క్షయ—దానిపై సాగించే పోరాటంలో ఒక క్రొత్త ఆయుధం
క్షయ (టీబీ) మానవులను హతమారుస్తున్న పురాతనమైన అంటువ్యాధి. అయితే టీబీని ప్రపంచ ఆరోగ్య సంస్థ టైం బాంబుతో పోల్చేంతగా అది ఆరోగ్యానికి ఒక గంభీరమైన ప్రమాదకారిగా నిలిచివుంది. “మనకు ఉన్న సమయం చాలా తక్కువ” అని టీబీని గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ఒకటి హెచ్చరించింది. మానవుడు ఈ బాంబు పేలకుండా చేయలేకపోతే, “గాలి ద్వారా వ్యాపిస్తూ, ఎయిడ్స్ వ్యాధిలా ఎంత మాత్రం నయంకాని” మందులకు లొంగనటువంటి ఒక వ్యాధితో అతడు ఏదో ఒకనాడు బహుశా తలపడాల్సి వస్తుంది. టీబీకున్న నాశనం చేసే సామర్థ్యాన్ని గుర్తించేందుకు సమయం ఆసన్నమైందని ప్రపంచ ఆరోగ్య సంస్థ నొక్కి చెప్పింది. “వాల్ స్ట్రీట్ నుండి గ్రేట్ వాల్ వరకు గాలిని పీల్చే ప్రతి ఒక్కరు . . . ఈ అపాయాన్ని గురించి చింతించాల్సి ఉంటుంది.”
ఇది అతిశయోక్తా? ఎంత మాత్రం కాదు. ఒక వ్యాధి అదుపు తప్పి విజృంభించి, కెనడాలో ఉన్న జనాభాకు సరిసమానమైన జనాభాను పది సంవత్సరాల్లో సమూలంగా తుడిచిపెట్టేంత ప్రమాదకారి అయినట్లైతే, ప్రపంచం దాని విషయంలో ఎంత అప్రమత్తంగా వుండాలో ఒక్కసారి ఆలోచించండి! అది ఒక కాల్పనిక గాథలా అనిపించినా, ప్రమాదం మాత్రం వాస్తవం. ప్రపంచ వ్యాప్తంగా, ఎయిడ్స్, మలేరియా, ఉష్ణ మండల వ్యాధుల మూలంగా మరణించే వారి కంటే ఎక్కువ మంది ప్రజలు అంటే, రోజుకు 8,000 మంది టీబీ మూలంగా మరణిస్తున్నారు. కెనడా జనాభా కంటే ఎక్కువ సంఖ్యలో అంటే దాదాపు రెండు కోట్ల మంది ప్రజలు ప్రస్తుతం టీబీతో బాధపడుతున్నారు, రాగల పదేళ్ళలో దాదాపు మూడు కోట్లమంది దాని మూలంగా మరణించవచ్చు.—పేజి 22లో “భూగ్రహంపై టీబీ ఉడుంపట్టు” అనే బాక్సును చూడండి.
నేడు ఒక శుభవార్త
అయితే, ఈనాడు ఒక ఆశ ఉంది. పది సంవత్సరాలపాటు పరీక్షలు జరిపిన తర్వాత పరిశోధకులు, అడ్డూ అదుపూ లేకుండా విజృంభించే హంతకురాలి స్థానం నుండి కట్టడిలో ఉంచబడిన నేరస్థురాలి స్థాయికి టీబీని బహుశా తగ్గించివేసే పథకాన్ని రూపొందించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ మునుపటి డైరెక్టర్ జనరల్ అయిన డా. హీరోషీ నాకాజీమ ఈ క్రొత్త పథకాన్ని “ఈ దశాబ్దపు అత్యంత ప్రాముఖ్యమైన ప్రజా ఆరోగ్యపు పురోభివృద్ధుల్లో ఒకటి” అని పిలిచారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క భౌగోళిక టీబీ కార్యక్రమ డైరెక్టర్ అయిన డా. అరాటా కోచీ, “టీబీ అంటువ్యాధి నిర్మూలన”కు మొట్టమొదటి అవకాశాన్ని అది అందిస్తుందని అన్నారు. ఈ ఉత్తేజమంతటికీ గల కారణం ఏమిటి? డాట్స్ (DOTS) అని పిలువబడిన ఒక పద్ధతే.
