బైబిలు ఉద్దేశము
దేవుని దృష్టిలో మీకు విలువ ఉంది!
“నా జీవితంలో ఎక్కువభాగం నేను విలువలేని దాన్ననే అనుభూతులతో పీడించబడుతూ వచ్చాను. నేను యెహోవాను ఎంతగా ప్రేమిస్తున్నా, లేక ఆయన సేవలో నేనెంత కృషి సల్పుతున్నా సరే అదెంతమాత్రం సరిపోదనే నాకెప్పుడూ అనిపిస్తూ ఉంటుంది” అని ఒక క్రైస్తవ స్త్రీ వ్రాస్తోంది.
తగని వారమని, విలువలేనివారమనే లోతైన అనుభూతులతో పోరాడుతున్న ఎవరైనా మీకు తెలుసా? లేక కొన్నిసార్లు మీకూ అలాంటి అనుభూతులు కలుగుతుంటాయా? అలాంటి అనుభూతులు దేవుని నమ్మకమైన ఆరాధకులకైనా సరే అసాధారణమైనవేమీ కావు. వ్యవహరించడానికి కష్టంగా ఉండే ఈ “క్లిష్టమైన కాలాల్లో” జీవించేటప్పుడు కలిగే ప్రభావాలనుండి ఎవరూ కూడా మినహాయించబడలేదు. “అంత్యదినాల్లో” ప్రబలి ఉండే—“ఆత్మ నిగ్రహం లేకపోవడం, ఉగ్రత, మంచితనాన్ని ప్రేమించకపోవడం” వంటి—లక్షణాలు గల వ్యక్తుల అలక్ష్యానికీ, కఠిన స్వభావానికీ అనేకులు గురయ్యారు. (2 తిమోతి 3:1-5, NW) అలాంటి బాధాకరమైన అనుభవాలు బొత్తిగా విలువలేనివాళ్ళమనే అనుభూతులను కలిగిస్తూ, భావోద్వేగపరంగా లోతుగా దెబ్బతీయవచ్చు.
మరికొందరి విషయానికి వస్తే, వాళ్ళు తమ కోసం, అతి ఉన్నతమైన ప్రమాణాలు పెట్టుకోవడం వల్ల కలిగిన ఫలితంగానే కావచ్చు ప్రతికూల అనుభూతులు కలిగింది. ఆ ప్రమాణాలను చేరలేని అసమర్థత తాము తగిన వారు కాదనే అనుభూతికి మరింత బలాన్నిస్తుంది. కారణమేదైనప్పటికీ, ఈ విషయాన్నిబట్టి చూస్తే—దేవుడైనా లేక ఇతరులెవరైనా సరే—తమను ఎందుకు ప్రేమిస్తున్నారని గ్రహించడం కష్టంగా ఉన్నట్లు పనికిరాని వాళ్ళమనే అనుభూతులతో పోరాడేవారు కనుగొనవచ్చు. నిజంగా, ప్రేమించబడే యోగ్యత తమకు లేదని కూడా వాళ్ళు నమ్మవచ్చు.
కానీ యెహోవాదేవుడు భావించేది అలా కాదు! తన శత్రువైన, అపవాదియైన సాతాను యొక్క “మోసపూరితమైన తంత్రాల” విషయమై జాగ్రత్తగా ఉండమని యెహోవా తన వాక్యంలో మనల్ని హెచ్చరిస్తున్నాడు. (ఎఫెసీయులు 6:11, జ్యూయిష్ న్యూ టెస్టమెంట్) సాతాను తన మోసపూరిత తంత్రాలను ఉపయోగిస్తూ, మనం మన దేవుణ్ణి ఆరాధించడాన్ని మానుకొనేలా చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. సాతాను తన ఉద్దేశాన్ని సాధించేందుకుగానూ, మనం పనికిరానివాళ్ళం అనే అనుభూతిని, ప్రేమించదగినవాళ్ళంగా యెహోవా మనల్ని ఎన్నడూ చూడలేడు అనే అనుభూతిని ప్రోత్సహిస్తాడు. కానీ సాతాను “అబద్ధికుడు”—నిజానికి “అబద్ధానికి జనకుడు.” (యోహాను 8:44) కాబట్టి మనం అతని మోసపూరిత తంత్రాలకు మోసపోకూడదు! బైబిల్లో, యెహోవా తన గురించి తెలియజేస్తూ తన దృష్టిలో మనకు విలువ ఉందని ఆయన మనకు హామీనిస్తున్నాడు.
