజ్‌ ఇలా గుర్తు చేసుకుంటున్నాడు: “నా సైకిలు టైర్లు బాగా పాడైపోయాయి. అవి ఒకటి లేదా రెండు కిలోమీటర్ల వరకు మాత్రమే పనిచేస్తాయని నేను అనుకున్నాను.” కానీ, సైకిలు ఎలాగో ఇంకా బాగానే ఉంది. తిరిగి వచ్చేటప్పుడు మాత్రం రెండు టైర్లూ పేలిపోయాయి. ఏదేమైనప్పటికీ, సహాయక కార్యకర్తలుగా వచ్చినవారిలో సహోదరులే మొట్టమొదటి వాళ్ళు. స్థానిక క్రైస్తవ సహోదర, సహోదరీల ఒక గుంపును కలిసినప్పుడు వాళ్ళు ఎంతగానో సంతోషించారు! “తమ మద్దతును, సహాయాన్ని మాకందించినందుకు యెహోవాకు, మన సహోదరులకు నేనెంతో కృతజ్ఞురాలిని. మన సహోదరులు సహాయాన్ని అందించేందుకు అంత త్వరగా రాగలుగుతారని మేము అస్సలు ఊహించలేదు,” అని ఒక సహోదరి చెప్పింది.

బాధిత పట్టణాలకు జరిగిన అనేక సైకిలు ప్రయాణాల్లో ఇది మొదటిది, అనేక సందర్భాల్లో సహాయక కార్యకర్తలుగా వచ్చినవారిలో మొట్టమొదటివారు సహోదరులే. 16మంది సహోదరులు సైకిళ్ల మీద వచ్చిన అద్భుతమైన దృశ్యాన్ని లారేనాగా పట్టణం చూసింది ! వారి ప్రయత్నాలకు స్థానిక సహోదరులు కన్నీళ్లు పెట్టుకున్నారు. కొన్నిసార్లు సైక్లిస్ట్‌లు తమ వీపుపై 20 కిలోల కంటే ఎక్కువ బరువున్న పదార్థాలను మోయవలసి వచ్చింది. దాదాపు 100 కిలోగ్రాముల బరువున్న పదార్థాలను ఇద్దరు సహోదరులు ఎల్‌ గ్వాయాబో పట్టణానికి మోసుకు వెళ్ళారు! ఒకరు సైకిలు మీద సాధ్యమైనంత బరువును మోసుకువెళ్తూ, “సొమ్మసిల్లినవారికి బలమిచ్చువాడు [యెహోవాయే] శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే” అని చెప్తున్న యెషయా 40:29 నందున్న బైబిలు వచనాన్ని ధ్యానించడం ద్వారా ఉపశమనాన్ని పొందాడు.

టోనాలా అనే పట్టణంలోని సాక్షులు తమ దగ్గర ఉన్న ఆహారపదార్థాలు అయిపోయాయని, బాధ్యత గల సహోదరులకు తెలియజేసేందుకు ఒకరిని పంపించారు. ఆయన ఆ ప్రాంతానికి చేరుకునేసరికి, అప్పటికే ఆహారపదార్థాలు పంపబడ్డాయని తెలుసుకొని ఆశ్చర్యపోయాడు! ఆయన ఇంటికి తిరిగి వచ్చేటప్పటికి, ఆయన ఇంటిలో ఆయన కోసం భోజనం సిద్ధంగా ఉంది. చీనాండిగా పరిసరప్రాంతాల్లో ఉన్న వరద వచ్చిన ప్రాంతానికి ఆహార పదార్థాలను తీసుకువెళ్లడానికి సహాయం చేసిన మార్లన్‌ చావారీయా ఇలా గుర్తు చేసుకుంటున్నాడు: “ఒక పట్టణంలో 44 సాక్షుల కుటుంబాలు ఉన్నాయి. అయితే, మన సహోదరులు తమ ఆహారాన్ని పంచుకోవడం వల్ల 80 కుటుంబాలు ప్రయోజనం చెందాయి.”