డాట్స్ అనేది డైరెక్ట్లీ అబ్జర్వ్డ్ ట్రీట్మెంట్, షార్ట్-కోర్స్ అనే పదాల్లోని మొదటి అక్షరాల నుండి ఏర్పడిన పదం. ఇది టీబీ రోగులు ఒక్కరోజు కూడా ఆసుపత్రిలో గడపనక్కర్లేకుండా ఆరు నుండి ఎనిమిది నెలల్లో రోగాన్ని నయంచేసే ఒక ఆరోగ్య నిర్వాహక వ్యవస్థ. డాట్స్ విజయం, ఐదు మూలకాల మీద ఆధారపడి ఉంది. ఈ మూలకాల్లో ఏదైనా ఒకటి లోపించిందంటే, టీబీ రోగులను బాగుచేయగలిగే సామర్థ్యం “మన చేతుల్లో నుండి జారిపోతుంది” అని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంటోంది. మరి ఆ మూలకాలు ఏమిటి?
● 1. ప్రత్యక్ష పద్ధతి: అత్యంత ప్రమాదకరమైన టీబీ కేసు ఏమిటంటే, రోగాన్ని నిర్ధారణ చేయలేకపోవడం. కాబట్టి, మొట్టమొదటిగా ఆరోగ్య-సంరక్షణా కార్యకర్తలు తమ ప్రాంతంలో సోకే ప్రమాదమున్న టీబీతో బాధపడే ప్రజలను గుర్తించేందుకు తమ ప్రయత్నాలను కేంద్రీకరించాలి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ నొక్కి చెబుతుంది.
● 2. గమనించడం: డాట్స్లోని రెండవ మూలకం, రోగ నివారణను సాధించడం విషయంలో రోగిని గాక ఆరోగ్య వ్యవస్థనే బాధ్యురాల్ని చేస్తుంది. ఆరోగ్య-సంరక్షణా కార్యకర్తలు లేదా షాప్కీపర్లు, ఉపాధ్యాయులు, మునుపటి టీబీ రోగుల్లాంటి శిక్షణ పొందుతున్న స్వచ్ఛంద సేవకులు టీబీ రోగాన్ని నివారించే మందుల ప్రతి మోతాదును రోగులు వేసుకునేలా చూస్తారు. టీబీ రోగులు మందులను వేసుకోవడం మొదలుపెట్టిన కొద్దికాలానికే వాటిని ఆపివేయడమే ఈనాడు టీబీ ఇంకా ఉనికిలో ఉండడానికి గల ఒక ప్రధాన కారణం గనుక, విజయాన్ని సాధించేందుకు “రోగులను గమనించేవారు” ఉండడం ప్రాముఖ్యం. (22వ పేజీలోని “టీబీ మళ్ళీ ఎందుకు విజృంభిస్తోంది?” అనే బాక్సును చూడండి.) మందులు తీసుకోవడం ప్రారంభించిన కేవలం కొన్ని వారాలకే వాళ్ళు తమకు బాగైపోయిందని భావించడం ప్రారంభించి, ఇక మాత్రలు వేసుకోవడం ఆపేస్తారు. అయితే, టీబీ రావడానికి కారణమయ్యే దండాకారపు బ్యాక్టీరియాలనుండి శరీరానికి విముక్తి కల్గించేందుకు ఆరు నుండి ఎనిమిది నెలల పాటు మందులను తప్పని సరిగా వేసుకోవాల్సిందే.
● 3. చికిత్స: మందులను తీసుకొంటున్న ఈ నెలలన్నింటిలోనూ, ఆరోగ్య సంరక్షణా కార్యకర్తలు చికిత్సా ఫలితాలను చెక్చేస్తారు, రోగుల పరిస్థితిలో కనిపించే పురోభివృద్ధిని నోట్ చేసుకుంటారు. ఆ విధంగా, వాళ్లు రోగుల వ్యాధి పూర్తిగా నయమయ్యిందనీ, అది ఇతరులకు సోకదనీ నిశ్చయపరచుకుంటారు.