మన విలువను గూర్చిన సమతూక దృష్టి
నిరుత్సాహం మనపై చూపించగల ప్రతికూల ప్రభావాన్ని గురించి బైబిలు హెచ్చరిస్తుంది. “విపత్తు కలిగిన దినమున నీవు నిరుత్సాహాన్ని చూపిస్తావా? నీ బలము తగ్గిపోతుంది” అని సామెతలు 24:10, NW చెబుతుంది. మన లోలోన ఎంతో కాలంగా ఉన్న ప్రతికూల భావాలు మన బలాన్ని దోచుకుని, మనల్ని బలహీనులనుగాను, గాయపరచబడగలవారిగాను చేస్తుంది. సాతానుకి ఇది బాగా తెలుసు అన్న విషయంలో మీకు సందేహమక్కర్లేదు. విలువలేని వారమన్న అనుభూతులు మన హృదయాన్ని పట్టి పీడిస్తున్నట్లయితే దాన్ని భరించడమే ఎంతో కష్టం. ఏమైనప్పటికీ, అలాంటి అనుభూతులను ఉపయోగించుకునేందుకు సాతాను ప్రయత్నిస్తున్నప్పుడు అలాంటి పరిస్థితి మరింత భారమైనదిగా మారుతుంది.
అలాగైతే, మన విలువ పట్ల ఆరోగ్యవంతమైన సమతూకమైన దృక్పథాన్ని కలిగివుండటం ప్రాముఖ్యం. “తన్ను తాను ఎంచుకొనతగినదానికంటె ఎక్కువగా ఎంచుకొనక, . . . తాను స్వస్థబుద్ధిగలవాడగుటకై తగినరీతిగా తన్ను ఎంచుకొనవలెనని . . . మీలోనున్న ప్రతి వానితోను చెప్పుచున్నాను” అని అపొస్తలుడైన పౌలు అన్నాడు. (రోమీయులు 12:3) మరొక అనువాదం ఈ మాటలనే ఇలా చెప్తుంది: “తనకున్న నిజమైన విలువ కన్నా ఎక్కువగా తనను తాను ఎంచుకోక, తనకు హేతుబద్ధమైన విలువనే కట్టుకోవాలి.” (చార్ల్స్ బి. విలియమ్స్) అలా ఈ లేఖనం, మన గురించి మనం సమతూక దృష్టిని కలిగివుండాలని ప్రోత్సహిస్తుంది. ఒకవైపు అహంభావం కలగకుండా అప్రమత్తంగా ఉండాలి; మరోవైపు దానికి పూర్తి వ్యతిరేకంగా అతి తక్కువగా దృష్టించుకోకూడదు. అందుకే, స్వస్థబుద్ధి కలిగి ఉండాలని పౌలు సూచిస్తున్నాడు. మన గురించి ఎంతో కొంత ఆలోచించవలసిన అవసరం ఉంది. అవును, మనలో ప్రతి ఒక్కరం యెహోవా దృష్టిలో విలువైనవారమేనన్న విషయాన్ని పౌలు దైవావేశంతో సూచించాడు.
యేసు “నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెను” అని చెప్పినప్పుడు, ఆ మాటల్లో సొంత విలువ గురించిన సమతూక స్పృహ ఉండాలన్న విషయం ఇమిడి ఉంది. (మత్తయి 22:39) “నిన్నువలె” అనే మాటలు, మనకు సొంత విలువ ఉందనీ, ఆత్మ గౌరవం ఉందనే కొంత అనుభూతి మనకు తప్పనిసరిగా ఉండాలని సూచిస్తున్నాయి. నిజమే, మనలో లోపాలు ఉన్నాయి, తప్పులు చేస్తాము కూడా. కానీ, మనం యెహోవాను సంతోషపెట్టేందుకు శ్రమిస్తూ, మన లోపాల గురించి విచారపడుతూ, ఆయనను క్షమాపణ అడిగినప్పుడు కూడా మనం సొంత విలువ కలిగి ఉండగలం. దీనికి విరుద్ధంగా, మన విమర్శనాత్మక హృదయాలు హఠం చేస్తాయి. కానీ “దేవుడు మన హృదయముకంటె అధికుడై” ఉన్నాడన్న విషయాన్ని గుర్తుంచుకోండి. (1 యోహాను 3:19) వేరే మాటల్లో చెప్పాలంటే, యెహోవా మనల్ని చూసే విధానం, మనల్ని మనం చూసుకొనే విధానానికి చాలా భిన్నంగా ఉండవచ్చు.