ఈ సహాయక కార్యక్రమాలు ప్రభుత్వం దృష్టికి వెళ్ళాయి. వాంబ్లాన్‌ అనే పట్టణంలోని మేయరు సాక్షులకు ఇలా వ్రాశాడు: “మీరు మాకు కొంత సహాయం చేయడానికి వీలౌతుందా అన్నది కనుక్కోవడానికి వ్రాస్తున్నాము. . . . ఇక్కడ వాంబ్లాన్‌లోని మీ సహోదర, సహోదరీలకు మీరు సహాయం చేయడాన్ని మేము చూశాము, మాకు కూడా కొంత సహాయం చేయడం సాధ్యమేమో తెలుసుకోవాలని మేము కోరుతున్నాము.” యెహోవాసాక్షులు ఆహారాన్ని, మందులను, వస్త్రాలను పంపించటం ద్వారా ప్రతిస్పందించారు.

గ్వాటిమాలలో తీవ్రత

హోండురాస్‌, ఎల్‌ సాల్వేడర్‌ల తర్వాత, మిచ్‌ త్వరలోనే గ్వాటిమాలా మీదికి దండెత్తింది. గ్వాటిమాలా నగరపు దక్షిణ ప్రాంతంలో నివసిస్తున్న శారా అగస్టీన్‌ అనే ఒక సాక్షికి నీటి ఘోష వల్ల మెలకువ వచ్చింది. ఆమె నివసిస్తున్న కనుమ ప్రాంతం గర్జించే నదిగా మారిపోయింది. ఆమె బైబిలు సత్యాన్ని పంచుకోవడానికి తరచుగా తన పొరుగువారి ఇళ్ళకు వెళ్ళేది. ఇప్పుడు ఆమె తన పొరుగువారిని లేపేందుకు ఆందోళనతో ఇంటింటికి వెళ్ళింది ! తర్వాత ఒక మట్టిదిబ్బ కొండమీది నుండి జారి వచ్చి, ఆమె పొరుగువారి ఇళ్ళను కప్పేసింది. శారా రక్షించడానికి సహాయం చేస్తూ, పారతో త్రవ్వుతూ మట్టిలో కూరుకుపోయిన ఏడుగురు పిల్లలను కాపాడింది. మంత్రసాని వృత్తిలో ఉన్న శారా ఈ పిల్లల్లో ఒకరు ఈ లోకంలోకి రావడానికి సహాయం చేసింది. విచారకరంగా, మరణించిన వారిలో విల్మా అనే ఒక యౌవనస్థురాలు ఉంది. ఇటీవలనే శారా ఆమెకు బైబిలు సాహిత్యాన్ని అందజేసింది.

మిచ్‌ తుపాను తీవ్రత చాలా మేరకు తగ్గిపోయినప్పటికీ, విడువకుండా కురుస్తున్న వర్షాలు పంటపొలాలకు, బ్రిడ్జ్‌లకు, ఇళ్లకు చెప్పుకోదగినంత నష్టాన్ని కలుగజేశాయి, కాబట్టి, గ్వాటిమాలాలోని యెహోవాసాక్షుల స్థానిక బ్రాంచి కార్యాలయానికి పెద్ద మొత్తంలో పదార్థాలు పంపబడినప్పుడు, వాటిని హోండురాస్‌లోని సహోదరులకు సహాయం చేయడానికి ఉపయోగించడం మంచిదని నిర్ణయించబడింది. అనేక బ్రిడ్జ్‌లు కూలిపోయాయి, విమానాశ్రయం వరద నీటిలో మునిగిపోయింది కాబట్టి ఈ పదార్థాలను పడవ ద్వారా పంపించాలి. బ్రాంచి కార్యాలయంలో పనిచేస్తున్న ఫ్రెత్‌ బ్రూన్‌ ఇలా చెబుతున్నాడు: “మేము ఎనిమిది మీటర్ల పొడవున్న ఫైబర్‌గ్లాస్‌ పడవను అద్దెకు తీసుకుని, అందులో ఒక టన్ను మందులు, ఆహారపదార్థాలు తీసుకుని బయలుదేరాము. అల్లకల్లోలంగా ఉన్న సముద్రంలో భయం పుట్టించే ప్రయాణం తర్వాత, చివరికి మేము తడిసి ముద్దైపోయిన శరీరాలతో ఓమోయా నౌకాశ్రయాన్ని చేరాము.”