● 4. షార్టు కోర్సు: డాక్టరు చెప్పిన ప్రకారంగా నిర్ణీత వేళకు టీబీ నిరోధక మందులను సమపాళ్ళలో, సరియైన మోతాదులో తీసుకోవడమే, డాట్స్ పథకంలోని నాల్గవ మూలకం. ఇది షార్టుకోర్సు కెమోథెరపీగా అందరికీ సుపరిచితమే. సమపాళ్ళలో తీసుకునే ఈ మందులు టీబీని కలిగించే దండాకారపు బ్యాక్టీరియాలను చంపడంలో శక్తివంతంగా పనిచేస్తాయి.a చికిత్సా విధానానికి అంతరాయం కలగకుండా ఈ మందులు ఎప్పుడూ అందుబాటులో ఉండాలి.
● 5. !: డాట్స్ చివరలో ఉన్న ఆశ్చర్యార్థక చిహ్నం ద్వారా డాట్స్ పథకంలోని ఐదవ మూలకాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యక్తపరుస్తోంది. ఇది నిధులకూ, సరియైన పాలసీలకూ ప్రాతినిధ్యం వహిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రభుత్వ సంబంధమైన, ప్రభుత్వేతర సంబంధమైన సంస్థల నుండి పొందిన ఆర్థిక ఒప్పందాలను పరిరక్షించుకోవాలనీ, దేశంలో ఉన్న ప్రస్తుత ఆరోగ్య వ్యవస్థలో టీబీ చికిత్సను ఒక భాగంగా చేయాలనీ ఆరోగ్య వ్యవస్థలను కోరింది.
నిధుల విషయానికి సంబంధించి, డాట్స్ పథకానికి ఆర్థిక సహాయాన్ని అందించాలా వద్దా అని నిర్ణయించే పాలసీ విధాతలను డాట్స్ పద్ధతి ఆకట్టుకుంది. ప్రపంచ బ్యాంకు “రోగానికి [వ్యతిరేకంగా సాగించే] . . . పోరాటంలో అందుబాటులో ఉన్న అతి తక్కువ ఖర్చుతో కూడిన పథకాలలో ఒకటి”గా డాట్స్‌ను ప్రపంచ బ్యాంకు పరిగణించింది. పేద దేశాల్లో ఈ పథకాన్ని ఉపయోగించడానికి అయ్యే మొత్తం వ్యయం, రోగి ఒకనికి దాదాపు 100 డాలర్లు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కించింది. “ఇది, అభివృద్ధి చెందిన దేశాల్లో తలసరి 10 (అమెరికన్) సెంట్లకు మించదు, దాన్ని దుర్భర ఆర్థిక పరిస్థితుల్లో సహితం భరించవచ్చు.” అయినప్పటికీ, ఖర్చులు తక్కువైనా ఫలితాలు మాత్రం బేషుగ్గా ఉంటాయి.
ఇదెంత ప్రభావవంతంగా పనిచేస్తుంది?
ఇప్పటి వరకూ డాట్స్ పథకాన్ని పరిమితంగా ఉపయోగించడమే, “అనేక దశాబ్దాల కాలంలో మొట్టమొదటిసారిగా టీబీ భూగోళవ్యాప్తంగా నిలదొక్కుకోవడానికి కారణమవుతున్నది” అని మార్చి, 1997న ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు ప్రకటించారు. “డాట్స్ పద్ధతిని ఉపయోగించిన చోట్ల రోగం నయమయినవారి సంఖ్య దాదాపు రెట్టింపు అయ్యింది.” డాట్స్ మార్గదర్శక ప్రాజెక్టులు టీబీ విస్తృతంగా ఉన్న ప్రాంతాల్లో ఇప్పటికే అమలు పర్చడం, డాట్స్ పథకం పనిచేస్తుందన్న విషయాన్ని సూచిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఉదహరించిన కొన్ని విజయవంత కథనాలను పరిశీలించండి.