విరిగిన హృదయాలూ నలిగిన మనస్సులూ
“విరిగిన హృదయముగలవారికి యెహోవా ఆసన్నుడు నలిగిన మనస్సుగలవారిని ఆయన రక్షించును” అని కీర్తన గ్రంథకర్త అయిన దావీదు వ్రాశాడు. (కీర్తన 34:18) మాథ్యూ హెన్రీస్ కమెంటరీ ఆన్ ద హోల్ బైబిల్ ఈ వచనంపై వ్యాఖ్యానిస్తూ, “నీతిమంతుల లక్షణం ఏమిటంటే . . . తాము పాపానికి లొంగిపోయినందుకు, విరిగిన హృదయంతో, అపరాధభావంతో కూడిన మనస్సుతో ఉంటారు, తమను తాము రిక్తులుగా చేసుకుంటారు; తమను తాము తక్కువగా దృష్టించుకుంటారు, తమకున్న యోగ్యత విషయంలో వాళ్ళకు ఏమాత్రం నమ్మకం ఉండదు” అని పేర్కొంటుంది.
ఎవరైతే, “విరిగిన హృదయాలను” “నలిగిన మనస్సును” కలిగి ఉంటారో వాళ్ళు యెహోవా తమకు దూరంగా ఉన్నాడని, యెహోవా తమ విషయమై శ్రద్ధవహించేందుకు తాము అంత ప్రాముఖ్యమైనవాళ్ళు కాదని భావించవచ్చు. కానీ అలాగేం కాదు. “తమను తాము తక్కువగా దృష్టించు”కొనేవారిని యెహోవా విడిచిపెట్టడు అన్న దావీదు మాటలు మనకి హామీనిస్తున్నాయి. మరెప్పటికన్నా అలాంటి సమయాల్లోనే తాను మనకు ఎక్కువ అవసరమని సానుభూతిగల మన దేవునికి తెలుసు కాబట్టి ఆయన మన దగ్గరే ఉంటాడు.
ఒక ఉదాహరణ పరిశీలించండి. కొన్ని సంవత్సరాల క్రితం ఒక తల్లి తన రెండు సంవత్సరాల పిల్లవాణ్ణి తీసుకుని హాస్పిటల్‌కు పరుగెత్తింది. ఎందుకంటే ఆ పిల్లవాడు కింక వాయువు (క్రూప్) అనే వ్యాధితో బాధపడుతున్నాడు. పిల్లవాణ్ణి పరీక్షించిన తర్వాత, పిల్లవాణ్ణి ఆ రాత్రి అంతా హాస్పిటల్‌లో ఉంచాలని డాక్టర్లు ఆ తల్లితో చెప్పారు. ఆ తల్లి ఆ రాత్రి ఎక్కడ గడిపింది? హాస్పటల్‌లో తన పిల్లవాడు ఉండే గదిలో వాని మంచం ప్రక్కన కుర్చీలో గడిపింది. తన చిన్న పిల్లవాడు అనారోగ్యంతో ఉన్నాడు కనుక వాని దగ్గరే ఉండాల్సి వచ్చింది. మనం ఎవరి స్వరూపంలో అయితే సృష్టించబడ్డామో ఆ ప్రేమగల పరలోక తండ్రి నుండి తప్పకుండా మనం అంతకన్నా ఎక్కువే ఎదురుచూడవచ్చు! (ఆదికాండము 1:26; యెషయా 49:15) మనం “విరిగిన హృదయము”తో ఉన్నప్పుడు, యెహోవా ఒక ప్రేమపూర్వక తండ్రిలా మన ‘దగ్గరే ఉండి’—ఎల్లప్పుడూ అప్రమత్తంగా, శ్రద్ధతో, సహాయం చేసేందుకు సిద్ధంగా ఉంటాడని కీర్తన 34:18లోని మనసుకు తాకే ఆ మాటలు మనకు హామీ ఇస్తున్నాయి.—కీర్తన 147:1, 3.