మిచ్‌—అది వచ్చిన తర్వాతి పరిస్థితులు

మిచ్‌ ఆగ్నేయ మెక్సికోను నాశనం చేయడానికి సంసిద్ధమైనట్లు కనిపించింది. అయితే, చివరి ప్రయత్నంగా మిచ్‌ ఈశాన్యంగా ప్రయాణించి, హఠాత్తుగా అమెరికాలోని దక్షిణ ఫ్లోరిడా మీద దాడి చేసింది. అయితే, మిచ్‌ త్వరలోనే తన శక్తిని కోల్పోయింది. అది అట్లాంటిక్‌ సముద్రంలోకి వెళ్ళిపోయి, త్వరితగతిన తగ్గుముఖం పట్టనారంభించింది. నవంబరు 5 కల్లా తీవ్ర-తుపాను హెచ్చరికలన్నీ ఆగిపోయాయి.

కొంతమంది నిపుణులు మిచ్‌ను “గత రెండు శతాబ్దాల్లో పశ్చిమార్థగోళాన్ని దెబ్బతీసిన అత్యంత ప్రాణాంతక తుపాను” అని పిలిచారు! మరణించిన వారి మొత్తం సంఖ్య 11,000 మంది కావచ్చు; వేలాదిమంది ఇప్పటికీ కనిపించడం లేదు. 30 లక్షల కంటే ఎక్కువ మంది నిరాశ్రయులయ్యారు లేదా కనీసం తీవ్రంగా దెబ్బతిన్నారు. హోండురాస్‌ ప్రెసిడెంట్‌ అయిన కార్లోస్‌ ఫ్లోరెస్‌ ఫాకూస్‌ ఇలా విలపించారు: “50 సంవత్సరాలుగా కొద్ది కొద్దిగా కట్టుకున్న దాన్ని మేము కోల్పోయాము.”

మిచ్‌ కారణంగా అనేకమంది యెహోవాసాక్షులు తమ ఇళ్ళను కోల్పోయారు. విచారకరంగా, అనేకమంది ఇళ్లున్న స్థలాలు ఇప్పుడిక ఉనికిలో లేకుండా పోయాయి! అయినప్పటికీ, తమ ఇళ్ళను బాగు చేసుకోవడానికి, తిరిగి కట్టుకోవడానికి అనేకులకు యెహోవాసాక్షులు తమ సహాయాన్ని అందించారు.

మిచ్‌ తుపాను వంటి విషాదంతో కూడిన విపత్తులు మనం “అపాయకరమైన కాలముల”లో జీవిస్తున్నామన్న దానికి భయంకరమైన జ్ఞాపికగా ఉన్నాయి. (2 తిమోతి 3:1-5) ఇటువంటి విపత్తుల నుండి నిజమైన రక్షణ కేవలం ఈ గ్రహం మీద నిర్వహణా ఏర్పాట్ల గురించి దేవుని ప్రభుత్వం శ్రద్ధ తీసుకున్నప్పుడే వస్తుంది. (మత్తయి 6:9, 10; ప్రకటన 21:3, 4) అయినప్పటికీ, మిచ్‌ కారణంగా తమ సహోదరుల్లో ఏ ఒక్కరూ వారి జీవితాలను కోల్పోనందుకు యెహోవాసాక్షులు ఎంతో కృతజ్ఞులు.b స్థానిక భద్రతా ఆదేశాలకు విధేయతను చూపడం, స్థానిక సంఘాలు చేసిన చక్కని వ్యవస్థీకరణ, అనేకమంది ప్రమాద స్థలాల నుండి భద్రతా స్థలాలకు తరలి వెళ్ళేలా సహాయం చేశాయి.