ఇండియాలో “కోటి 20లక్షల కంటే ఎక్కువ మంది ప్రజలు ఉన్న ప్రాంతాల్లో మచ్చుకి డాట్స్ పథకాన్ని అమలు చేయడం జరిగింది. . . . ప్రతి 5మంది క్షయ రోగుల్లో నలుగురికి నయమౌతుంది. బంగ్లాదేశ్‌లోని 10లక్షల మంది క్షయ రోగులుగల డాట్స్ మార్గనిర్దేశక కార్యక్రమంలో “87 శాతం మందికి నయమైంది.” ఒక ఇండోనేషియా ద్వీపంలో డాట్స్ ప్రాజెక్టు వల్ల “10మంది రోగుల్లో 9మందికి నయమైంది.” చైనాలో 94 శాతం మంది రోగనివారణను పొందడంతో డాట్స్ మార్గనిర్దేశక ప్రాజెక్టులు “ఎంతో విజయవంతమయ్యాయి.” దక్షిణాఫ్రికాలోని ఒక నగరంలో “[టీబీ రోగులలో] 80 కంటే ఎక్కువ శాతం మందికి చికిత్సను విజయవంతంగా జరుపబడుతోంది.” ఇటీవల, డాట్స్ పథకం న్యూయార్క్ నగరంలో నెలకొల్పబడింది, ఫలితాలు అమోఘంగా ఉన్నాయి.
అనేక దేశాల్లో ఎంపిక చేయబడిన ప్రాంతాల్లో జరిపిన పరీక్షల ఫలితాలు, డాట్స్ పథకాన్ని “అన్ని చోట్లా ఉపయోగించవచ్చు, [అది] రోగులలో 85 శాతం మందికి, అంతకంటే ఎక్కువ శాతం మందికి నయమయ్యేలా చేయగలదు” అని చూపిస్తున్నాయని డా. కోచి ముగించారు.
ఆకస్మిక అభివృద్ధికాదు—కానీ పురోగమన దిశలో
మానవుడ్ని పట్టి పీడిస్తున్న ప్రాణాంతకమైన రోగాల్లో ఒకదాన్ని సులభంగానూ, తక్కువ ఖర్చుతోనూ ఆచరణాత్మకంగా అణచివేసే అలాంటి చికిత్సతో, మీరు డాట్స్ పథకం ఆకస్మికంగా అభివృద్ధి చెందాలని ఎదురు చూస్తారు. “కానీ, పనిచేస్తుందనీ, ఖర్చు తక్కువ అవుతుందనీ ప్రపంచ ఆరోగ్య సంస్థ నిరూపించిన టీబీ నియంత్రణ పథకాన్ని ఆశ్చర్యకరంగా కొన్ని దేశాలు మాత్రమే అమలుచేస్తున్నాయి” అని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారి ఒకరు అన్నారు. నిజానికి, 1996 ప్రారంభంలో కేవలం 34 దేశాల్లో మాత్రమే దేశవ్యాప్తంగా ఆ పథకాన్ని అమలుచేశాయి.
అయినప్పటికీ, పురోభివృద్ధి ఉంది. 1993కి ముందు అంటే భూగోళవ్యాప్తంగా టీబీ నివారణా అత్యవసరతను గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించినప్పుడు, ప్రతీ 50 మంది టీబీ వ్యాధిగ్రస్తులలో కేవలం ఒకరు మాత్రమే డాట్స్‌ను తీసుకున్నారు. ఈనాడు ఆ నిష్పత్తి ప్రతీ 10 మంది రోగుల్లో ఒకరు తీసుకుంటున్నారు. ఒక నివేదిక ప్రకారం, 1998లో దాదాపు 96 దేశాలు డాట్స్ పథకాన్ని ఉపయోగించాయి. డాట్స్‌ను ఉపయోగించడంలో మరిన్ని దేశాలు కనుక చేరినట్లైతే, టీబీ కేసుల వార్షిక సంఖ్య, ‘కేవలం ఒక దశాబ్దకాలంలోనే 50 శాతం వరకు తగ్గిపోతాయి.’ “మా దగ్గర రుజువుపర్చబడిన ఆరోగ్య సంరక్షణా ఏర్పాటు ఉంది, కావాల్సిందల్లా దాన్ని విస్తృతంగా వినియోగించడమే” అని డా. కోచి అన్నారు.
టీబీపై విజయవంతంగా పోరాడేందుకు మానవుని దగ్గర విజ్ఞానం, ఉపకరణాలు ఉన్నప్పటికీ, “ఈ మందులు ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించబడేలా చూసే ప్రజలు” మాత్రం కరువయ్యారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైద్యులకూ, ఇతర ఆరోగ్య కార్యకర్తలకూ సంభోదించబడిన ఒక ప్రచురణలో, ప్రపంచ ఆరోగ్య సంస్థ “మనమందరం దేని కోసం నిరీక్షిస్తున్నాము?” అని ప్రశ్నించడంలో ఆశ్చర్యమేమీ లేదు.