“మీరనేకమైన పిచ్చుకలకంటె శ్రేష్ఠులు”
యెహోవా, భూమి మీదనున్న తన సేవకులను గురించి ఎలా భావిస్తాడనే విషయంతో సహా, యెహోవా తలంపులను, అనుభూతులను గురించి యేసు భూపరిచర్య చేస్తున్న సమయంలో ఎంతో వెల్లడిచేశాడు. యెహోవా దృష్టిలో తన శిష్యులకు విలువ ఉందని ఒకటి కన్నా ఎక్కువసార్లు, యేసు వాళ్ళకు హామీ ఇచ్చాడు.—మత్తయి 6:26; 12:12.
ఉదాహరణకు, ప్రతి ఒక్క శిష్యునికి ఉన్న వ్యక్తిగత విలువను యేసు సోదాహరణంగా తెలియజేస్తూ, “రెండు పిచ్చుకలు కాసుకు అమ్మబడును గదా; అయనను మీ తండ్రి సెలవులేక వాటిలో ఒకటైనను నేలనుపడదు. మీ తలవెండ్రుకలన్నియు లెక్కింపబడి యున్నవి గనుక మీరు భయపడకుడి; మీరనేకమైన పిచ్చుకలకంటె శ్రేష్ఠులు” అని చెప్పాడు. (మత్తయి 10:29-31) మొదటి శతాబ్దంలోని యేసు శ్రోతలకు దాని అర్థం ఏమై ఉండి ఉంటుందో పరిశీలించండి.
పిచ్చుకలు, ఆహారానికి ఉపయోగించే చవకైన పక్షుల కోవకు చెందినవన్నది స్పష్టం. సాధారణంగా, ఈ చిన్ని పక్షులను ఈకలు పీకిన తర్వాత కట్టెలపై కాల్చి కబాబుల్లా వేయిస్తారు. సంతలో, పేద స్త్రీలు తమ దగ్గరున్న కాసులతో ఎన్ని పిచ్చుకలను కొనగలమా అని లెక్కపెట్టుకోవడాన్ని యేసు చూశాడనే విషయంలో సందేహం లేదు. పిచ్చుకలు చాలా తక్కువ విలువైనవిగా ఎంచబడేవి. ఎంత తక్కువగా అంటే, చాలా తక్కువ మూల్యం గల ఒక చిన్న కాసుకు ఒక వ్యక్తి రెండు పిచ్చుకలను కొనగల్గేవాడు (అక్షరార్థంగా అది అస్సారియోన్ నాణెం, దాని విలువ రెండు రూపాయల కన్నా తక్కువే).
యేసు ఈ ఉపమానాన్ని కొంతకాలం తర్వాత మరలా చెప్పాడు—కానీ ఒక చిన్న తేడాతో. లూకా 12:6 ప్రకారం, “అయదు పిచ్చుకలు రెండు కాసులకు అమ్మబడును గదా” అని యేసు అన్నాడు. దాని గురించి ఆలోచించండి. తక్కువ మూల్యంగల ఒక కాసుకు కొనుగోలుదారు రెండు పిచ్చుకలను పొందాడు. కానీ అతను రెండు కాసులు చెల్లించేందుకు సిద్ధపడినప్పుడు, నాలుగు పిచ్చుకలు కాదు ఐదు పిచ్చుకలను పొందాడు. ఆ అదనపు పక్షికి మూల్యం లేదన్నట్లుగా, ఉచితంగా అన్నట్లుగా ఇచ్చేయడం జరిగింది. “అయనను వాటిలో ఒకటైనను [బేరమాడగా ఊరకే ఇచ్చేయబడినది సహితం] దేవునియెదుట మరువబడదు” అని యేసు చెప్పాడు. ఆ దృష్టాంతాన్ని అన్వయిస్తూ “మీరు అనేకమైన పిచ్చుకలకంటె శ్రేష్ఠులు” అని అంటూ ఆ విషయాన్ని అంతటితో ఆపేశాడు. (లూకా 12:7) ఆ మాటలు ఆయన శ్రోతలను ఎంతగా ప్రోత్సహించి ఉండి ఉంటాయో కదా!