గడిచిన కొన్ని నెలల్లో, తుపాను ప్రభావానికి తీవ్రంగా గురైన దేశాల్లోని యెహోవాసాక్షులు తమ ఆధ్యాత్మిక దైనందిన కార్యకలాపాలను తిరిగి కొనసాగించేందుకు కష్టపడి పనిచేశారు. ఉదాహరణకు, ఎల్‌ సాల్వేడర్‌లో మిచ్‌ ఆగిపోయిన కొద్ది రోజులకే వరదబాధితులు జిల్లా సమావేశానికి హాజరయ్యేందుకు తగిన ఏర్పాట్లు జరిగాయి. రవాణా సౌకర్యాల నిమిత్తం బస్సులు అద్దెకు తీసుకోబడ్డాయి, వసతి ఏర్పాట్లు చేయబడ్డాయి. అనారోగ్యంతో ఉన్నవారు కూడా హాజరు కాగలిగేలా వారికి చికిత్స చేసే ఏర్పాట్లు కూడా చేయబడ్డాయి! హాజరవుతారని అంచనా వేసిన దాని కంటే ఎంతో ఎక్కువ సంఖ్యలో అంటే, 46,855 శిఖరాగ్ర సంఖ్యలో హాజరవ్వడంతో, సమావేశం విజయవంతమయ్యింది. “మేము గొప్ప బాధను అనుభవించాము, కానీ సహోదరులిచ్చిన ఆతిథ్యంతో ఎంతో ఉపశమనాన్ని పొంది, ఆ అసెంబ్లీ నుండి తిరిగివచ్చాము,” అని మిచ్‌ మూలంగా తన ఇంటిని, వ్యాపారాన్ని రెండింటినీ పోగొట్టుకున్న, సాల్వేడర్‌లోని హోసా రైవరా అనే సహోదరుడు చెబుతున్నాడు. నివేదిక ప్రకారం, ఈ దేశాల్లో కూటాలకు హాజరైన యెహోవాసాక్షుల సంఖ్య ఎంతో పెరిగింది, మన సహాయక కార్యకలాపాలను బయటివారు గమనించారన్న దానికి ప్రత్యక్ష ఫలితమే ఇది.

అయితే ఎక్కువ ప్రభావం సాక్షులపైనే పడివుండవచ్చు. హోండురాస్‌లోని వరద బాధితుడైన కార్లోస్‌ ఇలా చెప్పారు: “ఇటువంటి అనుభవాన్ని నేనెన్నడు పొందలేదు. నేను నా సహోదరుల ప్రేమనూ, ఆప్యాయతనూ వ్యక్తిగతంగా చవిచూశాను.” అవును, మిచ్‌ తుపాను కలిగించిన నష్టం ఒకనాటికి గతించిన విషయమౌతుంది. కానీ, తమ ప్రాణాలను ప్రమాదంలో పడవేసుకుని, తమ సహోదరులకు సహాయాన్ని అందించిన యెహోవాసాక్షుల ప్రేమ మాత్రం ఎన్నటికీ మరువబడదు.

[అధస్సూచీలు]

a యెహోవాసాక్షులు ఒకరినొకరు సాధారణంగా “సహోదరుడు, సహోదరి” అని పిలుచుకుంటారు.

b తుపాను ఫలితంగా అంటువ్యాధులు వృద్ధి చెందాయి. ఫలితంగా, నికరాగ్వాలోని ఒక సాక్షి మరణించారు.