[అధస్సూచీలు]
a ఆ మందుల్లో ఐసోనియజైడ్, రిఫామ్పిన్, పిరజినమైడ్, స్ట్రెప్టోమైసిన్, ఎథామ్బ్యుటల్లు చేరివున్నాయి.
[21వ పేజీలోని చిత్రం]
ప్రతీ సెకనుకు, ఒకరు చొప్పున ఈ భూమిపై క్షయవ్యాధికి గురవుతున్నారు.
[21వ పేజీలోని చిత్రం]
‘కోట్లకొద్దీ ప్రజలు మరణిస్తూండగా, ప్రాణాలను రక్షించే మందులు అల్మారాల్లో మూలిగాయి.’—డాక్టర్ అరాటా కోచి
[23వ పేజీలోని చిత్రం]
“డాట్స్ పథకం ఈ దశాబ్దపు అత్యంత ప్రాముఖ్యమైన ప్రజా ఆరోగ్యపు పురోభివృద్ధుల్లో ఒకటిగా నిరూపించుకుంటుంది.”—ప్రపంచ ఆరోగ్య సంస్థ పత్రికా ప్రకటన
[22వ పేజీలోని బాక్సు]
టీబీ మళ్ళీ ఎందుకు విజృంభిస్తోంది?
క్షయకు (టీబీ) నివారణ ఇప్పటికి నాలుగు కంటే ఎక్కువ దశాబ్దాల క్రితమే కనుగొనబడింది. అయినా, అప్పటినుండీ 12 కోట్ల కంటే ఎక్కువ మంది ప్రజలు టీబీ మూలంగా మరణించారు, ఈ సంవత్సరం రమారమి 30 లక్షల మంది ప్రజలు మరణించవచ్చు. టీబీకి నివారణ ఉన్నప్పటికీ, ఇంకా అనేకమంది ప్రజలు ఎందుకు మరణిస్తున్నారు? దీనికి ప్రధాన కారణాలు మూడు: నిర్లక్ష్యం, హెచ్ఐవి/ఎయిడ్స్, వివిధ రకాల మందులకు లొంగని టీబీ.
నిర్లక్ష్యం. ఎయిడ్స్, ఇబోలా వంటి అంటు వ్యాధులపైనే ప్రపంచం తన దృష్టిని కేంద్రీకరించింది. అయితే, 1995లో ఇబోలా వల్ల మరణించిన ప్రతీ వ్యక్తికీ, 12,000 మంది చొప్పున టీబీ మూలంగా మరణించారు. నిజానికి, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో టీబీ ఎంత సర్వసాధారణమైపోయిదంటే, ప్రజలు ఆ వ్యాధిని జీవిత వాస్తమన్నట్టుగా దృష్టిస్తున్నారు. అదే సమయంలో, ధనిక దేశాల్లో టీబీని నివారించే ప్రభావవంతమైన మందులు అల్మారాల్లో మూల్గుతున్నప్పటికీ, ఆ రోగాన్ని పట్టించుకోకుండా వ్యాప్తిచెందడానికి విడిచిపెట్టారు. భూగోళవ్యాప్తంగా జరుగుతున్న ఈ నిర్లక్ష్యం, వినాశనాన్ని కల్గించే ఒక పొరపాటని రుజువయ్యింది. టీబీ విషయంలో ప్రపంచపు శ్రద్ధ సన్నగిల్లుతుండగా, టీబీ రావడానికి కారణయ్యే దండాకార బ్యాక్టీరియాలు ఉధృతంగా పెరిగిపోతున్నాయి. ఈనాడు అవి, మానవచరిత్రలో ముందెన్నడూ లేనంత ఎక్కువగా అనేక దేశాల్లో అనేకమంది ప్రజలపై దాడి చేస్తున్నాయి.