యేసు చెప్పిన హృదయోద్దీపకమైన దృష్టాంతం ఏమి తెలుపుతుందో మీరు గ్రహించారా? యెహోవా చిన్న పక్షులను సహితం విలువగలవిగా ఎంచుతున్నట్లయితే, ఆయనకు తన భూమి మీదనున్న సేవకులు అంతకంటే ఎంత ఎక్కువ ప్రియమైన వారై ఉంటారు! మనలో ఎవరమూ యెహోవా దృష్టిలో లేకుండా పోము. మనలో ప్రతిఒక్కరం యెహోవాకు అంత విలువైనవారం కనుకనే, యెహోవా మన గురించిన ప్రతీ చిన్న విషయాన్ని గమనిస్తున్నాడు—మన తల వెంట్రుకల్లోని ప్రతి ఒక్కటీ ఆయనకు లెక్కే.
మనం యెహోవాకు సేవచేయడాన్ని మానుకునేలా చేసేందుకుగాను, సాతాను “మోసపూరితమైన” తన “కుతంత్రాలను” ఉపయోగించడంలో—విలువలేనివాడ్ని/విలువలేనిదాన్ని అనేటువంటి అనుభూతుల్ని వాడుకోవడం వంటి కుతంత్రాలను ఉపయోగించడంలో కొనసాగుతాడు. కానీ సాతాను విజయం పొందేందుకు అనుమతించవద్దు! ప్రారంభంలో ప్రస్తావించిన ఆ క్రైస్తవ స్త్రీని జ్ఞాపకం తెచ్చుకోండి. మన భావాలను ఉపయోగించుకోవడానికి సాతాను చేసే ప్రయత్నాలను గూర్చి హెచ్చరించిన కావలికోట పత్రికలోని ఒక శీర్షిక ఆమెకు సహాయం చేసింది.a “నన్ను నిరుత్సాహపర్చేందుకు సాతాను నా అనుభూతులనే ఉపయోగిస్తాడన్న విషయాన్ని నేను ఎప్పుడూ గ్రహించలేదు. ఇది తెలుసుకోవడం నాకు ఈ అనుభూతులతో పోరాడేందుకు పురికొల్పునిస్తుంది. నేను ఇప్పుడు ఈ సాతాను ప్రభావాలను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోగలను.”
యెహోవా “సమస్తమును ఎరిగి యున్నాడు.” (1 యోహాను 3:20) అవును మనం ఇప్పుడు సహిస్తున్నదేమిటో ఆయనకు తెలుసు. మన ఆత్మ గౌరవాన్ని మనం నలుగగొట్టుకొనేలా చేసిన మన గతకాల అనుభవమేమిటో కూడా ఆయనకు తెలుసు. యెహోవా దృష్టిలో మనం ఏంటి అన్నదే లెక్కకు వస్తుందని గుర్తుంచుకోండి ! మనం ఎంత మాత్రమూ ప్రేమింపతగని వారమనీ, విలువలేని వారమనీ మనం అనుకున్నా, యెహోవా మాత్రం తన సేవకుల్లో ప్రతి ఒక్కరూ విలువైన వారేనని మనకు హామీనిస్తున్నాడు. మనం యెహోవా మాటను నమ్మవచ్చు. దేవుడు తన శత్రువులా కాడు, ఆయన “అబద్ధమాడనేరని” వాడు.—తీతు 1:4.
[అధస్సూచీలు]
a ఏప్రిల్ 1, 1995 కావలికోట సంచిక, 10-15 పేజీల్లో ఉన్న “మీరు దేవుని దృష్టిలో అమూల్యమైనవారు!” అనే శీర్షికను చూడండి.
[12వ పేజీలోని చిత్రం]
హృదయ విచారం గలవారందరికీ యెహోవా ఒక ప్రేమగల తల్లిలా/తండ్రిలా దగ్గరే ఉంటాడు
[13వ పేజీలోని చిత్రాలు]
యెహోవా చిన్న పిచ్చుకనే మర్చిపోనట్లయితే, ఆయన మిమ్మల్ని ఎలా మర్చిపోగలడు?
[క్రెడిట్ లైను]
Lydekker
Illustrated Natural History