[19వ పేజీలోని బాక్సు/చిత్రం]

పొరుగునున్న సాక్షులు సహాయాన్ని అందించడం

మిచ్‌ తుపాను బెలీజ్‌ మీదికి వస్తుందని సూచికలు తెలియజేసినప్పుడు దాని తాకిడిని తట్టుకోవడానికి బెలీజ్‌ సంసిద్ధమయ్యింది. సముద్ర తీర ప్రాంతాలలోనూ, పల్లపు ప్రాంతాలలోనూ ఉన్నవారందరూ స్థలాలను ఖాళీ చేయాలని ప్రభుత్వం ఆజ్ఞను జారీ చేసినప్పుడు యెహోవాసాక్షులు వారి రాజధాని అయిన బెల్మోపాన్‌కు, అంటే సముద్రతీరం నుండి దాదాపు 80 కిలోమీటర్లు లోపలికి, లేదా మెరక ప్రాంతంలో ఉన్న ఇతర పట్టణాలకు తరలి వెళ్ళారు.

సంతోషకరంగా, బెలీజ్‌ మిచ్‌ కోపాగ్నికి గురి కాలేదు. కానీ, హోండురాస్‌, నికరాగ్వా, గ్వాటిమాలాలోని తమ సహోదరుల దీనస్థితిని విని, బెలీజ్‌లోని సహోదరులు ఆహారాన్నీ, బట్టలనూ, శుభ్రపరిచిన నీటినీ, డబ్బునూ పంపించారు.

నిజానికి, పొరుగు దేశాలలోని సహోదరుల నుండి అటువంటి ప్రతిస్పందన వస్తుందన్నది తెలిసిందే. కోస్టారికాలోని సాక్షులు నాలుగు పెద్ద కంటెయినర్లలో ఆహారాన్నీ, బట్టలనూ, మందులనూ పంపించారు. పనామాలోని సహోదరులు విరాళంగా ఇవ్వబడిన వస్తువులను తీసుకోవడానికీ, వేరుపరచడానికీ, పేక్‌ చేయడానికీ నాలుగు కేంద్రాలను ఏర్పాటు చేశారు. కొద్ది రోజులలోనే 20,000 కిలోల కంటే ఎక్కువ వస్తువులు సేకరించబడ్డాయి. సాక్షి కాని ఒకరు ఇలా వ్యాఖ్యానించారు: “సహాయక కార్యక్రమాన్ని సంస్థీకరించే విషయంలో సైనిక సిబ్బందే మొదటి స్థానంలో ఉంటుందని నేను అనుకునేవాడ్ని. కానీ, ఆ స్థానాన్ని యెహోవాసాక్షులు ఆక్రమించుకుంటారని నేను ఇప్పుడు చూస్తున్నాను.” సాక్షులు బైబిలు సత్యాన్ని పంచుకోవడానికి ఇప్పుడు ఈ వ్యక్తిని క్రమంగా దర్శిస్తున్నారు.

రవాణా పని చేస్తున్న ఒక సహోదరుడు నికరాగ్వాకు సహాయార్థం వస్తువులను తీసుకువెళ్ళడానికి ఒక చిన్న బండిని, (సాక్షి కాని) ఒక డ్రైవర్‌ను ఏర్పాటు చేశారు. పనామా, కోస్టారికాలలోని అధికారులు ట్రక్కు తమ సరిహద్దుల గుండా వెళ్ళేటప్పుడు తమ కస్టమ్స్‌ నిబంధనలను ఉపేక్షించారు. ట్రక్కు యొక్క రెండు ట్యాంకులను నింపుకునేందుకు తగినంత ఇంధనాన్ని అంటే, పూర్తి ప్రయాణానికి సరిపోయేంత ఇంధనాన్ని ఒక గ్యాస్‌ స్టేషన్‌ విరాళంగా ఇచ్చింది! నికరాగ్వాలోని కస్టమ్స్‌ అధికారులు కూడా పార్శెల్స్‌ను తనిఖీ చేయకుండానే పంపించారు. “ఇవి యెహోవాసాక్షుల నుండి వస్తున్నవైతే వీటిని తనిఖీ చేయవలసిన అవసరం లేదు, మాకు వారితో ఎప్పుడూ, ఎటువంటి సమస్య ఉండదు” అని వారన్నారు.