హెచ్ఐవి/ఎయిడ్స్. టీబీ అనేది హెచ్ఐవి/ఎయిడ్స్‌ల ప్రయాణ సహకారి. ప్రజలు తమ రోగనిరోధక శక్తిని తగ్గించివేసే హెచ్ఐవికి గురైనప్పుడు, బహుశా ఇతరులకన్నా వారిలో టీబీ వ్యాధి వృద్ధి చెందే అవకాశం 30 రెట్లు ఎక్కువ ఉంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హెచ్ఐవి వ్యాధి, టీబీ రోగుల సంఖ్య పెరగడానికి కారణమయ్యిందనడంలో ఆశ్చర్యమేమీ లేదు! 1997లో టీబీ మూలంగా హెచ్ఐవి-పాజిటివ్ ఉన్న 2,66,000 మంది ప్రజలు మరణించారని అంచనా. “తమకు సోకిన క్షయ రోగం నయం కావడానికి కావాల్సిన అతి చౌకైన టీబీ నిరోధక మందుల నుండి ప్రయోజనం పొందని స్త్రీ పురుషులు వీళ్ళే”నని జాయింట్ యునైటెడ్ నేషన్స్ ప్రోగ్రామ్ ఆన్ హెచ్ఐవి/ఎయిడ్స్ డైరెక్టర్ అయిన పీటర్ ప్యోట్ అన్నారు.
వివిధ రకాల మందులకు లొంగని టీబీ. మానవుని వ్యాధి నిరోధక శక్తికి లొంగని “సూపర్‌బగ్స్” (మందులకు లొంగని సూక్ష్మజీవులు), కాల్పనిక విజ్ఞానశాస్త్రానికి సంబంధించిన విషయాంశాలు. అయితే, టీబీ విషయంలో అవి చాలా త్వరితగతిని వాస్తవికమయ్యాయి. 5 కోట్ల కంటే ఎక్కువ మంది ప్రజలు ఇప్పటికే ఈ మల్టీ డ్రగ్-రెసిస్టెంట్ (ఎమ్డిఆర్) టీబీకి గురై ఉండవచ్చు. తమకు నయమైందని తలంచినందువల్లో, మందులు అయిపోయినందువల్లో, లేక సమాజంలో చిన్నచూపుకు గురౌతామన్న భయంవల్లో కొన్ని వారాల తర్వాత మందుల్ని వాడటం మానేసే రోగుల శరీరంలో ఉన్న టీబీ కారక దండాకార సూక్ష్మజీవులన్నీ పూర్తిగా నాశనంకావు. ఉదాహరణకు, ఆసియాలోని ఒక దేశంలో, ప్రతి ముగ్గురు టీబీ వ్యాధిగ్రస్తుల్లో ఇద్దరు చికిత్సను ప్రారంభదశలోనే ఆపేస్తున్నారు. వాళ్ళకు మరలా రోగం తిరగబెట్టినప్పుడు, శరీరంలో బ్రతికి ఉన్న బ్యాక్టీరియా లభ్యమౌతున్న టీబీ నిరోధక మందులన్నింటిపైనా తిరిగి పోరాటాన్ని సాగించి, విజయాన్ని సాధిస్తుంది గనుక దానికి చికిత్స చేయడం చాలా కష్టం కావచ్చు. ఫలితంగా, రోగులు నయంకాని ఒక రకమైన టీబీ రోగానికి గురౌతారు. వారి నుండి ఆ రకమైన టీబీ సోకిన వారివిషయంలో కూడా పరిస్థితి అదే అయివుంది. ప్రాణాంతకమైన ఈ ఎమ్డిఆర్ భూతం సీసాలోనుండి ఒక్కసారి బయటకు వచ్చిందంటే, దాన్ని మరలా సీసాలో పెట్టడం మానవుని తరమా? అన్న నిరాశాపూరితమైన ప్రశ్న మనల్ని పట్టి పీడిస్తుంది.
[22వ పేజీలోని బాక్సు]
భూగ్రహంపై టీబీ ఉడుంపట్టు
ప్రతీ సంవత్సరం క్షయ (టీబీ) వ్యాధి అంతకంతకూ పెరుగుతోంది. అది మరింత ఖరీదైనదిగానూ, ప్రాణాంతకమైనదిగానూ పెరుగుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సేకరించిన నివేదికలు, నిశ్శబ్దంగా వ్యాపిస్తున్న ఈ హంతకి ఆచూకీని తెలియజేస్తున్నాయి. ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఇవ్వబడ్డాయి: “క్షయకు వ్యతిరేకంగా సాగించే పోరాటంలో పాకిస్తాన్ ఓటమికి గురౌతోంది.” “థాయ్‌లాండ్‌లో క్షయవ్యాధి ప్రతీకారేచ్ఛతో మళ్ళీ విజృంభించింది.” “బ్రెజిల్లో అనారోగ్యానికీ, మరణాలకూ నడిపించే వాటిలో నేడు క్షయవ్యాధి కూడా లెక్కించబడుతోంది.” “క్షయ మెక్సికో ప్రజలపై తన ఉక్కు పిడికిలిని బిగించింది.” రష్యాలో “క్షయ ప్రభావం తీవ్రంగా పెరిగిపోయింది.” ఇథియోపియాలో “క్షయ దేశమంతటా విస్తృతంగా వ్యాపించింది.” “ప్రపంచంలో టీబీ ప్రభావాన్ని గూర్చి నమోదైన రేట్లలో దక్షిణాఫ్రికాకు శిఖరాగ్రస్థానం ఉంది.”
ప్రతి 100 మంది టీబీ రోగుల్లో 95 మంది ప్రపంచంలోని పేద దేశాల్లో నివసిస్తున్నప్పటికీ, టీబీ ధనిక దేశాలపై కూడా తన ఉక్కు పిడికిలిని బిగిస్తోంది. 1990ల తొలి సంవత్సరాల్లో నమోదైన టీబీ కేసుల్లో తీవ్రమైన పెరుగుదలను అమెరికా చూసింది. టీబీ “అమెరికన్లను పట్టి పీడించడానికి మరోసారి వచ్చింది” అని అమెరికా విలేఖరి అయిన వాలరీ గార్ట్సెఫ్ అన్నారు. అదేవిధంగా, క్షయ వ్యాధి “తూర్పు యూరప్‌లోనూ, అలాగే పశ్చిమ యూరప్‌లోని కొన్ని ప్రాంతాల్లోనూ పరిస్థితి విషమించడం ఆరంభించింది.” అని రాయల్ నెదర్లాండ్స్ టీబీ అసోసియేషన్ డైరెక్టర్ అయిన డా. యాప్ బ్రూక్మాన్స్ ఇటీవల తెలియజేశారు. “క్షయ ఆరోగ్యానికి ఒక ప్రధానమైన ముప్పుగా కొనసాగుతోంది” అని ద జర్నల్ సైన్స్, ఆగస్టు 22, 1997 పేర్కొనడంలో ఆశ్చర్యమేమీ లేదు.
[24వ పేజీలోని బాక్సు]
టీబీ నకలు కనుగొనబడింది
క్షయకారక (టీబీ) బ్యాక్టీరియాకు సంబంధించిన జన్యుసంబంధమైన పూర్తి నకలును వ్రాయడంలో పరిశోధకులు ఇటీవల విజయవంతులయ్యారు. ఇది, “అత్యంత విజయవంతంగా మానవజాతిని పీల్చి పిప్పిచేస్తున్న వాటిలో ఒక దానిపై సాగించే పోరాటంలో ఒక క్రొత్త దశ”ను గుర్తిస్తోందని లండన్‌లోని ఇంపీరియల్ కాలేజ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కి చెందిన డా. డగ్లస్ యంగ్ అన్నారు. ఈ నకలు “టీబీ నిరోధక మందులపై, టీకాలపై జరిపే భావి పరిశోధనకు అమూల్యమైనదిగా నిరూపించబడుతుంది” అని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదించింది.—ద టీబీ ట్రీట్మెంట్ అబ్జర్వర్, సెప్టెంబర్ 15, 1998.
[23వ పేజీలోని చిత్రాలు]
ఈ సమపాళ్ళ మందులు టీబీ దండాకారపు బ్యాక్టీరియాలను చంపుతాయి.
[క్రెడిట్ లైను]
Photo supplied by WHO, Geneva
Photo: WHO/Thierry Falise
[24వ పేజీలోని చిత్రాలు]
ఒక రోగికి నివారణా ఖర్చు $100 అవుతుంది
[క్రెడిట్ లైను]
Photo: WHO/Thierry Falise
Photo supplied by WHO, Geneva
[21వ పేజీలోని చిత్రసౌజన్యం]
Photo: WHO/Thierry Falise
Photo supplied by WHO, Geneva
Photo: WHO/Thierry Falise