అయితే, హోండురాస్‌కు భూమార్గాన రవాణా సాధ్యం కాలేదు. కాబట్టి, హోండురాస్‌ రాయబారి కార్యాలయంలో పని చేస్తున్న ఒక క్రైస్తవ సహోదరి ఆ కార్యాలయం సహాయంతో, సహాయక వస్తువులను విమానం ద్వారా ఉచితంగా పంపే ఏర్పాట్లు చేయగలిగింది! ఈ విధంగా దాదాపు 10,000 కిలోల వస్తువులు పంపబడ్డాయి.

ఆసక్తికరంగా, సాక్షుల సహాయక కార్యక్రమాన్ని బట్టి కొందరు సాక్షులు కాని వ్యక్తులు ఎంతో కదిలించబడ్డారు. కొన్ని కంపెనీలు పెద్ద పెద్ద చెక్క పెట్టెలనూ, బాండెయిడ్‌లనూ, ప్లాస్టిక్‌ డబ్బాలనూ ఇచ్చాయి. ఇతరులు ధనసహాయాన్నీ, డిస్కౌంట్‌లనూ ఇచ్చారు. దాదాపు 20మంది స్వచ్ఛంద సాక్షులు హోండురాస్‌కు పంపవలసిన వస్తువులను దించడంలో చేసిన సహాయాన్ని చూసి పనామాలోని విమానాశ్రయ ఉద్యోగులు ఎంతగానో కదిలించబడ్డారు. ఆ మర్నాడు విమానాశ్రయ సిబ్బందిలోని కొందరు తామంతా కలిసి సేకరించిన విరాళాన్ని ఇచ్చారు.

[20వ పేజీలోని బాక్సు]

మెక్సికోలో కూడా అదేవిధమైన సహాయ కార్యక్రమాలు

మిచ్‌ తుపాను వల్ల మెక్సికో కొంత నష్టానికి గురైంది. కానీ, ఈ ప్రాణాంతకి మధ్య అమెరికాను దెబ్బతీయడానికి కొన్ని వారాల ముందు, చియాపస్‌ అనే రాష్ట్రంలో తీవ్రమైన వరదలు వచ్చాయి. దాదాపు 350 గ్రామాలు దీనికి గురయ్యాయి, కొన్ని పట్టణాలైతే పూర్తిగా కనుమరుగయ్యాయి.

సహజంగానే, ఈ వరద ఆ దేశంలోని యెహోవాసాక్షులకు అనేక కష్టాలను సృష్టించింది. అయితే, స్థానిక సంఘ పెద్దలు తీసుకున్న తక్షణ చర్యలు, తుపాను ప్రభావాన్ని తగ్గించడానికి ఎంతో సహాయం చేశాయి. ఉదాహరణకు, ఒక చిన్న పట్టణంలోని పెద్దలు, సంఘంలోని ప్రతి ఒక్కరిని దర్శించి, వర్షాలు కొనసాగినట్లయితే రాజ్యమందిరంలోకి రమ్మని హెచ్చరించారు. ఆ గ్రామంలోకెల్లా పటిష్ఠమైన కట్టడం రాజ్యమందిరమేనని భావించబడేది. తెల్లవారుతుండగా ఆ పట్టణాన్ని రెండు నదుల వరదలు కలిపి కొట్టాయి! సాక్షులు, వారి పొరుగువారనేకులు రాజ్యమందిరం పైకప్పు మీదికి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. ఒక్క సాక్షి కూడా తన ప్రాణాన్ని పోగొట్టుకోలేదు.

అయినప్పటికీ, మెక్సికోలోని దాదాపు 1,000 మంది సాక్షులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సురక్షిత ప్రాంతాలకు తరలించబడ్డారు. దాదాపు 156 మంది సాక్షుల ఇళ్ళు పూర్తిగా నాశనమైపోయాయి, 24 ఇళ్ళు కూలిపోయాయి. అదనంగా, ఏడు రాజ్యమందిరాలు పూర్తిగా నాశనమైపోయాయి.

కాబట్టి, యెహోవాసాక్షుల అవసరాలనూ, వారి పొరుగువారి అవసరాలనూ తీర్చేందుకు ఆరు సహాయక బృందాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఆహారం, బట్టలు, దుప్పట్లు, ఇతర వస్తువులు తక్షణమే పంచబడ్డాయి. నిజానికి, సహాయక కార్యక్రమాలు ఎంత విస్తృతంగా జరిగాయన్న దాని గురించి స్థానిక అధికారులు సమాచారాన్నిస్తూ, ఇలా అన్నారు: “సైనిక సిబ్బంది కూడా ఇంత త్వరగా చేయలేకపోయింది.”

తమ నిజాయితీ విషయంలో యెహోవాసాక్షులు ఎప్పటి నుండో ప్రఖ్యాతి గాంచారు, ఇది తరచుగా వారికి ప్రయోజనం చేకూర్చింది. ఉదాహరణకు, కొందరు వ్యక్తులు స్థానిక అధికారుల నుండి సహాయం కోరినప్పుడు, మీ ప్రాంతంలో ఎవరైనా యెహోవాసాక్షులు ఉన్నారా అని అధికారులు అడిగారు. ఉన్నారని వారు చెప్పినప్పుడు, అధికారులు ఇలా అన్నారు: “వారిలో ఒకరిని తీసుకొని రండి, మేము సహాయార్థ వస్తువులను ఆయన చేతికి అప్పగిస్తాము!”

ఒక స్థానిక సంఘ పెద్ద ఇలా వ్రాస్తున్నప్పుడు విషయాలను చక్కగా క్లుప్తీకరించాడు: “విపత్తు ఉన్నప్పటికీ, సహోదరులు సరియైన దృక్పథాన్ని కలిగి ఉన్నారు. తమ ప్రాణాలకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉన్నప్పటికీ, పరిసర ప్రాంతాల్లోని అనేకమంది సహోదరులు మమ్మల్ని బలపరిచేందుకు ఆహారాన్నీ, బైబిలు సాహిత్యాన్నీ తీసుకువచ్చారు. మేము యెహోవాకు ధన్యవాదాలు తెలుపుకొనేందుకు చాలా ఉంది.”

[14వ పేజీలోని బాక్సు/చిత్రం]

మెక్సికో

గ్వాటిమాలా

ఎల్‌ సాల్వేడర్‌

బెలీజ్‌

హోండురాస్‌

నికరాగ్వా

కోస్టారికా

[15వ పేజీలోని చిత్రం]

హోండురాస్‌

గ్వాసరీక్‌ నది

[16వ పేజీలోని చిత్రాలు]

ఎల్‌ సాల్వేడర్‌

చీలాంగరాలోని ప్రధాన వీధి

◼ రాజ్యమందిరంతో పాటు కాపాడబడిన లియోనార్డో ఏమూస్‌, ఆయన కుమార్తెలు

◼ కూలిపోయిన తన ఇంటి ముందు సాంటోస్‌ ఎర్నాండెస్‌

[17వ పేజీలోని చిత్రాలు]

నికరాగ్వా

◼ టెలీకాకు ప్రయాణమైన సైక్లిస్ట్‌ల మొదటి బృందం

◼ ఎల్‌ గ్వాయాబోలోని సాక్షులు ఆహారపు సంచులను సంతోషంగా అందుకున్నారు

[18వ పేజీలోని చిత్రాలు]

నికరాగ్వా

◼ వాలంటీర్లు తిరిగి కట్టిన అనేక ఇళ్ళు

◼ ఆహార పొట్లాలను కట్టడంలో స్థానిక సంఘాల్లోని సాక్షులు సహాయం చేశారు

[18వ పేజీలోని చిత్రం]

గ్వాటిమాలా

◼ మట్టిలో నుండి ఏడుగురు పిల్లలను రక్షించడానికి శారా సహాయం చేసింది

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి